రాయని రాతలు

“ఇంటర్‌లో నువ్వు, నేను వేర్వేరు కాలేజీల్లో చేరుంటే.. ఇవాళ ఈ టైంలో ఇక్కడ ఇలా కలిసేవాళ్లమా?”

సాయంత్రం చీకటి మెల్లమెల్లగా ఊపిరి పోసుకుంటోంది. సముద్రం ఒడ్డు తీరిగ్గా అలల్ని నెమరేస్తోంది. అప్పటిదాకా అక్కడ కూర్చున్న జనం మెల్లగా ఇంటిబాట పడుతూ కొత్తగా వచ్చేవాళ్లకి ఎదురెళ్తున్నారు.

“కాలేజీ కాకపోతే ఇంకో చోట.. అయినా కలవాలని రాసుంటే తప్పక కలుస్తాం”

ఆమె చెప్పిన సమాధానానికి అతను నవ్వాడు. ‘ఎవరా రాతలు రాసేది? ఏం భాషలో రాస్తారు?’ అని అడగాలనిపించింది. తన నమ్మకాల్ని అప్పుడప్పుడూ అలా ప్రశ్నించటం అతనికి సరదా.

“కాలేజీలో నన్ను కాకుండా మరెవర్నో ఇష్టపడి ఉంటే..?”

ఇంటర్ క్లాస్‌మేట్స్ గుర్తొచ్చారు. అమ్మాయిల పేర్లు తప్ప ముఖాలు గుర్తు రావట్లేదు.

“రాసి ఉందన్నావ్ కదా! అంతా ఆ స్ర్కిప్ట్‌కి తగ్గట్టుగానే జరుగుతుంది. ఇష్టపడటం, ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్.. అన్నీ పక్కాగా రాతలే!”

ఆమె ముఖం ముడుచుకుంది. అతను గట్టిగా నవ్వేశాడు. సముద్రం వాళ్ల మాటలు వింటూ కూర్చుంది. కెరటాలు చీకటితో కలిసి కొత్త పాటలేవో పాడుతున్నాయి.

” గుర్తుందా? క్లాసులో నువ్వు నాతో ఫస్ట్ టైం మాట్లాడిందెప్పుడో? మ్యాథ్స్ రికార్డ్ కోసం నా దగ్గరకొచ్చావ్. అప్పటికే మా ఫ్రెండ్ గీతకి నువ్వంటే క్రష్. దాని దగ్గరకు వెళ్లొచ్చుగా! నా దగ్గరికే ఎందుకొచ్చావ్? రాత బాబూ రాత. ఇట్స్ ఆల్రెడీ రిటెన్”

అతనికీ నిజమే అనిపించింది. పదిహేను మంది అమ్మాయిలు, ఇరవై మంది అబ్బాయిలు​ ఉన్న క్లాసులో వెతుక్కుంటూ తన దగ్గరికే ఎందుకు వెళ్లాడు? ఏమో? పదిహేనేళ్ల కిందటి సంగతది.

వాళ్ల మాటలింకా సాగుతూనే ఉన్నాయి. అతనేదో అంటున్నాడు. ఆమె దానికి తగ్గట్టు ఇంకేదో..! మధ్యమధ్యలో కొన్ని నవ్వులు వెన్నెల ముక్కల్లాగా రాలుతున్నాయి.

“టైం అయింది. వెళ్దాం.”

ప్రతిసారీ ఆ మాట అనే డ్యూటీ ఆమెదే!

పైకి లేచారు. రోడ్డు దాకా వచ్చాక, ఆమె ఆటోను పిలిచింది. అతను బైక్ ఎక్కాడు. ఎవరిళ్ల ఇళ్ల దారి వారిది. ఎవరి ప్రయాణాలు వారివి. కలిసి ప్రయాణం చేస్తూ ఒకే ఇంటికి చేరుకునే రాతని బహుశా రాయాల్సిన వాడు రాయలేదేమో!

రేపు మళ్లీ అదే చోట కలుస్తారు. ఏళ్లుగా కలుస్తూనే ఉన్నారు. సముద్రంలో కెరటాలు ఆగేదాకా కలుస్తూనే ఉంటారు.

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సముద్రపు కెరటాలు ఆగే దాకా కలుస్తూనే ఉంటారు..
    రాయని రాతలు.. కలవని జీవితాలు..

    ఆగని కెరటం.. వాళ్ళ ప్రేమ..
    ప్రతీ అలా సముద్రంలో నుండి కొత్త నిధులను ఒడ్డుకు చేరుస్తున్నట్టే..
    వాళ్ళు కలిసిన ప్రతీ సారీ కొత్త జ్ఞాపకాలను జమ చేసుకుంటున్నారు..

  • అల్ రెఢి రాసావ్ కదా.. కలిసి వుండలేరని..విడివిడిగా రోజు కలుస్తారని…చాలా బాగుంది.

  • వాళ్ళని కలిపే రాత నీ నుంచి మరో మైక్రో కథ రూపంలో రావాలి

  • ఊ… అదన్నమాట సంగతి 🤔
    కొన్ని పద ప్రయోగాలు బాగున్నాయి
    ఒడ్డు అలల్ని నెమరేయటం..
    వెన్నెల ముక్కలు..
    పాలమూరు లో
    కర్నూల్ లో ..
    సముద్రం యాడుందబ్బా 😜

  • Sodara chala bavundi…kani chala anyayam sodara mundantha oka madhuramaina anubhuthi chupinchi okkasariga chocolate lagesukunnattu lagesukuntav chivarakochhesariki….nikidi nyayama

  • సాయి చాలా బావుంది..కానీ ఇంత అద్భుతమైన ప్రేమకథ తొందరగా చేప్పేసినందుకు కొంచెం నిరాశ….❤️

  • Super bro..pedda pedda matalatho pogadalani undi kani…naku matalu Ravu..but simple ga Chala baga rasaru ani chpadam tappa

  • ఈ చిన్ని ప్రేమ కథ…

    మీ మరో కథలో పెరిగి పెద్దదవ్వాలని ఆశిస్తూ…

  • సముద్రం ఒడ్డు తీరిగ్గా అలల్ని నెమరు వేయడం…
    సముద్రం వాళ్ల మాటలు వింటూ కూర్చోవడం…
    కెరటాలు చీకటితో కలిసి క్రొత్త పాటలు పాడడం.. ఈ వాక్యాలు క్రొత్తగా అనిపించాయి.
    అన్నింటికీ మించి ముగింపు మనసును తాకింది. అరె! అదెలా? పాపం! అనిపించింది. వారి నుదుటి రాత రాసే బ్రహ్మ మీరే అయినప్పుడు మార్చేయవచ్చు. కానీ అలా మారిస్తే వారి జీవితంలో మీరు రాసిన మాకు అందంగా అనిపించిన వాక్యాలు వుండవేమో! రోజూ అలా సముద్రం ఒడ్డున కూర్చుంటారంటారా?
    ఏమైనా ఇలాంటి ఓ కథ రాయాలి నా జీవితంలో అని కూడా అనిపించింది. 👌💐🌹💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు