వాళ్ళు

ష్టించే చేతులకూ
ప్రార్థించే పెదాలకూ మధ్య
అగాధాల్లా వాళ్ళు..
మసీదుకూ, నమాజుకూ మధ్యన వాళ్ళు
మసీదుల్నీ,వీధుల్నీ వొణికిస్తూ వాళ్ళు..
ప్రశాంతతను భంగం జేస్తూ వాళ్ళు
ఉదయాస్తమయాల తుడిచేస్తూ వాళ్ళు
అన్న దమ్ములమధ్య
మతాల చిచ్చు రాజేస్తూ వాళ్ళు
ప్రేమికుల మధ్య
 అడ్డుగోడలు లేపుతూవాళ్ళు
విశ్వాసాల్ని చిదిమేస్తూ వాళ్ళు
విషాల్ని చిమ్ముతూ వాళ్ళు
పండుగ భీభత్సాలు వాళ్ళు..
ఆనంద సమయాల్ని
కత్తులతో తుడిచేసి
మారణకాండలో
కాలాన్ని వొణికించి
ఎగిసి పడే శ్వాసల
చలిమంటల ఆనందంలో వాళ్ళు
విశాలమైన రోడ్లమీద
వికటాట్టహాసాలతో వాళ్ళు.
ఇరుకు గల్లీల్లో
భయాల సృష్టిస్తూ వాళ్ళు.
మాణాయుధాల్తో
దేవుడు సైతం వొణికిపోయేలా
మారో..మారో..నినాదాల్తో వాళ్ళు..
విద్యాలయాల్లో వాళ్ళు
విద్వత్తును చిదిమేస్తూ వాళ్ళు
ముసుగుల్లో వాళ్ళు
ముసుగుల్లేకుండా వాళ్ళు
బహు రూపాల్తో వాళ్ళు
బహు నామాల్తో వాళ్ళు
అంతర్లీనంగా వాళ్ళు
ఆర్భాటంగా వాళ్ళు
చట్టాల రెక్క లిరుస్తూవాళ్ళు
రాజ్యాంగాన్నిధిక్కరిస్తూ వాళ్ళు
పువ్వు మొవ్వలో  విషంవాళ్ళు
శిశువు మెదడులో మత్తువాళ్ళు
జాత్యహంకారంతోవాళ్ళు
జాతి హననంలో వాళ్ళు
చావు పుట్టుకల శాసి స్తూ వాళ్ళు
శ్వాస,భాషల్ని శాసిస్తూ వాళ్ళు
శతాబ్ధాల సంఘర్షణలో
చరిత్రచెక్కిన
మహా మానవ సంస్కృతి కి
చెదలు పట్టిస్తూ వాళ్ళు
వెనక్కి తిప్పుతూ వాళ్ళు
కత్తిగాటును
దేశభక్తిగ మలుస్తూ  వాళ్ళు
గోబెల్స్ ప్రచారానికి
పరాకాష్ఠ వాళ్ళు
రక్త పాతాల్లో
జలకాలాడుతూ వాళ్ళు
శాంతి ప్రవచనాల్లో
సర్వ శ్రేష్ఠులు వాళ్ళు
శవాల గుట్టలమీద వాళ్ళు
సింహాసనాలమీద వాళ్ళు
అరె భాయ్!!
సమూహంలో చేరి
ప్రమాదాన్నెదిరిస్తవో
ఒంటరివై మిగిలి
అనామకంగ చస్తవో
నీ ఇష్టం..
*

ఉదయమిత్ర

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వాళ్ళు వేగంగా సమూహ
    మెదళ్లలోకి ఎక్కిస్తున్న
    విషపు చుక్కలు
    వడివడిగా పదాల నడవడి
    కవిత్వ ఆయుధంతో
    తుత్తునియలు చేసి
    నిర్వీర్యం చేసే ప్రయత్నం
    ఉదయమిత్రా! నీకు కవితాంజలి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు