వలపు స్వాతంత్య్రం

లా అసహనంగా ఫోన్ వైపు చూస్తూ కూచుంది, రూప. కానీ అది మోగట్లేదు ఎంతకీ! ఆతృతగా ఉంది, భయంగా ఉంది.. కానీ కావాలని ఉంది. కావాలని ఎక్కువగా ఉందేమో.. అందుకే ఆతృతని భయాన్ని పక్కన పెట్టి ఎదురు చూపులు కొనసాగిస్తూంది.

చరణ్ తనకి కొత్తేమీ కాదు. కాలేజీ రోజుల్లోనే తెలుసు. కానీ అప్పట్లో పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎప్పుడైనా గేట్ దగ్గరో, అడ్మిన్ ఆఫీస్ లోనో, కాంటీన్ బయటో కనిపిస్తే పలకరింపు గా నవ్వుకునే వాళ్ళంతే! ఇదెప్పుడో పడమూడేళ్ళ కిందటి మాట. కాలేజ్ అయిపోయాక ఫేస్ బుక్ లోనో.. ఇమెయిల్ ద్వారానో అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ.

ప్రస్తుతం విడాకులు తీసుకుని బాబు తో ఒంటరిగా బతుకుతున్న రూప కి రెండేళ్ళ క్రితం చరణ్ పంపిన వాట్స్ ఆప్ మెసేజ్ ఇంకా గుర్తే!

***

అర్థ రాత్రి 1.30 కి నిద్ర పట్టక, రక రకాల ఆలోచనలతో సతమతం అవుతున్న రూప ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చిన చప్పుడు విని ఫోన్ తీసి చూసింది. చరణ్ నుండి మెసేజ్.

“నమస్తే! ఎట్లున్నావ్?”

“బానే ఉన్నా.. నువ్వు?”

“నేను సూపర్. ఏంటి ఇంకా పడుకోలేదా?”

“నిద్ర పట్టలేదు.. చెప్పు.. ఏంటి సంగతులు?”

“ఏముంది అంతా మామూలే.. ప్రాజెక్ట్ పనుల మీద తిరుగుతున్నా!”

“గుడ్.. నీ పని బాగుంది. హ్యాపీ గా ట్రావెల్ చేస్తూ ఉంటావ్!”

“నువ్వు కూడా ప్లాన్ చేసుకో ట్రావెలింగ్. దానికి నా మీద పడి ఏడవటం దేనికి?” అని ఒక లాఫ్ ఐకాన్ కూడా పంపాడు చరణ్.

“నీ కంటే అడిగే వాళ్ళు లేరు.. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళి రావొచ్చు.. నా పరిస్థితి అలా కాదు కదా! బాబు ని ఎక్కడా వదలలేను. వాడిని తీసుకుని తిరగడానికి ధైర్యం చాలదు.”

“నిన్ను కూడా అడిగే వాళ్ళు లేరు కదా! ప్లాన్ చేస్తే అన్ని వర్క్ అవుట్ అవుతాయి. ఒక సారి నీకు నువ్వు గా ట్రావెలింగ్ చేయడం మొదలు పెట్టావంటే ఆ తరువాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది..”

“హ్మ్మ్… చూద్దాం!”

“రూప.. నిన్నొకటి అడగొచ్చా?”

రూప రిప్లై ఇచ్చే లోపే.. చరణ్ ఇంకో మెసేజ్ పంపాడు.. “కాన్ వి హావ్ సెక్స్?”

ఒక్క సారిగా అలా అడిగే సరికి ఏం చెప్పాలో తోచలేదు రూప కి. కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత, “షూర్.. వై నాట్?” అని రిప్లై ఇచ్చింది.

అంతే.. ఆ తరువాత మళ్ళీ కొన్ని నెలలు మాట్లాడుకోలేదు. ఒక రోజు ఉన్నట్టుండి సాయంత్రం మెసేజ్ వచ్చింది చరణ్ నుండి. అంతకు ముందు జరిగిన టాపిక్ గురించి ఏమి మాట్లాడుకోకుండా.. చాలా క్యాజువల్ గా మాట్లాడుకున్నారు ఇద్దరు. ఒక ట్రిప్ తరువాత హెల్త్ బాలేక ఊర్లో అమ్మ వాళ్ళ దగ్గరున్నా అని చెప్పాడు చరణ్. వాళ్ళ ఇంటి టెర్రస్ మీద నుండి ఒక సెల్ఫీ దిగి పంపాడు. ఆ ఫోటో చూస్తూ ఉండిపోయింది రూప. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు దగ్గరగా కూడా చూసుకున్నట్టు గుర్తు లేదు తనకి. కానీ గత ఆరేడు సంవత్సరాలుగా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. కొన్ని సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి.

చరణ్ తనని సెక్స్ గురించి అడిగిన విషయం చరణ్ కి గుర్తుందో లేదో కానీ, రూప కు మాత్రం బాగా గుర్తుంది. నిజం చెప్పాలంటే చరణ్ అలా అడగటం తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చరణ్ స్వతహాగా ఇంట్రావర్ట్. త్వరగా ఎవరితోనూ మాట్లాడడు. పాత రోజుల్లో కూడా చరణ్ కానీ, తను కానీ ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేసుకున్న దాఖలాలు లేవు. గత కొన్ని ఏళ్ళుగా రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నా.. మెసేజ్ లలో కానీ, మెయిల్స్ లో కానీ.. చరణ్ ని ఇలా అడగడానికి ప్రోత్సహించేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక్క క్షణం చరణ్ ని కలవాలని బలంగా ఉన్నా.. తన పరిస్థితి గుర్తొచ్చి ఊరుకునేది. తన ఎక్స్ వల్ల చాలా సెక్సువల్ అబ్యూస్ కి గురైన తను మళ్ళీ ఇంకో మనిషి కి దగ్గరయ్యే ధైర్యం చేయలేకుంది.

ఇప్పటికీ తనకి ఎవరో ఒకరు ప్రపోస్ చేస్తూనే ఉంటారు. నాతో ఉంటావా.. అని అడిగే వాళ్ళు కూడా లేకపోలేదు.. కానీ.. తన గతం రూప ని భయపెడుతూనే ఉంది. ఎందుకో తెలీదు.. అస్సలు తన పర్సనల్ స్పేస్ లో కి ఎవరినీ రానివ్వడం నచ్చదు తనకి. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. క్లోజ్డ్ స్పేసెస్ అన్నా కూడా తనకు ఊపిరి ఆడనట్టు అయిపోతుంది. ఈ మధ్యే తన ఫ్రెండ్ సరిత సలహా మేరకు ఆకాంక్ష అని ఒక థెరపిస్ట్ ని కలుస్తోంది.

ఇలాంటి ట్రామా నుండి బయట పడటానికి టైం పడుతుంది అని చెప్పింది ఆ థెరపిస్ట్. సెక్స్ అంటే పనిష్మెంట్ అని అనిపించేలా చేసాడు రూప ఎక్స్. సెక్స్ వల్ల నొప్పి తప్ప వేరే ఏ రకమైన అనుభూతి గుర్తు లేదు తనకు. పైగా తన శరీరాన్ని కించ పరిచినట్టు మాట్లాడే వాడు. దాని వల్ల అసలు కాంఫిడెన్స్ అంతా పోయింది రూప కి. నిజానికి అదొక పీడకల తనకి. ఇంక ఎలాంటి రిలేషన్ షిప్ వద్దనుకుంది రూప. కానీ థెరపిస్ట్ తో ఒక నాలుగైదు సెషన్స్ తరువాత.. కొద్దిగా ధైర్యం వస్తున్నట్టే ఉంది కానీ.. మళ్ళీ తన గతాన్ని తెలుసుకుని, అర్థం చేసుకుని.. తనకు స్పేస్ ఇచ్చేంత ఓపిక ఉన్నవాడు దొరకడం అసాధ్యం అనిపించి ఆ ఆలోచన పక్కన పెట్టి కెరీర్ మీద దృష్టి పెట్టి బాబు ని చూసుకుంటూ గడిపేస్తోంది.

***

చరణ్ తనని సెక్స్ గురించి అడిగి సరిగ్గా రెండేళ్ళు దాటిపోతోంది. గత వారం పది రోజులుగా ఎలా అయినా చరణ్ ని కలవాలనే ఆలోచన రూప కి ఎక్కువయింది. ఉండబట్టలేక రాత్రి ఆఫీస్ నుండి రాగానే చరణ్ కి ఫోన్ చేసింది.

“నమస్తే!” అన్నాడు చరణ్.

“ఎక్కడున్నావ్?” అడిగింది రూప.

“హైదరాబాద్ లోనే ఉన్నా!”

“మరి.. ఇప్పుడు కలవడం కుదురుతుందా? నీకు వీలవుతుందా?” సంకోచిస్తూనే అడిగింది రూప.

“టైం ఇప్పుడు 8 అయింది. ఇంకో 20 నిముషాల్లో వస్తా. లొకేషన్ వాట్సాప్ లో పంపు,” అన్నాడు చరణ్.

ఇప్పటికి 20 నిముషాలు అవుతూ ఉంది కానీ, చరణ్ ఇంకా రాలేదు. అడ్రస్ కనుక్కోవడం కష్టమయిందేమో అనుకుంటూ ఎదురు చూపులు కొనసాగించింది. కాసేపటికి చరణ్ ఫోన్ చేసాడు, “అపార్ట్మెంట్ కింద ఉన్నా, బైక్ పక్క సందులో పార్క్ చేశాను..” అని.

దాదాపు పరిగెత్తినట్లే కిందకి బయల్దేరింది రూప. పలకరింపుగా నవ్వుకున్నారు ఇద్దరూ. లిఫ్ట్ లో 5వ నెంబర్ బటన్ నొక్కింది రూప. నిశ్శబ్దంగా నిలబడ్డారు పక్క పక్కనే. చాలా గాభరాగా విచిత్రంగా అనిపించింది రూప కి. తనకు అంత ధైర్యం ఉందని తనకు కూడా తెలీదు. లిఫ్ట్ ఆగింది. రూప ముందు వెళ్ళి ఫ్లాట్ డోర్ తీసింది. లోపలికొచ్చి చెప్పులు సోఫా కిందకి వదిలాడు చరణ్.

ఇద్దరూ ఎదురెదురుగా సోఫా ల్లో కూచున్నారు.

“మంచి నీళ్ళు తాగుతావా?” అడిగింది రూప. చరణ్ తలాడించాడు.

రూప తెచ్చిచ్చిన నీళ్ళు తాగి, ఖాళీ గ్లాసు పక్కకు పెట్టాడు.

“కాఫీ తాగుతావా?” మళ్ళీ అడిగింది రూప. నవ్వి వద్దన్నాడు చరణ్.

“ఆక్వేరియం చూస్తావా?” అని హాల్ పక్కగా ఉన్న గది దగ్గరకు తీసుకెళ్ళింది రూప. గుండ్రటి బౌల్ లో రెండే రెండు గోల్డ్ ఫిష్ ఉన్నాయి.

“పంజరం లో చిలక లాంటి నీకు ఈ ఆక్వారియం లో చేపలు తోడు..” అంటూ నవ్వాడు చరణ్.

ఆ పోలికకి ఫక్కున నవ్వింది రూప. సరిగ్గా అప్పుడే చరణ్ రూప చెయ్యి పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు. రెప్ప ఆర్పే లోపు రూప పెదవులని అందుకున్నాడు. అంతే.. ఆ తరువాత ఒక 45 నిముషాల పాటు ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందింది రూప. ఎవరు మొదలు పెట్టారో.. ఎలా మొదలయిందో తెలీదు కానీ, తన జీవితం లో ఎప్పటికీ అనుభూతి చెందలేను అనుకున్న రూప మొదటి సారి ఆర్గాస్మ్ అనుభూతి చెందింది. గాల్లో తేలినట్టయింది, అలాగే ఉండిపోయింది ఒక పది నిముషాలు.

ఇంతలో పక్క గది నుండి బాబు ఏడుపు వినిపించింది. ఇప్పుడే వస్తానని చెప్పి రూప ఆ గది లోకి వెళ్ళింది. పది నిముషాలైపోయింది. రూప ని గట్టిగా పట్టుకుని బాబు పడుకున్నాడు. ఆ చెయ్యి పక్కకు పెట్టబుద్ధి కాలేదు రూప కి. పక్క గది లో ఉన్న చరణ్ కి వాట్సాప్ చేసింది, “నువ్వు కూడా ఇక్కడికే రా!” అని. కాసేపటికి చరణ్ వచ్చాడు. ఇద్దరూ ఇంకా నగ్నంగానే ఉన్నారు. చరణ్ నిశ్శబ్దంగా వచ్చి రూపకి ఇటు పక్కన పడుకున్నాడు. అలా రూప భుజం మీద తల వాల్చి క్షణాల్లో నిద్ర పోయాడు. చంటి పిల్లాడు తల్లి ని అంటి పెట్టుకున్నట్టు పడుకున్న చరణ్ ని చూస్తే రూప కి ముచ్చటేసింది. అలాగే చాలా సేపు ఉండిపోయారు.

ఎప్పుడో గంట తరువాత చరణ్ మెల్లిగా కళ్ళు తెరిచి తననే చూస్తున్న రూప ను చూసి చిన్నగా నవ్వాడు. లేచి పక్క రూమ్ కి వెళ్ళిపోయాడు. రూప కూడా లేవటానికి ప్రయత్నించింది కానీ, బాబు కదలనివ్వలేదు. చరణ్ బట్టలు వేసుకుని పక్క గది నుండి వాట్సాప్ చేసాడు, “నేను ఇంకా వెళ్తున్నా” అని. కాసేపటికి మెల్లిగా తలుపు తెరిచి మూసిన శబ్దం వింది రూప.

ఆ తరువాత రూప నిదానంగా లేచి వెళ్ళి బట్టలు వేసుకుంటూ అద్దం లో తనను తాను చూసుకుంది. మెడ మీద, రొమ్ముల మీద అక్కడక్కడా కుమిలిపోయిన గుర్తులు కనిపించాయి. మనసంతా హాయిగా అనిపించింది.

***

రూప ఇంటికి చరణ్ రాకపోకలు పెరిగాయి. రూప కి సెక్స్ పట్ల ఉన్న భయం పోయింది కానీ రిలేషన్షిప్ పట్ల భయం పోలేదు. దానికి తోడు చరణ్ మొదట్లోనే తాను పెళ్ళి లాంటి కమిట్మెంట్స్ కి ఇప్పట్లో సిద్ధంగా లేడని ముందే చెప్పడం వల్ల రూప తన జాగ్రత్త లో తను ఉంది.

తన థెరపిస్ట్ ఆకాంక్ష కూడా రూపకి చరణ్ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దనే చెప్పింది.

“చూడు రూప, నీ శరీరం ఒక తోడు కోరుకోవడం తప్పే కాదు. అది చాలా నాచురల్. కానీ దానికీ రిలేషన్షిప్ కి లంకె వేయడం కూడా తెలివైన పని కాదు. చరణ్ తానుగా వచ్చి నేను పెళ్ళి కి కానీ, కమిట్మెంట్స్ కి కానీ సిద్ధంగా లేను అని చెప్పాక నీ జాగ్రత్తలో నువ్వుండటం మంచిది. ఒక వేళ నీకు క్యాజువల్ సెక్స్ ఇష్టం లేకపోతే హ్యాపీ గా చరణ్ కి చెప్పెయ్యి.”

“లేదు ఆకాంక్ష.. మొదట్లో నేను భయపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. నా గతం వల్ల నేను నా చుట్టూ వాల్స్ పెట్టేసుకున్నాను. కానీ చరణ్ చాలా ఓపిగ్గా ఉన్నాడు నాతో. నాకు సెక్స్ లో ఏం కావాలో అడిగి మరీ చేస్తాడు. నేను తన దగ్గర నా ఆర్గాస్మ్ ఫేక్ చేయలేను.. కెన్ యు బిలీవ్ ఇట్? హి నోస్ వెన్ ఐ ఆమ్ నాట్ డన్. నా ఎక్స్ నన్ను శారీరకంగా మానసికంగా ఎంతో అబ్యూస్ కి గురి చేసాడు. మళ్ళీ నేను ఇంకో మనిషికి నేను దగ్గర కాగలనని కలలో కూడా అనుకోలేదు నేను. లేని ప్రేమలు నటించి ఏదో ఆశించే వాళ్ళతో పోలిస్తే చరణ్ వేల రేట్లు నయం. అయినా ఇప్పుడు నేను కూడా మళ్ళీ పెళ్ళి లాంటి డ్రామా డీల్ చేయలేనేమో అనిపిస్తుంది. రేపటి సంగతి నాకు తెలీదు బట్ ఫర్ టుడే, దిస్ ఈస్ ఎనఫ్.” అని రూప చిరునవ్వు నవ్వింది.

“నీకు ఆ క్లారిటీ ఉండటం మంచిదే. అది నిన్ను హార్ట్ బ్రేక్స్ నుండి కాపాడుతుంది. యు అర్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. మన జీవితం లోకి మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ఎవరూ పెర్మనెంట్ కాదన్నది పచ్చి నిజం” అని చెప్పింది ఆకాంక్ష.

***

గదిలో వెలుగుతున్న జీరో బల్బ్ వెలుతురు తప్పించి అంతా దాదాపు చీకటిగా ఉంది. కానీ అంత చీకట్లోనూ తనని చూస్తున్న చరణ్ కళ్ళల్లో మెరుస్తున్న మెరుపులు రూప గమనించక పోలేదు. చెమటతో తడిసిన తనను చరణ్ అలా చూస్తుంటే కొత్తగా తనను నగ్నంగా చూస్తున్నట్టు అనిపించి సిగ్గుపడింది.

“అబ్బా.. ఏంటలా చూస్తున్నావ్?” విసుక్కున్నట్టు నటిస్తూ అడిగింది.

“అనాటమీ పుస్తకం లో బొమ్మ లా ఉన్నావ్ తెలుసా?” అన్నాడు చరణ్.

“కామెంటా? కాంప్లిమెంటా?” మళ్ళీ అడిగింది రూప.

“నువ్వేమన్నా అనుకో, ప్రతి సారి కొత్తగా కనిపిస్తావ్ తెలుసా?” ముద్దుల వర్షం కురిపిస్తూ అన్నాడు చరణ్.

“మరీ చెప్తావ్.. కడుపు మీద సి-సెక్షన్ స్కార్, సాగిపోయిన కడుపు, వొళ్ళంతా స్ట్రెచ్ మార్క్స్, ఇవన్నీ చూస్తున్నా నీకు అలా ఎలా అనిపిస్తుంది?” లోలోపల సంతోషంగా ఉన్నా, తను నిజమే చెప్తున్నాడని నమ్మినా, కావాలని, తను మళ్ళి మళ్ళీ చెప్తే వినాలని అడిగింది.

“ఈ స్కార్స్ నీ అందాన్ని ఇంకా ఇంకా పెంచుతున్నాయి. ట్రస్ట్ మీ!” అని రూప పొత్తి కడుపు మీద ముద్దులు పెట్టాడు.

ఇదంతా కిటికీ లో నుండి గమనిస్తున్న మచ్చల చందమామ ఇంకాస్త ఎక్కువగా మెరిశాడు.

*

మాధురి పాలాజి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • టైటిల్ ఒక్కటే కాదు, కథ కూడా చాలా బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు