వర్చ్యువల్ బీయింగ్

నేను శ్రీనిధి . మహబూబ్ నగర్ లో ఇంటర్ దాకా చదివి హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను.  7వ తరగతి నుంచి అడపా దడపా కవితలు అల్లుతూ ఎక్కడ ఏ పోటీ ఉన్నా బుర్రుపిట్టలా అక్కడ చేరేదాన్ని . ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రాలినచుక్కలు అనే కవితా సంపుటి తీసుకొచ్చాను.  అక్షరాలను మోస్తూ ఎగిరేందుకు స్వేచ్చా రెక్కలిచ్చిన నా కుటుంబానికి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని.
*
1.వర్చ్యువల్ బీయింగ్ 
~
నిండుకున్న బంధాల మూటలు నింపుకుని
భుజాన మోసేందుకు
ఎడతెగని ప్రయాణం చేసే బాటసారిని …
కలుపుకుపోవడమే నా ధ్యేయం
అది నిన్నైనా మరొకరినైనా …
గుండెరాయికి అలారం కట్టి
ఊపిరిని విడతల వారిగా పంచుకునే కాలం …
ఒక్క హృదయమైనా నాతో సాగుతుందా ?
సమయాలు గడియారల్లోనే బంధింపబడ్డాయి
ఆనందలన్నీ ఆఫీసు ఇన్సెంటివుల్లో
అమ్మప్రేమలన్నీ అరనిమిషం స్టేటస్లో ఒదిగిపోయాయి
ఎవరిని నిందించలేం …
కాలాన్నేమో ఆపేయ్యలేం !
మోక్షమంటే టార్గెట్ రీచింగ్గా …
గండమంటే ట్రాఫిక్ లో ఇరుక్కోవడంగా …
నవ్వులన్నీ id కార్డులకు వేలాడదీసి
గుంజుకుపోయిన ముఖాలు తొడుకున్నాం …
పాతరోతలకు పంగనామం పెట్టినా
కొత్తరంగులను ఆస్వాదించలేం
పురోగమనంలో బంధింపబడ్డా
బంధనాల సంకెళ్లు విధిలించుకోలేం
సంతోషాల స్వేచ్చావాయివులు పీల్చుకోలేం
ఇప్పుడు మనిషంటే కేవలం
ప్లాస్టికు నవ్వు తొడుక్కుని
కాంక్రీటు జంగిల్లో నలుగుతున్న వర్చ్యువల్ బీయింగ్
నవ్వడం, నటించడం ఆఖరికి జీవించడం కూడా
నలభై నిమిషాల క్లాసులో నేర్పబడును !
2.అందరూ ఆహ్వానితులే…  
~~~
గొంతు పూడుకుపోయింది
రెక్కలు రెండూ బిగుసుకుపోయాయి
విధిలించుకోవాలని ఆరాటపడుతున్నాయి
ఇంతలో చిన్ని అలికిడి
అటుగా వీచే చైతన్య గాలిపాట
మంద్రంగా చెవులను
స్పృశిస్తుంటుంది
కట్టుబాట్ల పంజరాలు
మౌఢ్యపు మోహరింపులు
ఫెళ్ళున విరిగేలా
రెక్కలు విప్పుతాను
ఎగరడం నేర్చుకుంటాను
పడిపడి లేచి
స్వేచ్చా గీతం ఆలపిస్తాను
గాలి శృతి కలుపుతుంది
తెగింపు వేసిన భవిషత్ బాటపై
నా చైతన్య గీతాల కార్యక్రమానికి
అందరూ ఆహ్వానితులే.
*

శ్రీనిధి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇలా సారంగ పత్రికలో నా కవితలు చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు కలిగించిన అఫ్సర్ సర్ కు , పేర్ల రాము అన్నయ్యకు నా ధన్యవాదాలు.

  • నీ ఆహ్వానం బహు బాగుంది, పర్చ్యువల్ బీయింగ్ అంటూ నేటి సమాజాన్ని ఆవిష్కరించావుగా. చాలాబాగున్నాయ్ మా కవితలు అభినందనలు💐💐

  • రెండు కవితలు బాగున్నాయ్ విప్లవ .

  • చాలా బాగా రాసావు శ్రీ.. అద్భుతం.. కలుపుకు పోవడమే ధ్యేయంగా.. గుండె రాయికి అలారం కట్టి సాగిపోతున్న కాలం సాక్షిగా.. నీ చైతన్య గీతాల స్రవంతిలో నేనూ నీ తోడున్నాను..

    • చాలా అద్భుతమైన కవిత అమ్మ
      దేవుడు ఆశీస్సులుతో ఎన్నో విజయాలు
      సాధిచాలని కోరుకుంటున్నాను
      మీ మీ శ్రేయోభిలాషి
      పిన్నాన నందీశ్వరరావు
      శ్రీ సత్యసాయి బాలవికాస్ గురు
      పాంచాలి

  • Congrats …విప్లవి. కవితలు బాగున్నాయి.
    ఇలానే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ…..💐💐 Thank-you afsar sir💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు