రెడీమేడ్ పరిష్కారాలు లేవు!

వికి కవే దిక్కు. ఈ సూనృతం కవులకు తెలుసు. అంటే, వచనరచనలు మాత్రమే ఎంత గొప్పవి రాసినవారైనా కవిత్వం దగ్గరికొచ్చేసరికి అంత గొప్ప రత్నపరీక్షకులు కాలేరు. ఇది నా స్వానుభవం నాకు నేర్పిన పాఠం. ఈ విషయం ఎందుకిక్కడ ప్రత్యేకంగా ఉటంకిస్తున్నానంటే, విమర్శకులు, పండితులు, పేరున్న రచయితలూ అంతా మంచి కవిత్వాన్ని మెచ్చుకున్నా, ప్రతి కవితనూ సరిగా బేరీజు వెయ్యగలరని నేను అనుకోను. కవికి సాటి కవే దిక్కు. సాటి కవి చెప్పిన అభిప్రాయమే కవికి శిరోధార్యం. సాటి కవి మెచ్చుకోలే యోగ్యతాపత్రం.

ఎన్నెన్నోసార్లు నాకు గొప్ప రచయితలవల్ల ఆశాభంగం ఎదురయ్యింది. నేను నగ్నముని దిగంబరయుగపు కవితలు చదివి కన్నీళ్ళు పెట్టుకున్న విషయం చెబితే, “అదంతా బూతు” అని కొట్టిపారేసేవారు నాకు తెలుసు. నేను Ted Hughes ని ఇష్టంగా చదివిన రోజుల్లో, చాలామటుకు నీరస కవిత్వమే రాసిన W.H. Auden ని మన వారు తెగ పొగిడేవారు. కె.శివారెడ్డిని అనుకరిస్తూ రాసిన లెక్కలేనంతమంది కవుల కవిత్వం ఎలా నిలదొక్కుకుందో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం.

నా తరంలో అద్భుతమయిన కవిత్వం రాసిన ఒకరిద్దరి పేర్లు నేను ప్రస్తావించినప్పుడు మన పండితుల నుంచి నాకు ఎదురయిందల్లా ఆశాభంగమే. అదే ప్రస్తావన ఇంకో కవితో చేసినప్పుడు ఆ కవి ప్రతిస్పందన మాత్రం నాకు కవిత్వం మీద మమకారం పెరిగేలా చేసింది, నాపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచింది. ఆధునిక వచనపద్యాల్లో లయ ఉండదని శ్రీశ్రీయుగపు ఒక మహారచయిత వాపోయాడు. మొత్తానికి ఎంత గొప్ప రచయితలైనా కవిత్వానికొచ్చేసరికి నా దృష్టిలో నవ్వులపాలైపోయారు. రా.వి.శాస్త్రి మాత్రం కవిత్వం జోలికి రాకుండా, తనకు కవిత్వం అట్టే నప్పదని తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. ఆధునిక కవితలో లయ శబ్దాన్ని అంటిపెట్టుకొని గేయల్లో మాదిరి ఉండదు, మనసులో ఏదో భావలయను కలిగిస్తుంది. ఈ అభిరుచి లోపించిన వ్యక్తికి ఎన్ని చెప్పీ, ఎన్ని కవితలు చదివించీ ప్రయోజనంలేదు. అంతా బూడిదలో పన్నీరు. దీనికి మినహాయింపులు లేవా అంటే ఉన్నాయి. ఒకటో రెండో! వారూ తమలోని చదువరులను జాగ్రత్తగా బతికించుకున్నారు కనుక కవిత్వాన్ని బేరీజు వేయగలిగే శక్తియుక్తులను కోల్పోలేదు.

ఇలాటి అనుభవాలు దశాబ్దాలుగా ఎదురయిన నాకు కవికి కవే దిక్కు అని తేలిపోవడంలో ఆశ్చర్యం లేదు. నా మటుకు నేను నా సాటి కవి అభిప్రాయానికిచ్చే విలువ వేరే వ్యక్తి ఎంత గొప్ప రచయితయినా తనకు ఇవ్వను.

ఈ పరంపరలోని పూర్వపు భాగాల్లో చాలా విషయాలు లేవనెత్తాను. కొంతమంది పండితులు నన్ను వాటికి పరిష్కారమార్గమేమిటి అని అడిగారు. నా దగ్గర అన్ని సమస్యలకూ రెడీమేడ్ పరిష్కారాలు లేవు. ప్రతిభావంతులైన యువకవులూ కవయిత్రులూ కవిత్వానికే ముందు పెద్దపీట వేయాలని సందేశమిస్తాను. తమ తమ రచనల్లో ఇటీవల పెచ్చురిల్లుతున్న స్పెల్లింగ్ తప్పులూ వ్యాకరణ దోషాలూ లేకుండా చూసుకోమని మనవి చేస్తాను. లబ్ధప్రతిష్ఠులయినా సరే, నిజాయితీ లేని కవితను రాస్తే నిర్మొహమాటంగా అది కవిత కాదనీ ఏతత్సారాన్ని వ్యాసంలోనో ఇంకో వచనప్రక్రియలోనో చెప్పడం వీలౌతుందని తెలియజేయమంటాను. ఇక ఛందోకవిత్వాన్నీ ప్రధానస్రవంతి వచనకవితనూ ఒకే వేదికమీదకు తేవడం కష్టసాధ్యమని నాకూ తెలుసు. నలుగురు పెద్దలు కల్పించుకొని ప్రయోగాలు చేస్తేతప్ప మనకు పరిష్కారం గ్రాహ్యం కాదు. ప్రస్తుతానికి ఛందోకవిత్వాన్ని తక్కువ చేస్తూ (దాని తరం ముగిసిందనో అందులో ఆధునిక కంటెంట్ ఇమడదు అనో) మాట్లాడడం అసమంజసమనే నేను భావిస్తాను. మీకు ఎదురయే కవి రచనలకు మీరు ఏదో విధంగా స్పందిస్తేనే మీ బాధ్యత నెరవేర్చినవారౌతారని అంటాను.

మళ్ళీ కలుద్దాం.

*

వాసు

2 comments

Leave a Reply to narayana Sarma Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వ్యాసాల్ని ఫాలో అవుతున్నాను..చాలా వరకు ఎందరికో వచ్చే సందేహాలను ముందుకు తెస్తున్నారు..ఇవి అందరిలో కలుగుతాయి అని నా అభిప్రాయం.వీటికి నిశ్చితమైన సమాధానాలు దొరుకుతాయని కూడా నేను అనుకోను.బహుశః ఏ విషయం మీదా “సార్వత్రిక నిర్వచనాలు”నిలబడకపోవడం ఒక కారణం.

    ఈ వ్యాసాన్ని గురించి..

    1.కవికి సాటి కవే దిక్కు. సాటి కవి చెప్పిన అభిప్రాయమే కవికి శిరోధార్యం. సాటి కవి మెచ్చుకోలే యోగ్యతా పత్రం
    * ఈ విషయం మీద కొంత చర్చించాలేమో సార్.. పైవాళ్లకు(దీని ముందువాక్యంలో మీరు ఉదహరించిన వాళ్ళు)అర్థం కానిది కవులకు ఎలా అర్థమవుతుందనేది నాకైతే కొంత సందేహమే (కవులు కూడా బాగా బేరీజు వేయలేరు అన్నదే నా అభిప్రాయం.కొంతలో కొంత అనుభవం కూడా.)
    2. కవుల కవిత్వం గొప్పగా అనిపించడానికి అనిపించకపోవడానికి పారా మీటర్లు ఏమిటో నాకిప్పటికీ అర్థం కాదు.మంచి కవిత అని ఉటంకించినదాన్ని పేలవంగా ఉందని అన్నవాళ్ళు చాలా చోట్ల ఉంటారు మీరన్నట్టు.బహుశః అభిరుచి ఒక కారణం.చెప్పాలంటే ఈ తరహాదే నిజమైన కవిత్వం అనే ఆలోచన ఉండడం.
    3.ఇక భావ లయ వినడానికి బాగుంది .. మీరు కొంత వివరిస్తే బాగుండేది అనిపించింది-(నేను “వచన కవిత్వంలో లయ”అని ఒక వ్యాసం రాశాను.అందులో కొంత చర్చించాను..)
    4.పద్య కవిత్వం అంతా వ్యర్థమైందని కాదుగాని..పద్య రచన బాగా జీర్ణమైనవాళ్ల కవిత్వం బావుంటుంది.అలా రాసేవాళ్ళు కూడా ఉన్నారు.అయితే వచన కవిత ఆకట్టుకున్న శాతానికన్నా బాగా తక్కువ.పద్య రచనలో ధార కన్న,గణాలు యతుల కుస్తీ పద్యకవుల్లో ఎక్కువైందని అనిపిస్తుంది..చెప్పాలంటే కొందరు పద్యాలు రాస్తారు.పద్య కవిత్వం కాదు.

    • నా సుహృల్లేఖలను చదువుతున్నందుకూ, స్పందించినందుకూ మీకు ధన్యవాదాలు.
      కవికి కవే దిక్కు అనడంలో చిన్న, తప్పించుకోలేని circulairty ఉన్నమాట వాస్తవమే, సర్. ఎవరు ఎన్నదగ్గ సాటికవి? భగవద్గీతలో “యద్యదాచరతి శ్రేష్ఠః” అన్నప్పుడు ఎవరు శ్రేష్ఠులు? ఇది అనుభవం నేర్పించే పాఠం. అనుభవం కొన్ని ఎదురుదెబ్బలను తగిలించినా, అనుభవసారం చెబుతుంది, శ్రేష్ఠులెవరో. నేనిక్కడ సాటికవి (ఎన్నదగ్గ సాటికవి) అన్నది ఆ అర్థంలోనే. నిజమే, కొంతమంది కవులు కూడా మంచి కవిత్వాన్ని సరిగ్గా బేరీజు వెయ్యలేరు. “ఎన్నిక” ఇక్కడ ఉద్దేశించిన అర్థం. పోగా పోగా కవికి ఎన్నదగ్గ సాటికవే దిక్కు అని తెలిసొస్తుంది. ఇదీ నా తాత్పర్యం.
      భావలయకు నిర్వచనం వెతుక్కొనేకన్నా ఉదాహరణలు ఇస్తే సరిపోతుందేమో, సర్. వాడ్రేవు చినవీరభద్రుడి పద్యాలు (“హైదరాబాద్: రెండు పద్యాలు”, “ఇప్పుడు రాస్తున్న కవిత”, “కొండ మీద అతిథి” సంపుటిలో కవితలు), అఫ్సర్ రాస్తున్న నాదం తప్పని prose poems నేను ఇస్తున్న ఉదాహరణలు. ఇక్కడితో ఆపెయ్యడం సరైనదికాదుగానీ, ఈ విషయంపై నా అభిప్రాయం ఇంకోసారి తెలియెజేయగలను. ఇంకో లేఖలో.
      నిజమే, ఛందస్సువల్లనే పద్యం కవిత్వమైపోదు గానీ, ఛందోకవిత్వమూ మనదే అన్నమాట మరోమారు చెబుతున్నాను.

      -Vasu-

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు