ఆంగ్లంలో రామదాసు పలుకులు

క్కో సారి అనిపిస్తుంది.

ఎన్నోవేల సంవత్సరాలకు చెందిన వాల్మీకి దేశమంతటా ఎలా విద్యుత్తేజంలా వ్యాపించారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీరాముడనే కథానాయకుడిని దేశమంతటా విస్తరింపచేసిన వాల్మీకి రామాయణం రచించినప్పుడు  భారత దేశ చరిత్రలో  శ్రీరాముడు సుస్థిరంగా ఉండిపోతాడని, వర్తమానాన్ని, చరిత్రను ప్రభావితం చేస్తారని ఆయనైనా ఊహించారా అన్న ఆలోచన మెరుస్తుంది.  ‘High in the Sky at Vishnupada’ అన్న పేరుతో అన్నమయ్య సంకీర్తనలను అనువాదం చేసిన . మాడభూషి రాజగోపాల చారి  తాజాగా Shower Your Mercy O Sri Rama! అన్న పేరుతో రామదాసు కీర్తనలను అద్భుతంగా అనువాదం చేసిన తీరు ఎంతో అబ్బురం కలిగించింది.  రాజగోపాల చారి వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో కొన్ని దశాబ్దాల పాటు ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేసి ఎన్నో రచనలు చేశారు.

ప్రాచీన, ఆధునిక కవులను రామాయణం ప్రభావితం చేసినంతగా మరే కావ్యమూ ప్రభావితం చేయలేదనడం అతిశయోక్తి కాదు. ‘అగణిత భోగభాగ్యముల నాసవహింపగ లేదు’ కాని…. అని మా తాతగారు అప్పరుసు నరసింహారావు ‘వీరరాఘవా’ అన్న మకుటంతో రాసిన పద్యాలు చదివినప్పుడు  అసలు దక్షిణాదిన శ్రీరాముడిని ఆరాధించడం ఎప్పుడు జరిగిందనే జిజ్ఞాస నాలో ఎప్పటి నుంచో ఉన్నది. శ్రీరాముడు, హనుమంతుడు లేని ఊళ్లు ఏమైనా ఉన్నాయా అన్న సందేహం నాలో కలిగింది.శ్రీరాముడు కేవలం ఒక పురాణ దేవుడు మాత్రమే కాదు; భారతదేశంలో సంచార యుగం నుండి వ్యవసాయ యుగానికి, గిరిజన సమాజాల నుండి రాజ్యాల ఏర్పాటు దిశగా జరిగిన పెద్ద సామాజిక-ఆర్థిక పరిణామ క్రమానికి సూచికగా   ప్రముఖ చరిత్రకారుడు డిడి కొశాంబి అభివర్ణించారు. రాముడు  ఉత్తరాదిన మాత్రమే కాదు, దక్షిణాదినే కాదు దేశమంతటా కూడా ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.

దక్షిణాది విషయానికి వస్తే కేరళలో జన్మించిన శంకరాచార్యుడు 8వ శతాబ్దంలోనే దేశమంతటా సంచరిస్తూ శ్రీరాముడిని స్తుతిస్తూ శ్లోకాలు రచించారు. ఆయన రచించిన ‘వామాంకస్థిత జానకీ పరివిలసత్ కోదండదండం కరే,చక్రాబ్జాద్యయుధైః శ్రితం వికసితాంభోజాయతాక్షం హరిమ్,భక్తానామభయప్రదం రఘువరం రత్నాంగదాంగీకృతం,రామం శ్యామలకోమలాంగమనిశం వందే ధనుర్ధారిణమ్’ అన్న శ్లోకం బహుళ ప్రచారంలో ఉన్నది. కాని శంకరాచార్యుడికి ముందే నాగార్జున కొండ త్రవ్వకాల్లో 3వ శతాబ్దానికి చెందిన సున్నపురాయి శిల్పాల్లో   రామాయణ కథ చిత్రణ కనిపిస్తుంది.  6-7 శతాబ్దానికి చెందిన ఉండవల్లి, మొగల్లాజపురంలోని గుహల్లో రాతిపై మలచిన శ్రీరాముడి జీవిత ఘట్టాలు గోచరిస్తాయి, 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, బాదామి చాళుక్యులు, పల్లవుల వరకు శ్రీరాముడి ఆరాధన కనిపిస్తుంది. ఎన్నో శ్రీరాముడి ఆలయాలు ఆ సమయంలోనే దక్షిణాదిన అంతా నిర్మించారు. ఈ కాలంలోనే కులశేఖర ఆళ్వార్, నమ్మళ్వార్. పెరియాళ్వార్, ఆండాళ్ (గోదాదేవి), తిరుమంగై ఆళ్వార్ లల రచనల్లో శ్రీరాముని అవతార వైభవాన్ని, గుణగణాలను అద్భుతంగా కీర్తించారు.

తెలుగు సాహిత్యంలో ఆది కవిగా పేరొందిన నన్నయ్య ద్వారా 11వ శతాబ్దంలో శ్రీరాముడు సాహిత్యంలో ప్రవేశించారు. అరణ్యపర్వంలో మార్కండేయ ముని యుధిష్టిరుడికి రామోపాఖ్యానాన్ని వివరించే ఘట్టం ఉంటుంది. నన్నయ్య రాజమహేంద్రవరానికి చెందిన వారైతే ప్రస్తుత తెలంగాణలో ని పాలమూరుకు చెందిన గోన బుద్దారెడ్డి 13వ శతాబ్దంలో  రామాయణాన్ని పూర్తి కావ్యంగా ద్విపద రూపంలో రంగనాథ రామాయణం పేరుతో రచించారు. 12వ శతాబ్దికి చెందిన కవి పాల్కురుకి సోమానాథుడి సాహిత్యంలో కూడా శ్రీరాముడి ప్రస్తావన వీరశైవ దృక్పథంతో కనిపిస్తుంది. శైవసాహిత్యంలో శ్రీరాముడి గురించి ఎంతో ఆరాధనా భావంతో చిత్రించారు. 12వ శతాబ్దంలోనే రామేశ్వరం లోని రామనాథ దేవాలయాన్ని నిర్మించినప్పటికీ శ్రీరాముడు ఇక్కడే శివుడి ఆశీర్వాదాన్నికోరేందుకు పూజించారనే కథనం ప్రచారంలో ఉన్నది. శ్రీరాముడు, శివుడు ఇద్దరికీ ఇరువురూ ఇష్ట దేవతలేనని శైవ సాహిత్యంలో అభివర్ణించారు.13వశతాబ్దంలోకవిత్రయంలో  ఒకరైన  తిక్కన  వాల్మీకి ఉత్తరకాండ ఆధారంగా నిర్వచనోత్తర రామాయణం రచించారు.   14వ శతాబ్దంలో ఎర్రన్న కూడా రామాయణాన్ని చంపూ శైలిలో రచించారు. ఆయన రచించిన నృసింహపురాణంలో కూడా శ్రీరాముడి ప్రస్తావన ఉంటుంది.   క్రమంగా  రామాయణం దక్షిణాదిన జానపద గీతాల్లో,స్త్రీల పాటల్లో, తోలు బొమ్మలాటలో, యక్షగానాల్లో స్థూలంగా మొత్తం గ్రామీణ జీవనంలో వ్యాప్తి చెందింది.  13 వ శతాబ్దికి చెందిన బద్దెన్న సుమతీ శతకం లో ‘శ్రీరాముడి దయచేతను, ఆరూఢిగ సకల జనులు ఔరా’ యనగా పద్యం కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వారి నోళ్లలో నానింది.

భక్తి సాహిత్య యుగం  శ్రీరాముడు ఇంటింటా వెలిసేలా చేసింది. శ్రీరాముడు తారకమంత్రం అయ్యాడు. 14 శతాబ్దికి చెందిన అన్నమయ్య ‘శ్రీరాముడు, లోకాభి రాముడు’ అంటూ పరవశుడయ్యారు  ‘జో అచ్యుతానంద జోజో ముకుందా,రావే పరమానంద రామ గోవిందా’ అంటూ శ్రీరామ కథను సామాన్య ప్రజలకు చేరవేశారు. 18వ శతాబ్దికి చెందిన త్యాగయ్య ‘నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా’ అని రామనామాన్ని అమృత తుల్యం చేశారు. ‘ఎంతనే వర్ణింతును శబరి భాగ్యం’ అని తన్మయత్వం చెందారు. ‘ఎన్నగాని రామభజన’ అని ఆలపించారు. రాముడొకడు పుట్టి రవికులమీడేర్చి అని ప్రజాకవి వేమన కూడా పద్యాలు రచించారు.

ఆధునిక యుగంలో రామాయణాన్ని ప్రేమించిన, కవిత్వీకరించిన వారు పలువురు. ఆంధ్ర వాల్మీకిగా పేరొందిన  వావికొలను సుబ్బారావు నుంచి  కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ వరకూ  రామాయణాన్ని తమదైన సాహిత్యంలో సృజించిన వారెందరో. శ్రీశ్రీ, మధురాంతకం రాజారాం నుంచి కాళోజీ వరకు తమ కవితల్లో రాముడి గురించి ప్రస్తావించకుండా ఊరుకోలేదు.

‘ఏది నీ దేశమనినన్నెవరైనా అడిగి చూడుడు, నాది రాముని దేశమందును, నేను రాముని దాసుడందును. ఎవని నామోఛ్చారణమ్మున బోయవాడు మహర్షి యాయెను, పుట్టగానే కవిత ఎవ్వని పుట్టును కీర్తింపదొడగెను.’ అని  మధురాంతకం రచించారు. ‘సంసారములో మునకలు వేయుచు సతమతమౌచుంటిని నే సతతము అపరాధము మన్నించి దీనుయెడ కృపజూపర రఘురామ స్వామి’. అని కాళోజీ రాశారు.   ‘రఘురాముడు, రమణీయ, వినీల ఘనశ్యాముడు’ అని  1961లో వచ్చిన వాగ్దానం సినిమాలో శ్రీశ్రీ లిఖించారు.

ఇక రాజగోపాలాచారి  చెప్పినట్లు  17వ  శతాబ్దికి చెందిన  భద్రాచల రామదాసు గురించి చెప్పనక్కర్లేదు.  దాశరథీ కరుణాపయోనిధీ, శ్రీరఘురామ, చారు తులసీ దళధామ వంటి  వంద అద్భుత పద్యాలు రచించిన రామదాసు అంతా రామమయం, జగమంతా రామమయం, పలుకే బంగారమాయెనా, అదిగో భద్రాద్రీ, ఎటుబోతివో రామా, ఎటు బోతివో,రాముని వారము మేము మాకేమి విచారము, శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగా బోచె,రామనామమే జీవనము అని ఎన్నోకీర్తనలు లిఖించారు. ఇక ఆయన తర్వాతి కాలానికి చెందిన  తూము నరసింహదాసు కూడా ‘వారిజాక్ష రమాధీశ బహుపరాకు’ అంటూ  భద్రాద్రి రాముడిని ఇష్టదైవంగా ప్రార్థించాడు. పోయెదమయ్యా వైకుంఠమునకు పోవుచున్నాను శ్రియఃపతిని తలిచి ఆయన 17 మంది శిష్యులతో కలిసి గోదావరిలో ఆత్మార్పణం చేసి, జీవన్ముక్తి పొందినట్లు కథనాలున్నాయి.. ఎంతటి భక్తి !

ప్రముఖ  యకుడు, సంగీత విమర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మాటల్లో చెప్పాలంటే  రామదాసు పాటలో ఆత్మను కదిలించే తత్వం, భావాల లోతు, మధురమైన సంగీతం, మానవీయ స్పర్శ ఉంటుంది. కంచెర్ల గోపన్న నుంచి రామదాసుగా మారిన ఈ వాగ్గేయకారుడు ఎక్కడో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో జన్మించినప్పటికీ ఆయన కీర్తనలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలోని భక్తి సాంస్కృతిక సంప్రదాయంలో సంకీర్తనా గోష్ఠులు మరియు భజనలలో తప్పనిసరి భాగంగా మారాయి. ఆయన మూలంగా భద్రాచలం ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా రూపొందింది.   అంతకు ముందు ఎన్నో ఏళ్ల ముందే ఈ ఆలయం ఉన్నట్లు కథలు  వ్యాప్తిలో ఉన్నా,  12, 13వ శతాబ్దాలలో కాకతీయ సామ్రాజ్యంలో  భాగమైన భద్రాచలం ఆ సామ్రాజ్యం పతనమైన తర్వాత అడవుల్లో చిక్కుకుపోయిందని అందరికీ తెలుసు. 17వశతాబ్దిలో గోపన్న తహశీల్దార్‌గా నియమితులయ్యే వరకు అక్కడ నిక్షిప్తమైన ఉన్న సీతారామలక్ష్మణుల విగ్రహాలు ప్రపంచం దృష్టికి రాలేదు. ఆయన తహశీల్దార్‌గా వసూలు చేసిన రాబడితో భద్రాచలంలోని శ్రీరాముని ఆలయాన్ని పునరుద్ధరించినందుకు గోపన్న పన్నెండేళ్ల పాటు జైలు శిక్ష, చిత్రహింసలను అనుభవించాల్సి వచ్చింది.

రామదాసు సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు. కలయే గోపాలం, ‘నందబాలం భజరే బృందావన వాసుదేవం. అంటూ రచించిన కీర్తనల్లోను, దాశరథీ కరుణాపయోనిధీ పద్యాల్లోనూ సంస్కృత భాషపై ఆయనకు పట్టు కనిపిస్తుంది. కాని వైష్ణవ భక్తి సంప్రదాయంలో కొట్టుకుపోయినందువల్లనేమో, ప్రజల భాషలో రాయాలనుకున్నారేమో కాని ఆయన జనసామాన్యుడికి అర్థమయ్యే భాషల్లో  కీర్తనలు రాశారు. త్యాగరాజు లా ఆయన శాస్త్రీయ కచేరీలకోసం గీతాలు రచించలేదు. సామాన్య ప్రజలు పాడుకునేందుకు రాశారు. తన  అస్తిత్వ వేదన, తన భక్తి, తన నిజాయితీని వ్యక్తీకరించేందుకు  ఆయన రచించారు.  అబ్బబ్బా దెబ్బలకోర్వలోను రామచంద్రా అని ఆయన గోలకొండ ఖైదులో కొరడా దెబ్బలు తింటూనే ఆలపించిన గీతాలు రాళ్లను కూడా కరిగించాయి. ఆ హింస భరించలేక  ఆ దేవుడిని తిట్టినా అది జనం అర్థం చేసుకుని కన్నీళ్లు పెట్టారు. ఎంతో వేదనలోనూ దేవుడిపై  అచంచలమైన భక్తిని, శరణాగతిని ప్రదర్శించారు.

రాజగోపాల చారి రచించిన అనువాదాలు శ్రీరామదాసు కీర్తనల్లోని గొప్పతనాన్ని  ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ అనువాదాలు చదువుతుంటే రామదాసు ఆంగ్లంలోనూ తనను తాను వ్యక్తీకరించుకున్నారా అనిపిస్తుంది. Everything radiates with Sri Rama, and Sri Rama pervades Entire Universe (అంతా రామమయం, జగమంతా రామమయం)),Where is the dearth for us as long as Lord Sri Rama with us (తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు),O savior of the servants! Splendour of the Sun! Full Moon of the Sea of the dynasty!(నన్ను గన్న తండ్రీ, మదిలో నీకన్న నితరులను గొలిచెదనా ఆపన్న రక్షకా), Is there anything greater than chanting the holy name of Rama?(ఎన్నగాని రామభజన కన్నమిక్కిలున్నదా)(What a sweet savour your name has O Sri Rama! How delicious is it beyond words O Rama! (శ్రీరామ నీ నామమేమి రుచిరా)If you intently chant the enchanting form of the Lord without fatigue, the holy name of Rama drives away all your piled up sins (మార సుందరాకారుని వేసారక ఎప్పుడు కోరి భజించుచుండ ) I don’t know how your benevolence upon me, O scion of Solar dynasty! Is it possible for me to cross the ocean of earthly ties, O Lotus eyed  Rama! (ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా!నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా!),Are your words are so precious as gold, O lord with bow, so precious! (పలుకే బంగారమాయెనా కోదండ పాణి పలుకే  బంగారమాయెనా),O Lord Seetharama, what is the crime, I have committed? (సీతారామస్వామి, నే చేసిన నేరంబేమి),I beg you O Mother Sita, to persuade Sri Rama  come to my rescue !(నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే),I yearned for it and earned it-the Taraka Mantra-that enables us to cross the ocean of earthly ties! Bless am I, O my brother!)(తారక మంత్రము కోరిన దొరకదు ధన్యుడనైతిని ఓ రామా).. ఇలా ఆ అనువాదాలు రామదాసు మూల రచనల్లోని సరళతను, గాఢతను వ్యక్తం చేస్తాయి.

రాజగోపాల చారి అభివర్ణించిన రామదాసు ఒక ధిక్కార శక్తి. తన కావ్యాన్ని రాజులకు అంకితమీయబోనని చెప్పిన పోతన లో ఎంత ధిక్కారం ఉన్నదో రామదాసులో అంత ధిక్కారం ఉన్నది. కాని రామదాసు పోతనను అధిగమించి రాజ్యాన్నే ధిక్కరించారు. ప్రభుత్వం పట్టి పీడించి వసూలు చేసే ధనాన్ని ప్రజలు ఆరాధించే దేవాలయాల పునరుద్దరణకు ఉపయోగించి రాజ్య శక్తిని సవాలు చేశారు. ఇది ఆ నేలకున్న శక్తి.  నేటి నికృష్టుల్లా రామదాసు అయోధ్యలో శ్రీరాముడి మందిరంలోని హుండీల్లో నిధుల్ని సైతం స్వాహా చేయలేదు. ఇది నాటి కాలానికీ, నేటి కాలానికీ ఉన్న వ్యత్యాసం.

రెండవది, నాటి పాలకులు రామదాసును హిందూమత అనుయాయిగా భావించి శిక్షించలేదు. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినందుకు శిక్షించారు. అదే పాలకులు రామదాసు భక్తిని గౌరవించి ఆయనను విడుదల చేశారు. రామలక్ష్మణులు తానీషా కలలోకి వచ్చి రామదాసు ఇవ్వాల్సిన పైకాన్ని ఇచ్చినందుకు ఆయన విడుదల చేశారని రామదాసుతో పాటు ప్రజలు విశ్వసించారు. శ్రీరాముడు తనకు దర్శనమీయలేదని నాటి పాలకులూ ఖండించలేదు. పైగా 1785లో రెండవ నవాబు నిజామలీ ఆలయాన్ని పునరుద్దరించి దేవాలయ భృతికి రూ. 40వేలు కేటాయించారని, నిజాం ప్రభుత్వం  అనేక సంవత్సరాలు ఆలయ నిర్వహణ చేసిందని చరిత్ర చెబుతోంది. ఇది కూడా పాలకుల మనస్తత్వంలో తేడాను తెలియజేస్తుంది. నాడు ప్రభుత్వాలు ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరిచినందుకు భక్తుడిని శిక్షించాయి. నేడు ఆలయాల్ని కొల్లగొట్టిన శక్తులను కాపాడుతున్నారనే అభిప్రాయం నెలకొంది.  రాజగోపాలా చారి  రామదాసు ద్వారా ఆంగ్లంలో చేయించిన గానాలు ఈ శక్తులను బహిర్గత పరుస్తున్నాయి.

రామాయణం మతానికీ, మత వ్యవస్థకూ అతీతమైనది. అదొక ప్రాచీన గాథ. ఈ గాథను అపహాస్యం చేసేందుకు ఇప్పుడు వికృత శక్తులు ప్రవేశించాయి. ఈ వికృత శక్తులను దునుమాడేందుకు మళ్లీ రాముడు అవతరిస్తారా?

(Shower Your Mercy, O Sri Rama! (Bhadrachala Ramadasu Kirtanas in English) by Prof. M. Rajagopalachary, Published by Authorspress, Q-2A, Haus Khas Enclave, New Delhi-11016 (India) Price Rs.395)

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)


  • రామతత్వాన్ని కథగా,చరిత్రగా,కావ్యంగా,
    గేయంగా,పాలనా పుస్తకంగా,రాజనీతిశాస్త్రంగా,
    మానవజాతి గీతంగా పలుభంగుల ఆవిష్కరించిన
    కృష్ణుడుగారి వ్యాస విన్యాసం,
    ఆచార్య మడభూషి రాజగోపాలాచార్యగారి
    అనువాద కథామృతాన్ని వివరించిన విధానం
    విశిష్టం,విభిన్నం,విలక్షణం
    విలువైన వ్యాసాన్ని అందించిన కృష్ణారావుగారికి
    వేద్దాం వీరతాళ్లు!

  • చాలా బాగుందండి. పుస్తకంలోని భక్తి రసాన్ని, ఆధ్యాత్మిక లోతులను మీ సమీక్ష ద్వారా చాలా అందంగా ఆవిష్కరించారు.
    – కోవెల గోపాలా చార్య

  • అత్యద్భుతం. రామకథను రామమహిమను తలుచుకోని భాష, తరించని మానవుడు లేదు.

    శ్రీ రాజగోపాలాచారి గారికి అనేక అభినందనలు , కృష్ణుడు గారి రమణీయ విస్తృత సమీక్షకు ధన్యవాదాలు. తప్పక కొని చదవవలసిన పుస్తకం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.