ఊపిరి సాక్షిగా

గరం తన గొంతులో ఏదో పచ్చి గాయాన్ని దాచుకుంటోంది
వీధుల నిండా నిశ్శబ్దంగా నడుస్తోంది యుద్ధపు నీడ…
కానీ నా లోపల, కన్నీళ్లన్నీ ఆవిరై
మౌనం పేరుకుపోతోంది..

నల్లటి పొగ ఆకాశాన్ని మింగేస్తూ ముఖం మీదికి వస్తోంది
నా శ్వాస నాకే ఒక పరాయిదవుతుంది
బయట కూలుతున్న ప్రతి గోడ చప్పుడూ
నా లోపల నన్ను ముక్కలు చేస్తోంది.

నిన్నటివరకు నాచేతుల్లో ఒక పుస్తకం ఉండేది
పిల్లల నవ్వుల తడి, ప్రణయగాధలు ఉండేవి ,
ఇప్పుడు అక్షరాలు రాయాల్సిన నా వేళ్లు… భయంతో శూన్యాన్ని అల్లుకుంటున్నాయి.
ఆ శూన్యంలోంచే చూస్తున్నాను…
నా కళ్ల ముందే కాంక్రీటు శిథిలాల కింద
నా గత జీవితపు గుర్తులన్నీ నలిగి బూడిదవుతున్నాయి.
రేపు చరిత్ర ఏ దేశం గెలిచిందో లెక్కలు రాసుకోవచ్చు,
కానీ నా చుట్టూ ఆగిపోతున్న ఊపిరుల సాక్షిగా
నేను ఏమని కవిత్వం రాయాలి?

నా లోపల ఒక విచిత్రమైన భయం…
బ్రతకాలనే ఆరాటం ఒకవైపు,
మిగిలాననే నేరభావన మరోవైపు.
యుద్ధంలో రాలిపోయే ఒక్కొక్కరి వెనుక
ఆరిపోని కన్నీటి దీపమో ,దిక్కుతోచని నిరీక్షణో మిగిలే ఉంటుంది కదా?

ఇదేనా మనం వెలిగించుకున్న నాగరికత?
జ్ఞానపు కాంతుల్ని వెతుక్కుంటూ వచ్చి…
చివరికి మనుషుల్ని బూడిద చేసే మంటల నీడన నిలబడ్డామా?

ఆకాశం ముక్కలై రాలుతోంది, భూమి వణుకుతోంది
కానీ ఈ అలజడి అంతా ముగిసిపోయాక
రేపు మిగిలే ఆ శూన్యాన్ని భరించడం ఎలా?
మనసుకి అంటుకున్న ఈ యుద్ధపు మసిని
ఏ నదిలో కడగాలి?
నేను సైనికుడిని కాను, శత్రువుని కాను
నేను కేవలం ఒక ఆర్ద్ర హృదయాన్ని…
యుద్ధపు కాళ్ల కింద నలిగిపోతున్న
ఒక అనామక అంతరంగాన్ని.
యుద్ధం రేపు ముగిసిపోవచ్చు…
కానీ నా లోపల నలిగిపోయిన అక్షరాల సాక్షిగా,
నేనిక ఎప్పటికీ పాత మనిషిని కాలేను.

*

లావణ్య సైదీశ్వర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent
    ఈ యుద్ధపు మసి ని ఏ నదిలో కడగాలి

  • నా కళ్ల ముందే కాంక్రీటు శిథిలాల కింద
    నా గత జీవితపు గుర్తులన్నీ నలిగి బూడిదవుతున్నాయి.
    👏👏

  • “నేను సైనికుడిని కాను, శత్రువుని కాను… నేను కేవలం ఒక ఆర్ద్ర హృదయాన్ని” అనే ముగింపు బాగుంది.. యుద్ధం బయట కంటే ముందు మనిషి లోపలే విధ్వంసం సృష్టిస్తుందనే సత్యాన్ని బాగా వ్యక్తీకరించారు. ఈ కవిత మానవత్వం తరఫున చేసిన సాక్ష్యం. అక్షరాలు కూడా ఏడవగలవని నిరూపించిన కవిత ఇది. యుద్ధపు బూడిదలో మానవత్వపు మిగిలిన చిగురును వెతికే ఈ కవిత పాఠకుడి మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. అభినందనలు.💐💐💐

  • మంచి యుధ్ధం వ్యతిరేక కవిత. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.