నేలకి చెవొగ్గి చెప్పిన దృశ్యకావ్యం కాంతార 

ఇక్కడ ఎన్ని వందల గ్రామాలు కాంతార కథను పోలి ఉంటాయి, కానీ,  ఇక్కడ అటువంటి సినిమాలు ఎందుకు రావు ?

భూమి చుట్టూ ముడిపడ్డ ఏ భావోద్వేగాల చరిత్ర అయినా బీభత్సంగా  ఉంటది. అది రాజేసిన చరిత్ర శకలాలు చూస్తే విస్మయ విభ్రమాలు  కలగడం సహజం. ప్రపంచంలో  ఏ మూల ఏ అలజడి జరిగినా అక్కడి మూలవాసుల రక్తంతో తడిసిన మట్టి ఉంటుంది. అందుకే భూమితో మాట్లాడేటప్పుడు  సమస్త అలజడులూ అక్కడ సాక్షాత్కారం అవుతాయి. ఏ మూల ఏ పెద్ద నాగరికత చూసినా ఆ నాగరిక సమాజపు వికాసానికి తమ రక్తాన్ని సాకబోసిన వీరుల త్యాగాలు కనుకనే  భూమికి మూలవాసులు మాత్రమే  కాదు, మానవ ఆవాసానికి చిరునామ. సమస్త నాగరికత మూలాలు ఆదివాసీ జీవన సంరంభం. ఎక్కడ మొదలు పెట్టాలి ధ్వంసం  అయిన హవాయి ద్వీపాలా? అమెరికా రెడ్ ఇండియన్? ఆస్ట్రేలియా అబొరిజినల్ ?కోయ ? గోండు? కోలామ్? వీళ్ళు కదా నియ్యతి గల మనుషులు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారో తిరగబడితే ఆ తీవ్రత కొలిచే సాధనాలే మనకు లేవు. నిన్న రిషబ్ శెట్టి కాంతార చూసాక ఒక మనిషి తిరగబడితే ఆధునిక ఆయుధ సంపత్తి అధికార మదం తల వంచాల్సిందే అనిపించింది.

ఇప్పుడు ఒక కథ చెబుతా..

మా ఖమ్మంలో అమ్మపాలెం అనే గ్రామంలో వందేళ్ళ కింద భూమి యజమానికీ కౌలు రైతుకీ మధ్య తగాదా వచ్చింది. కాల్లూరి జోగారావు, ఆలవాల శేషగిరి రావు  అనే భూస్వాములు  అహంకారంతో అధికార మదంతో రైతులను ఇబ్బంది పెట్టి అక్కడి రైతు కూలీలకు ఎంతో ఆస్తి నష్టం కలిగేలా చేసారు. మితిమీరిన కౌలు ఇతర శిస్తు వసూలు చేసి సరిగా కట్టనివాల్లని ఏళ్ళ తరబడి కోర్టు చుట్టూ తిప్పిన లిటిగెంటు. ఆ గ్రామ  రైతుల మీద దాదాపు డెబ్బై ఎనభై కేసులు పెట్టారు. ఇరవై ఏళ్ళపాటు సాగిన ఈ జగడం చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత సంపాదించుకోలేదు కారణం కమ్యూనిష్టులకు ఎరక.  జోగారావు తనకున్న కుల ఆర్ధిక వెసులుబాటుతో కిందా పైనా ఉన్న కోర్ట్ లను మేనేజ్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడు. భూమి తప్ప వేరే ఆధారం లేని  రైతులు తాము ఓడిపోయాము అనీ భూమి హద్దులు చూపిస్తే సాగుచేసుకుని సక్రమంగా శిస్తు చెల్లిస్తాము అని ప్రాధేయపడ్డారు. విజయగర్వంతో గుఱ్ఱంమీద స్వారీ చేస్తూ భూమి అంతా కలియ దిరుగుతూ మీ లాంటి అలగాజనాలు జీవితాంతం నా కాళ్ళ కిందనే ఉండాలి అని విర్రవీగుతూ భూమి ఇవ్వను అని గాండ్రించాడు. కొందరు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. గత్యంతరం లేని మరి కొందరు రైతులు తమ దగ్గర ఉన్న సంప్రదాయ ఆయుధాల తోనే రెండు వైపులా చేరి తిరగబడి  అతన్ని ముక్కలు ముక్కలు గా నరికేశారు. అంటే చంపి గద్దలకు వేసారు అనుకోవచ్చు. ఈ హత్య నేటికి తొంబై ఏళ్ళ కింద జరిగింది.  ఈ కేసులో యావజ్జీవ శిక్షపడిన రైతులు తెలంగాణ పోరాట కాలం లో జైలులో ఉన్న నల్గొండ నాయకులు ఒకే జైలు లో ఉండడం మూలంగా ఇది నా దృష్టికి వచ్చింది. ఆంధ్ర మహాసభ నాయకుడు ఒకడు ఆయనను విద్యావంతుడు జమీందారు, ప్రకాశం పంతులు నడిపిన స్వరాజ్య పత్రికకు డబ్బులు పంపేవాడు ఆంధ్ర మహాసభ నాయకులకు ధన సహాయం చేసాడు అని గొప్పగా రాసుకున్నాడు అది వేరేకథ.

ఇప్పుడు ఎన్నికలు జరుగతున్న మునుగోడు గ్రామంలో  ఎనిమిది దశాబ్దాల కింద రామిరెడ్డి అనే దేశముఖ్ పెద్ద ఆస్తిపరుడు, పోలీసుపటేలు ఉండేవాడు. తాలూక్దారులు,తహశీల్దారు,అబ్కారీ వారికి లంచాలు ఇచ్చి ఊరంతా కయ్యాలు పెడుతూ ఆస్తి తగాదాలు అక్రమ కేసులతో ఊరంతటికీ కంటగింపుగా మారాడు. ఎదురుతిరిగిన వాళ్ళను తుపాకీతో బెదిరించి కాల్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. విసిగి వేసారిన గ్రామస్తులు తిరుగుబాటు చేసినా రామిరెడ్డి ఆగడాలకు శాశ్వత ముగింపు కోసం ఒక ఆసరా కోసం ఎదురుచూస్తున్న పేద రైతులకు రామిరెడ్డి  తన కచ్చడం బండిలో అధికారులకు ఇవ్వడానికి పచ్చడి కుండలు నెయ్యి కుండలు తీసుకొని ఊరినుండి నల్గొండకు పోతున్న దేశముఖ్ రామిరెడ్డిని దోమలపల్లి అనే గ్రామ శివారులో అడ్డగించి కొట్టి చంపారు. కసితీరని గ్రామస్తులు ఆయన కచ్చడం బండిలో ఉన్న నెయ్యి పోసి కాల్చి బూడిద చేసారు. ఇలా తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలు నమోదు చేశా. ఇలాంటివి పదుల సంఖ్యలో జాగీర్దారులు ప్రజల ఆగ్రహపు మంటల్లో కాలిపోయారు. ఇందులో ఒక్క ముస్లిం జాగీర్దారు లేడు అనేది దాచేస్తే దాగని సత్యం. పరమ పంకిలమైన ఈ ప్రజా చరిత్రను పరమ పునీతులు అయిన సుందరయ్య ఆయన వారసులూ చెప్పుకోలేరు. ఇవ్వాళ రామిరెడ్డి వారసులే మునుగోడు లో ఎన్నికల బరిలో ఉన్నారు. వారి పక్కన ఎర్రజెండాలు ఉన్నాయి. రామిరెడ్డి, జోగారావు లను ఎర్ర జెండాలే చైతన్య పరిచాయి అంటే నేను ఊరుకోను. ఎర్ర జెండా ఉనికి కూడా తెలియని ప్రజాందోళనలు అవి.

మట్టికి పోరాట రూపం ఇస్తే అది కాంతార. అందులో పచ్చని అడివీ, పారే సెలయేరూ, పారవశ్యంతో పాడుకున్నపదాల పల్లవులూ ఉన్నాయి. అందుకే భూమి ఇరుసుగా సాగిన ప్రతి పోరాట చరిత్ర నెత్తుటి చిత్తడి సజీవంగా సాగుతూనే ఉంది. ఆ నెత్తుటి గాయాలను దృశ్యమానం చేస్తే  ‘కాంతార’ సినిమా. ఏముంది ఇందులో  కాంతార అంటే మంత్ర అడివి. ప్రకృతికీ మనిషికీ మధ్య జరుగుతున్న అంతః సంఘర్షణ రూపం ఈ మాంత్రిక అడవి. ప్రకృతి మీద సాధికారత కోసం మనిషి చేసే ప్రతి అడుగూ గర్షణతో ముడిపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే  ఆధునిక విస్వాసానికీ పురాజ్ఞాపకాలకీ మధ్య జరుగుతున్న ఆధిపత్య యుద్ధం కాంతార. అధునికునికీ  మైదాన వాసీకీ మధ్య తలెత్తిన సంక్షోభం ఈ సినిమా.

అనగనగా కోస్తా కర్నాటక లో పాలన సాగిస్తున్న ఉన్న ఒక రాజు మానసిక  సాంత్వన కోసం దేశ దేశ దేశాలు తిరుగుతూ ఒక అడవిలో కనబడ్డ పురాతన రాయికి సాగిలపడతాడు. ఒక మైదానవాసి రాజు అక్కడ నివాసం ఏర్పరుచుకున్న దళిత  సమాజాలలోకి తొలిసారి జొరడ్డాడు. ఆ అడివీ, అక్కడి వనరులూ తరాలుగా తమవిగా భావిస్తున్న దళితుల ఉనికికీ అస్తిత్వానికీ పెనుముప్పు పొంచి ఉన్న కాల లో   అదే తన రాజ్యం అనీ ఆ అడవే తన సొతం అనీ ఆ ప్రజల తోనే కలిసి బ్రతికిన రాజు వారసులకు తమ ముత్తాత దానం చేసిన వందలాది ఎకరాల మీద కన్ను పడ్డది. అలా ఆ భూస్వామి తన కుటుంబ ప్రవర, పరంపరను యశస్సు నూ ఐశ్వర్యాన్నీ ప్రకటించుకున్న కాలంలో ఆ జాతితో కలిసి నట్టు నటించి ఆ సమాజాన్ని అక్కడి నుండి తరిమేసి భూమిని సొంతం చేసుకునే కుట్ర చుట్టూ అల్లుకున్న కథ ఇది.

భూతారాధన చేసే ఆ గ్రామ పూజారి తరాలుగా యక్షగానాన్ని ఆవాహన చేసుకున్నవాడు. మన తెలంగాణలో ‘రంగం’ లాంటిదే ఈ భూతారాధన. ఆహార్యం భిన్నంగా ఉంటుంది. చిత్ర విచిత్రమైన వేషధారణ. చిక్కని రంగుల్లో పెట్టుకున్న అలంకరణ. ఉడిపి మంగుళూరు పశ్చిమ కనుముల్లో ‘భూతకాళ’ ఒక ఆచారం. భవిష్యత్తు గురించి పూనకం తో ఆ కళాకారుడు చెప్పే ప్రవచనమే  భూతకళ. అది ఒక మార్మిక ప్రక్రియ. తరాలుగా ఒక కుటుంబం ఆ పరంపరను కొనసాగిస్తుంది. కార్ణాటక లో ఉడిపి, మంగుళూరు ఇంకా పశ్చిమ కనుముల్లో కొన్ని ప్రాంతాల్లో  దళితుల్లో ఉన్న నలికే, పంబాడ, పారవ అనే కులాలు తమ కుల ఆచారాన్ని, స్థల పురాణాన్ని యక్షగాన రూపం లో చెప్పే కళాకారులు. ఈ కులాలకి నెత్తిన పందిని పోలిన కిరీటం ధరించి వళ్ళంతా పసుపు కుంకుమ ఇంకా ఇతర నామాలు ధరించి ఒక విలక్షణమైన కేకలు పెడుతూ తాండవం ఆడే ఆ కళాకారుల కథ ఈ సినిమా. ఒక రకమైన ఉన్మాధపు అరుపుతో అతను వేసే కేకలు నిన్ను వెంటాడతాయి. ఆ కేకలో ఉన్న హెచ్చరిక పట్ల అప్రమత్తమైన తమ జాతి జనులు సాగిల పడి చేసే క్రతువే భూత కళ. ఇది మూడు తరాల రాజ వంశీకులకూ అక్కడి భూతారాధన చేస్తున్న సాంప్రదాయ దళితులకూ  మధ్య నడిచిన ఘర్షణ. ముఖ్యంగా సత్యమంగళ అడువుల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్న స్థానిక ప్రజలకీ ఫారెస్టు అధికారులకూ మధ్య నలిగిన ఒక గ్రామ కథ. అన్నిటికన్నా అడవి ఆదివాసీ సమాజంతో పెనవేసుకున్న కొన్ని కట్టుబాట్లకీ  మైదాన ప్రాంతం అవలంభించుకున్న ఆధునిక చట్టాలకీ అలవాట్లకీ మధ్య నడిచిన కథనం అది. ‘మీ సోకులకీ ఆచారాలకీ అడవిలో ఉన్న ప్రాణులూ పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి’ తెలుసా అనే అటవీ అధికారికీ. ‘పక్షులూ జంతువులూ వచ్చి మీకేమయినా పిర్యాదు చేశాయా అనే అమాయకపు దళితునికీ  మధ్య జరిగే ఆధిపత్య అస్తిత్వ యుద్ధం.

మన రంగం ఆడటం లాంటి ‘బూతకోల’,  యక్షగానం, కర్నాటకకే  ప్రత్యేకమైన జల్లికట్టు లాంటి ఎద్దు పందేలు. విలక్షణమైన మంత్రం భాష, తాంత్రిక క్రతువులతో ముడిపడ్డ విలక్షణమైన ఆచారాల కలబోత ఈ సినిమా. ఈ సినిమాకు ప్రాణం అందులో ఉన్న పాత్రలు మనిషికి సాగిల పడే మనస్తత్వాలు. అవి హేతువుకి అందనివి. దర్శకుడు తాను చిన్నప్పటి నుండి ఆ నమ్మకాలు క్రతువులు చూస్తూ పెరిగాడు. కనుకనే బలమైన కథను అల్లుకోగలిగాడు. రెండువందలఏళ్ళ మధ్య కాలంలో మూడు తరాల తుళు ప్రజల భూస్వామ్య, శ్రామిక కులాల మధ్య ఘర్షణ, సంబంధాలు, మారిన సాంస్కృతిక భూ సంబంధాల మధ్య వచ్చిన వైరుధ్యాలు ఇవన్నీ కాంతార లో కలబోసుకుని ఉంటాయి.

మొదటి తరంలో భూస్వామి దళితులకీ  భూమి ఒక ప్రాకృతికమైన ఒనరు. . కూలి యజమాని అనే సంభాషణ తెలియని కాలం అది. వాళ్లకు భూమిహక్కు, అటవీ చట్టాలు అవగాహన లోకి రాని కాలం. అందుకే భూమి కోసం ఆరాట పడ్డ కొడుకుతో తండ్రి ‘ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవునికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందిరా’ అంటాడు. వాడి కొడుకు దేవుడినీ, మాటనీ నమ్మేవాడు కాదు. భూమి అంటే కాసులు కురిపించే కైలాస పురి. రెండో తరంలో పుట్టిన దొర కొడుకు ఆధునికత తెలిసిన వాడు. భూ సంబంధాలు గుట్టు తెలిసినవాడు. ఇంకో వైపు అక్కడే పుట్టి పెరిగిన రెండో తరం తన తండ్రి కొనసాగించిన భూతారాధన నిరాకరించి తండ్రి పరంపరను తమ్మునికీ వదిలేసిన దొరకు నమ్మిన బంటుగా మారతాడు. అక్కడి ఆచారాలకీ ఆ ఆచారాలకి సహకరిస్తున్న స్థానిక దొరకీ భూమి సంబంధాలకు కేంద్రం ‘భూతరాధన’.

ఆ క్రతువు ఆపితే భూమి తన సొంతం అవుతుంది అని విశ్వాసాన్ని దెబ్బ తీయాలి అని ఒక్కరినీ మాయం చేయడమే కథ. ఇందులో రాజకీయం, అటవీ చట్టాలు, రిజర్వ్ అటవీ ప్రాంతం పోడు,చొరబాటు అన్నీ ఉంటాయి. ఎక్కడా తన లెక్కను తప్పనీయలేదు. నాగరికులుగా చెప్పబడుతున్న ఆధునికులు క్రూరంగా మేక వన్నె పులుల మాదిరిగా ఉంటె. మేకలు సాదుజీవులు లా బ్రతికే ఆదివాసీ తన పరంపర కోసం, పుట్టిన నేల కోసం,కనుమరుగు అవుతున్న తన పూర్వీకుల కలల కోసం ఒక పూనకం లా శత్రువుని తుత్తినియలు చేయడం తెర మీద మాత్రమె చూడాలి. మట్టిని వళ్ళంతా పూసుకుని దాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్న భూస్వామి తన నరకడం తోనే కాంతార ముగుస్తుంది.  ఆ నటన, అవి దృశ్యమానం చేసిన సాంకేతిక నైపుణ్యం, ముఖ్యంగా సౌండ్, కలర్ పట్ల దర్శకుడు చూపిన శ్రద్ద  నాకయితే అక్షరాలు సరిపోవడం లేదు.

కన్నడ సినిమాలలో   అక్కడి ప్రజల విస్తారమైన సాంస్కృతిక వారసత్వం వుంది. అక్కడి సాహిత్యం కళారూపాలు, నాటకం నిత్యం సజీవంగా ఉంచే బుద్ధిజీవులు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక బసవడు ప్రత్యామ్నాయ రాజకీయాలు కలగన్నాడు, వచన కావ్యాలు సజీవ ధార ప్రజల నోళ్ళలో స్థిరపడి ఉంది. అక్కడ ఒక బూసా ఉద్యమం చూసాము. మరొక హిజాబ్ ఆంక్షలకు ఎదురుతిరిగిన అమ్మాయిల చైతన్యం అక్కడే చూసాము. హేతువుని నిలబెట్టడం కోసం ప్రాణాలు సాకబోసిన  కల్బుర్గి, పన్సారే, దబోల్కర్, గౌరీ లాంటి త్యాగాలు, మతం పేరా కులం పేర జరిగిన ఎన్నో పోరాటాలు అక్కడ బ్రతికాయి. అన్నిటికన్నా సజీవ కళలకు నిలయం ఆ ప్రాంతం. ఒక రకంగా న్యూ  కాంతార ఒక మోడరన్ ఎపిక్. భూమి పొరల్లోకి పోతే, భూమి మీద సాగిల పడి చెవి ఒగ్గేసి వింటే ఎంత రక్తపాతం పారి ఉంటది.  ఇక్కడ ఎన్ని వందల గ్రామాలు కాంతార కథను పోలి ఉంటాయి, కానీ,  ఇక్కడ అటువంటి సినిమాలు ఎందుకు రావు ?

శిధిల కంకాళాల మీద మోలిసిన విషపు మొక్కలతో దుర్గంధ మైనది తెలుగు తెర. డాబుల బాబుల దర్పణాల మీద మొలిచిన కుక్కమూతి పిందెలు ఇక్కడి అవతారాలు. ఇక్కడ మట్టి గురించి మాట్లాడితే ఆధునిక అమరావతి, కోకా పేటలలో తెగ్గోయబడ్డ పీకలు కనిపిస్తాయి తప్ప మట్టికోసం తపించిన కాంతార లు కనబడవు. అందుకే బలమైన సాంస్కృతిక పునాది మీద నిలబడ్డ ఏ కళారూపం అయినా కాంతారలా వెండితెర మీద మిరుమిట్లు గొలుపుతూనే ఉంటుంది.

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అంతా బానే ఉంది.. మధ్యలో
    సుందరయ్య (పుచ్చలపల్లి) ఎందుకొచ్చాడో అర్థం కాలేదు..
    ఇక తెలుగు సినిమా రంగం కృత్రిమమైనది
    హీరోలను అభిమానించే పిచ్చి తమ్ముళ్ళతో నిండిపోయింది..
    ఇక్కడ కళకు అర్థం లేదు..
    కమర్షియల్ ఫార్మాట్ తో ఏమన్నా సాధిస్తున్నారా అంటే అది లేదు..
    అందుకే అలా నాసిరకం గాను, చౌకబారుగానూ ఉంటాయి

    • సెలక్టివే అమ్నీషియా అనే జబ్బు ప్రతిఒక్కరికీ ఉంటది. తెలంగాణ సాయుధపోరాట కాలం లో కొన్ని సంఘటనలు అందునా తమ పార్టీ చేసిన చేబట్టిన ఉద్దేశ్య పూర్వక కార్యక్రమాలనే రాసుకుని ప్రజలు స్వచ్చందంగా చేసిన పోరాటాలను విస్మరించడం జరిగింది. ఒక్క దొడ్డి కొమరయ్య నో చాకలి ఐలమ్మ సంఘటన మాత్రమె కాకుండా ఇలా ప్రజలు స్వచ్చందంగా అమ్మపాలెం జోగారావు నీ మునుగోడు రామిరెడ్డి నీ హతమార్చి పాక్షికంగా అయినా తమను తాము విముక్తి చేసుకున్నారు అలా పదుల సంఖ్యలో ఉన్నాయి కొందరు కమ్యూనిస్ట్ లు ఇలా విష్మరించడం వెనక కుట్ర ఉంది అని నా అవగాహన అందుకే విమర్శకు నాగిరెడ్డి నో సుందరయ్య నో అతీతులు కారు. సుందరయ్య ఉద్దేశ్య పూర్వకంగా స్త్రీల త్యాగాలను మరిచాడు అనే కథా స్త్రీవాదులు మనకి తెలియని మన చరిత్ర రాసుకుంది. అందుకే స్థల కాలాల కు అనుగుణంగా ఇలాంటి ప్రశ్నలు రావాలి వాటిని ఆహ్వానించాలి అని అభిప్రాయపడతా…

    • సెలక్టివ్ అమ్నీషియా అనే జబ్బు ప్రతిఒక్కరికీ ఉంటది. తెలంగాణ సాయుధపోరాట కాలం లో కొన్ని సంఘటనలు ఉదేశ్య విష్మరించ బడినాయి కొన్ని సమూహాలు తమ పార్టీ చేసిన చేబట్టిన కార్యక్రమాలనే రాసుకుని ప్రజలు స్వచ్చందంగా చేసిన పోరాటాలను పట్టించుకోలేదు. ఒక్క దొడ్డి కొమరయ్య నో చాకలి ఐలమ్మ సంఘటన మాత్రమె కాకుండా ఇలా ప్రజలు స్వచ్చందంగా అమ్మపాలెం జోగారావు నీ, మునుగోడు రామిరెడ్డి నీ హతమార్చి పాక్షికంగా అయినా తమను తాము విముక్తి చేసుకున్నారు .అలా పదుల సంఖ్యలో ఉన్నాయి. కొందరు కమ్యూనిస్ట్ లు ఇలా మర్చిపోవడం వెనక కుట్ర ఉంది అని నా అవగాహన . అందుకే విమర్శకు నాగిరెడ్డి నో సుందరయ్య నో అతీతులు కారు. సుందరయ్య ఉద్దేశ్య పూర్వకంగా స్త్రీల త్యాగాలను మరిచాడు అనే కథా స్త్రీవాదులు ‘మనకి తెలియని మన చరిత్ర’ రాసుకుంది. అందుకే స్థల కాలాల కు అనుగుణంగా ఇలాంటి ప్రశ్నలు రావాలి వాటిని ఆహ్వానించాలి అని అభిప్రాయపడతా…

  • నిజానికి ప్రజల చరిత్ర ఎక్కడా, ఒక చరిత్రగా ఒప్పబడిందా? ఎర్ర జెండా వాళ్ళు అయినా ఎవరు అయినా తమకూ, తమ రాజకీయాలకు (సిద్ధాంత వాదాలు అయినా) స్వప్రయోజనాలే కోరతారు. అందుకే అందుకే రావిరెడ్డిన సంపిన ప్రజల గురించి అమ్మపాలెం రైతులకి ఏ చరిత్రా లేకుండా పోయింది. ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఆధిపత్యపు అధికారిక చరిత్రయే కదా, ఈ భూమి చరిత్రగా నిలుస్తోంది. ఎందరు మనుషులు మట్టిలో కరిగిపోయారో ఎవరు లెక్కలు చెప్పగలరు. ఆధునిక, నాగరిక ముసుగు ఏసుకున్న మానవుడు ఆ మనుషుల జీవనం ముందు ఉట్టి చవట దద్దమ్మ.
    👏👏

      • తెలుగు తెరకు
        గంజాయి గుళికలు
        గుత్తులుగా కాస్తున్నాయి,
        ఎన్ని మింగినా
        మరిన్ని కావాలంటూ
        బుర్రలు జోగుతున్నాయి.
        అడవులు లేవు
        బిడ్డలు ఏడికి బోతరు
        నువ్వు జెప్పవే అన్నా.

  • కాంతార రివ్యూ చాలా చాలా బాగుంది. థాంక్యూ సీతారాములు.
    మనచుట్టూ అడవుల, ఆదివాసుల, దళితుల జీవితాలతో ముడిపడ్డ మార్మిక కథలన్నీ ఖచితంగా ఇట్లా భూమి గురించో, అణచివేతకు నిరసనో అయివుంతాయి. మనమే చరిత్రను విడదీసి, విప్పిచెప్పుకోవాలి అంతే. కంతార సినిమా అద్భుతం. మా అమ్మాయి మణిపాల్ లో ఇంజనీరింగ్ చదివేప్పుడు నేను అక్కడ తిరిగాను. యక్షగానం ఆడే కుటుంబాలు కొన్ని చూశాను. ఆ కళా రూపం తో పాటు ఇంకాకొన్ని కళా రూపాలు ఇంకా బతికి వున్నాయి అక్కడ..
    సినిమాలో ఒకవ్యక్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు కనిపిస్తుంది అని కొందరన్నారు. కానీ గ్రామీణ సమాజాల్లో చరిత్ర అట్లాగే రికార్డు అవుతుంది. దాన్ని ప్రతీకాత్మకంగా మాత్రమే అర్థం చేసుకోవాలి.
    మనవాళ్ళు కొందరు రివ్యూల్లో ‘ ఓం ‘ అని పలికించాడు అని రాసారు. కానీ సినిమాలో నాకు అలా అనిపించలేదు. ఓ… అన్న ఆదిమ అరుపుగానే తోచింది. పెద్దగా మలుపులు లేని సినిమా కానీ శిల్పం పక్కాగా మలుచుకున్నాడు.
    ఆ ప్రాంతం లో యీ భుతారాధన అనివార్యంగా అగ్రవర్ణాల సంస్కృతి లోకీ వచ్చింది . మధ్వాచార్యుల శిష్యుడు ‘వాదిరాజరు ‘ గా పిలుచుకునే మధ్వగురువు యీ ప్రాంతం వాడే. అక్కడ “సొందే ” లో ఆయన (సమాధి) బృందావనం వుంది. అక్కడ జరిగే పూజలో భూతరాజరు పూజ కూడా కూడా అనివార్యంగా వుంది. ఒక్క జంతుబలి మాత్రం వుండదు. దానికి ప్రతీకగా వేరే ఏదో చేస్తారు. నేను చెప్పేది ఏమంటే భూతారాధన ఆక్కడి సంస్కృతి లో అనివార్య భాగం.
    మనవాళ్ళకు కూడా తీయాలన్న మనసు ఉండాలిగానీ, ఎన్ని కథలు లేవు ఎన్ని వనరులు లేవు మన దగ్గర. ముందు ఆ సాహిత్య ఆసక్తి వుండాలికదా మన సినిమా వాళ్లకి. అది వుందనుకోవడం అత్యాశే. పుస్తకాల అట్టల ఫోటోలు చూపి, పేర్లు చెప్పి తాము విపరీత చదువరులుగా భ్రమింపజేసే వాళ్లు యెక్కువ. మన ప్రాచీన కళల మూలాలను వ్యాపార సినిమా యేపుడో మింగేసింది. అది లంపెన్ కాపిటల్ ముందు సాగిలపదింది. తొలినాళ్ళ భూస్వామ్య బ్రాహ్మణ, రెడ్డి యాజమాన్యం స్థానంలో , ఆధునిక కమ్మ, కాపు కుటుంబాల అజమాయిషీ వచ్చింది. నడమంత్రపు Surplus capital కు పుట్టిన కుక్క మూతి పిందెలు మన సినిమాలు. కరోనాలో OTT కొట్టిన దెబ్బకు కూడా యింకా బుద్ది రాలేదు.
    కాలం మారింది ‘ బాసులూ. ‘ మీరు తీసేదే చరిత్ర కాదు ఇంక. కొత్త కథలు కొత్త చరిత్ర వస్తున్నాయి. కొత్తగా పీడిత కులాలు సినిమాలోనూ వాటా కోరుతున్నాయి. ఇవ్వకపోతే కొట్టి గుంజుకుంటాయి కూడా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు