మన కథల్లో ఇంత ఇంగ్లీష్ అవసరమా?

కొన్ని కథల్లో సంభాషణలు తెలుగుపదాలు, ఆంగ్లపదాలు కలగలిపి కనిపిస్తాయి. ఈ సంభాషణల్ని చదివితే పాత్ర తెలుగులోంచి ఆంగ్లంలోకి ఉన్నట్లుండి వెళ్లటం, ఆ పాత్రకి తెలుగు రాకపోవటం వల్ల అనిపించదు.

తెలుగు కథల్లో, ఆంగ్లపదాల వాడకం ఎప్పటినుంచో ఉంది. అయితే అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటోంది,  ఏ ధోరణిలో ఉంటోంది అనేది ఒక ప్రశ్న.  ఆ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నంలోంచి పుట్టుకొచ్చిందే ఈ వ్యాసం.

కథలో భాగాలు మూడు. కథ పేరు, పాత్రల వెనుక జరుగుతున్న కథ, పాత్రల మధ్య సంభాషణ.

కథల పేర్లు:  

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కథాసాహితి వారు 1990 నుంచి 2015 వరకూ ప్రచురించిన  కథల సంపుటాల్లోని 351 కథల పేర్లు,  అంతర్జాల పత్రికల్లో ప్రారంభ సంచిక నుంచి 2017 వరకూ వచ్చిన సారంగ 187 కథలు, ఈమాట 532 కథలు; మొత్తం కలిపి  1070 కథల పేర్లని పరిశీలించాను. వీటిలో పూర్తిగా ఆంగ్లపదాలతో పేరు ఉన్న కథలు 94. ఆంగ్లపదాలు, తెలుగు పదాలు కలగలిపి పేరు పెట్టబడిన కథలు 61. మొత్తం 155. 1070 కథల్లో వీటి శాతం 14.48. ఈ పేర్లని మూడు రకాలుగా రాయటం జరుగుతోంది.

మొదటిది-శీర్షికకి పూర్తిగా ఆంగ్లపదాలు వాడటం. ఇందులో రెండు పద్ధతులు. ఒకటి-ఆంగ్లలిపి వాడటం. ఉదాహరణ-The Professional. రెండు-తెలుగు లిపి ఉపయోగించటం. ఉదాహరణ-డీ హ్యూమనైజేషన్.  మూడు-కథ పేరును ఆంగ్ల, తెలుగు లిపి-ఈ రెండిట్లోనూ రాయటం. రాఫెల్(Raffle), ఫ్యూగ్(Fugue).

రెండోది-ఆంగ్లపదాలు, తెలుగు పదాలు కలిపి వాడటం. దీనిలో రెండు ధోరణులు. ఒకటి-ఏ భాషకు చెందిన పదాలను, ఆ భాషలోనే రాయటం. నిదర్శనం-http://www/యంత్రరాక్షసి.com. రెండు-ఉభయ భాషాపదాలకు తెలుగు లిపి ఉపయోగించటం. దృష్టాంతం-మిథ్య ఎగ్జిబిషన్.

మూడోది-ఒక ఆంగ్లపదాన్ని, మరో తెలుగుపదంతో సంధించి కొత్తపదప్రయోగం చేయటం. ఉదాహరణ-Breakrooమోపాఖ్యానము: డబ్బింగ్ ఢమాల్, గూగోళ జ్ఞానం.

పై వాటికి తోడుగా ఒక కథకు, తెలుగు పదాలతో ఒక పేరూ-ఆంగ్లపదాలతో ఒక పేరూ పెట్టిన అరుదయిన సందర్భం ఒకటి కనపడింది. కథ పేరు-రాదె చెలీ! నమ్మరాదే చెలీ!(అనబడు) త్రిబుల్ స్టాండర్డ్స్.

కథ పేరుకి పూర్తిగా తెలుగు పదాలని వాడి, వాటిని ఆంగ్లలిపిలో రాసిన సందర్భాలు, నాకు తటస్థించలేదు.

U.F.O., వి. డి. ఆర్. ఎల్., Walmart లాంటి కథలకి, కథ ఇతివృత్తం దృష్ట్యా ఆ పేర్లే సరయినవి. వాటికి వాడుకలో ఉన్న తెలుగు పదాలతో పేరు దొరకటం కష్టం. అందువల్ల అలాంటి కథలకి ఆంగ్లపదాలతో పేరు తప్పనిసరి. అయితే ఈ అనివార్యత, బెనిఫిట్ ఆఫ్ డౌట్, బ్లాక్ ఇంక్, రిసెర్చ్, సారీ జాఫర్, కొలీగ్స్, వాల్ పోస్టర్, లైబ్రరీలో, ఐ హేట్ మై లైఫ్, లివింగ్ టుగెదర్ లాంటి కథలకి వర్తించదు. అంతే కాదు, ఆంగ్లపదంతో కథలకి రాఫెల్, ఫ్యూగ్ లాంటి పేర్లని పెట్టి; అదే పదాలని Raffle, Fugue అని తెలుగు లిపి, ఆంగ్లలిపి రెండిట్లోనూ రాయటం ఎందుకో బోధపడలేదు.

పాత్రల నేపథ్యంలో ఆంగ్లపదాల వాడకం:

ఇంతవరకూ నేను చదివిన అతి కొద్ది తెలుగు కథల్లో ఇంగ్లీషు పదాలు ఎక్కువ శాతం ఉన్న కథ  గతసంవత్సరంలో ప్రచురించబడ్డ పునరావృతమ్. ఈ కథలో ఉన్న మొత్తం పదాలు 2560. వాటిలో ఇంగ్లీషు పదాలు 978. కచ్చితంగా 38.20 శాతం. ఈ కథలో ఇన్ని ఆంగ్లపదాలున్నా, కథకి ఆంగ్లపదాలతో పేరు ఉండకపోవటం; ఇతివృత్తానికి పూర్తిగా సరిపడేలా తెలుగుపదాల్తో పేరు ఉండటం గమనార్హం.

పై కథతో పోలిస్తే గతనెలలో వచ్చిన ఇడ్లి, వడ, సాంబార్ అనే కథలో ఆంగ్లపదాల సంఖ్య  ఎక్కువ. ఈ కథలో ఉన్న మొత్తం పదాలు 2451. వీటిలో ఇంగ్లీషు పదాలు 1243. నిక్కచ్చిగా వీటి శాతం 50.71.

పాత్రల వెనుక కథలో ఆంగ్లపదాలు ఎలా వాడబడుతున్నాయో, పునరావృతమ్ కథ నుంచి తీసుకున్న ఈ వాక్యసమూహం ద్వారా తెలుసుకోవచ్చు.

“ఫిమేల్ మెల్లిగా కళ్ళు మూసుకొని మేల్ చెంపకు చెంప ఆనించింది. మేల్ తనను చుట్టుకున్న ఫిమేల్ చేతులను అల్లాగే ఉంచి మెల్లిగా ఫిమేల్ పెదవుల మీద పెదవులు ఆనిస్తూ…ఇంకేదో ఎక్స్‌ప్రెషన్ మేల్ మొహంలో. ఇంటిమసీతో వారి ముఖాల్లో శరీరాల్లో మార్పులు, వారి ముఖాల్లో ఏవో ఫీలింగ్స్ కొత్తకొత్తగా. హ్యూమన్స్‌లో ఇన్ని అనుభూతులు ఉంటాయా? ఇప్పుడెవరూ అలా లేరే. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ కెమికల్ స్ట్రక్చర్… నాలోనూ ఏదో తెలియని ‘ఎమోషన్?’. యువర్ బాడీ టెంపరేచర్ ఈజ్ ఎలివేటెడ్ స్లైట్‌లీ. ఇట్ ఈజ్ ఎ నార్మల్ రియాక్షన్. నార్మల్ అయితే నాకు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇన్నేళ్ళలో నాకు తెలిసిందల్లా ప్లెజంట్ రియాక్షన్స్, అన్‌ప్లెజంట్ రియాక్షన్స్. అవి కూడానూ పూర్తిగా రెగ్యులేట్ చేయబడ్డాయి. ఏదైనా రియాక్షన్ కొంత తీవ్రంగా ఉంటే అటెండర్ రోబో వచ్చి డ్రగ్ ఒకటి అడ్మినిస్టర్ చేస్తుంది. ఇప్పుడు నాలో ఉన్నది ఏ ఎమోషన్? నాకు సరిగ్గా అర్థంకావడం లేదు. తీవ్రమైన అనుభూతి ఇలా ఉంటుందా?”

ఆంగ్లపదాల చోటులో తెలుగు పదాలను ప్రతిక్షేపిస్తే, పై వాక్యసమూహం ఇలా మారుతుంది.

“స్త్రీ మెల్లిగా కళ్లు మూసుకొని పురుషుడి చెంపకు చెంప ఆనించింది. పురుషుడు తనను చుట్టుకున్న స్త్రీ చేతులను అలాగే ఉంచి మెల్లిగా స్త్రీ పెదవుల మీద పెదవులు ఆనిస్తూ…ఇంకేదో అనుభూతి పురుషుడి  మొహంలో. దగ్గరితనంతో వారి ముఖాల్లో శరీరాల్లో మార్పులు, వారి ముఖాల్లో ఏవో భావాలు కొత్తకొత్తగా. మనుషుల్లో ఇన్ని అనుభూతులు ఉంటాయా? ఇప్పుడెవరూ అలా లేరే. మానవశరీరం ఒక సంక్లిష్ట రసాయనిక నిర్మాణంనాలోనూ ఏదో తెలియని ‘భావోద్వేగం?’. నీ శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతోంది. ఇదొక సహజసాధారణమయిన ప్రతిస్పందనా? సహజసాధారణమైనదయితే నాకు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇన్నేళ్లలో నాకు తెలిసిందల్లా సంతోష లేదా బాధాకరమయిన ప్రతిచర్యలు. అవి కూడానూ పూర్తిగా నియంత్రించబడ్డాయి. ఏదైనా ప్రతిచర్య కొంత తీవ్రంగా ఉంటే అటెండర్ రోబో వచ్చి మందు ఒకటి ఎక్కిస్తుంది. ఇప్పుడు నాలో ఉన్నది ఏ భావోద్వేగం? నాకు సరిగ్గా అర్థంకావడం లేదు. తీవ్రమైన అనుభూతి ఇలా ఉంటుందా?”

కథలోనుంచి ఉదాహరణకు తీసుకున్న అసలు వాక్యసమూహంలో 42 ఆంగ్లపదాలు ఉన్నాయి. వాటి బదులు తెలుగు పదాలు వాడటంతో, చివరకు 2 ఆంగ్ల పదాలే మిగిలాయి.  అటెండర్ కు సరయిన తెలుగు పదం నాకు తోచలేదు. రోబో బదులు మరమనిషి అని రాయవచ్చు. కథ ప్రవాహం దెబ్బ తింటుందనిపించింది.

విస్తృతంగా ఆంగ్లపదాల వాడకం, ఆంగ్లపదాల్తో కూడిన వాక్యప్రయోగం కాకుండా ఇడ్లి, వడ, సాంబార్ కథలో నేనింతవరకూ చూడని ఒక మరో కొత్త ధోరణి కనపడింది. అది- ఆంగ్లపదాల్తో కూడిన ఒక వాక్యాన్ని తెలుగు లిపి, దానికెదురుగా కుండలీకరణాల్లో ఆంగ్లలిపిలో మళ్లీ రాయటం. తెలుగు లిపిలో ఉన్న తతిమ్మా కథంతా చదవగలిగిన పాఠకుడు, ఆంగ్లపదాలతో ఉన్న వాక్యాలు తెలుగులిపిలో ఉన్నా చదవగలడు. అలాంటప్పుడు, వాటిని రెండు లిపుల్లో రాయటం పునరుక్తమే అవుతుంది. ఇది కథ నిడివిని, దాంతో పాటు కథ చదివే సమయాన్ని పెంచింది.

ఈ రకంగా రాయబడ్డ వాక్యాలు ఒకటి రెండు కాదు. ఈ కథలో ఏకంగా 103 ఉన్నాయి. వీటిలో వాడబడ్డ పదాలు 839. మొత్తం కథలో ఉన్న 2526 పదాల్లో వీటి శాతం 16.58. కథలో వాడిన 1243 ఇంగ్లీషు పదాల్లో వీటి శాతం 33.70. ఈ వాక్యాలనన్నిటినీ రెండు లిపుల్లో కాకుండా, ఏదో ఒక లిపిలోనే రాసి ఉంటే కథ మీద సుమారుగా 419 ఆంగ్ల పదాల బరువు తగ్గి ఉండేది.  కథలో మిగిలిన 824 ఆంగ్లపదాల శాతం, 50.71 బదులు 32.62 అయేది.

పునరావృతమ్ కథ, వచ్చే శతాబ్దాల్లో వైజ్ఞానిక ప్రగతిని దృష్టిలో సుదూర భవిష్యత్తులో, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయో ఊహించి రాసిన కథ. అందువల్ల, ఈ కథలో ఆంగ్లపదాల ప్రయోగం విస్తృతంగా ఉంది.

వాడుకలో ఉన్న సమానార్థక తెలుగు పదాలు లేవనుకోవటానికి ఇడ్లి, వడ, సాంబార్ కథలో ఇతివృత్తం ఒక శాస్త్రానికి చెందినది కాదు.  ఈ కథలో, కథనం సాఫీగా నడవటానికి అవసరమైనది శాస్త్రీయ లేదా సాంకేతిక పదజాలం కాదు. కథలో వాడిన అనేక ఆంగ్లపదాలు; డార్క్, డార్క్ నెస్, డోర్, కీస్, సన్ రైజ్, సన్ సెట్, వెదర్ ఫోర్ కాస్ట్, పంచ్, ఇట్స్ ఇనఫ్, బౌల్, మాచ్ బాక్స్, సడెన్ ఫ్లాష్; లాంటివి ప్రాచుర్యంలో తెలుగులో సమానార్థక పదాలు ఉన్నవే. అలాగే, హౌ కెన్ యు ఏవేన్థింక్ లైక్ దట్ లాంటి వాక్యాలు కూడా సులభతెలుగులో రాయగలిగినవే. అందుకని, పునరావృతమ్ కథ విషయంలో అనేక ఆంగ్లపదాలు వాడటానికి కనపడిన సహేతుకత, అనివార్యత ఈ కథలో గోచరించలేదు.

కథల్లో సంభాషణలు:

కొన్ని కథల్లో సంభాషణలు తెలుగుపదాలు, ఆంగ్లపదాలు కలగలిపి కనిపిస్తాయి. ఈ సంభాషణల్ని చదివితే పాత్ర తెలుగులోంచి ఆంగ్లంలోకి ఉన్నట్లుండి వెళ్లటం, ఆ పాత్రకి తెలుగు రాకపోవటం వల్ల అనిపించదు. ఒక దృష్టాంతం-డిసెంబర్ 29, 2016 సారంగలో వచ్చిన తూర్పు వాకిటి పశ్చిమం లోని ఈ వాక్యాలు.

  1. “నేను పెద్దవుతున్నానని నువ్వు పదే పదే అంటావు కానీ, you really don’t mean it?!”
  2. ప్రపంచంలోని ఏ ప్రదేశంలో ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలు కావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని కంటారని, అందుకే నేను మన ఇంట్లో పుట్టానని, నా రూపురేఖలు మీ ఇద్దరి నుంచి, మీ ఇద్దరి కుటుంబాల నుంచీ వొచ్చాయనీ చెప్పింది…and it makes sense!”  అంది.
  3. “By the way, ఇదంతా జరగటానికి కొన్ని స్పెషల్ ఫీలింగ్స్ అవసరం!”

ఒకప్పుడు, ఆంగ్లపదాలు తెలుగులిపిలో కనపడేవి. ఇప్పుడు, తెలుగు పదాలు ఆంగ్లలిపిలో కూడా కనపడుతున్నాయి. ఉదాహరణకి నవంబర్ 17, 2016 సారంగలో వచ్చిన సాయేనా? కథలోని ఈ వాక్యాలు.

“Idae samayam. Mana samayam. Oosulaadukunae samayam. Inkaa aedainaa chaesesukunae mana daina samayam. Neeto panchukovaali konni…Including…LOL”

దీనికి ఇంకాస్త భిన్నంగా డిసెంబర్ 1, 2016 సారంగలో వచ్చిన డేవిడ్ కథలో సంభాషణ ఆంగ్లపదాల్తోనే కాకుండా, వాటికి తెలుగు అనువాదం కూడా తెలుగు పదాల్లో ఉంది. ఈ ఉదాహరణలు చూడండి.

  1. ‘పారెట్‌ఐ ‌వాంటు ఆస్క్ ‌సమ్‌థింగ్‌’ (‌నిన్నొకటి అడగాలి)
  2. ‘విల్‌‌యు బి మై గాళ్‌’ (‌నా అమ్మాయిగా ఉంటావా?)

పై ఉదాహరణలన్నీ చూస్తే, అర్థమయేది ఒకటే. తెలుగు కథల్లో, ఆంగ్లపదాల వాడకం, కొంతవరకే తప్పనిసరి అనీ, కొన్ని కథల్లో చాలావరకూ తప్పించుకోదగినదనీ. అవసరమయినది, అవసరం లేని చోట ఆంగ్లపదాల వినియోగం తగ్గించాలనే ఆలోచన. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే, తెలిసిన తెలుగు పదాలను వాడటం, తెలియని తెలుగు పదాలని తెలుసుకుని పదసంపద పెంచుకోవడం, వీలున్న చోట వాడుకలో సులభంగా ఇమిడేలా ఉండే తెలిసిన తెలుగు పదాలతో కొత్త పదబంధాలని తయారు చేసుకోవటం-ఇవే మార్గాలు.

*

టి. చంద్రశేఖర రెడ్డి

2 comments

Leave a Reply to నవీన్ కుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వ్యాసం పరిశోధన చేసి రాసినరు సార్.

  • మంచి వ్యాసం. మంచి పరిశోధన. అయితే, అసంపూర్తిగా ముగిసినట్లనిపించింది. ఇంత పరిశోధన ద్వారా ఇంకొన్ని కోణాల్లోనూ inferences రాబట్టి ఉండొచ్చుననిపిస్తోంది. ఇడ్లి, వడ,సాంబార్ కథలోని సంభాషణల విషయంలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
    నావి మూడు సందేహాలు (మూడూ ఒకటే కావొచ్చు కూడా).
    1. నేను మాట్లాడేటప్పుడు అన్ని మాటలూ తెలుగులోనే మాట్లాడను. ఎదుటి వాళ్లకు ఇంగ్లీషు తెలియదని లేదా అర్థం కాదని అనిపించినపుడు మాత్రమే consciousగా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఆఫీసులో గానీ బయటగానీ ఎక్కువ సమయం ఇంగ్లీషు లో మాట్లాడేవాళ్ళు (ఉదా:సాఫ్ట్వేర్ ఉద్యోగులు) ఆఫీసయ్యాక కూడా సంభాషణల్లో ఇంగ్లీషు వాక్యాలు వాడడం చాలాసార్లు గమనించాను. వ్యాసంలో ఉదహరించిన తూర్పు వాకిటి పశ్చిమం కథలోలాగా. మనం నిత్యజీవితంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు కథల్లో అవే సంభాషణలు ప్రతిఫలిస్తే కలిగే నష్టం ఏమిటి? పైపెచ్చు, పాఠకుడు ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది కదా.
    2. ఒక కథను పట్టణాల్లో ఉండే తెలుగు యువతీయువకులను దృష్టిలో ఉంచుకుని రాసినపుడు వాళ్ళ సంభాషణల్లోని భాష ఎలా ఉండాలి? చాలా మాటలు తెలుగులోకి అనువదించేవిగానే ఉంటాయి కానీ కథను వాళ్లకు రీచ్ అయ్యేలా చెయ్యడంలో భాష పనిముట్టుగానో అడ్డంకిగానో పనిచేయదంటారా?
    3. కథ వాతావరణం బట్టి సంభాషణల్లోని భాష ఎందుకు మిక్స్ అయి ఉండకూడదు? చిత్తూరు నేపథ్యంలో రాస్తే తమిళం, అనంతపురం లోని రాయదుర్గం నేపథ్యంలో రాస్తే కన్నడ పదాలు విరివిగా దొర్లుతున్నపుడు అమెరికన్ తెలుగు సమూహాల నేపథ్యంలోనో బెంగళూరులో పనిచేసే తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నేపథ్యంలోనో రాసినపుడు ఇంగ్లీషు పదాలు దొర్లడంలో అనౌచిత్యం ఏముంది?

    ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు