ఖాళీ పేజీలు -5

[క్రితం వారం-5 పేజీలు:

ప్రాహీలో వచ్చిన మార్పు చూసి ఆమె అమ్మా, నాన్నా ఆశ్చర్యపోతారురాజు ఎలా పోయాడని అడుగుతాడు ప్రాహీ తండ్రి. జవాబు చెప్పకుండా దాట వేస్తుంది ప్రాహీ.

 నేహాని రిసీవ్ చేసుకోడానికి సుధీర్ రావడంతో అతని కారులో వెళిపోతుంది నేహ. శీను మీద నీరు కోపగించుకుంటుంది, నేహాతో అతను కలిసి ఉండడం ఇష్టం లేక.

నేహా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని ఆవిడ కోరిక తీర్చడం కోసం శీనూ, నేహా పెళ్ళి చేసుకుంటారు. ఆవిడ చనిపోగానే విడాకులు తీసుకో వచ్చన్న  ఆశతో.

 బీ.ఎమ్.డబ్లుయూ  కారు అప్పు చేసి  తీసుకు కొందని దీప మీద తల్లి కోపగించుకుంటుంది. అదీ నీరజ్కోసం కొన్నందుకు. దీప తల్లి ముందర కారు ప్రస్తావన తీసుకొచ్చినందుకు బాధపడతాడు స్వరూప్

 తల్లిని ఆర్నెల్లు ఎలా నెట్టుకురావాలా అని దీప చికాకు పడుతుంది

 దేవవ్రతని కలవడానికి అతని ఇంటికి వెళతాడు స్వరూప్భార్య ఫ్లైట్ మిస్సయ్యిందని దిగాలు పడతాడు దేవవ్రత. ఈమెయిల్ చెక్ చేస్తే, అది చదివి భోరున విలపిస్తాడు దేవవ్రత. ]

 

ఆఫీసుకయితే వచ్చింది కానీ దీప మనసంతా అల్లకల్లోలంగా ఉంది.

రెణ్ణెల్ల క్రితం అమ్మ వస్తానంటేనే భయం మొదల్లయింది.

తను ఇండియా వెళ్ళి నాలుగేళ్ళు దాటింది.

దాంతో అమ్మా, నాన్నల పోరు ఎక్కువవయ్యింది.

నాన్న కూడా వస్తారులే అనుకుంది. కానీ చివరినిమిషంలో ఆయన రాలేనన్నాడు.

అమ్మ ఎలాగైనా వస్తానని పట్టు పట్టింది.

రావద్దనీ చెప్ప లేదు. రావడమూ ఇష్టం లేదు.

వచ్చి నాలుగు రోజులు కాలేదు, అప్పుడే గొడవ మొదలు పెట్టింది అనుకుంది దీప.

ఉదయాన్నే నీరజ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు – “యువర్ మామ్ వాంట్స్ టూ టాక్!” అంటూ.

మెసేజ్ చూసి ఆశ్చర్య పోయింది.

నీరజ్‌తో తను ఏ రకమైన కాంటాక్టులోనూ లేదు. దాదాపు ఆర్నెల్ల తరువాత వచ్చిన మొదటి మెసేజ్!

“నాకు తెలీదు! లెట్ మీ టాక్ టూ హెర్ ఫస్ట్!” అని జవాబిచ్చింది.

ఇది తెలిసినప్పటినుండీ తల్లి మీద కోపం నసాళానికి అంటింది.

తల్లకి ఫోన్ చేసి అడగ లేదు. అడిగితే మరో పెద్ద గొడవ. సాయంత్రం ఇంటికెళ్ళాక అడుగుదామనుకుంది.

ఆఫీసుకి వచ్చింది కానీ, మనసంతా అయోమయంగా ఉంది. వచ్చీ రాగానే కొన్ని ఈమెయిల్స్‌కి జవాబిచ్చింది.

ఇవాళ ఒక్క మీటింగూ లేదు, బ్రతికిపోయాను అనుకుంది.

మనసంతా ఎడతెరిపిలేని ఆలోచనలు. అమ్మ నీరజ్‌ని కలిస్తే వివరాలు అడుగుతుంది. అతనేవో చెబుతాడు.

ఈమె రెట్టిస్తుంది. అతనేవో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఈవిడ ప్రశ్నలతో వేధిస్తుంది.

చివరకి ఎటూ తేలక సమస్య మరింత జటిలం అవుతుంది. పోనీ తనూ అమ్మతో వెళదామన్నా చిక్కే!

తనుంటే నీరజ్ మాటల్లో తేడా ఉంటుంది.  లేకపోతే అతను వేరేగా ఉంటాడు.

నిజానికి తన తల్లికి నీరజ్ బాగా నచ్చాడు. దీప నాన్నకి నచ్చ లేదు.

“అతని ప్రవర్తన వింతగా ఉంది దీపా! నాకెందుకో అతను నీకు తగడేమో అనిపిస్తోంది, ” అన్నాడు మొదటి సారి చూసినప్పుడు.

కానీ దీప పట్టుపట్టి తనూ, నీరజ్ ఇంజనీరింగ్ నాలుగేళ్ళు కలిసి చద్విమనీ, ఎంతో సౌమ్యుడని తండ్రికి నచ్చ చెప్పింది.

తండ్రి కూతురి మాట కాదనలేక సరేనన్నాడు.

కానీ ఇలా అవుతుందని దీప ఊహించలేదు. ఒక్కొక్కటీ తలచుకుంటే బాధ కలుగుతోంది.

కుదురులేని ఆలోచన్లకి గమ్యం ఉండదు. తలంతా బరువెక్కింది దీపకి.

డెస్క్ మీద మోచేతి ఉంచి, దాని మీద  తలపెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది దీప.

“దీపా! మేడమ్” అంటే ఒక్కసారి ఉలిక్కి పడి తలెత్తింది దీప.

ఆమెను చూస్తూ, “సారీ!” అంటూ వెనుదిరగబోయాడు.

“కమాన్! తలనొప్పిగా ఉంది. కాసేపు రెస్ట్ కోసం తలవాల్చాను, అంతే!” అంది దీప.

కూర్చో మన్నట్లు అక్కడున్న చైర్ ముందుకు తోసింది.

“ఇవాళ లంచ్‌కి వెళదాం అన్నారు కదాని వచ్చాను. ఆల్రెడీ పన్నెండు దాటింది,” నసుగుతున్నట్లుగా అన్నాడు.

“గివ్ మీ 2 మినిట్స్! వుయ్ విల్ గో!” అంటూ మొహం కడుక్కోవడానికి లేచి వెళ్ళింది దీప.

ఆ తరువాత ఇద్దరూ కారులో బయల్దేరారు. దీపే డ్రైవ్ చేస్తోంది.

“మీకొ విషయం చెప్పాలి మేడం! మా వాళ్ళు నన్ను పెళ్ళి చేసుకోమని తెగ పోరుతున్నారు,” అంటూ చెప్పాడు.

అది విని గట్టిగా నవ్వింది దీప.

“గ్రీన్‌కార్డ్ వచ్చేసిందా ఏవిటి? పెళ్ళంటూ తొందర పడుతున్నావ్…?” తల తిప్పి స్వరూప్ కేసి చూస్తూ అంది.

“అమ్మో! నాకయితే ఇప్పుడే వద్దు. మా అమ్మా, నాన్నా తెగ విసిగిస్తున్నారు. అయినా మా ఫ్రెండు దేవవ్రతని చూసాక పెళ్ళంటే భయం పుట్టుంది.

పరిచయం లేకపోతే ఎలాంటి వాళ్ళు వస్తారో చెప్పలేం కదండీ..”  కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు.

“మేరేజ్ ఈజ్ ఎ బిగ్ గాంబ్లింగ్!  పరిచయాలతో పనిలేదు దానికి. నష్టపోవడం దాని స్వరూపం.  ఎప్పటికైనా గెలవకపోతామా అన్న ఆశే దానికి ఊపిరి,” అంది.

దీపకి పెళ్ళయ్యిందని తెలుసు కానీ, అతనెప్పుడూ అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు స్వరూప్‌కి.

కొలీగ్ మాత్రమే కాదు, దీప అంటే అతనికి గౌరవం. కాస్త అభిమానం కూడా.

“మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకో లేదు? మేడం!” గబుక్కన అనేసాడు.

ఊహించని ప్రశ్న విని ఉలిక్కిపడింది దీప.

వేంటనే తేరుకొని – “అయ్యిందీ, పోయిందీ!” నెమ్మదిగా అంది.

“సారీ! ” అని భయంగా అన్నాడు. నోరు జారినందుకు భయమేసింది కూడా. దీప అతని మేనేజరు కూడా.

“సారీ ఎందుకు? మన మధ్య ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. అంతే,” అంటూ భుజాలు ఎగరేసింది.

కాసేపు స్వరూప్ ఏమీ మాట్లాడ లేదు.  ఓ నిమిషం తరువాత దీపే అంది.

“నాదో విచిత్రమైన పెళ్ళి. జరిగే వరకూ ఉన్న ఆత్రుత పెళ్ళయ్యాక హరీ మంది. లంచ్ చేస్తూ చెబుతాలే!” అంటూ కారు రెస్టారెంట్ ముందు పార్క్ చేస్తూ అంది.

స్వరూప్ ఏమీ అనలేదు. తన తొందరపాటుకి తనలో తననే తిట్టుకుంటున్నాడు.  ఇన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న వెయ్యలేదు.

వెయిటర్ వస్తే లంచ్ ఆర్డర్ ఇచ్చింది దీప. తనకీ అదే అని చెప్పాడు స్వరూప్!

“నాకు పెళ్ళయ్యిందన్న విషయం నీకు తెలుసనే అనుకున్నాను. మన ఇండియన్ ఫ్రెండ్స్ ఈ పాటికి చెప్పే ఉండాలే!” నవ్వుతూ అంది.

“లేదండి,  ఎప్పుడూ ఈ విషయం ప్రస్తావనకే రాలేదు,” అని అబద్ధం చెప్పాడు పైకి.

కానీ స్వరూప్‌కి చూచాయగా తెలుసు. అదీ వాళ్ళూ వీళ్ళూ అనుకుంటూండగా విన్నవి.

“ప్రేమకి ఆఖరి మజిలీ పెళ్ళి అంటారు కానీ అదంతా పెద్ద ట్రాష్!

ఆరేళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని చేసుకున్న పెళ్ళి.

అంతవరకూ లేని అపోహలూ, అహాలూ పెళ్ళయ్యాక వికృత రూప్దం దాల్చాయి.

ఎంతలా అంటే – ఎంతో శ్రమించి డిజన్ చేసీ, విపరీతమైన టెస్టింగ్ చేసాక, కష్టమరు దగ్గర ప్రోడక్ట్ ఘోరంగా కోర్ డంప్ అయినట్లు!”

ఆమె కేసి చూస్తూనే వింటున్నాడు.

” అతన్ని ప్రేమిస్తాను. ద్వేషిస్తాను. ఒక్కోసారి జాలి పడతాను కూడా…!”

తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నా, ఒక్కసారి ఎందుకో అతనికి చెమటలు పట్టాయి. అప్పుడే వెయిటర్ పెట్టివెళ్ళిన అయిస్ ముక్కలేసిన మంచి నీళ్ళ గ్లాసుని అందుకున్నాడు.

” సంతోషానికి ప్రేక్షకులు కావాలి. బాధ ఒంటరిది – నటులూ, ప్రేక్షకులూ, వేదికా ఏదీ అవసరంలేదు!…  నాకే అర్థం కాని … నా కథ చెబుతాను, విను….” అంటూ దీప చెప్పడం మొదలు పెట్టింది.

దీప చెబుతున్న సొంత కథ -1

మాది కాకినాడ.

నా బాల్యం అంతా అక్కడే గడిచింది.

మాది మధ్య తరగతి కుటుంబం.

నాన్న ఎస్.ఆర్.ఎం.టిలో పనిచేసేవారు.

చాలీ చాలని జీతాలూ, జీవితాలూ.

ఇంటర్ అవ్వగానే ఆంధ్రా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీటొచ్చింది.

దగ్గరే కదాని అమ్మా, నాన్నా సరే నన్నారు.

నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను.

నాకు నీరజ్ పరిచయమయ్యింది అక్కడే.

అతను గీతమ్ ఫార్మసీ కాలేజీలో బి.ఫారమ్ కోర్సులో జాయిన్ అయ్యాడు.

నీరజ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు సీత నా రూమ్మేట్.

మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది.

సీత ద్వారానే నాకు నీరజ్ పరిచయం.

నీరజ్ మరీ అంత అందగాడు కాదు కానీ కళైన మొహం.

సన్నగా రివటలా ఉంటాడు.

మాట్లాడుతూంటే చిన్న స్పార్క్ కనిపిస్తుంది.

నీరజ్ స్వతహాగా బిడియస్తుడు. సీత కోసం వుమన్స్ హాస్టల్‌కి ఎప్పుడైనా వచ్చేవాడు.

మేం సినిమాలకి వెళ్ళాలంటే బాడీ గార్డులా సీత రమ్మనమనేది.

వచ్చేవాడు, ఎప్పుడూ కాదనకుండా. సీత ద్వారా తెలిసింది, నీరజ్ వాళ్ళూ చాలా ఉన్నవాళ్ళనీ.

నిజానికి మొదటి రెండేళ్ళూ మా మధ్య అంత స్నేహం లేదు.

మూడో ఏడాదిలో ఉండగా ఒకసారి నాకు టైఫాయిడ్ వచ్చింది.

ఆ సమయానికి సీత వాళ్ళూరెళ్ళింది.

విపరీతమైన జ్వరం. కదిలే పరిస్థితిలో లేను.

శక్తినంతా కూడ దీసుకొని నీరజ్‌కి కాల్ చేసాను.

వేంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాడు.

వాళ్ళ నాన్నకి చాలా పలుకుబడి ఉండని అప్పుడే తెలిసింది.

కాకినాడ వెళడామనుకున్నా ఇంకో వారంలో పరీక్షలు.

పైగా అమ్మా, నాన్నా కంగారు పడతారు.

ఆ సమయంలో నన్ను నీరజ్‌యే ఆదుకున్నాడు.

నీరజ్ చాలా బిడియస్తుడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాడు.

తన మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.

ఎదుటివారు ఏం చెప్పినా వింటాడు తప్ప తనేమనుకుంటున్నాడో పైకి చెప్పడు.

నిజం చెప్పద్దూ, ఆ క్షణంలో నీరజ్ లేకపోతే ఊహించుకోవడం కూడా కష్టం.

హాస్పటల్ నుండి సరాసరి వాళ్ళింటికి తీసుకెళ్ళాడు.

కోలుకోవడానికి నాలుగు రోజులు పట్టింది.

నీరజ్ వాళ్ళమ్మా, నాన్నా నన్ను బాగా చూసుకున్నారు.

కాస్త ఓపికొచ్చాక పరీక్షలకి చదవడం మొదలు పెట్టాను.

హాస్టల్‌నుండి నా పుస్తకలన్నీ తనే తీసుకొచ్చాడు.

అలా మొదలయ్యింది మా ప్రేమ.

స్నేహాలూ, ప్రేమలూ స్ఫటికాల్లాంటివి.

మొదట్లో నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటాయి.

బంధాల ఊబిలో కూరుకుని కలుషితం అయిపోతాయి.

………

ఇంతలో వెయిటర్ చెక్ తీసుకొచ్చి టేబిల్ మీద పెట్టాడు.

తను చెబుతూన్నది  ఒక్కసారి ఆపి హ్యాండ్ బ్యాగ్‌నుండి క్రెడిట్ కార్డ్ తీసి ఇచ్చింది.

వెయిటరు అవి తీసుకొని వెళ్ళగానే – “ఇలా మధ్యలో ఆగి పోతాయి…” అంది నవ్వుతూ.

బిల్ సైన్ చేసి బటకి నడిచారిద్దరూ.

చెప్పండి అన్నట్లు దీప వైపు చూసాడు స్వరూప్.

“మిగతా కథ నెక్స్ట్ లంచ్ బ్రేక్‌లో…” అంది దీప.

“రేపటి వరకూనా…? కుదర్దు…కాఫీ బ్రేక్‌లో…” గట్టిగా నవ్వుతూ అన్నాడు.

చూద్దామన్నట్లుగా కళ్ళెగెరేస్తూ కారు స్టార్ట్ చేసింది దీప.

 

గొర్తి సాయి బ్రహ్మానందం

ఖాళీ పేజీలు గత భాగాలు ఇక్కడ చదువుకోండి

 

ఖాళీ పేజీలు  -1

ఖాళీ పేజీలు  -2

ఖాళీ పేజీలు  -3

ఖాళీ పేజీలు  -4

 

 

 

గొర్తి సాయి బ్రహ్మానందం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు