“సెంట్రల్ ఆఫీస్ నుంచి డెసిషన్స్ వచ్చే లోపు ఫైల్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి, అప్డేషన్స్, కంప్లీషన్స్ హైరానా ఎలెవెన్త్ అవర్ లో పడకూడదు…” ఎవరికో చెబుతున్నట్లే పైకి అనేసి, నాలిక్కరుచుకున్నాను.
అయినా ఎవరున్నారు ఆఫీసులో, సెకన్లతో పోటీ పడుతూ నేను, గడియారంలో గంటల ముల్లులా ఆ మూల మరో ఇద్దరు అంతేగా అనుకుంటూ వాల్ క్లాక్ వైపు చూసాను.. టైం రాత్రి 11.30!!. అమ్మో నిజంగానే ఎలెవెన్త్ అవర్!! అస్సలు టైం తెలీనేలేదు.
నా క్యాబిన్ పార్టీషన్ మీద workaholic… procrastination కోట్స్ ఎప్పుడు చూసుకున్నా నన్ను మెచ్చి ఇచ్చిన citations లా మెరుస్తుంటాయి. చేత్తో తీసేసినట్టు మాయమౌతుంది అలసట!
బుజ్జి కోయిల కుహూమన్న శబ్దానికి చిన్న ఉలికిపాటు, వాట్సప్ మెసేజ్ అర్జున్ నుంచి “నూనెలా మెరుస్తూన్న నల్లని గచ్చు మీద చీమ ఒకటి కాశీ యాత్రకి ప్రాకుతూంటుంది”
ఈ రోజు థర్టీయత్ ఆఫీసులో ఉన్నట్టు తెలుసు కదా, వెక్కిరిస్తూ పెట్టాడు ‘మో’ కవిత. భలే గుర్తొస్తాయి వీడికి, సందర్భానికి అతికినట్టు. మొన్ననే మాట్లాడుకున్నాం, ‘మో’, బైరాగి కవిత్వాలు- ‘చితిచింత’, ‘రహస్తంత్రి’, ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు…’!
“వేగుంట మోహన ప్రసాద్, ఆలూరి బైరాగి కవిత్వాల్ని కూడా మిగిలిన వాటిలా కరకరా నమిలి మింగకు దయచేసి. ఆగి ఆగి అక్షరమక్షరం మనసులోకి వంపుకుంటూ చదవాలి వాటిని,” అన్నాడు అర్జున్.
ఈ రోజు పని నిన్నే ముగించడం, రేపటికి ఈ రోజే దాచుకోవడం- చీమ లక్షణాలని, పదిలంగా కట్టుకోవడం, పొందిగ్గా ఉంచుకోవడం OCD అనీ – అర్జున్ వెక్కిరింపు. అందుకే- శుభ్రంగా మెరిసే నల్లని గచ్చు… చీమ యాత్ర … అంటూ వెటకారం మెసేజ్ లో.
అవును, చీమనే, grasshopper గజిబిజి బతుకు, పారాసైట్ జీవితం నాకొద్దు.
“Of course, ant is my trademark, tag, logo, motto and my aplomb”, అని అర్జున్ కి మెసేజ్ చేసి, లో బ్యాటరీ చూపిస్తున్న ఫోనుకి చార్జింగు, పేపర్స్ కి క్లిప్పు పెట్టి నడిచాను వాష్ రూంకి.
ఫేస్ వాష్ తీసి రెండు చుక్కలు అరచేతిలో వేసుకుని మొహం కడుక్కుంటూ అద్దంలోకి చూసుకున్నా. జుత్తు చెరిగిపోయి కళ్ళ కింద ఇంతింత నల్ల చారికలు, స్ట్రెస్ అంతా మొహం లోనే కనిపిస్తోంది.
రేపు కూడా దాదాపు ఇంతే పని ఉంటుంది. ఆ తర్వాత అయినా కాస్త రిలాక్స్ అవ్వాలి.
“ప్రయాసపడి భూభారము మోస్తున్న బిడ్డా, నా వద్దకు రమ్ము, నీకు స్వస్థత చేకూర్చెదను…” అంటూ ఆటపట్టించే అర్జున్ గుర్తొచ్చాడు మళ్లీ. అర్జున్ అనేదీ నిజమే, చేసే వాళ్ల మీద గాడిద చాకిరి మోపుతూనే ఉంటారు, పనిదొంగలు అంతకంత తప్పించుకుంటూనే ఉంటారు. అందుకే ‘స్మార్ట్ వర్క్’ అంటూ గోలపెడుతుంటాడు; వాడి జాబ్ లా అనుకుంటాడు, పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం కుదరదని తెలీక.
దూరంగా మొత్తుకుంటోంది- నా ఫోనే. ‘హమ్మయ్య డెసిషన్స్ వచ్చేసి ఉంటాయి. ఇంక క్లోజ్ చేసుకోవచ్చు…’ అనుకుంటూ పరుగు తీసాను.
“అర్జున్ కాలింగ్..” స్క్రీన్ మీద అక్షరాలు చూడగానే ఇప్పుడేగా మెసేజ్ చేసాడు అనుకుంటూ లిఫ్ట్ చేయబోయే లోగా కాల్ కట్ అయింది. మళ్ళీ చేయబోతుంటే తన ఫోన్ బిజీ. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడం తనకి అలవాటే, పైగా శరత్ ఊర్లో లేడు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని కాబోలు. లేకపోతే పీకల్దాకా తాగి ఉంటాడు, వాడి సోది అయితే ఇప్పుడు భరించడం నావల్ల కాదు. అయినా, నాకింక మళ్ళీ ఫోన్ చేసే తీరిక లేదు, పని రాక్షసి తరుముకొస్తుంటే అందులో మునిగిపోయాను.
గంట తర్వాత, బయలుదేరుతుంటే గంటల ముల్లు మేనేజర్ తాపీగా అడిగాడు, “ఎలా వెళ్తున్నారు మేడం?”
“కార్ ఉంది సర్, వెళ్తా నేను. తను లేరు. కాన్ఫ్ రెన్స్ కి ముంబై వెళ్ళారు,” మొక్కుబడిగా చెప్పేసి, కార్ లో కూర్చుని స్టార్ట్ చేస్తుండగానే శరత్ నుంచి ఫోన్.
“నాయనా బయలుదేరాను. నీ పాటికి నువ్వు ఊరెళ్ళావు సరే, నీ స్నేహితుడికైనా కొంచెం కన్సెర్న్ ఉండక్కర్లేదా? అరగంట క్రితం కాల్ చేసాడు. తిరిగి నేను చేస్తుంటే తెగ బిజీ, అర్థరాత్రి అంకమ్మశివాలులా ఏమిటో అంత చేటు మాటలు, ఎవరితోనో. ఇదిగో ఇప్పుడెళ్తున్నా ఇంటికి ఒక్కదాన్నే,” ఫిర్యాదుగా అనేశాను, శరత్ ని మాట్లాడనీకుండా.
“మిథునా! నేను ఎయిర్ పోర్ట్ కి బయలు దేరాను, పొద్దున్న ఐదుగంటల ఫ్లయిట్ కి వచ్చేస్తున్నా. మయూర వచ్చిందట, అర్జున్ చెప్పాడు, వివరాలు తెలీవు. నా మొబైల్ లో చార్జింగ్ లేదు, ఆఫ్ అయితే కంగారు పడకు,” శరత్ ముక్తసరిగా చెప్పి పెట్టేశాడు.
మయూర పేరు వినగానే, అది సింక్ కావడానికి కొంత టైం పట్టింది; మిగతావేవీ తలకెక్కలేదు. ఒక్కసారిగా మనసు మొద్దుబారిపోయినట్లయింది. అప్రయత్నంగా అర్జున్ కి కాల్ చేసాను, కాల్ వెయిటింగ్ వచ్చినా, వెంటనే కనెక్ట్ అయింది; “ఆఫీసు నుంచి బయిల్దేరావా…” అంటున్నాడు అర్జున్.
“మయూర… శరత్ చెప్పాడు… మయూర వచ్చి…. ” అరకొరగా ఏదేదో మాట్లాడేస్తున్న నన్ను ఆపి, “అవును, వచ్చింది, పోలీసుల కస్టడీలో ఉంది, త్రీ టవున్ పోలీస్ స్టేషన్ కి వచ్చేయ్,” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్.
జ్ఞాపకంగా కూడా చెరిగిపోతున్న మయూర తిరిగొచ్చిందా? గోడ మీద ఫొటో తీసేసినా, మేకు చేసిన డాగు, ఫొటోఫ్రేమ్ వెనక వెలిసిపోని వెల్ల ఉంటాయి నిజమే. కానీ, కొంతకాలానికి అవి కూడా పోతాయి; మరి ఈ 15 ఏళ్లకి మయూర మాత్రం మాసిపోదా, విస్మృతిగా మారిపోదా?
వళ్ళు చల్లబడి, తూలు వచ్చినట్లు అనిపిస్తే ఒక్క నిమషం కార్ పక్కన ఆపి అలా కూర్చుండి పోయా. మయూర అంటే నా నెమ్మి??!! దిగంతాలే హద్దులని, ఆకాశమే గమ్యమనీ ఎగిరిన నెమ్మి, ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసి… నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిన’ట్టు ఇక్కడికి రావడం ఏమిటి?
ఎక్కడ కనిపించి… ఇంకెక్కడ వినిపించి… మరెక్కడ మాయమయ్యిందో… మళ్లీ ఇన్నేళ్ల తర్వాత! జీవితంలో వింటాననుకోలేదు ఆ పేరుని, అదీ అర్జున్ నుంచి.
ఆలోచనల్లోంచి తేరుకుని బయలుదేరా.
ఉలిని జార్చేసుకుంటున్న ఏమరుపాటులో చెక్కుతున్న శిలనే తదేకంగా చూస్తుండిపోయిన పిగ్మెలియన్ లా అనిపించాడు అర్జున్. బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూపలుకూ లేని మయూర వంక రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు. స్టేషన్ లోకి వెళ్లగానే నాకు కనిపించిన దృశ్యమదే. రాయి దెబ్బకి తుట్టె కదిలి, జుంటీగలు జుయ్యిమనే రొదపెడుతున్నట్టు ముసురుతున్నాయి తెంపులేని ఆలోచనలు. నెమ్మీ అంటూ భుజం మీద చెయ్యేసే దాకా నా ఉనికిని కూడా పట్టించుకోలేదు ఇద్దరూ.
నా వంక నిర్వికారంగా చూసి, మళ్లీ కళ్లు తిప్పేసుకుంది. మేలుకున్నట్టు లేచి దగ్గరకొచ్చాడు అర్జున్.
జారత్వాల్ని చూసి రోసిన పిగ్మెలియన్ లా స్త్రీద్వేషి కాలేదు గానీ, ఆడ పొడ గిట్టకుండా, నీడ సోకకుండా ఏకాకి అయ్యాడు అర్జున్.
‘మయూర అంటేనే స్వేచ్ఛ, విడుదల. తన ఆరాటాన్ని, వెదుకులాటని ఒక సగటు భర్తలాగా బరితెగింపుగా చూశాడు అర్జున్…’ అంటాడు శరత్.
చిన్ననాడే కుదురుకున్న స్నేహం మా నలుగురిది, ఏ ఒక్కరినీ వేరు చేసి తప్పొప్పుల బేరీజుతో జడ్జిమెంటల్ గా మాట్లాడటం శరత్ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తనతో జీవితం పంచుకున్న నాకు తెలీదా! కానీ, ఈ విషయంలో నేను పూర్తిగా అర్జున్ వైపే ఉండటం కరెక్ట్ కాదని శరత్ ఉద్దేశం. ఆ మాటకొస్తే మయూర వెళ్లిపోయాక, మతి చెడినట్లయిన అర్జున్ ని అమ్మలా చూసుకుంది శరత్తే.
పెళ్లి అనే బంధనాలు తనకి సరిపడవని మయూర మొత్తుకుంది కూడా. గాలిపటం ఎంత ఎగిరినా, సూత్రంతో కట్టిపడేశాననీ, దారం తన గుప్పెట్లోనే ఉంటుందనే నమ్మకం అర్జున్ ది. గాలులకి గింగర్లెత్తే గాలిపటం కాదు మయూర, సాధ్యాసాధ్యాల్ని కూడా ఎదిరించి మబ్బుల్ని కూడా తన్ని ఆపైన చక్కర్లు కొట్టే జొనాథన్ లివింగ్ స్టన్ సీగల్ అనే మరో పోలిక తెచ్చాడొకసారి శరత్.
అయినా ఇవన్నీ ఎన్నేళ్ల నాటి మాటలు, ఆ తర్వాత మయూర ఊసే మర్చిపోయాం. ఇప్పుడిలా హఠాత్తుగా ఊడిపడింది – లేడీ జొనాధన్ లాగా చీరుకుపొయి రక్తమోడే గాయాలతో.
మధ్యాహ్నం నుంచి బీచ్ దగ్గర కూర్చుని ఉందట, అదీ జనసంచారం అట్టే ఉండని తెన్నేటి పార్క్ దగ్గర బీచ్. చీకటి పడినా కదలకపోవడంతో తన వాలకమే అనుమానస్పదంగా ఉండి ఎవరో ఒకాయన పలకరిస్తే, ‘పున్నమికే కాదు, అమావాస్యకి కూడా పోటు ఉంటుంది కదండీ…” అని సముద్రం వంకే చూస్తూ అందట. ఆ పెద్దాయన పెట్రోలింగ్ కి వెళ్ళిన పోలీసులకు చెపితే, ఆత్మహత్యా ప్రయత్నం అనుకుని స్టేషన్ కి తీసుకొచ్చారు. చాలా సేపు అడిగాక అర్జున్ పేరు, తను పని చేసే డిపార్ట్మెంట్ వివరాలూ అతి కష్టం మీద చెప్పిందట. స్టేషన్ కి వెళ్తూ ఆ విషయం చెప్పడానికే నాకు ఫోన్ చేశాడు, నేను తీయలేదని శరత్ తో మాట్లాడాడు.
అర్జున్ చెబుతుంటే యాంత్రికంగా ఊ కొడుతున్నానే గానీ, మయూర వంకే చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయాను.
“దారిన పోయే దానయ్యకీ మయూరనే, మీకు కూడా మయూరనేనా ఏంటే. నెమ్మీ అని పిలువు,” అనేది తను, నేనెప్పుడైనా ‘మయూరా’ అని పిలిస్తే. అవును అది ప్రపంచానికి ఏదయినా కావొచ్చు, మాకు- నాకు, శరత్, అర్జున్ కీ- మాత్రం నెమ్మీనే. దాన్ని ఎక్కువగా ఆట పట్టించే అర్జున్ కి నేరేడు నెమ్మీ! ‘నల్ల పిల్ల అంటే కమల్ హాసన్ నల్ల పొన్ను కాదు, అల్లో నేరేడు లాంటి అల్లరి నల్ల పిల్ల అని,’ – అనేవాడు. ‘రొంబ అళగ ఇరికె..’ అని దాని బుగ్గలు పుణికేవాడు.
మైత్రి అంటే ఏమిటో, దాని రంగు, రుచి ఏమిటో తెలియనంత చిన్ననాటి నుంచీ కలిసిమెలిసి పెరిగాం నలుగురం. నేను- శరత్ ఒకటయ్యాం, నెమ్మీ- అర్జున్ కూడా అంతే అనుకున్నాను.
చూడబోతే అర్జున్ తో బంధం ఏమంత సీరియస్ అనిపించేది కాదు. పోనీ అలాగని తెగేసి నిర్ణయం చెప్పేదీ కాదు. ఒక పక్క నేనూ శరత్ జీవితంలో కుదురుకొని, మరోపక్క మా ప్రాణ స్నేహితులిద్దరూ అలా ఒంటరిగా ఉండడం నాకు బెంగగా ఉండేది.
” అర్జున్ అంటే నీకిష్టం లేకపోతే చెప్పేయొచ్చుగా ” అనేదాన్ని.
“ఇష్టం మిథూ, బోలెడు ఇష్టం. కానీ పెళ్ళి చేసుకోవడం, ఇవన్నీ నా వల్ల కాదు ” అనేది.
ఓ సారి డైరక్టుగానే పెళ్లికి నో చెప్పేసింది నెమ్మీ, అర్జున్ డిప్రెస్ అయిపోయాడు.
“అయితే, అర్జున్ తో ప్రేమలో పడటం అబద్ధమేనా?” అడిగానప్పుడు నెమ్మీని.
“అవునే మిథూ అబద్ధమే. ప్రేమలో పడలేదు, ప్రేమలోకి ఎగిరాను మరిన్ని రంగుల రెక్కలతో, ఇప్పుడూ ఆ ప్రేమలోనే ఉన్నాను,” అంది నవ్వుతూ.
దానివన్నీ వింత మాటలే, విడ్డూరపు చేష్టలే. ఒకే ప్రాణం అన్నట్టు ఉంటుంది, ఒక్కోసారి మాత్రం ఎంతో దూరం అన్నట్టు ప్రవర్తించేది; ఇదిగో ఇప్పట్లానే నిర్లిప్తంగా, అసలు పట్టనట్టు చూస్తుంది.
అర్ధరాత్రి కావడం వల్ల కాబోలు స్టేషన్ నిశ్శబ్దంగానే ఉందిగానీ, కీచురాయి అరుపుల వల్ల అర్థమౌతున్న నిశ్శబ్దం వల్ల కాబోలు ఆ వాతావరణం ఇంకా ఇర్రిటేటింగ్ గా అనిపిస్తోంది. ఆడ కానిస్టేబుళ్లు కూడా లేకుండా ఆడపిల్లని స్టేషన్ తీసుకురావడమేంటో, అన్నేసి గంటలు పట్టించుకోకుండా ఆ నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్ధం కాలేదు. దేనికోసం ఈ పడిగాపులు, నెమ్మీని మనం తీస్కెళ్లడానికి ఏమిటీ వీళ్ల అభ్యంతరం. ఇన్స్‌పెక్టర్ వచ్చాక మాట్లాడి మయూరని తీస్కెళ్లమని అర్జున్ తో అన్నారట కానిస్టేబుల్స్.
“ఎవరు మీ ఇన్స్‌పెక్టర్? ఆయనకి ఫోన్లు వంటివేమీ ఉండవా? నెంబర్ నాకు చెప్పండి…” అని నేను దబాయిస్తుంటే అర్జున్ నన్ను ఊరుకోబెట్టాడు, ఆత్మహత్యాప్రయత్నం కింద కేసు కడితే మనమే పీక్కోవాల్సివస్తుందంటూ.
మెతకదనం ఇంటిపేరు, మోమాటం అసలు పేరు అని అంటారందరూ నన్ను. కానీ, ఆవేశం వస్తే మాత్రం ఎదురు ఎంత వాళ్లయినా దులిపేస్తాను.
‘శరత్ నీ బలం, నీ ధైర్యం…’ అంటారు తెల్సినవాళ్లు. శరత్ ఎన్ఎల్పి ప్రొఫెషనల్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ట్రైనర్స్ చాలా మంది ఉండొచ్చు గానీ, శరత్ ఇండియాలోనే పేరున్న ప్రముఖుల్లో ఒకడు.
నలుగురం కలిసి పెరిగాము, టెన్త్ వరకూ కలసి చదివాము, ఎవరి కెరీర్స్ ఏ దారులు తీసుకున్నా ప్రాణానికి ప్రాణంగా మెలిగామే గానీ, శరత్ జీనియస్ మాకు ఎప్పుడూ అందలేదు, అంతుబట్టనూలేదు. ఐఐటీ, ఐఐఎం లో చదవడం, ఆ దారులు వదిలి ఎన్ఎల్పి ట్రైనర్ గా ప్రొఫెషన్ షిఫ్ట్ అయ్యి పేరు తెచ్చుకోవడం… వంటివి కాదు శరత్ ప్రత్యేకతలు, జ్ఞానాన్ని వివేకంతో, వివేచనతో జీవితానికి అప్లయి చేయడం తెలియడమే వాడి అసలైన విశిష్టత – అంటాడు అర్జున్. తాగినప్పుడు తత్వవేత్తలా మాట్లాడుతుంటాడు.
ఇప్పుడు కూడా బాగా డ్రింక్ చేసే ఉన్నాడు గానీ, పోలీసులతో జాగ్రత్తగా, మయూరతో మురిపెంగానూ మెసలడం మాత్రం ఆ తాగుడు వల్ల మాత్రం కాదు. అసలు వాడి తాగుడికి కారణమైన నెమ్మీ మాత్రం బెంచి మీద నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోనుంది.
“ఆడపిల్ల అంటే మయూర లా ఉండాలి. అంత ఒద్దికగా అంత పద్ధతిగా,” అని నాయనమ్మ తెగ మెచ్చుకునేది; “అబ్బో మీ నెమ్మీ ఫాషన్స్ అన్నీ రేపటివే. కనీసం ఇరవై ఏళ్ళు ఎడ్వాన్స్ గా ఉంటాయి,” అని తను వేసుకునే అల్ట్రా మోడెర్న్ డ్రెస్సులు చూసి అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. రెండూ నిజమే.
గజగజ వణికించే చలిలో తెల్లవారు జామున కోనేట్లో మునకలేసి, తడిబట్టలతో శివాలయం చుట్టూ అది ప్రదక్షిణలు చేస్తుంటే అమ్మ మురిసిపోతూ, నన్ను చచ్చే చివాట్లు పెడుతూ ‘నెమ్మీని చూసి నేర్చుకోవే’ అనేది. అది కార్తీక సోమవారం ఉదయాన; అదే సాయంత్రం కాలేజీలో దేవుడు లేనేలేడని ప్రసంగించి, పరమ నాస్తికురాలిలా బల్ల గుద్ది వాదించి ఫస్ట్ ప్రైజు ఏగరేసుకు పోయేది. ఈ రెండూ కూడా నిజమేనా అనిపించేది.
నాణేనికి రెండు ముఖాలవి అనేవాడు శరత్; కాదు, ఒకే మనిషి- రెండు నాల్కలు అనుకునేదాన్ని ఒక్కోసారి. నా ప్రాణసఖి గురించి అలా అనుకోడం నాకే నచ్చక, చంచలమైన చిన్నపిల్ల మనస్థత్వంలే అని చప్పున సర్దుకునేదాన్ని.
చిలక రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టడం కాదు ప్రేమ అంటే, ఎంచుకున్న గూటికి ఎగరనివ్వడం- అనేది నెమ్మీ, అర్జున్ తో పెళ్ళి గురించి ఎత్తితే. ఎందుకో ఉక్రోషమొచ్చేది నాకు, అంటే మేమంతా కలుగుల్లో, బోనుల్లో ఇరుక్కుపోయి, కూరుక్కుపోయి కునారిల్లుతున్నామా అని.
చీమలబారు మధ్యలో వేలితో తుడిచేది, తుడిచిన చోట అవి గొల్లుమంటుంటే వాటికి వినబడేలా నవ్వేది. సిపాయిలు కవాతు చేస్తుంటే విసుగ్గా చానల్ మార్చేసేది. క్రోటన్ తోటలూ… బోన్సాయ్ బ్రతుకులు అని అర్థమొచ్చేలా ఏదో కవిత కూడా రాసింది అప్పట్లో.
ఆ holier-than-thou మాటలే నాకు నచ్చేవి కావు. నా శుభ్రత, ఒబ్బిడి, ప్లానింగ్ – ఓసీడీ వంటి రోగంగా చూడటం కష్టమేసేది. నీళ్లలో బ్రతకాలంటే చేపలానే ఉండాలి, నేను ఈదను, ఈత నేర్చుకోను అంటే ఎలా కుదురుతుంది!
“ఎలా ఉండాలి, ఏది పద్ధతి, అది కూడదు, ఇది చెడు – అంటూ ఎప్పుడైనా, ఎవరికైనా చెప్పిందా తను, మనంతట మనమే ఏదో ఊహించుకొని, ఆపాదించుకుంటే ఎట్లారా మిథూ…” అన్నాడొకసారి శరత్.
అంతేలే…
‘పెళ్లిళ్లు వద్దు, సంసారాలు చేయొద్దు… అని నేను అనట్లేదే. నాకు సరిపడదు అంటున్నానంతే…’ అనేగా నెమ్మీ అన్నది కూడా.
ఇన్స్‌పెక్టర్ లోపలికి రావడంతో ఆలోచనల్లోంచి బైటబడ్డాను. అర్జున్ వైపు చూసాను. ఏం మాట్లాడకుండా అభావంగా కూర్చున్నా, ఓ కంట నెమ్మీనే చూస్తున్నాడు. వాడిలో పొంగుతున్న లావాలు.. గుండె అగాధాల్లోకి జారుతున్న అవలాంచీల గజిబిజి నాకు తెలుస్తూనే ఉంది. అయినా, “నాయినా పిగ్మిలియన్, ముందు ఇక్కడ్నుంచి బైటపడే పని చూడు,” అన్నాను కొంచెం కటువుగా. తల విదిల్చి లేచి ఇన్స్‌పెక్టర్ దగ్గరకి వెళ్ళాడు.
ఇంటికి తీసుకెళ్తామని అర్జున్ రెక్వెస్ట్ చేస్తున్నాడు ఇన్స్‌పెక్టర్ ని. చాటుగా డబ్బు కూడా ఇచ్చినట్టున్నాడు. బహుశా అది చాలక కాబోలు అతను బెట్టు చేస్తున్నాడు, కేసు కట్టాల్సిందే అంటూ.
నేను శరత్ కి కాల్ చేసాను. మొదటి రింగ్ కే లిఫ్ట్ చేసి “మిథూ, అర్జున్ ఎలా ఉన్నాడు?” అడిగాడు శరత్. అన్నాళ్ళ తర్వాత వచ్చిన మయూర మీద లేదు తన ధ్యాస, అర్జున్ గురించే కంగారంతా. నిట్టూర్చి, క్లుప్తంగా విషయం చెప్పాను. నా ఫోన్ కట్ చేసిన రెండు నిమిషాల్లో సీన్ మారిపోయింది. హఠాత్తుగా పోలీస్ స్టేషన్ పరిసరాలన్నీ అతివినయాన్ని అందిపుచ్చుకున్నాయి. వచ్చే ఆ నాలుగు డబ్బులూ వదులుకున్నానే అనే దాచేస్తే దాగని బాధ ఉన్నా, ఇన్స్‌పెక్టర్ మాకు నెమ్మీని అప్పగించి కారు దాకా వచ్చి మరీ మాకు వీడ్కోలు చెప్పాడు. శరత్ ఎవరితో మాట్లాడాడో గానీ, బాగానే పనిచేసిందది పోలీసాయన మీద. దండం దశగుణ భవేత్ అని కాసేపు వినోదించొచ్చుగానీ, అవేం పట్టించుకునే పరిస్థితిలో లేం మేము. బయటకు వచ్చాక ఏం చేయాలో తోచనట్లు నిలబడ్డాడు అర్జున్. వాడి మొహం చూస్తే ఆ కొద్దిసేపట్లోనే పదేళ్ళు పైబడినట్లు ఉన్నాడు.
“నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. పొద్దున్నే వద్దువు గాని,” అని తనకి ‘బై’ చెప్పేసి, నెమ్మీ ని తీసుకొని కారులో ఇంటికొచ్చేశాను. వచ్చేటప్పటికి 3.30 అయింది. కాసేపట్లో తెల్లారిపోతుందేమో.
ఇల్లు, పరిసరాలు ఏమీ పట్టలేదు గానీ, గదిలో మిషిక ఫోటోల వంకే చూస్తుండిపోయింది మయూర చాలాసేపు.
“ఇది మిషి రూమ్ రా నెమ్మీ. అది పుట్టినప్పుడు మొదట ఎత్తుకుంది నువ్వే కదా. ఇప్పుడది నార్త్ లండన్ కాలేజియేట్ స్కూల్లో ఐబీ మిడిల్ ఇయర్స్ ప్రోగ్రాం చేసేంత ఆరింద అయిపోయింది…” మురిపెంగా చెప్పాను. తల చిన్నగా ఊపింది కాబట్టి విన్నదని అర్థం చేసుకున్నాను.
“స్నానం చేసి బట్టలు మార్చుకో నెమ్మీ,” అంటూ నైట్ డ్రెస్ ఇవ్వబోయాను. వద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది.
“ఏమన్నా తింటావా, తాగుతావా,” ఫ్రిజ్ దగ్గరకు వెళ్తూ అడిగాను. మళ్ళీ తల అడ్డంగా ఊపింది. ఇంకేం మాట్లాడకుండా బెడ్‌రూం లోకి తీసుకెళ్ళాను. పక్కన పడుకుని దుప్పటి ఇచ్చాను. మౌనంగా దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి ముడుచుకుని పడుకుంది. కంటి నిండా నిద్రపోయి ఎన్నో యుగాలయినట్లు క్షణాల్లో నిద్రపోయింది.
నాకెలా నిద్ర పడుతుంది, ఎన్నో ప్రశ్నలు మూగి తల చుట్టూ రొద పెడుతుంటే.
నెమ్మీ కంటే ఓ పిడికిలెత్తు నేను, నా కంటే రంగు బాగా తక్కువ, తనది చామనఛాయ. కానీ, దానికి ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. అది అందుకునే ప్రేమలేఖలు, ప్రపోజల్స్ కి లెక్కేలేదు. మయూరని ‘కన్వల్జివ్ బ్యూటీ…’ అంటూ కాలేజీ గోడ మీద ఎవడో రాశాడు, దాని అర్థమేమిటో మాకెవ్వరికీ తెలియకపోయినా, అదే ముద్దు పేరు ఖాయమయ్యింది తనకి. తన విషయానికొస్తే, దాని ఆశలు, కలలూ అవి ఎలాంటివో, అసలు సాధ్యపడేవో కావో ఎవరికీ అర్థమయ్యేది కాదు. కాసేపు మోడలింగ్ అనేది. కానీ అందుకు తగ్గ ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నట్లు ఉండేది కాదు. అనుకోకుండా ఏదన్నా ఒక పెద్ద ఆఫర్ వచ్చి రాత్రికి రాత్రి స్టార్ అవుతానని మాత్రం నమ్మేది.
చదువు, ఉద్యోగం, ఈ లోపు శరత్ తో పెళ్లి- నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. అర్జున్ కూడా జాబ్ లో జాయినయ్యాడు, తిరుపతిలో పోస్టింగ్. ఇన్ని మార్పులొచ్చినా మేము నిలవనీరు, మయూర మాత్రం సెలయేరు అన్నట్టే చలాయించేది. మయూర పెళ్లికి నో అన్నాక కొత్తగా తాగుడు మొదలెట్టాడు అర్జున్. ఇంతలో మయూర నాన్నగారు హఠాత్తుగా చనిపోయారు. తల్లిలేని నెమ్మీకి ఆయనే సర్వస్వం. ప్రవాహానికి ఎదురీది, అనుభవాలతో రాపాడి, జీవితంతో తలపడే తెగువ తనకి తండ్రి ఇచ్చిందే, ఆయన పోయాక దాని ప్రపంచం తల్లకిందులైపోయింది. అంకుల్ తో మాకూ ఎంతో అనుబంధం, అర్జున్ కైతే ఇంకాస్త ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో మయూరకి మరింత దగ్గరయ్యాడు అర్జున్. ఆ దగ్గరితనం వల్లనో, పరిస్థితుల కారణంగానో పెళ్లికి ‘ఓకే’ చెప్పింది మయూర.
అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరిగితే మంచిది, పోయిన వాళ్లకి సద్గతులు కూడా అంటూ పెద్దలు పూనుకోవడంతో వెంటనే పెళ్లయ్యి, కాపురం తిరుపతిలో. అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యిందని తర్వాత అర్థమయ్యింది. అన్నీ షేర్ చేసుకునే అర్జున్ ఎక్కువ చెప్పుకున్నది లేదు. వాళ్లు విడిపోవడం కాదు, అర్జున్ తో తెగతెంపులు చేసుకొని మయూర వెళ్లిపోయింది. ఎటు వెళ్లిందీ? ఎవరితో పోయింది? అసలు ఉందా…లేదా… అవేమీ తెలియవు ఎవ్వరికీ. మయూర తరఫు బంధువులైతే అర్జున్ మీద కేసు పెట్టారు. ఆ కేసు నుంచి అర్జున్ ని బైటపడేసి, తిరుపతి నుంచి వైజాగ్ కి ట్రాన్స్ ఫర్ చేయించడానికి తన పరపతి వాడాడు శరత్. కానీ, అర్జున్ తాగుడినైతే మాన్పించలేకపోయాడు. శరత్ మాటే పెడచెవిన పెట్టినవాడు, నా మాట వింటాడా. ఒకటా రెండా… పదిహేనేళ్లు. నాకు కాన్పు కష్టమై, సీరియస్ అయినప్పుడు వచ్చింది నెమ్మీ. పసిగుడ్డుని పదిలంగా పొత్తిళ్లలో పట్టుకొని, “దీనికన్నీ శరత్ పోలికలే, నాన్న పోలికలొస్తే అమ్మాయికి అదృష్టం అంటారు, మరి మా నాన్న పోలికలు వచ్చిన నాకే అదృష్టం పట్టింది…” అంది నవ్వుతూ. తనకి పెళ్లై అప్పటికి నెల కూడా కాలేదు. అదే దాన్ని చివరిసారి చూడ్డం, మాట వినడం.
అనస్తీషియా మత్తు వదిలి, మళ్ళీ కళ్లు తెరిచేటప్పటికి నెమ్మీ తిరుపతి వెళ్లిపోయింది. పాప నా ప్రపంచమంతా నిండిపోయాక, కొన్నాళ్లు వేరే విషయాలు అంతగా పట్టించుకోలేదు నేను. బహుశా ఆ తర్వాత మరో నెలన్నర లోపే మయూర వెళ్లిపోయిందని కబురు. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక్కో కథ, మయూర గురించి – ఎవరో దర్శకుడితో ఉంటోందని ఒకసారి. కాదు, లండన్ వెళ్లిందని మరోసారి; ఎవరో పెద్ద వ్యాపారవేత్తని చేసుకుందని, ఏదో ఇండస్ట్రీ పెట్టిందని ఇంకోసారి. వాటిల్లో ఎంత నిజముందో తెలీదు. ఆ వ్యవహారంలో అర్జున్ కి సంబంధం ఉంది కాబట్టే ఆ మాత్రం పట్టించుకున్నానేమో. అర్జున్ ని శరత్ వైజాగ్ మార్పించాక, మళ్లీ ఇద్దరం కలిసి పుస్తకాలు చదువుకోవడం, చిన్నప్పటిలా గంటలు గంటలు వాటి గురించి చర్చించుకోవడాలు- అంతే. మా మధ్య మయూర ఊసు ఎప్పుడూ రాలేదు. అలాగని తనని అర్జున్ ఏ క్షణమూ మరిచింది లేదని అనిపిస్తోంది.
** **
కోనేరు గట్టు మీద కూర్చుని ఒక్కో రాయి విసురుతున్నా నీళ్ళలోకి.
దూరంగా నడుము లోతు నీళ్ళలో ఈదుతూ కలువలు కోస్తోంది మయూర.
“కోసింది చాలు, ఇక వచ్చేయ్,” విసుక్కుంటున్నా నేను.
“ఎన్నైనా చాలవు నాకు, ఇంకా ఇంకా కావాలి,” అరుస్తూ చెప్తోంది మయూర. కలువ పూల ఆకులు, తీగలు, పైకి తేలుతున్న వేర్లు వాటి తో పైకి వస్తున్న బురద.. పూవు పట్టుకుని తను లాగినప్పుడల్లా బురద పైకి లేచి తన మొహం మీద చిమ్ముతోంది. “నెమ్మీ” పిలుస్తున్నా అందనంత దూరం వెళిపోయింది.
దూరంగా నీళ్ళలో మయూర అందమైన రూపం, అస్తమిస్తూ కూడా నారింజ రంగులో మెరుస్తున్న సూర్యుడు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు ఉంది. ఎవరో పక్కన కూర్చున్నట్లు చూసాను. అర్జున్! ఎప్పుడొచ్చావన్నట్లు చూసాను. అతను నావైపు చూడట్లేదు. వెనక దాచుకున్న చేతిని ముందుకు చాపాడు. పెద్ద కలువ పూవు అతని చేతిలో. తెల్లగా వెన్నెలతో పోటీపడుతున్నట్లుంది ఆ మెరుపు. పూవున్న చేతిని నవ్వుతూ ముందుకి చాపాడు. మయూర చూసినట్లే చూసి తలతిప్పుకుంది. పకపకా నవ్వుతూ కొత్త పూలకోసం పరిగెడుతోంది. కోనేరులో పైకి తుళ్ళుతున్న బురదలోంచి, మొక్కల చిక్కుల్లోంచి.. అలా అలా తేలి పోతున్నట్లు నడుస్తోందామే. మయూరా ! అర్జున్ పిలుస్తున్నాడు. తెల్లని కలువపువ్వు పట్టుకున్న అతని చేయి మయూర దాకా వెళ్ళింది. ఇదేంటి అర్జున్ చేయి అంత పొడుగ్గా ఉంది??
హటాత్తుగా కలువపూల కొమ్మల్లోంచి పెద్ద పాము. శరీరమంతా అందంగా కళ్ళుమాత్రం ఎర్రగా.. ఉన్నట్లుండి మయూరని చుట్టేసింది. కిలకిలా నవ్వుతున్న మయూరని బురదలోకి లాగేసింది.
అర్జున్ అర్జున్ .. అరుస్తోందామె. కానీ, చేయి చాస్తున్నా అర్జున్ చేయి పట్టుకోవట్లేదు. ఇంతలో పాము ఉన్నట్లుండి పెద్దది అయిపోయింది. పైకి లేచింది. వళ్ళంతా కలువపూల మచ్చలు.. అదేంటి ఇప్పటిదాకా నేను చూసినవి పూలు కాదా.. మయూర ఆడుకుంటున్నది పాముతోనా…?
నెమ్మీ… నెమ్మీ… గట్టిగా అరుస్తున్నా.. ఈ లోపే మయూర కోనేటి బురదలోకి వెళిపోయింది.
** **
నెమ్మీ.. గట్టిగా అరుస్తూ లేచాను. నా వళ్ళంతా తడిచిపోయింది. కళ్ళుతెరిచి పక్కకి తిప్పి చూశా. ప్రశాంతం గా నిద్రపోతోంది. అదే ప్రశాంతత. చిన్నప్పుడు ఎండాకాలం మేడమీద పడుకుని నక్షత్రాలు లెక్కపెట్టుకుంటున్నప్పుడు పక్కన ఇలానే పడుకునేది. ఉక్రోషం వచ్చి గట్టిగా కుదిపి లేపేదాన్ని; ‘ఎంత అందం మిస్ అవుతున్నావో చూడు’ అనేదాన్ని. ‘అంతకన్నా అందమైన కలలు కంటున్నా,’ అనేది. ‘కలలు ఎప్పటికీ నిజం కావు, వాస్తవంలో బతుకవే…’ అని నేనంటే నవ్వేసేది. ‘నా కలలు ఎలా నిజం వేసుకోవాలో నాకు తెలుసు’ అన్నట్లు ధీమాగా ఉండేదా నవ్వు.
మెసేజ్ వచ్చినట్లు ఎలర్ట్ వినగానే తొంగిచూసా ఫోన్ లోకి. అర్జున్ మేసేజ్: ‘డోంట్ బీ జడ్జిమెంటల్’ అని ఓ స్మైలీ ఒక నమస్కారం ఎమోజీ పెట్టాడు. ‘ఎలెహ్…’ అంటూ పళ్ళుకొరుకుతున్న ఎమోజీ పెట్టి లేచి బయటకి వచ్చాను. బాత్రూం లోకి దూరి చల్లటి నీళ్ళు మొహం మీద పోసుకుంటుంటే ఇంతలో కాలింగ్ బెల్!
తలుపు తీయగానే శరత్ ని చూసి ఒక్క సారిగా హాయిగా అనిపించింది. మూడు రోజుల కాన్ఫరెన్స్ కోసం ముంబై వెళ్ళాడు. సాధారణంగా లాంగ్ వీకెండ్స్ ఇలా ప్లాన్ చేసుకుంటాడు. మయూర విషయం తెలిసాక కాన్సిల్ చేసుకుని వచ్చేసాడు.
నేనేదో చెప్పబోయే లోగా లోపలికి వెళ్ళాడు ‘నెమ్మీ’ అని పిలుస్తూ. తన వెనకే గదిలోకి వెళ్లాను. ‘నెమ్మీ’ అని శరత్ పిలిచిన పిలుపుకి దిగ్గున లేచిన మయూర శరత్ ని కావలించుకొని బావురుమంది. ఎన్ని సంవత్సరాల దుఃఖమో కరిగి కదిలి కనలి కనలి ఏడుస్తోంది. తను ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచిన తన తండ్రి కంటే శరత్తే తనని బాగా అర్థం చేసుకున్నాడని దాని ఫీలింగ్. నెమ్మదిగా బయటకి వచ్చేసి అర్జున్ కి కాల్ చేసాను. మొదటి రింగ్ కే లిఫ్ట్ చేసి.. ‘వస్తున్నా’ అని పెట్టేసాడు.
“నీకు అస్సలు నిద్ర పట్టలేదనుకుంటా మిథూ”, అన్నాడు శరత్ హాల్లోకి వచ్చి నన్ను దగ్గరకి తీస్కొని.
“ఇది మళ్లీ ఎందుకు వచ్చినట్లు.. “నాలో నేను అనుకున్నట్టు శరత్ తో అన్నాను.
రాత్రి ఉన్న కంగారు, ఆందోళన లేదిప్పుడు నాకు.
“మిథూ!” శరత్ మొదలు పెట్టాడు, “నువ్వు అర్జున్ వైపు నిలబడి మయూరని తూచడం మానేయి. తండ్రి చనిపోయి నిస్సహాయంగా ఉన్న మయూరని, ఇష్టం కొద్దీనో, బాధ్యత అనుకున్నాడో చేసుకున్నాడు కానీ, ఆ తర్వాత మామూలు భర్త లానే ప్రవర్తించాడు వాడు కూడా. మయూర రెక్కలు కత్తిరించి తన గూట్లో ఉంచుకోవాలి అనుకున్నాడు. మయూర అంతకంతకీ ఎదురు తిరిగింది. వాడు అణచాలని, అదుపు చేయాలనీ అనుకున్న ప్రతీసారీ తను ధిక్కారంతో బదులిచ్చింది. అహానికి పోయి వాడు నెమ్మీని అంతకంత గాయపరిచాడు”.
ఇవేవీ నాకు తెలియక కాదు. బహుశా ఎక్కడో ఓ మూల మయూర మీద గెలవాలని ఉందేమో నాకు చిన్నప్పటి నుంచి. నాకు లేని ధైర్యం, నేను చూపలేని చొరవ తనలో ఉండడం కారణమా? పెళ్లయ్యాక మయూర, అర్జున్ పడుతున్న ఘర్షణ మాకు తెలిసినా ప్రత్యేకంగా నేనైతే ఒక స్నేహితురాలిగా చేసింది ఏమీ లేదు. నేనూ నా భద్ర లోకం. నా భాషలో ఆయితే దాన్ని ఒద్దిక, కుదురు అంటారేమో. మంచి భర్త, నా బంగారు తల్లి, ఇల్లు, కారు, నగలూ, పార్టీలు, ప్రమోషన్లు… నాకు లేనిదేముంది. మయూర పతనం తెలిసినప్పుడల్లా “నాకు ముందే తెలుసు” అనుకోవడంలో బహుశా మరింత గెలుపు రుచి చూశానా?
శరత్ అన్నీ గమనిస్తూ కూడా నన్ను ఔననడానికి, కాదనడానికీ కూడా ప్రయత్నించలేదు. నాకు ఏదన్నా చెప్పడానికి, నా ఆలోచనలు సరిదిద్దడానికి కూడా చూడలేదు. అవును మరి… బయట ఇలాంటి కౌన్సిలింగులకి తనకి లక్షలు వస్తాయి కదా అని నిష్టూరపడ్డాను.
మళ్ళీ ఆలోచనలకి అంతరాయంగా కాలింగ్ బెల్ మోగింది, అర్జున్ వచ్చాడు. లోపలికి రాగానే హాల్ లో మా ఇద్దర్నీ ఒకసారి చూసి, ఏం మాట్లాడకుండా నెమ్మీ గదిలోకి వెళ్ళాడు.
** **
ఆ తర్వాత ఏమయ్యింది?
ఏం చేయాలని అర్జున్ లోపలికి వెళ్లాడు? ఏం కానుందని శరత్ ఊహించాడు? ఏం జరగాలని నేను ఆశించాను? అసలు మయూరకి ఏం కావాలి?
ఈ ప్రశ్నలేవీ ఇప్పుడు- ఈ ఐదేళ్ల తర్వాత, మయూర ఆచూకీ మళ్లీ తెలియకుండా పోయిన ఈ నాలుగేళ్ల తర్వాత – అస్సలు రెలవెంట్ కావు.
భూకంపం ధాటికి కొంకర్లు తిరిగిన పట్టాల మీద ప్రయాణాన్ని వంకర అని వంకలు పెట్టడం మానేసినందుకేమో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉన్నాను. అర్జున్ ఒంటరితనం, మయూర మరో మోసం, శరత్ నిర్లిప్త నిశ్శబ్దం – ఇప్పుడు నన్ను వేధించడం లేదు.
‘కలిసుందాం’ అని మయూరకి ఆ రోజు నచ్చజెప్పి అర్జున్ తనని పొదువుకొని తీస్కెళ్తున్నప్పుడు – ‘ఎన్నాళ్లూ…’ అనుకున్నాను.
ఆ తర్వాత అర్జున్ ని అదే మాట అడగకుండా ఉండలేకపోయాను.
“ఏంటి ఎన్నాళ్లు?” అడిగాడు అర్జున్.
“అదే మీరు కలిసి ఉండేది ఎన్నాళ్లూ అని…” కొంచెం కసిగా అన్నాను.
“నువ్వు విలువ ఇవ్వాలంటే మా కాపురానికి కావల్సిన టైమ్ ఫ్రేమ్ ఎంత?” అని అర్జున్ ఎదురులాడినప్పుడు ఒళ్లు మండిపోయింది.
“చావండి, ఇద్దరూ ఏ ఏట్లోనో, నాకెందుకు…” అన్నాను.
“మయూరని పసుపుపచ్చ పలుపుతాడుతో కట్టేయాలని చూసిన అప్పటి అర్జున్ కాడు, వాడిప్పుడు లేడు,” అన్నాడు శరత్ తర్వాత ఓ సారి.
చెడు దారుల్లో తిరిగి, చేదు అనుభవాలు చూసిన నిన్ను సహించి, క్షమించి, ఉద్ధరిస్తున్నాను అనే ఆధిక్యం అర్జున్ చూపించలేదు; ‘రాయిని ఆడది చేసిన రాముడివా…’ తరహా అలవిమాలిన అణకువతో మయూర ముడుచుకుపోనూ లేదు. ఒకరిని ఆశ్రితులుగా మిగిల్చి, మరొకరు ఉదారులుగా ఎక్కువ చేసేలా- ‘అతని పంచన చేరింది’; ‘ఆమె ఆదరణలో ఒదిగాడు’ వంటి సగటు మెహర్బానీలు లేవు వాళ్లు కలిసి ఉన్న ఆ ఏడాదిలో వెనకటి వాటిని తవ్వుకొని, తలుచుకొని, అర్జున్ తో పంచుకోవాలని మయూర ప్రయత్నించలేదు, అర్జున్ అడగనూ లేదు. మయూర వచ్చేసిందని సినిమా ఫక్కీలో మందు బాటిళ్లు కుప్పబోసి తగలెట్టనూలేదు. నేను చూడలేదు గానీ, ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకున్నారనిపించింది కూడా.
అయితే నా ‘నెమ్మీ’ నాకు తిరిగిరాలేదు, లేదా తను తనలా ఉండటాన్ని బహుశా నేను తీసుకోలేకపోయానేమో. తాను అర్జున్ తో ఉన్న ఆ ఏడాదిలో రెండు సార్లు కలిసామంతే. ‘పెళ్లి అనే చట్రంలో నేను ఇమడలేను…’ అని నెమ్మీ అన్నప్పుడు, నా వంటి భద్రజీవుల్ని వెక్కిరిస్తుందేమో అని ఉక్రోషపడ్డాననుకుంటా. అందుకే తరగని ప్రేమబంధం మాది, పెళ్లితో మరింత బలపడిందని ప్రకటించడానికన్నట్టు శరత్ ని ఎక్కువ అతుక్కుపోయి ఉండేదాన్ని, తన ముందు అప్పట్లో. ప్రదర్శనకి, నిరూపణకీ పూనుకుందంటే అది ప్రేమ కాదని లోన కెలుకుతున్నా, నెమ్మీని ఓడించాలనే పంతంలో ఇంకేమీ పట్టలేదు నాకు. పదిహేనేళ్లకి తను తిరిగి వచ్చినప్పుడు కూడా గెలుపోటములకి సంబంధించిన ఆలోచనలు వదల్లేదేమో నన్ను.
“నిజంగా అర్జున్ మీద అక్కరతోనే మయూరని ద్వేషించావా?” అని ఓ రోజు యథాలాపంగా అడిగినట్టు అడిగాడు శరత్.
ప్రశ్న కాదది చరుపు. శరత్ కళ్లలోకి చూడలేకపోయాను. విలువలని నేను నమ్మినవి, మయూరకి మూసలని తోచవచ్చని తొలిసారిగా తెలియజెప్పిన చరుపు. భద్రమని నేను కోరిన బతుకు, తనకి బందిఖానా కావచ్చని తట్టేలా చేసిన చరుపు!
మేల్కొలుపు వంటి చరుపు!
“మయూర ఏమైనా అక్కడికి వచ్చిందా…” అని ఒకట్రెండు సార్లు అర్జున్ ఫోన్ చేసినప్పుడు మళ్లీ కొత్త స్నేహాలు మొదలెట్టిందని అర్థమైనప్పుడు, చెప్పాచేయకుండా ట్రిప్పులు వెళ్తోందని తెలిసిపోయినప్పుడు – అంతకుమునుపులా అర్జున్ మీద ఆపేక్ష, నెమ్మీ మీద అక్కసు కలగలేదు.
మయూరానికి ఇది మరో వానమబ్బుల కాలం అనుకున్నానంతే!
** ** **
చాల రోజుల తర్వాత మళ్లి చదవాలి అనే తృష్ణ మీ రచనతో కలిగింది. చదువుతున్నంత సేపు ఏవో పరిచయాలు పక్కనే మాట్లాడుతున్నట్లనిపించింది . హత్తుకునే రచనకు అభినందనలు, ఇంకా ఆసిస్తున్నాము మీ నుంచి
కిరణ్ గారు… Thank you so much
చాలా ఆలోచింపచేసే కధ . బావుంది
Sir.. Thank you
మీరు రాసిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ ఇది. భిన్న నేపథ్యాలు, భిన్న వ్యక్తిత్వాలు కలిగున వ్యక్తుల అనుభవాలు భిన్నంగా వుంటాయి. వాటిని బట్టే ఎవరి ప్రాపంచిక దృక్పథం వారికి వుంటుంది. Not to tresspass that personal space is the call of the day. నాకెంతో ఇష్టమైన మీనుండీ మంచి కథ రావడానికి కారణం అయిన అఫ్సర్ అన్నయ్యకి ధన్యవాదాలు.
శ్రీధర్.. thank you so much
చాలా బాగుందండీ స్వేచ్ఛ ను పంజరాలు బంధించలేవు మానసిక విశ్లేషణ కూడా చక్కగా వివరించారు
Thanks అండి
మనస్సు కోతిలాంటిది ,నిలకడ ఉండదు .అది నిజం .మన మనసునే అర్థం చేసుకోవడం కష్టం .ఒక్కోసారి అర్థం చేసుకున్నప్పుడు అద్దంలో చూసుకోవడం కష్టం. ఇంత దగ్గరగా కాకపోయినా ఇలాంటి Ant and the Grasshopper సన్నివేశాల్ని చూసి వున్నా.మంచి కథ ఉమా.
Madam.. thank you so much
నిజంగా మనకు ఏమి కావాలో తెలిసి, మనకు నచ్చినట్టుగా
జీవించగలితే ఎంత బావుణ్ణు. తరచి లోపలికి చూసుకుంటే…
అందరమూ అసంతృప్తులమే. బహుశా మిథు కు ఈ సత్యం
అర్థమైందనుకుంటాను… చివరలో. స్వేచ్చా విహంగము
మయూరకు, పూర్తిగా భిన్న ధ్రువం ఈమె. జాలి పాడాల్సింది ఎవరిని
చూసో చెప్పకనే చెప్పారు రచయిత్రి. హ్యాట్సాఫ్…
Thanks andi
చక్కని రచన.. ఆస్వాదిస్తూ చదివాను చాలా కాలం తర్వాత. కథ చదవడం పూర్తి చేసాక రచయిత పేరు చూసా.. ఇంతకుముందు ఉమ గారి రచనలు చదివానేమో, చాలా సంతోషంగా అనిపించింది.
సునీత గారూ.. థాంక్స్ అండి
మన రోజువారీ జీవితంలో మనుష్యులే , ఇంకొంచం ఉదాత్తంగా మీ కథలో కనబడ్డారు. వకీల్ సాబ్ -2 with tag line judge-mental 😀 లా అనిపించింది. 4 కారెక్టర్స్ అక్కర్లేదు అనుకుంటా ఉమ , ఒక calm and successful protective husband with drinking problems and a bitchy windy female who can say no to social augmented protective life should have been as good as your 4 person persona. అపుడు కదా కథ కథలా కాకుండా రియాలిటీ లా ఉండేది. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి రాసే కథ ఒకటి మీ నుండి కావాలి మీ ఈ రీడర్ కి 😁. బాగుంది . Soft reading as always. ఒక చిన్న కోరిక ఏమిటంటే సేం charecters with role play అంటే nlp కి మయూర the windy girl తన వెర్షన్ లో కథ చెప్తున్నట్లు ,drinker boy gets our protaganist herioine and …… ఇలా మళ్ళీ రాయగలరా , మీ వాక్యంలో అలా చదవాలన్న కోరిక జస్టిఫికేషన్ అక్కడ ఎలా conclude అవుతుంది అని.