హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, సాయంత్ర వేళ.
పగలంతా ఆఫీస్ లో కంప్యూటర్ ముందు గడిపిన వేల మంది ఉద్యోగులకు ఊరట నిచ్చే రోడ్డు అది. ఐటీ కంపెనీల నుంచి బయటికొచ్చిన ఉద్యోగుల వాహనాలతో
బహుళ అంతస్తుల భవనాల వెలుగు జిలుగులు, వాహనాల హెడ్ లైట్లు కలిసి గచ్చిబౌలి రోడ్డును ఓ కాంతివంతమైన చిత్రపటంలా మార్చాయి. ఫ్లైఓవర్ పై వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తున్నది. వివిధ రకాల నియాన్ సైన్ బోర్డులు తమ ఉనికిని చాటుతూ కంటికి ఇంపుగా ఉన్నాయి.
పాదచారుల సందడి కూడా ఆ సాయంత్రంలో భాగమే. ఆ రోడ్డు పక్కన దోసె, బిర్యాని, రకరకాల చాట్ బండ్ల నుంచి వచ్చే మసాలా ఘుమఘుమలు ఆ చల్లగాలిలో ముక్కుపుటల్ని తాకి ఊరిస్తుంటే ఆగిపోయే జనం ..ఆ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.
ఈ జీవన లయలోంచి 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివాని తన కో-లివింగ్ స్పేస్ ‘హార్మొనీ హోమ్స్’ లోకి అడుగుపెట్టింది. ఆ అధునాతన కో లివింగ్ స్పేస్ లోనే ఆమె ఉంటున్నది.
‘హార్మొనీ హోమ్స్’ శివానికి కేవలం ఇల్లు కాదు; ఆమె కలలకు, స్వతంత్ర ఆలోచనలకు, స్నేహానికి, స్వేచ్చకు, ఆధునిక ఆకాంక్షలకు ప్రతీక.
శివానిలా నగరానికి వచ్చే యువతకు ఈ కో లివింగ్ స్పేస్ ఒక సౌకర్యం. కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, లాండ్రీ, జిమ్, వైఫై, ఫ్రిజ్, టీవీ, రన్నింగ్ వాటర్ వంటి ఎన్నెన్నో సౌకర్యాలతో కూడిన ఇల్లు. అద్దె ఇంటిలో ఉండే ఖర్చులు, ఒంటరితనం, భద్రతా భయం లేకుండా అందరితో కలిసి ఉన్నానన్న మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ప్రదేశం.
లోపలికి అడుగుపెడుతున్న శివానిని చిరునవ్వుతో పలుకరించే స్నేహితుల ముఖాలు, తాకిన చల్లని గాలి ఆమె అలసటను తీర్చాయి. గోడలపై ఉన్న రంగుల ఆర్ట్, కిచెన్ నుంచి వచ్చే కాఫీ సుగంధం తో కూడిన వాతావరణం తన ఇంటిని గుర్తు చేసింది. ఇల్లు, అమ్మ నాన్నలను తలుచుకోగానే హృదయం బరువుగా మూలిగింది.
రేపు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలో ఏమో! ఎంత చెప్పినా అమ్మానాన్న మళ్ళీ మొదటికి వస్తున్నారు. మళ్లీ అదే గోల. పెళ్లి గోల, అంతకు మించి ఈ లోకంలో మరేమి లేనట్టు మాట్లాడుతున్నారు’ అని బాధగా నిట్టూర్చింది.
రెండడుగులు వేసేసరికి కిచెన్ లోంచి నవ్వులు వినిపించాయి. తనలాగే కొన్ని లక్ష్యాలతో అక్కడ చేరిన కన్నడిగుడైన అర్జున్ గౌడ, బెంగాలీ మీరా భట్టాచార్య, తమిళ అమ్మాయి శ్రీ రంగరాజన్ ఏదో జోక్ వేసుకుని పకపకా నవ్వుకుంటున్నారు. అంతలో టపాకాయలు బాగా పేలుతున్నాయ్.. కారణం ఏంటో అంటూ వచ్చింది గుజరాతీ అమ్మాయి మోనా శర్మ. వాళ్ళను చూసి తానూ వెళ్లి వాళ్లలో కలిసింది శివాని.
వారితో మంచి స్నేహం ఏర్పడింది శివానికి. వయసులో ఐదారేళ్ల తేడా ఉన్నప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ, మాట్లాడే భాషలు ఏమైనప్పటికీ అంతా ఒక కొత్త కుటుంబంలా మారారు. సమర్ధవంతమైన సౌకర్యవంతమైన జీవితం అందుకుంటున్నారు.
ఆఫీసు అయ్యాక కో లివింగ్ మిత్రులతో కలిసి వంట చేస్తూ, సినిమాలు చూస్తూ, భవిష్యత్తు కలల గురించి చర్చిస్తూ శివాని సంతోషంగా గడుపుతున్నది. అందరినీ చూస్తూ ‘ఏ భయాలు లేకుండా ఇక్కడ నేను నేనుగా ఎంత కాలమైనా ఉండగలను’ మరోసారి మనసులో అనుకుంది.
కానీ ఈ స్వేచ్ఛ ఆమె తల్లిదండ్రులకు భయం గా మారింది. కంటి మీద కునుకు పట్టనీయడంలేదు.
***
విజయవాడ సమీపంలోని పల్లెలో జీవిస్తున్న సరళ, రామకృష్ణల జీవితం సంప్రదాయబద్దంగా ఉంటుంది. ఆడపిల్లలకు పెళ్లి, అత్తింటి ఆదరణే భద్రత అని సరళ నమ్ముతుంది. రామకృష్ణ అందుకు భిన్నం ఏమీ కాదు.
శివాని భవిష్యత్తు గురించి సరళ ఎన్నో కలలు కన్నది. ఆ దంపతులిద్దరూ కూతురి కోసం రూపాయికి రూపాయి ముడి వేశారు. ఆ సొమ్ముతో ఆస్తి అంతస్తు ఉన్న వరుడిని కానుకగా ఇవ్వాలని, ఘనంగా పెళ్లి చేయాలనీ ఆశ పడుతున్నారు. కానీ, ఆ కలలు ఇప్పుడు తమకు అర్థం కాని దిశలో పయనిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఒంటరిగా ఉండట్లేదు, కో లివింగ్ లో ఉన్నానని శివాని ఎంత చెప్పినప్పటికీ అది సురక్షితమా? అసలు ఈ కో-లివింగ్ ఏంటి?” అని సరళ సందేహం పోవట్లేదు. కూతురి మీద ఉన్న ప్రేమ వారిలో మరింత ఆందోళన, అసహనం పెంచుతున్నది.
శివాని ఎంత వివరించి చెప్పినప్పటికీ ఆ మాటలు వారి చెవికి ఎక్కట్లేదు. ఆందోళన తగ్గట్లేదు. మానసిక అశాంతి పెరిగిపోతున్నది.
బిడ్డపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ తెలియని భయం వాళ్ళని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆ క్రమంలోనే సరళ ఈ మధ్య చాలా సార్లు అదుపుతప్పి మాట్లాడుతున్నది. రామకృష్ణ తన ఆవేదనను, అసహనాన్ని, కూతురు నిర్ణయాలపై తన అసంతృప్తిని ఒకటి రెండుసార్లు వెళ్లగక్కినప్పటికీ చాలా వరకు అదుపులో పెట్టుకోవడానికి కష్టపడుతున్నాడు.
ప్రతి ఆదివారం జరిగే ఫోన్ సంభాషణ వారి మధ్య సంఘర్షణ కారణమై దూరం పెంచుతున్నది. “శివానీ, ఈ సారి చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో స్థిరపడ్డాడు అనో లేదా మరేదో దేశంలో ఉన్నాడు అనో సరళ చెప్పడం, “అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకిప్పుడు పెళ్లి ఆలోచన లేదు. నా కెరీర్ మీద దృష్టి పెట్టాలి,” అని శివాని ఒక్కోసారి మెత్తగా చెప్పడం, మరోసారి తల్లిపై అరవడం, విసుక్కోవటం మామూలైపోయింది.
ఆ తల్లి అదేమీ పట్టించుకోకుండా “మంచి సంబంధం వదులుకుంటావా? ఒక్కసారి వచ్చి వెళ్ళు” అని బతిమాలడం, శివాని ససేమిరా ప్రతి వారం ఉన్నదే.
అక్కడ కూర్చున్న నీకు ఇక్కడ మా బాధ అర్థం కాదే. అయినవాళ్లు, కాని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చస్తున్నాను.” అని సరళ కంటతడి పెట్టడం, కోపం, ఆందోళన కలిసి చాలా పరుషంగా మాట్లాడడం, అవి శివాని గుండెలో గాయాలై గుచ్చుకుని మరింత పట్టుదల పెంచేవి.
“అమ్మా .. నేను చాలా సంతోషంగా, భద్రంగా ఉన్నానంటే వినకుండా అర్థం చేసుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇంటికి ఫోన్ చేయాలంటే భయమేస్తున్నది. ఎంతసేపూ నీ గోలతప్ప నన్నెందుకు అర్థం చేసుకోవు?” అని శివాని గట్టిగా అరవడం వెనుక తరతరాల మానసిక దూరం ప్రతిబింబిస్తున్నది.
తల్లీబిడ్డల సంవాదం విన్న రామకృష్ణ ఒక్కోసారి కలుగజేసుకుని సర్ది చెప్పడానికి యత్నించేవాడు. చాలా సార్లు మనస్సులోనే బాధపడేవాడు.
***
సరళ జీవితంలో సమాజం అదృశ్య గీతలు గీస్తున్నది. బంధు మిత్రులు కలిసినప్పుడు గతంలో లాగా పప్పన్నం ఎప్పుడు అని అడగటం మానేశారు.
ఒకరోజు “శివానికి కో-లివింగ్‌లో ఉంటున్నదట కదా? పరువు మర్యాదలు గల ఇంటి ఆడపిల్ల అలా ఎలా ఉంటుంది? ఆ.. ఇట్లయితే ఇక ఆ పిల్లకు పెళ్లయినట్లే .. ” అనిదీర్ఘాలు తీస్తూ ప్రశ్నలు.. వెటకారాలు..
“కో లివింగ్ హౌస్… అంటే అదేంటో” అని ఒకరంటే
“ఎంత చక్కెర పులిమితే చెబితే మాత్రం..” అని మరొకరు అంటుండగా ” కోలివింగ్ స్పేసా.. అదో బ్రోతల్ హౌస్ లాంటిది” అంటూ ఎగతాళిగా నవ్వింది మరొకావిడ.
పక్కింటి రాధమ్మయితే, “పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుం
గుండెలో వేయి కత్తులు దింపిన బాధతో విలవిలలాడింది సరళ.
జులాయిగా తిరిగే తన అక్క కొడుక్కి శివానినిచ్చి పెళ్లి చేయాలని ఆశ పడింది రాధమ్మ. కానీ అందుకు శివాని ఒప్పుకోలేదు. అది మనసులో పెట్టుకొని రాధమ్మే ఆ విధంగా మాట్లాడించిదని సరళ అనుమానం.
అయితే, అప్పటికే ఒక వార్తా పత్రికలో ‘కో-లివింగ్ స్పేస్‌లలో ఆడ, మగ కలిసి ఉండటం మన సమాజానికి సరిపడదు’ అని చదివి సరళ కలవరపడింది. వీరి మాటలతో ‘నా బిడ్డ సురక్షితంగా ఉందా?’ అని తీవ్ర సంఘర్షణకు లోనైంది. అటు కూతురు ఇటు సమాజం మధ్య నలిగిపోతూ నిద్రపోని రాత్రులు ఎన్నో ఆమెకు?!.
***
శివానికి తన కలలు స్పష్టం. ఆమె ప్రముఖ కంపెనీలో ఒక కీలక ప్రాజెక్ట్ లీడ్ గా పని చేస్తున్నది. తన స్టార్టప్ ఆలోచనకు ప్రణాళిక వేసుకుని రూపొందించే క్రమంలో ముందుకు పోతున్నది. తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్న తర్వాతే పెళ్లి అనుకుంటున్నది. అందుకే పెళ్లి ఊసు ఇప్పుడే వద్దని స్థిర నిర్ణయంతో ఉన్నది.
‘అమ్మా.. నాన్నా దయచేసి నేను చెప్పేది వినండి. మీ ఇద్దరికీ నా భవిష్యత్తు గురించి ఆందోళన ఉందని నాకు తెలుసు. నాకు పెళ్లి చేసి మీ బాధ్యత తీర్చుకోవాలని తాపత్రయ పడుతున్నారని నాకు అర్థం అయింది. కానీ నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకో స్పష్టత ఉంది. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం.
నేనిప్పుడు పెళ్ళికి సిద్ధంగా లేను. నాకంటూ కొన్ని లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా. దయచేసి నన్ను ఒత్తిడి చేయొద్దు. మీ ఒత్తిడి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని మరోసారి స్పష్టంగా చెప్పింది.
మీరు నా ఆనందాన్ని, మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు కదా? అయితే నా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయకండి. సరైన సమయం వచ్చినపుడు, పెళ్లి నిర్ణయం తీసుకుంటా. నా మీద నమ్మకం ఉంచండి అని ఎప్పటిలాగే వేడుకుంది.
ఊళ్ళో వాళ్ళు , బంధు మిత్రులు .. వాళ్లంతా ఎవరు? మీ వెంటపడి విసిగించడానికి? వాళ్ళ మాటలు పట్టించుకోకండి అని మళ్ళీ మళ్ళీ చెప్పింది శివాని. కానీ ఆమె తల్లిదండ్రుల ఆందోళన తగ్గకపోగా మరింత పెరిగింది. అది ఆమెను బాధిస్తున్నది.
ఓ రోజు వ్యక్తిగత విషయాలను పంచుకున్నప్పుడు హార్మొనీ హోమ్స్ లో స్నేహితులు ఆమెకు ధైర్యాన్నిచ్చారు.
“నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి ఉంది. కానీ నేను నా స్టార్టప్‌పై దృష్టి పెట్టాను. ఇప్పుడు ఇన్వెస్టర్స్ నా ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నారు, త్వరలో నా లక్ష్యం నేను నెరవేరబోతున్నది” మీరా ఆనందంగా చెప్పింది.
“అవును మీరా, మనం లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో వాటిని చేరుకోవడానికి ఎదురయ్యే సవాళ్ళను అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం'” ఆలోచనగా శివాని.
అవునన్నట్లుగా తలూపింది మోనాశర్మ.
“నా తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఈ ఉద్యోగం కుటుంబాన్ని ఆదుకుంది. అది నాకెంతో తృప్తిని, ఆత్మస్థైర్యం ఇచ్చింది ” అంటూ తన విషయాలు పంచుకున్నాడు అర్జున్.
ఆ కొత్త మిత్రుల మధ్య స్నేహ బంధం బలపడుతున్నది. సంశయాలు దాటి ఒకరి కష్టం, ఒకరి సంతోషం రెండూ పంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకునేలా చేస్తున్నది. కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉన్నామన్న భావన లేకుండా చేస్తున్నది.
***
ఒక శనివారం ఉదయం, హార్మొనీ హోమ్స్ బయట ఆటో ఆగింది.
సరళ ఆటో దిగి చీర సరిచేసుకుంటూ ఆందోళనతో నిలబడి హార్మోని హోమ్స్ వైపు చూస్తున్నది. ఇక్కడేనా నా కూతురు ఉండేది అని ఆ ఆరంతస్తుల భవనాన్ని తదేకంగా చూసింది. హార్మొనీ హోమ్స్ అని బోర్డు చూస్తూ తనని చూసి శివాని ఏమంటుందో అనుకుంటూ ఒక్క నిమిషం తటపటాయింపుగా నిల్చుంది. .
వార్తా పత్రికలో చదివిన కో-లివింగ్ వ్యాసం, రాధమ్మ వాళ్ల మాటలు సరళని తీవ్రంగా కలవరపెట్టాయి. నా బిడ్డ సురక్షితంగా ఉందా? అని సందేహం మొదలైంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు అది పెరిగి ఆమెను నిలువనీయలేదు. ఇక ఆగలేక హైదరాబాద్‌కు చేరుకుంది. హార్మొనీ హోమ్స్ ఎదుట నిలిచింది.
చుట్టూ పరికిస్తూ బెరుకు బెరుకుగా లోపలికి అడుగుపెట్టింది,
శరీరాన్ని పలకరిస్తూ చల్లని గాలి, కంటికింపుగా గోడలపై రంగు రంగుల ఆర్ట్, కిచెన్ నుంచి వచ్చే మసాలా టీ, కాఫీ వాసనలు.. సోఫాలపై నవ్వుతూ మాట్లాడుకుంటూనో, లాప్‌టాప్‌లతో పనిచేస్తునో యువతీ యువకులు ఆమెకు కనిపిస్తున్న కొత్త ప్రపంచాన్ని చూసి సరళ ఆశ్చర్యపోయింది, ఇది నేను ఊహించినట్టు లేదని మనసులో అనుకుంది.
“శివాని ని పిలుస్తారా?”ఎవరినో అడుగుతున్న సరళ గొంతు విని, లాప్ టాప్ లో సీరియస్ గా పని చేసుకుంటున్న శివాని తలెత్తి చూసింది.
వడలిన మొహంతో ఆందోళనగా కనిపిస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది. “అమ్మా, నువ్వు.. నువ్వేంటి ఇక్కడ? ఏం జరిగింది?” ఒక్క ఉదుటున లేచి ముందుకు వస్తూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నించింది.
బిడ్డను చూసిన ఆనందం ఓ క్షణం ఆ మొహంపై మెరిసింది, “శివానీ, కో-లివింగ్‌లో ఆడ, మగ కలిసి ఉంటారని విన్నాను. నీవు సురక్షితంగా ఉన్నావా?” బావిలోంచి వణుకుతూ వస్తున్న గొంతుకతో బిడ్డను హత్తుకుంటూ అడిగింది. సరళ కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది శివానికి.
“అమ్మా .. చూస్తున్నావుగా.. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు, నాన్న ఎలా ఉన్నారు అని అడిగి, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. ఎప్పుడు బయలుదేరావో ఏంటో.. ముందు ఫ్రెష్ అయి స్నానం చేద్దువుగాని రా.. అంతలో నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తా అంటూ తన రూమ్ లోకి తీసుకెళ్ళింది శివాని.
వేడివేడి కాఫీ తెస్తున్న అర్జున్ దగ్గరనుంచి తీసుకుని సరళకి అందించింది శివాని.
***
ఆ సాయంత్రం శివాని రూమ్ బాల్కనీలో శివాని, సరళ కూర్చున్నారు. ఐదో అంతస్తు నుంచి నగర లైట్ల ను చూస్తూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నది సరళ. తల్లి మనసు అర్ధం చేసుకున్న శివాని “అమ్మా, కో-లివింగ్ గురించి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి, ఇది కేవలం ఇల్లు కాదు, కమ్యూనిటీ. ఇక్కడ అందరం చిన్న పిల్లలం కాదు. అంతా ప్రొఫెషనల్స్. రకరకాల వృత్తుల వారున్నారు. మేం ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోము. ఎవరి విలువలు వారివి. వాటిని గౌరవిస్తాం. 24/7 సెక్యూరిటీ, ఫింగర్‌ప్రింట్ లాక్‌లు, కమ్యూనిటీ నియమాలు వగైరా ఇవన్నీ మమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి.
నీకు తెలుసుకదా! నేను మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక అపార్ట్‌మెంట్ లో ఉండేదాన్ని. అప్పుడు నాకు ఇంటికి రావడం ఆలస్యమైతే ‘రాత్రి 10 తర్వాత వచ్చావా?’ ‘ఒంటరి ఆడపిల్ల ఇలా పొద్దుపోయి రావడం ఏంటి?’ ఇరుగుపొరుగు ప్లాట్స్ వాళ్ళు గుసగుసలాడే వాళ్ళు. పెళ్లికాని ఆడపిల్లలకి సంసారులుండే ఇళ్లమధ్య ఇల్లు ఇవ్వకూడని అనడం నా చెవిన చాలాసార్లు పడింది. నాకది చాలా ఇబ్బందిగా ఉండేది. నేనే తప్పు చేయకుండా వాళ్ళు నన్ను దోషిగా చూస్తుంటే ఉక్రోషం వచ్చేది. చాలా బాధగా ఉండేది. మానవసంబంధాల విలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళను కొట్టాలన్నంత కోపం వచ్చేది.
హార్మొనీ హోమ్స్ లో ఆ ఒత్తిడి లేదు. ఆ బాధ లేదు. ఆ ఒంటరితనం లేదు. ఆ ఖర్చు లేదు. నాలాంటి ఆలోచనలు ఉన్నవారితో స్నేహం ఏర్పడింది. ఖర్చు చాలా తగ్గింది. నీటి బిల్లు, కరెంటు, ఇంటర్నెట్ అన్నీ తక్కువ. నా జీతంలో సగం నా స్టార్టప్ కోసం ఆదా చేస్తున్నాను. నా సమయం, శక్తి అన్నీ ఆదా అవుతున్నాయి. నా కెరీర్‌పై, నా కలలపై పెట్టగలుగుతున్నాను.
ఒక రోజు, ఆఫీస్‌లో నా సీనియర్ ,“కో-లివింగ్‌లో ఉండటం పెళ్లికాని ఆడపిల్లకు సరికాదు”అని ఏదో ఉచిత సలహా ఇవ్వబోయాడు. అతని గురించి నాకు బాగా తెలుసు. అందుకే గట్టిగా, “నా జీవితం నా ఎంపిక. నేను సురక్షితంగా, సంతోషంగా ఉన్నాను, ఈ స్వేచ్ఛ నాకు బలం ఇస్తుంది ” అని స్పష్టంగా చెప్పాను అంటూ తల్లి ముఖంలోకి చూసింది శివాని.
మౌనంగా ఆలోచనలో ఉన్న సరళ “కానీ, శివానీ, వార్తాపత్రికలో చదివాను—కో-లివింగ్‌లో పెళ్లికాని ఆడ, మగ కలిసి ఉండటం సమాజానికి సరిపడదని… .” చెప్పబోతుంటే మధ్యలో అందుకున్న శివాని సీరియస్‌గా, “అమ్మా, వార్తాపత్రికలు సంచలనం కోసం ఏవేవో రాసేస్తున్నాయి. నువ్వు నీలాంటి వారు తరాల తరబడి మోస్తున్న లోతుగా పాతుకుపోయిన భయాలు, పరువు, కట్టుబాట్ల బరువు ఇక్కడ ఉండే మేం మోయడానికి సిద్ధంగా లేము.
నిజానికి కోలివింగ్ లో అమెరికా వెళ్లిన మనవాళ్ళు ఎప్పటినుండో ఉంటున్నారు. అమెరికా దాకా ఎందుకు? బెంగుళూరు, ఢిల్లీ , ముంబై అన్ని చోట్లా ఈ పద్ధతి ఉంది. ఒకవేళ ఎవరైనా ఆకర్షణ ఏర్పడి సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధం ఏర్పడితే అది ఆ ఇద్దరి వ్యక్తిగత ఎంపికలు, నమ్మకాలు, వారి మధ్య ఉన్న సంబంధం పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ తప్పు జరిగితే అది కో-లివింగ్ వల్ల కాదు. అది అపార్ట్‌మెంట్‌లోనో, హాస్టల్‌లోనో ఎక్కడున్నా జరగవచ్చు. నిజానికి ఇక్కడ కఠిన నియమాలు ఉన్నాయి. నేనిక్కడ చాలా భద్రంగా సురక్షితంగా ఉన్నాను. ఎలాంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకు. నన్ను కంగారు పెట్టకు” స్పష్టంగా చెప్పింది శివాని.
సరళ కళ్ళలో నీళ్లు ఉబికాయి. “శివానీ, నీ చిన్నతనంలో నీకు చిన్న గాయమైనా మేం విలవిలలాడేవాళ్ళం. ఈ మహానగరంలో నువ్వు ఒంటరిగా ఉంటుంటే మాకు బెంగగా ఉండదా? కంగారు ఉండదా?
పెళ్లి చేస్తే నీకో తోడు వస్తాడని ఆశపడ్డాం. నువ్వేమో వాయిదాలపై వాయిదాలు వేస్తున్నావ్. వయసు పెరిగితే పిల్లలు పుట్టడం లో ఇబ్బందులు రావొచ్చు. అవన్నీ నువ్వు అర్ధం చేసుకోవు.
మన ఊరి వాళ్లేమో ఆడపిల్లకు ఇంకా పెళ్ళిచేయరా? అని ప్రశ్నలు. ఆ మధ్య ఇల్లు బాగు చేయించాం కదా. అది చూసి కూతురి సంపాదన పైనే బతుకుతున్నామని కొందరు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. రాధమ్మయితే నీ బిడ్డ విచ్చలవిడిగా తిరుగుతోంది’ అని నాతోనే అంది. అటువంటి మాటలు వింటుంటే నీకు మాత్రం బాధగా ఉండదా? ”అంటూ కూతురి మొఖంలోకి చూసింది.
శివాని గుండె బరువెక్కింది. “అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. నీ భయాలన్నీ నీ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, శ్రేయస్సు కోరుకునే తత్వం నుంచి వచ్చాయి. కానీ సమాజం మారుతుంది. నీవు, నీ అమ్మ, నీ అమ్మమ్మ.. తరాల్లో ఆడపిల్లల జీవితంలో పెద్ద మార్పేమీ ఉండేది కాదు. కానీ, మా తరంలో చాలా మార్పులు. మేం స్వతంత్రంగా ఆలోచిస్తున్నాం. నేను మా కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నడిపిస్తున్నాను, నాకు ప్రమోషన్ తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు నా స్టార్టప్ పనులు..
ఈ మాత్రం స్వేచ్ఛ లేకపోతే, నేను నేనుగా ఉండలేను. అనుకున్న పనులు సాధించలేను.
ఆ రోజుల్లో పెద్దగా చదువుకోలేని నువ్వు నన్ను చదివించాలని పట్టుబట్టి చదివించావు. ఆడపిల్లకి చదువు అవసరం అని చెప్పావు. నీ పెంపకం వల్లే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను.
మన మధ్య జరుగుతున్న సంఘర్షణ వ్యక్తిగతమైనది కాదు. అది రెండు భిన్న ప్రపంచ దృక్పధాల మధ్య, రెండు తరాల మధ్య జరుగుతున్న ఘర్షణ. సంప్రదాయాలు- ఆధునికత; కట్టుబాట్లు-స్వేచ్ఛ; అపార్థాలు-అర్థం చేసుకోవాలనే తపన ఇవన్నీ కలగలిసి ఒక సందిగ్ధ వాతావరణాన్ని సృష్టించాయి.” అంటూ తల్లిని హత్తుకుంది శివాని.
***
మరుసటి రోజు, శివాని సరళను హార్మొనీ హోమ్స్ చుట్టూ తిప్పింది. కిచెన్‌లో మీరా, అర్జున్ దోసెలు కాలుస్తూ నవ్వుకుంటున్నారు. లాబీలో శ్రీ లాప్‌టాప్‌తో పనిచేస్తున్నాడు. సరళ ఆశ్చర్యపోయింది. ఇక్కడ అందరూ కలిసి గౌరవంగా ఉన్నారు. భద్రత నాలుగు గోడల మధ్య కాదు, మనుషుల మంచి మనసుల్లో ఉంటుందనుకున్న సరళకి తమ మధ్య ఉన్నఅదృశ్యగోడ నేలకూలిన భావన కలిగింది. కళ్ళలో నీళ్లు సుళ్లుతిరిగాయి. అవి భయంతో వచ్చినవి కావు. అపార్ధం తొలిగిపోయిన ప్రశాంతతవి.
సరదా కబుర్లతో ఆ ఆదివారపు భోజన సమయం గడిచిపోయింది. అక్కడి వారు ఒకరి మాటను మరొకరు మన్నిస్తూ, సహకరించుకుంటూ పనులు చేసుకోవడం చూస్తే సరళకు ముచ్చటేసింది. “మీరు అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది నేను ఊహించినట్లు లేదు” అని శివానితో చెప్పింది.
సోమవారం శివాని సరళను తన ఆఫీస్‌కు తీసుకెళ్లింది. సమోసాలతో కాఫీ తాగుతూ ఆమె నడిపిస్తున్న ప్రాజెక్ట్, స్టార్టప్ గురించి పంచుకుంది. సరళ కళ్ళలో గర్వం. “నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే, నా భయం కరిగిపోతోంది,” అని కూతురి చేయి చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది.
***
“శివానీ నీ సంతోషం, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాలో కొత్త శక్తి ధైర్యం వస్తున్నవి. ఇకనుంచి ఊరి వాళ్ళ సూటిపోటి మాటలు నన్ను తాకినా మనసుకు తీసుకోను . నీ కొత్త జీవనాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి.”ఆ సంధ్యవేళ నగరాన్ని చూస్తూ సరళ చెప్పింది,
శివాని నవ్వి, “అమ్మా, నువు నా జీవితాన్ని రెండురోజులుగా చూస్తున్నావు. నువ్వు చెప్పింది విని నాన్న కూడా అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది.
ఇక్కడ మేం మా జీవితాల్లోకి ఆధునికతను ఆహ్వానిస్తూ మా కెరీర్ నిర్మించుకుంటునే సాంప్రదాయ మానవ విలువలు, కుటుంబ విలువలను గౌరవిస్తున్నాం. మమ్మల్ని మేం ఎలా విస్తరించుకోవాలో తెలియని సందిగ్దతల్లోంచి కాలానుగుణంగా నడుస్తున్నాం.
నిజమైన భద్రత, పరువు బయటి వ్యక్తుల తీర్పుల ద్వారా రాదని మన నిజాయితీ , వ్యక్తిగత ప్రవర్తన ద్వారానే వస్తుందని ఎరుకలోకి వచ్చానమ్మా.. ” మెరుస్తున్న కళ్ళతో అని తల్లిని గట్టిగా హత్తుకుంది శివాని.
“అమ్మా.. ఈ హార్మొనీ మనిద్దరి మధ్య మాత్రమే కాదు తరతరాల మనసుల మధ్య కూడా రావాలి ” అంటూ తల్లి కళ్ళలోకి చూసింది.
సరళ మనసులో భయం కరిగి, కొత్త నమ్మకం మొదలైంది.
బయట, హైదరాబాద్ నగర లైట్లు ఈ బంధానికి సాక్ష్యంగా మెరిసాయి.
వి. శాంతి ప్రబోధ







అపోహలకు దారితీసే అంశాన్ని వస్తువుగా తీసుకుని ప్రస్తుత పరిస్థితిని కథగా బాగా మలిచారు.
రోజులు మారుతున్నాయి,మనమూ మన ఆలోచనల్లో
మార్పు రావలసిందే.శివాని, సరళ…ఈ రెండు పాత్రలు మన మధ్య,మన సమాజం మధ్య ఉన్నాయి.
రచయిత్రికి అభినందనలు.
___డా. కె ఎల్వీ ప్రసాద్
శేరిలింగంపల్లి
హైద్రాబాద్.19
9866252002