అర్ధరాత్రి
దేశాధినేత భారతమాత ఫోటో ముందు నిలబడి కన్నీరు మున్నీరౌతున్నాడు.
భారతమాతకు వొక పక్కన గోమాత మరో పక్కన ఆయనకి బయలాజికల్ జన్మనిచ్చిన తల్లి బొమ్మలు కూడా వున్నాయి.
అతని దుక్కానికి కరిగి ఆ బొమ్మలు జీవం పోసుకున్నాయి.
తాను నాన్ బయలాజికల్ అవతార పురుషుడు అని ప్రకటించుకున్నప్పటినుంచీ ఆయన సొంత అమ్మ జ్ఞాపకాలని పెద్ద పట్టించుకోవడం లేదు. భారతమాతని విశ్వమాత చేసేందుకే కారణ జన్ముడై పుట్టానని విశ్వసించడం వల్ల తన తల్లి బొమ్మ కెమెరా ఫ్రేంలో పదిమందికీ కనిపించడానికి పక్కన పెట్టుకున్నాడు గానీ ఆయన ఆమెకేసి చూసింది లేదు.
కానీ యిప్పుడా బొడ్డూడని జెన్ జి, జెన్ ఆల్ఫా పిల్లలు అన్న మాటలతో అతని నమ్మకాలు పెనుగాలికి దూదిపింజల్లా చెదిరిపోవడంతో భూమ్మీదికి దిగిరాక తప్పలేదు.
‘అమ్మా’ అందామనుకున్నాడు కానీ నోరు పెగల్లేదు.
తన చుట్టూ అందంగా కట్టించుకొన్న ఆరాధనా సౌధాలన్నీ కుప్ప కూలిపోయినట్టనిపించి ఆయన కుమిలిపోతున్నాడు.
తాను నిర్మించింది జన సముద్రపు అలల తాకిడికి చెదిరిపోయే సైకత శిల్పమనీ యిసుకతో కట్టిన పిచ్చి పిచ్చుక గూడనీ తెలిసే సరికి అవాక్కయ్యాడు.
తాను ముప్పై యేళ్ళుగా ప్రచారం చేసిన అసత్య కథానాల్నీ చరిత్రనీ కుర్ర కుంకలు మూడునాళ్ళలో ధ్వంసం చేశారని కోపంగా వుంది.
వాళ్ళు అత్యంత సృజనాత్మకంగా మీమ్స్ లో చేసే అవహేళనలకు అంతులేకుండా పోతుంది. తల కొట్టేసినట్టుంది.
ఏ చిన్నపాటి నిరసన యెదురైనా అణచివేశాననీ ప్రశ్నించిన ప్రతి గొంతునీ కాల రాశాననీ యిన్నాళ్ళూ గర్వంగా వుండేది. దేశాన్ని భయం గుప్పిట్లో బంధించి నియంత్రించాననుకున్న మురిపెం ముక్కలైంది. ఏ మాత్రం భయం లేని రవ్వంతయినా జంకూ బెదురూ లేని యీ పిల్లల ముందు పంచె వూడి పరువు పోయింది.
వాళ్ళని భయపెట్టే భ్రమపరచే ప్రలోభపెట్టే పక్కదారి పట్టించే కొత్త నేరేటివ్స్ తోచక దిగులుగా వుంది.
వాట్సాప్ యూనివర్సిటీలు కూడా స్తబ్దుగా మూగపోయాయి.
భక్తుల నోళ్ళు మూతపడ్డాయి.
ఇదంతా నంబర్ టూ నంబర్ త్రీల పన్నాగం కాదు గదా అని అనుమానం కూడా ఆయనకి కలిగింది.
ఆ అనుమానంతో వొళ్ళు జలదరించింది. ఒక్క సారిగా వొంటరితనం కమ్ముకున్నట్టై మరింత దుఖ్కం కలిగింది.
తట్టుకోలేక బావురుమని ఏడ్చాడు.
గోమాత తోకతో ఈగలు తోలుకుంటూ పట్టించుకోలేదు. పద్నాలుగేళ్లు నిండిపోయాయని దాని బెంగలో అది వుంది.
సొంత అమ్మ సహజోద్వేగానికి గురైందిగానీ సంబాళించుకుంది.
భారతమాత తనతో పాటు సింహమ్మీద కూర్చోబెట్టుకుని వోదారుద్దామనుకుంది గానీ మళ్ళీ దిగనంటాడేమోనని భయపడి వూరుకుంది.
అర్ధరాత్రి పూట సెల్ఫీ వీడియోలో దేశాన్ని వుద్దేశించి మాట్లాడినా, దానికి 35 కోట్ల వీక్షకులు వచ్చినా ఆయనకి సాంత్వన దొరకలేదు.
తన వీడియో కౌంటర్ ప్రొడక్టీవ్ గా మారిందని తెలిసి దిగులైంది. ఆ వీడియోని ట్రోల్ చేస్తూ వచ్చిన రీల్స్ కి వ్యూస్ యెక్కువ వచ్చినట్టు తెలిసింది.
జూకర్ బర్గ్, ఎలెన్ మస్క్ కూడా తన మీద కుట్ర చేశారేమోనని బెంగపడ్డాడు. యుద్ధభూమిలో ఆయుధాలన్నీ అయిపోయిన వొంటరి కిరాయి సైనికుడిలా వుంది అతని పరిస్థితి.
“అమ్మా.. అమ్మా.. హ్హమ్మా” బోరుమని యేడ్చాడు మళ్ళీ.
చెట్టంత యెదిగిన అడ్డంగా యాభై ఆరించీలు వ్యాపించిన ఆ మనిషి హృదయ విదారకమైన యేడుపు విని యీ సారి జన్మనిచ్చిన తల్లి తట్టుకోలేకపోయింది. మళ్ళీ పొదవుకుని తన కడుపులో దాచుకుంటే బావుణ్ణు అనుకుంది.
“అమ్మా తిట్టారమ్మా”
“ఎందుకు నాయనా నీ బాధ? వాళ్ళు తిట్టినందుకా దొరికిపోయినందుకా ముసుగు తొలగి పోయినందుకా వోటు బ్యాంకు చోరీ అయినందుకా?” కొడుకు కళ్ళలోకి చూస్తూ ఆమె అడిగింది.
“విశ్వగురువైన దేశాధినేతని అలా పిల్లలు తిట్టవచ్చా అమ్మా” టాపిక్ మార్చాడు.
‘దేశాధినేత కాని వాళ్ళని తిట్టవచ్చా’ ట్రోలింగ్ కి గురయ్యే తన బిడ్డలెందర్నో తల్చుకుని భారతమాత దీనంగా వాళ్ళిద్దరివైపు చూసింది.
“నాకైతే యిది పెద్ద కల్చరల్ షాక్” అన్నాడు యెవర్నీ వుద్దేశించకుండా గాల్లోకి చూస్తూ.
‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’
ఆ మాటలు ఆవు నోటినుంచి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు చిట్లించి దాని కేసి చూస్తే అది నెమరేసుకుంటుంది.
ఒక్కసారిగా గంభీరంగా ముఖం పెట్టి “అయినా వాళ్ళని క్షమించానని దేశ్ కీ జనతా సాక్షిగా ప్రకటన యిచ్చానమ్మా” అన్నాడు.
అతని మాటల్లో లాజిక్ ముగ్గురు తల్లులకీ అర్థం కాలేదు.
కొడుకు నార్సిస్టు స్వభావం తెలిసిన సొంత తల్లే ముందు తేరుకుంది.
“అదేంటి నాయనా చేయాల్సిందంతా చేసి వాళ్ళని నువ్వు క్షమించడం ఏంటి?”
“నేనేం చేశాను?” అమాయకమైన ముఖం పెట్టి యెదురు ప్రశ్నించాడు.
“ఏం చెయ్యలేదు? పసిపిల్లల మీద లాఠీ చార్జి చేయించావ్. కాళ్ళూ చేతులు విరగ్గొట్టావ్. తలలు పగలగొట్టావ్. టియర్ గ్యాస్ వదిలావ్. చట్ట పరిధిని అతిక్రమించి పెల్లెట్స్ కాల్పులు చేశావ్. చదువుకునే ఆడపిల్లల మీద వాళ్ళ తల్లుల మీదా మగ పోలీసులూ మదమెక్కిన నీ ప్రయివేట్ సైన్యం చెడ్డీ గ్యాంగ్ పశువుల్లా దాడిచేశారు. చున్నీలు లాగారు. కిందపడేసి కుర్తాల్లో చేయిపెట్టి నేలకు తొక్కి పెట్టి ఆనందించారు. పిర్రల మధ్య లాఠీలు పెట్టి అసహ్యంగా నవ్వారు. చేసిన అసభ్యకరమైన హేయమైన చర్యలనెలా సమర్థించుకుంటావ్?” చిరాగ్గా అడిగింది.
“అమ్మా నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు.”
“నిన్ను నాకంటే బాగా యెవర్రా అర్థం చేసుకునేది. శాంతి యుతంగా నిరాహారదీక్ష చేసే పిల్లల్ని ప్రేమగా పలకరించి సమస్యని పరిష్కరించి వుంటే నీకీ యాతన తప్పేది.”
“అమ్మా, వాళ్ళు రాళ్ళేశారు. రెచ్చగొట్టారు!”
“ఆ రాళ్ళ లారీలు అక్కడికెలా వచ్చాయో తెలుసులేరా సన్నాసీ!”
ఇక లాభం లేదని తన దగ్గర మిగిలున్న ఆఖరి అస్త్రం బయటికి తీశాడు కొడుకు.
“అమ్మా, నువ్వు వినలేదనుకుంటా. ఆ పిల్ల నన్ను కాదమ్మా తిట్టింది .. నిన్ను” అన్నాడు ఆమెని ముగ్గులోకి లాగుతూ.
“నిజానికి నన్ను కాదురా నాయనా నిన్ను తిట్టారు. దీన్ని కూడా రాజకీయం చేయకు”
“హ్హమ్మా..”
“నా కడుపున చెడబుట్టావ్. ‘మాతృవత్ పరదారేషు’ అన్నారు కదా! ఎంతమంది స్త్రీలని నీ భక్తులు బండ బూతులు తిట్టారో యెంతమంది తల్లుల్ని నువ్వు నిండు సభల్లో అవమానించావో మర్చిపోయావు. నీలాంటి కొడుకుని కన్నందుకు నన్ను తిట్టారంటే తిట్టరా మరి. నేను నిందకు అర్హురాలినే” ఆ మాట పూర్తయ్యే లోపు ఆమె కళ్ళలో నీళ్ళూరాయి.
కొరగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు; తల్లి గుణములు చెఱచున్ పద్యం, తనలాంటి కోట్లాది తల్లులు గుర్తుకొచ్చి కొడుకు దుఖ్కానికి కరిగి జీవం పోసుకున్న తల్లి మళ్ళీ గడ్డకట్టుకుని నిలువెత్తు ఫోటోలోకి బిగుసుకుపోయింది.
గోమాత అక్కణ్ణుంచి యెప్పుడెళ్ళిపోయిందో యెవరూ గమనించలేదు.
భారతమాత బిక్కచచ్చిపోయింది.
*








సారంగ మొత్తానికి ప్రతిపక్ష పత్రికగా మారిపోయింది. బోల్డంత మంది (కుహనా) మేధావులు మొత్తుకుంటూ ఉన్నట్టు ఏ రాజకీయ పార్టీ/ లేదా నాయకుడు కేవలం దొంగ ఓట్లతో గెలవలేదు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీని తుక్కు తుక్కుగా ఓడించి, బీజేపీని తక్కువ సీట్లకు పరిమితం చేసి, ఆమ్ ఆద్మీబార్తీ నేతను ఏం ఎల్ ఏ గా కూడా ఓడించే ప్రజలు మాటిమాటికీ నిరూపిస్తూనే ఉన్నారు. జనానికి కావాలంటే ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా మళ్ళీ మోడీ రాక మానదు. వద్దనుకుంటే ఒక్క సీటు కూడా రాకుండా మాడి మసి అయిపోతాడు. దాని గురించి సాహిత్య పత్రికలను రాజకీయాలతో కంపు చేయవద్దు. ప్లీజ్.
రచయిత తన అనుభవానికి పదును పెట్టి వ్రాసిన కథనానికి జేజేలు
థేంక్యూ, ఇది మనందరి అనుభవం గిరి ప్రసాద్ గారూ.