సూఫీజం మా డి. ఎన్. ఎ!

సూఫీ గొడుగు నీడలో– 1

ప్పుడు పరిస్థితి మారిందికానీ (సౌదీఅరేబియా ప్రభావంతో) మా చిన్నప్పుడు ముస్లీంలంతా సూఫీలే! కనీసం మా రాయలసీమలో!! సూఫీలు వొదిలివెళ్ళిన మార్గంలో నడిచినవాళ్ళమే! నిజానికి సూఫీజం మా డి ఎన్ ఎ లో ఉంది.

మా చుట్టూ వందల కొద్దీ దర్గాలూ, ఉరుసులూ అదే మా వైభోగం. నిజానికి హిందూ- ముస్లీం గొడవలు మా ప్రాంతంలో లేకపోవడానికి  కారణం దర్గాచుట్టూ అల్లుకున్న సూఫీ సంస్కృతే! గొడవలు సృష్టించనివ్వని సంస్కృతే గొప్పదనీ, అది సూఫీజంలోని సర్వమానవ ప్రేమ అనే ఫిలాసఫీని నమ్ముతుందనీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

మా ఊళ్ళో ఇద్దరు పేరెన్నికగన్న సూఫీలున్నారు. ఒకరు చౌసేన్ వలీ సాహెబ్ ఇంకొకరు నజురుల్లా షా సాహెబ్. పక్కన కడపలో పెద్దదర్గా ఇప్పటికీ పాపులర్. ఇటు పక్క కమలాపురం ఇంకో పక్క జమ్మలమడుగు ఆ పైన మైలవరం ఇలా నా దరిదాపుల్లోనే అనేక దర్గాలున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దర్గాల పట్టణం. అక్కడ బంధులువు ఉండడం వల్ల నా బాల్యం వేసవి సెలవులన్నీ చందాసాహెబ్ దర్గా ఒడిలోనే గడిచాయి. ఉరుసులూ, ఖవ్వాలీలూ అమ్మ పాడిన ఖసీదాల నడుమ బాల్యపు రోజులు గడిచాయి. ఈ ఖవ్వాలీలన్నీ సూఫీ చరిత్రనీ, సూఫీ గురువుల జీవితాలను పరిచయం చేససేవే‌‌! సాబ్రీ బ్రదర్స్ ఖవ్వాలీలు వినడం చిన్నపుడు క్రేజ్.

మా కడప జిల్లాలో కమలాపురం ఉరుసు చాలా బాగా జరుగుతుంది. దూరదూరాల్నించి భక్తజనం వేలకొద్ది కమలాపురం హాజరౌతారు. చాలా పెద్ద ఖవ్వాలీ గాయకులు వచ్చి ఖవ్వాలీలతో ఊర్రూతలూగిస్తారు. ఖవ్వాలీ సాహిత్యం అమోఘంగా ఉంటుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఖవ్వాలీల పాత్ర గొప్పది. ఇక ప్రతి ఇంట్లో ఖసీదా గాత్రం సరేసరి.

ఆ సంప్రదాయం మా సీమలో ఇంకా కొనసాగుతోంది. ఆ పరిమళం ఇప్పటికీ ఇగిరిపోనిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, మా వాళ్ళకు మక్కా సంగతేమో గానీ ఒకసారి జీవితంలో అజ్మీర్ వెళ్ళి ఖ్వాజా గరీబ్ నవాజ్  ను సందర్శించి ఆశీర్వాదాలు పొందడం గొప్ప గా భావిస్తారు. మా వాళ్ళ నోళ్ళల్లో ఇంకా గుల్బర్గా, కస్నూర్ దర్గా పేర్లు నానుతూ ఉంటాయి. అట్లాగే మా మొహల్లాల్లోకి సూఫి అనుయాయులు చాలా (ఇటీవల బాగా తగ్గిపోయింది) మంది వచ్చేవాళ్ళు నల్లటి దుస్తులు ధరించి! వాళ్ళను చూసి పిల్లలం భయపడేవాళ్ళం. ఒకరోజో,రెండురోజులో మా వీధుల్లో తమ చిమ్టాలను ఝళిపిస్తూ తిరిగేవారు. ఆ చిమ్టాలేమిటో వాళ్ళ చేతిలో అవెందుకున్నాయో అర్థం అయ్యేది కాదు. కానీ అవి బాగా భయంగొలిపేవి. అన్ని వేళ్ళకు రాళ్ళ ఉంగరాలూ, మేడలో రాళ్ళ హారాలూ, పొడగాటి జులపాలూ విచిత్ర వేషధారణ వారిది. దీన్ని బట్టి వారి ప్రత్యేకతను ఇట్టే గుర్తించవచ్చు. మొఖద్దర్ కా సికిందర్ సినిమాలో హీరోకు దారి చూపే పకీరులా ఉండేవారు. పెద్దలందరూ వారి చుట్టూ చేరి తమ సాదకబాధలు చెప్పుకునేవారు. “ఖ్వాజాగరీబున్నవాజ్ తేరా సాథ్ దేగా బెటా ఫికర్ నా కర్” అనే వారు. వాళ్ళ బట్టల సంచుల్లోంచి తావీజులు తీసి ఇచ్చే వారు. సిల్వర్ తావీజుల మీద మక్కాదొక వైపూ, మదీనాదొక వైపూ ముద్రలుండేవి. ఆ తావీజు మా పేదల గుండెల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపేవి. ఇలా మా బీదసాదలతో సూఫీలకు గొప్ప ఆధ్యాత్మిక సంబంధమే ఉండేది.

బాల్యంలో మొహర్రం పీర్లను ఎత్తుకొని గల్లిల్లో తిరిగిన జ్ఞాపకం కంటిమీది తడిలాంటిది. అసలు మా ఇంటి పేరులోనే పీర్లున్నారు. ఈ పీర్లనూ, ఇస్లాం నూ మనదేశానకి పరిచయం చేసిన సూఫిజానికి ప్రపంచంలో బహుశా అది సాగివచ్చిన పర్షియా కంటే ఘనంగా ఈ భూమి గౌరవించింది. ఇక్కడ వెనుకబడ్డ జాతులు సూఫీలను ఆదరించారు, సూఫీల ఆశీర్వచనం పొందారు. అలాగే అన్ని పల్లెటూర్లలో మొహర్రం ముస్లీమేతరులు జరుపుకునేలా హిందూ-ముస్లీం సాంస్కృతిక సమ్మేళనానికి దోహదం చేసింది సూఫీజమే!

ఇస్లాం దర్గా సంస్కృతికి విరుధ్ధమా, అవునా, కాదా అనే చర్చలోకి నేనిప్పుడు వెళ్ళదల్చుకోలేదు. నాకు మతమే లేదు. అసలు సూఫీలకు మతముందా అనేది కూడా అనుమానమే. వాళ్ళ ఆచరణను గీటురాయిగా చూచినపుడు వాళ్ళ పరిశుధ్ధమైన ఆచరణ తో అన్ని రంగుల, అన్ని జాతుల, అన్ని భూముల ప్రజలను కలుపుకుపోవడమనే భిన్నమైన, ఇంకే ఆధ్యాత్మిక వ్యవస్థకూ లేని విశిష్టమైన పధ్ధతి సుఫీలదని నాకర్థమైన విషయం. అంతకు ముందు ప్రపంచం చూడని ప్రేమ జీవితంలో ఖంగుతిన్నవాళ్ళకు పంచుతూ పోయారు సూఫీలు. ఆ ఆచరణ మనుషుల్ని మనుషులుగా చూసే, అన్నార్తుల అనాదరణకు గురైన వారిని అక్కున చేర్చుకునే ప్రేమమయ మార్గం అనేది మాత్రమే నాకు తెలిసిన నిజం. అదే నా కవిత్వంలో ప్రతిఫలించడానికి ప్రయత్నించాను.
నా మొదటి కవిత 1994 లో ఆహ్వానం లో అచ్చయ్యింది. ఎన్ని కవితలు రాశానో గుర్తులేదు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2003 నుంచి 2016 వరకూ చలా తక్కువ రాశాను. ఆ కాలంలో అధ్యయనం కూడా కొరవడింది. నా కవిత్వం ఎక్కువగా అరుణతారలో అచ్చయ్యింది. అరుణతారలో నాలుగు పిట్టలు పేరుమీద మిని పొయెట్రీ రాశాను.

ప్రణాళికలు వేసుకొని కవిత్వం రాయడం నాకు రాదు. నాకూ స్పాంటినియస్ గా వస్తుంది. అందుకే నాకో ప్రత్యేక స్టైల్ లెదు. నాలుగు పిట్టలు చాలా రాసేసాను. కానీ ఇప్పుడు రాయలేకున్నాను. నా నాలుగు పిట్టల్లో కూడా సూఫీ ఫ్లేవర్ బాగా కనబడుతుంది.

సూఫి పొయెట్రీ రాయాలని వత్తిడి చేసింది కవి మిత్రుడు స్కైబాబా. అతడి ఒత్తిడి మీదనె “అలావా” కోసం “సూఫి చందమామ” రాశాను. ఇటీవల అఫ్సర్ గారు సూఫీజం మీద చేస్తున్న పని కూడా విరివిగా సూఫీ కవితలు రాసేలా చేసింది. ఈ విషయంమ్మీద అఫ్సర్ గారూ నేనూ చాలా సార్లు మాట్లాడుకున్నాం.

*

మహమూద్

13 comments

Leave a Reply to vijay kumar svk Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సూఫీల గురించి తెలుగులో ఏమైనా మంచి పుస్తకాలు వచ్చాయా ? కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా వ్యాసాలు కూడా రాలేదు. ఇప్పుడైనా ఈ ప్రయత్నం జరగడం హర్షణీయం.

  • సూఫీఇజం గురించి
    మహమూ ద్ గారి
    అవగాహనా పూర్వక వ్యాసం
    మా వంటి వారికిఅర్ధం అయ్యేలా
    సరళంగా వుం ది.
    రచయితకు ధన్యవాదములు

    ____డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

  • మా ఇంట్లో,.. నవాబు, bashir, ఉండేవారు.. ఏదీ అయిన కథలు చెప్పామన్నా,పాటలురూపంలోపడేవాడు నవాబ్..అప్పుడు అవి అంతగా తెలియకపోయిన,.. గానముశ్రావ్యం ఉండి,వింటూ ఉండి పోయేవాళ్ళం. తర్వాత,.. తెలిసింది, సూఫితత్వాలూ అవి అని..!ఎందుకో, ఇది చదివితేఅది గుర్తుకు వచ్చింది..!అభివందనలు. సాబ్!💐

  • సూఫీయిజం, వర్గాలతో ఉన్న అనుబంధం గురించి చక్కగా రాసారు భయ్యా. ఇది చదివాక దర్గాలతో ఉన్న అనుబంధం గురించి నాకూ రాయాలనిస్తున్నది. తప్పక రాస్తాను.

    చాలాసార్లు సూఫీయిజం, ఇస్లాం… వేరు వేరు అంటే నమ్మబుద్ధి కాదసలు. శాంతి, ప్రేమ… వీటిని పెంచడమే అనేకానేక అనుభవాలద్వారా చూస్తూ వస్తున్నాను.

    అఫ్సర్ భయ్యా… చారిత్రాత్మక కృషి చేస్తున్నారు. ఇది నాలాంటి వారికో మార్గం.

    థాంక్యూ

  • అస్సలాముఆలేకుమ్ మహమూద్ గారు సూఫీ సంస్కృతి గురించి ఇంత విపులంగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా వివరించడం అభినందనీయం. మీరు చెప్పింది అక్షరాలా నిజం ఏమిటంటే సర్వమత సమ్మేళనం .అన్నీ దర్గాలలో హిందూ ముస్లింలు ఆత్మీయంగా కలిసి ఎంతో భక్తి తో దర్గా లను సందర్శిచడం నేను చాలా చోట్ల చూశాను. హైదరాబాద్ కు దగ్గర లోని రంగాపూర్ దర్గా కు (నిరంజన్ షావలి) హిందూ ముస్లింలు తేడా లేకుండా వచ్చి తమ కోరికలు కోరుకుంటారు
    వాళ్ళ ఆత్మీయత చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి వ్యాసం అందరికీ అర్థం అయ్యే రీతిలో వ్రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు. 🎍🎍🎍🎍🎍🎍
    మొహమ్మద్అ.ఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

  • మహమూద్ భాయ్, మీ సూఫీజంపైన విశ్లేషణ నా చిన్ననాటి స్మ్రతుల్లోకి తీసుకుపోయింది. చిన్నప్పటి నుండీ హైదరాబాదు కింగ్ కోఠీలో వుంటూ ముస్లిం సంస్కృతిని బాగా దగ్గరగా చూసాను. అప్పటి మా ఇంటి ఓనర్లతో దర్గాలకు వెళ్ళటం, సంబరాలు చేసుకోవటం, నాకు అనారోగ్యంగా వున్నప్పుడు దర్గాలో ఫకీర్లతో తావీదులు కట్టించుకోవటం లీలగా గుర్తొస్తున్నాయి…. nostalgic memories rewinded reading your write up🙏🙏

  • భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేలుకలయిక సూఫీజం. మానవాళి కి సామరస్యం, గొప్ప శాంతి సందేశమూ యిచ్చిoది సూఫీజమే.

  • నా చిన్నప్పటి బాల్య స్మృతులని తట్టి లేపిన వ్యాసం ఇది. జీవితo యెన్నో మధుర ఙ్ఞాపకాల సమ్మేలనం. దర్గాలూ, ఉరుసులూ అమిత మానసిక ఉల్లాసాన్ని యిచ్చే జన జీవన ప్రమాణాలు.

  • చక్కని పోస్టింగ్. అభినందనలు. సూఫిజం, శ్రీ వైష్ణవం, బెంగాలీ బౌల్ తత్వం, హిందుస్తానీ సంగీతం – వీటన్నిటి మేలుకలయికా వికాసం విశ్వకవి కవనం – అని ఎప్పుడో చదివినట్టు గుర్తు. అప్పటి నుండి సూఫిజం గురించి అడపా దడపా చదవడమే కాని లోతుల్లోకి వెళ్ళలేదు. ముందుముందు ఆ అవకాశం అందివస్తుందని ఆశ.
    మహమూద్ గారికి మరో మారు కంగ్రాట్స్.

  • ‘సూఫీయిజమే మార్క్సిజం’ వివి ఒకచోట రాసారు. దాని మీద ఆర్ ఎస్ రావు కొంచెం నెగేటివ్ గా చేసినట్లు కూడా వివి చెప్పడం విన్నాను.

    అలాగని అదీ ఇదీ ఒకటే కావాలనేం లేదు. కానీ, సూఫియిజంలోని ఆస్తిని పోగేసుకోవడం వంటి స్వార్థచింతనా రాహిత్యం లేదా ఓ మాల బైరాగి వలె ఇహలోకంలో పరోపకార స్పృహతో జీవించే లక్షణాన్ని అన్య మతస్థులు కూడా ప్రేమించగలరని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు.

    సూఫీ తత్వం లో ఇంతటి ఉదాత్తత ఉన్నప్పటికీ … స్వార్థపర శక్తులను ఎదిరించడం వంటిదేదో మనలాంటి వాళ్లు అంటించాలనుకుంటా.

    అప్పుడిక స్వార్థపర శక్తులకు మనం కంటగింపు అయినప్పటికీ మన తాత్వికతలో కొద్దిపాటి నిండుదనం కూడా వస్తుందని…

  • ‘సూఫీయిజమే మార్క్సిజం’ వివి ఒకచోట రాసారు. దాని మీద ఆర్ ఎస్ రావు కొంచెం నెగేటివ్ కామెంట్ చేసినట్లు కూడా వివి చెప్పడం విన్నాను.

    అలాగని అదీ ఇదీ ఒకటే కావాలనేం లేదు. కానీ, సూఫియిజంలోని ఆస్తిని పోగేసుకోవడం వంటి స్వార్థచింతనా రాహిత్యం లేదా ఓ మాల బైరాగి వలె ఇహలోకంలో పరోపకార స్పృహతో జీవించే లక్షణాన్ని అన్య మతస్థులు కూడా ప్రేమించగలరని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు.

    సూఫీ తత్వం లో ఇంతటి ఉదాత్తత ఉన్నప్పటికీ … స్వార్థపర శక్తులను ఎదిరించడం వంటిదేదో మనలాంటి వాళ్లు అంటించాలనుకుంటా.

    అప్పుడిక స్వార్థపర శక్తులకు మనం కంటగింపు అయినప్పటికీ మన తాత్వికతలో కొద్దిపాటి నిండుదనం కూడా వస్తుందని…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు