కొత్త కవిత్వానికి డిజిటల్ దారులు!

ఈ యేడాది అమెరికాలోని తెలుగు సంస్థ నాటా,  సారంగ పత్రికతో కలిసి కవిత్వం కథల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం ముదావహం. వాటిల్లో కవిత్వానికి నేను న్యాయ నిర్ణేత గా వ్యవహరించడం జరిగింది.

విత్వానికీ సాహిత్యానికీ కాలం చెల్లింది,  ఇంటర్నెట్ సోషల్ మీడియా  మొబైల్ డిజిటల్ టెక్నాలజీలు సర్వవ్యాప్తమైన ఈ అత్యాధునిక యుగం లో ఇంకా  కవిత్వాన్ని సాహిత్యాన్ని ఎవరు చదువుతారు ఎవరు రాస్తారు అని పెదవి విరిచే వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు తెలుగు భాషనే నెమ్మది చావు అనుభవిస్తోంది, ఇంకొన్ని ఏండ్లు పోతే తెలుగు మాట్లాడే వారే కరువై పోతారు, తెలుగు మృత భాష అయిపోతుందని భయపడుతున్న వారూ లేకపోలేరు. వాళ్ళ అనుమానం లో కొంత సహేతుకత లేకపోలేదు. ఈ నిరాశకు భిన్నంగా  మనకిప్పుడు మరో కొత్త ట్రెండు కనబడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీ వాడుకుంటూనే తెలుగులో రాయడం, సంభాషించడం –  సమకాలీన సాంకేతికతకు అనుగుణంగా కొత్త మాటలను ఎంచుకుంటూ కొత్త భాషను సృష్టిస్తూ ఆధునిక తరం భాషను సజీవంగా ఉంచుతున్నది.

అత్యాధునిక సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ సాహిత్యానికి కవిత్వానికి వేదికలు తయారయ్యాయి. ఈ వేదికల్లో వేలాది మంది సభ్యులవుతున్నారు. అనుక్షణం (అన్నా అతిశయోక్తి కాదేమో) ఏదో ఒకటి రాస్తున్నారు. సాహిత్య సృజన చేస్తున్నారు. ఇట్లాంటి సామాజిక మాధ్యమ వేదికల్లో అగ్ర స్థానంలో కవిసంగమం ఉంటుంది. కవిసంగమం వేదికగా ఎందరో కొత్త కవులు ముందుకొచ్చారు. పాత కవులు తమ కలాలకు పదును పెట్టారు. పుంఖానుపుంఖంగా కవిత్వం వస్తున్నది. అట్లే ఇతర వేదికల్లో కూడా. ఐతే వస్తున్నదంతా గొప్ప కవిత్వమనీ రాసే వాళ్ళంతా గొప్ప కవులనో కాబోతున్నారనో అనుకోవడం సరైంది కాదు. కానీ తెలుగులో సాహిత్య,  కవిత్వ సృజన సజీవంగా ఉండడానికి ఒక నిరంతర ప్రవాహంగా ప్రవహించడానికి కవిసంగమం లాంటి వేదికలు ఎంతో దోహదం చేస్తున్నాయి. ఈ వేదికల్లో అట్లే ఇంటర్నెట్ లో వస్తున్న పత్రికలు. ఇంటర్నెట్ ప్రభావం వల్ల చాలావరకు అచ్చు పుస్తకాలు పత్రికలు చదవడం తగ్గిందనే చెప్పుకోవాలి. ఐతే ప్రతి యేట రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుస్తక ప్రదర్శనకు వేలాదిగా జనం వెళ్ళడం పుస్తకాల అమ్మకాలు లక్షల్లో ఉండడం చూస్తే దానిలో అంత నిజం లేదేమో అనిపిస్తుంది. ఐతే ఒకటి మాత్రం నిజం . ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో వస్తున్న పుస్తకాలు పత్రికల సంఖ్య విపరీతంగా పెరిగింది. తెలుగులో ఎన్నో ఆన్లైన్ పత్రికలు వచ్చాయి. ప్రస్తుతం  తెలుగులో వస్తున్న అగ్రశ్రేణి అంతర్జాల పత్రికగా సారంగ ను నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఉన్నత విలువలున్న సాహిత్యాన్ని పాఠకులకు అందించడం లో, పాఠకుల్లో ఉత్తమ సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడంలో సారంగ గొప్ప పాత్ర నిర్వహిస్తున్నది. కథలూ కవిత్వమూ సాహిత్య విమర్శ జ్ఞాపకాలు ఒకటేమిటి అనేక సాహితీ ప్రక్రియలను సారంగ పాఠకులకు ముందుకు తెస్తున్నది. కవిసంగమం లాంటి వేదికల్లో సారంగ లాంటి పత్రికల్లో ముందుకొచ్చిన అనేక మంది కొత్త తరం తెలుగు వాళ్ళు  మంచి  కవులుగా  సాహిత్యకారులుగా అభివృద్ధి చెందడం చూస్తున్నాం.

ఈ యేడాది అమెరికా లోని తెలుగు సంస్థ నాటా,  సారంగ పత్రికతో కలిసి కవిత్వం కథల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం ముదావహం. వాటిల్లో కవిత్వానికి నేను న్యాయ నిర్ణేత గా వ్యవహరించడం జరిగింది. న్యాయనిర్ణేతగా ఉండమన్నప్పుడు ముందు కొంత సంశయంగానే ఒప్పుకున్నాను. సంశయానికి మూడు  కారణాలు ఒకటి ఇంతకు ముందెన్నడూ ఈ పని చేయలేదు రెండు అసలు కవిత్వాన్ని సాహిత్యాన్ని కొలమానాలతో కొలిచి మొదటిది రెండోది అని ఎట్లా నిర్ణయించగలం అని కొంత సందేహం. కవిత్వాన్ని అనుభవించి పలవరించాలే కదా మార్కులెట్లా ఇవ్వగలమ్ అని అనుమానం. మూడోది – ఇట్లాంటి పోటీల్లో రాగా ద్వేషాలకు పక్షపాతాలకు అతీతంగా ఉండడం ఎట్లా అనే ప్రశ్న. సరే ఇంతకు ముందు  చెయ్యకపోయినా  ఏది మంచి కవిత్వమో చెప్పగలిగే జ్ఞానం కాలక్రమేణ అనుభవరీత్యా సంపాదించుకున్న కదా పర్వాలేదు అనుకున్న. కొలమానాలు కాదు మార్కు లు కాదు అనుభవించి పలవరించే మంచి కవిత్వాన్ని ఎంపిక చెయ్యాలి అనుకున్న. ఇక రాగద్వేషాలూ పక్షపాతాలూ అంటారా – కవుల  పేరు లేకుండా కవిత్వాన్ని అంతా ఒకచోట చేర్చి ఒకటికి మూడు సార్లు చదివి ఎంపిక చేయాలనుకున్నా. ఇవీ నాకు నేనుగా నియమించుకున్న నియమాలు,  పద్దతులు. ఒకటి తర్వాత ఒకటి దాదాపు 30కి పైగా  కవితలు వచ్చినాయి అఫ్సర్ నుండి నాకు ఈమైల్స్ గా. అన్నిటిని ఒకచోట చేర్చి కవుల పేర్లు తీసేసి చదవడం మొదలు పెట్టిన. అట్లా కవితలను అనామధేయంగా (anonymous) చదవడం ఎంతో బాగుంది. కవులెవరో తెలవదు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ నా ముందు కంప్యూటర్ తెర మీద ఎలక్ట్రానిక్ అక్షరాలు – పదాలు – కావ్య శకలాలు – వర్షపు ధారల్లా నదుల్లా జలపాతాల్లా అద్భుతంగా కొత్త పదచిత్రాలను కొత్త ఉద్వేగాలను కొత్త భావావేశాలను కొంగ్రొత్త వ్యక్తీకరణలతో కవిత్వం నా ముందు ప్రవహించింది. అందులో ఏది ఉత్తమం  యేది మొదటిది యేది రెండోది అని చెప్పడం ఎట్లా?  మార్కులను ఆశ్రయించాలా?

ఒక శనివారం ఉదయాన్నే ఎవరూ నిద్రలేవని సమయం లో.. ప్రశాంతంగా అన్నీ కవితలను ఒకే సారి చదివిన ఒక నిర్మాలిన్య అమాయకత్వం తో – ఎవరైనా కవిత్వాన్ని అమాయకంగానే చదవాలి అని అని ఉద్దేశ్యం, బాల్యపు అమాయకత్వం తో చదివితే తప్ప కవిత్వం హృదయానికి తాకదు – మనలోని  మన అమాయకత్వాన్ని అబ్బురపరిచేదే గొప్ప కవిత్వం అని నా నమ్మకం – మనసుకు నచ్చేలా తాకినవి,  తడి చేసినవి ఉద్వేగ ధారలో ముంచేసినవి గుర్తుపట్టడం పెద్ద కష్టం కాలేదు. హమ్మయ్య ఇప్పుడు లిస్ట్ పొడవు తగ్గింది – ఒక పది దాకా ఉన్నాయి.  నన్నట్లా ఆ ఉదయాన్నే తడిపిన కవితలు. మరో సారి చదివాను ఆ కవితల్ని. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది మార్కులేవీ ఇవ్వకుండా కొలమానాలు లేకుండానే వాటిని బేరీజు వెయ్యవచ్చని.

మరి మొదటి సారి యేమి చూసి ఆ 30 పైగా కవితల్లోంచి ఒక పదిని ఎంచుకున్నాను. మనసుకు తాకడం, తడి చెయ్యడం, ఉద్వేగ ధారలో ముంచడం, తడిపెయ్యడం ఇవన్నీ ఉపమానాలే. బహుశా పైకి చెప్పడానికి ఈ ఉపమానాలు ఎంచుకున్నా లోలోపల నేను చూసినవి కవితలో వ్యక్తీకరణ, పదచిత్రాలు, ఉపమానాలు, వస్తువును కవిత్వం చేసిన పద్దతి, కవిత లో ఉద్వేగ స్థాయి, వాడిన టెక్నిక్, భాష వగైరాలే. అంటే నిస్సందేహంగా రూపమే. కవితలో వస్తువేదన్న విషయానికి అతీతంగా రూపం మీద ఆధారపడే,  కవి ఎంచుకున్న శిల్పం మీద ఆధారపడే ఏది హృదయానికి తాకిందో గుర్తుపట్టగలిగాను. ఆ క్రమంలో వస్తువు మీద ధ్యాస లేదు. తర్వాత ఆ పది కవితలనూ మరో సారి చదివాను. పొద్దున చదివిన అమాయకత్వం తో కాక మరికొంత శిల్పచాతుర్యం మీద ధ్యాసతో కొంచెం ‘తెలివిగా’ చదివిన.  ఇప్పటికీ వస్తువు మీద ధ్యాసే పెట్టడం లేదు నేను. ఐతే నాలోపల ఇన్ని యేండ్ల సాహిత్య అనుభవం వల్ల చదవడం వల్ల కొన్ని ‘హార్డ్ వైరింగ్స్’ ఉన్నాయి. అవి నాకు తెలిసో తెలియకో ప్రతి చోట పనిచేస్తుంటాయి. నిజమే వాటిని వాదులుకోవడం అంత సులభం కాదు. ఐనా  వాటన్నింటినీ వదులుకోవాల్సిన అవసరం లేదు కదా – వాటిలో గిడసబారిన వాటిని,  కాలం చెల్లిన వాటిని వదులుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. వాటి స్థానే మెరుగైన, సరైన కొత్త సమకాలీన జ్ఞానాన్నీ అభిప్రాయాలనూ నేర్చుకోవడానికీ ఏర్పర్చుకోవడానికీ నేను ఎప్పుడూ సిద్ధమే. అదే ఓపెన్ ఎండెడ్ దృక్పథం తో మళ్ళా చదివిన ఆ పది కవితలనూ. ఇప్పుడు స్పష్టంగా ఒక ఐదు మిగిలినయి.

ఈ అయిదింటిలోనూ వస్తువు సమకాలీనమే. సమాజాన్ని బాధ్యతాయుతంగా పట్టించుకున్నదే. వేదనా సరైందే. ఆక్రోశం లో ఉద్వేగమూ, ధర్మమూ  రెండూ ఉన్నాయి. అంటే వస్తు రీత్యా ఆ అయిదూ మంచి కవితలే. మరిప్పుడు వాటిలో మూడింటిని ఎంచుకోవడం ఎట్లా. మళ్ళా రూపమే, శిల్పమే శరణ్యం నాకు. ఆ ఐదు కవితల్లో ఏవి  బలంగా ఉన్నాయి. వేటిల్లో వ్యక్తీకరణ శక్తివంతంగా ఉన్నది. కొత్తగా ఉన్నది. కొంగ్రొత్త పదచిత్రాలతో ఉన్నది. రొడ్డకొట్టుడు వస్తువు కాక కొత్త వస్తువును ఎంచుకున్న కవితలు ఏవి? వేటిలో వస్తువు, వ్యక్తీకరణ, వస్తువును కవిత్వం చేసిన పద్దతి (ట్రీట్మెంట్)కొత్తగా ఉన్నాయి అనే దృష్టితో చదివి ఆలోచించిన. అప్పుడు కానీ తేలలేదు మొదటి మూడూ ఏవో. అప్పుడు ఇంతకీ ఆ కవితలను రాసిన కవులు ఎవరూ అని వెతికి వాటికి పేర్లు అటాచ్ చేసి చూసుకున్న. ఆశ్చర్యం వాటిలో ఒక్క పేరు తప్ప మిగతా వారు ఎవరో నాకు తెలియదు.  గొప్ప ఆనందం వేసింది.  కవులేవరో తెలియకుండా వారి కవితలను అమాయకత్వం నుండి ‘మాయకత్వం’ వరకు భిన్న వేషాలేసుకుని  చదివి ఇవీ నాకు నచ్చినవి అని నిర్ణయించుకుని మళ్ళీ వెనుకకు ఎన్ని సార్లు చూసినా అవే నచ్చడం చాలా ఆనందకరమైన విషయం.

ఆ కవితలు మీ ముందుకొస్తున్నయి. వాటి శిల్పమూ వ్యక్తీకరణ పదచిత్రాలు ట్రీట్మెంటు  వస్తువు అన్నీ మీ ముందున్నాయి. వస్తువు సమకాలీనం,  కొత్తది,  వ్యక్తీకరణ కొంగ్రొత్తదీ, మన సమాజానికి  మొత్తంగా తెలుగు సమాజాన్ని నిర్ధిష్టంగా వర్తించే వస్తువు. దాన్ని కవిత్వం చేసిన పద్దతి నిస్సందేహంగా అభినందించదగ్గది. నీటి గురించి విశ్వజనీన దుఃఖం ఒకటైతే, జాలరుల నిర్దిష్ట దుఃఖమూ వేదనా జీవన సంక్షోభమూ  మరొకటి – అడవి మీద ఆదివాసులమీద వనరుల మీద కార్పొరేట్, సామ్రాజ్యవాదుల దాడి పై ఆగ్రహం మరొకటి. అద్భుతమైన కవితలు. నిజానికి వీటికి ఒకటి రెండు మూడు అని రాంకింగ్ ఇవ్వడం కష్టమూ కొంత అసంబద్దం కూడా. కానీ తప్పలేదు.

సమకాలీన వస్తువును, సామాజిక వేదనను, నిర్దిష్టత నుండి విశ్వజనీనత దాకా  కొంగ్రొత్త వ్యక్తీకరణ తో గొప్ప కవిత్వం ఎట్లా చెయ్యొచ్చో ఈ కవితలు మనకు అద్భుతంగా చెపుతాయి. ఇంత మంచి కవిత్వం రాసిన కవులకు మనఃపూర్వక అభినందనలు.

*

వచ్చే పక్షం : మరో న్యాయ నిర్ణేత రవి వీరెల్లి అభిప్రాయం 

పెయింటింగ్: సత్యా బిరుదరాజు 

నారాయణ స్వామి వెంకట యోగి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు