ఇంటి లోపాలను మరమ్మత్తు పనులు
బయటి లోకానికి వెల్లడి చేసినట్టు
చికిత్సలు జీవ శైథిల్యాన్ని
పరులకు తెలియపరచటమేమిటి.
రోగాలు,నొప్పులు యిలా
ఈగల్లా ముసరటమేమిటి.
ఇన్నేళ్లు గుప్తంగా, నిశ్శబ్దంగా పనిచేసిన అవయవాలు
ఒకటొకటిగా సమ్మె ప్రకటించటమేమిటి.
ఆఖరికి తన అనుచరుడే జీసస్ ను అప్పగించినట్టు
జీవితాంతం నమ్ముకున్న ఒక అవయవం
మృత్యువుకి తలుపు తెరవటమేమిటి.
పువ్వుని అందంగా వాడిపోనిచ్చి,
ఆకుకి తన చివరి రంగుతో మురిసిపోయే
అవకాశమిచ్చిన శిశిర వైభవం
మనిషిని మాత్రం శక్తిహీనంగా,
కళాహీనంగా మార్చే
శాపంలా ఆవహించటమేమిటి.
చుక్కలా తెగి రాలిపడటం కాదు
చంద్రునిలా పెరిగి తరగటమే జీవలక్షణమని
బ్రతుకుకొక తడవగా
ప్రకృతి రుజువు చెయ్యటమేమిటి.
*








Add comment