అడుగులు స్థిర పడిన తర్వాత
పరుగెత్తడమే మంచిది
వెళ్ళనివ్వండి
రెక్కలు మొలిచిన తర్వాత
ఎగరటం అనివార్యం
ఆపకండి
రెప్పల మాటు రక్షణ కంటే
గాయాలు నేర్పే పాఠాలే ఎక్కువ అవసరం
అక్షరాలు ఒంటబట్టిన తర్వాత
సంక్లిష్ట మానవ మస్తిష్కాన్ని శోధించనివ్వండి
ముగింపు ముందే చెబితే
కథా- కథనం సొగసు ఏం అర్థమవుతుంది?
నక్కలేవో – కుక్కలేవో ఎలా తెలుస్తుంది?
మనిషేదో – మృగమేదో గుర్తించడం ఎలా అలవడుతుంది?
మొదలు నరికినా…
మొక్కై మహావృక్షమై
బతకడం తెలియాలి
జారిపోతున్న కాలాన్ని
గాలం వేసి
గుప్పిట బంధించడంలో
నైపుణ్యం రావాలి
అనుభవాలను చావిట్లో కుప్పగా పోసుకుని
పురికొసలా పేనటం నేర్చుకోవాలి
సంఘర్షణల బొంతను
తలకిందేసుకుని
గాఢ నిద్రపోవటం రావాలి
వెళ్ళనివ్వండి…
దిక్కుల్లేని ప్రపంచంలోకి
రెక్కలు విప్పి ఎగరనివ్వండి.
*
కవిత చాలా బావుంది అక్క…
శుభాకాంక్షలు💐
ఇంకా నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్నా