ఆ గురవడు అంటే అందరికీ భయమే!

ఎన్నో వందలసార్లు నేను ఆ చోటు మీదుగా తీసుకెళ్లాలని ప్రయత్నించినా గుర్రం అక్కడికి రాగానే గుగుర్పాటుకు గురై భయంతో వణికిపోయేది, ఒగర్చేది. చుట్టూ తిరిగి ఆ చోటు దాటాక తిరిగి బాటలోనికి వచ్చేది. తీవ్రంగా భయపడిపోయేది.

పిల్లలు పాడుతున్న థాయ్ పాటలోని తప్పుల్ని సరిచేసి, వారి చేత ఆ పాటను తిరిగి పాడించుకొని, ఇంకొంచెం సేపు ప్రాక్టీస్ చేయించి, వారు బాగా పాడడం మొదలుపెట్టాక ముందుకు సాగాను.
ఆ పిల్లల ఊరు వచ్చింది. “చింతపల్లి వరకు నా బండి మీద వెళ్లడం అవుతుందా?” అనే ప్రశ్నను ఆ గ్రామంలో అనేక చోట్ల ఆగి చాలా మందిని అడిగాను. వారంతా ముందుకు వెళ్లడం అసాధ్యమనే చెప్పారు. బురదలో బండి వెనక్కి జారిపోతుంది అని కొందరు, ఈ వర్షంలో రాళ్ల దారిని దాటుకొని వెళ్లడం జరిగే పని కాదని కొందరు చెప్పుకొచ్చారు. అయితే వెనక్కి వెళ్లడానికి నా మనసు అంగీకరించలేదు.
నేను మొండిగా అనేకంటే మూర్ఖంగా ముందుకు సాగాను. ముందుకు వెళ్లేకొద్దీ దారి ఇబ్బందికరంగా తయారయింది. బురద పెరిగింది. దారి ఇరుకుగా మారిపోయింది. రాళ్లూరప్పలూ పెరిగాయి.
నేను ఇక వెనక్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని ఆగాను. కానీ వెనక్కి వెళ్లడానికి మనసు రాక అక్కడే నిరాశగా బైక్ పైన కూర్చుని ఉండిపోయాను.
అప్పుడే ఒక అద్భుతం జరిగింది. పొడవాటి శిరోజాలు, గడ్డo తో ఋషిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతడు ఉత్తర భారతీయుడు. చూడడానికి Gandalf లా ఉన్నాడు. అతడు అక్కడ ఎందుకు ఉన్నాడో తెలియదు.
“చింతపల్లి వరకు ఈ బండి మీద వెళ్లడం అవుతుందా?” అని అతడిని  నేను అడిగాను.
అతడు ఉత్తర భారతదేశ యాసలో వచ్చీరాని తెలుగులో చెప్పాడు “వెళ్లవచ్చు. రోడ్డు ఇబ్బంది. రాళ్ళు ఉంటాయి. బురద ఉంటాది. కష్టంగా ఉంటాది. అయినా వెళ్ళవచ్చు. వెళ్ళవచ్చు…వెళ్ళవచ్చు”
“వెళ్ళవచ్చు…వెళ్ళవచ్చు” అనే యాసతో ఆయన చెప్పిన మాటలు నా రక్తంలోకి స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసినట్టుగా నాలో శక్తిని పంప్ చేశాయి. అతనికి ధన్యవాదాలు చెప్పి నేను ధైర్యంగా ముందుకు సాగాను.
జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. మనం అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి రూపంలో సహాయం అందుతుంది. ఆ స్థితిలో నాకైతే అతను రావడం, ధైర్యం చెప్పడం ఒక అద్భుతానికి తక్కువేమీ కాదు. అతను రాకపోతే నా జీవితంలోని ఒక అతి ముఖ్యమైన ఆశ నెరవేరేది కాదు.
అతి కష్టం మీద మరొక కొండ ఎక్కాను. వర్షం పెరిగి, తిరిగి తగ్గుతూ ఉంది. శిఖరం ఎక్కే సమయంలో బైక్ యొక్క అన్ని గేర్లు విఫలమయ్యాయి. ఒకటవ గేరు మాత్రమే బైకును అతి కష్టం మీద ముందుకు తీసుకు వెళ్ళగలుగుతోంది. చాలాసార్లు బైక్ జారిపోయి వెనకకు వచ్చేస్తోంది.
“వెళ్ళవచ్చు…వెళ్ళవచ్చు” అనే మాటలు తలలో గింగురుమంటున్నాయి.
ఎలాగైతేనేం చివరికి శిఖరాన్ని ఎక్కాను. అక్కడ మరొక అద్భుతమైన ప్రకృతి దృశ్యం నన్ను పులకింప చేసింది. మేఘాలు శిఖరాన్ని ఒరుసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతే, Frost “చీకటి పడబోతోంది. ముందుకు పద!” అని మరొకసారి మొహమాట పడుతూ చెవిలో చెప్పాడు.
నేను కొండ దిగుతున్నాను. ఒక్కసారిగా నాలో థ్రిల్స్ ప్రవహించాయి. అవి భయానికి సంబంధించినవి. హఠాత్తుగా దారిలో బైక్ ఆపేసి నిలుచున్నాను. ఆ చోటుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదొక అంతు చిక్కని చోటు. ఎంత గంభీరమైనదో, అంత హేతుబద్ధతకు అందనిది.
చిన్నతనంలో కొండవాలులోని ఆ సన్నని కాలిబాటలో వెళుతున్న నాకు ఆ చోటుకు రాగానే భయం కలిగేది. గొంతు తడి ఆరేది. ఎందుకంటే అక్కడికి రాగానే గుర్రం ఆగిపోయి ఆందోళనగా సకిలించేది. భయంతో కొంత దూరం పక్కకు వెళ్ళి చుట్టూ తిరిగి ఆ చోటు దాటాక తిరిగి కాలి బాటలోకి వచ్చేది.
ఎన్నో వందలసార్లు నేను ఆ చోటు మీదుగా తీసుకెళ్లాలని ప్రయత్నించినా గుర్రం అక్కడికి రాగానే గుగుర్పాటుకు గురై భయంతో వణికిపోయేది, ఒగర్చేది. చుట్టూ తిరిగి ఆ చోటు దాటాక తిరిగి బాటలోనికి వచ్చేది. తీవ్రంగా భయపడిపోయేది.
కుక్కలకు, గుర్రాలకు అమానుష శక్తుల జాడ తెలుస్తుందని, ఆత్మలు కనిపిస్తాయని అంటారు. సునామీలు, భూకంపాల వంటి ఉత్పాతాలను అవి ముందుగా తెలుసుకోగలుగుతాయని వెల్లడి అయింది.
మనం చూడలేని ఎన్నో దృగ్విషయాలను అవి చూడగలవని అంటారు. నేరస్తులను పట్టుకోవడానికి ఇప్పటికీ కుక్కల్ని ఉపయోగిస్తున్నారు. వాటి మానసిక శక్తుల పైన మనుషులు ఆధారపడుతున్నారు.
“అక్కడికి రాగానే గుర్రం ఎందుకు భయంతో వణికిపోతోంది? ఎందుకు దూరంగా పారిపోతోంది?”
చిన్నప్పుడు ఒక మంచుకురిసే శీతల రాత్రి నాణ్యమైన ఊలుతో తయారు చేసిన ఇంపోర్టెడ్ లాంగ్ కోటు వేసుకుని దామనాపల్లి ఊరి చివరి పాకలో ఉండే క్షుద్ర ఉపాసకుడైన గురవడిని, గుర్రం ఆ చోటుకు రాగానే ఎందుకు భయపడుతుందో, కారణం అడుగుదామని వెళ్ళాను. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల మసక దీపపు వెలుతురులో అతను నగ్నంగా మోకాలి పై నిలబడి కళ్ళు మూసుకుని పూజలు చేస్తున్నాడు. అతని ముందు పూజాపీఠం మీద రెండు మానవ కపాలాలు ఉన్నాయి. వాటిని చూసేసరికి నా గుండె జల్లుమంది. ఇంతలోనే అతడు నా ఉనికిని గుర్తించి నా పైపు చూసాడు. నేను వెంటనే పారిపోయి ఇంటికి వచ్చేశాను. చాలాసేపటికిగానీ నాలో వణుకు తగ్గలేదు. ఆ రాత్రి నాకు కాళరాత్రిలా గడిచింది.
ఆ గురవడు అంటే గ్రామంలో అందరికీ భయమే. అతడు ఎప్పుడూ తన తలలోని దెయ్యాలతో మాట్లాడుతూ ఉండేవాడు. అది నిజమో కాదో పక్కన పెడితే, ఒక రకంగా అతని కథ దీనమైనది. అతడు శక్తుల కోసం క్షుద్ర ఉపాసన చేశాడట. అవి కరుణించి అతని తలలోకి చేరాయట. అందువల్ల అతడికి ఎన్నో శక్తులు వచ్చాయట. అతడు తన మాట వినని వారి మీద క్షుద్ర శక్తుల్ని ప్రయోగించి అనారోగ్యానికి గురిచేయడం, చంపడం చేసేవాడట. అతడు ఎవరి మీద తన శక్తుల్ని ప్రయోగిస్తాడోనని వారంతా భయంతో బిక్కు బిక్కుమని ఉండేవారు. అతనితో మాట్లాడడానికి కూడా భయపడేవారు. అందువల్ల అతడు ఒంటరివాడై ఇతర గ్రామస్తులతో కాకుండా తన తలలోని దెయ్యాలతో మాత్రమే మాట్లాడుకునేవాడు. మొదట్లో తన శక్తుల్ని ఆనందంగా అనుభవించిన అతడు, తరువాత తరువాత అతని తలలోని దెయ్యాల గోలను భరించలేకపోయేవాడు. అవి అతన్ని నిలువనిచ్చేవి కాదు. బెదిరించేవి. అతడిని  వింత వింత పిచ్చి పనులు  చెయ్యమని బలవంత పెట్టేవి. వాటితో అవి గొడవపడేవి. అతడిని  చంపేస్తానని బెదిరించేవి. వాటి క్షుద్రత్వాన్ని భరించలేక అతడు రాత్రీ పగలూ తాగుతూనే ఉండేవాడు. అవి అతడిని నిద్రపోనిచ్చేవి కాదు. రోజంతా నిండు కడవెడు జీలుగు కల్లు తాగి స్పృహ తప్పి పడిపోతే తప్ప అతనికి నిద్ర, శాంతి లేదు.
ఒక రోజు గ్రామస్తులు నాన్న గారికి చెప్పారు, అతడు మా కుటుంబం మీదకు క్షుద్ర శక్తుల్ని పంపాడని, గత రాత్రి మనిషి ముఖం, పిల్లి దేహం ఉన్న ‘మలివలు’ అనే, మెడ కొరికి రక్తం తాగే క్షుద్ర శక్తులు మా ఇంటి ద్వారం దగ్గరకు వచ్చాయని, వాటిలో అవి మాట్లాడుకుని వెనక్కి వెళ్ళిపోయాయని.
సాయంత్రం తనలో తాను బిగ్గరగా మాట్లాడుకుంటూ వస్తున్న గురవడిని నాన్న గారు సరదాగా అడిగారు. “ఏమయ్యా! గురవడూ! మా ఇంటి మీదకి రాత్రి మలివల్ని పంపావట?”
అతడు సిగ్గుపడిపోతూ వినమ్రంగా అన్నాడు “మీ ఇంటిలో పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, మాస్టారు గారూ! వాటి నుండి వెలుగు వస్తున్నాది. నా శక్తులు మిమ్మల్ని ఏం చెయ్యగలవు! మీ దైవశక్తి ముందు నా శక్తి ఎంత!” అని చెప్పి త్వరత్వరగా వెళ్లిపోయాడు.
మా ఇంటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయని వాడికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోవడం మా నాన్న గారి వంతయింది.
“అయితే వెధవ అపకారం చెయ్యాలని అనుకున్నాడన్న మాట!” అని ఆయన నవ్వుకున్నారు.
అప్పటి నుండీ గురవడు నాన్న గారు ఎదురుపడితే భయపడేవాడు. అవమానభారంతో తలదించుకుని మౌనంగా వెళ్ళిపోయేవాడు.
“అతడు అధమ మానసిక చేతనావస్థలను అనుమతించాడు. అతడు అధమ పౌనఃపున్యంలోకి ఎప్పుడైతే చేరుకున్నాడో అదే పౌనఃపున్యంలో ఉండే క్షుద్ర శక్తుల అధీనంలోకి అతని చేతన వెళ్ళిపోతుంది. అవి తన తలలో చేరి దెయ్యాలవలె వేధిస్తున్నాయని అతను అన్నది నిజమే కావచ్చు. వాటిని అతనే ఆహ్వానించాడు. అటువంటి శక్తులను పొందడం చాలా సులభం. వదిలించుకోవడం మాత్రం కష్టం.” అని చెప్పారు నాన్న గారు.
ఆయన ఈ మాటలు చెప్పిన ఒక దశాబ్దం తరువాత టిబెటన్ యోగి మిలరపా జీవితం గురించి Tsangnyön Heruka (1452–1507) రాసిన The Life of Milarepa (Mila Katum) చదివినప్పుడు నాన్న గారి మాటలు గుర్తొచ్చాయి. క్షుద్ర శక్తుల్ని ఆవాహన చేసుకుని ఒక మనిషిని చంపిన మిలరెపా వాటిని విదిలించుకుని యోగిగా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ పుస్తకంలో రాయబడి ఉంది.
ఒక రోజు “గుర్రం ఎందుకు అక్కడ బెదిరిపోతోంది?” అని నాన్న గారు తలదించుకొని వెళుతున్న గురవడిని అడిగారు.
అతనికి ఆ చోటు తెలుసునని, అక్కడ ఎంతో శక్తివంతమైన పురాతన క్షుద్ర శక్తి ఉందని, అందుకే గుర్రం చుట్టూ తిరిగి వెళుతుందని, దాని పేరు “డుంబ” అని చెప్పాడు. అలాగే అక్కడ మమ్మల్ని కూడా చుట్టూ తిరిగి వెళ్ళమన్నాడు. వాటి జోలికి వెళ్ల వద్దని హెచ్చరించాడు. తాను క్షుద్ర శక్తుల్ని ఉపాసన చేసి తప్పు చేశానని, మెల్లగా, గుసగుసగా చెబుతూ, తన లోపలి దెయ్యాలు వింటాయేమోనని విపరీతంగా భయపడిపోయాడు. అవి మా నాన్న గారితో మాట్లాడితే అతన్ని చంపేస్తామని చాలా సార్లు హెచ్చరించాయట.
కొన్నింటికి ఎవరి వద్ద ఖచ్చితమైన సమాధానాలు ఉండవు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఊహించుకోవడం తప్ప ఎవరూ ఇతమిద్దంగా ఇది అని రుజువు చేయలేరు.
చీకటి పడబోతోంది. అప్పటి గుర్రం కళ్ళలోని భయం, దాని ఒగర్పు గుర్తుకు వచ్చి ఒళ్ళు గుగుర్పాటుకు గురైంది. బహుశా ఈ చోటులో నేల పొరల కింద ఏదైనా పురాతనమైన క్షుద్రశక్తి నిజంగా ఉండి ఉంటే దానిని అలా నిద్రపోనివ్వడమే సరైన విషయం అనిపించి, నేను చుట్టూ తిరిగి అక్కడి నుండి ముందుకు కదలాను.
 “డుంబ” ఉన్న ఆ అంతుచిక్కని చోటును విడిచి పెడుతుంటే ఒక బలమైన sinister and ill premonition లాంటి అనుభూతి కలిగింది.
(సశేషం)

శ్రీరామ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు