నవలలకు నవీన్‌ అవార్డులు

కొత్తగా నవలలు రాసే రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో నవలాకారులు రచించిన మొదటి  నవలలకు ప్రథమ బహుమతిగా 10 వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5 వేల రూపాయల పారితోషికం ఇవ్వాలని అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు నిర్ణయించింది. ఈ పారితోషికాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 24వ తేది నాడు జరిగే నవీన్‌ జన్మదినోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేయడం జరుగుతుంది.
నవలాకారుడు రచించిన తన మొదటి  నవలని ఈ క్రింది అడ్రసుకు మూడు ప్రతుల చొప్పున 2020 నవంబర్‌ 15వ తేదిలోగా పంపించవలసినదిగా మనవి చేస్తున్నాం.
నవలాకారులు పాటించాల్సిన  నిబంధనలు :
1. తెలుగులో రచించబడిన నవలలే ఈ పురస్కారానికి అర్హమైనవవుతాయి. తెలుగువాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా తాము రచించిన మొదటి  నవలని ఈ పురస్కారానికి పంపించవచ్చు.
2. నవల నిడివి ప్రింటులో  100 పేజీలకు తగ్గకుండా, 250 పేజీలకు మించకుండా ఉండాలి.
3. ఇతివృత్తం తెలుగువాళ్ళ జీవితాలకు సంబంధించినదై ఉండాలి. కథా కథనంలో కొత్తదనం, ప్రయోగాత్మకత, పఠనీయతాగుణం ఉన్న రచనలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
4. ప్రతి సంవత్సరము రెండు నవలకు ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. (ప్రథమ బహుమతి 10 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 5 వేల రూపాయలు) ఇదివరకు యే పత్రికలోనూ ప్రచురించబడని నవలనే పంపించాలి. నవలను డిటిపి  చేయించి పంపిచవచ్చు. లేదా స్పష్టంగా తెలిసే చేతివ్రాతలో కూడా పంపించవచ్చు. ఈ నవలా రచన 2016-2019 సంవత్సరాల మధ్య జరిగి ఉండాలి. అంతకన్న పూర్వం రచించబడిన నవలకు అవకాశం ఉండదు.
5. పారితోషికాన్ని యే నవలలకివ్వాలన్న విషయంలో ఇందుకోసం నియమించబడిన న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు గాని మరే ఇతరమైన సంప్రదింపులకు గాని అవకాశం లేదని గమనించాలి. పంపించబడిన నవలల్లో ఏ నవల కూడా పారితోషికానికి అర్హమైనది కాదని న్యాయ నిర్ణేతలు భావిస్తే ఆ సంవత్సరము ఏ నవలకు కూడా పారితోషికం ఇవ్వబడదు.
6. పంపించబడిన నవల ప్రతులను తిరిగి పంపించడం సాధ్యం కాదు. తగినన్ని పోస్టల్‌ స్టాంపులు జతచేస్తే తిరిగి పంపడానికి ప్రయత్నిస్తాం.
7. ఇది తను రచించిన మొది నవలే అని, ఆ నవల 2016-19 సంవత్సరాల మధ్యకాలంలోనే రచించానని ఇదివరకు ఈ రచన యే పత్రికలోనూ ప్రచురించబడలేదనీ రచయిత హామీ పత్రాన్ని జతచేయాలి.
నవలలు రాయాలన్న ఉత్సాహము, అభినివేశం ఉన్న రచయితల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు తలపెట్టిన  ఈ కార్యక్రమములో యువ నవలాకారులు ఉత్సాహంగా పాల్గొంటారని  ఆశిస్తున్నాము.
డి. స్వప్న
కార్యదర్శి
అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు
2-7-71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ,
వరంగల్‌ – 506 001.
ఫోన్‌ : 0870-2456458
*

"అంపశయ్య" నవీన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దాదాపు ఆరేళ్ళ పైన సంగతి.
    నేను “అంతర్జ్వలన” అన్న నవల రాసాను.
    అది నవ్య వీక్లీలో వచ్చింది. పుస్తకం అచ్చేసినప్పుడు కొన్ని కాపీలు కాత్యాయని విద్మహే గారికి పంపుతూ, నవీన్ గారికీ, నవలలు ఇష్టంగా చదివే వారికీ ఇవ్వమని చెప్పాను.

    దాదాపు ఆర్నెల్ల తరువాత అంశయ్య నవీన్ గారి నుండి కాల్ వచ్చింది, ఏటా వచ్చే నవలల్లో మొదట నవల రాసిన వారికి అవార్డు ఇస్తున్నామనీ, నా నవల ఎన్నికయ్యిందనీ చెప్పారు. అవార్డు కూడా డిశెంబరు 25న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇస్తామని చెప్పారు.

    నాకు ఇండియా వెళ్ళే ఆలోచన లేదనీ, భరించలేనంత ఖరీదులో డిశంబరు నెలలో టిక్కట్లు ఉంటాయని రాలేనని చెబుతూ, వేరెవరికైనా అవార్డు ఇచ్చేయమని చెప్పాను. మేం ఈ నవలకే ఇద్దామని నిర్ణయించాము, మీరెప్పుడొస్తారో చెప్పండి, అప్పుడే ఈ కార్యక్రమం చేస్తామన్నారు. తరవాత సంవత్సరం మార్చిలో వస్తానని అంటే, నాకోసం ఒక ఆదివారం ప్రోగ్రామ్ పెట్టారు.

    ఇదేదో సొంత డబ్బాకి రాయడం లేదు.
    నవల ఎడల ఆయన ప్రేమనీ, నిబద్ధతనీ చెప్పడానికి రాస్తున్నాను.
    ఇన్నేళ్ళుగా కొత్త నవలలని ప్రోత్సాహిస్తూ బహుమతులిస్తున్న శ్రీ అంపశయ్య నవీన్ లాంటి వారు అరుదుగా కనిపిస్తారు.

    కొసమెరుపు: అప్పుడు నా దగ్గరున్న కొన్ని కాపీలు పట్టుకెళ్ళాను.
    ఆ సభకి వెళ్ళినప్పుడు విచ్చేసిన శ్రీ జనార్థన రావు ఆ పుస్తకం తీసుకున్నారు. ఏడాది తరువాత – ఆయన ఆ నవలని సంస్కృతంలోకి అనువదించారు. “సంస్కృత భారతి అనే బెంగలూరు సంస్థ వారి “సంభాషణ” అనే మాస పత్రికలో ఏడాదిపైగా అది సీరియల్‌గా వచ్చి, క్రితం నెలలోనే పూర్తయ్యింది. అది వారు పుస్తకంగా వేస్తున్నారు కూడా.

    శ్రీ అంపశయ్య నవీన్ బహుమతి చేసిన ఇంద్రజాలం అది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు