ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ -తమాషా అనుభవం

1914 లో ప్రొఫెసర్ మెక్మాహన్, ప్రొఫెసర్ సైమన్ సెన్ అనే ఇద్దరు బ్రిటిష్ రసాయన శాస్త్ర వేత్తలకి భారతదేశం లోశాస్త్ర పరిశోధన పెంపొందించడానికి ప్రతీ ఏటా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనే పేరిట దేశవ్యాప్తంగా పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహిస్తే బావుంటుంది అనే అలోచన వచ్చి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అస్సోసియేషన్ (ISCA) అనే సంస్థ ప్రారంభించి మొదటి సమావేశం కలకత్తా లో నిర్వహించారు. ఆ సమావేశానికి ఇండియాలో అన్ని నగరాల నుంచీ 150 మంది శాస్త్రవేత్తలు వచ్చి, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ మొదలైన ఆరు శాస్త్రాలలో 35 పరిశోధనా పత్రాలు సమర్పించారు. అలా చిన్న సమావేశం తో మొదలయిన ఆ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి శత వార్షికోత్సవాలు దాటి ప్రతీ ఏటా జనవరిలో జరుపుకుంటూ ప్రపంచ స్థాయి శాస్త్ర వేత్తల ప్రధాన సమావేశంగా రూపుదిద్దుకుంది. ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 56వ సమావెశం మా బొంబాయి ఐఐటి లో 1969 జనవరి మొదటి వారం లొ జరిగింది.

ఈ సమావేశాలు జనవరిలో పెట్ట్డానికి ప్రధాన కారణం ఆ సమయం లో అన్ని విశ్వవిద్యాలయాలకీ అటు క్రిస్మస్, ఇటు సంక్రాంతి శలవులు కాబట్టి విద్యార్ధులు ఇళ్ళకి వెళి పోయి హాస్టళ్ళ లో గదులు ఖాళీగా ఉంటాయి. అవన్నీ దేశవ్యాప్తంగా వచ్చే ప్రతినిధులకి ఆ నాలుగైదు రోజులూ ఆ గదులు ఇచ్చే వెసులు బాటు ఉంటుంది. కానీ నేనూ, మరి కొందరూ రిసెర్చ్ స్కాలర్స్ కాబట్టి మాకు అలాంటి శలవులు ఉండవు. అంచేత మా హాస్టల్ వన్ లో నా లాంటి ఓ యాభై మంది గదులు తప్ప మిగిలిన యాభై గదులూ మాత్రమే సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులకి ఇచ్చారు. వాళ్ళ సౌకర్యాలు చూసుకునే బాధ్యత మాదే. ఆ మాట కొస్తే ఆ సమావేశానికి సీనియర్లు అయిన మేము వలంటీర్లు గా అహర్నిశలూ పని చేశాం.

ఇక్కడ మొదటి రోజు ఒక చిన్న తమాషా జరిగింది. నేనూ, కిషోర్ గాడూ నా గది నించి వరండాలోకి రాగానే అవతలి వేపు ఇద్దరు అమ్మాయిలు కనపడ్డారు. మా మగవారి హాస్తల్ ఆడకూతుళ్ళు కనపడగానే మేం కళ్ళు నులుముకుని చూసి, “ఓహో, వీళ్ళు సైన్స్ కాంగ్రెస్ కి వచ్చిన ప్రతినిధులు అయి ఉంటారు” అనుకున్నాం. తీరా వాళ్ళ దగ్గర దాకా వెళ్ళగానే అందులో ఒక అమ్మాయి , రెండో అమ్మాయి తో “అది కాదే, నీళ్ళు అంత చల్లగా ఉంటే ఎలాగా స్నానం చెయ్యడం. ముందు తెలిస్తే వాటర్ హీటర్ అయినా తెచ్చుకునే వాళ్ళం” అని ఆ రెండో అమ్మాయి మీద విసుక్కుంటోంది. అసలే అమ్మాయిలు. అందులో తెలుగు లో విసుక్కోవడం తో నేనూ, కిషోర్ గాడూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని “ఏ ఊరు నుంచి వచ్చారూ?” అని ఆత్రంగా పలకరించాం. తెలుగు పలకరింపు వినగానే వాళ్ళ ప్రాణం లేచి వచ్చింది. విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ విశాఖ పట్నం లో ఆంధ్రా యూనివర్శిటీ బోటనీ డిపార్ట్మెంట్ లో మా లాగే రిసెర్చ్ స్కాలర్స్. సైన్స్ కాంగ్రెస్స్ లో పరిశోధనా పత్రాలు సమర్పించడానికి వస్తే మా హాస్టల్ లో, మా వరండాలోనే వాళ్ళకి గదులు కేటాయించారు. ఒక అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. రెండో అమ్మాయి పేరు మంగ తాయారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ అమ్మాయి ఇంటి పేరు మా ఇంటి పేరే..వంగూరి. అప్పుడు బంధుత్వం లేదు. ఆ రెండో అమ్మాయి భీమవరం రాజులమ్మాయి. ఆ తరువాత నాలుగు రోజులూ వాళ్ళకి వేడి నీళ్ళ సమస్య లేదు అని వేరే చెప్పక్కర లేదు. వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ సమ్యం లో తప్ప నలుగురం కలిసే తిరిగాం. వాళ్ళకి బొంబాయి నగరం చూపించే క్రమం లో జరిగిన ఒక సంఘటన ఇక్కడ వివరిస్తాను.

బొంబాయి లో చౌపాటీ బీచ్, మరైన్ డ్రైవ్, గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్ లాంటి వే కాక ఎలిఫెంటా గుహలు చూడడం ఒక ప్రత్యేక అనుభవం. అవి సముద్ర మధ్యలో ఒక చిన్న దీవి మీద కొండ లో అవి యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రఖ్యాతి చెందినవి. దానికి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ పేకేజ్ బుక్ చేసుకుంటే వాళ్ళు పడవలో అక్కడికి తీసుకెళ్ళి, కొండ ఎక్కాక ఆ గుహలూ, క్రీ,పూ. 600 ప్రాంతాలలో అక్కడ చెక్కిన ఈశ్వ సంపాదించిరుడి విగ్రహాలు, చరిత్ర వాళ్ళ గైడ్ కూడా ఉండి, అన్నీ చెప్పి మళ్లీ సాయంత్రానికి వెనక్కి తీసుకొస్తారు. దానికోసం నేనూ, కిషోరూ, మంగ తాయారూ, రాజ్యలక్ష్మీ పొద్దున్నే బయలు దేరి ఎక్కడో ఉన్న పవాయ్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా కి వెళ్ళి టూరిజం వాళ్ళ బోటు ఎక్కగానే, గైడ్ గా వచ్చిన అమ్మాయిని చూసి భలే ముచ్చట పడిపోయాం. ఇక కిషోర్ గాడు అయితే ఆ అమ్మాయి అందానికి మూర్ఛపోయినట్టే. ఎలాగైనా మా టూర్ పూర్తి అయే లోగా ఆ అమ్మాయి అడ్రెస్ సంపాదించడమో, లేదా మా ఐఐటి కి ఆహ్వానించడమో, ఇలా ఏదో ఒక విధంగా పరిచయం పెంచుకోడానికి చీటికీ, మాటికీ నన్ను గిల్లడం మొదలు పెట్టాడు. మొత్తానికి నేను సేకరించిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి అక్కడే ఏదో కాలేజ్ లో చదువుకుంటూ , కాస్త ఆదాయం కోసం ఇలా పార్ట్ టైమ్ గైడ్ గా పని చేస్తొంది. అందగత్తె కాబట్టి ఆ ఉద్యోగం సులభంగానే వచ్చింది అని మాకు అర్ధం అయింది. మా తంటాలు చూసి ఆ ఆంధ్రా యూనివర్శిటీ పాపలు తెగ నవ్వుకున్నారు. మొత్తానికి పడవలో అవతలి వడ్డుకి వెళ్ళి కొండ ఎక్కి ఆ గైడ్ అమ్మాయి (పేరు మర్చిపోయాను) ధర్మమా అని ఎలిఫెంటా గుహలు చూసి తరించాం.

ఇంత వరకూ బాగానే ఉంది కానీ గుహలు చూశాక మధ్యాహ్నం సుమారు రెండు గంటలకి ఇక కొండ దిగి వెళ్ళే సమయానికి కిషోర్ గాడికి ఒక వెధవ ఐడియా వచ్చి చచ్చింది. వాడు ఆ గైడ్ అమ్మాయి తోటి “మాతో ఉన్న అమ్మాయిలు బోటనీ లో రిసెర్చ్ స్కాలర్లు. ఎక్కడో తూర్పు తీరం లో ఉన్న వైజాగ్ నించి వచ్చారు. మనం ఇలా మెట్ల మీద నించి క్రిందకి దిగే బదులు వెనకాల వేపు నుంచి ఆ చెట్లూ, మొక్కల మధ్య నుంచి క్రిందకి ప్రకృతి మధ్యలోంచి సముద్రం ఒడ్డు కి వెళ్ళి అక్కడ చుట్టూ నడిస్తే మన బోట్ ఉండే చోటు వస్తుంది కదా!. ఈ అమ్మాయిలకి కావలసిన కొత్త కొత్త ఆకులూ, అలములూ కోసుకుంటారు” అదీ ఆ వెధవ ఆలోచన. ఆ గైడ్ అమ్మాయి తల అందంగా, అడ్డంగా ఊపి “నేను మిగతా టూరిస్ట్ ల తో ఉండాలి. కావాలంటే మీరు వెళ్ళి మన బోటు వెళ్ళే లోపుగా రండి. ఆలస్యం అయితే కుదరదు. మీరు రాత్రి అంతా ఇక్కడే ఉండిపోవాలి” అని వార్నింగ్ ఇచ్చింది. కిషోర్ మొహం మాడిపోయింది కానీ, ఆ వైజాగ్ అమ్మాయిలు “మాకు మా బొటానికల్ టూర్లలో నడవడం అలవాటే” అని సరే అన్నారు. అంతే సంగతులు. మేము నలుగురం ఆ గుహల వెనకాల నుంచి దారీ తెన్నులు తెలియని ఆ దట్టమైన కొండ అడవులలో. ఎలా దిగినా క్రిందకే కదా అని బయలు దేరాం. ఒక అర గంటా, గంటలో మేము కొండ దిగుతున్నామో, లేక కొండ చుట్టూ చక్కర్ కొడుతున్నామో తెలియ లేదు, మరో గంటకి చెమట్లు ఎక్కువ అవడం, పైన గుహలు కూడా కనపడక పోవడం, అసలు ఎక్కడా దిక్కు తోచక బెంబేలు పడిపోయాం. మరొక గంటలో మేము మా బోటు దగ్గరకి చేరుకోక పోతే ఆ రాత్రి నిర్మానుష్యమైన ఆ అడవిలో కాలక్షేపం చెయ్యాల్సిందే. పైగా అక్కడ పెద్ద పులులు, చిరుత పులులే ఉంటాయో, నక్కలూ, పాములూ ఉంటాయో ముందు కాస్త కనుక్కో లేదు కూడానూ. మా మొహాలలో కత్తి వాటుకి నెత్తురు చుక్క లేకుండా, ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని, వళ్ళంతా చెట్టు కొమ్మల వాతలతో మొత్తానికి మా బోటు ఉండే ప్రాంతానికి చేరుకున్నాం. అప్పటికే అంత అందమైన గైడమ్మాయీ గంగ వెర్రులెత్తి పోతోంది. అవును మరి. తనకి అప్పచెప్పిన నలుగురు టూరిస్ట్ లు తప్పిపోతే కొంప ములగదూ.

మొత్త్తానికి అందరం మళ్లీ బోటు లో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తీరానికి చేరగానే కిషోర్ గాడు “ఒరేయ్, ఆ అమ్మాయి ని కేంపస్ కి పిలుద్దాం, రారా” అని ఆ అమ్మాయి దగ్గరకి వెళ్ళి మాట కదపగానే ఆ అమ్మాయి వాడి కేసి చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అలాగా ఆ వైజాగ్ అమ్మాయిల కిచ కిచ లూ కూడా. పాపం కిషోర్ గాడు భలే చిన్నబోయాడు పాపం.

ఇదంతా జరిగినది 1969 జనవరిలో, ఆ తరువాత రాజ్యలక్ష్మీ, మంగ తాయారు ఇద్దరూ డాక్టరేట్లు తెచ్చుకునే దాకా రెండేళ్ళకి “సోదరా” అని సంభోధిస్తూ ఉత్తరాలు వ్రాసేవారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి వరంగలో ఏదో కాలేజ్ లొ చేరగా, మంగ ఆంధ్రా యూనివర్శిటీ లోనే లెక్చరర్ గా చేరి, ఆఖరికి ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్టెమెంట్ గా రిటైరై అయింది అని విన్నాను. ఆశ్చర్యం ఏమిటంటే,,,,మరో పదేళ్ళ తరవాత మా తమ్ముడు మంగ స్వయానా వదిన గారి మేనగోడలి ని పెళ్ళి చేసుకోడం ద్వారా మా ఇద్దరికీ చుట్టరికం కలిసింది. విశేషం ఏమిటంటే, రాజ్యలక్ష్మినీ, మంగ తాయారునీ కేవలం నాలుగు రోజులు 1969 జనవరిలో చూడడం అదే మొదటి సారి. అదే ఆఖరి సారి. కిషోర్ గాడు 1988 లో హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడు. ఆ

మరో రెండేళ్ళ తరువాత అది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవునో కాదో నాకు అంతగా జ్ఞాపకం రావడం లేదు కానీ అలాంటి భారీ జాతీయ శాస్త్ర వేత్తల సమావేశం లో నేను కలుసుకున్న ఆవిడ పేరు ఇందిరా గాంధీ….గడిపినవి 15 నిముషాలూ….ఆ అనుభవం వివరాలు మరో సారి…..

*

 

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు