రేపటి కోసం సిద్ధపడదాం!

సుహృల్లేఖ – 6

“ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం”

అని శ్రీశ్రీ అన్నమాట చదివిన నా చిన్ననాటినుంచీ నన్నీ వాక్యం వెంటాడుతూనే ఉంది. ప్రపంచాన్ని పద్మవ్యూహం అన్నాడు మహాకవి. శ్రీశ్రీ ఉద్దేశమిక్కడ ఏదైతేనేంగానీ, కవితాప్రపంచం పద్మవ్యూహమే.

ఇందులోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన నైపుణ్యమేదో ఉండాలి. దీన్నుంచి నిష్క్రమించడమంటే కవి తన ఆత్మావిష్కారాన్ని పూర్తిచేసుకుని అంతరంగంలోకి మరలడమే. పాఠకప్రపంచం నిర్దయాత్మకమైనది. కవినుంచి ఎప్పుడూ కొత్తదనాన్నీ, వింతనూ ఆశిస్తుంది.

కవి తన కవిత్వ ప్రయాణాన్ని నిష్కపటంగా కొనసాగిస్తేనే తనదంటూ ఒక పాఠకప్రపంచాన్ని సృష్టించుకోగలడు. సహృదయులయిన పాఠకుల మేలైన అభిప్రాయాన్ని మించిన నికషోపలం కవికి మరెక్కడా దొరకదు. సామాజిక, రాజకీయ విషయనిబద్ధులయిన రచయితలకు ఇది ఎక్కువ వర్తిస్తుంది. వీరికి నిరంతరం “పాఠకులను educate చెయ్యడం (!)” మినహా ఇంకో రసలక్ష్యం లేకపోవడంవలన అందరి పాఠకుల feedback కు విలువనివ్వకుండా తన వచనాన్ని ప్రజలనే సామూహిక సర్వనామంతో అతికించి అహంభావాన్ని చాటుకునే మూలమూర్తులై వీరు చతికిలబడతారు. మహాప్రస్థానం రాసిన శ్రీశ్రీ మరోప్రస్థానంవంటి తేలిపోయే రాజకీయ రచననూ చేసి విమర్శల పాలయ్యాడని మనకు తెలుసు. ఇందుచేతనే కవికి ఆత్మశోధన అవసరమని పదేపదే హెచ్చరించేది.

సమాజం అంత ఆదర్శవంతంగా ఎప్పుడూ లేదనేది వాస్తవమే.

మంచి మార్పు కేవలం రచనల ద్వారానే రాదు, అది అనేక దారుల్లో వస్తుంది. ప్రవచనం మినహా మిగతా దారుల్ని గుర్తించని కవుల్ని నేను గుర్తించను. నా వీణకు ఒకటే తీగె అన్నవాడు తన పరిధిని తానే కుదించుకున్నవాడౌతాడు. వెనక్కి తిరిగి చూస్తే, మనకు మిగిలి ఉన్న కొద్దిమంది కవులూ నిజాయితీగా కవిత్వానికి నిబద్ధులయినవారే. “అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి” అని తిలక్ కవిత్వాన్ని నిర్వచించాడు.

ఇది అంతర్జాలయుగం. చదివేవారికి text చదివే ఓపికా, టైమూ రాన్రాను తగ్గిపోతున్న కాలం. బొమ్మలు, memes నడుస్తున్న కాలమిది. ఒక రచనను ఆద్యంతమూ చదివేవారు ఉన్నా, అది పెద్ద సంఖ్య కాదు. రచయితలు మేల్కొని కొత్త ప్రయోగాలు చెయ్యాల్సిన అవసరం ఉందిపుడు, ఆ అవకాశాలూ ఉన్నాయి. ఈ ప్రయోగాలు ఎలా ఉండాలన్నది ఆయా ప్రయోగకర్తలకే వదిలిపెడుతున్నాను.

ముందు ముందు కవిత్వంలో పదాల శాతం తగ్గి non text శాతం పెరిగితే, నేను ఆశ్చర్యపోను. దీనికి మూలం “తృవ్వట బాబా” పద్యం కథలోనే ఉంది. ఆ ధోరణిని స్వాగతిస్తాను కూడా, అది కవిత్వమైనంతవరకూ.

ప్రస్తుతానికి మాత్రం మనం ప్రధానంగా అస్తిత్వ కవిత్వాన్ని చదువుతూ ఓ నలుగురు “అనిబద్ధ” కవులనూ చదివి కాలం గడపాల్సిందే. చూద్దాం. Tomorrow is yet another day! అనడం ఆశావహమైన ప్రతీక్షణ. రేపటి కోసం సిద్ధపడదాం.

ఈ సుహృల్లేఖలో ఇదే ఆఖరి భాగం. అందరికీ ధన్యవాదాలు.

*

వాసు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు