కొన్ని మలుపుల్లో కొన్ని మాటలు!

”ఇలా ఆలోచించండి. ఇదే సరైన పద్ధతి. బాధితుల్ని దుఃఖితుల్ని ‘వాళ్ళ ఖర్మ’ అంటూ కన్నీటి తుఫాన్లలో వదిలేసి మీ ‘భద్రత’ అనే ఊహాజనితాలైన నెగడుల్లో చలికాచుకోకండి.”

జలంధర

“మళ్ళీ మేము ప్రారంభిస్తున్న ఆన్ లైన్ మాగజైన్ కు మీరు తప్పకుండా ఏదన్నా రాయాలి” అని ఆత్మీయం గా సంభాషణ ప్రారంభించారు కల్పనా రెంటాల గారు.

ఏదో చెప్పబోయేలోగా –

“నేను, అఫ్సర్ మీ చేత తప్పకుండా రాయించాలి అనుకున్నాము” అది ఆప్యాయతతో కూడిన అభ్యర్థన లాంటి ఆజ్ఞ.

వెన్నెల చినుకులు వేడిగా ఉండవుగా –

అఫ్సర్ గారి మీద గౌరవం –

“ఇప్పుడేం నేను రాయలేను. ఏదో బిజీ గా ఉన్నాను. అయినా నేను ఇప్పుడేం రాస్తాను ?!” వగైరా, తప్పించుకునే అక్షరబాణాలు అనుసంధించే అవకాశం లేకుండా చేశాయి – కల్పన గారి ప్రేమ, అఫ్సర్ గారి పేరు!

“ఆత్మకథలు లాంటివి అయితే ….” సజషన్ లాగా అన్నారు.

“అయ్యబాబోయ్ ” – కేక పెట్టినంత పని చేశాను.

“ఏం అంత భయపడుతున్నారు? సాధారణంగా మొగవాళ్ళు ఆత్మకథలు ధైర్యంగా రాసుకుంటారు. ఆడవాళ్ళ ఆత్మకథలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రపంచానికి కనబడే మీరు…ఇలా మీకు తెలిసిన మీరుగా పరిణతి చెందడం …సినిమా అనే వింత ప్రపంచం లో ఒక ప్రఖ్యాత నటుడి భార్యగా మీ అనుభవాలు…ఇలా మిమ్మల్ని ఎలా మలచాయి? మీ అసలు ఇలా ఉండనిచ్చాయి? Too personal  అనిపించేవి అయితే ఒద్దు – కానీ ఈ పరిణతి కి కారణాలు?”

ఇలా అర్థం వచ్చేట్లు చాలా మాట్లాడారు కల్పన గారు.

ఆవిడ ఆలోచనలు మాటల కూర్పుగా… మరింత …మరింత… సూటిగా …గురినుంచి దృష్టి చెదరకుండా.

( అసలు ఈవిడ గురించి చాలా తెలుసుకోవాలి …అనిపించింది  ఆ తర్వాత )

నేను ఉలిక్కిపడుతున్నాను.

అసలు ఆత్మ …వేరు. ఈ అనుభవపరిణామాలు వేరు. ఇవన్నీ ‘నేను’ కాదు …అసలు లేని ‘నేను’ అంతఃదగ్ధత లోంచి రూపుకట్టిన వెలుతురు బొమ్మలాంటి లాంటి అనుభూతికి రూపకల్పన. (మాయ, నిజమని భ్రమింపజేసే ఒక బూడిద వంతెన – అన్నారు ఒక మహా రచయిత.)

ఆ బొమ్మకు ఆపాదిస్తే వెలుతురు…అనుసంధానమైతే స్పందన… తెలుస్తాయేమో కానీ …

అక్షరాలతో తోడి పరుద్దామంటే దోసిలి నిండా ఏమి చూపించగలను?!

మహా శూన్యం తప్ప –

మా ఇద్దరి సంభాషణలో మాటల కన్నా జాగృతమైనది మరేదో ఉన్నది కాబోలు …కల్పన గారికి అర్థమైంది.

“మీరు రాయాలి…అంటే ఒప్పుకుంటే…రాస్తారు…ఆలోచిస్తూ రాస్తారు…ఏం రాసినా …ఎలా రాసినా, ఎంత రాసినా, ఎప్పుడు రాసినా …

రాయాలి – అంతే…”

కల్పన గారి మాటలా ? అవి కావు …ఒదిలించుకోవాలని అనిపించని పారిజాతపు పూల సంకెళ్ళు…”

“చూద్దాము… ప్రయత్నిస్తాను” అన్నాను ఆ తరువాత –

యూనికోడ్ – అలా టైప్ చేయడం అలవాటు లేని నా అసహాయత –

“మీరు మామూలుగా రాసెయ్యండి…మేము ప్రింటింగ్ గోల చూస్తాము…” అని ఆ వెసులుబాటు కూడా ఇచ్చేశారు.

[మా మైథిలి అబ్బరాజు ఆ పని చేసి పెడతానన్నారు]  

అలా ప్రారంభం అవుతోంది ఈ కాలమ్. ఇది అందమైన, ఆప్యాయతతో కూడిన శుభారంభం. 

“ఎవరికీ ఉపయోగపడనిది …నీకు మాత్రం చాలా గొప్పగా కావాలి అనుకునేది నువ్వు నీ డైరీ లో రాసుకుని దాచుకో.”

“నా బాధ ప్రపంచం బాధ అనుకుని అందరి నెత్తినా రుద్దకు.”

అది మా నాన్నగారు డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఇచ్చిన వార్నింగ్. 

నా జీవితంలో మర్చిపోలేనిది.

ఆ విషయం చాలా విషయాల్లో- ఎప్పటికప్పుడు నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది.

కొన్ని మాటలు మంత్రాల లాగా మన సబ్ కాన్షియన్స్ లో నిక్షిప్తమై, మన జీవితాన్ని నిర్దేశించే neural pathways ను మన మేధస్సులో ఏర్పాటు చేసేస్తాయి. వాటి ప్రభావం మన జీవితాన్ని మొత్తం గైడ్ చేస్తూ ఉంటుంది. మన thought process మారితేగాని మన attitude  మారదు – అది మారితేగాని మన జీవితం మారదు. విన్నదే వింటూ, చెప్పిందే చెప్తున్నా, మంచి అనుకుని మననం చేసుకుంటూ మన మొత్తం జీవితాన్ని ఆ ప్రభావపు ఛాయల్లో గడిపేస్తాము.

Affirmations అంటే బహుశా అప్పుడే, తెలియకుండానే నాకు ఆరాధన పెరిగిందేమో.

అంతమాత్రం చేత – నేను చాలా మేధోమథనాల నుంచి తప్పించుకోలేదు.

“ఇలా ఆలోచించండి..ఇదే సరైన పద్ధతి …బాధితుల్ని, దుఃఖితుల్ని ‘వాళ్ళ ఖర్మ’ అంటూ కన్నీటి తుఫాన్లలో వదిలేసి … మీ ‘భద్రత’ అనే ఊహాజనితాలైన నెగడుల్లో చలికాచుకోకండి – నిజమైన అనుభూతి – అది బాధ అయినా, దుఃఖమైనా సంతోషం అయినా దాని వైబ్రేషన్ అందర్నీ స్పృశించక మానదు …”ఇలా వార్నింగ్ ఇచ్చి, కుదిపి, అక్షరాల ఉప్పెన తో – మన జడత్వాన్ని, తప్పించుకు తిరిగే గుణాన్ని – ‘ముంపు’ కు గురిచేసిన ఎన్నో ‘ఇజాలు’ నన్ను ప్రభావితం చేశాయి. ఆలోచించమని ‘లోతలుపులు’ బలంగా నెట్టాయి…అంతర్లీనమైన ఆవేశం కట్టి కుదిపేసేది.

 అప్పుడప్పుడు..కొన్ని సమయాల్లో చాలా identify  అయిపోయి…మనకు కావలసిన బోలెడంత సానుభూతి కోసరము …ఆ గూళ్ళల్లో చిలకలతో ఇరుక్కుందామని ఆలోచిస్తాము కూడా.

ఈ కోరుకునే స్వేచ్చకు identity కోసరము ఇరుక్కుపోవడానికి అర్థం లేదని మరొక మలుపులో మరెవరో గమనించి చెప్తే తప్ప బయటపడలేము.

ఒక రోజు కాలేజి నుంచి వస్తూ వేలికి ఎదురుదెబ్బ తగిలి గోరు ఊడిపోయింది.

ఇంటికి వచ్చి, ఆ వేలుకు  బాండేజ్ కట్టుకుని గబగబా బ్రెడ్ టోస్ట్, లెమన్ టీ చేసి మా నాన్నగారి బెడ్ రూంకు తీసుకువెళ్ళాను.

(అప్పట్లో నాన్నగారికి పక్షవాతం వచ్చి, కొంతవరకు ఎదటివారిమీద ఆధారపడే పరిస్థితిలో ఉన్నారు.

 కానీ ఎప్పుడైనా ఎట్లా ఉన్నా ఆయన చుట్టూ స్నేహితులకు, ఆత్మీయులకు తక్కువ ఉండేది కాదు. Dr GBS   అంటే జార్జ్ బెర్నార్డ్ షా అన్నంత ఆరాధన ఉండే ఆత్మీయులు ఉండేవారు ఆయనకు)

అప్పటికే బాండేజ్ నుంచి కూడా బ్లీడింగ్ వస్తోంది. అయినా కాలేజి నుంచి వచ్చి ఇంటిపనులు చేసుకుంటున్న ‘బంగారుతల్లి’ ఇమేజ్ ను మెయిన్ టైన్ చేస్తున్నాను.  

“దిక్కుమాలిన రాయి … నీకెందుకు తగిలిందమ్మా!” అని మంచం మీదినుంచి లేవలేకపోయినా దగ్గరకు పిలిచి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి పోసింది డెబ్భై ఆరేళ్ళ మా బామ్మగారు.

(“క్లీన్ పణ్ణి మరందు పోడ్రేన్ ఇరు. అప్పా వ కేకరేన్ ఇనజక్షన్ పొడులామా పాకలాం…పాళా పోన కల్లు…)

“క్లీన్ చేసి మందు వేస్తానుండు…ఇంజక్షన్ ఇవ్వాలేమో నాన్నను  అడుగుతాను ఉండు…అయినా ఆ పాపిష్టి రాయి…” అంటోంది మా నర్స్ జూలెమ్మ.

దెబ్బ తగిలితే తగిలింది కానీ…ఈ సానుభూతి , నా మీద ఆప్యాయత ఉన్నదని చూపించటానికి వెధవరాయిని తిట్టడం – అది విని నా మీద వీళ్ళకు ఎంత ప్రేమో…అన్న విషయం ఒక పదిహేడేళ్ళ అమ్మాయికి బోలెడు ‘కిక్’ ఇస్తుంది.

ఆ రోజు గదిలో నాన్న తో పాటు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు, ఆంధ్రా చెస్ చాంపియన్ వడ్లపట్ల ప్రసాదరావు మామయ్య ఉన్నారు.

ఇంట్లో ప్రవహిస్తున్న ఈ సానుభూతుల వెల్లువ లో నేను ఉక్కిరిబిక్కిరి అవటం గమనిస్తున్నారు కాబోలు…నేను కనబడగానే –

“ఏమిటీ  రాయి పనివేళా వచ్చి జిజ్జమ్మను కొట్టిందా ? లేక జిజ్జమ్మ వెళ్ళి రాయిని కొట్టుకున్నదా?” – అడిగారు కొడవటిగంటి వారు…

“నడుస్తుంటే తగిలింది…” అన్నాను కానీ …

‘ఎవర్ని ఎవరు?’  అని మరొక్కసారి అడక్కుండానే నాకు అర్థమైపోయింది. మా నాన్నగారి మాటల్లో నవ్వు…కొడవటిగంటి వారి మాటల్లో శ్లేష ..

నాకు కుళ్ళుమోత్తనం వచ్చింది చెప్పద్దూ ?!

అంత దెబ్బ తగిలి.. కాలు విపరీతమైన బాధ పెడుతూ ఉంటే…నాకు కావలసిన వస్తువు, సానుభూతి, అందరూ కురిపించేస్తూ ఉంటే…

ఆ మాయపందిరి  ఈ మాంత్రికుడి స్పర్శ తో మాయమైపోయినట్లైంది.

నువ్వు వెళ్ళి రాయిని కొట్టుకుని దెబ్బ తగిలించుకుని …వీళ్ళంతా రాయిని కారణం అని తిడుతూ ఉంటే ఆనందిస్తున్నావేమిటి?!

సమస్య దగ్గరకు నువ్వు వెళ్ళావు..తగిలిన దెబ్బకు ఇవాళ ఈ రాయి కారణం..రేపు ప్రాణం ఉన్న మనిషో , మరొకటో …ఎవరినో ఒకర్ని blame game  లో ఇరికించి ఆనందిస్తే …ఇలా ఉండిపోతే , నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుని దిద్దుకుంటావు ?!

ఇన్నిమాటలు వాళ్ళెవరూ మాట్లాడలేదు..

“మంత్రి ఎగిరిపోవడానికి పాన్ కాదు కారణం..మీ రాజు vulnerable position  లోకి వెళ్ళాడు” మామయ్య నాన్నతో వాదన…

ఆ ఎన్నో మాటలు మాట్లాడనివి…వాటితో నాకు తలంటి పోశారు.

ఆ రోజే అన్నీ తెలిసిపోయాయి అని అబద్ధం ఆడలేను కానీ..ఆ తర్వాత జీవితంలో ప్రతి ఎదురుదెబ్బకు, భయంకరమైన సమస్యకు, చచ్చిపోదామనిపించే సన్నివేశాల్లో – అహంతో, దుఃఖంతో, సానుభూతితో – అంతా నా వైపు తిప్పుకుని ఎవర్నో ‘విక్టిమైజ్’ చేయాలి…నేను మంచిదానిలా నటించగలను కాబట్టి నమ్మించగలను..ఆ నమ్మకం కొనసాగుతుంది ” – అని అర్థమైనప్పుడు శాడిజం నన్ను ఆవరించకుండా …

నన్ను కుదిపి..ఆలోచనల తలుపులు బలవంతం గా తెరిపించే ఆ మాటలు నన్ను సవాలక్ష గిల్ట్ ట్రిప్స్ నుంచి రక్షించాయి .

“రాయి దానంతట అదిగా నీ దగ్గరకు రాదు..రాలేదు. నువ్వు ఏదో ఆశించి – రక్షణో, భద్రతో, నమ్మకమో, లాభమో, ఎగో ఫీడో, మరొకరికి తిక్క కుదరడమో …లేక సబ్ కాన్షియన్స్ లో నిక్షిప్తమైన మరేదో కారణం వల్లో – నువ్వు సమస్యను ఆహ్వానించావు. , ఇవాళ నీ సమస్యకు మళ్ళా విక్టిం ను వెతుక్కోకు…

వాళ్ళు అలా ప్రవర్తించి ఉండకపోతే..నేనసలు..అన్న ‘డబ్బా’ ఒద్దు.”

అన్న ఆ నాటి వార్నింగ్ గుర్తుకు రాకపోతే –

ఎంత అర్థం లేని డ్రామా …మనను ఎదగనియ్యకుండా ఆపేసే డ్రామా…రంగస్థలం, ఆహార్యం, స్క్రిప్ట్, బోలెడు ఎమోషన్…

ఎంత గొప్ప సృష్టికర్తలవగలం  మనం ?!

“Cut the drama from your trauma …then I can show you reality…”  అని పేషెంట్స్ ను కౌన్సెలింగ్ చేస్తూ హెచ్చరిస్తుంది మా పెద్దమ్మాయి మధుర [మీనా మోహన్…ఫ్లారిడా లో వింటర్ హెవెన్ హాస్పిటల్ లో సైకాలజిస్ట్]

కానీ…అది ఎంత కష్టం ?! మన అహాన్ని పెంచిపోషించి రూపం ఇచ్చే ఆ ‘వల’ నుంచి బయటపడటం …అంత సులభమా?!

కళ్ళజోడులోనించి సూటిగా చూస్తూ కళ్ళనిండా నవ్వుతో ప్రశ్నించిన ఆ మేధావి ప్రశ్న.

అది నిజానికి ప్రశ్న కాదు.

చాలా సమస్యలకు జవాబు.

*

జలంధర

జలంధర

కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • జిజ్జీ,
  ఎన్నాళ్ళకెణ్ణాళ్ళకు డాక్టర్ గారి గురించి చదువుతున్నాను…జూలమ్మ గురించి కూడా! కొ కు…మధు…అఫ్‍కోర్స్…రోజీ కనబడుతుందా ఇక్కడ? There is so much you could share! ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను! 🙂

 • ‘ పున్నాగపూల’ పరిమళం కు నమస్సులు!! చెంపకు చెయ్యి పెట్టుకొని శ్రద్ధగా ‘ఊ’ కొడుతూ మీ అనుభవాల అక్షరాల దగ్గర మేము _/\_

 • జలంధర గారూ
  మొదలు పెట్టడమే సెల్ఫ్ పిటీ కి వేటు వేశారు. కుతుహలానికి జ్ఞానం కాన్క చేశారు. ఎదురుచూపులు మొదలుపెట్టించారు.
  మళ్ళీ మిమ్మల్ని కలిసినట్టుంది. అదే ప్రేమతో…

 • చాలా బావుంది. కల్పన గారి ప్రయాస ఫలించింది. జలంధర గారి జ్ఞాపకాలకు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ..
  -భాస్కర్ కూరపాటి.

 • జలంధర గారూ!

  కొ.కు. నాయన ( కొడవటిగంటి కుటుంబరావు ) గారి లాగే మరెందరో మద్రాసు నగరంలోని అలనాటి తెలుగు ప్రముఖుల గురించి మీరు ప్రస్తావిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాము.

  ( మీరు అనుమతిస్తే, త్రిపుర కధల పుస్తకం మీకు అందించే భాగ్యం కోసమూ ఆశతో ఎదురుచూస్తున్నాము )

 • ఇదే మీలో ప్రత్యేకత. మేము చాలా మామూలుగా తీసుకునే సందర్భాలకు ఒక ప్రత్యేక రూపాన్నిఛ్చి దానికి పున్నాగ పూవుల పరిమళాలను అద్ది, అందులో ఒక తార్కిక భావము, మనసు తెర మీద జరిగే సంచలనము, నేర్చుకునేందుకు ఒక పాఠము, వీటన్నిటి వెనుక ఒక తాత్విక భావము, ఇలా పంచరంగుల చిత్రాన్ని చిత్రించి మా ముందు పెడితే, ఈవిడకి ఇలా ఎలా తడుతాయి ఇలాంటి ఆలోచనలు అని ఆశ్చర్యపోయి, ఆనందించటమే మా వంతు:)

 • రాయి దానంతట అదిగా నీ దగ్గరకు రాదు..రాలేదు. నువ్వు ఏదో ఆశించి – రక్షణో, భద్రతో, నమ్మకమో, లాభమో, ఎగో ఫీడో, మరొకరికి తిక్క కుదరడమో …లేక సబ్ కాన్షియన్స్ లో నిక్షిప్తమైన మరేదో కారణం వల్లో – నువ్వు సమస్యను ఆహ్వానించావు. , ఇవాళ నీ సమస్యకు మళ్ళా విక్టిం ను వెతుక్కోకు…
  Copy and paste in brain too Amma. Best solution for all problems????