ముగింపు

దూదిపింజ తత్వాన్ని
ఒడిసి పట్టుకోవడం ఎలా?
తల మీద మోస్తున్న సంవత్సరాల బరువుని
దబ్బున కిందపడేసి పోవడం సాధ్యమేనా?
కలలన్నీ రాలిపోయిన నిర్మలమైన ఆకాశంలా
చేతులు దులుపుకోవడం కుదురుతుందా?
శిశు రాజసాలు.. యవ్వనపు నిగనిగలు..
ప్రేమ సవ్వడులు.. వార్ధక్య వైరాగ్యాలు..
కొంటె గుండె అలజడులు.. ఆశల అంతస్థులు..
అన్నీ.. కళ్ల దోసిళ్ళలో పూసి వాడిపోయే
గుప్పెడు పూల క్షణాలేనా!
తొలి ఊపిరికీ కడపటి శ్వాసకు నడుమ
ఒక అనంతమైన ఆకలి వాగు
దాటడానికి అలవి కాని ఉధృతి
ఎప్పటికప్పుడు సుడులు తిరుగుతూ
బలం పుంజుకోవడమే తెలుసేమో దానికి!
ఆస్తి.. కీర్తి.. వినోద బ్రాంతి..
మొత్తంగా చూస్తే
మూడు ముక్కల్లో చెప్పొచ్చు
ఏ మనిషి కథయినా!
చిదపలైన అన్ని అనుభవాలనూ కలిపి
భూత భవిష్యత్తు వర్తమానాల్లోంచి
ప్రతి కథను అల్లుకోవాలి
ఓ కథకు ముగింపు వాక్యమే
మరో కథకు తొలి వాక్యం
పతాక సన్నివేశానికి వచ్చేసరికి
తేలియాడే గాలి పాటల మేనాలో
వెలుతురేదీ సడి చేయని నిశ్శబ్ద లోయల్లోకి
తేలికగా ఒరిగిపోయే సుఖాంత చరితం
ఒక దూది పింజ కథ
కొమ్మల్లో చిక్కి గింజుకులాడే
భారమైన దుఃఖాంతపు గాథ
ఒక గాలిపటం కథ
కాలం కక్ష్యలోకి
ఎలా జారుకోవాలో తెలిసినప్పుడు మాత్రమే
కన్నీళ్ల కథ ముగిసిపోతుంది.
మరో కవిత 

 ఒంటరైనపుడు…

జాలి గుండెలు.. నవ్వు మొహాలు..
అన్ని ఆవిరి బుడగలూ పేలి
కన్నీటి సంద్రంలో చిక్కుకుపోతాయి
అదృశ్య అగాథాల లోతుల్లో
కలల వెలుగులు మునిగిపోతాయి
పరుగాపని చీకట్లో దిగాలుగా
కాలం, కాలం గడుపుతుంది
నిర్మలమైన ఆకాశం ఒక్కటీ లేక
పాడు మబ్బులు కమ్మిన పల్లె వీధిలా
ఒంటరినై మిగిలిపోతాను –
రాత్రికి రాత్రి ఒక సంజీవనిలా
ఏకాంతం గుప్పిట చిక్కుతుంది
మూడు నాలుగు బొట్లుగా
బతుకుతీపి లాంటి ఆశల తేనె
నాలుక మీద కురిసిపోతుంది!
ఎప్పటికప్పుడు
కొత్త సోకుల్నీ, సరికొత్త రుచుల్నీ
ఎంచి తెచ్చుకునే నగరంలా
నాకు నేను కొత్తగా పరిచయమౌతాను –
అడవిచాటు ఆలోచనల్లోని మొగ్గలన్నీ
ఒక్కొక్కటిగా
మంచుగాలిని తాగి పువ్వులవుతాయి
ఉషోదయాన్ని పాడుకుంటూ
దుఃఖపు రెక్కల కిందనుంచి
పక్షులిటు ఎగిరొస్తాయి
గుబురుటాకుల పచ్చని చెట్లు
చిగురు కళలతో చికిలించి చూస్తాయి –
నమ్మకంగా భుజం తట్టి
జాలి గుండెలు స్థిమితపడతాయి
పొద్దు పొద్దున్నే,
ఒంటిమబ్బు ఆకాశం వొంగి
పెదవంచున కొసమెరుపులాంటి
ఒక చిరునవ్వు తరకై మెరిసిపోతుంది –
అంతలోనే..
ఊపిరున్న ఆత్మీయులూ
ఉసురు లేని ఆలంబనలూ
గుండెయింటికి చుట్టాల్లా వచ్చేస్తారు
ఇక లోపలంతా ఒకటే కోలాహలం!
*

కంచరాన భుజంగరావు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు