తల్లి గుండె చప్పుడు అనసూయా దేవి కవిత

ముద్దు కృష్ణ గారు సంకలనం చేసిన వైతాళికులు పుస్తకం నాలాగే చాలా మందికీ ఇష్టం. కొద్దిగా తెలుగుభాష అందాలు తెలిసిన వయసులో ఆ పుస్తకం చేతిలోకి వచ్చింది. గురజాడ మొదలుకొని పలువురు ఆధునిక కవుల కవిత్వాలను రుచి చూపించింది. ఎప్పటికీ నిలిచిపోయే పలువురు కవుల కవితాఖండికలు అందులో దొరికి ఇప్పటికీ వెన్నంటిఉన్నాయి
ఐతే అలాంటిదే మరో కవిత్వసంకలనం కావ్యమాల. చాలా మంది దృష్టికి వచ్చిఉండదనుకుంటాను.దీన్ని సాహిత్య అకాడమీ 1959 లో ప్రచురించింది. ఇప్పటికి ఐదు ముద్రణలు జరిగేయి. కాటూరివెంకటేశ్వర్రావు గారు సంకలనం చేశారు నన్నయ నుంచి దేవులపల్లి వారి దాకా రాసిన కవిత్వాల నుంచి ఏరి కూర్చిన పుష్పాలతో.
 కాటూరివారి విమర్శకళ అనే వ్యాసాల పుస్తకం చిన్నప్పుడు నేను పాఠ్యభాగంగా చదువుకున్నాను. చదువుకోవడం కాదు మాష్టారు శరభయ్య గారు రెండునెలలు పాఠం చెప్పేరు ఆ వ్యాసాలు.
 వ్యాసాలకు పాఠమెందుకు? పైగా పది పన్నెండు వ్యాసాలకు. దాన్ని బట్టి ఊహించండి కాటూరి వెంకటేశ్వర్రావు గారంటే ఏమిటో. మా మాష్టారు ఆయన్ని మాష్టారనేవారు.
ఇదంతా కాటూరివారి ఎంపిక, ఏరిక ఎలా ఉండిఉంటుందో కొలుచుకోడానికే. కానీ మచ్చు కి  రుచి చూపించాలి కదా. అందుకోసమే ఈసారి శేఫాలికల దండ లో దానిని గుచ్చడం.
మొన్న నందిహిల్స్ చరియల మీద నడుస్తున్నప్పుడు నాలుగైదు కోతులు(ఆడవనే నా ఉద్దేశం) వాటిపిల్లల్ని గట్టిగా పొదువుకుని కూర్చోడం చూశాను. చాలాసార్లు చూసినదే. చాలా మందీ చూసేఉంటారు. మాతృత్వభావన ఒక సహజాతం (ఇన్సింక్టే) అనిపించింది. పిల్లలపట్ల కలిగిఉండే త్యాగశీలత వల్ల ముఖ్యంగా తల్లిని సమాజం దేవతను చేసింది. తర్వాత తండ్రిని కూడా అనుకోండి (పితృదేవోభవ).
 ఐతే ఒకానొక భావజాలానికి లోనైన సమాజం మాతృత్వాన్ని మోయలేనిభారంగా కూడా మార్చిపారేసింది.స్త్రీలు దానికింద తుక్కు తుక్కయిపోయారు. మా ముందుతరం తల్లులు శల్యాలు గానే మిగిలారు.
 ఇక గొంతులు విప్పకతప్పని పరిస్థితుల్లో స్త్రీవాద కవులు, రచయితలు ఆ భావజాలాలను ఎదిరించారు.
తొమ్మిదినెలలు మొయ్యడం, కనడం వెనకనున్న కష్టాన్ని, హింసను విప్పిచెప్పవలసి వచ్చింది.
 లేబర్రూం లాంటి కవితలు పుట్టేయి.ఆ నిష్ఠురనిజాలు చెప్పిన కవిత్వాల పట్ల ఆదరణతోపాటు విమర్శ కూడా సమాంతరంగానే నడిచింది.
మొయ్యడమూ కనడమూ ప్రకృతిధర్మాలనీ, కనకేం చేస్తారని ఇలాంటి అవగాహనా రాహిత్యపు చెత్తవిమర్శ చాలానే నడిచింది.
 ఇప్పుడు ఇదంతా మళ్లీ ఎందుకు ఎత్తుకోవలసివచ్చిందంటే  తొమ్మిదినెలలు మోసి, కని, పాలిస్తూ, పెంచుకుంటూ ఉండడం లోని స్త్రీల సంక్లిష్ట భావాల గురించీ, ఆ అనుభూతుల గురించీ మొదటిసారిగా ఒక కవయిత్రి రాసిన పద్యాలు ఈ కావ్యమాలలో దొరికేయి కనక వాటి రుచి చూపిస్తున్నాను కనుకానూ.
గడచిన వెయ్యేళ్ల లోంచీ ఇంచుమించు వందమంది కవుల కవిత్వాలను ఏరడంలో కావ్యమాల సంకలనం లోకి నలుగురే నలుగురు కవయిత్రులను లెక్కలోకి తీసుకోవడం కూడా గమనించకతప్పదు.
ఐతే నేను ఇంతవరకూ పేరువిన్నా కవిత్వం చదవని దొప్పలపూడి అనసూయా దేవి పద్యాలు మొదటిమాటు ఇందులో చదివాను. వెంటనే చలం గారు తలుపులో మెదిలారు. స్త్రీకి హృదయం ఉంది అనుభూతినివ్వాలి అన్న మాట బహుశా తెలియని రోజుల్లోనే ఆమె విశేషమైన అనుభూతిని  ఈ పద్యాలలోంచి పలికిస్తూ వాటిని స్త్రీజనీనం చేశారు.
శీర్షిక మాతృహృదయం అని సాదాసీదా గానే ఉంది. కానీ ఖండిక ను అంకురార్పణం అన్నారు. కడుపున బిడ్డ పడగానే ఆ కాబోయే తల్లి మనసు ఎలా ఉంటుంది?!! ఇలా రాసారావిడ.
“అంకురంబుననే ప్రేమాంకురంబగునొకో!
నెలతప్పినంతనె నెమ్మనంబు పొంగారు
వాంఛా తరంగాలతో నిండి
పోవు చుండె నిదేమి! పూర్వమిట్టి
 తీయందనాలూర చేయంగజాలెనే
సంసారవార్థి నే సౌఖ్యమైన!
లోకాలసృష్టించు లోకేశు చిత్రంబు
కాకున్న ఇదిఏమి కాంక్షయొక్కో!
గర్భవతులైనవారిని గాంచినంత
ప్రసవవేదన నెంచి మానసమునందు
ఎంతయో భయమొందు నాకిప్పుడింత
మధురభావన కల్గ ఏమాయయొక్కో!
పద్యం సులువుగానే అర్ధమౌతోంది. ఈ సంసారసాగరం లో ఇంతటి తీయదనాలు ఊరే లాంటి సంతోషం ఎప్పుడూ కలగలేదు అనిపించింది ఆమెకు.
నెలతప్పగానే వికారమూ వాంతులూ గాభరా తప్పనివే. నేనూ పడ్డాను. కానీ సరిగ్గా ఈమె రాసిన భావాలన్నీ అనుభవించాను. మొదటికాన్పు. ఇవన్నీ బయటికి చెప్పడానికి సిగ్గు , మొహమాటం. అనసూయాదేవి 1917 లో పుట్టినావిడ మాకు రెండుతరాలు ముందు పుట్టిన ఆడది. వీటిని జయించి ఏకంగా పద్యాల్లోనే రాసేసారు
ఇంకా
ఆ చిన్నారిని కళ్లారా చూసుకునే ఘడియ ఎప్పటికొస్తుందో. ఆ ముద్దుల పాపాయి నా పక్కలో ఎప్పుడు “బజ్జుండునో మేను పుల్కరింప”. అనుకుంటుంది.
ఇంకా ఇలా
ఏ లోపమూ లేకుండా చక్కగా పుడుతుందా, ఎంత చక్కని రూపం వస్తుందో అనే భయంతోనూ కుతూహలంతోనూ కలగలిసి ఉన్నాను.
“కానరాని మహాశిల్పి లోనచేరి
రాత్రిపవళులయందు విశ్రాంతి లేక
ఎట్లు సృష్టించుచుండెనో ఏమొ? వాని
ఇష్టమేగాని నాచేత ఏమియౌను “
కాసేపు,సైన్సులూ, స్కానింగులూ గొడవా గోలా పక్కనపెడదాం. జీన్స్ ని అటకెక్కిద్దాం.
కానరాని మహాశిల్పి అమ్మ కళ్లు, నాన్న ముక్కు, తాతయ్య నోరూ, అమ్మమ్మ మేని ఛాయ కలగాపులగం చేసి కొత్త బొమ్మను ఎలా తయారుచేస్తూఉంటాడో!
తన పొట్టలోంచి నిరంతరమూ ఆ కదలికలు అనుభవిస్తూ ఉండే లేత చిన్ని చూలాలికి ఎలా ఉంటుంది. ఇలా ఉంటుంది. నేనూ అనుభవించా.
“నెలలునిండుచున్న కొలది నిండుచుండు
మానసంబున భయద భావంబటంచు
నిశ్చయించిన నా మది
నిండుచుండె
మాసముల్ రాగ సంతోషరాశి తోడ”
స్త్రీకి ప్రసవం మరణంతో సమానం అని భయపడే రోజుల్లోరాసిన పద్యాలివి.
భయమే అంటోంది ఆమె. కానీ దాన్ని మించిన సంతోషం ఎన్నడూ ఎరగనిది కలుగుతోంది అనికూడా.
కానీ కాన్పులమీద కాన్పులు ,ఎడతెరిపి లేని పిల్లల పెంపకాలు  చాలీచాలని ఆర్ధిక స్థితిగతులు, అనారోగ్యాల మధ్య, పురుషుల దాష్టీకాల
మధ్య ఈ సంతోషపు లేశం కూడా మిగలకపోవడం పచ్చి నిజం. కానీ కలగడం అన్నది సత్యం. ఆమె దానినే చెప్తోంది
పాపాయి వచ్చేసింది. మొదటగా పాపకి పాలు చేపించే అనుభవం. ఇలా ఆశ్చర్యపోతోంది ఆమె.
“నేను తినే భోజనాలు కోమలమైన నీ జఠరకోశానికి జీర్ణమౌతాయా
 “మాధురిచే రుచులూరు క్షీరముల్ స్వామి సృజింపకున్న”
దాన్ని మధురమైన రుచి గల పాలుగా స్వామి మార్చకపోయినట్లైతే
” ఒకపల్లును మొలవని బోసినోటితో”
 ఏమీ తినలేవనే ఇలా తయారుచేసిపెట్టాడు ఆయన అంటుంది.
జాషువా శిశువు కవితలో ఇదే మరోలా అంటాడు
” భోజనము వెంట తెచ్చుకున్న వింత అతిధి” అని. మరెవరేనా ఇలా మనింటికి తన భోజనం వెంట తెచ్చుకుంటే ఒప్పుకోం. “ఆ మాత్రానికి ఎందుకొచ్చేరు” అంటాం.కానీ ఆయనే చెప్పినట్టు మన ఇంట కొత్తపెత్తనపు దారు అయిన వాడినేమీ అనలేం.
ఇంతవరకూ మరొకరెవరేనా రాయచ్చు. కానీ తరువాతి రెండు పద్యాలూ ఆమె రాయగలిగినవే. ప్రతీ స్త్రీ తాలూకు గాఢమైన అనుభవాన్నీ నిస్సంకోచంగా పద్యాలలోకి ఎక్కించేసారు అనసూయ గారు.
” గుప్పున చప్పరించుచును గ్రోలగ వీలగు పాత్రలందు
 నీ కప్పటికప్పుడే పచనమై ప్రవహించుచు వెచ్చవెచ్చగా
నిప్పును నీళ్లు లేక యిట నిల్చెడి ఎన్మిది
జాములందు
 నీకెప్పటికాకలౌనొ అపుడెల్ల ననున్ కడు తొందరించుచున్
గుప్పుగుప్పుమని చప్పరిస్తూ గ్రోలడానికి (తాగడానికి అనలేదు. పిల్లలు అమ్మ దగ్గిర పాలు తాగరనుకుంటాను. అమృతంలా గ్రోలుతారట) వీలైన పాత్రల్లోకి అప్పటికప్పుడు అంటే ఆకలి అవగానే సిద్ధంగా పచనమై ప్రవహించి వచ్చేస్తాయి.
ఇక్కడ ఆమె పాలతో నిండిన రొమ్ములను పాత్రలు అంటోంది. వెచ్చవెచ్చగా కూడా. నిప్పూ నీళ్లూ అవసరం లేకుండా. అమ్మ పాలు గేదెపాలలా చిక్కగా ఉండవు మరి. నీళ్లు కలిపిన పాలలాగే ఉంటాయి. ఆ వెచ్చదనాన్ని పల్చదనాన్ని ఆమె ఎంత హృద్యంగా చెప్పేరో కదా
ఇంకా ఇలాగట
“నీకెప్పటికాకలౌనొ అపుడెల్ల ననున్ తొందరించుచున్”
పాప కిఆకలి కాగానే పాత్రల్లో పాలు సిద్ధమై అమ్మను తొందరపెడతాయి. అమ్మలందరి నిరంతర నవ్యానుభవమే ఇది.
మరింత వివరంగా రాయకుండా ఉండలేకపోయిందేమో అనసూయా దేవిగారు అనిపిస్తుంది తర్వాతి పద్యం చూస్తే.
“ఆకటిచిచ్చు రేగ అట అర్భకు గర్భములోన
స్తన్యముల్ దూకుచు పొర్లిపోవుటకు తొందరచేయును”
పాపాయి గాడి పొట్టలో ఆకలి రేగిందంటే తల్లి స్తనాల లోకి పాలు దూకి పొర్లిపోవడానికి సిద్ధమౌతాయి.
ఇంత అద్భుతమైన అనుభవం తల్లికి కాక తండ్రి కి వస్తుందా.
“పసికందువు ఏడుపు పాలచేపు తో ఏకము చేసి బిడ్డదరి కేగగ వేగిరపెట్టుచుండెడిన్”
బిడ్డ ఏడవగానే పాలుచేపుకు వచ్చేలా చేసి పాపాయి దగ్గరకు వెళ్లాలని తల్లి ని కంగారు పెట్టే ఆ దివ్య శక్తి ఎవరో కదా అని ఆశ్చర్యపోతుంది కవయిత్రి.
 మాతృమూర్తి ఐన స్త్రీ గుండెల్లోంచి పొంగుకువచ్చే వెచ్చని చల్లదనాన్ని ఆమె హాయిగా ఏ సంశయమూ లేకుండా చెప్పడం ఆ కాలంలో ఎంతో విశేషమే.
కానీ స్త్రీ కి ఇంత పారవశ్యంతో ఈ తియ్యదనాన్ని అనుభవించే అవకాశం సమాజం అప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు.
అందుకే పాటిబండ్ల రజని “పాలింకడానికి మాత్రలున్నట్టు మనసు ఇంకిపోవడానికి కూడా మాత్రలుంంటే బావుణ్ణని” అబార్షన్ స్టేట్మెంట్ కవిత లో రాస్తారు
కానీ ఏదెలా ఉన్నా ఈ తల్లి ఆ బిడ్డ తో పొందిన ఆ తాదాత్మ్యపు సమయం తో ఏదీ సాటి రాదు. పాలిచ్చే సమయంలో తల్లీ పిల్లల ఏకాగ్రతల పారవశ్యం చూడ తరమా అనిపిస్తుంది.
అనసూయా దేవి పద్యాలు చదివితే నేను మళ్లీ పాత రోజులలోకి వెళ్లిపోయాను. నిజమే ఆకలితో పసిబిడ్డ స్తన్యంకోసం ముక్కునీ మొహాన్నీ ఏకం చేసుకుని హడావిడి, కంగారూ, గడబిడ పడిపోతూ బుల్లి పెదవుల మధ్య ఇమిడేదాకా పడే అవస్థ,
దొరకగానే కంగారు కంగారు గా తాగేసి ఉక్కిరిబిక్కిరి అవడం, ఆయాసపడడం, కాస్త ఆకలితీరేక నెమ్మదిగా అరమోడ్పు కళ్లతో నిద్రలోకి జారడం ఇవన్నీ గుర్తొచ్చాయి.
కవిత్వం నన్ను మళ్లీ బాలింతను చేసింది.
అది కదా కవిత్వం అంటే
పునర్నవం చెయ్యగలగడమే కదా కొలబద్ద.
ఇలాంటి పద్యాలు ఏరినందుకే , వాటిని కావ్యమాలలో చేర్చినందుకే కాటూరివెంకటేశ్వర్రావు గారు నాకు ఫేవరెట్ హీరో.
సౌందరనందమనే గొప్ప కావ్యం రాసినందుకు ఎలాగూ వారిని ఎప్పుడో శిరసున ధరించేను.
గుంటూరు లో పుట్టిన అనసూయా దేవి గారి మొత్తం కావ్యంలో ఇంకెన్ని రుచులున్నాయో  ఎక్కడ దొరుకునో?? ఏమో??!!
*
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి”అన్నారో సినీకవి. అలాటిది మహిళ మాతృమూర్తి అవడం ఎంత తీయని విషయం… మీరు వ్రాసిన వ్యాసం కూడ అనసూయ గారి పద్యాల వలె హృదయంగమం మేమ్. ఈ సంపదను వెలికి తీయడం మీ వల్లనే సాధ్యం సుమండీ.

  • మాతృత్వం కూడా ఒక మార్కెట్ అయిన ఈ రోజున , ఆపేరు చెప్పి ఆడవారిని శల్యాలుగా మార్చిన ఆ రోజున కూడా అమ్మకి ,బిడ్డకి మధ్య మాత్రమే వుండే ఆ అవ్యాజమైన అనురాగాన్ని , ఆ అనుభూతి ని అనసూయాదేవిగారు ఎంత చక్కగా రాయగలిగారో . దాన్ని కాటూరి గారు సంకలనంలో చేర్చటం ,మీరు మీ అద్భుతమైన విశ్లేషణతో మాకు అందించటం ఇంకా ఆనంద దాయకంగా ఉంది. అభినందనలు .💐🙏💖🌷

  • లోలోపల మాతృత్వపు భావనల ను స్త్రీత్వపు మృదువైన తడితో తీర్చిదిద్దారు…. ఆనాటి ఆ సృజనను మీరు మాత్రమే పట్టి మాకు అందించగలరు. మేమ్.

  • ధన్యవాదాలు, ma’am💐..మాకు అంత గా,తెలియని ప్రముఖులు గురించితెలియ పరిచే,మీరు మా అభిమాన 💐రచయిత్రి.!

  • లక్ష్మి గారూ మీరు విశ్లేషించిన తీరు ఒక చక్కని పెయింటింగ్ లా పాఠకుల మదిలో ముద్ర పడిందండీ..అది ఎన్నో మాతృత్వ పు మధుర జ్ఞాపకాలను తట్టి రేపింది. ధన్యవాదాలు.

  • ఎంతో ఓపికగా పాత సంకలనం బయటకు తీసి అద్భుత పద్యాల భావాలను చక్కగా విశ్లేషించిన తీరు చాలా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు