ఖాళీ పేజీలు -3

పైకి మామూలుగా ఉన్నా నాకు నిద్ర పట్టని రాత్రులు చాలా ఉన్నాయి.

నేను గిల్టీ అన్నది ఎవరికీ చెప్పుకో లేను.
నా జీవితంలో ఆ పేజీలు ఎప్పటికీ ఖాళీగానే ఉంటాయి.

 3

జరిగిన పేజీలు:

( అమెరికాలో కొన్ని జీవితాల సమాహారమే ఖాళీ పేజీలు:

 కొత్తగా పెళ్ళైన దేవవ్రత మొదటి సారి అమెరికా వస్తున్న భార్యని రిసీవ్ చేసుకోవడానికి శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టుకి వెళతాడు. 

ఆమె ఫ్లైట్‌లో రాదు. హాంకాంగ్‌లో ఫ్లైట్ మిస్సయ్యిందని అనుకుంటాడు. ఇండియాలో ఉన్న మావగారికి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయరు.

తండ్రిని వెళ్ళి మావగారింటికి వెళ్ళి కనుక్కోమని పురమాయిస్తాడు.

 ప్రహేళిక భర్త రాజు చనిపోయిన అయిదేళ్ళ తరువాత అమ్మా, నాన్నా అమెరికా వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆరేళ్ళ కొడుకుని ఎయిర్‌పోర్టుకి వెళుతుంది. 

ప్రహేళికలో వచ్చిన మార్పు చూసి తల్లితండ్రులు ఆశ్చర్యపోతారు. 

 అప్పుడే పెళ్ళయి వచ్చిన నేహ, శీనులని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్టుకి వస్తాడు శివ. అక్కడ సుధీర్ కనిపిస్తాడు. సుధీర్ నేహ బాయ్ ఫ్రెండ్. నిరుపమ శీను గర్ల్ ఫ్రెండ్. ఫ్లైట్ దిగగానే నేహ సుధీర్‌తో వెళిపోతుంది. శీనుకి అది నచ్చదు.

 దీప వాళ్ళమ్మని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్టుకి వస్తుంది.  స్వరూప్, దీపా కొలీగ్స్! అంతకుమించి ఫ్రెండ్స్. నీరజ్‌తో వేరు పడ్డాక దీప ఒంటరిగానే ఉంటుంది.

విడాకులు తీసుకోమని దీప తల్లి  కూతుర్ని అడుగుతుంది. దీప విసుక్కుంటుంది. )

 

“ప్రహీ! ఇంత పెద్దిల్లే!” అమ్మా, నాన్నా మా ఇల్లు చూసి నోరెళ్ళ బెట్టారు.

ఈ ఇల్లు రాజుబావ ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లు.  నేను వచ్చేసరికే ఇది కొన్నాడు. కానీ ఇల్లు కట్టి ఇవ్వడానికి పది నెలలు పడుతుందని చెప్పాడు. మధ్య మధ్యలో వచ్చి చూసి పోయేవాళ్ళం. నీహార్ పుట్టిన నెలకి ఈ ఇంట్లోకి మారాం.

నిజానికి ఇంట్లో అడుగు పెడుతూనే నాన్న కళ్ళల్లో రెండు కన్నీటి బొట్లు గమనించాను.

రాజు బావంటే నాన్నకి ఇష్టం. ఎంతైనా సొంత చెల్లెలి కొడుకు కదా!

హాలులో రాజుబావ పెద్ద ఫొటో కేసి చూస్తూ నిలబడి పోయాడు.

అమ్మ మాత్రం మామూలుగానే ఉంది.  నీహార్ అమ్మని తీసుకొని లోపలకి వెళ్ళాడు.

నేను దగ్గరకొచ్చి భుజమ్మీద చెయ్యి వేయగానే నన్ను దగ్గరకి తీసుకున్నాడు.

“ప్రాహీ! వాడు లేడంటే నమ్మ బుద్ధి కావడం లేదే!” అంటూ బావురుమన్నాడు.

“నాన్నా! బాధ పడకు. రోజూ రాజు బావ జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటాను. బావే నాకు స్ఫూర్తి!” అన్నాను.

హాల్లో ఉన్న సోఫాలో చతికలబడ్డాడు నాన్న. నేనూ పక్కనే కూర్చున్నాను.

ఇంతలో కర్తార్ వచ్చాడు. లగేజ్ గరాజ్‌లో పెట్టానని చెప్పాడు.

“ఆప్ కీ బేటీ బహుత్ అచ్చీ లడ్కీ… బహుత్ తాకత్ భీ!” అన్నాడు.

నాన్నకి కాస్త హిందీ వచ్చు.

“షీ టొల్డ్ మి యబౌట్ యూ! యూ ఆర్ హెల్పింగ్ హెర్… ” అంటూ ఇంగ్లీషులోనే జవాబిచ్చాడు.

కర్తార్ రాజుబావ దగ్గర పనిచేసేవాడు. రాజుబావ కర్తార్‌కి చాలా సాయం చేసాడన్న కృతజ్ఞతతో ఇప్పటికీ అలానే ఉంటాడు.నాకూ ఎంతో సాయం చేసాడు. రాజుబావ పోయినప్పుడు నిజంగా కర్తార్ చేసిన సాయం ఎప్పటికీ మరవలేను.

నేను ఇలా ఈ రోజు ఉన్నానంటే కర్తారే కారణం.

కాసేపు మాట్లాడి కర్తార్ వెళిపోయాడు.

“నాన్నా! కర్తారే లేకపోతే ఎలా ఉండేదాన్నో ఊహించుకోవడం కూడా కష్టం,” అన్నాను.

“రాజు పోయాక నువ్వేం కష్టాలు పడ్డావో మాకు తెలీదు. నువ్వూ చెప్ప లేదు కూడా! కారు డ్రైవ్  చేస్తున్న నిన్ను చూస్తే నా ప్రాహీయేనా అనిపించింది. నువ్వు ఇంగ్లీషు ఇలా గల గలా మాట్లాడ్డం చూసి ముచ్చటేసింది.”

నేను చాలా గారాబంగా పెరిగాను. ఒక్కతే కూతుర్నవ్వడం వలన ఏ పనీ చెప్పే వారు కాదు. ఆఖరికి చదవకపోయినా సరే. చచ్చి పదో క్లాసు పాసయ్యాను. ఎలా పాస్ అయ్యానొ తెలీదు.  నా అదృష్టం బావుండి నేను బట్టీ కొట్టినవే వచ్చాయి. ఈలోగా అమెరికా వచ్చేసాను.

“మీరు రమ్మనన్మని పదే పదే అడిగినా రాక పొవడానికి కారణం ఉంది. నీహార్‌ని వదిలి రాలేను. పైగా ఇక్కడ విషయాలు నాకు అంతగా తెలీవు. ఒక్కొక్కటీ నేర్చుకున్నాను. అవసరం నేర్పింది.  రాజుబావ నీహార్‌ గురించి ఎన్నో కలలు కన్నాడు. వాడి కోసమే ఇక్కడ ఉండి పోయాను,” అన్నాను.

నిజానికి రాజు బావ పోయాక ఎలా గడిపానో తీలీదు. ఎలా బ్రతకాలో కూడా తెలీని పరిస్థితి.  ఓ రెండేళ్ళు పగలూ, రాత్రి కష్టపడ్డాను.

నాన్నకి ఇల్లంతా చూపించాను. రాజు బావ రూముతో సహా!

“ప్రాహీ! నిన్నొకటడగచ్చా!” నాన్న మెల్లగా అన్నాడు.

ఏంటి అన్నట్లు చూసాను. అడగమన్నట్లు తలాడించాను.

“ఇన్నాళ్ళూ నిన్ను అడగలేదు, రాజు ఎలా పోయాడు…?” నాన్న గొంతు మారింది.

నాన్న నుండి నేనూహించని ప్రశ్న.

“రాజుబావ హార్ట్ ఎటాక్ వచ్చి పోయాడు నాన్నా! పక్కనే నేనూ ఉన్నా! వివరాలు తీరిగ్గా తరువాత చెబుతా! ఇప్పుడు కాదు,” అని మాట దాటేసాను.

రాజుబావ పొయినప్పుడు పోయాడని చెప్పాను కానీ ఎలా పోయాడని వీళ్ళకి చెప్పలేదు.  అమ్మ చాలాసార్లు అడిగింది కానీ ఎప్పుడూ చెప్పలేదు. అడిగితే గట్టిగా ఏడ్చేసేదాన్ని మొదట్లో. మెల్లగా అమ్మ అడగటడం మానుకుంది.

ఇన్నాళ్ళూ అడగని నాన్న ఎందుకడిగాడో నాకు అర్థం కాలేదు.

వినగలిగే ధైర్యం నాన్న కున్నా, చెప్పే మనసు నాకు లేదు.

చెప్ప లేను కూడా!

పైకి మామూలుగా ఉన్నా నాకు నిద్ర పట్టని రాత్రులు చాలా ఉన్నాయి.

నేను గిల్టీ అన్నది ఎవరికీ చెప్పుకో లేను.

నా జీవితంలో ఆ పేజీలు ఎప్పటికీ ఖాళీగానే ఉంటాయి.

00000000000

శాంతాక్లారా సమీపిస్తూండగా శీను ఫోను మ్రోగింది.

నేహా అనుకున్నాడు. జేబులోంచి ఫోన్ తీసి చూసాడు. నిరుపమ ఫోన్ అది.

“హాయ్! ఎప్పుడొచ్చావ్?” అంది ముక్తసరిగా.

“గంటయ్యింది. నువ్వూ ఎయిర్‌పోర్టుకి వస్తావనుకున్నాను…” అన్నాడు శివా!

“ఎందుకు? నీ కొత్త పెళ్ళాంతో ఫోటో దిగడానికా?” నిరుపమ గొంతు మారింది.

శీను కంగారు పడ్డాడు. ఇంతవరకూ ఎప్పుడూ ఇలా మాట్లాడ లేదు.

నిజానికి నిరుపమ అనుమతితోనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు కూడా.

ఆడవాళ్ళూ, అసూయా అంటే ఇదేనేమో అనుకున్నాడు.

“అదేంటి? అలా మాట్లాడతావు? నువ్వు వస్తావనే అనుకున్నాను. కావాలంటే శివని అడుగు. పక్కనే ఉన్నాడు…” అంటూ ఫోన్ శివ చెవి దగ్గర పెట్టాడు.

“లేదు నీరూ! వాడు రాగానే నువ్వు రాలేదే అని  అడిగాడు. నేనే రావొద్దన్నాని వీడికి చెప్పా! వాడిదేం తప్పు లేదు,” అన్నాడు.

“విన్నావుగా! నేహాని రిసీవ్ చేసుకోడానికి సుధీర్ వచ్చాడు. తను అతని కార్లో వస్తోంది…” శీను జవాబిచ్చాడు.

“సర్లే! రాత్రి మనం డిన్నర్‌కి వెళదాం!” అంది నీరూ.

“ఇవాళ కుదరదేమో…?” నసుగుతూ బదులిచ్చాడు.

దిగీ దిగగానే రాత్రి నేహ వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఆ తరువాత మా ఇంట్లో వాళ్ళతో.

ఎవరికీ అనుమానం రాకూడదని ప్రతీ రోజూ మాట్లాడతానని నీరూ వాళ్ళమ్మకి తన ఎదురుగానే చెప్పడం గురొచ్చింది.

“ఇవాళ వద్దు. రేపెళదాం లంచ్‌కి.”

“ఇవాళే వెళ్ళాలి,” గట్టిగా అంది నీరూ ఆవతలి వైపు నుండి.

“లేదు…ఇండియా ఫోన్ చెయ్యకపోతే గొడవలై పోతాయ్! కంగారు పడతారు! నేహ వాళ్ళమ్మకి బాగో లేదని నీకు తెలుసుండీ…” చికాగా అన్నాడు శీను.

వేంటనే ఫోన్ కట్ చేసింది నీరూ. శీను ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ తియ్య లేదు నీరూ. కోపం వచ్చిందని అనుకున్నాడు.

ఈ ఆడవాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తారో తెలీదు. అసలు ఈ పెళ్ళి ప్లాను సలహా ఇచ్చిందే నీరూ.

ఇప్పుడేమో ఇలా ప్రవర్తిస్తోంది చికాగ్గా!

“నీరూ! పికప్ ద ఫోన్! వుయ్ విల్ గో టు ద డిన్నర్!” అని మెసేజ్ ఇచ్చాడు.

“చచ్చింది గొర్రె! ” నవ్వుతూ అన్నాడు శివ.

ఇంతలో నేహా ఫోన్ వచ్చింది.

“శీనూ, రాత్రి నేను ఎపార్ట్‌మెంట్‌కి రాలేను. నువ్వు మీ వాళ్ళతోనూ, నేను మావాళ్ళతోనూ విడిగా మాట్లాడేద్దాం!” అంది.

నేహ మాటలకి చిర్రెత్తుకొచ్చింది శీనుకి.

“నేకేవయినా పిచ్చెక్కిందా? అమెరికాలో అడుగుపెట్టి ఇంకా గంట కాలేదు, అప్పుడే మొదలయ్యిందా! మన వాళ్ళకి తెలిస్తే చస్తాం. ముఖ్యంగా మీ నాన్నకి.

నా మాట విని రా. కావాలంటే అయిదు నిమిషాలు మాట్లాడి పెట్టేద్దాం. రేపు సండే మాట్లాడతామని చెబుదాం!” కసురుకుంటూ అన్నాడు శీను.

“సర్లే!” అంటూ ఫోన్ పెట్టేసింది నేహా.

“ఏం! నీ కొత్త పెళ్ళాం రానందా…?” అంటూ వెటకారంగా అన్నాడు శివ.

“నోర్ముయ్! నేహా వస్తుంది. నీరూకే ఎలాగో అలాగ చెప్పాలి,” అంటూ తలపట్టుకున్నాడు శీను.

నీరూనే రాత్రి అపార్ట్‌మెంటుకి రమ్మనమని శివ సలహా ఇచ్చాడు. శీనుకీ అదే నచ్చింది. కాల్ అవ్వగానే అక్కణ్ణుండి డిన్నర్‌కి వెళ్ళచ్చు అనుకున్నాడు.

“ఒరేయ్! ఇవాళ్టి నుండి నీ బ్రతుకు బస్టాండే! నీరూ, నేహా నిన్ను బ్రతకనివ్వరు!” అంటూ పగలబడి నవ్వాడు శివ.

శీనుకీ తెలుసు. ఎలాగో ఈ ఆర్నెల్లూ సర్దుకుంటే సరిపోతుంది.

నేహ వాళ్ళమ్మ ఎలాగూ ఆర్నెల్లు మించి బ్రతకదని డాక్టర్ చెప్పాడు.

తను కూడా ప్రవైటుగా వెళ్ళి అడిగి కన్‌ఫర్మ్ చేయించుకున్నాడు.

ఆవిడ గుటుక్కుమనగానే డైవోర్స్ తీసుకోవచ్చు, అనుకున్నాడు.

అనుకున్నావని జరగవు అన్నీ

అనుకోలేదని ఆగవు కొన్నీ!”

ఈ పాట శీనుకి తెలీదు.

తెలుసుంటే జీవితం వేరేలా ఉండేది.

పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేవాడే కాదు.

000000000

దారిపొడుగునా దీప తల్లికి లక్ష్మికి అమెరికా గురించి చెబుతోంది, ఇక్కడి అలవాట్లూ, పద్ధతులూ.

ఆవిడ రోడ్ల కేసి చూస్తోంది కానీ, దీప చెప్పేవి పట్టించుకోవడం లేదు.

సన్నీవేల్ రాగానే తనుండే టవున్‌హోమ్ ముందు కారు ఆపింది.

కారు పార్కు చేస్తూండగా ఎదురుగా పార్క్ చేసిన కారుని గుర్తుపట్టింది.

అది స్వరూప్ కారు.

తన కారు చూడగానే డోర్ తీసుకొని వచ్చాడు.

కారు ట్రంక్‌లో నుండి లగేజ్ తీస్తూండగా కొన్ని పెట్టెలు బయటకి తీసాడు.

తల్లికి స్వరూప్‌ని పరిచయం చేసింది దీప.

“మీకు బి.ఎం.డబ్ల్యూ ఉందని ఎప్పుడూ చెప్పలేదు. ఇందాకట్నుండి హోండా కారుకోసమే చూస్తున్నా!” అన్నాడు స్వరూప్.

“అదా! ఈ బి.ఎం.డబ్లుయూ నీరజ్‌ది. తనకి ఇష్టమని కొన్నాను. అతన్నుండి వేరు పడ్డాక నా దగ్గరే వదిలేసాడు. ఈగో,” అంది దీప.

నీరజ్ పేరు వినగానే ముందు నడుస్తున్న దీప తల్లి వెనక్కి చూసింది.

స్వరూప్‌కి అర్థమయ్యింది. తల్లి దగ్గర నీరజ్ ప్రస్తావన తీసుకు రావద్దని దీప స్వరూప్‌ని ముందే హెచ్చరించింది. నాలిక్కరుచుకొని  మాట మార్చేసాడు. దీప ఈ కారుని డ్రైవ్ చెయ్యడం ఎప్పుడూ చూళ్ళేడు. వర్కుకి కూడా డ్రైవ్ చెయ్యడం తెలీదు.

దీప ఉండే టవున్‌హోం మెట్లెక్కి వెళ్ళాలి. స్వరూప్ లగేజ్ పైకి పెట్టడంలో సాయం చేసాడు.

“థాంక్యూ స్వరూప్! నువ్వు వస్తావని చెప్పే లేదు,” అంది దీప.

“ఇంటర్ నెట్లో ఫ్లైట్ రావడం చూసాను. రావడానికి గంట పడుతుంది కదాని వచ్చాను. నేనూ వచ్చి పది నిమిషాలు అయ్యింది, అంతే!”

“ఎలాగూ వచ్చావు కదా! లంచ్ చేసి వెళుదువుగాని,” నవ్వుతూ అంది దీప.

“అలాగే” అన్నట్లు తలూపుతుండగా ఫోన్ వచ్చింది. హలో అంటూ పక్కకి వెళిపోయాడు.

కొంత సేపయ్యాకి లోపలికి వచ్చి – “దీప గారూ, అర్జంటుగా వెళ్ళాలి. లంచ్ చెయ్యలేను. మా ఫ్రెండ్ వేంటనే రమ్మనమని చెప్పాడు,” అన్నాడు.

“ఏమయ్యింది, సీరియస్సా!”

“కాదు, మీకు చెప్పానుగా నా ఇంజనీరింగ్ క్లాస్‌మేట్ దేవ వ్రత అని ఒకతని గురించి. అతనికీ ఈ మధ్యనే పెళ్ళయ్యింది. మీ మదర్ వచ్చిన ఫ్లైట్‌కే అతని వైఫ్ రావాల్సి ఉంది. ఆమె ఫ్లైట్ హాంకాంగులో మిస్సయ్యిందట. ఇంకా రాలేదని కంగారు పడుతున్నాడు. వెళతాను,” అంటూ చిన్నగా మొహం పెట్టి అడిగాడు.

“సరే! వెళ్ళండి. కాస్త లంచ్ చేసి వెళ్ళండి. రెండంటే రెండు రోటీలు,” అంటూ కిచన్‌లోకి వెళ్ళి తీసుకొచ్చింది.

మొహమాటంగా సరేనంటూ ఆ రెండు రోటీలు నోట్లో కుక్కుకొని బయల్దేరాడు.

“అదేంటే దీపా! నువ్వు డ్రైవ్ చేసిన కారు నీరజ్‌దా?” స్వరూప్ వెళ్ళీ వెళ్ళగానే అడిగింది కూతుర్ని.

తన మాటాలు తల్లి విందన్నామాట. ఈవిడకి అక్కర్లేనివి లేవు అనుకుంది.

“అవునమ్మా! నీరజ్‌కి కార్ల పిచ్చి. ఒక బర్త్‌డేకి నేనే కొన్నాను, అందుకని నా దగ్గరే వదిలేసాడు,” ముక్తసరిగా చెప్పింది.

“అలాగా! వాడి పొగరు ఇందులో కూడా చూపిమాడన్నమాట. అయినా ఈ కారెంతుంటుంది…?” ప్రశ్నించింది.

“ఇదా, ఓ అరవై వేల డాలర్లు పైనే ఉంటుంది…” మామూలుగా అంది దీప.

“అరవై వెల డాలర్లే! అంత డబ్బు పెట్టి…” నోరెళ్ళ బెట్టింది లక్ష్మి.

“ఆమ్మా! అది లోన్ తీసుకొని కొన్నది…ఇక్కడ అందరూ లోన్ తీసుకునే కొంటారు,” దీప మాటల్లొ విసుగు కనిపించింది.

“అంటే… ప్రతీ నెలా నువ్వే లోన్ కడుతున్నావన్న మాట…ఆ వెధవకి ఇంత చేసినా ఆనందం లేదు. నిన్ను…”

“అమ్మా!  అతన్నెందుకు తిడతావ్..ఊరుకో” అని తల్లిని గదిమింది.

“అంతే! మా మాట ఎప్పుడు విన్నావు కనుక. వాడు నీ జీవితం నాశనం చేసినా పరవాలేదు. నేను మాత్రం ఏవీ అనకూడదు…” అంటూ విసుగ్గా సోఫాలో కూలబడింది లక్ష్మి.

దీప ఇహ పొడిగించలేదు. తల్లికి ఎంత చెప్పినా అర్థం కాదు.

ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. మెల్లగా చెప్పాలి.

అడుగుపెట్టీ పెట్టగానే ఇలా ఉందంటే ముందు ముందు ఎలా వుంటుందో అనుకుంది దీప.

ఈ ఆర్నెల్లూ ఎలా భరించాలి దేవుడా అనుకుంది.

000000000

హడావిడిగా దేవవ్రత ఇంటికి బయల్దేరాడు స్వరూప్.

దేవవ్రత, స్వరూప్ బె.టెక్ క్లాస్‌మేట్స్. సిలికాన్ వేలీ వచ్చాక కలిసారు. ఇద్దరూ వేర్వేరు కంపెనీలలో పని చేస్తారు.

కాకపోతే ఇద్దరూ తరచు కలుస్తూనే ఉంటారు.

స్వరూప్‌ని చూడగానే భోరు మన్నాడు దేవవ్రత.

“ఒరేయ్! అనూ హాంకాంగులో ఫ్లైట్ మిస్సయ్యిందనుకుంటాను. ఈ ఫ్లైటుకి రాలేదు. కనీసం ఈమెయిల్ అయినా చేసేది. అదీ లేదు…” దేవవ్రత మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

“అదికాదురా! తరవాత ఫ్లయిట్‌లో వస్తుందిలే! కంగారు పడకు…” భుజమ్మీద చెయ్యి తడుతూ అన్నాడు స్వరూప్.

“హైద్రాబదునుండి హాంకాంగ్ వరకూ వచ్చిందని వాళ్ళు చెప్పారు. ఆ తరువాతే తెలీదన్నారు. నెక్స్ట్ ఫ్లైట్ ఇంకో రెండు గంటల్లో బయల్దేరుతుందట. ఎయిర్‌పోర్టుకెళ్ళి కన్నుక్కోవాలి. నువ్వు కూడా నాతో రారా, ప్లీజ్! “ అంటూ ప్రాధేయ పడ్డాడు.

“వస్తాలే! ముందు వాళ్ళ వాళ్ళకి కాల్ చేసావా..?”

మావగారికి కాల్ చేస్తే ఫోన్ తియ్యడం లేదనీ, నాన్నని వెళ్ళి కనుక్కోమని చెబితే రాత్రికి రాత్రి ఆయన వెళ్ళాడానీ, ఇల్లు తాళం వేసుందనీ చెప్పాడు.

“ఒక్క నిమిషం ఆగు. కేథే పసిఫిక్ కస్టమర్ సర్వీస్‌కి ఫోన్ చేసి అడిగి చూద్దాం. వాళ్ళకి వివరం చెబితే తెలుసుకుంటారు. వాళ్ళ నంబరుందా? ఐ మీన్ హాంకాంగ్ నంబరు…?”  స్వరూప్ అడిగాడు.

“ఉంది. ఎయిర్‌పోర్టులో వాళ్ళే ఇచ్చారు,” అంటూ తన జేబులోంచి ఒక కాగితం తీసాడు దేవవ్రత.

స్వరూప్ వేంటనే వాళ్ళకి కాల్ చేసి వివరాలు చెప్పాడు. దేవవ్రతనే మాట్లాడమని చెప్పాడు. వివరాలు ఇచ్చాడు. కొంత సేపు వాళ్ళు ఫోన్ హోల్డులో పెట్టి వివరాలు తెలుసుకు చెబుతామన్నారు. దేవవ్రతకి విపరీతమైన టెన్షన్!

ఓ అయిదు నిమిషాల తరువాత మెల్లగా చెప్పారు, ఆ పేరుగల వ్యక్తి ఎవరూ శాన్‌ఫ్రాన్సిస్కో ఫ్లైట్‌లో ఎక్కలేదని.

ఒక్కసారి దేవవ్రతకి కళ్ళ నీళ్ళు తెరిగాయి.

“ఒరేయ్ బాధ పడకు. ముందు వాళ్ళ వాళ్ళకి కాల్ చేద్దాం. మీ మావగారి బంధువుల నంబర్లున్నాయా…?”

“లేదురా, మా నాన్నకి మా మావగారి తమ్ముడి నంబరు తెలుసు. మా నాన్న ఆయనకి ఫోన్ చేస్తే ఆయనకీ ఫోన్ కలవడం లేదని చెప్పాడట,” అంటూ బాధగా అన్నాడు.

“నువ్వు అనవసరంగా దిగులు పడకు. ముందు ఈ మెయిల్ చెక్ చెయ్యి…” అన్నాడు స్వరూప్!

లాప్‌టాప్ బెండ్రూములో ఉందని అటువైపుగా వెళ్ళాడు. స్వరూప్ కూడా అనుసరించాడు.

బెడ్‌రూమ్ అంతా పూలతో అలంకరించబడి ఉండడం చూసి పాపం అనుకున్నాడు స్వరూప్!

స్వరూప్ గదంతా కలయ చూస్తున్నాడు.

ఈ మెయిల్ చెక్ చేసాడు దేవ వ్రత. “అనూ!” అంటూ గట్టిగా అరిచి బెడ్ మీద ఏడుస్తూ పడి పోయాడు. కంగారు పడ్డాడు స్వరూప్.

ఏమయ్యిందని అడిగితే ల్యాప్‌టాప్ వైపు చూపించాడు.

దగ్గరగా వెళ్ళి మెయిల్ చదివి హుతాశుడయ్యాడు స్వరూప్!

నోట మాట రాలేదు.

దేవ వ్రత వైపు చూస్తూ ఉండి పోయాడు.

దేవవ్రత వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

000000000000000

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గొర్తి సాయి బ్రహ్మానందం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు