క్వియర్‌ హక్కులపై సీమకి ‘అదేప్రేమ’

తెలుగుసాహిత్యం తన దిశను మార్చుకుంటున్నది. వాస్తవానికి అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతోనే సాహిత్యప్రయాణం తన రూపాన్ని, స్వరూపాన్ని మార్చుకుంది. సాహిత్యప్రయాణంలో దళిత, స్త్రీ,బహుజన ఉద్యమ సాహత్యమే కాదు, ఆదివాసీ, ఎరుకల అస్తిత్వ సాహిత్యమూ వచ్చింది. ఎవరికి వారు తమ బాధల్ని, కన్నీళ్ళని రాయడమొక్కటే కాకుండా సంఫీుభావంగా ప్రగతిశీలకవులు రాయడం చేస్తున్నారు. రాయలసీమ నుండి క్వియర్‌ హక్కులపై అదే ప్రేమ కొనసాగింది.

ఈ క్రమంలో ‘అదేప్రేమ’ తెలుగు క్వియర్‌ కథలుపేరుతో బోధి పౌండేషన్‌ వారు సంకలనం తీసుకొచ్చారు. అపర్ణతోట చాలాగొప్పపని చేశారనిపించింది. ఎల్‌జిబిటిక్యూలపై వివక్ష ఇప్పటిది కాదు. మన దేశంలో 1835 నుండి 2018 వరకు సాగింది. 1835లో, లార్డ్‌ థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే భారతీయ శిక్షా ధర్మసంహితా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ మొదటి ముసాయిదాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి సమర్పించారు.

వాస్తవానికి ఆనాటి బ్రిటీష్‌ ప్రభుత్వం బైబిల్‌ ఆధారంగా చట్టాలను రూపొందించారు. ‘పురుషశయనము చేయకూడదు, అది హేయము’ అని, ‘స్త్రీలు సహాస్వాభావికమైన ధర్మమును విడిచి, స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడా స్త్రీయొక్క, స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పితమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామ తప్తులైరి., ఆడంగితనముగలవారైనను, పురుషసంయోగులైనను…, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.’ మొదలైన బైబిల్‌ ఆధారిత వాక్యాల వల్ల ఈ చట్టం అమలు చేశారని తెలుస్తున్నది. మతప్రాతిపాదికన ఏర్పడ్డచట్టం వల్ల ఎల్‌జిబిటిక్యూలపై వివక్ష దాదాపు నూటతొంభైఏళ్లు కొనసాగింది. ఈ పరిస్థితుల్లోనే ఏర్పడ్డ 1835 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కానీ, 1973 ఏప్రిల్‌1న అమల్లోకి వచ్చిన సిఆర్‌పిసిలు కూడా బైబిల్‌ ఆధారిత చట్టాల వల్ల వివక్షసాగింది.

పురాణాల్లో అర్ధనారీశ్వరుడని, మహాభారతంలో శిఖండి, అవతారాల్లో మోహినిఅవతారం మనకు తెలిసిందే.  ద్రౌపది  స్వయంవరంలో అర్జునుడు బ్రాహ్మణ యువతివేషం వేస్తాడని, అర్జునుడు శాపం వల్ల బృహన్నల(స్తీరూపం)గా జీవిస్తాడని చదివాం. రామాయణంలోను రాముడు వనవాసానికి వెళ్ళినపుడు మూడోలింగం వారు అనగా హిజ్రాలు 14 సంవత్సరాలు వేచి ఉంటారు. బౌద్ద, జైన మతాల్లోనూ వీరిప్రస్తావన వుంది. అయితే ఎక్కడా ఎల్‌జిబిటిక్యూ వ్యక్తులను అవమానించడం లేదు. ఇక ఈ క్రమంలో రాయలసీమ నుండి ఈ కథావస్తువుతో దాదాపు 7 కథలు కనబడతాయి.

అదేప్రేమ కథల సంకలనంలో ఆరుకథలుండగా ఏడో కథ చిత్తూరు జిల్లా నుండి కేవి మేఘనాథరెడ్డి ఊరుపొమ్మంది కథ రాశారు. అనంతకర్నూలు జిల్లాలకు చెందిన కథారచయిత జి.వెంకటకృష్ణ రాసిన ఆదిలక్ష్మీ కేరాఫ్‌ ఆరెస్‌రోడ్‌ కథ 2007లో ఆంధ్రజ్యోతి ఆదివారంలో, మారుతీ పౌరోహితం తృతీయప్రకృతి 2022 కథామంజరిలో, యం. హరికిషన్‌ రాసిన చెన్నమ్మ సర్కిల్‌ 2023లో ఆంధ్రజ్యోతిలో, తిరుపతి జిల్లా కు చెందిన సొలోమోన్‌ విజయకుమార్‌ సిలమంతుకూరి రైలుగేటు దగ్గరి కొజ్జా 2023 అరుణతారలో, చిత్తూరుకు చెందిన సామాన్య లైక్‌ రియల్‌ పీపుల్‌ డూ, అజీమ్‌ కథలు 2023లో రాశారు.

ఈ సంకలనంలో లేని కెవి మేఘనాథరెడ్డి ఊరు పొమ్మనింది కథ 2022 సాక్షిలో ప్రచురితమైంది. ఇప్పటివరకు ఇన్నే కథలు అనడానికి లేదు. క్వియర్‌ వస్తువుపై రాయలసీమ నుండి కథలు వచ్చివుండే అవకాశముంది. అయితే మేఘనాథరెడ్డి తన కథలో గ్రామస్థులు ట్రాన్స్‌జెండర్స్‌ పట్ల వివక్షచూపించి గ్రామం నుండి వెలివేశారని రాశారు.

కానీ రాయలసీమ సమాజం మాత్రం  ఇప్పటికీ వారిని దైవంగా చూస్తారు. అంతెందుకు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదురు వస్తే శుభం జరుగుతుందని భావిస్తారు. కానీ కథకుడు మేఘనాథరెడ్డి ఈ కథలో ట్రాన్స్‌జెండర్‌ను ఆ ఊరు వెలివేస్తే తన తల్లి ట్రాన్స్‌ జెండర్‌ అయిన తన కొడుకును ఊరు నుండి తీసుకెళుతుంది అని రాశారు. ఇలా రాయలసీమలో జరుగుతుంది అనడం సహేతుకం కాదు. కథను అంత గొప్పగా నడిపిన కథకుడు ట్రాన్స్‌జెండర్‌ జీవితాలను సమగ్రంగా తెలుసుకోలేదనిపించింది. మిగతా కథల పట్ల అభ్యంతరమేమి లేదు.

*

కెంగార మోహన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.