సమాధుల తోట

నల్లటి రాగంలో

ఈ రహదారి పాడే

జ్ఞాపకాల పాటలు

నువ్వు ఎప్పుడైనా విన్నావా

 

నల్లటి దేహం కింద

చెట్టును కోల్పోయిన తల్లివేరు

బాధతో పాడే పాట ఉంది

 

గూడును పిట్టను  కోల్పోయిన పుడక

వేదనతో పాడే పాట ఉంది

ఇంటిని మనుషులను కోల్పోయిన

ఒంటరి పునాది పాడే పాట ఉంది

 

నాగలిని రైతును కోల్పోయిన నాగేటి చాలు

బేలగా పాడే పాట ఉంది

పంటలను తోటలను కోల్పోయిన మాగాణి

పచ్చగా పచ్చిగా పాడే పాట ఉంది

 

నీటి కోసం పచ్చని పంట కోసం

ఎదురు చూసి చూసి అలసి పోయి

శాశ్వతంగా కన్నుమూసిన

బీడు భూముల మోడు పాట ఉంది

 

తెగిపడిన కలల గురించి

ఇంకిపోయిన ఎండిపోయిన

ఎర్రటి రక్తపు మట్టి పాడే పాట ఉంది

 

ఎన్ని బంధాలు అనుభూతులు

నవ్వులు జ్ఞాపకాలు

ఇక్కడ సమాధి చేయబడ్డాయో

ఇన్ని దుఃఖపు పాటలను

విని విని ఏడ్చి ఏడ్చి

తన కంటి కాటుక కరిగి

రహదారులు ఇంత నలుపెక్కాయేమో

 

రహదారులు విస్తరిస్తున్నంతమేర

సమాధుల తోట లా ఉంది.

*

దోర్నాదుల సిద్ధార్థ

స్వస్థలం: చిత్తూరు జిల్లా , పలమనేరు. వృత్తి: పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. 30కి పైగా కవితలు, వ్యాసాలు ప్రచురించారు..ఆకాశవాణి, తిరుపతి కేంద్రం నుండి కథలు కవిత్వం ప్రసారమయ్యాయి. రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుడు. ఎక్సరే సాహితీ పురస్కారం వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ పురస్కారం మరికొన్ని అందుకున్నారు.

6 comments

Leave a Reply to రమేష్ నాయుడు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు