జరగకూడని తప్పు

కొన్ని కథలు జీవితాంతం వెంటాడుతాయి. పత్రికల్లో పనిచేసిన అనుభవం నాకలాంటి కధల్ని పరిచయం చేసి౦ది. ఓసారి దీపావళి పోటీకి వచ్చిన కధలు టేబుల్ మీద గుమ్మరించుకుని చదువుతున్నాం నేను నా స్టాఫ్ ఇంకో నలుగురు. తిరపతిలో లడ్డు కడుతున్నప్పుడు ఇలాగే కూచు౦టారనుకుంటా. కానీ మంచి కథలు వెతకడం లడ్డూలు తిన్న౦త తియ్యగా ఏమీ వుండదు.

పది మంచి కథలు బయిటికి తియ్యడానికి తొంభై శాతం నిస్సారమైన కథలు చదివాలి దానికంటే నీళ్ళు లేని చెరువులో చేపలు పట్టడం తేలిక.  అనుకోకుండా నా చేతికి ఒక ఆణిముత్యం దొరికింది. అప్పట్లో చాలా రోజులు వెంటాడింది కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకం మాసిపోయింది. రచయిత పేరు గుర్తు రావడంలేదు. కధ , కధనం కూడా మసకగానే వున్నాయి . క్లయిమాక్స్ ఒక్కటీ గుర్తు వుంది . దానికోసమే ఈ కధ అల్లుతున్నాను . కాబట్టి ఇది తిరిగి రాసిన కధ ( retold story ) అనుకోవచ్చు .

*

గోదావరి ఎక్స్ ప్రెస్ వేగంగా నడుస్తోంది . బoడిలో ప్రయాణీకులు పల్చగా వున్నారు . నాకు రిజర్వేషన్ లేదు . వాళ్ళనీ వీళ్ళనీ బతిమలాడి లేదనిపించుకుని, మోకాలు నొప్పితోనే ఎలాగోలాగా పై బర్త్ మీదికి ఎక్కి, దేహాన్ని సగానికి మడత పెట్టాను . తల ఎత్తడానికి లేదు కాబట్టి కొంగలాగా కిందికే చూస్తున్నాను .

కనీసం అప్పర్ సీట్ కిటికీ కూడా కనిపించడంలేదు . కిందవాళ్ళ లగేజ్ అనుకుంటా ఎడా పెడా పేర్చేసి వుంది . నాలుగురోజులుగా కురిసిన వాన వల్లనో ఏమో చలిగాలి వీస్తోంది . దూరంగా తలుపు దగ్గర ఒక భార్యా భర్తా నేలమీద పాత దుప్పటి పరుచుకుని కూచున్నారు . రెండు మాసిన సంచులు , ఒక తోలు పెట్టె పక్కన వున్నాయి . పని పాటలు చేసుకునే వాళ్ళు కావచ్చు అనుకున్నాను . ఇద్దరు పిల్లలు కాబోలు, . ఎర్ర తువ్వాలు కప్పుకున్న ఒక పాప ఆమె వొళ్ళో నిద్రపోతోంది. ఇంకో పాప అతని భుజం నిద్రపోతోంది. ఆ పాప మీద నీలం రంగు గళ్ళ తువ్వాలు వుంది. ఆవిడ కొంగుతో ముఖం కప్పుకుని ఎందుకో ఏడుస్తోంది. అతను ఓదార్చడానికి ఒకసారి భుజంమీద చెయ్యివేసి వూరుకున్నాడు . నిజానికి అతని ముఖం కూడా దిగులుగానే వుంది . కాసేపటికి స౦చీ లోంచి చిన్న స్టీలు గిన్నె తీసి ఏదో తినమని ఆమెకి ఇచ్చాడు . ఆమె వద్దు అన్నట్టుగా మొహం తిప్పుకుంది . వెంటనే ఆ గిన్నె మళ్ళీ స౦చీలో పెట్టేశాడు . అతను కూడా తినలేదు. బహుశా అయినవాళ్ళెవరో పోయినట్టు తెలిసి హటాత్తు గా ప్రయాణం కట్టి వుండాలి అనుకున్నాను .

రైలు నడుస్తూనే వుంది . కాసేపటికి అతని భుజం మీద పాప కదిలి ఏడ్చింది . పాపను ఆమెకి ఇచ్చి అమె వొళ్ళో వున్న ఇంకో బిడ్డని చేతిలోకి తీసుకున్నాడు . పాపకి పాలిస్తూ కూడా ఆమె ముక్కు చీదు కుంటూనే వుంది. లయబద్ధమయిన రైలు చప్పుడుకి క్రమగా నా కళ్ళు మూతలు పడ్డాయి .

అర్ధ రాత్రి దాటినట్టుంది . రైలు బ్రిడ్జి మీద నడిచే ఒక రకమైన చప్పుడతో బాటు తలకి సీటు హుక్ తగిలి మెలకువ వచ్చింది . నా చూపు మళ్ళీ ఆ దంపతుల కోసం వెతికింది . ఆమె అలాగే తల సీమకు పక్క గోడ కి ఆన్చి నిద్రకొరిగింది, కానీ అతను రెప్ప వాల్చినట్టు లేదు . తన భుజం మీద వున్న పాపని ఆమె పక్కనే పడుకోబెట్టి ఒకసారి కంపార్ట్మెంట్ అంతా చుట్టి వచ్చాడు . అరగంట తర్వాత మళ్ళీ వచ్చాడు . ఆమె వొళ్ళో వున్న ఎర్రఆతువాలు కప్పిన పాపను పాపని తీసుకుని వెళ్ళాడు . ఇప్పుడు నాకు ఆమె తప్ప అతను కనిపించడం లేదు. ఆమె పక్కనే కింద చాప మీద ఇంకో పాప నిద్రలో వుంది .

రైలు బ్రిడ్జీ మీదే వుంది. గోదావరి బ్రిడ్జి చాలా పెద్దది కదా దాటడానికి సమయం పడుతుంది అనుకున్నాను .

మళ్ళీ నాకు కళ్ళు మూత పడ్డాయి . కూచుని నిద్రపోయే అలవాటు లేకపోవడం వల్ల ఎప్పుడు పడిపోతానో అని భయంగా వుంది ఆలాగే రాడ్ పట్టునికి దానికేసే తల వాల్చాను .

ఎంత సేపు గడిచిందో తెలియదు . . బైట వాన పడుతూనే వుంది . బాత్రూమ్ కి వెళ్లాలనిపించి మెల్లిగా కిందికి దిగాను . ఇప్పుడు తలుపు దగ్గర వున్న దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు కావలించుకుని ఏడుస్తున్నారు .

మత్తు దిగిపోయింది . ‘ఏమిటి ఏమయింది’ అడిగాను

కాసేపు సందేహించి అతను చెప్పాడు .

మొత్తం విన్నాక నా బుర్ర మొద్దుబారిపోయింది . నాకు అర్ధంఅయింది మీకు చెబుతాను .

ఆ ఇద్దరు వ్యవసాయ కార్మికులు . తమకి వున్న కొద్ది పాటి పొలంలో వరి పండిస్తారు. రెండేళ్ల నుంచీ పంటలేక అప్పుల పాలయ్యారు . వేర్వేరు కులాలు నుంచి చేసుకున్న ప్రేమ పెళ్లి కాబట్టి అటువైపు కానీ ఇటువైపు కానీ అమ్మా అయ్యలు తొంగి చూడరు. ఎవరో మిత్రుడు తను చేసే చోట పని ఇప్పిస్తానన్నాడు . వెంటనే ఏమీ ఆలోచించ కుండా బ౦డెక్కేసారు . వాళ్ళ కష్టాలు అంతటితో తీరలేదు . ఒకే పోలికలతో వున్న ఆ ఇద్దరు కవల పిల్లల్లో ఒక పిల్లకి రెండ్రోజులనుంచీ ఎడ తెరిపి లేని జ్వరం కాస్తోంది . మామూలు జ్వరమే కదా వూరు వెళ్ళాక సూది మందు ఇప్పి౦చాలని అనుకున్నారు . ప్లాట్ పారమ్మీద బండి కోసం చూస్తుండగానే ఆ పిల్ల ఉన్నట్టుండి రెండు వెక్కిళ్లు పెట్టి ఊపిరి విడిచింది . ప్లాట్ ఫారమ్మీద ఎవరో మెళ్ళో స్టెతస్కోప్ వేసుకుని కబడితే బిడ్డ కి ఏమయిందని అడిగారు . “ప్రాణం లేదు” అని చెప్పాడట. ఇద్దరికీ మతి పోయింది . వెనక్కి వెళ్లాలో ముందుకి వెళ్లాలో తోచని తనం . ఏదయితే అది అవుతుందని బండెక్కారు. కానీ మృత శిశువు ని ఏం చెయ్యాలి . రైల్లో ఎవరికి తెలిసినా దిగి పొమ్మని గొడవ చేస్తారు కదా . కళ్ళు మూసుకుని గోదావరి తల్లి ఒడిలో పడేస్తానంటాడు భర్త. వద్దని ఏడుస్తోంది భార్య .

రైలు దిగిన వెంటనే కాంట్రాక్టు ప్రకారం పనిలో దిగాలి . సాయంత్రమయే దాకా ఈ బిడ్డకి ప్రాణం లేదనే మాట కప్పి పుచ్చాలి. కాబట్టి అదంతా కుదరదు . గోదారి తల్లి కి ఇచ్చేద్దాం అంటాడు

పద్దతి ప్రకారం ఖననం చేద్దాం అంటుంది భార్య .

బండి ఎక్కినదగ్గరనుంచీ ఎవరికీ వినిపించకుండా వాళ్లకున్న రహస్య వేదన ఇదే .

తీరా ఏం జరిగింది .

భార్య నిద్రలోకి వెళ్ళగానే అతను అనుకున్నప్రకారం ఆమె వొళ్ళో వున్న పిల్లని అందు కున్నాడు . గుండె రాయి చేసుకుని గోదారిలో పడేసి వచ్చాడు . చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో భార్య పక్కన పడుకోబెట్టిన ఇంకో బిడ్డని బిడ్డని చేతిలోకి తీసుకుని గుండెకి హత్తుకున్నాడు . ఏదో అనుమానం వచ్చింది . బిడ్డశరీరం చల్లగా వుంది కదలడం లేదు . ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు . జరిగింది అర్ధమై కుప్పకూలిపోయాడు .

అతనికి తెలియకుండా జరిగి౦ది ఏమిటంటే , పొత్తి గుడ్డలు తడుపుకుని ఏడుస్తున్న బిడ్డని ఒడిలోకి తీసుకుని చలికి వొణుకుతుంటే ఎర్ర తువ్వాలు కప్పిందని ..

అదే బిడ్డని అందుకున్న అతను బిడ్డ నిద్రలో వుండటం , ఎవరూ చూడకూడదనుకోవడం , చీకటి , తడ బాటు , తొందర , జరగకూడని తప్పు జరిగిపోయింది . చేతులారా బతికున్నబిడ్డని గోదారిలో జారవిడిచాడు . వెనక్కి తీసుకోలేనంత తప్పు చేశాడు . ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు . అలికిడికి అప్పుడే నిద్రలేచి వొడి తడుముకున్న భార్య అక్కడ వుండాల్సిన బిడ్డ ఎక్కడుందో , చనిపోయిన బిడ్డ ఎవరో అర్ధం కాక దుఖానికి అతీత౦గా అయోమయంగా చూస్తోంది .

అతను చేతులతో ముఖ౦ కప్పుకుని రోదిస్తున్నాడు .

నేనయితే నిలునా కొయ్యబారిపోయాను .

రైలు పరిగెడుతూనే వుంది .

వాళ్ళు ఆ బిడ్డని విసిరేసిన క్షణాన్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలీక ఏడుస్తున్నారు .

ఆ బండికి వెనక్కి నడవడం చాతకాదు కాబట్టి ముందుకే పరిగెడుతోంది .

గోదావరి మాత్ర౦ ఏమీ జరగనట్టు ప్రవహిస్తూనే వుంది.

*

చిత్రం: సృజన్ రాజ్

కొండేపూడి నిర్మల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథనం బావుంది
    పేదరికం ఎంతవరకు తెచ్చిందో

  • ఎంత భయంకరమైన కథ. I ఆలోచన రావడానికి మూలం ఏమిటో మరి.

  • ఇది కేవలం కథ మాత్రమే. అస్సలు వాస్తవం కాదు అని చెప్పండి నిర్మల గారూ! ప్లీజ్.

  • గుండెను మెలిపెట్టింది మేడం..
    ప్చ్…

  • ఇటువంటి కథ ఈ మధ్యకాలంలో చదవలేదండీ. మీరు చెప్పినట్టు ఈ కథ జీవితాంతం వెంటాడుతుంది.

  • ఈ కథ 1993లో అనుకుంటాను కారా మాస్టారు మద్రాస్‌లో రాణి బుక్ సెంటర్ మెట్లపై నిలబడి చెప్పారు నాకు. అనూష అనే కలం పేరుతో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన కథ అని తెలిసింది అని అన్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.