భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఆయా ప్రాంత గిరిజన సమూహాల సాక్షిగా, నాలుగు దశాబ్దాలుగా ఆదివాసీల అస్తిత్వ వేదనను అక్షరాల్లో నిక్షిప్తం చేస్తున్న అచ్చమైన మూలవాసీ గొంతుక పి. విద్యాసాగర్. కే టీ పీ ఎస్ విద్యుత్ కర్మాగారంలో పనిచేస్తూ బాహ్య ప్రపంచానికి వెలుగులు పంచుతూనే, దండకారణ్యపు చీకటి బతుకుల్లోకి, అణగారిన గిరిజనుల జీవితాల్లోకి తన కవిత్వపు వెలుగులు ప్రసరించిన గొప్ప సాహిత్య శ్రామికుడు ఈ కవిమిత్రుడు.
1985లో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి, ఆదివాసీల జీవితాన్నే తన ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నారు. 1995లో వెలువరించిన ‘దిష్టిబొమ్మ’ దీర్ఘ కవితతో గిరిజనుల ఆత్మగౌరవానికి కాపలాదారుగా నిలబడి, ‘గాలికట్ట’ కవితా సంపుటితో వారి జీవన లయను రికార్డు చేసి, ‘ముంపు’ దీర్ఘ కవితతో నిర్వాసితుల కన్నీటిని తన కవిత్వంలోకి ఒంపుకున్నారు.
పరాయీకరణకు గురవుతున్న ఆదివాసీల భాషను, సంస్కృతిని బతికించుకునే క్రమంలో త్వరలో వెలువడనున్న తన ‘పూర్భం’ కవితా సంపుటిని తెలుగుతో పాటు ఏకకాలంలో కోయ భాషలోకి కూడా తీసుకువస్తున్నారనడానికి ఆయన నిబద్ధతే సజీవ సాక్ష్యం. అంతేకాకుండా, దేశవ్యాప్త ఆదివాసీల ఆర్తిని తెలుగు నేలకు వినిపించేలా ఇప్పటికే సుమారు 300 పైగా హిందీ ఆదివాసీ కవితలను తెలుగులోకి అనువదించారు. ఆ మట్టితో, ఆ అడవితో, ఆ మనుషులతో ఆయనకున్న నెత్తుటి బంధం నుంచి ఉద్భవించిన అస్తిత్వ ఆక్రందనే ఈ “హెచ్చరిక” కవిత. అనాదిగా దోపిడీకి గురైన మూలవాసుల చారిత్రక, సాంస్కృతిక, భౌతిక సంపదను తిరిగి క్లెయిమ్ చేసుకునే ఒక బలమైన ప్రతిఘటన ఇది. అణగారిన వర్గాల శ్రమను, కళలను, దేహాలను, భూములను, చివరికి దేవుళ్లను సైతం ఆధిపత్య సమాజం ఎలా ఆక్రమించుకుందో ప్రశ్నిస్తూ, కోల్పోయిన ఆ అస్తిత్వాన్ని సగర్వంగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూపుదిద్దుకున్న ఆ కవితను ఒకసారి చదివి, పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశం. ఇది సారంగ పాఠకులకు ప్రత్యేకం

హెచ్చరిక
ఇచ్చేయ్!
శూర్పణఖ ముక్కు చెవుల్ని,
తెగ్గోసిన బొటన వేళ్ళని,
శబరి ఎంగిలి చేసిన రేగు పండ్లని,
వేలిముద్రలు మింగిన భూముల్ని,
సంకర వీర్యాన్ని మోసి
అలసిన గర్భసంచుల్ని
ఇచ్చి తీరాల్సిందే!
సినిమాలు ఎంగిలి చేసిన రేల పాటల్ని,
డీజేలు మింగిన తుడుం మోతల్ని,
నెలవంకల్ని, ఇంద్రధనస్సుల్ని
అడవి అందాల్ని, మహాగానాల్ని, నృత్యాల్ని
ఇచ్చెయ్యండహో!
దోచుకున్న సంస్కృతిని,
భాషల్ని, యాసల్ని, మాటల్ని
సంతలు మింగిన సహజత్వాన్ని
ఇచ్చి తీరాల్సిందే!
మేడారం జాతర్ని,
చిలకలగుట్ట అడవిలో
చేజార్చుకున్న కుంకుమ భరిణని,
ఇంద్రవెల్లి స్థూపాన్ని,
హిందుత్వం మింగిన
కొలుపుల్ని, వేల్పుల్ని
___________________________
ఈ కవిత ఆద్యంతం ఒక ధిక్కార శైలితో సాగింది. ‘ఇచ్చేయ్’, ‘ఇచ్చి తీరాల్సిందే’, ‘ఇచ్చెయ్యండహో’ అనే పదాలు కేవలం అభ్యర్థనలు కావు, అవి ఒక చారిత్రక నష్టానికి నష్టపరిహారం అడుగుతున్న తీవ్రమైన హెచ్చరికలు. ప్రధాన స్రవంతి పురాణాలను, చరిత్రను ప్రశ్నించే విలోమ శిల్పం ఈ కవితకు ప్రధాన బలాన్నిచ్చింది. కవిత ప్రారంభమే భౌతిక, శారీరక దోపిడీని ప్రశ్నించడంతో మొదలవుతుంది.
వేలిముద్రలు మింగిన భూముల్ని
సంకర వీర్యాన్ని మోసి
అలసిన గర్భసంచుల్ని
అనే వాక్యాలు చారిత్రక హింసకు దర్పణాలు. ఇందులో శూర్పణఖ ముక్కు చెవులు, తెగ్గోసిన బొటనవేలు మూలవాసుల ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యాలయ్యాయి. భూస్వామ్య వ్యవస్థ గిరిజనుల భూములను అక్రమంగా ఎలా లాక్కుందో, అగ్రవర్ణాల లైంగిక దాడికి గురైన ఆదివాసీ స్త్రీల చారిత్రక వేదన ఎలాంటిదో కవి అత్యంత పదునైన, గుండెల్ని పిండేసే పదచిత్రాల ద్వారా ఆవిష్కరించారు.
ఇలా వారి దేహాలపై, భూములపై సాగిన ఆధిపత్య వర్గాల క్రూరమైన దాడి అక్కడితో ఆగకుండా.. వారి కళల మీదికి ఎలా పాకిందో రెండవ చరణం దృశ్యమానం చేస్తుంది. ప్రముఖ మౌఖిక సాహిత్య పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు అంతరించిపోతున్న గిరిజన వాద్యాలను రక్షించడానికి ‘ఆదిధ్వని’ పేరిట చేసిన సుదీర్ఘ అన్వేషణ ఇక్కడ గుర్తుకు వస్తుంది.
సినిమాలు ఎంగిలి చేసిన రేల పాటల్ని
డీజేలు మింగిన తుడుం మోతల్ని
అనే వాక్యాల్లో వాడిన రేల పాటలు, తుడుం మోతలు ఆదివాసీల స్వచ్ఛమైన జీవన లయకు, కళాకారుణ్యానికి ప్రతీకలు. ఈ మూల కళారూపాలను పెట్టుబడిదారీ వినోద పరిశ్రమ ఎలా కబళించిందో ‘ఎంగిలి చేసిన’, ‘మింగిన’ అనే సజీవ పదచిత్రాల ద్వారా కవి అత్యంత శక్తివంతంగా చెప్పారు. ప్రకృతికి సంబంధించిన నెలవంకలు, ఇంద్రధనస్సులు సైతం కృత్రిమ వ్యాపార వస్తువులుగా మారిన వైనాన్ని కళ్ళకు కట్టారు.
కళలను, ప్రకృతిని వ్యాపార వస్తువులుగా మార్చిన ఆధిపత్య వ్యవస్థ… ఆ తర్వాత వారి మనుగడకు ఆధారమైన భాషను, అస్తిత్వాన్ని ఎలా కబళించిందో కవిత తదుపరి దశలో ప్రశ్నిస్తుంది. ఆచార్య జయధీర్ గారు తమ ‘తొవ్వ ముచ్చట్లు’ గ్రంథంలో గిరిజనులు తమ నేలకు దూరమై ఎలా సాంస్కృతిక పరాయీకరణకు గురవుతున్నారో సోదాహరణంగా హెచ్చరించారు. ఆ చారిత్రక వాస్తవమే ఈ కవితలో ‘సంతలు మింగిన సహజత్వాన్ని’ అనే పాదంలో ధ్వనిస్తుంది. మూలవాసుల యాసలను, భాషలను చిన్నచూపు చూస్తూనే, వారి సహజత్వాన్ని ప్రపంచీకరణ, మార్కెట్ శక్తులు ఎలా వస్తువుగా మార్చి మింగేశాయో ఈ భావచిత్రం స్పష్టం చేస్తుంది. కేవలం భౌతికమైనవే కాకుండా, అస్తిత్వానికి మూలమైన సంస్కృతిని సైతం కోల్పోయిన ఆవేదన ఈ కవితలో బలంగా వ్యక్తమైంది.
సంస్కృతిని, భాషను తమలో కలుపుకుని సహజత్వాన్ని నాశనం చేసిన ఆధిపత్యం.. చివరకు మూలవాసుల పవిత్రమైన నమ్మకాలను, దైవాలను సైతం ఎలా తనలో విలీనం చేసుకుందో కవిత ముగింపులో నిలదీస్తుంది. బయటనుంచి వచ్చిన ఆధిపత్య వర్గాలు.. ఆదివాసీ, బహుజనుల కళలను లాక్కొని, వారి స్థానిక పురాణాలను నాశనం చేసి అష్టాదశ పురాణాలను ఎలా ప్రచారం చేశాయో జయధీర్ గారి ‘జాంబ పురాణం’ పరిశోధన నిరూపించింది. సరిగ్గా అదే చారిత్రక కుట్రను ఈ కవిత
హిందుత్వం మింగిన
కొలుపుల్ని, వేల్పుల్ని
అంటూ నిలదీసింది. అణగారిన వర్గాల పోరాటాలకు, సాంస్కృతిక అస్తిత్వానికి సజీవ ప్రతీకలైన మేడారం జాతర, ఇంద్రవెల్లి స్థూపాన్నీ, ఆధిపత్య సమాజం ఎలా కబళించిందో కవి విమర్శనాత్మకంగా ఎండగట్టారు. ముఖ్యంగా…
చిలకలగుట్ట అడవిలో
చేజార్చుకున్న కుంకుమ భరిణ
అన్నప్పుడు కవి ప్రయోగించిన ధ్వని అత్యంత లోతైనది. కుంకుమ భరిణ చేజారడం అంటే కేవలం ఒక వస్తువు పోవడం కాదు; ఆ అడవి సాక్షిగా జరిగిన పోరాటంలో ఆ భరిణతో పాటే ఆదివాసీ స్త్రీల అదృష్ట రేఖలూ చెరిగిపోయాయి. తమ భర్తలను కోల్పోయి వారి సౌభాగ్య చిహ్నాలు మాసిపోయాయని, ఒక నిండు అర్ధాంగి అర్ధాయువు అయిపోయిందనే వ్యథ ఆ చేజారిన కుంకుమ భరిణలో అణువణువునా వ్యక్తమవుతోంది. ఇంతటి నెత్తుటి విషాదంతో ముడిపడి ఉన్న వారి నమ్మకాలను, దేవుళ్లను సైతం ఆధిపత్య మతం ఎలా మభ్యపెట్టి లాక్కుందో కవి ఈ చరణంలో అత్యంత ఆవేదనతో ప్రశ్నించారు.
ఈ కవిత భౌతిక దోపిడీతో మొదలై, కళల దోపిడీ గుండా ప్రయాణించి, సాంస్కృతిక విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ, చివరకు మతపరమైన ఆక్రమణను ఎదిరించే ఒక పరిపూర్ణ చారిత్రక క్రమాన్ని అద్భుతంగా నిర్మించి, పాఠకుడిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
ప్రముఖ సంతాలీ-హిందీ ఆదివాసీ కవయిత్రి నిర్మలా పుతుల్ తన ప్రసిద్ధ కవిత ‘ఆవో, మిల్కర్ బచాయేం’ (आओ, मिलकर बचाएं) లో చేసిన చారిత్రక ప్రకటన ఇక్కడ అప్రయత్నంగానే గుర్తుకు వస్తుంది.
आओ, मिलकर बचाएं
कि इस दौर में भी
बचाने को बहुत कुछ बचा है
अब भी हमारे पास।
(రండి, కలిసి కాపాడుకుందాం.. అన్నీ కోల్పోతున్న ఈ కాలంలోనూ, రక్షించుకోవడానికి మన దగ్గర ఇంకా ఎంతో మిగిలే ఉంది) అంటూ ఆమె తన సంస్కృతిని కాపాడుకునే పిలుపునిచ్చారు.
నిర్మలా పుతుల్ ‘మిగిలిన దాన్ని కాపాడుకుందాం’ అని ఆర్తిగా పిలుపునిస్తే, విద్యాసాగర్ గారు ఒక అడుగు ముందుకేసి ‘దోచుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయండి’ అని ఆధిపత్య వర్గాలను హెచ్చరించారు. నిర్మలా పుతుల్ ది ఆత్మరక్షణ స్వరమైతే, విద్యాసాగర్ గారిది ఎదురుదాడి గొంతుక. భాషలు వేరైనా, కోణాలు వేరైనా… అడవి బిడ్డల ఆత్మగౌరవ పోరాటంలో ఈ రెండు కవితలూ అస్తిత్వ ప్రకటనకు రెండు ముఖాలే!
*








ధన్యవాదాలు అఫ్సర్ గారు, విల్సన్ రావు గారు.