ఖాళీ పేజీలు-1

 శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంశనివారం ఫిబ్రవరి 16, 2008

ఎప్పుడు, ఎలా ముగుస్తాయో చెప్పలేం గానీ, కథలు మాత్రం ఇక్కడే మొదలవుతాయి.

కలలు కూడా.

ముఖ్యంగా అమెరికాలో.

అదీ ఎయిర్‌పోర్టుల్లో.

దేవవ్రత కొత్త అధ్యాయం!

బంధువుల్నీ, స్నేహితుల్నీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళతో ఎరైవల్ టెర్మినల్ కిక్కిరిసి ఉంది.

పైగా ఆ వచ్చేది సింగపూర్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్.

హైద్రాబాదు నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వైపు రావడానికి ఇదొక్కటే కాస్త అనువుగా ఉంటుంది.

సింగపూరు విమానం ఎప్పుడొస్తుందాని ఆత్రంగా పచార్లు చేస్తున్నాడు దేవవ్రత.

రాత్రి నిద్ర పట్ట లేదు. పెందలాడే లేచి రెడీ అయి పోయాడు.

అపార్ట్‌మెంట్ అంతా నీటుగా సర్దాడు.

ఫ్రెండ్స్ కూడా ఎయిర్‌పోర్టుకి వస్తానన్నారు కానీ వద్దన్నాడు.

ఈ సమయం, అనుభవం తనవి. అందులో ఎవరికీ చోటు లేదు.

తనకీ, అనూకి తప్ప.

పదే పదే వాచ్ చూసుకుంటున్నాడు.

ఇంకా ఫ్లైట్ రావడానికి గంట పైనే  ఉంది.

అసలు కాలం నడవడం లేదు. ఉదయం నుండి నత్తనడకలా ఉంది.

కావల్సినపుడు కాళ్ళు చాచుకుని కూర్చుంటుంది కాలం.

అక్కర్లేనప్పుడు అంగలు వేస్తుంది.

దేవవ్రతలో అసహనం అతని నడకలోనే కనిపిస్తోంది.

దేవవ్రత అమెరికా వచ్చి అయిదేళ్ళు దాటింది. న్యూయార్క్‌లో ఎం.ఎస్ చేసాడు. ప్రస్తుతం సిస్కోలో ఉద్యోగం.

వీటన్నింటికీ మించి క్రితం నెలే అతనికి పెళ్ళయ్యింది. అదీ చాలామంది అమ్మాయిల్ని చూసీ, చూసీ – ఓ పట్టాన ఎవరూ నచ్చక.

అప్రయత్నంగా జేబులు తడుము కున్నాడు. చిన్న పేకట్ తగిలింది.

అనూకి సర్‌ప్రైజ్ చేద్దామని నిన్ననే రూబీ నెక్లెస్ కొన్నాడు.

కాపురానికి వచ్చే ఈ శుభ సమయం , ముఖ్యంగా అమెరికా మొదటి సారి వస్తున్న ఈ రోజు తనకి జీవితాంతం గుర్తుండాలి.

అందుకే అనూకి రూబీ నెక్లెస్ కొన్నాడు.

ఇదే కాదు ఇల్లంతా అందంగా డెకరేట్ చేసాడు.

అయిదువందల డాలర్ల గులాబీలు కొన్నాడు.

అపార్ట్‌మెంట్ అందంగా అలంకరించాడు.

పెళ్ళయి రెణ్ణెల్లు కావస్తోంది.

నాలుగు వారాలు శలవు పెట్టుకొని మరీ వెళ్ళాడు.

మొదటి రెండు వారాలూ పెళ్ళి హడావిడిలో గడిచిపోయాయి.

ఇంకోవారం పెళ్ళి, ఆ తరువాత తిరుపతి ప్రయాణం.

అక్కడనుండి చెన్నైలో వీసాకి వెళ్ళారు.

వెంబడే నాలుగు రోజులు గోవా హనీమూన్!

చూస్తూండగా రోజులు గడిచిపోయాయి.

వేంటనే తిరుగు ప్రయాణం.

అందుకే గత అయిదు వారాలుగా ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నాడు.

ఇంకా ఎంత సేపో ఈ ఎదురుచూపు?

దేవవ్రతకి సహనం నశిస్తోంది.

చికాగ్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.

పదే పదే టీవీ మానిటర్ వైపు చూస్తున్నాడు.

ఇంకా ఎంత సేపు ఈ నిరీక్షణ?

ఆత్రుత పెరిగేకొద్దీ నరకంలా ఉందతనికి.

ఎదురుచూపుని మించిన నరకం ఇంకోటి ఉండదు.

దేవుడా! కాలాన్ని పరిగెత్తించు!

కళ్ళు మూసుకొని ప్రార్థించాడు.

 

సర్గలు లేవు

హడావిడిగా ఇంటర్నెట్‌లో  SFO Airport వెబ్సైట్ చూసింది దీప.

ఫ్లైట్ ఇంకో గంటలో లాండ్ అవుతుంది.

ఎంత లేదన్నా అమ్మ బయటకి రావడానికి గంటన్నర పైనే పడుతుంది.

పైగా మొదటి సారి కాబట్టి ఇమ్మిగ్రేషన్ దగ్గరే టైం తినేస్తుంది.

ఎయిర్‌పోర్టుకి స్వరూప్ వస్తానన్నాడు, ఏదైనా సాయం కావాలంటే.

స్వరూప్, దీప ఇద్దరూ కొలీగ్స్.

ఒకే కంపెనీ, ఒకే గ్రూప్ కూడా.

స్వరూప్ ఈ మధ్యనే ఎం.ఎస్ పూర్తి చేసాడు.

సమ్మర్ ఇంటర్న్‌గా చేరినప్పుడు ఇద్దరికీ పరిచయం.

తరువాత అతనికి ఫుల్‌టైం ఆఫర్ వచ్చింది.

స్వరూప్ వస్తానని ఒకటికి రెండు సార్లు అడిగినా, తను మేనేజ్ చెయ్యగలనని చెప్పి వారించింది.  అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పాడు.

అలాగే అంది కానీ తను చెయ్యదు.

చాలా రోజుల తరువాత అమ్మ వస్తోంది.

తనని చూడగానే కాస్త ఎమోషనల్ కావడం ఖాయం.తనొక్కతీ ఉంటే అది వేరు.

తరచు ఫోన్‌లో మాట్లాడు కోవడం తప్ప దీప ఇండియా వెళ్ళి దాదాపు అయిదేళ్ళు కావస్తోంది.

ఎన్నో సార్లు అమ్మా, నాన్నా రమ్మన్నారు కానీ, తనకే వెళ్ళాలనిపించలేదు.

వస్తా, వస్తా అంటూ వాయిదాలు వేస్తూనే ఉంది.

నాన్నని విడిచి అమ్మ రాదు. ఆయన ఒక్కరూ రాడు.

ఈ సారి మాత్రం దీప తల్లి ఒక్కతీ రావడానికి సిద్ధ పడింది.

కాదన లేదు దీప. అమ్మ వస్తే తనకీ ఒక బ్రేక్‌లా ఉంటుందని సరేనంది.

గరాజు లోంచి బి.ఎం.డబ్ల్యూ కారు బయటకి తీస్తూండగా స్వరూప్ ఫోన్ చేసాడు.

” దీపా! చెప్పండి, నన్ను ఎయిర్‌పోర్టుకి రమ్మంటారా…?”  అని అడిగాడు.

“ఐ కెన్ మేనేజ్! థాంక్స్!  సాయంత్రం రండి. అమ్మని పరిచయం చేస్తాను…” నవ్వుకుంటూ అంది.

“అలాగే! ఏం హెల్ప్ కావాలన్నా పిలవండి. నా కివాళ ప్రోగ్రాం ఏదీ లేదు,” అంటూ ఫోన్ పెట్టేసాడు.

మంచి కుర్రాడు అనుకుంటూ నవ్వుకుంది దీప.

స్వరూప్ బుద్ధిమంతుడే కానీ చాదస్తం ఎక్కువ. ప్రతీదీ ఒకటికి రెండు సార్లు అడుగుతాడు.

తనకి ఒకసారి చెప్పడానికే చికాకు. పదే పదే అడగద్దని హెచ్చరించింది కూడా.

అలాగే అంటాడు. మరలా షరా మామూలే!  వర్కులో తనకి చేదోడు వాదోడుగా ఉంటాడు.  ఏం అడిగినా నోరెత్తకుండా చేస్తాడు.  మంచి స్నేహితుడు.

ఒక్కోసారి ఒంటరితనం కూడా భరించలేని నరకం సృష్టిస్తుంది. దాన్ని తప్పించుకోడానికే వీకెండ్ కూడా వర్కుకి వెళుతుంది.

ఏదో ఒక వ్యాపకం. మనసుని దారి మళ్ళించే ప్రయత్నం. వీకెండ్ వర్కుంటే స్వరూప్ కూడా వస్తాడు. అతనితో మంచి కాలక్షేపం ఆమెకి.

ఎప్పుడైనా టెబిల్ టెన్నిస్ ఆడతారు. అది నేర్పింది కూడా స్వరూపే.

కారుని మెల్లగా 101 హైవే మీదుగా పోనిచ్చింది దీప.

రోజూ ఒక కొత్త అధ్యాయమే! ఎన్నని లెక్క పెట్టేది?

ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఇదే మాట వర్కులో ఉండగా కర్తార్ సింగ్ అన్నాడు.

అప్పుడయితే నవ్వేసాను కానీ ఈ రోజు ఉదయం కాదు.

ఉదయాన్నే లేచి వంట చేసి, ఇంట్లో చిన్నా చితకా పనులు చేసి బాబుని కూడా తయారు చేసాను.

సాధారణంగా వీకెండు నీహార్ ఓ పట్టాన లేవడు.

ఈ మధ్య గేమ్ బాయ్ పిచ్చి మొదలయ్యాక రాత్రంతా అదే ఆడుతూ గడుపుతున్నాడు.

ఏ మూడ్‌లో ఉన్నాడో ఉదయం నిద్ర లేపగానే గొడవ చెయ్యకుండా లేచాడు.

” మామ్! అమ్మమ్మా, తాతా రాగానే నా స్కూల్ చూపిస్తా!” అంటూ ఎగిరి గంతేసాడు. అలాగే అన్నాను. అమాంతం దగ్గరకొచ్చి ముద్దిచ్చి పరిగెత్తుకెళిపోయాడు.

నీహార్‌కి తెలుగు నేనే నేర్పాను.

మిగతా వాళ్ళతో ఇంగ్లీషు మాట్లాడినా నాతో మాత్రం తెలుగే మాట్లాడతాడు.

అమ్మమ్మా, తాతా రాగానే వాళ్ళకి తన గేమ్ బాయ్ గురించి చెప్పాలనీ, వాళ్ళతో పార్కుకెళ్ళి ఏం ఆడాలనీ ఇలా గత వారంగా ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు.

నవ్వేసి ఊరుకుంటున్నాను. వాడికే కాదు నిజానికి నాకూ ఆనందంగానే ఉంది. వాళ్ళని చూసి దాదాపు ఆరేళ్ళు కావస్తోంది.

వాళ్ళూ నీహార్‌ని చూడ లేదు. అందుకే వాడి ఆనందం అంతా!

ఇల్లు సర్దుతూండగా నా దగ్గరకొచ్చి అమాయకంగా మొహంలో మొహం పెట్టి చూసాడు.

ఏంటన్నట్లు చూసాను.

“మామ్! యూ లుక్ సో హేపీ!” అంటూ నా కాళ్ళను చుట్టేసాడు.

ఎక్కడో కలుక్కుమంది ఒక్కసారి నాకు. అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నాడన్నమాట.

నవ్వుతూ పైకి తీసుకొని ముద్దు పెట్టుకున్నానే కానీ, వాడి మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి.

సంతోషం మొహమ్మీద కాదు మనసులో చూసాడు నీహార్!

పసివాడయినా బాగానే పసిగట్టాడు.

వాడూ గమనిస్తూనే ఉన్నాడన్న మాట.

నిజానికి నా మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. తెలియనివ్వను కూడా.

కర్తార్ సింగ్ కూడా అదే అంటాడు. ఎప్పుడూ అలా నవ్వు మొహంతో ఎలా వుండగలవని?

బయటనవ్వుకీ, లోపలి ఆనందానికీ తేడా బాగానే కనిపెట్టాడు నీహార్!

అమాయకత్వంలో పుట్టిన ప్రశ్న. స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది.

నేనూహించ లేదు.

ఇన్నాళ్ళూ ఉగ్గపెట్టుకున్న ఉద్వేగం ఒక్కసారి తన్నుకొచ్చింది.

ఆపుకోలేక పోయాను.

పైకి మామూలుగానే కనిపించినా ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చేసాను.

రాజు బావ ఎప్పుడూ వేళాకోళం చేస్తూ ఉండేవాడు – “పిలిస్తే చాలు నీకంటే ముందు ఏడుపొస్తుందని!”. అప్పుడు నేను ఉడుక్కునేదాన్ని.

నిజానికి అయిదేళ్ళ తరువాత మొట్టమొదటి సారి ఏడ్చాను.

ఏడవకూడదని నాకు నేనే ఒట్టు పెట్టుకున్నాను.  అదీ రాజు బావ కోసం.

” ప్రాహీ! నువ్వు నవ్వితే  ఎంత బావుంటావోనే? ఏడుపు నీ మొహానికి నప్పదు!” అనేవాడు.

“మావయ్య ఏం చూసి పెట్టాడోనే నీ పేరు?  ఏ అప్సరసో, మోహినే పెడితే సరిగ్గా సరిపోయేది…వెళ్ళి వెళ్ళి నోరు తిరగని ప్రహేళిక అని పెట్టాడు…ప్రహేళిక అంటే అర్థం తెలుసా…?” అంటూ గదమాయించేవాడు రాజు బావ.

“ప్రహేళిక అంటే అర్థం తెలీదా…మొద్దూ…?” అంటూ పగలబడి నవ్వేవాడు.

తెలుసున్నా తెలీదన్నట్లు తలూపేదాన్ని. మళ్ళీ మళ్ళీ రాజు బావ చేత పొగిడించుకోవాలని.

నన్ను వెక్కిరించడం బావకి సరసం.

అమాయకత్వం నటిస్తూ పొగిడించుకోవడం నాకు సరదా!

అందుకే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.

“మేడమ్! నవ్వుతూ ఎలా ఉండాలో మా బివీకి కాస్త ట్రైనింగ్ ఇద్దురూ!” అంటాడు కర్తార్ సింగ్.

నీహార్ పిలుపుకి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

గబగబా తెమిలి ఎయిర్ పోర్టుకి బయల్దేరాను. నాతో పాటే నీహారూ.

“మామ్!  ఈ చిన్న వ్యానులో అందరూ పడతారా?” కారు స్టార్ట్ చేస్తూండగా అడిగాడు.

నీహార్‌కి భలే డౌట్స్ వస్తాయి. చూడ్డానికి వాడికి అయిదేళ్ళయినా ఎనిమిదేళ్ళ  పిల్లాడికున్న మెచ్యూరిటీ ఉంది.

రాజు బావ తెలివి తేటలన్నీ దిగిపోయాయి వాడిలో. ఒక్క రూపం తప్ప. నా నోట్లోంచి ఊడి పడ్డాడంటారు అందరూ!

“లేదు! కర్తార్ అంకుల్ లిమో తీసుకొస్తాడు. వుయ్ ఆల్ కమ్ బై దట్!” అని చెప్పాను.

ఓకే అన్నట్లు తలాడించి పోకెట్‌లోంచి గేమ్‌బాయ్ బయటకి తీసాడు.

వ్యాను మెల్లగా హై వే 280 మీదకి పోనిచ్చాను.

కొన్ని చాప్టర్లు మొదలయ్యేది మధ్యలోనే!

ఉదయాన్నే లేచి కార్ రెంటల్ షొరూమ్‌కి బయల్దేరాడు శివ.

ఇవాళ తన రూమ్మేటూ, జిగిరీ దోస్తూ శీను పెళ్ళి చేసుకొని ఇండియానుండి వస్తున్నాడు.

శీను పెళ్ళి చేసుకున్న నేహా కూడా కూడా తనకి చాలా ఏళ్ళగా తెలుసు.

ముగ్గురూ ఎర్బానా షాంపైన్ యూనివర్శిటీలో కలిసి ఎం.ఎస్ చేసారు. పైగా ముగ్గురిదీ హైద్రాబాదే!

ఇద్దరికీ లగేజ్ ఎక్కువ ఉంటుందనీ, ఒక వ్యాన్ రెంటు తీసుకొని రమ్మన్నాడు శీను.

ఈ వీకెండు టాహో వెళదాం రమ్మనమని ఫ్రెండ్స్ అడిగారు. శీను కోసం ఆగిపోయాడు శివ.

ఫ్రెండ్స్ ఎంత రమ్మనమని చెప్పినా వెళ్ళ లేదు.

శీను గాడు సెటిల్ అయ్యే వరకూ తనూ తోడుగా ఉంటానని మాటిచ్చాడు. అసలు పెళ్ళికి  రమ్మన్నాడు కానీ, ప్రోజక్ట్ డెడ్‌లైను ఉందనీ, అత్యవసరాల్లో తప్పితే లీవులో వెళ్ళొద్దనీ చెప్పాడు బాస్!

అసలే తను పని చేసేది స్టార్టప్ కంపెనీ. వెళ్ళలని వున్నా అందుకే వెళ్ళ లేదు.

బయల్దేరబోతూంటే నిరుపమ ఫోన్ చేసింది తనూ వస్తానంటూ.

“నీకేమయినా మతి పోయిందా? కొద్ది రోజులు శీను గాడికి దూరంగా ఉండు. తెలిస్తే కొంపలంటుకుంటాయి…నువ్వు మాత్రం ఇటు రాకు. శీను నీ దగ్గరికి వస్తానని చెప్పమన్నాడు,” అంటూ గదమాయించాడు.

నిరుపమ ఫోనులో నసుక్కోవడం వినిపిస్తూనే ఉంది శివకి. అయినా చేసేదేమీ లేదు.

శీను, నేహాలు అమెరికా వచ్చాక ఎలా మేనేజ్ చెయ్యాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నాడు.

శీను గాడు మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లు ఉంటాడు. నేహా కూడా అంతే!

బహుశా డబ్బున్న వాళ్ళందరూ అలానే ఉంటారేమో? అనిపిస్తూ ఉంటుంది శివకి.

శీను, నేహల ధైర్యం చూస్తే కళ్ళు తిరుగుతాయి ఎవరికైనా.

వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటున్నాం అంటేనే తను కళ్ళు తిరిగి పడినంత పని చేసాడు.

మనుషులు ఇంత కృతకంగా కూడా ఉండగలరా అని ఆశ్చర్యపోయాడు కొత్తలో.

పెళ్ళి కూడా చేసుకొస్తూంటే నమ్మకుండా ఉండలేక పోయాడు.

కొంతమంది అంతే! ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.

అసల వీళ్ళ కథ, ప్లానూ తెలిస్తే వీళ్ళని పుట్టించిన దేవుడు కూడా నోరెళ్ళ పెట్టడం ఖాయం!

జీవితం క్రూరమైంది.

మనుషుల్ని రాక్షసులుగా మారుస్తుంది.

రాక్షసులని మనుషుల్లా నటింపచేస్తుంది

( ఫ్లైట్ ల్యాండ్ కావడానికి టైముందికా!) 

 

 

 

 

గొర్తి సాయి బ్రహ్మానందం

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు