ప్రస్తుతం భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలకు కనీస జవాబుదారితనం లేదు. ఉండాలని కూడా అనుకోవడం లేదు. ఉండకూడదు అనేది విధానంగా అమలు చేస్తున్నారు.
కనీసం మనిషి అంటే ఓటరు అనే గౌరవం కూడా ఇవ్వడం లేదు. లొంగి ఉండాలి. తలెత్తకూడదు. ప్రశ్నించకూడదు.
మాట్లాడకూడదు. సభలు పెట్టుకోవడం నిషేధం. ఏలిన వారివి కాని భావాల గురించి మాట్లాడుకోవడం నేరం . నిరసన తట్టుకోలేరు. నిరసన దీక్షలను ఖాతరు చేయరు. గుడ్డితనమూ చెమిటితనమూ తనకు తానుగా తెచ్చిపెట్టుకుని ప్రభుత్వాలు ప్రజల గోడు కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు.
సోను వాగ్ముంచుక్ ఢిల్లీలో జంతర మంతర్ దగ్గర ఇరవై రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం కిమ్మనడం లేదు. ఆయన ప్రాణం అంటే ఖాతరు లేదు. కనీసం చర్చలకు పిలవడం లేదు.తనంతట తనే ఉపసంహరించాలి. ఒకవేళ ఆయనకేమైనా జరిగితే ఈ దేశంలో విచ్చిన్నకారులందరూ కలసి ఆయన్ని చంపేశారని కేసులు పెట్టడం కోసం చూస్తున్నట్టు కనిపిస్తోంది.
కనీసం అరెస్టు చేసి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం దాన్ని ఆందోళనకారులు నిరసించడం ఇలాంటి సంఘటనలు మనం అనేకం చూశాం.
ఈ ప్రభుత్వం నుంచీ అలాంటివి ఆశించడం అత్యాశేనేమో … మీ చేతులతో మీ కళ్లనే పొడిపించేస్తా … మీ చేత్తో మీ పీకే పిసికించేస్తా అన్నట్టు వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
మేం చేసేది మేం చేస్తాం. ఇష్టం ఉంటే పడుండండి లేకపోతే స్వచ్చందంగా ఎలిమినేట్ అయిపోండి.
లొంగిపోతారా లేక అదృశ్యమౌతారా? ఇదే ప్రశ్న ప్రతి సమూహం పీకల మీదా కత్తిలా వేలాడుతోంది.
వాంగ్చుక్ గురించి కాంగ్రెస్ పార్టీ నుంచీ ఇంతవరకూ ఎందుకు స్పందన కనిపించడం లేదు. పార్లమెంటులో ఉన్న విపక్షసభ్యులందరూ కలసి ఓసారి వెళ్లి ఆయన్ని పరామర్నించి రావచ్చు కదా … ఎందుకు ఆ పని జరగడం లేదు?
ఇవి కీలక ప్రశ్నలు.
ఆయనేమీ తన సొంత సమస్యలపై నిరాహారదీక్ష చేయడం లేదు. పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల ప్రాణం కోల్పోయిన భారతీయ విద్యార్ధుల మరణాలకు సమాధానం కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
ఆయన్ని కాపాడుకోవడం ఇప్పుడు దేశంలో పోటీ పరీక్షలకు వెడుతున్న ప్రతి విద్యార్ధి బాధ్యత. ప్రభుత్వం మెడలు వంచి వాంచుక్ ప్రాణాన్ని కాపాడుకోడానికి దేశవ్యాప్త ఆందోళన జరగాల్సి ఉన్నది.
అలాంటి కార్యక్రమం జరగకుండా చూడడానికి పడరాని పాట్లూ పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే దేశంలో ఎన్డీయేతర పార్టీల పరిస్తితి కూడా గందరగోళంగాఉన్నది. అన్ని పార్టీలనూ బిజేపీ అనే భూతం ఆవహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీయే కు ప్రత్యామ్నాయం యుపిఎనో లేక ప్రస్తుతం ఇండియా కూటమో అనుకుంటే పొరపాటే.
తెలంగాణలో చూస్తున్నాం కదా…
నియంతృత్వ దొర రాజ్యం పోయింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది అని గంభీరంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వ్యవహరిస్తూ … విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించింది.
విప్లవోద్యమంలో అసువులు బాసిన పాక హనుమంతు రచనల ఆవిష్కరణ సభపెట్టుకుంటాం అంటే అనుమతి లేదు అన్నది. హైకోర్డు జోక్యం చేసుకుని పర్మిషన్ ఇచ్చింది.
నిజానికి హాలు మీటింగులకు అనుమతి అవసరం లేదు. నిజానికి బహిరంగ సభలకు కూడా అనుమతి అవసరం లేదు. కేవలం సభ జరిగే ప్రదేశం పౌరజీవనానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదా లేదా అన్నది ఒక్కటే పరిశీలించే బాధ్యత పోలీసులకు ఉన్నది. అలాగే మైకు పర్మిషన్ తీసుకోవాలి. అంతే … హాలు మీటింగులకు పర్మిషన్ అవసరమే లేదు.
కానీ వీళ్లు ఈ మీటింగ్ హాల్ నిర్వాహకులను బెదిరించి వాళ్లకు అద్దెకివ్వకండి వీళ్లకి అద్దెకివ్వకండి అని జులుం చేస్తున్నారు. మరి అదేం ప్రజాస్వామ్యమో వారికే తెలియాలి.
తెలంగాణలో ఇలాంటి ప్రాక్టీసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు అంకితమై నిలబడుతుందని నమ్మేదెట్లా?
ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడలేకపోతున్నాంగానీ రేపెప్పుడైనా అధికారం పోతే తప్పనిసరిగా ప్రజాస్వామ్య గీతాలాపన చేస్తాం అలాగే అప్పటి ప్రభుత్వం కనుక ఇలానే సభలకు అనుమతి నిరాకరిస్తే మీతో భుజం కలిపి తెబ్బలాడుతాం అంటాడేమో సిఎం రేవంత్ రెడ్డిసారు.
ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకువెళ్లే ఏ ప్రయత్నాన్నీ వారు అంగీకరించడం లేదు. దేశంలో అన్ని రాజకీయపార్టీలనూ వారి కంట్రోల్ లోకి తీసేసుకున్నారు. కేసుల్లో ఇరికించి కొందరిని అదుపులోకి తీసుకుంటే… హిందూత్వ ఆపరేటివ్ సిస్టమ్ ద్వారా ఇంకొందరు విపక్ష నేతను కంట్రోల్ లోకి తీసుకున్నారు.
దేశంలో మెజార్టీ మతంగా ఉన్న హిందూమతాన్ని భయాందోళనల్లోకి నెట్టేయడం అనేది భారతీయ జనతాపార్టీ చేసిన మొదటి కుట్ర. అద్వానీ ఎనభై దశకం ప్రారంభంలో చేసిన ఏకాత్మతా యజ్ఞం ఈ క్రతువుకు అంకురార్పణ.
ఏకాత్మ అంటే హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేషన్ కార్యక్రమం. ఏక ఆత్మగా హిందూ ఆత్మల్ని మార్చడం. ఇందుకోసం వారెంచుకున్న మార్గం మైనార్టీల నుంచీ హిందూ మతానికి ప్రమాదం ఉన్నది అనే ప్రచారం. పర్సనల్ లాస్ పేరుతో మైనార్టీల సంతుష్టీకరణ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ .. దీని వల్ల ముస్లింలు ఒక్కొక్కరు అనేక వివాహాలు చేసుకుని అనేక మంది సంతానాన్ని కనేసి జనాబాలో వారి శాతం పెంచేసుకుని భారతదేశంను ముస్లిం దేశంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు … అలాగే మత మార్పిడి చేయడం ద్వారా క్రైస్తవులు ముస్లింలు కలసి హిందూ సమాజాన్ని జనాభా రీత్యా పలచన చేస్తున్నారు.
ఒక వేపు ముస్లింలు బహుభార్యాత్వం అంటుంటే హిందూ సమాజంలో ఏకపత్నీ విధానం పిల్లల్ని కనడం లో కూడా నిబంధనలు కుటుంబ నియత్రణలు … ఇలా చేయాల్సినంత విష ప్రచారం స్కూల్ పిల్లలనుంచీ మొదలుపెట్టి అన్ని ఏరియాల్లోకీ విస్తృతంగా పంపిణీ చేశారు.
హిందూమతంలో ఉన్న ఉదారవాదాన్ని ఓ పద్దతి ప్రకారం చంపేశారు. పక్క మతాల పట్ల విద్వేషభావాలను నింపేశారు. అందుకోసం విపరీతంగా గుసగుసల ప్రచారం చేశారు. సోషల్ మీడియా కన్నా ముందే ప్రతి పది ఇళ్లకీ ఓ కార్యకర్తను పెట్టి మరీ ఈ విద్వేష ప్రచారం యుద్ద ప్రాతిపదికన నడిపించారు.
విశ్వహిందూ పరిషత్ ఉండగానే గాయత్రీ పరివార్ , హిందూ బాల చైతన్య , యువతీ భారతి, ధర్మ రక్షక్ దళ్ , భజరంగదళ్ గోరక్షాదళ్ హిందూ యువజాగరణ సమితి ఇలా చిత్ర విచిత్ర పేర్లతో సంఘాలు పెట్టి వాటి కింద యువతను రిక్రూట్ చేసుకుని ధార్మిక ప్రచారకులుగా వారిని హిందూ కుటుంబాలకు పరిచయం చేసి వారికి వారానికి ఒక పూట మీ ఇంట్లో భోజనం పెట్టండి చాలు అని చెప్పి గృహాల్లోకి ఎంట్రీ పాసులిచ్చి …
ఇలా ఇంటింటికి మెదడు మెదడుకీ తాము చేర్చాలనుకున్న భావజాలాన్ని చేర్చసాగారు.
సోషల్ మీడియా వచ్చాక ఈ ప్రక్రియ ఇంకా ఎక్కువైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సినిమాలను కూడా అద్భుతంగా వాడేసుకుంటున్న పరిస్థితి మనకు తెలుసు.
పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీసేవారికి కేంద్ర హోం శాఖా మంత్రి గారు సత్కార కార్యక్రమాలు నిర్వహించడం కూడా మనం చూశాం.
ఇలా తాము పొల్యూట్ చేసుకుంటూ వెళ్లిన ఈ దేశ మెజార్టీ మత బుర్రలకు ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఎక్కించే ప్రయత్నం ఎవరైనా చేస్తే వారిని టార్గెట్ చేయడం అందుకోసం పోలీసు యంత్రాంగాన్నీ కోర్టులను వాడడం చాలా సహజంగానే మారిపోయింది.
అందులో భాగమే ఈ మధ్య రావణ్ అరెస్టు అతనిపై ఉపా చట్ట ప్రయోగం. తులసీ చందు అనే జర్నలిస్టును క్రైస్తవ మతస్తురాలు అని ప్రచారం చేసి హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని ప్రచారం చేయడం లాంటి విన్యాసాలు చూస్తూనే వస్తున్నాం.
మెజార్టీ మతంలో ఎప్పుడైతే అభద్రత పోగుపడుతుందో సరిగ్గా అప్పుడే మైనార్టీల్లోనూ అభద్రత పెరిగిపోతుంది. మెజార్టీ మతం వారు మన గురించి చెడుగా అనుకుంటున్నారు. ఇది ఏదో ఒక రోజు మన పీకల మీదకు ఏదో ప్రమాదం తీసుకువస్తుంది అని అర్ధమయ్యాక … మైనార్టీ మతాల వారు ముందు జాగ్రత్త చర్యగా తమ ఇళ్ల ముందు తామే కాపలా కాస్తుంటే …
ఆ సన్నివేశాన్ని చూపించి చూశారా వాళ్లు ఎంత ప్రొటెక్టివ్ గా ఉన్నారో … అదంతా మననేదో చేద్దామనే అని మెజార్టీ మతంలో ప్రచారం చేస్తారు.
ఈ కార్యక్రమం చేసే వారెవరూ అంటే … మెజార్టీ మతంలో మైనార్టీల నుంచీ మతానికి ప్రమాదం ఉన్నదని చెప్పే వారే … వాళ్లు ఆ ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు.
ఎందుకంటే మైనార్టీలు మన దేశ మనుగడకు ప్రమాదం అని ప్రతి హిందువు అనుకుంటేనే కమలం వైను ఆకర్షణతో ఉంటారు.
మైనార్టీలకు ఈ కొమ్ములు ఇచ్చిన పార్టీలుగా దేశంలో ఉన్న మిగిలిన అన్ని పార్టీలనూ నేరేట్ చేసేస్తే … వాళ్లకూ ఓటు బ్యాంకు పోయి బావురుమంటారు.
ఎప్పుడు ఏ పార్టీపై ప్రజల మనసుల్లో విద్వేషాన్ని నింపుతారో తెలియని పరిస్థితి కల్పించి అన్ని పార్టీలనూ అన్ని సమూహాలనూ తమ దొడ్లో కట్టేసుకోవడం సంఘ్ పరివార్ అనుసరిస్తున్న వ్యూహం.
ప్రత్యామ్నాయ భావజాలాలపైనా వాటిని వ్యాప్తి చేస్తున్న వారి వ్యక్తిగత జీవితాలపైనా దుష్ప్రచారం చేయడం మాత్రమే చేసిన హిందూత్వ శక్తులు ఇప్పుడు కొత్తగాభౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు.
డబ్బులు ఎరేసి అనేక మందిని తమ వేపు ఆకట్టుకుని వారితో ఈ భౌతిక దాడులు చేయిస్తారు.
సోషల్ మీడియాలో ఆత్మాహుతి దళాలను కూడా రంగంలోకి దించారనేది తాజా వార్త.
మీకు టార్గెట్ గాఇచ్చిన వాళ్ల అంతు చూసేయండి. మీకు మీ కుటుంబానికీ ఏ కష్టం రాకుండా మేం చూసుకుంటాం. అని ప్యాకేజీలు ప్రకటించి మరీ ఆత్మాహుతి దళాల్లోకి రిక్రూట్మెంట్ చేస్తున్నారని తెలిసి ఖంగారేసింది.
వీళ్ల ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే …
రావణ్ మీద జరుగుతున్న దాడి వ్యవహారాన్నే తీసుకుంటే …
రావణ్ నుంచీ అతని టీమ్ నీ అతనికి సహకరించిన వారినీ అందరినీ టార్గెట్ చేసి వారందరూ క్రైస్తవులని చెప్పి … వాళ్లందరికీ జగన్ పార్టీ నుంచీ ఆర్ధిక సహాయం అందుతోందని ఎస్టాబ్లిష్ చేసి ఈ అభిప్రాయాలను జనాల బుర్రల్లోకి ఎక్కించడమే లక్ష్యంగా ప్రధాన స్రవంతా ఛానళ్లల్లో చర్చలు పెట్టి … వారికి వావి వరసలు ఉండవని విశృంఖల జీవన విధానాలనీ నైతిక దాడి కూడా చేసేసి …
ఇలాంటి వారందరినీ అక్కున చేర్చుకుని హిందూమతానికి వ్యతిరేకంగా వాడేసుకుంటున్న జగన్నే మనం టార్గెట్ చేయాలని కూడా ఎటువంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు.
జగన్ హిందూ అయి ఉంటే అతన్ని ఈ రొచ్చులోకి లాగి ఉండేవారు కాదు.
అతను క్రైస్తవుడు అవడం అనేది అనేక విధాల గ్రాంటెడ్ గా తీసేసుకుని దారుణమైన ప్రకటనలు చేస్తూన్నారు అనేది పచ్చి నిజం.
ఇది ఎంత వరకూ వెళ్లిందంటే …
ఆ మధ్య తిరుమల కొండ మీద లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అని గగ్గోలు పెట్టారు కదా … ఆ సందర్భంలో సాక్షాత్తూ సిఎం చంద్రబాబుగారూ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి ..
కేవలం డబ్బుల కోసం తిరుమల లడ్డూ లో వాడే నెయ్యి కల్తీ చేశారని మనం అనుకోలేం అన్నారు. అంతే కాదు … ఆ దేవదేవుడు తనకు నివేదనగా పెట్టిన ఈ కల్తీ ప్రసాదాన్ని ఆరగించడం ద్వారా ఆయన శక్తి హీనుడవుతాడు. తమ దేవుడు శక్తి హీనుడవగానే హిందూవులు అందరూ బలహీనులైపోతారు.
అప్పుడుహిందూ సమాజాన్ని టోటల్ గా కంట్రోల్ లోకి తీసేసుకోవాలని అనే కుట్రతోనే ఈ నెయ్యిని కలుషితం చేశారని చెప్పేయగలిగారు.
అలా చెప్పేయడానికి వారికున్న ఏకైక ధైర్యం జగన్ క్రైస్తవుడనే .. ఒక రకంగా ఈ ప్రెస్ మీట్ లో వారు అండర్ కరెంట్ గా ప్రజలకు చెప్పదల్చుకున్న విషయం ఏమిటీ అంటే …
ఈ దేశంలో కీలకనిర్ణయాలు తీసుకునే అధికార పదవులకు అంటే ముఖ్యమంత్రి ప్రదాన మంత్రి లాంటి పదవుల్లోకి మైనార్టీ మతాల వారిని ఎన్నుకోకండి. అలా ఎన్నుకుంటే … వారు హిందూ మతాన్ని నాశనం చేయడానికే పనిచేస్తారు … కనుక ఎల్లప్పుడూ హిందువులనే హిందూ పార్టీలనే అధికారంలోకి తీసుకురండి… లేకపోతే హిందూమతం సర్వనాశనం అయిపోతుంది అని.
ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్దం. అని వారి మీద మైనార్టీలుగానీ జగన్ మోహన్ రెడ్డిగారుగానీ ఎందుకుకేసులు పెట్టలేదు? అంటే చాలా స్పష్టంగా భయం. వీళ్లతో పెట్టుకుంటే ఏం చేస్తారో అనే భయం.
ఈ భయం ప్రస్తుతం భారతదేశంలో అన్ని సమూహాల్లోనూ నింపేశారు.
మైనార్టీల పట్ల వారు వ్యాప్తి చేస్తున్న వ్యతిరేకత వాళ్లని బయపెట్టడం కోసమే … అలా భయపెట్టి కంట్రోల్ లోకి తీసుకోవడం కోసమే తప్ప ఈ దేశం నుంచీ వెళ్లగొట్టడానికి కాదు.
ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఒక చేత్తో హిందూ ఓటు బ్యాంకునీ మరో వైపు మైనార్టీ ఓటు బ్యాంకునీ కూడా కంట్రోల్ చేయగలిగే స్థితి సాధించింది భారతీయ జనతా పార్టీ.
మీడియాను కూడా ఇన్ టోటల్ కొనేసి ఈ ప్రపంచానికి ఏం తెలియాలో ఏం తెలియాలని తాము అనుకుంటారో దాన్ని తెలియచేయడం మాత్రమే పరమధర్మగా ఆ సంస్ధలు భావించి ఆచరించే పద్దతిలోకి తీసుకొచ్చి పనిచేయించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం.
ఎన్నికల కమీషన్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలే వాళ్లకు దాసోహం అన్న తర్వాత …ఈ మీడియా సంస్ధలూ ఇవన్నీ కూడా జస్ట్ జూజూబీ అన్నట్టు అర్ధం చేసుకోవాలని వారి తాత్పర్యం.
ప్రత్యామ్నాయ ఆలోచనలను రేపుతూ … ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న భావజాలాల నుంచీ ప్రజల బుర్రలను బైటకి తీసుకువచ్చే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్లని రూట్స్ లోకి వెళ్లి చంపేస్తారు.
మొన్న ఓ మీడియా ఛానల్లో చర్చ జరుగుతుండగా విజయవిహారం పత్రిక నడిపిన రమణమూర్తి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి విశ్వరూప చిత్రంలో కృష్ణుడి ముఖం మోదీముఖంలా మార్చడం తప్పు కదా అన్నారు.
అలా అని వదల్లేదు. ఇలాంటి పనులు చేస్తే హిందూవుల మనోభావాలు గాయపడతాయి కదా అని కూడా అనేశారు.
నువ్వెవడివి తప్పు అనడానికి నువ్వెవరు హిందూ మనోభావాలు గాయపడతాయని చెప్పడానికి ఆ మాట చెప్తే మేం చెప్పాలి గానీ అంటూ … అసలు మోదీగారే పరమ విష్ణువు అవతారం అని తెల్సుకోలేక ఇలాంటి కు విమర్శలు చేస్తావా అన్నట్టు ఆయన ముఖంపై చెప్పుతో కొట్టాడు ధర్మవీర్ అనే సంస్ధ ప్రతినిధిగా చెప్పుకుంటున్న కశ్యప్ రెడ్డి. అతని ఉద్దేశ్యం మోదీ పరమ విష్ణు అవతారంగా భావించాలి తప్ప ఇలాంటి విమర్శలు చేయకూడదు అని ఎలా అనగలిగాడు కశ్యప్ రెడ్డి?
ఆయనకీ తెల్సు మోదీమానవుడే అని కానీ … మోదీని మహా విస్ణుతో పోలిస్తే తనను కాషాయ పార్టీ గుర్తించి ఏదో కొంచెం డబ్బు విదులుస్తారనే ఆశతోనే అలా మాట్లాడి ఉంటాడని నేను అర్ధం చేసుకోగలను.
అలాగే ఈ మధ్య హిందూ మతోద్దరణకే అంకితం అయిపోయిన తెలుగు శాటిలైట్ చానల్ రావణ్ మీద నడుపుతున్న చర్చలో పాల్గొన్న ఓ పాత యాంకరమ్మగారు రావణ్ వెనుక ఉన్న అసలైన శక్తి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిగారు అనేశారు. ఆవిడ గతంలో ఓ రాయలసీమ ఫ్యాక్షన్ హత్యసందర్భంగా వివాదాస్పదం అయ్యారు కూడా. అలాంటావిడ ఇప్పుడు పూర్తిగా కాషాయ దుస్తులతో పెద్ద బొట్టుతో అమ్మవారిగా మారిపోయి మరీ ఆ ఛానల్ డిస్కషన్ లో కనిపించారు.
ఆవిడ ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటే …
ఎలాగూ మొన్నే ప్రధానిగారు హైద్రాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు … చాలా స్పష్టంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆ వేడుకల్లో తాను పాల్గొనాలని ఆశిస్తున్నట్టు ప్రకటించారు.
ఆ మాటలు గట్టిగా మనసుకు పట్టించుకున్న మన హిందూత్వ యాంకరమ్మ గారు … రావణ్ వెనుక రేవంత్ అంటే తనకు ప్యాకేజ్ గ్యారెంటీ అని భావించి అలా ఆవేశపడి ఉంటారు తప్ప మరేమీ కాదని నేను అర్ధం చేసుకోగలను.
ఇలా ప్రత్యామ్యాయ ఆలోచనల మీద మాత్రమే కాదు …ఈ దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచనలకు ఊత ఇస్తూ వేద ప్రమాణాన్ని ప్రశ్నించిన వారిని కూడా ప్రజల జ్ఞాపకాల్లోంచీ కూడా తొలగించేయాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
ఈ ఆలోచనతోనే బెంగాల్ లో రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని బద్దలు కొట్టారు. బౌద్ద ధర్మం నుంచీ మార్క్సిస్టు ఆలోచనల వైపు మరలిన సాంకృత్యాయన్ వైదిక ప్రమాణాలను గట్టిగానే ప్రశ్నించాడు. అందుకే ఆయన విగ్రహాన్ని టార్గెట్ చేశారు బెంగాల్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజేపీ పార్టీ పెద్దలు కార్యకర్తలు.
విజయవిహారం రమణమూర్తి మీద దాడి … రావణ్ పై జరుగుతున్న దాడి … అలాగే అతని అరెస్టు ఖండిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్న పద్దతి రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చూస్తుంటే … దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ట్రోల్ గ్యాంగ్స్ నే చూశాం సోషల్ మీడియాలో …
ఇకపై ఆత్మాహుతి దళాలను సైతం రంగంలోకి దించి ప్రత్యామ్నాయ ఆలోచనలను వ్యాప్తి చేసేవారి అంతు చూసేదాకా వెంటపడే రోజులు చాలా స్పష్టంగా అతి సమీపంలోనే ఉన్నాయని భావిస్తున్నాను.
పరిస్థితి మునపెన్నడూ చూడనంత విననంత బీభత్సమైన స్తాయిలోనూ ఆంలోళనాకరంగానూ కనిపిస్తోంది.
దీన్ని ప్రతిఘటించి ఈ దేశాన్ని ఈ కాషాయ భూతాన్నించీ కాపాడుకోడానికి తీసుకోవాల్సిన కార్యక్రమం ఏమిటి అనేది తేల్చుకుని దాన్ని అమలు చేయడానికి అనుసరించాల్సిన పద్దతులేమిటనే అంశంపై కూడా స్పష్టమైన అభిప్రాయానికి రావడం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిస్టు సంస్ధల సమైక్య కార్యక్రమం కావాల్సిఉన్నది.
నిర్బంధభారత్ – ఇప్పుడు భారతదేశంలో ఊపిరి ఆడని పరిస్తితి ఉన్నది. ఎవరు ఎప్పుడు విద్రోహిగా మారతారో తెలియడం లేదు. ఎవరూ ఎవర్నీ నమ్మలేని పరిస్థితులు కల్పించేస్తున్నారు. మార్కెట్ ఎకానమీ ప్రకారం మనుషులనూ పార్టీలనూ కారు చవకగా కొనేసి ఏం చేసైనా సరే దేశాన్ని జైలుగా మార్చేశారు.
ప్రస్తుతం మనం జైల్లోనే ఉండి మాట్లాడుకుంటున్నాం అని నేను బలంగా భావిస్తూన్నాను.
*








మీరు రాసిన ప్రతి అక్షరం నిజం.
జరుగుతున్నవి చూస్తూ, చదువుతూ, వింటూ వేదన చెందుతూ ఏమీ చెయ్యలేని మా అశక్తతకి బాధ పడుతూ మన దేశం ఎటు పోతుందో, ఏమైపోతుందోనని కుమిలిపోతున్న పాత తరం మాది.
ఈ జనం ఎప్పుడు మేల్కొంటారో, ఎప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారో, ఈ అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలని ఐకమత్యంగా ఎదుర్కుంటారో తెలియదుగానీ ఆ రోజు మేము చూస్తామనే ఆశ మాత్రం ఉంది.