ఎరుకల మాగ్నకార్టా!

ఇవి అడ్రస్ ప్రూఫ్ లు కావు, ఆత్మగౌరవానికి గుర్తులు. ఎరుకల జీవితం గుర్తింపే లేని ఒక నిరంతర యుద్ధం అవడం ఆధునిక సమాజంలో మనం ఎంతటి అసమానతల మధ్య బ్రతుకుతున్నామో తేటతెల్లం చేస్తుంది. 

రిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ళ పక్షమే. రాజులు, రాజ్యాలు, యుద్ధాల గురించి రాసినంతగా… అడవుల అంచుల్లో, ఊర్ల చివర్లల్లో, మురికివాడల బురదల్లో బ్రతుకుతున్న సామాన్యుల గురించి చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు. అదృశ్యమైపోతున్న జీవితాలకు ఒక ‘రికార్డ్’ లాగా నిలబడటం సాహిత్యపు ప్రాథమిక బాధ్యత. సాహిత్యం చట్టాలను మార్చలేకపోయినా కనీసం సాటి మనుషుల పట్ల మన ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని మార్చాలి. అణగారిన తెగల జీవితాలను అక్షరబద్ధం చేయకపోతే, రేపటి తరానికి వాళ్ళ ఉనికి, సంస్కృతి, భాష ఉన్నాయనే విషయమే తెలియకుండా పోతుంది. ‘ఏకలవ్య కాలనీ’ ఎరుకల జీవితాల చుట్టూ అల్లిన మొట్టమొదటి తెలుగు కథా సంపుటి. ఇప్పటివరకు అడపాదడపా పాత్రలుగా మాత్రమే కనిపించిన ఈ మనుషులు, ఈ పుస్తకంతో కథానాయకులుగా మారి తమ గొంతును వినిపిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ఎరుకల కథా సంపుటి రావడం ఒక చారిత్రక అవసరం, అది బాలాజీ గారి లాంటి మంచి రచయిత ద్వారా జరగడం ఆ వర్గ ప్రజల అదృష్టం. ఆ అట్టడుగు వర్గాల జీవితాలను కేవలం సానుభూతితో కాకుండా, ఒక ఆత్మీయమైన గౌరవంతో చూపించడం ఆయన రచనలోని గొప్పదనం.
‘ఏకలవ్య కాలనీ’ కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఎరుకల జాతి ఆత్మకథ. ఇది ఎరుకల ఆత్మగౌరవ ప్రకటన. ఇది ఎరుకల మాగ్నకార్టా.
ఈ కథల్లోని వాస్తవం, ఆర్ద్రత, సామాజిక స్పృహ- మూడూ కలిసి మనమీద ముప్పేట దాడిచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పాఠకుడిని సౌకర్యవంతమైన కుర్చీలో నుండి పైకి లేపి, ఎరుకల కాలనీలోని విసిరేస్తుంది. ఆ పందుల మధ్య, ఆ గాడిదల మధ్య నిలబెడుతుంది. ఆ మురికి వాడల్లో పాదయాత్ర చేయిస్తుంది. స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలని ‘గాడిదలు, పందులు కాసేదానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోతారు’ అని టీచర్లు తిట్టడం ఎంత అన్యాయం అని గర్జిస్తుంది. గాడిదలను, పందులను కాసే పనులు హీనమైన, నీచమైన పనులని అంత చిన్నపిల్లలకు అట్లా తప్పుగా ఎందుకు చెబుతున్నారని నిలువునా నిలదీస్తుంది. ‘మాకు గాడిదలు కాయడం, పందులను పెంచడం రెండూ గొప్ప పనులే. మా ఇళ్లల్లో మనుషులు ఎంతో ఆ జీవాలు కూడా అంతే’ అని మనకు తెలియయని ఒక జీవన విధానపు గీతాసారాన్ని బోధిస్తుంది.
‘ఎరుకల’ అనే పేరు ‘ఎరుక’ అనే పదం నుండి వచ్చిందనీ, ఈ తెగ మహిళలు భవిష్యత్తును ఊహించి ‘సోదె’ చెప్పడం వల్ల వీరిని ‘ఎరుక చెప్పేవాళ్ళు’ లేదా ‘ఎరుకలవాళ్ళు’ అని పిలుస్తారనీ, ఆంధ్రా తెలంగాణల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాచీన తెగకి ‘కుర్రు భాష’ అనే సొంత స్వరం ఉందనీ, బ్రిటిష్ పాలనలో తెచ్చిన ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ వీరిని ‘పుట్టుకతోనే నేరస్తులు’ అని ముద్ర వేసిందనీ… మనకు తెలియని ఎన్నో చారిత్రక సత్యాలనీ, మనం చేసిన ఎన్నో చారిత్రక తప్పిదాలని మనకే ఎరుక చేస్తుంది ఈ పుస్తకం. స్వాతంత్ర్యం వచ్చి శతాబ్దం కాబోతున్నా ఎరుకల మీద పడిన నేరముద్ర ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. నో డౌట్.. బాలాజీ గారి రచనలు ఆ ‘ముద్ర’ని చెరిపేయడానికి ఉపయోగపడే ‘ఎరేజర్ టూల్స్.’
ఇందులో 18 కథలు ఉన్నాయి. ఇవన్నీ నిజ జీవిత గాథలు, బాధలు, వ్యథలూ. ప్రతీ కథ ‘ఎరుకల’ జీవన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఎరుకల అస్తిత్వ పోరాటం, తమ సంప్రదాయ వృత్తులను వదిలేసి ఆధునిక సమాజంలో కలిసిపోవడానికి చేసే ‘కల్చరల్ అడ్జస్ట్ మెంట్’ ప్రయత్నాల్లో వాళ్ళు పడే ఇబ్బందులు, గౌరవంగా బ్రతకడానికి వాళ్ళు పడే పాట్లు చదువరులను కలవర పెడతాయి. మనం కూడా ఆ కాలనీలోని ఇళ్ళ మధ్య తిరుగుతున్నట్టు, ఆ మనుషులతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తెలుగు సాహిత్యం ఇప్పటివరకూ చూడని ఒక కొత్త కోణాన్ని ఈ పుస్తకం మనకు చూపిస్తుంది.
అడవి బిడ్డలైన ఎరుకల దగ్గర గొడ్డళ్లు, కత్తులు లాక్కుని, వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న కట్టెల మోపులను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా సొంతానికి వాడుకోవడం, పాత నేరస్థుల జాబితాలో వాళ్ళ పేర్లు ఉండటం, తప్పు చేసినా చేయకపోయినా పోలీసులు వాళ్ళను వేధించడంలాంటి వాస్తవాలు చదువుతుంటే మనకు రక్తం మరుగుతుంది. అక్కడక్కడా ఆవేశం కూడా కలుగుతుంది. తెలిసో తెలియకో ఈ అన్యాయంలో, ఈ వ్యవస్థలో మనమూ భాగమైనందుకు ఎక్కడోచోట గిల్టీగా ఫీలవుతాం కూడా.
బాలాజీ గారి రచనలో సహజత్వం ఉంది. కాలనీలోని కాంతమ్మత్త, కాపాలి, జయమ్మ, ఒంటి కన్ను నారాయణప్ప, సోది చెప్పేవాళ్ళు, బాతులు మేపేవాళ్ళు… ఇలా ప్రతి పాత్రలోనూ ఒక జీవం ఉంది. ఎరుకల మహిళల ధైర్యం, కుటుంబం కోసం వాళ్ళు పడే కష్టం, వాళ్ళ తెగువ ఈ గాథల్లో హైలైట్‌గా నిలుస్తాయి. ‘నాలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మాటలు నాలోపలే ఉంటాయి’ అన్న వాక్యం, ఈ పుస్తకం చదివిన ప్రతి పాఠకుడి అంతరాత్మలోనూ ప్రతిధ్వనిస్తుంది. పైకి ఇవి కేవలం ఎరుకల కథల్లాగా కనిపించినా, నిజానికి ఇవి రక్త మాంసాలున్న మనుషుల కథలు.
చిన్నప్పటి నుండి కళ్ళ ముందు కదలాడిన జీవితాలను, అనుభవించిన బాధలను, అంతులేని దుఃఖాలను అక్షరాల్లోకి అనువదించడం అంత సామాన్యమైన పని కాదు. ఇది కేవలం కథలు రాయడం కాదు. రచయిత తనలోని ఒక నిరంతర గాయాన్ని, పదేపదే వేధించే ఒక శోకసంద్రాన్ని అక్షరాలుగా మార్చి కాగితంపై కుమ్మరించడం. ఆ గాయం ఎంత లోతైనదో ప్రతి వాక్యంలోనూ మనకు కనిపిస్తుంది.
‘ఎరుకలు  కోరుకుంటున్నది ఆస్తులు, అంతస్తులు కాదు. ఈ దేశ పౌరులుగా తమ ఉనికిని చాటుకునే ఆధార్ కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఓటర్ కార్డులు మాత్రమే’ అని రచయిత అనడంలోనే ఒక అస్తిత్వ నినాదం ఉంది. ఇవి అడ్రస్ ప్రూఫ్ లు కావు, ఆత్మగౌరవానికి గుర్తులు. ఎరుకల జీవితం గుర్తింపే లేని ఒక నిరంతర యుద్ధం అవడం ఆధునిక సమాజంలో మనం ఎంతటి అసమానతల మధ్య బ్రతుకుతున్నామో తేటతెల్లం చేస్తుంది.
ఈ కథల్లోని భాషా, యాసా, పాత్రల చిత్రణ, జీవిత చిత్రణ, వాక్యాల్లోని సత్యం తత్వం నూతనత్వం, బాలాజీ గారి రచనా పటిమ- ఇవన్నీ చూస్తుంటే, ముందు ముందు ఈ పుస్తకాన్ని తెలుగు సాహిత్య రంగంలో అణగారిన వర్గపు జీవితాలను చిత్రించిన కొన్ని గొప్ప పుస్తకాల సరసన చేరే పుస్తకంగా గుర్తిస్తారని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఎక్కడైతే అణగారిన జీవితాలకు అక్షరం తోడుగా నిలుస్తుందో… అక్కడ ఒక కొత్త ‘మాగ్నకార్టా’ పుట్టినట్టే.
అందుకే ఇది ఎరుకల మాగ్నకార్టా!
పలమనేరు బాలాజి ఏకలవ్య కాలనీ కథా సంపుటి పుస్తకం కోసం: పలమనేరు బాలాజి,9440995010

స్వర్ణ కిలారి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమీక్ష స్నిగ్ధంగా గాఢంగా వుంది. కథల్ని మళ్ళీ తిరిగి చెప్పకుండా కథల అంతస్సారాన్ని పట్టి చూపారు. రచయిత సమీక్షకులు ఇద్దరికీ అభినందనలు

  • కథల్లోని వాస్తవికత, జీవన సౌందర్యం మీ సమీక్ష లో ప్రతిబింబిస్తుంది. మంచి కథలకు మరింత దగ్గరచేసే పరిచయం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు