రాత్రిని తలగడ చేసుకున్నాను,
నేల పరుపు అయిపోతుంది
నా వెన్నెముక వెచ్చదనం తగలాగానే.
గాలి దుప్పటి చలి నుంచి
కాపాడుతుంది.
గోడల్లేని జగత్తు ఇది
యాంత్రికమైనవేవీ లేవు ఇక్కడ
దిక్కులున్నాయి కానీ
సంపదకు నిశానీ లాంటి
నివాసాల అడ్డుగోడల్లేవు
అంతా బహిరంగమే
రహస్యం అంటూ ఏముంటుందీ
సొంతమనే వస్తువుల ఊసే లేని చోట-
నింగి ఎలాగూ ఓ గొడుగే!
ఆరుబయలెలాగూ నిత్య విడిదే-
నిబధ్ధమైన నా నిర్భయత్వం లోకి
అడుగిడండి.
ఖరీదైన సుఖాలను కోల్పోడానికి
సిధ్ధపడి సర్వానందం ఇచ్చే కష్టాల్లోకి దారితీయండి
స్థలకాలాలతో సంబంధం లేని
అంకెలతో సంఖ్యలతో పని లేని
ఈ చోటులో భయానికి చోటే లేదు
ప్రకృతి తల్లి
పంచభూతాలు తోబుట్టువులు
భువనమంత కుటుంబం
పోగొట్టుకోవడానికి ఏమి లేని
సంపదలేమిని రుచి చూడండి
కలలను కళ్ళు జోకొడతాయి
నిదురకి మెలకువ జోల పాడుతుంది
జీవితపు మడుగులో
చంటి చేపలై నగ్న జలత్వం
లో ఈదులాడండి
ఆనందబాష్పాలతో కడగబడ్డ
స్వచ్ఛమైన నవ్వుల్లో జీవించడం ఏలాగో తెలుసుకోండి
ప్రేమ మధువు ఇచ్చే అంతర్మోహం రుచి తెలుసా?
మరణమనే ప్రశాంత వనంలోకి
కనుమరుగయేదాకా బతుకు ఓ సుందర ఆనందవిన్యాసం ఇక్కడ
ప్రేమ పంచుతాం ప్రేమ పొందుతాం
ప్రేమలో ఐక్యం అయ్యే మానవోత్తములతో
సహవాసం సహ ప్రయాణం చేస్తూ ఉంటాం
ఈ ఆనందం ఏ ఒక్కరి సొత్తూ కాదు
అందరికీ అందుబాటులో ఉండే
మధుపాత్రలో తేనీరు-
నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా
నిరామయంగా నిదానంగా
ఒక్కో చుక్క ఇచ్చే ఆనందం లో
ఒక్కో జీవితకాలాన్ని అనుభవించండి…
జీవించడం అనే కళా సాధన కోసం మాత్రమే
ఇక్కడకు రండి-
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం








ప్రేమ మధువు ఇచ్చే అంతర్మోహం రుచి తెలుసా?
తెలియదు కామ్రేడ్