ఖాళీ పేజీలు  – 7

జీవితంలో సమస్యలు వస్తాయి. అది సహజం. కానీ ఒక సమస్య మరో నాలుగు సమస్యలకి మూలం కాకూడదు.

 

[ సమయానికి ఎవరూ లేకపోతే తనే లిమో సర్వీస్‌కి వెళ్ళాలని ప్రాహీ నిర్ణయించుకుంటుంది. తండ్రి వద్దన్నా పరవాలేదని నచ్చ చెబుతుంది.

అక్కడ గూగుల్‌లో పని చేసే రాయన్ పరిచయం అవుతాడు. ప్రాహీ అందం చూసి మెచ్చుకుంటాడు.

*****

దేవవ్రతని రూమ్ ఖాళీ చేయ్యాల్సిందేనని ఆపార్ట్‌మెంట్ మేనేజరు నోటీసిస్తాడు.  స్వరూప్ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా మేనేజరు ఒప్పుకోడు.

ఒక్కడూ ఉండడం దేవవ్రత ఆరోగ్యానికి మంచిది కాదని, తన రూమ్‌కి తీసుకొస్తాడు స్వరూప్.]

 

తన రూమ్‌కి వచ్చాక దేవవ్రత మొహంలో కాస్త తెరిపి కనిపించింది స్వరూప్‌కి.

ఒక్కడూ ఉండొద్దనీ, వర్కుకి వెళ్ళమని గట్టిగా చెప్పాడు. సరేనన్నాడు కానీ, దేవవ్రతకి వెళ్ళాలని లేదు.

తన గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

వర్కుకి వెళితే తలో ప్రశ్నలు వేస్తారు. ఏం చెప్పాలో తెలీదు. నిజానికి అతని దగ్గరా చెప్పడానికి  ఏమీ లేదు.

ఇండియాలో అమ్మా, నాన్నలకి ఫోన్ చేసి చెప్పాడు, తను రూమ్  మారాలనుకున్నట్లుగా.

అక్కడ తల్లీ, తండ్రి పరిస్థితీ అంతా బాగా లేదు.

తను ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యబోయానని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు.

తన రూమ్‌కి మార్పించానన్న విషయం స్వరూప్‌నే చెప్పమని దేవవ్రత అడిగాడు.

స్వరూప్‌కి దేవవ్రత పేరెంట్స్‌తో మాట్లాడ్డం ఇష్టం లేదు.

ఏదో స్నేహితుడన్న సింపతీ మీద సాయం చేస్తున్నాడు తప్ప, తను ఇలాంటి విషయాల్లో తలదూర్చడం ఇష్టం లేదు అతనికి.

ఈ విషయం దేవవ్రతకి కూడా స్పష్టంగానే చెప్పాడు.

ప్రస్తుతం దేవాకి మనస్థిమితం లేదు.

తనకు జరిగింది తెలిసీ తెగ కుమిలిపోతున్నాడు.

ఆ రాత్రి డిన్నర్‌కి బంగాళా దుంపలు వేపుడు చేద్దామని పాత్రలు సిద్ధం చేసుకుంటూండగా చేతిలో ఫోన్‌తో దేవవ్రత వచ్చాడు.

ఏవిటన్నట్లు చూసాడు స్వరూప్. మౌత్ పీస్ చేత్తో మూసి – వాళ్ళ నాన్న స్వరూప్‌తో మాట్లాడాలనుకుంటున్నాడనీ మెల్లగా చెప్పాడు.

వద్దన్నా వినకుండా తన తండ్రితో మాట్లాడేటప్పుడు బలవంతాన ఫోన్ అందిచ్చాడు.

“హలో అంకుల్!  దేవా ఈజ్ ఆల్‌రైట్. కాస్త సెన్సిటివ్ కదా, టైమ్ పడుతుంది లెండి.

ఒక్కడూ ఉంటే మంచిది కాదని మా రూముకి మార్పించాను. నో ప్రోబ్లం అంకుల్! ఐ విల్ హెల్ప్ హిం! ” అని చెప్పాల్సినవి చెప్పేసి దేవ వైపు గుర్రుగా చూసాడు.

కాసేపయ్యాక వచ్చి దేవవ్రత మరలా ఏడుపు అందుకున్నాడు. స్వరూప్‌కి చికాకేసింది.

విషయం చెప్పమని గట్టిగా తిట్టాడు.

తన వల్ల ప్రాణ భయం ఉందని అనూ వాళ్ళ నాన్న లాయర్‌ నోటీసు పంపించాడట – అదీ విషయం.

అనూ వాళ్ళ అమ్మా, నాన్నలని కలుద్దామని వెళితే ఇల్లు  తాళం. వాళ్ళు వేరే వూళ్ళో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలీదట, కేవలం ఈ నోటీస్ తప్పించి. వాళ్ళేమో కంగారు పడుతున్నారని చెప్పాడు.

స్వరూప్‌కి ఏం చెప్పాలో తెలియడం లేదు. అంతా శ్రద్ధగా విన్నాడు.

“దేవా! ఇదంతా చూస్తూంటే ఒకటర్థమవుతుంది. నీ పెళ్ళాం అనూ, అదే ఆ అమ్మాయి తన దగ్గరున్న ట్రంప్ కార్డులన్నీ వాడేస్తోంది. నీ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని. నా దొక్కటే సలహా. నువ్వు ఈ పెళ్ళి పెటాకులయ్యిందని మర్చిపో! ఎందుకంటే అనూ నీ దగ్గరకి రాదు కాక రాదు. పిరియడ్.

నువ్వు ఈ రొంపిలోంచి బయట పడాలి. అన్నింటికంటే ముందు నువ్వు మారాలి. నువ్వు ధైర్యంగా ఉంటే మీ అమ్మా, నాన్నలకీ కాస్త ధైర్యం వస్తుంది.

చెప్పినట్లు విను. నువ్వు మామూలుగా ఉండు. ఎవరికీ ఏ వివరమూ చెప్పద్దు.

ఒకవేళ ఎవరైనా గట్టిగా అడిగితే – ఇద్దరికీ కుదర్లేదనీ డైవోర్స్ తీసుకుంటామని చెప్పు. అంతకు మించి వివరాలు చెప్పకు. మరీ గట్టిగా ఎవడైనా అడిగితే – నన్ ఆఫ్ యువర్ బిజినెస్ – అని చెప్పేసెయ్యి.  ప్రస్తుతం ఇదొక్కటే నీ కున్న దారి.  ఇంతవరకూ నీ జీవితంలో పడిన ముళ్ళు చాలు. ఒక్కొక్కటీ మెల్లగా తొలగించుకోవాలి…” అని వివరంగా చెప్పాడు.

దేవవ్రత అన్నీ విని సరే నన్నాడు ఎప్పటిలాగానే.

కానీ ఎప్పుడు బ్రేక్ అవుతాడో అతనికే తెలీదు. ఈ విషయం స్వరూప్‌కి తెలుసు.

దేవవ్రత ఒకే విషయాన్ని నెమరు వేసుకుంటూ భయపడతాడు.

అందుకే భోజనం చేద్దువుగానీ, మొహం కడుక్కు రమ్మనమని చెప్పి పంపించాడు.

జీవితంలో సమస్యలు  వస్తాయి. అది సహజం. కానీ ఒక సమస్య మరో నాలుగు సమస్యలకి మూలం కాకూడదు.

బయటనుండి ఎన్నైనా చెప్పచ్చు కానీ అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ.  కానీ ఆ బాధ – పుండు ముదిరి బ్రహ్మ రాక్షసి – కాకూడదు.

ఇదే విషయాన్ని విపులంగా చెప్పాడు స్వరూప్.

ఒక రిలేషన్ గట్టిపడటానికి నమ్మకం మనుషుల మధ్య కావాలి.

ప్రేమ వేరు, నమ్మకం వేరు.

చాలా సార్లు ప్రేమే నమ్మకాన్ని మింగేస్తుంది.

ప్రేమ క్షణికం; నమ్మకం శాశ్వతం.

ఈ రెంటినీ కలిపే దారప్పోగు – కాలం మాత్రమే!

ప్రపంచాన్ని నమ్మించడంకోసం నేహా శీనూతో కలిసి ఉంటోంది తప్ప, మిగతా సమయమంతా సుధీర్ రూములోనే.

లేదంటే సుధీరే ఇక్కడకి వస్తాడు. వీళ్ళిద్దర్నీ చూస్తే శీనూకి కంపరంగా ఉంది. పైకి ఏమీ అనలేడు.

పోనీ నీరూతో కలిసుందామంటే, తను వేరే ఇద్దరు కొలీగ్‌స్తో కలసి ఒక అపార్ట్‌మెంట్ తీసుకొని వుంటోంది.

వాళ్ళుండగా నీరూ అపార్ట్‌మెంట్‌కి వెళ్ళడానికి మనసొప్పదు.

వీక్‌డేస్ ఒక్కోసారి కలవడం కూడా కుదరదు. నీరూ ఫ్రీమాంట్‌లో ఉంటుంది.

తనేమో సన్నీవేల్. రోజూ కలవడం కుదరదు.

సాయంత్రాలు విపరీతమైన ట్రాఫిక్‌లో వెళ్ళడం ఇష్టం లేక మానుకుంటాడు శీను.

తన కంపెనీ శాన్ మ్యాటియో లో ఉంటుంది. ఇద్దరికీ దొరికేది వీకెండొకటే.

ఒక్కోసారి పనుందని నీరూ కలవదు.  ఫోన్‌లోనే పలకరింపులూ, మాటలూ.

ఆ రోజూ  వర్కునుండి శీను ఇంటికొచ్చే సరికి సుధీర్‌తో కనిపించింది నేహా.

క్రిత్రం రోజు నేహ కజిన్ వచ్చి వెళ్ళాడనీ, ఆ సమయానికి నేహా ఉన్నా లేదని చెప్పి పంపించేసానని చెప్పాడు. మరలా ఇవాళ వస్తాననీ చెప్పాడు.

ఇదంతా విని ఏమనుకున్నాడో ఏమో సుధీర్ కొంతసేపయ్యాక వెళిపోయాడు.

అతను వెళ్ళడం చూసి, అంతవరకూ టీవీ చూస్తున్న శీను నేహా గది వైపు వెళ్ళాడు.

అతన్ని చూడగానే – ఏంటన్నట్లు కళ్ళెగరేసింది.

“నేహా!  యూ హావ్ టు మినిట్స్ టు టాక్…?” అని అడిగాడు.

చెప్పమన్నట్లు సైగ చేసింది. అక్కడున్న కుర్చీ లాక్కొని చెప్పడం మొదలుపెట్టాడు.

“బిలీవిట్ ఆర్ నాట్. నాకెందుకో మనం చేసే ఈ నాటకం చూస్తే భయంగా ఉంది…ఎన్నాళ్ళిలా..?

నేను రూమ్ మారి పోదామనుకుంటున్నాను. మేనేజ్ చెయ్యడం వల్ల కావడం లేదు…”

నేహా వేంటనే ఏం మాట్లాడ లేదు. ఓ నిమిషం ఆగి అంది  – “నీకే కాదు. నాకూ ఇబ్బందిగానే ఉంది. ఏదో ఒక రోజు దొరికిపోతామేనని అనిపిస్తోంది.

సుధీర్ ఈస్ట్ కోస్ట్ మూవ్ అవుదామంటున్నాడు. ర్యాలీలో వాళ్ళకి ఆఫీసుంది.

ట్రాన్స్‌ఫర్‌కి అడిగాడు. నేనూ మా కంపెనీ మేనేజర్ని అడుగుదామనుకుంటున్నాను, ట్రాన్స్‌ఫర్ చెయ్యడం వీలవుతుందాని. మా అమ్మ పరిస్థితీ మెరుగు పడుతుందని అనిపించడం లేదు. కొంత కాలం ఓపిక పట్టు. ప్లీజ్!”

తలదించుకునే విన్నాడు శీను. ఏం చెబుతాడు. ఒక పక్క నీరూ కూడా చికాకు పడుతోంది.

“నీ ఫోన్ దొరక్క పోతే మీవాళ్ళు నాక్‌కాల్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ ఫోన్లు తీసుకొని మాట్లాడు. ముఖ్యంగా మీ అమ్మా, నాన్నలవి. వాళ్ళని సముదాయించడం నా వల్ల కావడం లేదు…అన్నట్లు – ఎప్పుడు ఇండియాలో ఉదయం 10 అవుతుంది. ఒకసారి మనిద్దరం మీ అమ్మతో మాట్లాడుదాం. నీకు వర్కు పని మీద కొన్ని నెలలు ర్యాలీ వెళ్ళాల్సిందని ముందు ఒక పొడి వెయ్యి…వాళ్ళూ మెంటల్‌గా

ప్రిపేర్ అవుతారు…నేనూ మా వాళ్ళకి చెబుతాను…” అన్నాడు.

“గుడ్ ఐడియా…” అని ఒక్క ఉదుటున లేచి కూర్చొని సెల్‌ఫోన్‌లో ఇండియా కాల్ చేసింది వాళ్ళ అమ్మకి.

ఇద్దరూ కాసేపు మాట్లాడారు – పక్కపక్కనే కూర్చొని.

నేహా ఫోన్ టేబిల్ మీద పెట్టి  ఇద్దరూ పక్కపక్కన దూరంగా నిల్చొని మాట్లాడుతున్నారు.

నేహా వాళ్ళమ్మ ఎప్పుడూ పాడే పాటే – మనవడో, మనవరాలో కావాలంటూ.

తను పోయే లోపు వాళ్ళని ఎత్తుకొని ఆ ఆనందం పొందాలని. ఇద్దరూ పైకి అలాగే అన్నారు కానీ, ఆ మాటలంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

ఒక్కసారి ఇద్దరికీ ఫక్కున నవ్వొచ్చింది.

తను వేరే వూరులో కొంత కాలం పని చెయ్యాల్సి ఉంటుందని తల్లి చెవిన వేసింది.

ఇద్దరూ వేరు వేరు ఊళ్ళల్లో ఉండాలా అని తల్లి ఆరా తీస్తే, వీకెండు శీను దగ్గరకి వచ్చేస్తానని సర్ది చెప్పింది.

కొంత సేపు మాట్లాడి ఫోన్ పెట్టేసారు.

ఎప్పుడూ రుస రుసలాడే నేహా ఇవాళ ఇంత సౌమ్యంగా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించింది శీనుకి. తనకి చిన్నపటినుండీ తెలుసు. చాలా తొందరగా రియాక్ట్ అయిపోతుంది అయిన దానికీ, కాని దానికీ.

 

డిన్నర్ ప్లేట్ తీసుకొని క్రితం రోజు మిగిలిన కూరా, సాంబారూ ఫ్రిజ్‌లోంచి బయటకి తీసాడు.

కాసేపు హీట్ చెయ్యడానికి స్టౌ వెలిగించాడు. తరువాత  టీ వీ ఆన్ చేసాడు.

భోజనం చేసి ప్లేట్ కడుగుతూండగా నేహా పరిగెత్తు కుంటూ వచ్చింది.

“శీనూ! సుధీర్ వాళ్ళ నాన్నకి హార్ట్ఎటాక్ వచ్చిందట. ఓ గంటలో బయల్దేరుతాడట.

శాన్‌ఫ్రాన్‌సిస్కో ఎయిర్‌పోర్టులో అక్కడ టికెట్ ట్రై చేస్తానని చెప్పాడు.

నేను అర్జంటుగా సుధీర్‌ని కలవాలి,” – అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చెప్పులు వేసుకుంది.

“నేనూ రావచ్చా…?” మెల్లగా అడిగాడు శీనూ.

“వద్దు – నే వెళతాలే..” అంటూ డోర్ ఓపెన్ చెయ్యబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి – “యా…యూ కెన్ కమ్…!” అంది.

తింటూన్న ప్లేటు సింక్‌లో పడేసి ఉన్న పళాన బయల్దేరారు ఇద్దరూ.

గత రెండ్రోజులుగా దేవవ్రతకి విపరీతమైన జ్వరం. డాక్టర్ దగ్గరకి వెళితే రెస్ట్ అవసరం అని చెప్పాడు. దేవవ్రతకి వర్కు ప్రెషర్ ఉందని చెప్పి సర్దాడు స్వరూప్.

డ్రైవ్ చేసే పరిస్థితిలో కూడా లేక పోయేసరికి స్వరూప్‌కి వెళ్ళడం తప్పింది కాదు.

డాక్టర్ అప్పాయింట్‌మెంట్ అని దీపకి ఈ మెయిల్ కొట్టాడు.

దేవవ్రతని రూంలో దిగబెట్టి ఆఫీసుకు వెళ్ళాడు. పార్కింగ్ లాట్‌లో దీప కనిపించింది.

ఆమె వద్దకు వెళ్ళి పలకరించాడు.

“ఏమయ్యింది…డాక్టర్ అప్పాయింట్‌మెంట్…?”

“ఓ అదా, నాక్కాదండీ…మా ఫ్రెండు దేవవ్రతకి. అదే వాడి గురించి చెప్పాను కదండీ…వాడికి హై ఫీవర్. డ్రైవింగ్ చెయ్యలేనంటే సాయం వెళ్ళాను…”

“యా, యా” అవున్నట్లు తలూపింది.

తను లంచ్‌కి వెళుతున్నాను, వస్తావా అని అడిగింది. సరే నని దీప్ కారు ఎక్కాడు.

“మా ఫ్రెండు చాలా పిరికివాడు…అంతకు మించి మరీ సెన్సిటివ్.  ఆడవాళ్ళకంటే ఎక్కువగా ఏడుస్తాడు…ఏం కొంపలు మునిగాయిరా…ఆ అమ్మాయి పోతే ఇంకోళ్ళని పెళ్ళి చేసుకొవచ్చని చెప్పినా వినడు… ఇంకా ఎక్కడో ఒక చిన్న ఆశ వాడికి. ఆ అమ్మాయి తిరిగొస్తుందని. జరుగుతున్నది నిజం కాదని పెద్ద భ్రమ. ఇంత అమాయక ప్రాణులుంటారా అనిపిస్తుందండీ నాకు…” అంటూ గట్టిగా నవ్వాడు.

దీపకి ఒక్కసారి నీరజ్ గుర్తుకొచ్చాడు. నీరజ్ కూడా సెన్సిటివ్ వ్యక్తే! అదే పెద్ద భూతంలా తనని చుట్టుకుంది.

“ఈ రెండ్రోజుల్లో కొత్త డెవలప్‌మెంట్ ఏవిటంటే  దేవవ్రత వల్ల ఆ అమ్మాయికి ప్రాణ భయం ఉందని లాయర్ నోటీస్ వచ్చిందట. ఇక్కడ కాదులెండి. ఇండియాలో వాళ్ళ నాన్నకి…”

“ఇలాంటి కేసు వినడం ఇదే మొదటి సారి. పోతే పోయింది. మళ్ళా ఈ కేసులూ, గొడవలూనా…ఎంత చదువుకున్నా మనుషులు మారలు ఇలాంటి విషయాలు వచ్చేసరికి. స్టుపిడిటీ డామినేట్స్ కామన్‌సెన్స్. అండ్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్…”

అవునన్నట్లు తలూపాడు స్వరూప్.

“నీరజ్ కూడా ఇంతే. మనిషి నెమ్మదస్తుడే కానీ, ఒక్కోసారి పిచ్చెక్కిపోయేది ఆ స్టుపిడిటీ చూసి…” స్వరూప్ వైపు తల తిప్పి అంది.

“నీరజ్ అంటే గుర్తొచ్చింది. మీ కథ మధ్యలో ఆపేసారు…ఇప్పుడైనా చెబుతారా…?” నవ్వుతూ అన్నాడు.

కారు పార్క్ చేసి బనానా లీఫ్ రెస్టారెంట్‌లో వెళ్ళారు ఇద్దరూ.  దీపకి అక్కడి ఫుడ్ ఇష్టం.  ఎప్పుడూ రద్దీగా ఉండే బనానా లీఫ్ ఆ రోజు అంత వెయిటింగ్ లేదు. ఇద్దరికీ ఒక మూల సీటింగ్ దొరికింది.

ఆర్డరు ఇచ్చాక చెప్పడం మొదలు పెట్టింది దీప.

 ఖాళీ పేజీలు గత సంచికలు

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/

 

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81-2/

 

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81-3/

 

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81-4/

 

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81-5/

 

https://magazine.saarangabooks.com/%E0%B0%96%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81-6/

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గొర్తి సాయి బ్రహ్మానందం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ సీరియల్ అర్ధాంతరంగా ముగించారు, పూర్తీ చేయ వీలు లేదా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు