“మొహమాట కవిత్వం” ఇక చాలు, చాలు!

నాలుగునాళ్ళు నిలిచే కవిత్వం అరుదుగానే వస్తుందన్న సంగతి మనకు తెలిసినదే. ఆధునిక యుగంలో శ్రీశ్రీ తరువాత బహుశా నగ్నమునే అత్యంత శక్తివంతమైన కవిత్వం రాశాడు. కవిత్వం చదువరులను కదిలించాలంటే కవితలో నవ్యత ఉండితీరాలి. నవ్యత అంటే వస్తువులో మాత్రమే అని కాదు, వ్యక్తీకరణలోనూ కొత్తలయ ఉండితీరాలి.

తన సమకాలికులనుంచే ఎన్నో నేర్చుకుంటాడు ఏ కవి అయినా. అటువంటిది తన సమకాలికులకు భిన్నంగా, బాగా రాయడమే కవికి ప్రత్యేకతని ఇస్తుంది. నగ్నముని కవితావాక్యం పదునైనది, ఏదో మందుగుండు బాగా దట్టించినట్టుండీ, చదవగానే పఠితృహృదయంలో విస్ఫోటన కలిగించే వాక్యం ఆయనది. దీనికి తోడు సమాజహితాన్నీ మంచిమార్పునీ కోరేదీ అయిన వస్తువు ఉండడంవల్లనేనేమో నగ్నమునిని ఆధునిక కవితకు పిత అని వేగుంట ఒక సందర్భంలో కితాబిచ్చాడు. (నాపై నగ్నముని ప్రభావం బాగా ఉంది అని ఇక్కడ నేను ఒప్పుకోవాలి. నేనేమీ విప్లవకవిని కాను సుమండీ!).

కె.శివారెడ్డి తన బాల్యంలోనూ ఉద్యోగార్థియై హైదరాబాద్ వచ్చిన కొత్తలోనూ తనకు ఎదురైన అనుభవాలన్నీ అనుభూతులుగా మార్చుకొని అందరికీ తన గొంతును అరువిచ్చాడు. ఇది ఆయన ప్రత్యేకత. ఏది ప్రత్యేకమన్న విషయం నిర్వచించలేము. నా తరానికొస్తే, 1980ల్లోనే శిఖామణి కవిత “కొయ్యకాలు” తెలుగు కవితను ఒక మలుపు తిప్పింది. “కొయ్యకాలు” నూరుశాతం అనుభూతి కవిత. అందులో రాజకీయ చైతన్యం కానీ సామాజిక స్పృహగానీ (ఈ రెండు పదబంధాల్నీ నేను తక్కువ చెయ్యడంలేదు) లేవు, కవి వైయక్తికానుభూతి తప్ప. ప్రతీకాత్మకంగా తన బాధను చెప్పడం బహుశా అప్పట్నుంచే తెలుగులో మళ్ళీ మొదలయిందేమో. అది చర్వితచర్వణమైన విప్లవకవిత్వం నుండి ఎంతో relief ఇచ్చింది. అదే కాలంలో అనిబద్ధ, అస్పష్ట కవిగా తొలిదినాల్లో “పేరుపడ్డ” అఫ్సర్ కూడా రంగప్రవేశం చేశాడు. 1985లోనే చినవీరభద్రుడు తన తొలి కవితా సంపుటి “నిర్వికల్ప సంగీతం”తో అందరినీ ఆకట్టుకున్నాడు. నిజానికి ఇక్కడ ఎక్కువ చెప్పుకోవాల్సింది చినవీరభద్రుడి రెండో కవితాసంపుటి, “ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ”.

ఇప్పుడు కవిని కవిగా మిగిల్చే ప్రత్యేకత గురించి మాట్లాడదాం. కాలపరీక్షకు నిలబడే కవిత్వం ఖచ్చితంగా ప్రత్యేకమైనది కావాలి. అది అనుకరణలకు పాల్పడే వారికీ, కవిత్వంతో చెలగాటమాడేవారికీ, సర్కస్ కసరత్తులు చేసేవారికీ అసాధ్యం. పద్యం కలిగించే ఫీలింగ్ (భావస్ఫూర్తి) కొత్తగా ఉంటూ, కవి ఆవిష్కరించిన లోకం వింతగా, అందంగా తోచుతూ, కవిత textలో అంతర్లయ ఉంటేనే చాలదు, ఈ గుణాలు విస్తృతంగా ఉండాలి. ఆధునిక కవిత text ఎంత గుర్తుంటుందో ఏమో గానీ అది కలిగించే భావస్ఫూర్తి పఠితలను వెన్నాడిందంటే అది నిలబడే కవిత్వం.

Make it new అన్నాడు ఎజ్రా పౌండ్. గుర్తుండిపోయేదే కవిత్వమన్నారు చెళ్ళపిళ్ళవారు. ఆధినిక కవితల text అంతా పాఠకుల నోళ్ళల్లో నానకున్నా, భావం, లయ పాఠకుల మనసులో తిష్టవేసుక్కూచున్నాయంటే ఆ కవిత మిగులుతుంది. ఈ impression సాధించాలంటే, కవితలో అనవసరమైనదేదీ కనిపించకూడదు, నిండుకుండమాదిరి ఉండాలన్నమాట. ఈ textual integrity సాధించడమే కవికి ముఖ్యం. ఇదే మామూలు కవితకూ నాలుగునాళ్ళు నిలబడే కవితకూ మధ్యనుండే వ్యత్యాసం. దీన్ని సాధించాలంటే కవికి ప్రతిభతో పాటుగా నిజాయితీ ఉండడం ముఖ్యం. తను రాసినది తనూ ఒక పాఠకుడి మాదిరి చదివి, దాన్ని మగ్గనిచ్చి తిరగరాయాలి. ఈ పరీక్షకు కొంతమంది ప్రతిభావంతులూ తట్టుకొని నిలబడలేరు, ముఖ్యంగా కాస్త లబ్ధప్రతిష్ఠులయినవారు. ఏం రాసినా ఫరవాలేదులే, నా పేరు పాఠకులకు తెలుసు అనుకుంటే, అది బుకాయింపే. పాఠకుడు “అబ్బ, ఎంత బాగుందో” అనుకొని, నేనూ ఇలా రాయగలిగితే బాగుండును అనుకున్నాడంటే, కవి సఫలీకృతుడైనట్టే. లేదా లేదు.

నగ్నముని కవిత “పాలు ఎర్రబడ్డాయి”, అజంతా “చెట్లు కూల్తున్న దృశ్యం” వంటివి మనమింకా quote చేస్తూ జ్ఞాపకం పెట్టుకున్నామంటే, అవి కదిలేవీ కదిలించేవీ కనుకనే. నగ్నముని సామాజిక కవి, అప్పటికి విప్లవకవి. అజంతా వేదనను, బాధనీ కవిత్వీకరించినవాడు. ఇద్దరికీ ఒకలా చూస్తే పోలికే లేదు. అయినా ఇద్దరూ మిగిలారు. అంటే, వారు కవిత్వానికే నిబద్ధులని అర్థం. ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకున్న మంచి కవులు మనకున్నారు, ఇంకా రాస్తున్నారు కూడా. వారి పేర్లన్నీ ఇక్కడ ప్రస్తావించను గానీ, నన్ను సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నవారికి ఈ కవులు సుపరిచితులే, వారి కవిత్వంపై నా అభిప్రాయం విదితమే.

కవులు ఆర్భాటాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటీవల చాలామంది కొరోనా కవితలు రాశారు, అదీనూ ఎవరో అడిగితేనో, వెన్నుతట్టి రాయిస్తేనో. ఇటువంటి “మొహమాట కవిత్వం” మిగుల్తుందనుకోను. ఇవన్నీ formulaను అనుసరించే వచనాలు. అయినా, అడిగితే చెప్పే కవితలు వేరేగా ఉంటాయి. అవధానాల్లో అయినా, బయట అయినా. ఈ అస్తిత్వ తరంలో కాస్త రాయగలిగే ప్రతికవీ తన సామాజిక, కుల, మత, ప్రాంత పరిధుల్ని దాటి ఏమీ రాయడంలేదు. దీన్నొక ఉద్యమంగా చూద్దామా అంటే, ఈ “బహుజన కవితల్లోనూ” అనైక్యత కనిపిస్తుంది. దీనిమీద “ఆఖరి తీర్పు” వెలువరించడానికి ఇంకా టైమ్ పడుతుంది. ప్రస్తుతానికి ఈ పోకడలని గమనిస్తూ ప్రోత్సాహక విమర్శ చెయ్యడమే కవితాప్రియులు చేయగలిగేది.

మళ్ళీ కలుద్దాం.

*

వాసు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు