ఎర్రపుంజు

యమధర్మరాజు: ” చిత్రగుప్తా… చకచకా సాక్షులను విచారించాలి గానీ -కథలు చెప్పిస్తున్నావేమిటి? ”

మిటో , అంతా చిత్ర విచిత్రంగా ఉంది…ఒక కొత్త లోకంలోకి వచ్చి పడ్డాను.  ఔనూ .. ఇన్నాళ్లూ నేనెక్కడున్నాను? భూమి మీద జీవితం ముగిసిపోయి ఎంత కాలమైందో , ఆ లెక్కలేమీ  తెలీదు. . ఆ తర్వాత నేను ఏమైపోయానో .. నాకు శరీరం ఉన్నట్టూ లేదు, లేనట్టూ లేదు. మళ్లీ ఇన్నాళ్లకి – ఎవరో పిలిచారు.. “ఎర్రపుంజూ .. ఎర్రపుంజూ..ఎర్రపుంజూ ” అని !

పిలవగానే క్షణాల్లో ఇక్కడున్న పెద్ద తెర మీద ప్రత్యక్షమయ్యాను. ఆశ్చర్యంగా ఉంది.  ఎదురుగా పెద్ద సింహాసనం మీద రాజులాగా ఒకాయన కూర్చుని ఉన్నాడు.  ఆయనకి దగ్గరలోనే -హాలులో ఇంకొకాయన  పుస్తకాలు ముందేసుకుని,  ఓ యంత్రం  మీటలు నొక్కుతున్నాడు.

“చిత్తగుప్తా .. ఇవాళ ఎవరి చిట్టా విప్పుతున్నారు? ”అని అడిగారు ఆ రాజుగారు. “చిత్రగుప్తా” అని పిలుస్తున్నాడంటే – ఆయన యమధర్మారాజేమో కొంపదీసి -అనుకున్నా.  అనుమానమేమీ లేదు. ఇది యమలోకమే. పాప పుణ్యాలను విచారించి తీర్పులు చెబుతున్నారిక్కడ. ఆ హాలులో చుట్టూ యమభటులు కాబోలు,  కొమ్ములూ కోరలతో భయంకరంగా ఉన్నారు.

చిత్రగుప్తుడు :  ” అదిగో కనిపిస్తోంది చూడండి.. ఎర్రపుంజు.  దాని హత్యకేసునీ, అందులో నిందితులైన వాళ్లు చేసిన ఇతర నేరాలనీ విచారిస్తున్నాం యువరానర్‌ ? ‘

యమధర్మరాజు : ఓకే.. ప్రొసీడ్‌..

” చిత్తం ప్రభూ” అన్నాడు చిత్రగుప్తుడు. ఎర్రపుంజువైపు తిరిగి , ”  ఆరోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెబుదువు గానీ” ..  అన్నాడు. ” పుంజు ఏమి చెబుతోందో మీరు కూడా వినండి, అభ్యంతరాలుంటే చెప్పండి ” అంటూ  తనకు కొంచెం దూరంలో – వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ఓ జంటకి చెప్పాడు. ఎక్కడో చూసినట్టుంది వాళ్లను.. ఎక్కడ చూశానబ్బా… ఆయన సుబ్బయ్య కదూ.. ఆ మహాతల్లి శేషమ్మ కదూ.. భూమ్మీద నన్ను పొట్టన పెట్టుకున్నది ఆవిడే కదా..!

చిత్తగుప్తుడు : ఏమిటలా చూస్తున్నావ్‌ ఎర్రపుంజూ..  ఇద్దరూ ఏరు దాటుతూ ఉండగా, సడన్‌గా వచ్చిన వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. వీళ్లిద్దరి పాపపుణ్యాలను  బేరీజు వేయడానికి – సాక్షులను పిలిచి విచారిస్తున్నాం. నీ హత్య ఎలా జరిగిందో వివరంగా చెప్పు. .

—–

పొద్దున్నే దేవుడిని తల్చుకుంటూ తలెత్తి  ఆకాశం వైపు చూశా…నల్లటి మబ్బులు.. రాకాసుల్లా ఆకాశమంతా తిరుగుతున్నాయి. పైగా చల్లటిగాలి. సూర్యుడేమయ్యాడో ? అయిపూ అజా లేడు. వానాకాలం కదూ ? మిన్నూ మన్నూ ఏకమయ్యేలా కురవొచ్చు. అంతలోనే తేలి పోవచ్చు…ఏదీ చెప్పలేం.

“పెద్ద వాన వచ్చేట్టు ఉందమ్మాయ్‌. పనులు ఎంత వరకూ వచ్చాయి” అని  శేషమ్మను అడుగుతోంది పక్కింటి చుక్కమ్మ. శేషమ్మ ఏమి చెబుతుందో అని ఒక చెవి అటు వేసి వుంచా. “అవుతున్నయ్‌ పిన్నీ.. ఆ పాలేరు సచ్చినోడు ఏసోబుగాడు రాకపోయేసరికి మీ అల్లుడు పొద్దున్నే పచ్చగడ్డి కోసుకొద్దామని ఏటవతల పొలం వెళ్లాడు. ఇంకోపక్కన ఇవాళ మధ్యాహ్నం చుట్టాలొత్తన్నారు.. కోటేశు కోసం కబురు పెట్టానులే” అంటూ వాకిలి ఊడ్చే పనిలో మునిగిపోయింది శేషమ్మ.

కోటేశు పేరు విన్న తర్వాత, నా భయం ఇంకా పెరిగింది. అందుకేనేమో,  పైకి చూసి – “దేవుడా నువ్వే దిక్కు ” అని  మనసులోనే దండం పెట్టుకున్నా.  ఆ మబ్బుల్ని చూశాక,  మళ్లీ చీకట్లు కమ్ముకొస్తున్నట్టుగా  చిత్తభ్రమ కలిగింది నాకు. ఉదయమో, అస్తమయమో తెలీని అయోమయం… ఉండుండీ వీస్తున్న చల్లటిగాలికి – శీతలం కమ్మినట్టుంది . చలి జ్వరమొచ్చిందేమో? ఒళ్లంతా వెచ్చగా, కాలిపోతోంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. రంగమ్మ కూతురి పెళ్లి చూపులు నా చావుకొచ్చాయి. ఆ పిల్లను తన అక్క కొడుక్కి చేసుకోవాలని – శేషమ్మకి ఎప్పటి నుంచో వుంది. ఆస్తిపాస్తులకి ఏమీ లోటు లేదు. పిల్ల చామనచాయ  అయితేనేమి, ముఖంలో ఎంత కళో ? ఆ పిల్లను చూసుకోవడానికి అక్క కుటుంబమంతా వస్తోంది. సంబంధం ఖాయమైనట్టే.  ఆ చుట్టాలకి వండి పెడదామని , పొద్దున్నే నన్ను పట్టుకుంది శేషమ్మ.

గాచారం కాకపోతే, దొడ్లో ఇన్ని కోళ్లుండగా- నా ఒక్కదానికే రావాలా ఈ కష్టం. దాని దెవసం చెయ్య. ఆ శేషమ్మకి ఏం వాయవ వచ్చిందో? దానికి ఉప్పలాయి రానూ.. దాని శిరుసు పగల, దాని కాడి గట్ట.. ! పొద్దున్నే గంప కింద ఉన్న కోళ్లన్నింటినీ వదులుతూ – “నువ్వుండవే” అని నన్ను గట్టిగా పట్టేసుకుంది.    ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అర్థమయ్యాక ఎగిరిపోదామని చూశా.. ఆ కంత్రీముండ పడనివ్వలేదు. రెండు మూరల పురికొసతో, ఇదిగో పందిట్లో ఈ గుంజకి కట్టిపడేసింది. అటూ ఇటూ మెసలకుండా.

ఇక చేసేదేమీలేదు…అంతా అయిపోయింది. చావు కోసం ఎదురు చూడ్డమే .  కాసేపట్లో భూమ్మీద  నూకలు చెల్లిపోతున్నాయ్‌ .. ఇప్పటివరకూ బాధను ఉగ్గబట్టుకున్నా.. ఇక నావల్ల కాలేదు. కన్నీరు కారిపోతోంది. నేను ఏడ్చుకుంటూ ఉండగా గేటు చప్పుడైంది. గడగడ  వణికిపోయాను కోటేశుగానీ వచ్చాడేమోనని. వచ్చింది కోటేశు కాదు,  పాల దుర్గారావు.  “హమ్మయ్య”  అని ఊపిరి పీల్చుకున్నాను.

——     —

చిత్రగుప్తుడు : ” ఒక్క నిమిషం ఆగు ఎర్రపుంజూ.. భూమికి లైవ్‌ కనెక్ట్‌ చేయండి. అతడేమైనా చెప్పగలడేమో -.. పేరు పాలదుర్గారావు ” — అంటూ ఆయన చెప్పగానే  ఓ తెరమీద దుర్గారావు ప్రత్యక్షమయ్యాడు.  బెజవాడ గాంధీనగర్‌లో  పాలుపోసి, ఖాళీ బిందెలతో  సత్యనారాయణ పురం రైల్వేస్టేషన్‌ వైపు ( ఇప్పుడు ఆ స్టేషన్‌ లేదు ) వస్తున్నాడు.

చిత్రగుప్తుడు :  దుర్గారావ్‌. నీకు ఈ శేషమ్మ గురించి ఏం తెలుసో అది చెప్పు–

పాల దుర్గారావు : శేషమ్మ గురించి ఏం చెప్పమంటారండీ -ఎంగిలిచేత్తో  కాకిని కూడా తోలదు. బిచ్చగాళ్లు వస్తే చేతులు ఖాళీగా లేవు అని చెబుతుంది. ఖాళీగా ఉంటే ఓ అడ్డెడు బియ్యం వాళ్ల జోలిలో పోసినట్టు… అది ఎంత కక్కుర్తి ముండో నాకు బాగా తెలుసు.

చిత్రగుప్తుడు : కొంచెం వివరంగా చెప్పవయ్యా..

పాల దుర్గారావు : రోజూ పొద్దున్నే వెళ్లి  దూడను వదలమని ఓ కేక పెడతానండీ.  ఆమె పాలు తీస్తున్నంత సేపూ మనం అక్కడే ఉంటే ఫర్వాలేదు. ఒకటి రెండు  అడుగులు బయటికి వేశామో  అంతే సంగతులు. పాలలో అరలీటరు నీళ్లు కలిపేస్తది. గేద రోజూ ఇచ్చేపాలకంటే ఎక్కువిస్తే అనుమానం వస్తుంది కదా.. అదే అడిగితే ” గేదకి నిన్న తెలకపిండీ, చెరుకు దవ్వా బాగా తినిపించాంలే. అందుకే కూసిని ఎక్కువిచ్చింది’ అని ఇకిలించుద్ది. నాకు బొచ్చెడు సార్లు అనుభవం.

చిత్రగుప్తుడు : ఇటువంటి వాళ్లు ఓ పదిమంది ఉంటే, నువ్వు నెత్తిన చెంగేసుకోవాల్సిందే. నీళ్ల పాలలో ఇంకేం నీళ్లు కలుపుతావ్‌? ఇంకేం వ్యాపారం చేస్తావ్‌?  ‘ అని నవ్వాడు. ఆ జోక్‌కి యముడు కూడా చిరునవ్వు నవ్వినట్టు అనిపించింది. దుర్గారావు తెర మీద నుంచి అదృశ్యమయ్యాడు. శేషమ్మ తల సిగ్గుతో వాలిపోయింది.

చిత్రగుప్తుడు : ” ఎర్రపుంజూ – మళ్లీ నీ కథ కొనసాగించు.”

యమధర్మరాజు: ” చిత్రగుప్తా… చకచకా సాక్షులను విచారించాలి గానీ -కథలు చెప్పిస్తున్నావేమిటి? ” – అని చిరాకు పడ్డాడు.

చిత్రగుప్తుడు : ప్రభూ … నన్ను అపార్థం చేసుకోవద్దు. నెట్‌వర్క్‌ చాలా స్లోగా ఉంది. సిస్టమ్‌లో ఉన్న డేటాను, నా రాతప్రతులను – కంపార్‌ చేసుకోవడానికి ఎలాగూ  కాల హరణం జరుగుతుంది..  మొత్తం జరిగిందేమిటో చెప్పటం వల్ల – పుంజుకి కొంచెం ఉపశమనం.. మనకి మిస్‌ అయిన సమాచారం దొరుకుతుందన్న ఆశ.

యమధర్మరాజు : ఓకే, నో ప్రాబ్లమ్‌ . అటులనే కానివ్వండి.

చిత్రగుప్తుడు : చిత్తం ప్రభూ..  ( పుంజువైపు తిరిగి )  ఎర్రపుంజూ .. కొనసాగించు నీ మరణ వృత్తాంతం .

—  —- —

” పుడుతున్నప్పుడు మనం పుడుతున్నామన్న సంగతి తెలీదు. చావు కూడా   మనకి తెలీకుండా వస్తే బాగుండు.  ఆ కోటేశు  ఎప్పుడొస్తాడో, ఎప్పుడు నా  పీక తెగ్గోస్తాడో….తెలిసితెలిసీ మరణం కోసం ఎదురుచూడటం ఎంత నరకం?

నాకేమైనా వయసైపోయిందా? నిన్న గాక మొన్న పుట్టినదాన్ని. అప్పుడే నన్ను తీసుకుపోవడానికి నేనేం పాపం చేశాను అని దేవుడిని నిలదీశా.  వెంటనే నాకో సందేహమొచ్చింది.

దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా కోడిని కాపాడిన దాఖలా ఉందా? పైగా కోళ్లను బలి ఇస్తుంటే సంతోషంగా స్వీకరించటం.. అదేమిటో వాళ్లు చల్లబడటానికి – మనుషులను చల్లగా చూడటానికి కూడా మా వెచ్చటి రక్తమే కావాలి ! ఎంతైనా మనుషులు సృష్టించుకున్న దేవుళ్లు కదా –  అనుకుని సరిపెట్టుకున్నా..

దేవుళ్ల గురించి ఆలోచిస్తుంటే , మా అమ్మ గుర్తొచ్చింది నాకు. అమ్మను  మించిన దైవం ఇంకెవరుంటారు? కన్నీటి పొరల మధ్య ఆమె రూపం  మసకమసకగా మెదులుతోంది.

నన్ను మా  అమ్మ ఎంతో కష్టపడి పెంచింది .  పగలంతా గద్దలు వచ్చి ఎక్కడ తన పిల్లల్ని తన్నుకుపోతాయో అని- ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. ఒకటి రెండు సార్లు నేలమీదకి వాలబోయిన గద్దలను, పైకి ఎగిరి మరీ తరిమికొట్టింది. ఇక రాత్రయితే నిద్ర పోయేది కాదు. అర్థరాత్రి, అపరాత్రి ఏ జంగురు పిల్లులో వచ్చి – గంపల్లో దూరతాయని భయం . అందుకని రాత్రుళ్లు జాగారం చేసేది.

చిన్నప్పుడు నేను ఎంత అమాయకంగా ఉండేదానినో ! ఓసారి చీకటిపడిన తర్వాత, గంపకి ఉన్న కంతలో నుంచి పైకి చూసి – ” అమ్మా అక్కడెవరమ్మా – అన్ని నూకలు చల్లారు. పోయి తిందామా –అని అడిగాను. అప్పుడు అమ్మ నవ్వి -” పిచ్చికన్నా అవి నూకలు కాదు నాన్నా – ఆకాశం పూచిన నక్షత్రాలు. వాటికి కొంచెం పైన స్వర్గముంటుంది’ అని చెప్పి రెక్కలకిందకి తీసుకోవటం నా  కళ్లలో మెదిలింది.

“అమ్మా .. ఎక్కడున్నావమ్మా .  నీ కొడుకు జీవితం ముగిసిపోతుందమ్మా ‘ అని కుమిలికుమిలి , పొగిలి పొగిలి ఏడ్చాను. గుండెలు అవిసిపోయాయి . కళ్లు తిరుగుతున్నట్టు,   సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపించింది.

అలా  సోయి లేకుండా ఎంత సేపు మునగదీసుకుని ఉన్నానో తెలీదు. ఆ మగత నుంచి తెప్పరిల్లే సరికి దప్పికవుతోంది. నాలుక పిడచ కట్టుకుపోతోంది. దగ్గరలోనే గేదల కోసం పెట్టిన నీళ్ల తొట్టి ఉంది కానీ – కాళ్లు కట్టేసి ఉన్న సంగతి గుర్తొచ్చి ఆగిపోయాను.

ఓ గిన్నెలో కాసిని నీళ్లయినా పెట్టొచ్చుగా ఆ దొంగముండ. ఎలాగూ చంపుతున్నాం కదా – నీళ్లెందుకు దండగ అనుకుందేమో? బతికే ఈ కొంచెం సేపు కన్నీళ్లను తాగి బతకాలి కాబోలు.

సరే నా సంగతి వదిలెయ్‌. పాపం ముసలాయన.. పొద్దుటి నుంచి ఎన్నిసార్లు పిలిచాడో?  చాలా సేపు పట్టించుకున్న పాపాన పోలేదు శేషమ్మ. దగ్గు ఎక్కువైనట్టుంది, మళ్లీ పిలుస్తున్నాడు. ” ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో, పని చేసుకోనివ్వడు కదా ”’ అని ఇంట్లోకి  వెళ్లి మంచినీళ్లతో పాటు, ఓ మాత్ర ఇచ్చింది  శేషమ్మ.  కోడలి ముఖం చూడకుండానే బాధనీ, ముందుబిళ్లనీ ఒకేసారి మింగాడు ఆయన.

ముసలాయన ఎంతో కష్టపడ్డాడంట. తండ్రి రెండెకరాలు ఇచ్చి పోతే, ఈయన కష్టపడి ఇంకో ఆరెకరాలు సంపాయించాడంట. సుబ్బయ్య గానీ శేషమ్మగానీ  సంపాదించింది  ఏమీ లేదు.  కష్టపడే అలవాటు లేదు.. ఇవాళ ఒక్క రోజు ఏసోబు రాకపోయేసరికి మొగుడికీ పెళ్లానికీ దుంప తెగుతోంది – పనులన్నీ చేసుకోలేక.  ఆ విసుగు ముసలాయన మీద చూపెడుతోంది దెష్టముండ…ముసలాయనకి టైముకి కాసిని మంచినీళ్లూ, మందుబిళ్లా ఇవ్వడానికి కూడా ఏమి దొబ్బిడాయో ! ఈవిడే ఇలా ఉంటుందా? అన్ని కొంపల్లోనూ ఇంతేనా?

—    —-

చిత్రగుప్తుడు : జస్ట్‌ ఏ మినిట్‌..ముసలాయన ఇన్‌ఫో ఉంది.  ముసలమ్మకి సంబంధించి ఓ ఫైల్‌ కనిపించటం లేదు. సరే దాని సంగతి తర్వాత చూద్దాం-

యమడు: ఆలస్యమైనా ఫర్వాలేదు.  పాప పుణ్యాల అంచనాల్లో తేడాలు వచ్చినచో- యుగయుగాల యమలోక ప్రతిష్ట మసకబారును. టేక్‌ యువర్ ఓన్‌ టైమ్‌..!

చిత్రగుప్తుడు : చిత్తం ప్రభూ ..  ( పుంజు వైపు తిరిగి ) ఈ ఏసోబు ఎవరు? ( అంటూ కంప్యూటర్‌లో చూసి ) పాలేరు కదూ.. భూమికి కనెక్ట్‌ చేయండి.. పేరు ఏసోబు.

వెంటనే తెరమీద ఏసోబు కనిపించాడు. సావాసగాళ్లతో కలిసి బీడీ తాగుతున్నట్టున్నాడు.. ఇదెప్పుడు అలవాటు చేసుకున్నాడో?  వెంటనే ఆర్పి  ఆ సగం బీడీని చెవిలో పెట్టుకున్నాడు.

చిత్రగుప్తుడు : ఏసోబూ .. వాళ్లింట్లో ఎన్నాళ్లు పనిచేశావ్‌.. ఏమి ఇచ్చేవాళ్లు నీకు ..

ఏసోబు : పదమూడేళ్ల వయసు నుంచి పనిచేశాను. తెల్లవారు జామున వెళ్లి, మళ్లీ ఏ రాత్రికో ఇంటికి చేరేవాడిని.  అప్పుడు ఏడాదికి రెండు బత్తాల వడ్లు, రెండు జతల బ ట్టలు ఇచ్చేవాళ్లు. పెద్దయ్యాక నాలుగు బత్తాలు చేశారు.

చిత్రగుప్తుడు : ” చైల్డ్‌ లేబర్‌.. ఇన్‌ హ్యూమన్‌…” అని గొణుక్కుంటూ – కొన్ని పాయింట్లు ఏవో నోట్‌  చేసుకున్నాడు. (పుంజువైపు తిరిగి ) “ఇక నువ్వు కంటిన్యూ చేయి”  అన్నాడు

—–   —

” మేము తెల్లవారుజామున కొక్కోరోకో అని కూస్తాం కదా.. అప్పుడొస్తారు జీతగాళ్లు .. మాలపల్లి నుంచి మాదిగపల్లి నుంచి..

ఏసోబు వచ్చీ రావటంతోనే -గొడ్ల చావడిలో ఉన్న గేదలను బయటకట్టేసి, పేడంతా ఎత్తి, దాన్ని శుభ్రం చేస్తాడు. వాటికి కుడితి పెట్టి, రెండు పనలు వరిగడ్డి వేసి- పచ్చగడ్డి  కోసం పొలం వెళతాడు.

ఏసోబు  రాకపోతే సుబ్బయ్యకి కాళ్లూ చేతులూ ఆడవు. ఎనిమిదెకరాల పొలం.  అందులో రెండెకరాలు కట్నమిచ్చి  ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసి పంపించేశారు. ఇంకా ఆరెకరాల పొలముంది. గొడ్డూ గోదా ఎట్టాగూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటది.

ఏసోబుకి జొరమొచ్చిందంట,  అందుకే ఇవాళ నాగా పెట్టాడు. ఎలా ఉన్నాడో ఏమిటో అన్న జాలి లేకుండా ఆ అబ్బాయిని తిడుతోంది శేషమ్మ..  గొడ్డు చాకిరీ చేస్తాడు కదా?  ఎప్పుడైనా మంచి తిండి పెట్టిందా అంటే అదీ లేదు. ఎప్పుడు చూసినా చద్దన్నం , పచ్చళ్లు, నీళ్ల మజ్జిగ. ఇక జొరం రాకుండా ఎట్టా ఉంటుంది ? చాలా సార్లు అన్నం సయించక – ఆ మెతుకులను కోళ్లకు విసిరేసేవాడు. ఆ మెతుకుల్ని నేను  కూడా ఏరుకున్నాను.

నా దరిద్రం కాకపోతే ,  ఇవాళే జొరం రావాలా ? నేనంటే బాగా ఇష్టం  ఏసోబుకి. ఇవాళ గానీ  వచ్చి ఉంటే,  నా బదులు ఇంకేదైనా కోడిని కోసుకోమని చెప్పేవాడేమో!  వచ్చే సంక్రాంతి పండక్కి- నన్ను తీసుకెళ్లి బరిలో దింపాలని సరదా పడుతున్నాడు. “మనకెందుకురా పందాలు, అయినా అప్పుడు చూద్దాం లే” అనేవాళ్లు ఆ మొగుడూ పెళ్లాలు. ” పందెం వేస్తే మన పుంజు గ్యారెంటీగా గెలుస్తుందండీ ” అని చెప్పేవాడు.

నేనంటే అంత నమ్మకం ఏసోబుకి.  వేరే పుంజులతో నేను కలబడటం, చాలాసార్లు చూశాడు. నేను ఎప్పుడూ బయటపెట్టలతో సరసమాడుతూ , వాటి  ముడ్డెనక తిరిగేదాన్ని.  ఆ రంధిలో పడిపోయి, సొంత పెట్టలను ఎప్పుడైనా మర్చిపోయానా? లేదే?  వాటి జోలికి వచ్చిన బయటి  పుంజుల్ని తరిమితరిమి కొట్టేదాన్ని. ఇంతలావు మగాడు ఇక్కడ ఉండగా, బయటి పుంజులొచ్చి మన పెట్టలకి కన్ను కొడుతుంటే – అది ఎంత నామర్దా? ఒక పుంజుగా నా ధర్మం నేను నెరవేర్చాను.

ఏసోబు చెప్పినట్టు – పందాల్లో పోరాడితే విజయం దక్కేదేమో? లేదంటే ఎలాగూ వీరస్వర్గమే కదా.. ఇప్పుడు మాత్రం ఏమైంది?  ఏ పాపాలూ చేయలేదు కాబట్టి,  స్వర్గానికే వెళతానేమో!  అవునూ.. స్వర్గానికి వెళితే- రంభ, ఊర్వశిలాంటి దేవ పెట్టలుంటాయా? వాటితో గుడ్లు పెట్టించే అదృష్టం దక్కుతుందా?

నా ఆలోచనకి నాకే నవ్వొస్తోంది.  ఓవైపు  చావు భయంతో ఉచ్చ కారిపోతుంటే , మరోవైపు స్వర్గం పేరుతో చొల్లు కార్చుకోవటం ఏమిటో ? ఎవరికైనా  భూమ్మీద అనుభవించింది చాలదు కాబోలు. అందుకే స్వర్గాన్ని, పునర్జన్మలను కల్పించుకున్నట్టుంది.

నేను స్వర్గం గురించి ఆలోచిస్తూ ఉండగా – చుక్కమ్మ గొంతు వినపడింది.. ” ఏమ్మాయ్‌, కోటేశు రాలేదా? అయినా ఆడి కోసం చూసేదేమిటి? నువ్వు కొయ్యలేవూ ” అంటోంది. శేషమ్మ కంటే ముందు, ఈ ముండకి తొందరెక్కువగా ఉంది.. దీని ముదలార !

” నేను కొయ్యలేను పిన్నీ.. ఎంతైనా పెంచిన చేతులతో ఏమి కోస్తాం. ఆ పాపం నేను చేయలేను’ అంటోంది శేషమ్మ.. పెంచిన చేతులతో కొయ్యలేదు కానీ, – ఆ చేతులతోనే మసాలా నూరుతుంది,  ఆ చేతులతో కమ్మగా  తింటుంది. పైగా  పాపమూ, పుణ్యమూ అంటోంది..నంగనాచి తుంగబుర్ర… !

ఈ చుక్కమ్మ వదిలిపెట్టేట్టు లేదు..” నువ్వయినా  కొయ్యొచ్చుగా ” అంది సుబ్బయ్యని. ” నావల్ల ఎక్కడ అవుతుంది అత్తా ” అంటూ ఓ ఆడంగి నవ్వు నవ్వాడు ఆయన.  ” ఓరి నా బట్టా– నీ సంగతి మాకు తెలవదా ? ” అన్నట్టుగా  చూసింది చుక్కమ్మ.  ఆ సంగతి  ఏమిటో చుక్కమ్మకే కాదు, ఊరంతటికీ  తెలుసు.

ఇది  ఎప్పుడో పాతికేళ్ల నాడు జరిగిందంట.  ఊరి చివరన ఉండే రత్తమ్మనీ, వాళ్లాయననీ – పొలం పనుల్లోకి తీసుకెళ్లేవాడు సుబ్బయ్య. అసలే పైలా పచ్చీస్‌ మనిషి. ఆ రత్తమ్మ మీద మోజు పడ్డాడు. ఒకరోజున దాని మొగుడితో కలిసి ఏటవతలకి వెళ్లి , ఒక్కడే తిరిగొచ్చాడు సుబ్బయ్య. ఏరు అప్పటికప్పుడు పొంగిందనీ, అతడు కొట్టుకుపోతే – తాను ఎలాగొలా ఒడ్డుకు చేరాననీ చెప్పాడంట.

“అది ఏం బాగుందిరా ? దానికి సన్నూ సంకా సరిగ్గా లేదు. ఆడికి అది ఎట్టా నచ్చిందో ఏమిటో ? దాన్ని తగులుకున్నాడు. అనవసరంగా దాని  మొగుడిని చంపేశాడు ” అని అప్పట్లో ఊరంతా అనుకున్నారంట.

—–     —

సుబ్బయ్య : ఆగండాగండి.  నేను చంపలేదు స్వామీ. వాడే పూటుగా సారా తాగి ఉన్నాడు, నీళ్లలో కొట్టుకుపోయాడు ..

చిత్రగుప్తుడు : అవునా. ఇప్పుడే తేల్చేద్దాం… భూమికి కనెక్ట్‌ చేయండి .. పేరు రత్తమ్మ .. ( వెంటనే తెరమీద ప్రత్యక్షమైంది)  ఇదిగో రత్తమ్మా- మీ ఆయనను చంపలేదంటున్నాడు సుబ్బయ్య.

రత్తమ్మ : ( కోపంగా చూస్తూ )  ఈత బాగా వచ్చినోడు , నీళ్లలో కొట్టుకుపోతాడా?  ఈ సుబ్బయ్యే – ఆయనకి పీకలదాకా సారా పోయించి, కండువాతో గొంతు పిసికేసి- ఏట్లో పడేశాడు. నువ్వు  కూలినాలి చేసి ఇట్టా ఉన్నావ్‌ గానీ నీ కాలిగోటికి సరిపోదు మా ఆవిడ – అని చాలా సార్లు నాతో అనేవాడు.

అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న శేషమ్మకి –  రత్తమ్మ చెప్పిన మాటలు విని కడుపు రగిలిపోయింది.  మొగుడివైపు  కొరకొరా చూసింది. ఆ కోపాన్ని తట్టుకోలేని సుబ్బయ్య తల పక్కకు తిప్పుకుని – యమభటులవైపు చూస్తున్నాడు.

చిత్రగుప్తుడు : ” హత్య.. వ్యభిచారం.. కేసు లేదు , శిక్ష లేదు. భూమ్మీద ఐపీసీ ( ఇండియన్‌ పీనల్‌కోడ్‌)  బారి నుంచి తప్పించుకున్నాడు.. ఇప్పుడు వైపీసీ ( యమలోక్‌ పీనల్‌కోడ్‌) నుంచి తప్పించుకోలేడు… నరకం తప్పదు”  అని గొణుక్కుంటూ ఏదో రాసుకున్నాడు

అసలే కోపంమీదున్న శేషమ్మ – ” ఈయనను నరకంలోకి పంపిస్తారు కాబోలు.. నేను చేసిన పాపాలు ఏమీ లేవు కాబట్టి స్వర్గానికి వెళతాను ” అని లోలోపల సంతోషపడింది

చిత్రగుప్తుడు : “నువ్వు నీ కథను కొనసాగించు ”- అంటూ ఎర్రపుంజు వైపు చూసి చెప్పాడు ..

——–       —-

” నేను పందిట్లో ఒక్కదాన్నే … బిక్కుబిక్కుమంటూ ఉన్నా.  ఏడుపు కళ్లతో అటూ ఇటూ చూస్తున్నా. మిగతాకోళ్లన్నీ- చీకూ చింతా లేకుండా హాయిగా తిరుగుతున్నాయి. పురుగూపుట్రా ఏరుకుని తింటున్నాయి. గొడ్ల చావడి మీదా, వరిగడ్డి వామి మీదా  ఎగురుతున్నాయి.

ఆ కోళ్లన్నీ దూరం నుంచి అప్పుడప్పుడూ నా వైపు జాలిగా చూస్తున్నాయి. అంతకు మించి అవి మాత్రం ఏం చేయగలవు? ఇవాళ నా వంతు.. రేపు ఏ కోడి వంతు వస్తుందో ?  కోడిజన్మ ఎత్తాక ఎన్నాళ్లుంటామో ఎవరికీ తెలీదు. ఆదివారమనీ, పండగనీ, పుట్టినరోజనీ, దినమనీ, జాతరనీ, చుట్టాలొచ్చారనీ, తిరునాళ్లనీ, సవాలక్ష సాకులతో మమ్మల్ని నిత్యం తింటూనే ఉంటారు ఈ మనుషులు.

“ఎంత కాలము కోడిజన్మము ఎంత కాలము పాడు ఖర్మము.. పెట్టలైనా పుంజులైనా చిట్టచివరికి మాంసమవునూ ‘ అని పెద్ద కోళ్లు తత్వాలు పాడుతుంటే – అప్పుడు చిన్నతనం కదా .. ఏమీ తెలిసేది కాదు.. ఇప్పుడు తెలుస్తోంది అది ఎంత జీవిత సత్యమో.

ఆ  సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడు చేసేదేముంది? ఈ భూమ్మీద అన్ని కోళ్ల మాదిరిగానే,  నేను కూడా మాంసంగా మారబోతున్నాను. నా అంతిమఘడియలు, మరీ దగ్గరకొచ్చినట్టు అనిపిస్తోంది మనసుకి.

సరిగ్గా  ఆ క్షణంలోనే  గేటు చప్పుడైతే, వణికిపోతూ అటు చూశాను.  కోటేశు..నవ్వుకుంటూ లోపలికొస్తున్నాడు. నా కళ్లకి-కొమ్ములు కోరలు లేని యములోడిలా ఉన్నాడు. నా గుండెలు అదిరిపోతున్నాయి. వీడి చేతిలో రాసి పెట్టి ఉంది కాబోలు  నా చావు.

” ఎంత సేపటికి వచ్చావురా నాయనా ..మాంసం నేను కోసుకుంటా. నువ్వు మెడ తప్పిస్తే చాలు.. ” అంటూ ఇంట్లోకెళ్లి కత్తిని తీసుకొచ్చింది శేషమ్మ. దాన్ని అరచేతిలో పెట్టుకుని  అటూ ఇటూ తిప్పుతూ, పదును ఎంత వుందో చూస్తున్నాడు కోటేశు. ఆ కత్తిని చూసి గడగడ వణికిపోయా. తెల్లగా మెరుస్తున్న ఆ పదును చూడలేక కళ్లు మూసుకున్నా.,

భయంతో వణికిపోతున్నా,  ఆలోచనలు మాత్రం ఆగటం లేదు.  శేషమ్మకి మాంసం కోసుకోవటం వచ్చు కదా ? మరి కోటేశు కోసం పొద్దుటి నుంచి ఎందుకు ఎదురు చూసింది?  మాంసం కోసుకోగలిగిన మనిషి,  ఆ మాత్రం పీక కోయలేదా? ఇందులో ఉన్న మతలబు ఏమిటో నాకు అర్థం కాలేదు .

ఈలోగా శేషమ్మ పందిరి గుంజ దగ్గరకి రానే  వచ్చింది.. నా కాళ్లకి కట్టిన తాడును విప్పదీస్తోంది. తప్పించుకోలేనని తెలిసి కూడా గింజుకున్నాను.  రెక్కలు టపాటపా కొట్టుకున్నాను. ఒక చేత్తో నా కాళ్లనూ, ఇంకో చేత్తో రెక్కలనూ గట్టిగా పట్టుకుంది శేషమ్మ.

చేతిలో కత్తి పట్టుకుని , కోటేశు కూడా దగ్గరకొస్తున్నాడు- “రెండు కిలోలు మాంసం అవుద్దమ్మా” అనుకుంటూ.  దేవుడా.. దగ్గరకొచ్చాడు. కత్తిని కంఠం మీద పెడుతున్నాడు. అయిపోతోంది.. అంతా ముగిసిపోతోంది. అమ్మా.. నీ బిడ్డ జీవితం

అంతమైపోతోంది- అని మా అమ్మను తల్చుకుని ఏడుస్తున్నాను.  కంఠనాళం తెగిపోతోంది. భయంకరమైన నొప్పి… నరకం ..  నా నెత్తురు ధారగా చిందటం నాకు కనిపిస్తోంది.

చూస్తుండగానే నా తల మొండెమూ వేరైపోయాయి. మొండెం గిలగిల కొట్టుకుంటూనే ఉంది. నా కళ్లు నిమ్మళంగా మూతలు పడుతున్నాయి. ఆకాశంలో  నల్ల మబ్బులు కరిగినట్టున్నాయి. చినుకులు మొదలయ్యాయి. కాసేపటికి భూమ్మీద  ఉన్న నా నెత్తుటి ఆనవాళ్లు వాన నీటిలో కలిసిపోయాయి.

—       —   –

చిత్రగుప్తుడు : “సారీ ఎర్రపుంజూ.. ! ”  ( టెక్నికల్‌ స్టాఫ్‌ వైపు తిరిగి ) ” పేరు కోటేశు.. భూమికి లైవ్‌ పెట్టండి ”— అని ఆదేశించాడు.  కోటేశు తెరమీదకి వచ్చాడు. చాకిరేవులో పెళ్లాంతో కలిసి బట్టలు ఆరేస్తున్నట్టున్నాడు.

చిత్రగుప్తుడు : ( శేషమ్మ వైపు తిరిగి ) ” ఎర్రపుంజు ప్రాణాలు తీయడానికి కోటేశును ఎందుకు పిలిచావు ?

శేషమ్మ :  జాతర్లయినా, కొలుపులైనా – పెద్ద రైతులు యాటల్నీ, కోళ్లను మొక్కుకుంటే – చాకళ్లు కోయటం ఆనవాయితీ. ఇళ్లలో కోయాల్సి వచ్చినా, వాళ్లనే పిలుస్తారు..ఆ పాపం వాళ్లకి అంటదంటారు.  చాకలోళ్లు చలవ అనీ – వాళ్లు ఎదురొస్తే మంచిదనీ కూడా  అంటారు.  కొన్ని కొన్ని పనులకి కొన్ని కొన్ని కులాలవాళ్లను పిలవటం మామూలే.

చిత్రగుప్తుడు :  ” అవునా..? ” – అన్నాడు ఆశ్చర్యంగా .

శేషమ్మ :  ఇది కూడా తెలీదా మీకు? పెళ్లిళ్లకీ చావులకీ –  చాకళ్లూ, మంగళ్లూ కొన్ని పనులు చేయాలి.  మనిషి పోయినా, గొడ్డు చచ్చినా  మాదిగోళ్లతో పని ఉంటుంది.  ఎలుకల్ని పట్టాలంటే యానాదుల్ని పిలుస్తాం. మరుగుదొడ్ల పని ఉంటే పాకీ వాళ్లు చేయాల్సిందే ! చెబితే చాలా ఉన్నాయిలే !

చిత్రగుప్తుడు : సరే, మిగతాపనుల సంగతి అలా ఉంచుదాం. ఇది ఒక జీవిని చంపటం కదా?  ఆనవాయితీ ప్రకారం వాళ్లు కోసి పెడతారు అని చాలా మంది నేర్చుకోకపోవచ్చు. నీకు కోయటం వచ్చినా – కోటేశు కోసం చూశావంటే , ఆ పాపమేదో అతడి మీద పోవాలనే కదా?

ఈ ప్రశ్నకు  జవాబు  ఏమీ చెప్పకుండా  తల వంచుకుని మౌనంగా ఉండి పోయింది శేషమ్మ.

చిత్రగుప్తుడు  :  చూశావుగా కోటేశూ..కొందరు తమ చేతికి మట్టి అట్టకుండా-  కొన్ని పనులు కిందవాళ్లతో  చేయిస్తుంటారు. చేసే ముందు కొంచెం ఆలోచించండి !

ఆయన చెప్పింది కోటేశుకి ఏమైనా అర్థమైందో లేదో తెలీదు. బుర్ర మాత్రం ఊపి , అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత చిత్రగుప్తుడు – ”  భోజన విరామం తర్వాత – యమధర్మరాజు తమ తీర్పును చెప్పబోతున్నారు” అని ప్రకటించాడు.

—-      —   —

తీర్పు గురించి ఆత్రంగా ఉంది నాకు. తీరికగా ఓ గంట తర్వాత వచ్చిన యముడు  తన సీట్లో కూర్చున్నాడు. కాసేపు తన టేబుల్‌ మీదున్న పేపర్లను తీక్షణంగా  పరిశీలించి –  గొంతు సవరించుకున్నాడు.

”  సుబ్బయ్య, శేషమ్మ అనే ఈ జంటకి సంబంధించి, మా  విచారణ పూర్తయింది. ఇద్దరూ చేసిన నేరాలు, ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. “వైపీసీ”లోని పలు సెక్షన్ల ఆధారంగా  – వీరిద్దరినీ నరకంలో వేయాలని తీర్పునిస్తున్నాను. ” – అంటూ ఓ పేపర్‌పై సంతకం చేశాడు యముడు.

” ఇది అన్యాయం. ఆయనంటే – రత్తమ్మ మొగుడిని చంపాడు. నేను కనీసం కోడిని కూడా చంపలేదు. ఇద్దరినీ నరకంలోకి ఎలా పంపుతారు మీరు ?  ఇది ధర్మమేనా ? ‘ అని యముడి మీద పోట్లాటకి దిగింది శేషమ్మ.

” చిత్తగుప్తా.. ఏమిటీ ధిక్కారం.. మీరే వివరించి చెప్పండి ” అని కోపంగా చిత్రగుప్తుడివైపు చూశాడు యముడు.  చిత్రగుప్తుడు లేచి ” చిత్తం ప్రభూ ‘ అని యముడితో చెప్పి  శేషమ్మ వైపు తిరిగాడు. ” ఒక్క నిమిషం ఆగు శేషమ్మా.. ఎర్రపుంజు మర్డర్‌

కేసులో నువ్వు సూత్రధారివి. ఆ పాపం నీదే!  దాన్ని వదిలేసినా  ఇంకో ముఖ్యమైన విషయం ఉంది.. ఇందాక  సిస్టమ్‌ సరిగా పనిచేయక, ఆ ఫైల్‌ దొరక్క ఇబ్బంది  పడ్డాం. ఇప్పుడు చూడు”  అన్నాడు.

చిత్రగుప్తుడు : ” సుబ్బయ్య తలిదండ్రులకి కనెక్ట్‌ చేయండి ” అని ఆదేశించగానే  వాళ్లు తెరమీదకి వచ్చారు. ( ముసలమ్మ వైపు చూస్తూ ) ” అమ్మా.. మీ కోడలు మిమ్మల్ని ఎలా చూసేదో చెప్పండి ”

ముసలమ్మ : ( వలవల ఏడుస్తూ )  మంచాన పడ్డాక నరకం చూపింది స్వామీ. అన్నం పెట్టకుండా మాడ్చింది. తింటే బట్టలు కంపు చేస్తాననీ, దొడ్లోకి తీసుకెళ్లాల్సి వస్తుందనీ – ఏమీ పెట్టేది కాదు.  నోరు పడిపోయింది కాబట్టి, నేను ఎవరికీ చెప్పుకోలేను కదా.. అదీ దాని ధైర్యం. చాలా సార్లు తిట్టిందీ కొట్టిందీ కూడా ! ఇక బతకటం అనవసరం అని నాకు నేను అనుకునేలాగా చేసిందయ్యా.

చిత్రగుప్తుడు : ”ఒకసారి చుక్కమ్మకి కనెక్ట్‌ చేయండి” — అనగానే చుక్కమ్మ  తెరమీదకొచ్చింది. “చుక్కమ్మా- శేషమ్మ వాళ్ల అత్తగారిని ఎలా చూసుకునేది? ” అని అడిగాడు.

చుక్కమ్మ : యాలకీ పాలకీ ఎప్పుడూ అన్నం పెట్టేది కాదయ్యా. సరిగ్గా చూసుకుంటే ఇంకో ఐదారేళ్లు కచ్చితంగా బతికేదని అమ్మలక్కలంతా అనుకుంటూ ఉంటారు ఊళ్లో.

చిత్రగుప్తుడు : అదీ శేషమ్మా విషయం. మా లెక్కల ప్రకారం, ఆమెకి 76 ఏళ్ల వరకూ బతకడానికి అవకాశముంది. కానీ  నువ్వు నీ ప్రవర్తనతో నెమ్మదిగా చంపుకుంటూ – 70 ఏళ్లకే పైకి పంపించావ్‌.

శేషమ్మ భోరున ఏడుస్తూ “దేవుడా… నేను నీకు పూజలు , పునస్కారాలు ఎన్ని చేశాను.. అన్నీ వృధా అయిపోయాయా.. అయ్యో ‘ అంటూ  శోకండాలు  పెడుతోంది. ఇదంతా చూస్తున్న యముడికి చిరాకేసింది. “సైలెన్స్‌” అన్నాడు ఆయన గట్టిగా .

” మంచి చెడ్డలు నీడల్లా మన వెంట వస్తాయి. సుబ్బయ్యను చూశారుగా, ఏ ఏటిలో ఒకరిని చంపాడో – ఆ ఏటి వరదకే బలయ్యాడు. కేవలం కొన్ని పూజలు చేసినంత మాత్రాన చెడ్డ పనులు మాఫీ కావు. మంచి పనులు చేస్తే  దేవుడు మెచ్చుకుంటాడు. అవే మిమ్మల్ని కాపాడతాయి.  సాటి మనుషుల్ని, జీవుల్నీ ఏ రకంగా హింసించినా పాపమేనని తెలుసుకోండి ”  అంటూ గద భుజాన వేసుకుని వెళ్లిపోయాడు.

అదే పనిగా ఏడుస్తున్న శేషమ్మ భుజం మీద చేయి వేసి – “నేనుంటానుగా నీకేం భయం? ” అంటూ సముదాయిస్తన్నాడు  సుబ్బయ్య.   కాసేపటికి ముక్కు చీదుకుని – “నీకు  రత్తమ్మ మీద ఉన్నంత ఇష్టం నా మీద ఎందుకుంటది?’ అంటూ – మొగుడి చేతిని విసిరి కొట్టింది ఆమె. “నరకంలో నరకం ” అని గొణక్కుంటూ తల పట్టుకున్నాడు సుబ్బయ్య.     వాళ్లిద్దరినీ చూస్తుంటే నాకు విపరీతంగా  నవ్వొచ్చింది.

యముడి తీర్పుతో నాలో సంతోషం పొంగిపొర్లుతోంది. వేళగాని వేళ అని తెలిసి కూడా తమాషాగా  “కొక్కొరోకో” అని అరుచుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్లుకుంటూ తెలియని లోకాలలో  తేలిపోతున్నాను.

*

సాంబయ్య

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప కథ. కృష్ణా జిల్లా భాష. చక్కటి వ్యంగ్యం. ఆకులాలమీద విదిలించిన చెర్నాకోలు.

  • ఎర్రపుంజు కథ చదువుతుంటే ఎన్ని విషయాలు మదిలో మెదిలాయో!
    చదివిన ప్రతి ఒక్కరికీ వారిదైన కోణం నించి కథ అర్థం అవుతుంది.. నడిపిన తీరు చాలా బావుంది.. రచయిత సాంబయ్య/సాంబు కి అభినందనలు

  • సన్నూ సంకా చక్కగా కుదిరిన కథ ఇది.
    సాంబు సార్ తో మాట్లాడుతుంటేనే ఏదో తెలియని ఆనందం. అలాంటిది ఆయన కథ చదువుతుంటే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంది.
    కులాల గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నట్టు గుర్తు. కులం పేరు చెప్పి మనుషుల్ని ఎలా వాడుకునేవారో ఈ కథలో బాగా చెప్పారు.
    ఆయన వ్యంగ్యాన్ని ఆస్వాదించడం తప్ప, అది ఎంత గొప్పగా ఉంది అని చెప్పేంత పెద్దవాడ్ని కాదు.
    ఇంకా ఎన్నాళ్లు ఈ స్క్రిప్ట్ లు రాస్తూ కూర్చుంటాం మాస్టారూ అనేవారు అప్పుడప్పుడు.
    మీ నుంచి ఇంకొన్ని ఎర్రపుంజులు ఆశిస్తున్నాం సర్.

  • మూగ జీవాలకు కూడా హక్కులు వున్నాయి..కానీ వాటిని చంపుకుని తింటారు. జీవ హత్య పాపం అని వారికి పూర్వం బుద్దుడి నుండీ తెలుసు. అందుకని ఆ పాపం తమకి అంటుకొకుండా మరొకరి చేత చంపిస్టారు. లేదా దేవుడు అమ్మ వారి పేరున బలి చేస్తారు కా నీ ఆ పాపం పోతుందా? ఎంతో చక్కని కధ రాసారు సాంబయ్య. మా జంతు రక్షా సంఘం మిత్రులు రాసినట్టె వుంది. ప్రానిమిట్ర శ్రీ పీలా రామకృష్ణ గారి జీవిత కద సాహిత్యం అంతా 650 పేజీలలో రాసాను త్వరలో ముద్రణ జరుగుతుంది. పరవాలేదు మూగజీవాల హక్కుల గురించి ఆవేదన పడే కధకులు మనకు వున్నారు అన్న ధైర్యం కలిగించింది ఈ కధ. రచయితకు నిండా అభినందనలు. తన కధలో సంఘాన్ని కూడా ఈడ్చుకొచ్చి శిక్ష వేయించారు.

  • మంచి కథ. ఆసక్తికరమైన కథనం. ఈ కథలో అనేక లేయర్లు, అంతర్ కథనాలు ఉన్నాయి. సాంబశివునికి శుభాభినందనలు.

  • కథ పచ్చిగా బావుంది. కథనం పండింది. నరకంలోనైనా న్యాయం బతికి ఉంటుందని నమ్మకం కల్పించావు. కథనంలో కవనం.. చుక్కలు నూకల్లా కోడిపిల్లకు కనబడడం ! భేష్ సాంబా! సారీ సాంబయ్యా !

  • సన్నూ సంకా చక్కగా కుదిరిన కథ ఇది.
    సాంబు సర్ తో మాట్లాడుతుంటేనే తెలియని ఆనందం. ఆయన కథ చదువుతుంటే ఆయనే నేరుగా మాట్లాడుతున్నట్టు ఉంది.
    కులాల గురించి కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్నట్టు గుర్తు.
    ప్రత్యేకంగా ఈ కథలో కులాల పేర్లు చెప్పి మనుషుల్ని ఎలా వాడుకునేవారో బాగా చెప్పారు.

    ఆయన వ్యంగ్యాన్ని ఆస్వాదించడమే కానీ, దాని స్థాయి ఇదీ అని చెప్పేంత పెద్దవాడిని కాదు. ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ, ఈ కథ ద్వారా ఆయన శైలి తెలుసుకున్న ప్రతి ఒక్కరికీ ఆ స్థాయి ఏంటో తప్పకుండా తెలుస్తుంది.

    డెస్క్ లో కలసి పనిచేస్తున్నప్పుడు ఎంతకాలం ఈ స్క్రిప్ట్ లు రాస్తూ కూర్చుంటారు మాస్టారూ అనేవారు సరదాగా.,
    మీనుంచి మరిన్ని ఎర్రపుంజులు ఆశిస్తున్నాం సార్..

  • అసలు సిసలు పల్లె భాష. అక్షర దృశ్యం నీ కథ. చాలా బాగుంది సాంబూ.

  • జో కరే.. వో మరే
    ‘కేవలం కొన్ని పూజలు చేసినంత మాత్రాన చెడ్డ పనులు మాఫీ కావు. మంచి పనులు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అవే మిమ్మల్ని కాపాడతాయి. సాటి మనుషుల్ని, జీవుల్నీ ఏ రకంగా హింసించినా పాపమేనని తెలుసుకోండి’- ఇది కోడి కథ మాత్రమే కాదు. మనందరి కథ.

    ఒకరిని మాటలతో హింసించివాళ్లకు ఆ క్షణానికి గొప్పగా ఉండొచ్చు. కానీ కత్తి పోటు కంటే..మాటలతో హింసించడం ఎక్కువ బాధ పెడుతుంది. ప్రేమగా మాట్లాడితే పోయేదేమీ లేదు.

    మాటలతో రంపపు కోత పెట్టడం..కొన్ని పనుల్ని కొన్ని కులాలకు అంటగట్టడం..మన తప్పుల్ని ఇతరుల ఖాతాలోకి నెట్టేయడం..ఇలా ఏం చేసినా అన్నీ రికార్డు అవుతాయి. నోరులేని ఎర్రపుంజులు చెప్పలేకపోవచ్చు. కానీ పైన ఒక శక్తి అన్ని తప్పులకు లెక్కలుకట్టి చక్రవడ్డీ వేస్తుంది. చిన్న కథలో సమాజంలోని వివక్షను, తాత్వికతను, కర్మ సిద్దాంతాన్ని చెప్పిన సాంబుగారికి కృతఙ్ఞతలు.

  • కథ పచ్చిగా బావుంది. కథనం పండింది. నరకంలోనైనా న్యాయం బతికి ఉంటుందని నమ్మకం కల్పించావు. కథనంలో కవనం.. చుక్కలు నూకల్లా కోడిపిల్లకు కనబడడం ! భేష్ సాంబా! సారీ సాంబయ్యా !

  • ఎర్రపుంజు ఎన్నో సంగతులు చెప్పింది. సాంబ రాసిన ఈ కథ బిగి సడలకుండా సాగింది. కృష్ణా జిల్లా యాసను అద్భుతంగా రాశారు. కోడిపుంజుకు నరకలోకంలోనైనా న్యాయం జరిగినందుకు సంతోషం. రచయిత కోడిపుంజుతో పాటు శ్రామిక కులాలు పెద్దల కాళ్ళకింద నలుగుతున్న వైనాన్ని హాస్యస్ఫోరకంగా చెప్పినా దాని వెనకున్న అవమానాలు…అసహాయత మనకు తెలియకుండానే స్ఫురించేలా రాశారు. ఎర్రపుంజు చేసింది కూత కాదు…అసహాయులను మేల్కొల్పే సింహనాదం. రచయిత మరిన్ని మంచి కథలు అందించాలని కోరుకుందాం

  • ఈ కధని చాలా ఆలశ్యంగా ఇవ్వాళే చూశాను. చాలా చక్కని హాస్యం! రాసిన విధానం అంతా బాగా, చదివించేట్టుగా వుంది. ముగింపు ఎలా వుంటుందో అని మధ్యలోనే ఆలోచన వచ్చింది. ఊళ్ళల్లో యజమానులూ, పని వాళ్ళూ ఎలా ప్రవర్తిస్తారో ఎంతో తెలిసి రాసినట్టుంది. యమ ధర్మ రాజునీ, చిత్రగుప్తుణ్ణీ, ఆఫీస్ స్టాఫ్ నీ కధలోకి తీసుకురావడం సరదాగా వుంది. ముగింపు కూడా సహజంగానే వుంది. మొత్తం మీద చాలా శక్తివంతంగా రాసిన కధ ఇది!

  • ఐ పీ సీ సెక్షన్ లో శిక్ష పడకపపోయినా, వై పీ సీ సెక్షన్ లో వారికి శిక్ష పడింది. భలే. చేసిన తప్పులకి ఎక్కడో ఓ చోట శిక్ష పడుతుంది. చక్కని వ్యంగంతో కూడిన హాస్యకథ చాల మందికి చాల చురకలు అంటించింది. రచయిత సాంబయ్య గారికి అభినందనలు.

  • కథ బాగుందన్నా. అబ్జర్వేషన్స్ ప్లస్ వ్యంగ్యం బాగా అమిరాయి. ఖాదర్ చెప్పినట్టు చాలా లేయర్స్ ఉన్నాయి. ఫ్లోలో ఈజ్ తెలుస్తా ఉంది. అప్పుడప్పుడైనా మరికొంత ఎక్కువ చెయ్యి చేసుకోవాలి నువ్వు!

  • సాంబా!
    కధ చాలా బాగుంది. జంధ్యాల సినిమా చూసినంత హాయిగా ఉంది. కామెడీగా చెప్పినా ఒక ఇన్నర్ ఫ్లో లో మధ్య మధ్యలో నీవు టచ్ చేసిన కుల వివక్ష, పెత్తందారీ వ్యవస్థ, తప్పు లేదా పాపం చిన్నదైనా, పెద్దదైనా శిక్ష తప్పదు అన్న నీ అంతిమ తీర్పు కూడా బాగుంది. ముఖ్యంగా పుంజు మీద నీవు కధ అల్లిన తీరు కొత్తగా సాంబా స్టైల్ లో ఉంది. బట్, నీవు సాంబయ్య కంటే నీవు మల్లంపల్లి సాంబశివరావు గానే కధలు రాయడం నాకిష్టం.

  • సమస్యను సమస్యగా చెపుతూనే వ్యంగం, హాస్యం జోడించడంతో ఆ కథకు చదివించే గుణం పెరుగుతుంది. ఈ టెక్నిక్ బాగా వాడుకున్నారు మిత్రమా. కానీ ఎప్పుడు కోడి కూర తిన్నా మీ కథే గుర్తుకొచ్చేట్టుగా ఉంది.

  • ఖాదర్ గారన్నట్టు చాలా లేయర్స్ లో ఉన్న ఈ కథ నాకు బాగా నచ్చింది. వ్యంగ్యం, హాస్యం పోటీ పడ్డాయి. ఎర్ర కోడిపుంజు మాటల్లో నిరుపేద దళిత పాలేళ్ల చాకిరీని వినిపించటం విలక్షణంగా ఉంది.

    కృష్ణాజిల్లా పలుకుబళ్ళూ, తిట్లూ చాలాకాలం తర్వాత విన్నాను. హాయిగా అనిపించింది. కోళ్ళకు నోళ్లొస్తే.. అవి ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా తిట్లనే తిట్టేస్తాయన్నమాట 🙂 అన్నట్టు- ‘కాడి గట్ట’ అనే తిట్టు ఇదే వినటం. నేను విన్నది ‘పాడి / పాడె గట్ట’ అని.

    భూమ్మీద నూకలు చెల్లిపోవటం అనే మాట మనుషుల కన్నా కోళ్ళకే ఎక్కువ వర్తిస్తుంది. ఆ రకంగా ఈ సామెత మరింత అర్థవంతంగా ఉందీ కథలో.

    ‘బాధనీ, మందుబిళ్లనీ ఒకేసారి మింగాడు ఆయన’ , ‘ ఈవిడే ఇలా ఉంటుందా? అన్ని కొంపల్లోనూ ఇంతేనా?’ కథ చివర్లో ‘నరకంలో నరకం’ – ఇలాంటి సహజసిద్ధమైన మెరుపు వాక్యాలు కథనాన్ని ఆసక్తిగా మలిచాయి.

    అన్నట్టు ఈ ఎర్రపుంజు నిజంగానే ‘ఎర్ర’ పుంజులా ఉంది- ఓ చోట నాస్తికత్వ ఆలోచనలతో. చాలా కాలం తర్వాత చక్కని కథ రాసిన సాంబుకి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు