ఈ కథ గురించి చెప్పేముందు..ఈ కథ నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు నా జీవితం ఎలా ఉందో ఒక చిన్న పరిచయం ఇస్తాను. ఈ కథ నా మీద చూపిన ప్రభావం తెలియాలంటే ఈ పరిచయం చాలా అవసరం.
అది 2017..
ఏ నెలో సరిగ్గా గుర్తులేదు. కానీ వర్షాకాలం అని మాత్రం గుర్తుంది. హైదరాబాద్‌లో ఉన్నాను. మొట్టమొదటిసారి అద్దె ఇంటి జీవితం. నేనూ, ఇంకో ఫ్రెండు ఉండేవాళ్లం. డిగ్రీ పూర్తయ్యి ఏడాది గడిచినా ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నైట్ షిఫ్ట్ ఉద్యోగంలో చేరాను. రాత్రి 10 నుంచి ఉదయం ఆరింటి దాకా డ్యూటీ. రాత్రి 9 గంటలకు బయలుదేరి రెండు బస్సులు మారి ఆఫీసుకు వెళ్లాలి. డేటా ఎంట్రీ చేయడం నా పని. జీవితంలో అదే మొదటి ఉద్యోగం. మహబూబ్‌నగర్ అనే చిన్న పట్టణం నుంచి హైదరాబాద్ అనే నగరంలోకి వచ్చిన నా పరిస్థితి చిన్న చెరువులోనుంచి పెద్ద సముద్రంలో ఈతకొడుతున్న చేపలా ఉంది.
జీవితం చాలా స్తబ్ధుగా గడిచిపోతూ ఉంది. కొత్తదనం లేదు. మూడేళ్ల పాటు కలిసి ఉన్న డిగ్రీ ఫ్రెండ్స్ ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయారు. మరికొందరు దొరికిన ఉద్యోగాలతో అరకొరగా సెటిల్ అయిపోయారు. రోజూ రాత్రి జాగారం. తెల్లావారుజామున 3 నుంచి 4 గంటల మధ్య నిద్రను ఆపుకొని పనిచేయడానికి చుక్కలు కనిపించేవి. ఆరింటికి ఆఫీసు నుంచి బయటపడి బస్సెక్కగానే నిద్రొచ్చేసేది. దిగాల్సిన స్టాప్ దాటేసి చాలాసార్లు ముందుకువెళ్లిపోయేవాణ్ని. ఎవరో నన్ను తట్టిలేపితే, గబగబా ఆ బస్సు దిగేసి మరో బస్సు ఎక్కి వెనక్కి వచ్చేవాణ్ని. ఇదొక డైలీ వ్యవహారంలా మారిపోయింది. ఇక జీవితమంతా ఇలాగే ఉంటుందేమో అని ఒక్కోసారి భయమేసేది. టక్కున ఆ ఆలోచన ఆపేసేవాణ్ని.
ఆ టైంలో మహమ్మద్ ఖదీర్‌బాబు ‘న్యూ బాంబే టైలర్స్’ కథాసంపుటి నా చేతికొచ్చింది. వచ్చింది అంటే, ఎవరో ఇచ్చింది కాదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి నేనే తెప్పించుకున్నాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన రాసిన ‘బాలీవుడ్ క్లాసిక్స్’ సాక్షిలో రెగ్యులర్‌గా చదివేవాణ్ని. ఆ తర్వాత కొన్ని కథలు కూడా చదివాను. ‘ఈయనెవరో భలే రాస్తున్నారే!’ అనుకున్నాను. అప్పటిదాకా యండమూరి నవలలు, స్వాతి సీరియల్స్ తప్ప సీరియస్ సాహిత్యాన్ని చదివింది లేదు. మొదటగా చదివింది ఈ పుస్తకమే.
రెండు కథలు చదవగానే ఇది మామూలు పుస్తకం కాదు అనిపించింది. ఆ తర్వాత చదివిన కథ ‘కింద నేల ఉంది’. చాలా పెద్ద కథ. కథలు అంత పెద్దగా రాస్తారన్న సంగతి అప్పటికి నాకు తెలియదు(ఇప్పుడైతే ఎవరెవరు అలా పెద్ద కథలు రాస్తారా అని ఎదురుచూస్తున్నాను). గంటలో కథ పూర్తి చేశాను. పుస్తకం పక్కనపెట్టి అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. బయట చినుకులు. మనసంతా అలజడి. సిరివెన్నెల పాట విని త్రివిక్రమ్ శ్రీనివాస్ జేబులో చేతులు పెట్టుకొని ఎక్కడికో వెళ్లిపోయినట్టు నాకూ వెళ్లిపోవాలని అనిపించింది. కాళ్లు నిలవడం లేదు. ఆ కథ గురించి ఎవరికైనా చెప్పాలి. ఆ కథను ఎవరికైనా వివరించాలి. ఆ కథ గురించి ఎవరితోనైనా చర్చించాలి. లోలోపల ఇదే తపన. కానీ చుట్టూ ఎవరూ లేరు. నా మనసులో నేనే ఆ కథ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఒకటి, రెండు కాదు.. వారం రోజులపాటు ఆ కథ ధ్యాసలోనే ఉండిపోయాను. ఆ తర్వాత కాలంలో వందల కథలు చదివాను. కానీ ‘కింద నేల ఉంది’ కథ నాలో కలిగించినంత సంచలనం మరో కథ కలిగించలేదు. ఇది సత్యం.
ఆ కథలో మంగలి కథ చెప్పే లేడీ డాక్టర్ నేనే అనిపిస్తుంది ఒక్కోసారి. ఆమె తండ్రిలా బతకాలనిపిస్తుంది మరోసారి. ఆమె భర్త ఆమెకు దూరంగా విదేశాల్లో ఉన్నట్టు, మా అమ్మానాన్నలకు దూరంగా సిటీలో బతుకుతున్న నేను ఆ పాత్రేనేమో అనిపిస్తుంది ఇంకోసారి. 2005లో ఖదీర్ ఈ కథ రాస్తే, 2017లో నేను చదివాను. 2026లో మీరు చదువుతారు. 2036లో మరెవరో! అన్ని కాలాలకూ ఈ కథ సజీవంగా నిలబడుతుంది. ‘అరె..ఇప్పటి పరిస్థితిని భలేగా రాశారే’ అనిపిస్తుంది. అర్బనైజేషన్, క్యాపిటల్ ఎకానమీ, కన్జ్యూమరిజమ్, మాడ్రన్ టెక్నాలజీ.. అన్నీ కలిసి మనుషుల్ని మనుషుల్లా తప్ప అన్ని రకాలుగానూ తయారుచేస్తున్నాయి. లగ్జరీగా బతికేందుకు కావాల్సిన సౌకర్యాలు.. వాటికోసం కావాల్సిన డబ్బు.. ఆ డబ్బు సంపాదించేందుకు మార్గాలు.. అది నిలబెట్టుకోవడానికి పవర్.. చాలామంది ఆలోచనలు వీటి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఆ సాలెగూట్లో చిక్కుకుపోయామని తెలిసీ బయటకు రాలేక మనుషులు పడే అవస్థే ఈ కథ.
ఇప్పటికి ఈ కథ తక్కువలో తక్కువగా ఓ యాభై సార్లు చదివి ఉంటాను. ఎంతోమందికి ఈ కథ గురించి చెప్పాను. ఎంతోమందికి పంపాను. 2017లో నాకు ఈ కథ అర్థమైనదానికంటే 2026లో ఈ కథ నాకు మరింత బాగా అర్థమవుతూ ఉంది. కాలం గడిచేకొద్దీ మరింత లోతుగా, కొత్తగా అర్థమవడమే కథకుండే జీవలక్షణం. అది ఈ కథలో మెండుగా ఉంది. ఎందుకంటే ‘ఈ కథ కింద నేల ఉంది’. మట్టి ఉన్న ప్రతి చోటా కొత్త మొలక పుడుతుంది. అది మరో కొత్త జీవానికి నాంది.
*








❤️❤️