లోపలి తలుపులు తెరిచే తాళం చెవి కల్పనారెంటాల కథలు

 

‘‘మాకు గోడలు లేవు గోడలను పగలగొట్టటమే మా పని.’’

1937లో శ్రీశ్రీ అన్నమాట ఇది. వర్గవ్యత్యాసాలు, వాటిని పరిపోషించే భావవాదం మీద అభాగ్యుల పక్షాన నిలబడిన ఒక భౌతికవాది ఎగరేసిన తిరుగుబాటు కవితా పతాకం (వ్యత్యాసం) ఎత్తిపట్టిన నినాదం ఇది. ఆ తరువాత అర్ధ శతాబ్దికి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాల పై ధిక్కార స్వరమెత్తిన మహిళల కంఠంలో రణన్నినాదమై ప్రతిధ్వనించింది ఈ మాటే.

తెలుగునాట స్త్రీలు తమను తాము తెలుసుకొనటానికి , తెలుసుకొంటూ వ్యక్తీకరించు కొనటానికి గొప్ప సంరంభంతో బహువచనమై ప్రవహించిన ఆ తొంభయ్యవ దశకపు ఉత్సాహపూరిత, ఉద్విగ్నభరిత సందర్భాలు నాకిచ్చిన మిత్రులలో కల్పనా రెంటాల కూడా ఉంది. సాహిత్య ప్రపంచంలో ‘నేను’ కనిపించే పదం కోసం వెతుక్కొంటూ నాకు తారసపడింది. తన కవిత్వం ఇష్టంగా చదువుకొన్నాను. అమెరికా వెళ్లింది. అప్పుడప్పుడే కథలు వ్రాయటం మొదలుపెట్టింది. కవిత్వసంపుటి వేసిన పదేళ్లకు తన్హాయి నవల ప్రచురించి జీవితంలో స్త్రీపురుషుల మధ్య ఏర్పడే ఆకర్షణ, మోహం, స్నేహం సృష్టించే అద్భుత అనుభవాలను, సంఘర్షణలను, వాటి మధ్య సాధించు కోవలసిన సమన్వయాన్ని తరచి చూచుకొమ్మంటూ తట్టి లేపింది. మళ్లీ సరిగా పదేళ్లకు ఇప్పుడు కథల పుస్తకంతో మనతో మాట కలుపుతున్నది కల్పన. అందుకు తనను అభినందిస్తూ ఈ పదేళ్ల లెక్క తప్పించి ఇప్పటికే వ్రాసి ఉంచిన అనువాద కవిత్వం, విమర్శ వ్యాసాలు త్వరలో పుస్తకాలుగా తేవాలని కోరుతున్నాను కల్పనను.

ఈ సంపుటంలో 2002 నుండి ఇప్పటివరకు 20 ఏళ్ల కాలం మీద కల్పన వ్రాసిన పదిహేను కథలు ఉన్నాయి. ఒక రచయిత వ్రాసిన ఒక్కొక్క కథను విడివిడిగా చదివినప్పుడు కలిగే అనుభవం కన్నా అన్ని కథలను ఒకేసారి ఒకచోట చదివినప్పుడు కలిగే అవగాహన తప్పకుండా ఉన్నతమైందిగా ఉంటుంది. పరిమాణం గుణంగా వ్యక్తం కావటం అంటే అదేకదా! ఆ క్రమాన్ని పరిశీలిస్తూ చేసే ప్రయాణంలో రచయిత మనకు అర్ధం అయ్యే ప్రక్రియ ఒకటి ఉంటుందే, అది మరీ బాగుంటుంది. మహిళా రచయితల విషయంలో అయితే మరీను. వాళ్ల ఆలోచనాప్రపంచం, అనుభవ ప్రపంచం, ప్రపంచాన్ని మార్చటానికి, కొత్తగా నిర్వచించటానికి వాళ్లు పడే ఆరాటం, చేసే ప్రయత్నం ఆదిమానవి నుండి ఆధునిక మహిళ వరకు కొనసాగి వస్తున్న సంవేదనల భావజాల చరిత్రలో భాగంగా భాసించి సంభ్రమానికి గురి చేస్తాయి. ఈ సంభ్రమం ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది. అందుకనే కల్పన కథలకు ముందుమాట వ్రాయటానికి ఇష్టపడ్డా.

కల్పన కథలలో అయిదోగోడ చదవటం పూర్తయ్యేటప్పటికి అయిదోగోడ చాలా కాలంగా ఎన్నిసార్లు కూలగొడుతున్నా మళ్లీ మళ్లీ హఠాత్తుగా అడ్డంగా ప్రత్యక్షం అవుతున్న ఫీలింగ్‌ ఏదో ఊపిరాడనియ్యక ఉక్కిరిబిక్కిరి చేసింది. అయిదో గోడ అన్న ఈ భావచిత్రం కూడా చిరపరిచితం అనిపించింది. జ్ఞాపకాల పొరలలో దాని ఆచూకీ కోసం వెతుకులాట మొదలై ఏమీ తోచనివ్వదు. కథలు వదిలేసి కల్పన కవిత్వం తెచ్చి చదువుకోటం మొదలుపెట్టా. అయిదోగోడ శీర్షికతో ఈ కవిత కంట బడింది.

అయిదు గోడల గది

లోపల ఆత్మల అజ్ఞాతవాసం

గోడలకవతల ఏవేవో ఇజాలు

దగ్ధ శరీరాల కాంక్షా వాసనలు

ఆత్మ కథల కలవరింతల్లో

బీటలు వారిన గోడలు

రేగిన ప్రతిసారీ గేయమై

గాయమైన దేహాలు

ఇప్పుడు ఏముందక్కడ

గోడకవతల ఇజాలు

గోడకివతల నిజాలు

దేహం . నేను

గాయం . నేను

చివరాఖరికి అంతా అదృశ్యం

మిగిలింది అయిదో గోడ

గదికి గోడలు నాలుగే కదా! నాలుగు గోడల మధ్య బందీలైన స్త్రీల విముక్తి కోసమే కదా ఆరాట పోరాటాలన్నీ!? ‘అయిదుగోడల గది’ అంటుందేమిటి కల్పన!? ఆ అయిదో గోడ ఎక్కడ? ఏమిటి?

అని అప్పుడు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఆ కవిత చదివినప్పుడు వేసుకొన్న ప్రశ్నలు, చేసిన ఆలోచనలు జ్ఞాపకాల పొరలలో ఘనీభవించినవి ఇప్పుడీ అయిదో గోడ కథ చదివేసరికి కదలబారినట్లున్నాయి. కల్పన కథల తలుపులు తెరిచే తాళంచెవి ఈ అయిదోగోడ.

భౌతికమైన ఇంటి నిర్మాణంలో అయిదో గోడ పైకప్పు. అది లేంది ఇల్లుకాదు. తల దాచుకునేందుకు నీడను ఇచ్చే ఇల్లుగా సంపూర్ణ రూపం పొందేది దానితోనే. ఇంటి అలంకరణలో నాలుగు గోడలకు ప్రాధాన్యత ఇచ్చి పైకప్పును నిర్లక్ష్యం చేయటం సరైందికాదు, దానికి కూడా సమ ప్రాధాన్యత ఇయ్యాలన్నది ఒక భావన. అంతకన్నా సాహిత్యం విషయంలో అన్వయించుకోదగిన అయిదోగోడ భావన నాటక రంగస్థల ప్రయోగ సంబంధమైనది. రంగస్థలంలో నటులకు ప్రేక్షకులకు మధ్య ఉండే ఊహాత్మక దూరం నాలుగోగోడ కాగా ఒక నటుడు లేదా నటి భిన్న పాత్రలను పోషిస్తూ, అనుభవిస్తూ జీవించే భిన్న కథాప్రపంచాలకు సంబంధించినది అయిదోగోడ. ఒక సాంస్కృతిక అనుభవం తరువాత అనుభవం పొందిన స్థలానికి మిగిలిన ప్రపంచానికి మధ్య దాని ఉనికి. జీవితనాటక రంగంలో స్త్రీలు భిన్న స్థలాల్లో, సందర్భాలలో పొందే అనుభవాలను నాటకంలో పాత్రలవలె అక్కడికక్కడే వదిలేస్తూ మిగిలిన ప్రపంచానికి అది ఆశించిన, నిర్దేశించిన పద్ధతిలో జీవిస్తూ మిగిలిపోతుంటారు. స్త్రీల జీవితంలోనే ఆ రకంగా ఒక కనబడని అయిదోగోడ భాగమై ఉంది. రంగస్థల ప్రయోగ సాంకేతికతలో ఐదోగోడను బద్దలుకొట్టటం అంటే నాటకంలో ఆ కథకు భిన్నమైన స్థల కాలాలలోని పాత్రల సాంస్కృతిక అనుభవాలను ఒకానొక సంఘటనా సందర్భం లో ఆయా పాత్రల చేతనే చెప్పించటం. అయిదోగోడ కవితలో ‘గోడ కవతల ఇజాలు / గోడకివతల నిజాలు’ అని చెప్పిన కల్పన ఆ ఇజాలకు ఈ నిజాలకు మధ్య వైరుధ్యాలను గుర్తించి చర్చించటానికి వ్రాసిన కథలు ఇవి.

గోడలు హద్దులను నిర్దేశిస్తాయి. హద్దులు స్వార్ధానికి, సంకుచితత్వానికి గుర్తులు. అభివృద్ధి నిరోధకాలు. కులమత జాతివర్గ భేదాలు అన్నీ మానవ వికాసానికి అవరోధకాలే. గోడలను పగలగొట్టే కార్యక్రమం అందుకే. ఆ పనిలో ఎప్పటికైనా విజయం సాధించవచ్చునేమో కానీ సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం అంతకన్నా కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ, ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతం. ఆ పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి కథ అయిదోగోడ.

భర్త చనిపోయిన నెలరోజులకు కలిసి జీవితం పంచుకోటానికి తోడు కావాలని ఒక స్త్రీ ఇచ్చిన పత్రికాప్రకటనకు ఆమె కూతురి ప్రతిస్పందన, వాళ్లిద్దరి సంభాషణ, సమాధానం ఇతివృత్తంగా సాగే కథ అయిదోగోడ. భార్య చనిపోయి నెల తిరక్కముందే మగవాడు ఆడతోడు కోసం మళ్లీ పెళ్లికి సిద్ధపడటం అత్యంత సహజంగా భావించబడే సమాజంలో భర్త మరణించిన స్త్రీ మగతోడును ఆశించటం, అవసరం అని ప్రకటించటం విడ్డూరం అవుతాయి. మగవాడి కోరికలో న్యాయం ఉందనుకొంటారు. ఆడదాని కోరికలో కామంతో కాలిపోవటం కనబడుతుంది. ఈ ద్వంద్వ విలువల వ్యవస్థ సహజ న్యాయవ్యవస్థగా అంగీకారాన్ని పొంది ప్రతి మనిషి భావంలో, భాషలో, ఆలోచనలో, చూపులో లేపిన దుర్భేద్యమైన గోడల గురించిన చర్చను ముందుకు తెచ్చింది ఈ కథ.

చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకొని భర్తల ఇష్టాలకు అనుగుణంగా తమనుతాము తీర్చి దిద్దుకొనటానికి పొందిన శిక్షణతో స్త్రీలు సంఘర్షణ లేని చక్కని, చల్లని సంసారాలను నిర్మించవచ్చు. అయితే ఎన్ని చల్లారిన అభిలాషలు, ఆశలు, ఆకాంక్షలు అంతరంగం అడుగుపొరలకు నెట్టేసుకొంటే కానీ వాళ్లకు అది సాధ్యం కాదని తెలిసేది ఎందరికి? శారద ముఖంగా ఆ గోడలకివతలి వాస్తవాలను తెలియపరచింది రచయిత్రి. శారద భర్త మరణానంతరం యాభై దాటిన వయసులో తోడు కోసం వెతుక్కొనటం ఆ అసంతృప్తి నుండి విముక్తిని కోరే. తల్లి వాదనలోని న్యాయం, నిజాయితీ, సామంజస్యం ఆర్తిని అమ్మ ఎంచుకొన్న మగ స్నేహితుడిని కూతురుగా ఆమోదించేట్లు చేశాయి. ఇదీ కథ.

కానీ అసలు కథ కాదు. కథలో కథ. ఏ వయసు స్త్రీకయినా తనకు ఇష్టం వచ్చినట్లు, తనకు నచ్చిన పద్ధతిలో తోడు వెతుక్కోగల స్వేచ్చÛ ఈ సమాజంలో ఉందా లేదా అన్న ప్రశ్నను చర్చించటానికి ఒక స్త్రీ వ్రాసిన కథ. ఒకరకంగా ఇదొక విప్లవాత్మక కథ. రచయిత్రి స్త్రీవాద దృక్పథానికి గుర్తు. అయితే రచయితల చైతన్యంలో ఉండే పరిమితులను చర్చలోకి తేవటం ఈ కథకు అదనపు లక్ష్యం.

తోడు కావాలి అన్న ప్రకటనలో సంస్కారవంతుడై స్నేహంగా మెలగగలిగిన సంగీత సాహిత్యాలలో అభిరుచి, సామాజికసేవలో ఆసక్తి ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత అని పేర్కొనబడిన మాటలు తాను చేసిన పనికి సామాజికామోదం సమకూర్చిపెట్టటానికి రచయిత్రి ఉపయోగించిన భాషా చాతుర్యంగా పేర్కొంటుంది కథలోని శారద పాత్ర. శారీరక వాంఛ సహజీవనంలో భాగం కాదా!? దానిని మరుగుపరిచి చెప్పటం అంటే చెలియలి కట్ట దాటటం ఆదర్శంగా పేర్కొని ఆ క్రమంలో వేసే అడుగులకు మళ్లీ ఒక హద్దును నిర్ణయించటమే అంటుంది. ఆదర్శాలు, సిద్ధాంతాలు గోడలకావల ఎన్నెన్నో. కానీ ఆచరణకు సంబంధించి కనబడని లక్ష్మణరేఖలు లెక్కలేనన్ని. ఈ లక్ష్మణరేఖలనే మనిషి లోపల, ఇక్కడైతే ప్రత్యేకంగా రచయిత్రి లోపల ఉన్న అయిదో గోడ అని గుర్తించి చెప్పింది కల్పన. ఆ రకంగా ఈ కథ జీవితంలోనే కాదు, సాహిత్య సృజనలో వస్తు నిర్వహణలో కూలగొట్టవలసిన అయిదో గోడ గురించిన ఒక హెచ్చరిక.

పుట్టుకతో వచ్చే లింగభేదం వల్ల శరీరం ఆడదీ కావచ్చు మగదీ కావచ్చు. కానీ ఆ శరీరాన్ని నిర్వచించి, నియంత్రించే భావజాలం మాత్రం సామాజిక నిర్మితం. లింగ వివక్ష ఉన్న సమాజాలలో అది సహజంగా పురుష సాపేక్షతలో రూపం తీసుకొంటూ ఉంటుంది. ఫలితం శరీరం ఒక వాస్తవం కాగా దాని చుట్టూ అల్లబడిన మాయావరణం లో బందీలుగా స్త్రీలు హింసకు గురి అవుతుంటారు. దాని గురించిన ఎరుకగా, అభివ్యక్తీకరణగా స్త్రీవాద సాహిత్యం కొత్త వస్తువుతో మొదలైంది. శరీరం, బహిష్టు రక్తస్రావం, సంభోగ సంతోష విషాదాలు, గర్భం, అబార్షన్‌, ప్రసవం- అన్నీ కవితా వస్తువులయ్యాయి. అవే కల్పనకు కథావస్తువులైనా వాటిని ఆమె నిర్వహించిన తీరు విలక్షణం.

ఋతుభ్రమణం ఆమె తొలి కథ. నెలసరి బహిష్టు స్త్రీ జీవితాన్ని ఎలా ఆక్రమించి పాలిస్తుందో ఈ కథలో ఇద్దరు పిల్లల తల్లి, నలభై అయిదేళ్ల వయసులో ఉన్న ఉద్యోగస్తురాలైన స్త్రీ అనుభవకోణం నుండి చిత్రించబడింది. ఆమె ఆ నెల రావలసిన బహిష్టు ఇంకా రాలేదేమా అని ఎదురుచూస్తూ , గర్భం కాదుకదా అని సందేహిస్తూ అయితే చేయించుకోవాల్సిన అబార్షన్‌ గురించి భయపడుతూ అసహనంతో చిరాకుతో ఆందోళనకు లోనుకావటం దగ్గర కథ మొదలవుతుంది. ఆమె జ్ఞాపకాలుగా ఆలోచనలుగా రజస్వల తొలి అనుభవాలు, దానిని ఒక రహస్యంగా దాచుకోనటానికి ఇయ్యబడే శిక్షణ, మూడు రోజులు బయట కూర్చోవలసి రావటం వల్ల మగపిల్లల వింత చూపులకు గురి అవుతూ ఇబ్బందిపడటం, బహిష్టుతో పాటు వచ్చే కడుపునొప్పి, నడుంనొప్పి వంటి బాధల అనుభవం, అవి పోవటానికి ప్రసవానికి మధ్య సంబంధాల గురించిన ఊరటలు- ఇలా దాని చుట్టూ ఉన్న వాస్తవాలు, భ్రమలు, ఆచారాలు, అవమానాలు అన్నీ క్రోడీకరించబడ్డాయి. బహిష్టు రాక సూచనగా కావచ్చు, బహిష్టు ఆగిపోయే దశకు సూచకంగా కావచ్చు స్త్రీలలో సంభవించే శారీరక బాధా సంకేతాలు, మానసిక అవస్థలు, వాటిని ఎవరూ పట్టించుకొనటంలేదే అన్న ఉక్రోషం, తప్పని పనుల ఒత్తిడి , ఆందోళన కోపంగానో, చిరాకుగానో వ్యక్తమైతే ఇంటాబయటా అది వాళ్ల స్వంత సమస్యగా చూడబడటం స్త్రీత్వాన్ని శారీరక ధర్మస్థాయిని మించి సామాజిక విధానంగా నిర్వచిస్తున్న వివక్షాపూరిత సంస్కృతి ప్రభావం వల్లనే అన్న సూచనతో కథను ముగించింది రచయిత్రి. స్త్రీలు సామాజికరంగాలలో అవకాశాలను అంది పుచ్చుకొని సాధికారతను సాధించుకోవాలి అని చెప్పిన స్త్రీల సాధికారితా సంవత్సరం గడిచిపోయిన ఏడాది తరువాత రాసిన కథ ఇది. ఆ విషయంలో సమాజంలో సానుభూతిని పెంచగల, పంచగల జ్ఞాన సంస్కారాల వికాస దిశగా అడుగులు పడక పోవటం గురించి ఆలోచించమంటుంది ఈ కథ.

అమ్మకో ఉత్తరం! కల్పన రెండవ కథ (2004) పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిన కూతురు తల్లికి వ్రాసిన ఉత్తరం అది. మగపిల్లల ఉద్యోగాలకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు అమెరికా గమ్యం అయిన స్థితి మీద అమెరికా సౌకర్యాల పట్ల, జీవనవిధానం పట్ల పెరుగుతున్న వ్యామోహం గురించిన ఒకింత వ్యంగ్యంతో కూడిన విమర్శ అంతర్వాహినిగా ఉన్న ఈ కథలో ఆ కూతురు తల్లికి ఉత్తరంలో ‘అమెరికాలో ఉండటం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది,’ అంటూ, ‘స్వేచ్చÛకు ఈ దేశం పెట్టింది పేరు. ప్రతి మనిషి మాటకు విలువుంటుంది. ఎవరి ‘ఛాయిస్‌’కి ఎవరూ అడ్డురారు’… అని వ్రాస్తుంది. కానీ అది ఎంత భ్రమో ఛాయిస్‌ అనేది స్త్రీపురుష తేడాలను బట్టి ఎలా సంకుచితం అవుతుందో ఎలా విస్తరిస్తుందో క్రైవ్‌ు సీన్‌ కథ చదివితే అర్ధం అవుతుంది.

రాత్రి పార్టీకి స్నేహితురాలతో కలిసి వెళ్లిన శ్రియ కాలేజీ పాపులర్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు బెన్‌తో మాట కలిసినందుకు, సంభాషణ సాగినందుకు, సన్నిహితంగా ఉండగలిగి నందుకు సంతోషపడ్డది. కానీ అతను పక్క రూములోకి లాగేసి బలవంతాన ముద్దు పెడుతుంటే వద్దనే ఛాయిస్‌ ఆమెకు లేకపోయింది. చెంపలు వాయించి, నోరు మూసి అత్యాచారం చేస్తుంటే నిస్సహాయంగా మిగిలిపోవలసి వచ్చింది. ఇద్దరి ఇష్టంతో జరగవలసిన సంయోగంలో ఎప్పుడు ఎవరు అనే మగవాడి ఛాయిస్‌ అంతిమ నిర్ణాయక శక్తి అవుతున్నప్పుడు ఆడదాని ఛాయిస్‌ పూర్తిగా నిరాకరించబడ్డట్లే. అవకాశాల దేశం, ఎంచుకున్న మార్గంలో వెళ్లటానికి వీలున్న దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. అత్యాచారం కేసులో స్త్రీ శరీరం ఒక నేరదృశ్యం అయిపోతుంది. ఆ శరీరం మీద జరిగిన దాడి తాలూకూ ప్రతి చిన్న వివరాన్ని నమోదు చేయటమే రేప్‌ కిట్‌ పరీక్ష. అత్యాచారానికి గురైన బాధితులు రిపోర్ట్‌ చేయదలచుకొంటే నేర శోధనకు సాక్ష్యాలను భద్రపరచటమే దాని ప్రయోజనం. కథ శ్రియ రేప్‌ కిట్‌ పరీక్ష దగ్గరే మొదలవుతుంది.

అయితే ఇల్లలకగానే పండగ కాదు. కేసు వెయ్యకుండా అడ్డుకొనే వ్యక్తులు, సంస్థలు ఉన్నప్పుడు వేసినా విచారణకు రాకుండా అడ్డుకోగలిగిన పరపతి ఉన్నప్పుడు సాక్ష్యాలు వాటంతట అవి మాట్లాడలేవు. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం కంటే, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ తెచ్చే పాపులారిటీ ముఖ్యం అనుకుంటున్న కాలేజీ నిందితుడిని క్షమించి వదిలి పెట్టేయమంటున్నప్పుడు శ్రియకు తమ శరీరానికి జరిగిన అవమానం గురించి, అన్యాయాన్ని గురించి మాట్లాడే ఛాయిస్‌, న్యాయాన్ని కోరే ఛాయిస్‌ నిరాకరించబడ్డట్లే. పరువు, ప్రతిష్ట, భవిష్యత్తు, పెళ్లి వంటి భయాలతో రాజీకి సిద్ధపడదామని ఒత్తిడి తెచ్చిన శ్రియ తల్లిదండ్రులు కూడా ఆమె ఛాయిస్‌ను నిరాకరించినట్లే.

కానీ శ్రియ ఛాయిస్‌ను వదులుకొనటానికి సిద్ధంగా లేకపోవటం, ఆమె తన ఛాయిస్‌ను ఉపయోగించుకొనటానికి అన్న, తల్లి మద్దతుగా నిలబడతామనటం ఈ కథకు ముగింపు.

అత్యాచార ఘటనలలో తరచు బాధితులే బాధ్యులుగా చేయబడుతుంటారు. శ్రియ కాలేజీ బెన్‌ మీద ఫిర్యాదును స్వీకరించనందుకు, బెన్‌ కుటుంబంతో రాజీకి వత్తిడి పెడుతున్నందుకు బెన్‌ మీదా కాలేజీ మీదా కేసు పెట్టటమే తన నిర్ణయం అని ప్రకటిస్తే తల్లీతండ్రి ప్రెస్‌, మీడియాలలో జరగబోయే ప్రచారం గురించి, పార్టీలో బెన్‌తో సన్నిహితంగా ఉన్న ఆమె ఫోటోలు బయటకు వచ్చి ఆమె వేసుకొన్న బట్టల గురించి జరగబోయే చర్చను గురించి సూచించి అది రేప్‌ కాదని వాదించే అవకాశం ఉందని ఆమెను నిరుత్సాహపరచబోవటంలో ఉన్నది. బాధితులను బాధ్యులుగా చేసే సంస్కృతి గురించిన భయమే. ఆ అయిదో గోడకే ‘ఫోటోలు దిగడమో, షార్టో, స్కర్ట్‌ వేసుకోవటమో చేస్తే ఎవరైనా రేప్‌ చేయొచ్చా?’ అన్న ప్రశ్నతో గురిపెట్టింది శ్రియ.

ఎక్కడో జరిగే రేప్‌ల గురించి బాధపడి ఆవేశం తెచ్చుకునే వాళ్లు స్వంత కూతురుకి అన్యాయం జరిగితే మాత్రం మర్చిపొమ్మని సలహా ఇయ్యటంలో వైరుధ్యం ఎక్కడ ఉంది? లైంగిక సంబంధాన్ని కేవల శారీరక ప్రక్రియ స్థాయి నుండి శీలం, పవిత్రత వంటి సాంస్కృతిక అంశాలతో నింపి స్త్రీ జీవితాన్ని విలువకట్టే ప్రక్రియగా పరివర్తింప చేసిన సామాజిక సంబంధాల వ్యవసలో ఉంది. ఆ సామాజిక సంబంధాలే అత్యాచార బాధిత వాస్తవాన్ని గోడకివతలే అజ్ఞాత వాసం లోకి నెట్టెయ్యమంటాయి. బాధితులు నేరస్థులుగా తలలు వంచుకొని గోడలకివతల మిగిలిపోతే నేరస్థులు గోడ కవతల ధర్మపన్నాలు వల్లిస్తూ మిగిలిన ప్రపంచాన్ని మర్యాద రామన్నలుగా ఏలుతూ ఉండే స్థితి భయంకరమైనది. చూస్తూ సహించకూడనిది. అందుకే శ్రియ దేహంతో, దేహానికి అయిన గాయంతో మౌనంగా ఉండిపోవటమే నేరం అనుకొన్నది. భవిష్యత్తులో జరగవలసిన పెళ్లి కోసం వర్తమానంలో ఏమీ జరగనట్టు నటించటం న్యాయం కాదు అనుకొన్నది. అయిదోగోడను బద్దలు కొట్టి మిగిలిన ప్రపంచంతో పూర్వ అనుభవం కలిగించిన భయాలను, బాధలను, కోపాలను గురించి సంభాషించ సిద్ధపడింది.

యవ్వన సహజమైన ఆకర్షణలు, తొందరలు, లైంగిక సంబంధాల పట్ల కుతూహలం, ప్రేమ స్త్రీ పురుషుల మధ్య శారీరక కలయికలకు కారణం అవుతుంటాయి. స్త్రీలకు చదువులు, ఉద్యోగాలు దేశవిదేశాలలో ఒంటరి జీవితం పరిపాటి అవుతున్న ఆధునిక కాలంలో అందుకు అవకాశాలు ఎక్కువ. వీటి పర్యవసానాలు స్త్రీల జీవితం మీద ఎలా ఉన్నాయనేది భిన్నకోణాల నుండి కల్పన కథలకు వస్తువైంది. ఎండమావులు, అయిదు శాజరాక్‌ల తరువాత, కోట్‌ హేంగర్‌ కథలు ఆ కోవలోవే. రెండు కథలలోను స్త్రీలు భారతదేశం నుండి అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్లే . ముగ్గురూ తమకు నచ్చిన యువకులతో స్నేహం చేసినవాళ్లే, సహజీవనం చేసినవాళ్లే. అందులో వైఫల్యం అనుభవానికి వచ్చినవాళ్లే. ఆ వైఫల్యాన్ని వాళ్లు తీసుకొన్న తీరు, అధిగమించ టానికి ఎన్నుకొన్న మార్గం ఎవరివి వాళ్లవే.

ఎండమావులు కథలో దివ్య ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్న నమ్మకంతో రాజేష్‌తో ఏడాదిన్నర పాటు సహజీవనం చేసింది. లైఫ్‌ను జాలీగా ఎంజాయ్‌ చేయాలనే రాజేష్‌ అభిప్రాయానికి అనుకూలంగా తననుతాను మలుచుకొన్నది. తీరా అతను తల్లిదండ్రులు కుదిర్చిన కట్నం పెళ్లికి సిద్ధపడ్డాడని తెలిసి వచ్చేటప్పటికి ఆమె మూడు నెలల గర్భవతి. ఆ విషయం చెప్పినా, అన్ని విధాలా అతనిని సంతృప్తిపరచగల భార్యగా నడుచుకొంటానని బతిమాలినా భంగపాటే ఎదురైంది. దానికి ఆమె ఎన్నుకొన్న పరిష్కారం ఆత్మహత్య.

కోట్‌ హేంగర్‌ కథలో ప్రీతి కూడా దివ్యలాగానే తిరస్కృత. ఆమె ఎన్నుకొన్న పరిష్కారం గర్భస్రావం. చట్టబద్ద అవకాశాలు లేకపోవటంవల్ల ఆన్‌ లైన్‌లో కెనడా నుండి తెప్పించు కొన్న మాత్రలు వేసుకొని మరెవరి తోడూ లేకుండా గర్భస్రావానికి ప్రయత్నించి యాతన పడి, బతుకు మీద ఆశతో మెడికల్‌ ఎమర్జన్సీకి ఫోన్‌చేసి చివరకు ఇల్లీగల్‌ అబార్షన్‌ నేరం కింద జైలు పాలయింది. ఈ కథలో మరొక కథ ఉంది. అది ప్రీతి చేసిన పని మీద చర్చలు తెలుసుకొంటూ వింటూ వేదన పడిన అపర్ణ కథ. జైల్లో ఉన్న ప్రీతిని కలిసి తన కథ చెప్పుకున్నప్పుడు కానీ పరిచయమే లేని ప్రీతిపట్ల ఆమెకు ఒక దగ్గరితనం ఎందుకు కలిగిందో అర్ధం కాదు.

ఎండమావులు, కోట్‌ హేంగర్‌ రెండు కథలు వ్రాసి ఆ కథలలో మూడు జీవితాలు చూపి కల్పన చెప్పదలచుకొన్నది ఏమిటి? స్త్రీపురుషుల లైంగిక సంబంధాలు ఇద్దరి ఇష్టంతో ఏర్పడేవి , కొనసాగేవీ కావచ్చు. ఇష్టం పోయినప్పుడు వదిలేసుకొనేవీ కూడా కావచ్చు. ఈ ప్రక్రియలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన స్వేచ్చÛను, ఎంపికను వాడుకొంటున్నట్లే ఉంటుంది.

కానీ స్త్రీకి తన శరీరమే ఒక సంకెల అయి ఆ స్వేచ్చÛను, ఎంపిక అవకాశాన్ని హరిస్తుంది. స్త్రీకి ఉన్న పునరుత్పత్తి లక్షణం పురుషుడితో లైంగిక సంబంధాన్ని గర్భంగా శరీరంపై ముద్రించి వదిలినప్పుడు దానికోసం ఆత్మాభిమానాన్ని వదులుకొని వద్దని వదిలి వెళ్లి పోయే మగవాడి కాళ్లావేళ్లా పడేట్లు చేస్తుంది. ఎండమావులు కథలో దివ్య పరిస్థితి అదే.

కారకుడైన పురుషుడు భర్త గా పక్కన లేకుండా స్త్రీకి గర్భం మాతృత్వ గర్వకారకం కానేరదని నిర్ధారించి పెట్టిన మనుధర్మ సూత్రాలకు, స్త్రీల లైంగికత మీద సవాలక్ష నిఫూలకు అవకాశం ఇచ్చిన పితృస్వామ్య సంస్కృతికి సమ్మతి సాధించబడిన సమాజంలో స్త్రీలు ఆ గర్భం కారణంగా ఒంటరివాళ్లుగా చేయబడతారు. సమస్యను ఒక్కరుగానే ఎదుర్కోవలసి వస్తుంది. కని బిడ్డను ఒంటరి మహిళగా పెంచుకోవాలి. లేదా గర్భస్రావం చేయించుకొనాలి. ఆ క్రమంలో బాధ, కష్టం, నష్టం అన్నీ ఆమె ఒంటరిగానే అనుభవించాలి. కోట్‌ హేంగర్‌ కథలో ప్రీతి పరిస్థితి అదే. కలిసి పంచుకున్న సుఖానికి గుర్తుగా మిగిలిన నొప్పిని ఒక్కతే అనుభవిస్తున్న క్షణాలలో ఆమెకు ‘అతను’ గుర్తుకువచ్చాడు. గర్భస్రావ హింసను భరిస్తూ నిస్త్రాణత ఆవరిస్తున్న క్షణాన ఏ ఆశతోనో అతనికి ఫోన్‌ చేసింది. రెండు రింగులకే కట్‌ చేశాడు. మరో మూడుసార్లు ప్రయత్నించినా జవాబు లేదు.

ప్రీతి అబార్షన్‌ ఘటన వర్తమానం అయితే అపర్ణ రహస్య ప్రసవం గతం. ఈ వర్తమానమే అపర్ణ తన గతాన్ని చెప్పుకొనటానికి సందర్భం అయింది. ఇంటర్మీడియెట్‌ చదువుతున్నప్పుడు కాలేజీ ప్రేమ… పిక్‌నిక్‌ అని చెప్పి కల్పించుకొన్న ఏకాంతం గర్భానికి కారణం కాగా ముందు తిట్టి కొట్టి గొడవ చేసిన తల్లి ఉద్యోగానికి సెలవు పెట్టి వేరే రాష్ట్రంలో కాలేజీలో చేర్పించి పురుడు పోసి, పుట్టిన బిడ్డను ఎవరికో దత్తత ఇచ్చి కూతురిని తీసుకొని వచ్చింది. చదువు పూర్తిచేయించి పెళ్లి చేసింది. అలా అమెరికా వచ్చి స్కూల్‌ టీచర్‌గా స్థిరపడిన అపర్ణ ప్రీతి ఉదంతానికి అంతగా కదిలి పోవటం, వేదనపడటం ఆమె భారతీయురాలు కావటం వల్ల కన్నా ఎక్కువ గతంలో తనకు తప్పిన అలాంటి ప్రమాదం గురించిన జ్ఞాపకం వల్ల, అది తన అంతరంగాన్ని కోస్తూ తనలో గాయమై సలుపుతూ ఉండటం వల్ల. లేత వయసు గర్భం, రహస్య ప్రసవం, బిడ్డను తల్లి ఎవరికో ఇచ్చేయ్యటం అది ఒక బాధామయ అనుభవం. అది ప్రపంచానికి అనైతికం. అందువల్ల తల్లికి తనకు తెలిసిన నిజంగా అయిదోగోడ లోపలే మిగిలి పోయింది. సంసారంలో మనసు పొరల మూలాల్లోకి నెట్టేసిన ఆ అనుభవం బాహిరమైన ప్రీతి ఉదంతంతో ఒత్తిడికి లోనై ఆమె సమక్షంలో అత్యంత సహజంగా బహిర్గతమైంది. ఆ రకంగా ఈ కథ సాంకేతికార్థంలో అయిదోగోడను బద్దలుకొట్టింది.

అయిదు శాజరాక్‌ల తర్వాత కథలో సృష్టిది కూడా ప్రేమ వైఫల్యమే. ఐటీ ఉద్యోగంలో యారన్‌తో సంబంధం పెళ్లి వరకు వెళ్తుందనుకొంటే అతను బ్రేకప్‌ చెప్పాడు. ఆ నిరాశలో నిస్పృహలో ఆమె చేసిన ఒంటరి ప్రయాణంలో ఎదురైన అనుభవ కథనం ఇది. మనసులో రేగిన తుఫాన్‌ను తట్టుకోనటానికి ఆమె తుఫానుల నగరం న్యూఅర్లీన్స్‌కు రావటం, 2005 నాటి కత్రినా తుఫాన్‌ బాధితుడైన లోగన్‌ ఆమెకు తటస్థ పడటం, అతని స్నేహం, ఓదార్పు ఆమెలోని తుఫాన్‌ తీరం దాటేందుకు దోహద కారి కావటం చాలా సున్నితంగా, సుందరంగా చెప్పబడిన కథ ఇది. తుఫానులను తట్టుకొని చిగురించే జీవితాశ, సాగించే జీవన పోరాటాల సాపేక్షతలో ప్రేమ వైఫల్యం అన్నది ఎంత చిన్న అంశం అవుతుందో కూడా సూచించింది ఈ కథ.

భిన్న లింగ జీవుల మధ్య ఆకర్షణ, ఆసక్తి, ఉద్వేగం, సంయోగవాంఛ దానిని వ్యవస్థీ కరించిన పెళ్లి, సహజీవనం అనాదివి. సమాంతరంగా అరుదుగానైనా ఇద్దరు స్త్రీల మధ్యగానీ, ఇద్దరు పురుషుల మధ్యగానీ ఆకర్షణ, సహజీవన ఆసక్తి కలగటం వుంది. కానీ ప్రధాన స్రవంతిసమాజం దానిని అసహజ అసంబద్ధ సంబంధంగా త్రోసిపుచ్చు తుంది. తక్కువగా చూస్తుంది. వాళ్లు మైనారిటీ అయినా మనసు, శరీరమూ ఉన్న మనుషులు కనుక పౌరులుగా తమకు ఇష్టమైన జీవితవిధానాన్ని ఎంచుకొనే హక్కు, గౌరవంగా జీవించే హక్కు వున్నవాళ్లు. ఆ హక్కుల కోసం ూ.దీు ఉద్యమాలు 1960వ దశకం నుండి ఊపు అందుకున్నాయి. లెస్బియన్‌, గే సంబంధాలకు చట్టబద్ధత సమ కూడింది కూడా. ఆయా సంబంధాలలో ఉన్నవాళ్లను, ట్రాన్స్‌ జెండర్లను సాధారణ పౌరులుగా ప్రధానస్రవంతిలో విలీనం చేసుకొనే సంస్కారాలు అభివృద్ధి చెందు తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలను వస్తువుగా చేసి కథలు వ్రాయటానికి సాహసించింది కల్పన. ది కప్లెట్‌, సంచయనం ఆ కోవలో కథలు.

ది కప్లెట్‌ కథలో ఇద్దరు యువతుల మధ్య సంబంధం వస్తువు అయితే సంచయనం కథలో ఇద్దరు యువకుల మధ్య సంబంధం వస్తువు. మొదటిది లెస్బియన్‌ కథ. రెండవది గే కథ. రెండింటికీ కథాస్థలం అమెరికానే. రెండు కథలలోనూ సంఘర్షణాత్మక స్థితిని ఎదుర్కొన్నవాళ్లు భారతీయ మూలాలు ఉన్న స్త్రీ పురుషులే. ది కప్లెట్‌లో మాయ, వైష్ణవి ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులు. లైంగిక సహజీవనంలో ఆనందాన్ని అనుభవిస్తున్నవాళ్లు. అది నాలుగు గోడల బయట ప్రపంచానికి తెలియటం గురించిన వైష్ణవి సంకోచాలు ఇందులో ప్రధానం. లెస్బియన్‌ అని తాను బయటి ప్రపంచానికి తెలిస్తే తల్లిదండ్రులు ఏమనుకొంటారు? తమ్ముడేమనుకొంటాడు? స్నేహితుల మధ్య తన స్థితి ఏమిటి? వాళ్లు తనతో ఉంటారా? వదిలేస్తారా? అనే సందేహాల మధ్య వైష్ణవి తన శరీరం, మనసు కోరుకోనే లైంగిక అనుభవం, అనుభూతి తనకు తల్లిదండ్రులకు, సమాజానికి మధ్య సంబంధాలను శాసించే శక్తిగా మారటం గురించిన ఆందోళనకు గురి అయింది. మాయతో సంతోషాన్ని కలిగించే తన సంబంధం మిగుల్చుకోవలసినదా వదుల్చుకోవలసినదా అన్న ప్రశ్నల కూడలిలో వైష్ణవి చిత్తరువును చూపుతూ ముగుస్తుంది ఈ కథ. ఇది ముగిసినచోట మగవాడి కోణం నుండి మొదలయ్యే కథ సంచయనం.

సంచయనం కథలో కృష్ణ కూడా మరొక యువకుడిని ప్రేమించి పెళ్లాడే క్రమంలో వైష్ణవిలాగానే ఘర్షణ పడ్డాడు. తన నిర్ణయం తల్లిదండ్రులకు కష్టం కలిగిస్తుందని, వాళ్లను తనకు దూరం చేస్తుందనీ తెలిసినా తల్లిదండ్రులు ఎంచిన మార్గంలో జీవించటం అంటే తనను తాను వంచించుకొనటం అని కూడా తెలిసినవాడు కనుక అది ఇష్టం లేకనే నికోలస్‌ను పెళ్లి చేసుకొన్నాడు. దాని ఫలితం తండ్రి తనను వదిలెయ్యటం. మరణించేవరకు మాట్లాడకపోవటం. అది కట్టు తప్పినందుకు కొడుకుకు వేసిన శిక్ష అని తండ్రి అనుకోవచ్చు కానీ ఆ క్రమంలోనుండి తనను కూడా హింస పెట్టేదే. తండ్రి శవదహనం దగ్గర ప్రారంభించి మూడవరోజు జరిగే అస్థికల సేకరణ వరకు కొడుకు తండ్రికి జరిపే అపరకర్మ కథనంగా సాగుతూ సమాంతరంగా తండ్రికి మనసు విప్పి చెప్పుకొంటూ ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు సాగే కృష్ణ జ్ఞాపకాల దుఃఖ ప్రవాహాన్ని కూడా చూపిస్తుంది ఈ కథ.

తండ్రి దృష్టిలో కొడుకు యువకుడిని పెళ్లాడి జీవిస్తున్న జీవితం అసహజం, అనైతికం, బహిష్కరించవలసినది. అందువల్లనే సంబంధం తెంపుకొన్నాడు. తల్లి చనిపోయినా కొడుకును తలకొరివి పెట్టనీయను అని పంతం పట్టి నెగ్గించుకొన్నాడు. జబ్బుపడి ఆసుపత్రి పాలైనప్పుడు గత్యంతరం లేక కొడుకు సేవలు స్వీకరించాడు. కాస్త కోలు కున్నాక తన వెంట అమెరికా తీసుకువెళ్లిన కొడుకు ఇంట, కొడుకు కుటుంబంలో భాగమై ఉండటం ఇష్టం లేక ఇండియా పంపించమంటూ తిండి మాని ప్రాయోపవేశం చేసాడు. కొడుకు రాసుకున్న డైరీవల్ల నైతేనేమి, అందులో వ్రాసి పెట్టిన ఉత్తరంవల్ల నైతేనేమి కొడుకు ఆంతర్యం అర్ధమయ్యేసరికి, తన సంకుచిత దృష్టి గురించి పశ్చాత్తాపం కలిగేసరికి పంచుకోనే వ్యవధిలేక పోయింది. ఆయన ప్రాణమే పోయింది. జీవితంలో విలువైనవి ప్రేమ. సంబంధాలు. ఆ రెండింటి కోసం తపన కృష్ణది.

జాతి మత కుల లింగ పరిమితులకు అతీతంగా ప్రేమను జీవితాచరణగా అభ్యసిస్తున్న తాత్వికత లో భాగమే రష్యావాడైన నికోలస్‌తో ప్రేమ, సహజీవనం. తండ్రిని ప్రేమిస్తూనే ఉండటం. తండ్రితనాన్ని అనుభవించటానికి దత్తత తెచ్చుకొనటం. అది కూడా మత్తు మందులకు అలవాటుపడ్డ తల్లి కొడుకుకు మంచి కుటుంబం ఇయ్యాలన్న ఆదర్శంతో తెచ్చుకోవటం. ఆ కొడుక్కు తాత ప్రేమను హక్కుగా కోరటం. కుటుంబ సంబంధాలలో ఒక అనుస్యూతి కృష్ణ ఆకాంక్ష. అవి బ్రతికి ఉన్నప్పుడే సాధించుకొన వలసినవి. తరాలు, దేశకాలాలు మారేకొద్దీ, కొత్త సామాజిక సంబంధాల సంస్కృతి విస్తరించేకొద్దీ తరానికి తరానికి మధ్య ఘర్షణలు అనివార్యం అవుతాయి. ఆ ఘర్షణ నుండి మానవ సంబంధాలు ఉన్నతీకరించబడాలి కానీ ఆ వేడిలో అవి దహించుకు పోరాదు. ఆ రకంగా సంచయనం కథ జీవితాన్ని మొత్తంగా వెలిగింపచేసుకోవలసిన ప్రేమకు పరాయీకరించే ఇజాల గురించి, అహాల గురించి హెచ్చరిస్తుంది.

స్త్రీ పురుష స్నేహాల వ్యక్తిగత పరిధిలోకి తొంగి చూడాలనుకోనటం, నిఘా  సంస్థలుగా నైతిక తీర్పులు ప్రకటించే న్యాయస్థానాలుగా వ్యవహరించాలని అనుకోవటం ఆరోగ్య కరమైనది కాదని ఆ ముగ్గురూ కథలో చెప్పిన రచయిత్రి రైలుపెట్టెలో వున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు ఎవ్వరూ అవసరంలో ఉన్న మనిషి మాటకు చెవి పెట్టగల స్థితిలో లేకపోవటం వైపు వేలెత్తి చూపుతుంది టు డాలర్స్‌ ప్లీజ్‌ కథలో.

భార్యాభర్తల మధ్య అధీన అధికార సంబంధాలతో నిత్యహింసల మధ్య స్త్రీల రాజీ బ్రతుకుల విషాద చిత్రాలుగా కుటుంబాల మనుగడ ఉండటాన్ని స్లీపింగ్‌ పిల్‌, ఇట్స్‌ నాట్‌ ఓకే కథలలో చూపింది. నాట్‌ ఓకే కాకపోతే ఓకే అయ్యేట్లు దానిని మార్చుకోనైనా మార్చుకోవాలి, లాభం లేదనుకొంటే వదిలెయ్యనైనా వదిలెయ్యాలి. ఇట్స్‌ నాట్‌ ఓకే కథలో వైదేహి తనకు ఏ మాత్రం బాగాలేని, గౌరవం, ప్రేమలేని కుటుంబం బాగు చేసుకొనటానికి వీలులేనంతగా చెడిపోయింది కనుకనే వదిలెయ్యటానికి సిద్ధపడింది.

కుటుంబం అంటే పిల్లలు ఉంటారు. తమ ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పిల్లల ఇష్టా ఇష్టాలను, ప్రతిభ సామర్ధ్యాలను మలిచే క్రమంలో తల్లిదండ్రులు తెలియ కుండానే వాళ్లపై పెట్టే వత్తిడి, వాళ్ల ప్రవర్తన విధానాలను ప్రభావితం చేసే అమెరికా సాంస్కృతిక వాతావరణం గురించి తెలియక వత్తిడికి లోనై ఆందోళనపడే తీరు హోవ్‌ు రన్‌, టింకూ ఇన్‌ టెక్సాస్‌ కథలలో చిత్రించింది కల్పన. కల్పన వ్రాసిన ఈ కథలు కల్పన వ్రాయగల కథలను గురించి గొప్ప ఆశను ఇస్తాయి.

జీవితాన్ని ప్రేమతో ఫలవంతం చేసుకొనటానికి భావ బౌద్ధిక తలాలలో అవరోధంగా ఉండే అన్ని గోడలను పగలగొట్టటమే కార్యక్రమంగా ఇస్తున్న కల్పన కథల లోకంలోకి తలుపులు తెరుస్తూ… అభినందనలతో…

 

                                                                                                                                                                 కాత్యాయనీ విద్మహే

ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు

( తాజా గా విడుదలైన రచయిత్రి కల్పనారెంటాల “అయిదో గోడ” కథా సంపుటి కి రాసిన ముందు మాట )

 

పుస్తకం ప్రతులకు: Amazon.in: Buy Aido Goda (Fifth Wall) Book Online at Low Prices in India | Aido Goda (Fifth Wall) Reviews & Ratings

కాత్యాయనీ విద్మహే

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు