మరచిపోలేని ట్రెక్కింగ్ దారుల ప్రయాణం ….

యాత్రా స్మృతి-2

దో యాత్రానుభవం.

తుంగనాథ్, కార్తీక్ స్వామి ఆలయాలను చూడడం కోసం చేసిన ట్రెక్కింగ్ లో మాకు ఎదురైన అనుభవాలు, అక్కడి కొన్ని విశేషాలు. వీటికంటే కష్టమైనవి అధిరోహించిన వారు ఉంటారు, ఇంతకన్నా గొప్ప అనుభవాలను,అనుభూతులను మూట కట్టుకున్నవారూ ఉంటారు. అయినా ఇది మాకు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే రోజువారీ నడక, ఇంటి పనులు తప్పించి మరేవిధమైన అనుభవం లేని, ఏభైలకు దగ్గరవుతున్న మా ఇద్దరి అక్క చెల్లెళ్ళం ఒకరికొకరం తోడుగా ఓ పది రోజుల పాటు మాదే రాజ్యం అన్నట్టుగా కలిసి చేసిన ప్రయాణం ఇది. ఒక నెల రోజుల వ్యవధిలో అనుకుని మొదలు పెట్టిన ప్రయాణం.

ఎన్నో రకాల ట్రెక్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో చేరి వారితో పాటు ప్రయాణించవచ్చేమో కానీ మేం ఇద్దరమే వెళ్లడం, పూర్తిగా మా సమయాన్ని మా చేతుల్లో ఉంచుకోవడం,ప్రతీ చిన్న ఆనందాన్ని పంచుకోవడం…ఇవీ మాకు కావలసినవి.ఎవరి కుటుంబాలతో, జీవితాలతో సమయం పరిగెడుతున్నప్పుడు ఇలాంటి ఆటవిడుపులు నిజంగా చాలా అవసరం అనిపిస్తుంది అందులో కాస్త ఇబ్బందులు ఎదురైనా సరే.

ఉత్తరాఖండ్ చాలా సురక్షిత ప్రదేశం కాబట్టి కొన్ని భయాలని పక్కన పెట్టొచ్చు. అలాగే మేం చేయవలసిన ట్రెక్కింగ్ కూడా కాస్త సులభమైనదే.కానీ కొన్నిటికి మేం ముందే సిద్ధపడి బయలు దేరాం.ఎక్కడా ఉండడానికి ముందుగా  హోటల్ రూమ్స్ గానీ,ప్రయాణించడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ను గానీ బుక్ చేసి ఉంచుకోలేదు.ఇలాంటి ప్రయాణాల్లో అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఎలా ప్రయాణిస్తారో అలా ప్రయాణించడం లోనే ఉంది అసలు ఆనందం అంతా.చిన్న చిన్న సందేహాలు,భయాలు లేకపోలేదు.కానీ పొందబోయే ఆనందాల ముందు అవెంత అనిపిస్తుంది.

పర్యాటకులిగా కంటే యాత్రికులిగా ఉండడమే మా ఇద్దరి ఇష్టం.గమ్యస్థానాన్ని చేర్చే దారిలో ఎదురైన ప్రతీ అనుభవం మా కోసమే అనుకుని సిద్ధపడిన వాళ్ళం. అలా మొదలైంది మా ప్రయాణం.

ఢిల్లీ నుండి ఋషికేష్

ప్రయాణానికి కావలసినవన్నీ ఒక బేక్ పేక్ , స్లింగ్ బేగ్స్ లో సర్దుకున్నాం. ప్రయాణిస్తున్నది మార్చ్ నెలలో కాబట్టి మరీ విపరీతమైన చలి ఉండకపోవచ్చు.అయినా హిమాలయ పర్వత ప్రాంతాలలో వాతావరణాన్ని ముందుగా ఊహించలేం. నాలుగైదు జతల బట్టలతోపాటు తేలికపాటి ఉలెన్ స్వెటర్, జాకెట్, గ్లోవ్స్, రైన్ కోట్ , ట్రెక్కింగ్ షూస్ ; జ్వరానికి, vomiting sickness తగ్గించడానికి మెడిసిన్స్; టార్చెర్స్, పవర్ బ్యాంక్స్ (ఎత్తైన చలి ప్రదేశాలలో త్వరగా సెల్స్ డిస్చార్జ్ అవుతాయి కాబట్టి )ఇలా అన్ని ప్యాక్ చేసుకున్నాం. మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.

ఢిల్లీలో  ఎయిర్ పోర్టు లో ఉదయం 11:30 ప్రాంతంలో కలుసుకున్న మేం ఇద్దరం మెట్రోలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అప్పటికి టైం మధ్యాహ్నం పన్నెండుం పావు. హరిద్వార్ కి వెళ్ళవలసిన మా ట్రైన్ మూడున్నరకి. మా బ్యాక్ ప్యాక్స్ తగిలించుకుని తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీదికి వచ్చాం .మా భుజాల మీద ఉన్న బ్యాగ్స్ ఆ కాసేపటికే బరువు అనిపించడం మొదలెట్టేయి. మోసినప్పుడు కదా తెలుస్తుంది అనుకుని నవ్వుకున్నాం. రైల్వే క్యాంటీన్లో ఏదో భోజనం అయింది అనిపించి అక్కడే లేడీస్ వెయిటింగ్ హాల్లో కూర్చుని రెండున్నర వరకు ఎన్నో కబుర్లు… చేయబోయే ప్రయాణం గురించి కొన్ని, కుటుంబంలో విషయాలు కొన్ని. కలిసి ప్రయాణం చేసేది  ఇద్దరు అక్కాచెల్లెళ్ళు    అయితే కబుర్లకి కొదవా? సమయం ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు.

హరిద్వార్ వెళ్లవలసిన మా జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏడవ నెంబర్ మీదకి వస్తుందని తెలిసింది .మళ్లీ బ్యాగ్స్ తీసుకుని బయలుదేరాం. ఆ విధంగా ఢిల్లీ నుండి హరిద్వార్ రాత్రి 7:45 కి చేరుకున్నాం.

ఆధ్యాత్మిక స్థలం కాబట్టి వచ్చిపోయే జనాలతో గొప్ప రద్దీగా ఉంది హరిద్వార్ స్టేషన్ .ఉండవలసినంత శుభ్రత మాత్రం లేదు. స్టేషన్ నుండి వెలుపలికి వచ్చేసరికి ఎదురుగా ఓ పెద్ద శివుని విగ్రహం ధ్యానముద్రలో కనిపించింది. స్టేషన్ నుండి బస్టాండ్ ఐదు నిమిషాల నడక దూరంలోనే. ఇంచుమించుగా ప్రతి అరగంటకి రిషికేష్ వెళ్లడానికి బస్సులు ఉంటాయని విన్నాం. హరిద్వార్ నుండి గంటన్నర సమయం పడుతుంది .అంటే రాత్రి 9:30 కి గాని రిషికేష్ చేరుకోలేం. పెద్ద పెద్ద ఆటోలు షేర్డ్ వి తిరుగుతున్నాయి గానీ వాటికంటే బస్సు ప్రయాణం క్షేమం అనిపించింది. దారి కూడా ఎలా ఉంటుందో తెలియదు. అరగంట అలా నిరీక్షించాక రాత్రి 8:15కి రిషికేష్ వెళ్లవలసిన బస్సు దొరికింది.ప్రయాణిస్తూ ఉంటే తెలిసింది  రాత్రి పూట బస్సు ప్రయాణమే మంచిది అని.ఆ చీకట్లో పరిసరాలు కనిపించలేదు గానీ హరిద్వార్ ఊరు దాటాక నిర్జన ప్రదేశంలో నుండి బస్సు ప్రయాణిస్తూ ఉంటే కిటికీలోనుండి చల్లగా తగిలిన  అడవి చెట్ల వాసన తెలుస్తూనే ఉంది.కొన్ని సార్లు మనం ప్రయాణం చేసే దారులు ఎంత సురక్షితం అని తెలిసినా మన జాగ్రత్తలు మనం తీసుకోవలసిందే.

సరిగ్గా గంటంపావులో అంటే 9:30 కి రిషికేష్ చేరుకున్నాం. అక్కడ టీటీడీ వారి ఆంధ్ర ఆశ్రమంలో ఉండాలని ముందు నుండి అనుకోవడం వల్ల బస్టాండ్ కి కాస్త దూరంలో ఉన్న ఆ ఆంధ్ర ఆశ్రమానికి ఆటోలో వెళ్ళాం .కానీ అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కామన్ టాయిలెట్స్ ఉన్న రూమ్స్ ఉన్నాయి గాని అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్న రూమ్స్ లేవు అని, అవి పూర్తిగా పాడైపోయాయి, మేము ఉండే విధంగా లేవు అని అక్కడి కేర్ టేకర్ చెప్పాడు. ఏం చేయడం? అప్పటికే రాత్రి పది దాటింది .ఎంత లేదన్నా కాస్త అలసిపోయి వున్నాం.   మళ్ళీ మా బ్యాగ్స్ తగిలించుకుని ఆ పక్కనే ఉన్న మరో కాటేజి కి వెళ్ళాం. అక్కడా అదే పరిస్థితి. పక్కనే ఒక చిన్న లాడ్జ్ కనిపించింది.

ఆ రాత్రి ఉండడానికి ఓ చిన్న గది, దానికి శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం ఉంటే చాలు. వేయి రూపాయలకి ఆ లాడ్జిలో ఓ గది తీసుకున్నాం. సామాన్లు రూంలో పడేసి పక్కనే ఉన్న రెస్టారెంట్లో భోజనం చేశాం. వీలైనంత త్వరగా ఉదయం బస్సు పట్టుకుని రుద్రప్రయోగ బయలుదేరాలని అనుకుని తిరిగి రూమ్ కి వచ్చి నిద్రపోయాం.

ఋషికేష్ నుండి రుద్రప్రయాగ

రిషికేశ్ లో ఉదయం చాలా త్వరగా మూడున్నరకే నిద్రలేచాం. ఎప్పుడెప్పుడు బయలుదేరుతామా… ఎంత త్వరగా హిమాలయాలను దగ్గరగా చూస్తామా అని మాకు చాలా ఉత్సాహంగా ఉంది .ఇక్కడ నుండి మా ప్రయాణం బస్సు లేదంటే షేర్డు జీప్స్ లోనే సాగుతుంది .సుమారు ఉదయం 4:30 ప్రాంతంలో రిషికేష్ బస్టాండ్ కి చేరుకున్నాం. రిషికేష్ నుండి మేము ముందుగా చేరవలసింది ఊఖిమఠ్ కి.కానీ దానికోసం నేరుగా వెళ్లే బస్సులు దొరకడం కష్టం .అందుకు ముందుగా రుద్రప్రయాగ చేరుకుని అక్కడి నుండి ఊఖీమఠ్ వెళ్లాలి అని నిర్ణయించుకున్నాం.

చార్ ధామ్ యాత్రలు అంటే కేదార్ ,బద్రి, గంగోత్రి ,యమునోత్రి ఆలయాలు ప్రజల దర్శనార్థమై తెరుచుకున్న  తర్వాత నుండి యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం బస్సులో మా తోటి ప్రయాణికులు ఎక్కువగా స్థానికంగా ఉండేవారే .బహుశా కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే యాత్రికులు ప్రత్యేకంగా వెహికల్స్ బుక్ చేసుకుని వెళుతూ ఉండడం కూడా దీనికి కారణం ఏమో.

మా బస్ 5:30కి. ఇంకా టైం ఉండడంతో కాస్త వేడిగా టీ తాగి బిస్కెట్స్ తిన్నాం.రుద్రప్రయాగ చేరడానికి నాలుగు గంటల కాలం పడుతుంది. బస్సు మధ్యలో అంత త్వరగా ఆపమనీ, ఎవరైనా వాష్ రూమ్స్ కి వెళ్లాల్సిన వాళ్లు త్వరగా వెళ్లి రమ్మని కండక్టర్ చెప్పేడు. ఇలాంటి ప్రయాణాల్లో ఆడవాళ్ళకి ఇదో పెద్ద ఇబ్బంది. హై వే ల  దగ్గర ఉన్న హోటల్స్ లేదంటే ధాబా ల దగ్గర కాస్త శుభ్రంగా ఉన్న వాష్రూమ్స్ ఉంటాయి కానీ ఇలాంటి బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ సరియైన సదుపాయాలు, సౌకర్యాలు మాత్రం ఉండవు. అయినా తప్పదు కాబట్టి ఆ బస్టాండ్ లో కొత్తగా కడుతున్న పెయిడ్ వాష్ రూమ్స్ ని ఉపయోగించుకున్నాం. సరిగా ఉదయం 5:30 కి మా ప్రయాణం మొదలైంది .ఈ ప్రయాణం తీన్ ధారా, దేవప్రయాగ ,శ్రీనగర్ ల మీదుగా సాగుతుంది .దేవప్రయాగ వరకు అలకనంద,  భాగీరథి నదులు  సంగమించిన గంగ కనిపిస్తుంది. దేవప్రయాగ ఈ రెండు నదుల సంగమ స్థానం. దేవప్రయాగం నుండి రుద్రప్రయాగవైపు ప్రయాణిస్తుంటే అలకనంద నది మన పక్కనే ప్రయాణిస్తూ కనిపిస్తుంది ఓసారి దూరంగా…. మరొకసారి దగ్గరగా .నీరు మాత్రం చాలా తక్కువగా కనిపించింది, కాస్త నిరాశనీ కలిగించింది.  

ఉదయం 9:45కి రుద్రప్రయోగ చేరుకున్నాం రుద్ర ప్రయాగ మందాకిని, అలకనంద నదుల సంగమ స్థానం .ఇక్కడ ప్రసిద్ధమైన కోటేశ్వరాలయం ,సంగమ స్థానాలను మా తిరుగు ప్రయాణంలో సమయం ఉంటే చూడాలని అనుకున్నాం.

రుద్ర ప్రయాగలో ఊఖీమఠ్ కు వెళ్ళవలసిన వాళ్ల కోసం బజార్లో ఓ పెద్ద చెట్టు దగ్గర బస్సులు ఆగుతాయి .అక్కడే వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి కావలసిన షేర్డ్ జీప్స్ కూడా ఉంటాయి. సాధారణంగా స్థానికంగా ఉండేవారు వారి పనుల కోసం తక్కువ దూరాలు ప్రయాణించడానికి వీటినే ఎక్కువగా వాడతారు.

ఊఖీమఠ్ వెళ్లడానికి ఉదయం 11:30 కి గాని బస్సు లేదని తెలిసింది. అక్కడికి గంటన్నర ప్రయాణమే కాబట్టి షేర్డ్ జీపులో అయితే త్వరగా చేరుకోవచ్చు అనుకున్నాం. అక్కడే ఉన్న ఒక చిన్న హోటల్లో ఆలూ  పరాఠాలు తిన్నాం.మళ్లీ మేం ఊహించిన ఇబ్బందే….వాష్ రూం సమస్య. ఆ పరిసర ప్రాంతాల్లో మాకు దీనికోసం ఎటువంటి సదుపాయం కనిపించలేదు. ఆఖరికి ఆ హోటల్ వాళ్లని అడిగితే మీద ఫ్లోర్లో  వాళ్లు వాడుకునే బాత్రూం ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఇటువంటి ప్రయాణాల్లో ఇవన్నీ తప్పదు. ఒక్కళ్ళమే తిరగాలి అంటే ఇంకెన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాలో అనిపించింది.  ఆ విధంగా రుద్రప్రయాగ నుండి 10:15 ప్రాంతంలో ఊఖీమఠ్ వెళ్లడానికి గాను ఒక షేర్డు జీపులో బయలుదేరాం.

*

స్వాతి పంతుల

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు