ఇంకో వైపు నుంచి చెప్పుకొచ్చిన కథలు!

ఇది అన్వీక్షకి ప్రచురణ!

నాగరికత మొదలైనప్పటినుంచీ మనుషులు కళను సృష్టిస్తూనే ఉన్నారు. మానవ సంస్కృతి వికాసంలో, సమాజపు అభివృద్దిలో కళలు కీలకపాత్ర పోషించాయి. మానవుడు సృష్టించిన వివిధ కళారూపాల్లో సాహిత్యం ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉన్న చోటునుంచే పాఠకులను వివిధ ప్రదేశాలకు రవాణా చేయగలదు. వివిధ వ్యక్తులను పరిచయం చేయగలదు; వారి విభిన్న దృక్కోణాలను, భావోద్వేగాలను అనుభవంలోకి తేగలదు. మిగిలిన కళారూపాలతో పోలిస్తే, కళను అనుభవిస్తున్న వ్యక్తి అందులో పూర్తిగా మమేకం చేయగలిగే శక్తి సాహిత్యానికి ఉంది. తెల్లని కాగితం మీదున్న నల్లని ఆక్షరాలను చదువుతూ, రచయిత సృష్టించిన ఊహాత్మకమైన ప్రపంచాన్ని, అందులోని పాత్రలను తన మనోనేత్రంతో దర్శించగలిగే వీలు కల్పిస్తుంది సాహిత్యం. కానీ అన్ని కథలు పాఠకుడిని ఈ వీలుని కల్పిస్తాయని చెప్పలేం. అలా కలిగించగలిగే కథలు కొన్నే ఉంటాయి. అలా రాయగలిగే రచయితలూ కొంతమందే ఉంటారు. వారు రచయిత అనే స్థాయిని దాటి కళాకారుడిగా గుర్తింపబడతాడని నాకనిపిస్తుంది.

కథ చెప్పడం ఒక కళ. ఒకే కథను వివిధ రచయితలు ఎన్నో రకాలుగా చెప్పగలుగుతారు. కానీ వాటిలో ఎప్పటికీ నిలబడిపోయే కథ ఏది? అని అడిగితే – కేవలం కథలోని ‘వస్తువు’ ఆధారంగా మాత్రమే కాకుండా, ఆ కథను చెప్పడానికి రచయిత ఎన్నుకున్న శిల్పం/స్టైల్ వల్ల మాత్రమే ఆ కథ మరుపురానిదవుతుంది – అని నా నమ్మకం. సాహిత్యాన్ని కళారూపంగా ఆరాధించే నాకు, అటువంటి కథలను, కథకులను ఎక్కువగా అభిమానిస్తాను; అటువంటి కథకుల కోసం ఎల్లప్పుడూ అన్వేషిస్తుంటాను. అలా నాకు పరిచయమైన వారే త్రిపుర, వినుకొండ నాగరాజు, ఏ.మురళీధర్,  ఆలూరి బైరాగి, ఆర్.ఎస్.సుదర్శనం, కాశీభట్ల వేణుగోపాల్, శ్రీరంగం రాజేశ్వరరావు, కంఠంనేని రాధాకృష్ణ, బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం – ఇలా ఎంతోమంది. తెలుగులో పాపులరైన రచయితలు రాసిన పాపులర్ కాని ఎన్నో కథలు కూడా నాకు ఈ అన్వేషణలో పరిచయం అయ్యాయి. ఇప్పటికీ నేను ’కథ నిలయం’లోనూ, ’ఆర్కైవ్.ఆర్గ్’లోనూ ఏదో ఒక మంచి కథ దొరకకపోదా అని వీలున్నప్పుడల్లా వెతుకుతూనే ఉంటాను. ఈ నిరంతర ప్రయాణంలో నాకు పరిచయమైన మరొక రచయిత ఆడెపు లక్ష్మీపతి.

ఆయన రాసిన ఒక కథ మొదటిసారిగా ఒక సభలో ఏవరో చదవగా విన్నాను. ఆ కథ నన్ను ఎంతగానో “హాంట్” చేసింది. ఆ కథ ప్రధానంగా ఒక పాత్రను వేధిస్తున్న పన్ను నొప్పి  చుట్టూ తిరుగుతుంది. ఆ పన్ను నొప్పిని చాలా సార్లు చాలా రకాలుగా వర్ణిస్తారు రచయిత. ప్రతిసారీ ఆ పాత్ర నొప్పి మనకి తెలియడమే కాదు, మనకే నోట్లో ఆ నొప్పి కలుగుతోంది అన్నంత బాధ! ఆ కథతోనే ఆడెపు లక్ష్మీపతి గురించి మొదటిసారి తెలుసుకున్నాను. ఆ తర్వాత చాలాసార్లు ఆయన మిగిలిన కథలు దొరుకుతాయోమోనని కొంత ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు. కానీ అదృష్టవశాత్తూ ఆయనే ఫోన్ చేసి తన కథల పుస్తకం వెయ్యాలని మమ్మల్ని సంప్రదించారు. అలా ఆయన కథలు చదవడం, వాటిని ఒక పుస్తకంగా ప్రచురించడం, ఆ కథలకు పరిచయ వాక్యాలు రాసే అవకాశం లభించింది.

ఈ కథల పుస్తకానికి ఆయన ఎంచుకున్న శీర్షికని బట్టే ఆయన కథల్లోని ప్రత్యేకత ఏంటో మనకి మొట్టమొదట మనకి అర్థమవుతుంది. త్రిభుజానికి ఉండేదే మూడు కోణాలైతే ఈ నాలుగో కోణం ఏంటి? అనే ప్రశ్న మనలో ఆసక్తిని రేపుతుంది. నాకైతే ఈ టైటిల్ చూడగానే కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో డిటెక్టివ్ ఫిక్షన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు “The Fourth Side of a Triangle” అనే పుస్తకం చూసి ఇదేదో బావుందే అనుకున్నాను. కానీ ఈ కథల పుస్తకానికి పెట్టిన టైటిల్ చూసి ఆ పుస్తకానికీ, ఈ కథకూ ఏదైనా సంబంధం ఉందేమో అని కొంత రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.

త్రిభుజానికి మూడే భుజాలని మనందరికీ తెలిసిన సత్యం. కానీ 1993లో షెర్మన్ అనే గణితశాస్త్రవేత్త త్రిభుజానికి నాలుగో భుజాన్ని కనుగొన్నారు. దాని గురించి మీరు కూడా తెలుసుకోవాలంటే “Sherman’s Fourth Side of a Triangle” గురించి గూగుల్ చేస్తే చాలా సమాచారం దొరుకుతుంది. అంటే ఆ పుస్తకం 1965 లో వచ్చినప్పుడు అదొక కాంట్రడిక్షన్ అనిపించినా 1993కి అందులో వైరుధ్యమేమీ లేదని తేలింది. అయితే ఈ పుస్తకానికి లక్ష్మీపతి ‘త్రిభుజపు నాలుగో భుజం’ అనకుండా ‘త్రిభుజపు నాలుగో కోణం’ అని పెట్టడంలో ఆయనకు పైదంతా తెలిసే పెట్టారో, లేక ఒక పారడాక్స్‌గా ఉపయోగించారో తెలియదు కానీ, ఎంచుకున్న శీర్షికతోనే ఆయన ప్రత్యేకత తెలిసివచ్చింది.

ఈ  కథల్లో నన్ను మొట్టమొదటగా ఆకట్టుకుంది – స్టైల్. ప్రతి కళకూ కొన్ని ఈస్తటిక్ డైమెన్షన్స్ ఉంటాయి. అలాగే సాహిత్యంలోని  ఆ ఈస్తటిక్ డైమెన్షన్ శిల్పం ద్వారానే వ్యక్తమవుతుంది. ఒక కథలో వస్తువు ఎంత ముఖ్యమో, శిల్పం కూడా అంతే ముఖ్యం అని గట్టి నమ్మకం నాకు. ఒక మంచి కథ వస్తు-శిల్పాల శ్రావ్యమైన కలయిక అయ్యుండాలి. వస్తువు కథలోని సందేశాన్ని అందచేస్తే,  శిల్పం ఆ కథకు జీవం పోస్తుంది.

ప్రపంచంలో గొప్ప కథలుగా భావించే ఏ కథని పరిశీలించినా వాటికొక ప్రత్యేక శైలి ఉండే ఉంటుంది; ఆ కథను మరొక దానితో పోల్చలేని విధంగా వేరుగా ఉంటుంది. రంగులు, స్ట్రోక్‌లు మరియు ఇతర సాంకేతికతల ప్రత్యేకమైన కలయికతో అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించే చిత్రకారుడి మాదిరిగానే, లక్శ్మీపతి కూడా తన కథలన్నింటిలోనూ – ఆకర్షణీయమైన కథనాన్ని రూపొందించడానికి  – పడ్డ శ్రమ, కనబర్చిన నేర్పు ఈ కథలన్నీ చదివిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

ఈ కథల్లో ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనిపించే విజువల్ నెరేటివ్ కారణంగా లక్శ్మీపతిని ఈ ప్రక్రియలో స్పెషలిస్ట్‌గా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇలా రాసిన తెలుగు కథలు చాలా తక్కువగా చదివాను. ఈ పుస్తకంలో మొత్తం 13 కథలున్నాయి. ప్రతి కథలోనూ ఈ స్పెషాలిటీని గమనించవచ్చు.

ఇందులోని పదకొండు కథలు లిటరరీ ఫిక్షన్ కోవలోకి వస్తాయి. మరో రెండు కథలు జాన్రా ఫిక్షన్‌గా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి సైన్స్ ఫిక్షన్ కథ అయితే మరొకటి పల్ప్ ఫిక్షన్ కథ అనుకోవచ్చు. ప్లాట్ లేదా కథాంశానికి ప్రాముఖ్యత కలిగిన జాన్రా ఫిక్షన్ కథల్లో సైతం రచయిత తన ప్రత్యేకతను ప్రదర్శించడం నాకు నచ్చింది.

సినిమాని అధ్యయనం చేసే విద్యార్థులకు చెప్పే ముఖ్యమైన పాఠం ఒకటి ఉంటుంది – Show. Don’t tell అనేది ఈ పాఠం సారాంశం. దృశ్యమాధ్యమమైన సినిమాలో అది సాధ్యం కూడా. కానీ ఈ కథల్లో అవలంబించిన స్టైల్ గమనిస్తే, ఈ పాఠమే గుర్తొస్తుంది.

ముఖ్యంగా ‘త్రిభుజపు నాలుగో కోణం’ కథ అయితే సినిమా స్క్రీన్ ప్లే రాసేముందు, సినిమా రచయితలు రాసుకునే ’ట్రీట్‌మెంట్’లా ఉంటుంది. చిత్రంగా ఆ కథలోని నాలుగు భాగాలను, “ఒకటో చిత్రం’, రెండో చిత్రం’… అంటూ ఉపశీర్షికలు కూడా పెట్టారు. అంతేకాదు, ఆ కథ రాసిన శైలి కూడా ప్రత్యేకం. తెలుగులో ఇలాంటి స్టైల్‌లో వచ్చిన కథ చదవడం మాత్రం ఇదే మొదటిసారి.

ఈ కథ ఒక్కటే కాదు, ఏ కథ దానికదే ప్రత్యేకం. ‘విధ్వంస దృశ్యం’ కథలోని పాత్ర ఇంటినుంచి కూరగాయల మార్కెట్‌కి వెళ్ళొచ్చేలోపు జరిగే కథ. కానీ కథలో ఆ పాత్ర జీవితమంతా ఉంది. ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు, కష్టాలు, ఎదురయ్యే ప్రతి పాత్రకూ ఒక కొత్త డెమెన్షన్!

ఈ కథలన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ ‘అసందిగ్ధ కర్తవ్యం.’ ఈ కథే నేను మొదట్లో చెప్పిన ’పన్ను నొప్పి’ కథ. ఈ కథ గురించి తెలుసుకోవడం కంటే చదివి అనుభవించి తీరాల్సిందే. తెలుగులో వచ్చిన అత్యుత్తమ కథల జాబితాలో చేర్చదగ్గ కథ ఇది. ముఖ్యంగా, ఇతర కథల్తో పోలిస్తే, ఈ కథలో వస్తువు, శిల్పం సమపాలల్లో కుదరడం వల్లనేమో ఈ కథ ఈ పుస్తకానికే హైలైట్‌గా నిలుస్తుంది.

‘విశిష్ట గురుత్వం’ కథ కొంత హాస్యం మేళవించి రాసినప్పటికీ నాకు పెద్దగా మింగుడు పడని కథ. శైలి పరంగానూ, వస్తువు పరంగానూ కొంత నిరాశ కలిగించింది.

ఇదొక్క కథ తప్ప మిగిలిన కథల్లో లక్ష్మీపతి తన అక్షరాలతో మొదట సజీవమైన పాత్రలను సృష్టిస్తారు. వారి చుట్టూ జరిగే దృశ్యాన్ని ఎంతో వివరంగా చిత్రిస్తారు. ఎంత వివరంగా అంటే, ఒక గది గురించి రాస్తున్నప్పుడు, ఆ గదిలో తిరిగే ఫ్యాన్ చప్పుడు వినబడేలా, మూలన పేరుకున్న బూజు సైతం మన కళ్ళముందు సాక్షాత్కరించేలా రాస్తారు.

కొన్ని కథల్లో అయితే దృశ్యాలు మన కళ్ళముందు మెదలడమే కాదు. ఆయా సన్నివేశాల్లో వినబడే శబ్దాలూ మన చెవులకు తాకుతాయి. ‘జీవన్మృతుడు’ కథలో ఈ టెక్నిక్‌ని మీరు ప్రత్యేకంగా గమనించవచ్చు.

ఈ కథల్లో మరొక ఆకర్షణ – వస్తువైవిధ్యం. ప్రతి కథలో జరుగుతున్న జీవితంలోని ఎన్నో సమస్యలను లేవనెత్తుతూనే, అన్నింటిలోనూ రచయిత ఎవరి పక్షం వహించాడో చెప్పకనే చెప్తారు. సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పట్ల రచయితకున్న ఆవేదన, ఆక్రోశం దాదాపు ప్రతి కథలోనూ వ్యక్తమవుతుంది. కానీ రొడ్డకొట్టుడు సమస్య-పరిష్కారం పద్ధతిలో కాకుండా తనదైన శైలిలో ఈ కథల్లో వ్యక్తపరుస్తారు రచయిత.

కళకు ఉన్న ఎన్నో డైమెన్షన్స్‌లో సామాజిక వ్యాఖ్యానం ఒకటి.  కళ సామాజిక నిబంధనలను సవాలు చేయడానికి, ఆలోచనను రేకెత్తించడానికి, మార్పును ప్రేరేపించడానికి అవకాశాన్నిస్తుంది. కళాకారులు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు, చర్చను ప్రేరేపించవచ్చు.

ఆ విషయంలో ఆడెపు లక్ష్మీపతి తన కథల ద్వారా తాను చూసిన సమాజాన్ని, అందులో జరుగుతున్న అన్యాయాల్ని తన కథల ద్వారా గట్టిగానే ప్రశ్నించారు. అయితే కథాంశాలకు, సందేశాలకు తాకట్టు పెట్టపడిన తెలుగు కథలు చదవడం అలవాటుపడ్డ సామాన్యపాఠకులకు ఈ వర్ణనలు అంతగా రుచించకపోవచ్చు. అందువల్ల, ఈ కథలన్నీ చదివాక ఈ కథల్లో సందేశం ఏమీ లేదా? పరిష్కార మార్గాలూ రచయిత ఏమీ సూచించలేదే అని నిరాశ చెందవచ్చు.

అలాకాకుండా, కళాత్మక దృష్టితో కథలు చదివేవాళ్ళకు ఈ కథల పుస్తకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. తెలుగు కథల స్థాయిని పెంచే కథలు ఇవి.

*

వెంకట్ శిద్ధారెడ్డి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ విశ్లేషణ బాగుంది.
    వెంటనే పుస్తకం కొని చదవాలనే ఆతృత మొదలయ్యింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు