కూలిప‌ని

బువ్వ టిపెను తీచ్చాంటే.. ఆక‌లి ఇంగా సంపుతాంది. అన్నం వాస‌న కొట్టింది.

ఆ పొద్దు రెండో శ‌నివారం..
కూలిప‌నికి పోడానికి మాయ‌మ్మ టిపెనులో బువ్వ పెట్టుకుంటాంది.
‘ఒసీ.. ప‌నికిపోదాం రేప్పొద్దున‌’ అన్యాది మాయ‌మ్మ‌.
“..పోమా నేను రానుపో. నేను ఆటాడుకోవ‌ల్ల‌” అన్యా.

‘అట్ల‌నాకుమ్మా.. చీనీచెట్ల‌కిందికి గ‌డ్డితీనులే. ఎంత‌సేపు పైటాల అయితాదిలే. లెక్కొచ్చాది. నేనుండా క‌దా.. నీ ప‌ని జేచ్చా’ .
”పోమా.. నాకు రాబిద్ది కాదు. వాళ్లు ఎంత‌సేప‌టికి ఇంటికి ఇర్స‌రు”
‘నీకు రేపొచ్చినాక శెన‌గ‌వాల్ల పాయ‌సం సేచ్చా. పూరీలు కాలుచ్చా’ అన్యాది మాయమ్మ‌.
”ఏంటి వొద్దుపోమా.. నేను రానుస‌స  అన్యా నేను. నాకేమో గోళిగుండ్లు, చిల్లాక‌ట్టె, గానాట‌, నేల‌బండా, కండ్లాకాసి ఆట‌లాడుకోవ‌టం ఇష్టం.  తూనీగ‌లు ప‌ట్టుకోవ‌టం ఇష్టం. సెల‌వునాపొద్దు ప‌నికిపోతే ఇయ్య‌న్నీ కుద‌ర‌వని క‌డుపులో బాధ‌.
మాయ‌మ్మ ధ‌నాలు డ‌బ్బా తీసినాది. ఒక‌ అద్దురూపాయి బిళ్ల‌, రెండు పంది బొమ్మ‌లుండే పావులా బిళ్లలు ఇచ్చినాది.
బెరిక్కిన అంగ‌డిదావ‌ప‌ట్నా. ప‌ప్పులుంట‌, రెండు ఆశచాక్లెటు కొనుక్కున్యా.  ఇంటికొచ్చినా పొప్పులుంట తినుకుంటా. మాయ‌మ్మ ఇంట్లోంచి బ‌య‌టికొచ్చింది. బాయి కాడ నిల‌బ‌డినాది నాకోసం.  బెరీన రా.. అంటూ చేయి ఎత్తి నిల‌బ‌డింది. ఒక చేత్తో కొడ‌వ‌లిక్కి, ఇంకో చేత్తో బూటిపెను ప‌ట్టుకున్యాది. మెడ‌కు ట‌వాల ఏసుకున్యాది. ”నేను ప‌నికి పోయొచ్చా. రేపు నువ్వు రావ‌ల్ల‌. ఎనుముల‌కు నీళ్లు ద‌ప్పిగ‌యితాయి . నీళ్లు పెట్టు. వ‌సార్లో అరుగుమింద ఉండే ప‌చ్చిగ‌డ్డి వెయ్యి. అంతా వెయ్యాకు.. ఉన్నీ.  వ‌ట్టి గ‌డ్డి బెయ్యి రోంత‌.  బూపొద్దు కాక‌ముందే..  నుగ్గుల పొయ్యిమీంద ఉండే పాల త‌పేలా తీసి.. పాలు చ‌ల్లారినాక తోడెంటు వెయ్యి. పెరుగు ఎక్కువేచ్చే పులుచ్చాది. నువ్వు ముందు పాల‌మింద మీగ‌డంతా తినాకు. నేను సూచ్చా.  పాల‌ను పిల్లినాస‌వితి మూచ్చూచ్చాది. స్టూలేసుకోని ఉట్టిమీద పెట్టు. పాప జాగ్ర‌త్త‌. బువ్వ తినల్లి.  మ‌న బ‌జారోళ్ల‌కు మ‌జ్జిగ పొయ్యి. మ‌జ్జిగ‌లో నీళ్లు పొయ్యాకు. ఎవ‌రితో కొట్టాట పెట్టుకోవా”కన్యాది మాయిమ్మ‌.

ఇంటికాడికి పోయినాక మా పాప‌కి ఓ చాక్లెటు ఇచ్చినా. ఇంగో చాక్లెట్ తినుకుంటా.. కొట్రీ ఇంట్లోని అరుగుమింద ఉండే  సంచిప‌ట్ట‌ల కింద లెక్క స‌రిజూసుకున్యా.  ఆక‌ల‌యితాంద‌ని..  బువ్వ‌, ఊరిమిండి(ప‌ల్లీల చ‌ట్నీ) వేసుకోని తిన్యాం నేను, మా పాప‌.  ఇంటికాడికి వ‌చ్చినోళ్ల‌కు మ‌జ్జిగ త‌పేలాలో ఉండే మ‌జ్జిగ పోసినా. పొయ్యికాడికి పోయి నుగ్గులు రోంత ఎగ‌దోసినా లోప‌లికి. మెల్ల‌గా మ‌సిపాత‌తో త‌పేలామింద ఉండే ప్లేటు తీసినా. కుడిచేయి రెండో వేలితో పాల‌మింద క‌ట్టిన క‌ట్టును తీసుకున్యా. తిన్యా. *నాకు రోంత పెట్టు* అన్యాది మా చెల్లెలు. రోంతనే ఇచ్చినా. ‘అమ్మ‌తో చెబుతా రాజావ‌లి.. ‘ అన్యాది. చెప్పాకు.. అని ఇంగా రోంత పెట్నా. మ‌ళ్లా నుగ్గును ఎగ‌దోసి ప్లేటు మూసినా. ప‌దినిమిషాలు ఆగినాక పొయ్యిమీద పెట్నా పాల త‌పేలా. *నువ్వుండు ఇంట్లోనే* అని మా చెల్లెలుకు చెప్పి.. బ‌య‌ట గానాట తిప్పుకోని వ‌చ్చినా. అర్ధగంట అయినాక వ‌చ్చి.. పాలు చ‌ల్లారినాయో లేదో వేలుపెట్టి చూసి తోడెంటు వేసినా. త‌పేలాలోని పాలు ఏరే మంచి త‌పేలాలో వేసినా. అరుగుమింద బులుగు స్టూలు వేసుకోని పైకెక్కి ఉట్టిమింద పాల‌త‌పేలా పెట్టినా. ఎనుముల‌కు మేపు ఏసినా. ఇంక ప‌నియిపోయింద‌ని బ‌య‌టికి ప‌రిగెత్తినా.  పైటాలదాంక అలివి గాకుండా గోళిగుండ్లు ఆడినా. బువ్వాక‌ల‌యితాంది. అయినా గోళిగుండ్లు ఇంగా గెల్చుకోవాల‌ని.. బొంబాయి ఆట ఆడ‌తానే ఉండా. నా చేత‌ల‌కు, కాళ్ల‌కు, మ‌గానికి మ‌ట్టిపూసుకున్యా. చ‌క్కా, నిక్క‌ర మాసిపోయినాది. అయినా ప‌ట్టిచ్చుకోల‌. బొంబాయి ఆట‌లో అంద‌రి గోళిగుండ్లూ ఊస‌కొట్నా. నేను, నా సావాస‌గాడు అమీరు గోళీలు ఆడి ఇంటికొచ్చినా. అమీరు వాళ్లింటికి పోయినాడు. నేను మా ఇంటికి పోయినా పైటాల‌కి భ‌యంగా.

ఇల్లు వాకిలి తీలేదు. మాయ‌మ్మ ఇంగా రాల‌.. అని మంచు నిమ్మ‌ళమ‌యినాది. బెరీన‌ ఎనుముల‌కు  మేపు ఎయ్యాల, నీళ్లు బెట్టాల‌. ల్యాక‌పోతే మాయిమ్మ తిడ్తాదని అనుకున్యా. బెరీన‌.. బ‌య‌టాకిలికి ఉండే సిలుకు బొర‌క‌లోని క‌ట్టిపుల్ల తీచ్చాంటే.. ఇంట్లో కోడి కొక్కోక్కోక్కో.. అంటా చావ‌రుపు అరుచ్చాంది.  కాకొచ్చిందేమో అనుకున్యా.. గ‌బక్క‌ని ఇంట్లోకి పోయినా. కోడి.. దాని రెండు పిల్ల‌లే ఉండాయి. ప్య‌ప్యాప్యాపిచాక్‌.. అంటు పిల్ల‌లు అరుచ్చానాయి. కుడిప‌క్క‌కి చూసినా.  గంజుగుంత మింద ఉండే బండ ప‌క్క‌కు జ‌రిగినాది. ఎనుములు తొక్కులాడితే ఇట్ల గంజుగుంత బండ ప‌క్క‌కి జ‌రుగుతాది అనుకున్యా. రోంత ముందుకు పోయినా. గంజుగుంత‌లోకి చూసినా. తెల్ల‌గా రెక్క‌లు క‌న‌ప‌చ్చినాయి కోడిపిల్ల‌లు. మూడు కోడిపిల్ల‌లు స‌చ్చిపోయినాయని అర్థ‌మైంది. ఒళ్లు జ‌ల‌ద‌రిచ్చాంది. భ‌య‌మైంది. గంజుగుంత‌లో చేతులు పెట్టి కోడిపిల్ల‌లు తీసినా. *కోకోకోక్కొక్కో..* అంటా  కోడి ఇంగా చావుఅరుపు అరుచ్చాంది. గాల్లో ఎగురుతా.. న‌న్ను పొడ్చ‌టానికి వ‌చ్చిన‌ట్లు నా మీందికి ఎగిరింది.  కోడిపిల్లల చుట్టూ తిరుగుతా.. అరుచ్చాంది. ఏడుపిల్ల‌లుండాల‌.. గంజుగుంత‌లోప‌ల‌కి పోయిందేమో ఒక‌టి అనుకున్యా.  ప్లాస్టిక్ పావుతో గంజుగుంత‌లోని నీళ్లు తోడినా. లోప‌ల ఏం లేవు.  నీళ్లు మింగి, క‌డుపులు లావ‌య్యి.. రెక్క‌లు ఊసిపోయి.. చ‌ర్మం అంతా క‌న‌ప‌చ్చాండాయి చ‌చ్చిపోయిన మూడు కోడిపిల్లలు.  పిల్ల‌ల‌చుట్టూ కోడి తిరుగుతాంది. మిగ‌తా మూడు కోడిపిల్ల‌లు కోడిరెక్క‌ల కింద దాపెట్టుకున్యాది. ఇంకోటి.. దొడ్లోనుంచి కీచుకీచుమ‌ని అరుచ్చాంది. లోప‌లికి పోతానే అది గ‌ట్టిగా అర్చినాది. బ‌య‌టికి ప‌రిగెత్తింది.  కోడి రెక్క‌లు చాపింది. గూడిమాద్రిరి చేసినాది. మూడుకోడిపిల్ల‌లు వాళ్ల‌మ్మ రెక్క‌ల‌గూట్లో దూరుకున్యాది. ఇంగో కోడిపిల్లా ప‌రిగెత్త పోయినాది.  యాప‌చెట్టుమింద ఉండే కాకి, వ‌సార్లో జొన్న‌కంకిలకు వ‌చ్చిన పిచ్చిక‌ల చ‌ప్పుడు. కాకి అరుపు ఇంటా.. పిల్ల‌లు ఎత్త‌క‌పోతాదేమోన‌ని త‌ల్లి కోడి గాల్లోకి ఎగిరి రెక్క‌లు కొడ‌తాంది. స‌చ్చిపోయిన మూడు కోడిపిల్ల‌లు ఎన‌మ‌ల కింద ప‌డ‌తాయ‌ని ప‌క్క‌కు బెట్నా.ఆ మూడు జీవుల్ని సూచ్చానే క‌డుపు భ‌గ్గుమ‌న్యాది. ఆక‌లి చ‌చ్చినాది.  కండ్ల‌నీళ్లు దిగినాయి. ఏం చేయాలో అర్థం కాల‌. ఏడ్చి.. చక్కా రెట్ట‌ల‌తో కండ్లు తుడ్చుకున్యా.

దొడ్లోకి పొయ్యి కాళ్లు చేతులు క‌డుక్కోని.. ఎనుముల‌కు మేపు ఏసినా. అయ్యి తింటాండేప్పుడే ఇన‌ప బ‌క్కెట‌లోకి కాగులోని నీళ్లు తోడినా. ఎనుముల‌కు తాపినా. ఇర‌వై నిమిషాలు అయితానే.. మాయ‌మ్మ కూలికి పోయి వ‌చ్చినాది. *ఒమా.. కోడిపిల్ల‌లు చ‌చ్చిపోయినాయిమా* అన్యా. నెత్తిమింద ఉండే గ‌డ్డిమోపు వ‌సార్లోని అరుగుమింద ఇసిరేసి వ‌చ్చినాది.  చ‌చ్చిపోయిన కోడిపిల్ల‌ల కాడ గొంతు కుచ్చున్యాది. కాలికి ఉండే మెట్లు చేత్తోతీసి ప‌క్క‌కు ఇసిరేసినాది.  మాయ‌మ్మ కండ్ల‌నీళ్లు పెట్టుకున్యాది. *చొచ్చొచ్చొ.. పాపం ప‌సిబిడ్డ‌లు* అని ఏర్చినాది. *పాప‌ర్‌నాకొడ‌కా.. నువ్వాటికి పోయినావు. గంజుగుంత‌లో ప‌డ‌కుండా బండ అడ్డ‌పెట్ట‌కుండా చూసుకోకుండా. పాపం.. రొన్నాళ్లుంటే ఎడ‌పిల్ల‌లు అయితాయి. ఇట్ల ఎన్ని పాదెంకుటామో ప‌సిబిడ్డ‌ల్ని* అని ఏడుచ్చాంది.  *పాపం.. కోడిపిల్ల‌లు స‌చ్చిపోయినామా..* అంటా నేను ఏడిచినా. అర్ధగంట‌కు మా నాయిన ఇంటికి వ‌చ్చినాడు. మాపాప పోయి మా నాయిన‌తో చెప్పినాది. వోరినీ అన్యాడు మా నాయిన‌. గాటిపాట‌న ఉండే కోడిపిల్ల‌ల‌ను డ‌బ్బాచాట‌లో ఏసినాడు. నేను పొయ్యి ప‌ర‌తోట‌లోని కంప‌ల్లో మెల్ల‌గా కింద ఏసి వ‌చ్చినా.  సూచ్చాండంగ‌నే రాత్ర‌యినాది. నిద్ర‌ప‌ట్ట‌ల‌. చేప‌ల క‌థ‌, కోతిక‌థ‌.. చెప్ప‌లేదు. మేం అట్ల‌నే నిద్ర‌పోయినాం.

‘టైము ఐద‌యితాంది.. బెరీన లెయ్యి. తెల్లారినాది. ప‌నికి పోవ‌ల్ల’ అన్యాది మాయ‌మ్మ‌. రానుపోమా అన్యా. ‘ఏమి సీ.. నువ్వురా సాలు. ఎంత సేప‌యితాది పైటాల‌’ అని బంగ‌పోయినాది. ‘స‌రేలే’ అన్యా. ప‌ద్ద‌న్నే వంకాయ‌పప్పు ఎనుపుతాంటే.. వాస‌న గ‌ప్పుమ‌ని కొడ‌తాంది. బొగ్గుల‌గూటికాడికి పోయి బొగ్గు కొరుక్కున్యా. నోట్లో వేలుపెట్టి పండ్లు తోముకున్యా. మ‌గం క‌డుక్కుంటానే కాఫీ ఇచ్చినాది. పంత‌లోని ఉడుకునీళ్లు గ‌బ‌గ‌బా  దిగ‌బోసుకున్యా. అంత‌లోకే ఊరిమిండి నూరి చాట‌లో చెన‌క్కాయ‌లు తీసింది. చెన‌క్కాయ‌లు నాకు కావ‌ల్ల .. అని మా పాప, నేను కొట్లాడుకున్యాం. ‘వ‌చ్చినాంక‌.. సెన‌గ‌వ్యాల్ల పాయ‌సం సేచ్చా’ అన్యాది. పెద్ద టిపెనులో బువ్వ‌, కురాకు పెట్నాది. చిన్న‌టిపెనులో గ‌ట్టి పెరుగు ఏసినాది.  కొడ‌వ‌లి గూటికాడికి పోయి రెండు కొడ‌వ‌లిక్కిలు తెచ్చినాది. ‘కొస్సి కొడ‌వ‌లి నాకు కావ‌ల్ల‌మా..’ అన్యా. ”స‌రేలే” అన్యాది మాయ‌మ్మ‌. కూలోళ్ల‌తో క‌ల్చి ఎల్ల‌బారినాం తోట‌కాడికి. ‘జాగ్ర‌త్త ర‌జియా.. అనంత‌మ్మ‌వ్వ ద‌గ్గ‌ర ఉండు. పిల్లోల్ల‌కాడే ఉండు’ అని మాపాప‌తో చెప్పినాది. మాయ‌మ్మ ట‌వాల‌, టిపెన్లు ప‌ట్టుకున్యాది. నేను రెండు కొడ‌వ‌లిక్కిలు, ట‌ర్కీ ట‌వాల ప‌ట్టుకోని మాయ‌మ్మతో పాటే న‌డుచుకుంటా పోతాన‌. మాయ‌మ్మ వాళ్ల ఫ్రెండ్సుతో య‌వారాలు సేచ్చా న‌డుచ్చాంది. నేను దావుంటి ఉండే సీగిసెట్ల కొమ్మ‌ల్ని కొడ‌వ‌లిక్కితో న‌రుకుతా  పోతానా. సీకాకు, కొమ్మ‌లు రాలిపోతాండాయి. మంచులో నాకేమో పోవల్ల‌ని లేదు.. మాయ‌మ్మ బాధ‌ప‌డ‌తాంద‌ని మ‌కురుగా దావ న‌డిచినా. హ‌వాయి చెప్పులు మ‌ట్టిలో రాకుతా న‌డుచ్చానా.

చీనీచెట్లు(బ‌త్తాయి) ఉండే తోట‌కాడికి పోయినాం. చెట్టుకు ఇద్దురు తొగాల‌. ప‌దేండ్ల‌కు పైన‌ పెద్ద‌చెట్లు. చెట్టు మొద‌ల్ల‌లో తేమ ఉండాది. ‘లోప‌లికి అడ్డంగా దూరాకు. చీనీచెట్ల కొమ్మ‌లు పొడుచుకుంటాయి. పాడునాకొడుకుయి. హుషారుగా ఉండు’ అన్యాది మాయ‌మ్మ‌. లోప‌లకి పోయి చెట్టు చుట్టూ.. గుబురు కొమ్మ‌ల కింద దూరి నేను కొడ‌వ‌లిక్కితో తొగితే.. మాయ‌మ్మ మిగ‌తా అంతా ఐదు నిమిషాల‌లో సులుకు సూచ్చంగా తొగేది. చెట్టుకింద అంతా గ‌డ్డి తొగినాక సూచ్చే.. మాయ‌మ్మ‌నే నాకంటే ఎక్కువ ప‌ని చేసుంటాది. నాది ప‌ది పైస‌ల ప‌ని కూడా కాదు. ప‌క్క‌నుండే కూలోల్లు ”ఇమాంబి.. ఇద్ద‌రి మంచ‌ల ప‌ని సేచ్చాది” అని మాయ‌మ్మ‌ను ఇద్ద‌రు పొగిడినారు.  ‘ఇమాంబికి .. ఈ పొద్దు రెండు కూళ్లు’ అన్యాది ఇంకోకాయిమ‌. ”ఆ.. ఊరిక ఇచ్చారు. పాపం పిల్లోడు రాన‌న్యా.. తోల‌క‌చ్చినా. ప‌దైదు రూపాయ‌ల‌కు పిల్లోడు ప‌నిచేయ‌ల్ల పైటాలదాంక‌. క‌ష్ట‌ప‌డంది లెక్క ఏంటికి ఇచ్చారు” అన్యాది మాయ‌మ్మ‌. రెండు, మూడు చెట్లు తొగినామో లేదో… తోటాయిప్ప రెడ్డ‌య్య వ‌చ్చినాడు. ‘ఎవురు పిల్లోడివి పిల్ల‌గా.. ఆ గ‌డ్డిపాస‌లు పోగొడ‌తానావు’ అన్యాడు. మాట‌ల్లోనే మాయ‌మ్మ చెట్టులోప‌ల‌నుంచి బ‌య‌టికొచ్చినాది. ‘యాడ‌య్యా.. ‘ అని గ‌డ్డిపాసల‌ను కొడ‌వ‌లిక్కితో తొగినాది. ‘బూమ్మా.. నీ కొడుకా’ అన్యాడు ఆయ‌ప్ప తెలియ‌న‌ట్టు. ‘ ఏం చ‌దువుతానావుబ్బీస‌ అనడిగినాడు. ‘ఆరోత‌ర‌గ‌తిన్నా’ అన్యా.  అయ్యా.. అని అన‌కుండా ‘అన్నా’ అన‌టంతో మ‌గం మార్చుకున్యాడు ఆయ‌ప్ప‌. ‘పిల్లోల్లు చ‌దువుతే.. నాగ‌రీకం నేర్చుకుంటారు’ అన్యాడు ఆయ‌ప్ప‌. మాయ‌మ్మ మెల్ల‌గా నాతో ”అయ్యా” అను అని సైగ‌లు చేసినాది. నేను ‘పో..’ అన్యా మెల్ల‌గా.. ఆకుల్లోంచి త‌ల‌కాయ ఊపుతా. ఆయ‌ప్ప అట్ల‌పోతానే.. ”ఆయ‌ప్ప అంతే..  గ‌డ్డి, ఉన్యా లేకున్యా.. అదే ప‌నిగా ఎతుకుతాంటాడు. తోటోళ్లు క‌ద‌. వాళ్లు కూలిలెక్క ఇచ్చారు. పిల్లోల్ల‌కు లెక్కియ్యాలా అని బాధ ఉంటాది. కండ్లు మూసుకుంటే పైటాల వ‌ర‌కు నీకు ప‌దైదు రూపాయ‌లు వ‌చ్చాది. అంతా నీకే ఇచ్చా రోంత సేపుంటే బువ్వ యాల అయితాది.. తొగు మ‌ట్ట‌సంగా” అన్యాది మాయ‌మ్మ. ఆరేడు చెట్లు మెల్ల‌గా గ‌డ్డి తొగినాం. నాకు ఆక‌ల‌యితాంది. ‘బువ్వ‌మా’ అన్యా. ”రోంత‌సేపు ఓర్సుకో. ప‌దాం” అన్యాది. నా ప‌ని కూడా మాయ‌మ్మ చేసినాది.

‘బువ్వయాల దాటినాద‌ని.. ‘ ల‌చ్చిందేవ‌క్క అన్యాది. అంద‌రం చీనీచెట్ల మ‌ద్దెలోకి వ‌చ్చినాం. మాయ‌మ్మ చీనీకాయని గోటితో చీల్చి చీనీపండు తింటా న‌డుచ్చాంది. బాయితిక్కు ప‌దాం.. మోట‌రు ఉంటాది అన్యాడు ఒకాయ‌ప్ప‌. బాయిదిన్నె తిక్కు పోయినాం. మోట‌రు ఆడ‌తాంది. తోట‌వార చెట్ల నీడ‌లో కూర్చున్యాం. బిందె వొంచి అంద‌రూ చేతులు క‌డుక్కుంటాండారు. మాయ‌మ్మ చేతులు క‌డుక్కోని.. అర‌చేత్తో నీళ్ల‌ను తీసుకోని నా మ‌గం రెండుమాట్లు క‌డిగినాది. అర‌చేతిలో నీళ్లు పోసుకోని నాకు తాపిచ్చినాది. రోన్ని తాగినా. ట‌వాల‌తో మ‌గం తుడిచినాది.

బువ్వ టిపెను తీచ్చాంటే.. ఆక‌లి ఇంగా సంపుతాంది. అన్నం  వాస‌న కొట్టింది. ‘ఏందిమా స‌ద్దిబువ్వ‌నా’ అన్యా. ”నీకు ఉడుకుబువ్వ పైన ఉంది. టిపెను అడుగున రాత్రి స‌ద్దిబువ్వ ఉంటే పెట్ట‌క‌చ్చినా. ఎండ‌కు అట్లొచ్చాదిలే” అన్యాది.  పెద్ద‌గ్లాసులోని ప‌ప్పు, క‌ప్పులో ఊరిమిండి బ‌య‌ట‌కి తీసినాది. టిపెనులో పొప్పు వేసినాది. బువ్వ పిడ‌చ‌లు చేసి నాకు మూడు ముద్దలు తినిపిచ్చి..త‌ను వొక ముద్ద తింటాంది. పొప్పు బువ్వ తోట‌లో తింటాంటే.. రుచి అలివిగాకుండా ఉండాది. ‘ఇంట్లో ఉంటే ఇంత రుచిలేదుమా’ అన్యా. ”ఫ‌లంమీద‌కి వ‌చ్చే.. అంతే నాయినా.. రుచి. ఎక్క‌వ‌ తిన‌బిద్ది అయితాది” అన్యాది. దూరంగా ఓ కుక్క నాలిక బ‌య‌ట‌పెట్టి జొల్లు కార్చుకుంటా ప‌డుకున్యాది. ఆ కుక్క‌ను చూసినాది మాయ‌మ్మ‌. ఓ ముద్ద ఇచ్చి ‘మ‌ట్టిలో కాకుండా .. రాయిమింద బువ్వ పెట్టిరా’ అన్యాది. కుక్క ద‌గ్గ‌రికి పోతానే.. అది ఆశ‌గా వ‌చ్చినాది. బండ‌రాయిమింద బువ్వ‌ను ఎదురుకున్యాది. మా పొప్పు, ఊరిమిండి రోంత ఏసుకోండ‌ని వాళ్ల‌ ఫ్రెండ్సుకి ఇచ్చినాది మాయ‌మ్మ‌. వాళ్ల ఉర్ల‌గ‌డ్డ కురాకు మాకు ఇచ్చినారు. పొప్పులో ఊరిమిండి క‌లిపి.. బువ్వ తింటాంటే.. సొర్గం క‌న‌ప‌డిన‌ట్లుండాది నాకు. ఊరిమిండితోనే  బువ్వ‌ క‌లిపి ముద్ద‌లు చేసి పెట్నాది. ‘నాకు చాలుమా’ అంటానే మాయ‌మ్మ గ‌బ‌గబా తిన్యాది. పెరుగు వేరేవాళ్ల‌కు ఇచ్చినాది. ‘మా మ‌నం వేసుకున్యాక ఈ’ అన్యా. ”అట్ట ఇయ్య‌కూడ‌దు. మిగిలింది పెట్ట‌కూడ‌దు. ముందే ఇయ్యాల‌” అన్యాది మాయ‌మ్మ‌. వేరే వాళ్లు చారు ఇచ్చినారు. దాంతో మాయ‌మ్మ తిన్యాది. ‘నాకు క‌డుపు నిండింది వ‌ద్దుమా..’ అన్యా. అడ‌గ‌న స‌ద్దిబువ్వ ఉంది. ఆ స‌ద్దిబువ్వ‌లోకి.. గ‌ట్టి పెరుగు వేసినాది. ‘పెరుగుబువ్వ తిను’ అన్యాది. నాకిష్టంలేని పెరుగుబువ్వను తిన‌న‌న్యా. గ‌ట్టిపెరుగులోకి బిందెమింద ఉండే చెంబులోకి నీళ్లు వొంచుకోని.. కొన్ని నీళ్ల‌ను పెరుగులోకి వేసినాది. ‘ఎవ‌ర‌న్నా.. ఉప్పు తెచ్చినారాక్క’ అని అడిగినాది . వేరే ఆయిమ గ‌ట్టిఉప్పు ఇచ్చినాది. పెరుగులోకి వేసుకోని తిన్యాది మాయిమ్మ‌.  తిన్యాక‌.. రోంత య‌వారాలు ప‌ట్టిచ్చినారు కూలోళ్లు. ”ఇంగ లెయ్యండి లెయ్యండి.. ప‌నులు చేయ‌కుండా య‌వారాలు ప‌ట్టిచ్చినారు. ఇట్ల‌యితే మూడువ‌ర‌కు పెడ‌తా” అన్యాడు రెడ్డ‌య్య న‌వ్వుతా. అంద‌రూ ట‌వాల‌లు మింద ఏసుకోని.. టిపెన్లు గ‌బ‌గ‌బా క‌డుక్కోని ప‌నిలోకి ఎల్ల‌బారినారు.

చెట్ల‌కింద గ‌డ్డి తీచ్చానే మ‌ధ్య మ‌ధ్య‌లో చీనాకాయ‌లు సులుకుసూచ్చంగా చీల్చి తింటాంది. నాకు పండ్లు తిన‌డం ఇష్టం లేద‌ని తెల్చు మాయ‌మ్మ‌. అయినా చీనాకాయ స‌గం వొప్పు చీల్చి ఇచ్చినాది. గ‌బ‌గ‌బా చీనీవొప్పు ర‌సం తాగి.. వొప్పుల్ని ప‌క్క‌న ప‌డేసినా. ‘ఆయ‌ప్పకి ఈ వొప్పులు క‌న‌ప‌డితే క‌సురుకుంటాడు’ అన్యాది మాయ‌మ్మ‌. కొడ‌వ‌లితో గుంత తీసి.. చీనాకాయ వొప్పులు, తోలు బూడ్చిపెట్నాది మాయ‌మ్మ‌. పైన ఎండుటాకులు క‌ప్పెట్టినాది. ”కాపోళ్లు మామూళోల్లు కాదు. యాడ మ‌నం తింటాంటామోన‌ని దొంగ‌గా సూచ్చాంటారు. జాగ్ర‌త్త‌గా ఉండాల‌” అన్యాది. టైము దిక్కు తెల‌ల నాకు. గుబురు చీనీతోట‌లో నీడ అయితే బాగుండాది. అయినా చెట్ల సందుల్లోంచి ఎండ సులుక్కుమ‌ని కొడ్తాంది. ఎప్పుడెప్పుడు ఇంటికి దెంకోని పోదాముబ్బా అనిపిచ్చాది. గ‌డ్డి తీచ్చాంటే .. పాములేమ‌న్నా చెట్ల‌కింద ఉంటాయేమో.. బ‌ల్లులు, తొండ‌గాళ్లు, తేల్లు ఉంటాయోమో అని భ‌యంగా ఉండాది. మాయ‌మ్మ ప‌క్క‌నే ఉండ‌టంతో ధైర్నంగా ఉండా. గ‌డ్డి తొగుతానా.. కానీ మంచంతా గోళిగుండ్ల మింద‌నే ఉంది. ఈ పొద్దు మైటాల పోయి.. గోళీలు గెల్చ‌క‌చ్చుకోవాల అనుకున్యా. అస‌లు ఎందుకు ఈ ప‌నికి వ‌చ్చినా అనిపించింది. అడ‌విలో  ప‌క్షులు కూత‌లు ఇన‌ప‌డ‌త‌తానాయి.  దూరంగా రెండు కుందేలు పిల్ల‌లు క‌న‌ప‌డినాయి. మంచు స‌ల్ల‌గైంది. బ‌య‌టికొచ్చినా.. రాయి ఇసిరేసినా. అయి ప‌రిగిత్తినాయి. వేడి గాలి చంప‌లు వాయిచ్చాంది.  నా దిగులు చూసి.. ” రెండ‌య్యింటాది.. పొదాంలే ఇంగ బెరీన‌” అన్యాది మాయ‌మ్మ‌.

‘తోటాయ‌ప్ప ఇంటికి పోయేట‌ప్పుడు వ‌చ్చినాడు అన్యాది’ ఒకాయ‌మ్మ‌. గుంపును క‌ట్టే కూలోళ్ల  ఆయ‌మ్మ‌తో, వాళ్ల తోట‌కాడికి ప‌నికి వ‌చ్చే జీత‌గాడి పెళ్లాంతో య‌వారాలు పెట్టుకున్యాడు రెడ్డ‌య్య‌ . అంద‌రూ ఇంటికి పోవాల‌నుకుంటాంటే.. అప్పుడు మాటలు క‌లుపుతానాడు అంద‌రితో. జోకులు ఏచ్చాండు. ‘టైము రెండున్న‌ర‌ దాటింటాది’ అన్యాది ఒక‌యిమ‌. ”రెండున్న‌ర కూడా కాల‌. ప‌ద్ద‌న లేటుగా వ‌చ్చినారు. బువ్వ చానా సేపు తిన్యారు. రోంత తొగండి” అన్యాడు రెడ్డ‌య్య గ‌ట్టిగా. కొంద‌రు నోట్లోనే వ‌దురుతా రెడ్డ‌య్య‌ను తిట్టుకుంటాండారు. ‘ఈయ‌ప్ప తోట‌లోకి ప‌నికొచ్చే మ‌న మెట్టుతో మ‌నం కొట్టుకున్య‌ట్లే’ అన్యాది ఒకాయిమ ఎడం ప‌క్క‌న చెట్టుకింద నుంచి మెల్లంగ‌. అట్ల‌నే అర్ద‌గంట అయినాది. మూడు దాటినా పంప‌ల‌. ఒక‌యిమ లేచి .. ”ప‌దాం పాల్లి ” అన్యాది. ”మూడుకూడా దాట‌ల‌.. ” అన్యాడు రెడ్డ‌య్య చేతి గ‌డియారం చూసుకుంటా. గ‌బ‌గ‌బా అంద‌రూ దావ‌ప‌ట్నారు. నా పాణం స‌గం పోయిన‌ట్లునిపిచ్చాంది. అవాయిచెప్ప‌ల‌తో అడుగులెయ్యాలంటే మ‌జ్జుగా ఉంది. ఏంద‌న్నా తిందామా అనిపిచ్చాంది.  ప‌డుకోని నిద్ద‌ర‌పోదామా అనిపిచ్చాంది.  ‘ఏందిమా ఇంత లేటా’ అన్యా. ”కాపోళ్లంతే కొందురు. ఇచ్చే ప‌దైదురూపాయ‌ల‌కు ప‌దిగంట‌లు కూలి ప‌ని సేపిచ్చారు. అయినా కూలోళ్ల‌ను న‌ల్చ‌క‌తిని ఏం క‌ట్ట‌క‌పోతారు ఈళ్లు పైకి ” అన్యాది మాయ‌మ్మ కోపంగా. ఇంటికి ప‌రిగిత్తపోయిన‌ట్లు అంద‌రూ గ‌బ‌గ‌బా న‌డిచినారు. పైటాల బువ్వ తింటానే.. రోంత సేపు ప‌డుకున్యా. నిద్ర‌లేచే త‌లికి మాయ‌మ్మ సెన‌గ‌వాల్ల పాయ‌సం త‌ట్ట‌లో ఏసుకోని వ‌చ్చినాది. కాలే కాలే సెన‌గ‌వాల్ల పాయ‌సం నాలిక‌మింద ప‌డ‌తానే.. నాలిక సుర్రుమ‌ని కాలినాది. అయినా వ‌ద‌ల‌కుండా.. పాయ‌సం తినేదాంకా నా మంచు నిమ్మ‌ల‌ప‌ల్య‌.
…………………………………………………………..

(ఇట్ల కూలిప‌నికి పోకూడ‌ద‌ను అనుకుంటానే.. చానామాట్లు పోయినా. లెక్కమింద ఆశ మాయ‌మ్మ‌కు ఎక్కువ అనుకుంటాంటి. మాయ‌మ్మ ఆశంతా.. నేను చ‌దువుకుంటే ఇంత ప‌నివాన్ని అయితాన‌ని.. నా కోస‌మే న‌న్ను ప‌నికి పిల్చ‌క‌పొయ్యేది. అట్ల క‌లుపు తియ్య‌ను, చ‌న‌క్కాయ‌ల క‌ట్టె పెర‌క‌ను పోయినా. అయ్య‌న్నీ గుర్తుకొచ్చాంటాయి.మా ఊరిలాగే హైద‌రాబాద్‌లో ఉద్యోగ జీవితం ఉండేది. తీరా ఇంటికి పోయేత‌ప్పుడు అది రాయి.. ఈ విజువ‌ల్ చూసుకో.. ఆ ప్రెస్ మీటు ఉంది.. అని చెప్పే వాళ్లు బాసులు. ఊర్లో భూస్వామ్య‌వ్య‌వ‌స్థ ఇట్ల సిటీలో కార్పొరేటీక‌ర‌ణ అంతే తేడా అనుకున్యా చానా మాట్లు. క‌ష్ట‌జీవుల‌కు యాడైనా ప‌ని త‌ప్ప‌దని ఎన్నిసార్లు మంచులో అనుకున్యానో)

*

 

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు