మనిషి పరిచయం – 3

మౌనం మనిషిని పునర్నిర్మిస్తుంది. మౌనం మనిషిని ఉద్యుక్తుణ్ణి చేస్తుంది. కూలిపోతున్న మనిషిని తపస్సు వంటి మౌనం పునఃసృష్టిస్తుంది.

3

వేదిక వెనుక పిలిచిన తల్లులందరికీ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసిండ్లు నిర్వాహకులు. ఎవరో ఒక కార్యకర్త వచ్చి ” అమ్మా.. వెళ్ళమ్మా భోచేయండి ” అని అడిగాడు చాలా ఆదరణతో.

కాని సుభద్రకు అసలు తిండి దిక్కు ధ్యాసే పోవడంలేదు. ఆకలీ లేదు. మనసంతా పచ్చి పుండులా ఉంది. చేతిలోని మొగిలి ఫోటో ఫ్రేం ను చేతి సంచీలో పెట్టుకుంటూ.. ” నాకు ఆకలిగా లేదు నాయనా.. కొన్ని మంచినీళ్ళిప్పిస్తావా బాబూ ” అంది దీనంగా సుభద్ర. ఆ యువకుడు పరుగెత్తుతున్నట్టు నడుచుకుంటూ వెళ్ళి చటుక్కున ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్ళు తెచ్చిచ్చాడు. వాటిని గటగటా తాగి..” నాయనా నేను విశాలాంధ్ర పుస్తకాల దుకాణానికి పోవాలె.. ఆటో ఒకటి మాట్లాడ్తావా ” అంది ప్రాధేయపూర్వకంగా.

” ఎందుకమ్మా.. అసలు మీరెక్కడికి పోవాలె ”

” నేను జనగాం పోవాలె బిడ్డా. కాని నేను విశాలాంధ్రకు పోయి కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలె.. అక్కడినుండి బస్సుల జనగాం పోత”

” ఇక్కడికి మిమ్మల్ని ఎవ్వరైతే తీసుకొచ్చిండ్లో వాళ్ళే మీ ఊళ్ళె మీ ఇంటిదగ్గర దించుతరు గదా ” అన్నడా యువకుడు.

” చెప్పిండతను. కాని నేనే వద్దన్న బిడ్డా. నేను పుస్తకాలు కొనుక్కోవాలెగదా”

” ఏం పుస్తకాలు కావాలె మీకు ”

” అసలు ఈ మన తెలంగాణా ఈ రకంగా అట్టుడికిపోతూ.. వందలమంది యువకులు తమ ప్రాణాలను తీసుకూంటానికి కారణమైన ద్రోహం ఎట్ల జరిగింది.. ఈ ఆంధ్రోళ్లు ఎట్ల మనను మోసం చేసిండ్లు.. వజ్రమసోంటి నా కొడుకు ఎంత మనాదిపడి లోపట్లోపల కుమిలిపోతె గట్ల రైలుకెదురుగ ఉరికి ‘ జై తెలంగాణ ‘ అనుకుంట ప్రాణాలు విడిచిండు.. వానిలోపట ఉన్న రంది ఏంటిది.. దుఃఖమేంటిది.. అవన్నీ తెలుసుకోవాలె కొడ్కా.. చదువుత పుస్తకాలను. ఎవలూ అడ్గుతే చెప్పరు గీ విషయాలను. ఒక్క పుస్తకాలే నిజాలను చెపుతై. అక్షరంతోటే ఇగ నా సావాసమంతా. లోకాన్ని తెలుసుకోవాలంటే పుస్తకాలతోనే దోస్తీ చెయ్యాలె ” అంది నిబ్బరంగా.

ఆ యువకుడు నిశ్చేష్టుడై చూసిండామె కళ్ళలోకి. అప్పుడామె అతనికి బీద బట్టలు ధరించిన పేద సరస్వతి దేవతవలె కనిపించింది.

” ఆగండి.. ఒక్క నిముషం ” అని అతను సర్రున ఉరికి రెండు నిముషాల్లో తన హీరో హోండా మోటార్ సైకిల్ ను తెచ్చి ఆమె ముందాపి ” వెనుక మీరు ఎక్కి కూర్చోండి.. నేను తీసుక పోతా విశాలాంధ్రకు ” అన్నాడు.

అతనికి అప్పుడామె ఏదో మహాద్భుతాన్ని చేయబోతున్న సమరశీలురాలిగా కనబడింది. చదువుకూ, జ్ఞానసముపార్జనకూ, తద్వారా పొందే ఆత్మోన్నతికీ వయసుతో సంబంధమే లేదనిపించింది.

పది నిముషాల్లో వాళ్ళిద్దరూ సుల్తాన్ బజార్ లోని బడీచౌడీ విశాలాంధ్ర బ్రాంచ్ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏమి కావాలో కనుక్కుంటూ అక్కడి సేల్స్ మ్యాన్ తో వెదికించి దాదాపు ఓ పది పుస్తకాలు ఇప్పించాడామెకు. ఆమెకు అప్పటికే తెలంగాణా ఊద్యమ పరిచయం వల్లా.. కొడుకు మొగిలి సాంగత్యంవల్ల ఏ ఏ పుస్తకాల్లో తనకు కావలసిన సమాచారం దొరుకుతుందో కొంత అవగాహన ఉన్నట్టర్థమైందతనికి.

మనకు తెలియని మన చరిత్ర ( తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు ) : కె.లలిత, వసంత కణ్ణబిరాన్ , రమా మేలోటే ఇత్యాదులు సంకల పర్చింది.

నా గొడవ : ప్రజా కవి కాళోజీ.

తిరుగబడ్డ తెలంగాణ ( దొరలను దించాం.. నిజాంను కూల్చాం ) : ఇనుకొండ తిరుమలి

సలాం తెలంగాణ : కర్ర ఎల్లారెడ్డి

బత్తిని మొగిలయ్య గౌడ్: కట్టగాని రవీందర్

భూపతి కృష్ణమూర్తి , తెలంగాణ గాంధి.

తెలంగాణా సాయుధ పోరాటం- నా అనుభవాలు : నల్లా నరసింహులు

దేవులపల్లి వెంకటేశ్వరరావు – తెలంగాణ సాయుధ పోరాటం మొదటి భాగం.

బైరాన్ పల్లె పోరాటం : నర్ర భగవాన్ రెడ్డి

పెరియార్ ఇ.వి.జీవిత సంగ్రహం : జయగోపాల్

సలాం హైదరాబాద్ : పరవస్తు లోకేశ్వర్

వొడువని ముచ్చట్లు : ప్రొఫెసర్ జయశంకర్

మొత్తం పన్నెండు పుస్తకాలు. పదమూడు వందల ఇరవై రూపాయలు.

కించిత్తుకూడా తటపటాయించకుండా బొడ్లోనుండి తీసిన బట్ట సంచీలోనుంచి తీసిన చెమటతో తడిచిన నోట్లను చెల్లించింది కౌంటర్లో.

పుస్తకాలను చేతి సంచిలో పెట్టుకుంటున్నప్పుడామె ముఖాన్ని జాగ్రత్తగా గమనించాడతను. ఎంతో ఇష్టమైన జ్ఞాన సంపదను మూటకట్టుకుంటున్నట్టు వెలిగిపోతోందామె ముఖం. సరిగ్గా అప్పుడే బయటికి వస్తూండగా ఒక యువకుడు మొస్స పోసుకుంటూ ఉరికొచ్చాడు వాళ్ళ దగ్గరికి. వస్తూ వస్తూనే ” మీరు మొగిలి అమ్మ కదా ” అని అడిగాడు ఆతురతగా.

” ఔను ” అంది సుభద్ర.

” నేను రాములు యాదవ్.. మొగిలి క్లాస్ మేట్ ను.. హాస్టల్ లో రూం మేట్స్ ము.. వాడు చచ్చిపోయిన తర్వాత అప్ సెటై మా ఊరికి పోయిన . మూడు నెల్ల తర్వాత నిన్ననే వచ్చిన మల్ల కాలేజ్ కు.. అమ్మా.. వాని డైరీలు ఉన్నై నా దగ్గర. ఇదిగోండి. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి.. ప్రతిరోజూ రాసిండు మొగిలి ఈ డైరీలను. మొత్తం మూడు డైరీలు. వీటిలో వాని హృదయముంది . ఇవి మీ దగ్గర ఉండడమే న్యాయం. అవసరం కూడా.” అని గబ గబా ఒక ప్లాస్టిక్ సంచీలో ఉన్న మూడు బౌండ్ పుస్తకాలను ఆమె చేతిలో పెట్టి.. ” నేను కలుస్తానమ్మా.. నాకోసం పోలీసులు వెదుకుతున్నారు ” అని వేగంగా వెళ్ళిపోయాడు వెనుదిరిగి.

సుభద్రైతే అవాక్కయి పోయింది.

ఆ యువకు డూ షాక్ తిన్నాడు. అజ్ఞాత నిర్బంధాలు.. పోలీసుల రహస్య వేట ఎలా కొనసాగుతోందో ప్రత్యక్షంగా చూస్తూ.

ఆ రోజు తేదీ జ్ఞాపకం చేసుకున్నాడా యువకుడు.

పదకొండు సెప్టెంబర్ రెండువేల పదకొండు.

మర్నాడే కెసీఅర్ టి.ఆర్.ఎస్ పక్షాన కరీంనగర్ లో ‘ జనగర్జన సభ ‘ ను నిర్వహించబోతున్నాడు.

హైదరాబాద్ నగరం పేలబోయే ముందు అగ్నిపర్వతంలా ఉంది.

అన్యమనస్కంగానే ఆ యువకుడు సుభద్రను తన మోటార్ సైకిల్ పై కూర్చుండబెట్టుకుని ఇంలీబన్ బస్టాండ్ కు తీసుకెళ్ళి జనగాం బస్సునెక్కించాడు.

ఇక బస్సు కదలబోతూండగా ఏదో తెలియని శూన్యతతో చూస్తూంటే కిటికీ దగ్గర కూర్చుని తన కొడుకును చూస్తున్నట్టే వాత్సల్యంగా చూస్తున్న సుభద్ర అతనికి తన స్వంత తల్లివలెనే అనిపించింది.

అతనికి తల్లి లేదు. చచ్చిపోయింది చిన్నప్పుడే.

సుభద్ర మాత్రం భవిష్యత్తులో ఏదో అద్భుతం చేయబోతున్న మహా మహిళలా కనిపించిందతనికి ఆ క్షణం.

4

రాత్రి ఎనిమిది దాటింది సుభద్ర ఇంటికొచ్చేసరికి.

ఇల్లంతా చీకటి. లైట్ వేసి చుట్టూ చూసింది. అంతా ఖాళీ.

మనసు లోపలా.. మనిషి బయటా.. అంతా ఖాళే.

ఈ ఖాళీ ఎప్పటికైనా నిండుతుందా. శాశ్వతంగా ఇట్లాగే ఖాళీగానే మిగిలి ఒక ఎడారివలె శరీరమంతా.. జీవితమంగా విస్తరించి మిగిలిపోతుందా.

‘ అమ్మా మనిషి ఎప్పుడైనా తన జీవితాన్ని తనే తనకు నచ్చినట్టు నిర్మించుకోవాలమ్మా. ఈ సమాజంలో నువ్వు జాగ్రత్తగా గమనించు.. లేదా నలుగురిని అడుగు.. అయ్యా మీరు మీకు నచ్చిన జీవితాన్నే జీవిస్తున్నారా.? అని. నూటికి తొంబై ఐదు మంది లేదనీ.. బతుకుతెరువుకోసం ఏ అవకాశం దొరికితే దాన్నే ఆలంబన చేసుకుని అలా గాలి ఎటు వీస్తే అటే ఎండిన ఆకు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతున్నామనే చెప్తారు. కాని ఈ జీవితం నాకు నచ్చింది కాదు.. మళ్ళీ ప్రయత్నించి నాకు నచ్చిన నా జీవితాన్ని వెదుక్కుంటాను.. లేదా నిర్మించుకుంటాని.. లేదా సృష్టించుకుంటానని ఏ ఒక్కరూ అనరు. అసలు మనం నిర్దుష్టంగా ఎవరినైనా నువ్వు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు.. ఏ వృత్తిలో జీవించాలనుకుంటున్నావు.. అని ప్రశ్నిస్తే ఎవరూ ఫలానా వృత్తి అని చటుక్కున సమాధానం చెప్పరు. దానిక్కారణం వాళ్లేమి కావాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు స్పష్టమైన గమ్యాలూ, అభిరుచులూ, లక్ష్యాలూ లేవు. జస్ట్ అట్లా గాలివాటంగా జీవిస్తూ పోవడమే.. పైగా దేవుడు ఎవరికి ఏ జీవితాన్నిస్తే వాళ్ళు ఆ జీవితాన్నే జీవిస్తారని కర్మ సిద్ధాంతమొకటి చెప్తారు. ఎవరికేది ప్రాప్తమో అదే దొరుకుతుందని నిట్టూరుస్తారు. కాని తెలివైన, ఆత్మ విశ్వాసం కలిగి తన శక్తిపైన నమ్మకమున్న వ్యక్తి కాస్త ఆలస్యమైనా తాను స్వప్నించిన జీవితాన్నే అంతిమంగా పొందుతాడు. అలసిపోవద్దు. ఓడిపోవద్దు. ధైర్యంగా వ్యూహాత్మకంగా లక్ష్యం వైపే ఒక్కో అడుగు వేస్తూ గమ్యాన్ని చేరాలె. అప్పుడప్పుడు తడబడి పడిపోతే మనిషి తనంతట తానే సంభాళించుకుని లేచి నిలబడాలె పడి లేచే కెరటంవలె. ‘

అట్లా మొగిలి తనతో మాట్లాడుతూంటే ఎంత ధైర్యంగా ఉండేదో.

ఇప్పుడు వాడు లేడు. వెలుగు లేదు.

అసలు తనకు జీవితముందా.. అనిపిస్తోంది.

కాని.. కాని.. మొగిలినే ఒక కనబడని శక్తిగా తనలోకి ఆవాహన చేసుకుని.. ఒక కొత్త జీవితాన్ని రూపొందించుకోవాలె తనిక.. తప్పదు. పడి.. నేలను కరుచుకుని పతనమైన తను లేచి నిలబడాలి. భగవంతుడు ప్రసాదించిన ఈ బ్రతుకును అనేకానేక విధాలుగా తనకు నచ్చినట్టుగా.. సమాజానికి ఉపయోగపడేట్టుగా రూపొందించుకోవాలె.

సాధ్యమౌతుందా తనకు.

ఎందుకు కాదు.

గుండెలను దిటవు చేసుకుని ఇక ఒక కొత్త మార్గంలో నడిచేందుకు అడుగులను సిద్ధం చేసుకోవాలె.. చేసుకోవాలె.. తప్పనిసరిగా చేసుకోవాలె.

నిలకడగా ఎదుట ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని చంకలో ఉన్న పుస్తకాల సంచీని తెరిచి పుస్తకాలను ముందున్న టీపాయ్ వంటి చిన్న బల్లపై పెట్టింది. ప్రక్కనే అప్పుడు మొగిలి క్లాస్ మేట్ రాములు యాదవ్ ఇచ్చిన మూడు డైరీలను ప్రక్కనే పెట్టింది. వెంట తెచ్చుకున్న నాలుగు అరటిపళ్ళను తీసి తినడం మొదలు పెట్టింది.. రెండు తిని వెంట తెచ్చుకున్న నీటి సీసాలోని నీళ్లని తాగింది.

కళ్ళు మూసుకుంది మనసును ఉగ్గపట్టుకునేందుకు.

మౌనం మనిషిని పునర్నిర్మిస్తుంది. మౌనం మనిషిని ఉద్యుక్తుణ్ణి చేస్తుంది. కూలిపోతున్న మనిషిని తపస్సు వంటి మౌనం పునఃసృష్టిస్తుంది.

లోపలినుండి ఏదో ఒక వింతశక్తి నరనరాల్లో ప్రవహిస్తున్నట్టనిపించి.,

కళ్ళు తెరిచి ముందున్న పుస్తకాల్లోనుండి ఒకదాన్ని చేతుల్లోకి తీసుకుంది సుభద్ర.

తెలంగాణా అంతా ఇప్పుడొక అగ్ని గుండం. వలసాంధ్రుల దుష్టపాలనలో, అణచివేతలో, రాజకీయుల దుర్నీతితో , నిస్సిగ్గు నీతిహీన రాజకీయాలతో జుగుప్సాకరంగా మారిన రాజకీయ రంగం భ్రష్టుపట్టి.. చారిత్రాత్మక రెండవ దశ నిర్విరామ అహింసాయుత దీర్ఘకాలిక పోరాటం ఇప్పటికే కెసీఅర్ నాయకత్వంలో 2001 నుండి.. అంటే గత పదకొండేళ్ళుగా నిత్యాగ్నిశిఖలా ప్రజ్వరిల్లుతూంటే.,

ఇక మిగిలింది ‘ డు ఆర్ డై ‘ .. ‘ కెసీఅర్ చచ్చుడో..తెలంగాణా తెచ్చుడో ‘ గా సాగుతున్న పోరాటంలో.,

ఉద్యమం నీరుగారి పోతూండడానిక్కారణం.. ఇంటి దొంగలు.. కోవర్ట్ లు .. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఆంధ్రులకు ఊడిగం చేసే బానిస తెలంగాణీయులు.

కాళోజీ పుస్తకం ‘ నా గొడవ ‘ ఆమె చేతిలోకొచ్చింది.

‘ పుస్తకమంటే.. వివేకవంతుడైన మనిషి చేతిలో అతి శక్తివంతమైన ఆయుధమమ్మా ‘ అన్న మొగిలి మాట ప్రతిధ్వనించి.,

పేజీలను తిరిగేస్తోందామె.

ఒక కవిత వచ్చింది.. శీర్షిక ‘ ప్రాంతంవాడే దోపిడి చేస్తే., ‘ అది 1969 లో ‘ ప్రత్యేక తెలంగాణా తొలి దశ ఉద్యమం ‘ ఉధృతంగా సాగుతూ వందలమంది విద్యార్థులూ, ఉద్యోగులూ ఆంధ్ర పాలకుల అజమాయిషిలో నడుస్తున్న పోలీసుల తూటాలకు పిట్టల్లా రాలిపోతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో 1-5-1969 న వరంగల్లులో జరిగిన అప్పటి ‘ తెలంగాణ ప్రజా సమితి ‘ సదస్సులో వేలాదిమంది సమక్షంలో ప్రజాకవి కాళోజీ స్వయంగా మహోద్వేగంతో చదివినది.

దోపిడి చేసే ప్రాంతేతరులను

దూరందాకా తన్ని తరుముతాం

ప్రాంతం వాడే దోపిడి చేస్తే

ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును

దోస్తే చేస్తం – ప్రాణమిస్తం

ఎంతకు అంత అన్న ధోరణితో

చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది – తెలంగాణమిది

తీరానికి దూరాన ఉన్నది

ముంచే యత్నం చేస్తే తీరం

మునుగును తానే – మునుగును తప్పక

సూటిగా.. ఆవేశపూరితంగా.. ఖచ్చితంగా.. నిర్మొహమాటంగా.. దుఃఖపూరితంగా .. ప్రబోధకంగా కవిత్వం చెప్పడంలో కాళోజి ఒక ఋషి లాంటివాడు.

15 ఆగస్ట్ 1948.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఒక సంవత్సరం. దేశం దేశమంతా మహానందంగా మొట్టమొదటి స్వాతంత్ర్య దినాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఇంకా నిజాం దౌర్జన్యకర పాలనలోనే మగ్గిపోతున్న హైదరాబాద్ అని పిలువబడే తెలంగాణా ప్రాంతం ఇంకా దొరల దోపిడిలోనే కునారిల్లుతున్న సందర్భంలో .. దాదాపు నాలుగు వందలమంది నిజాం సైనికులూ, ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లూ జనగాం తాలూకా బైరాన్ పల్లి , ప్రక్కనే ఉన్న కూటిగల్లు గ్రామాలపైబడి.. విచ్చలవిడిగా.. అమానుషంగా జరిపిన మారణ కాండలో.. ఊరి జనాన్నంతా నగ్నంగా ఒక చోట చేర్చి.. వికృతంగా హింసించి , కిరాతంగా చంపి వందలమంది శవాలను సామూహిక దహనం చేసి.. బైరాన్ పల్లిలో 118 మంది.. కూటిగల్లు లో 30 మంది హతులైన సందర్భంలో .,

అప్పుడు ప్రజాకవి కాళోజీ నిజాం ప్రభుత్వం బనాయించిన కేసుల్లో గుల్బర్గా జైల్ లో శిక్షననుభవిస్తూ.. దుఃఖగ్రస్తుడై రాసి తన బ్యారక్స్ లోపలి ఖైదీలకు వినిపించిన కవిత సార్వజనీనమైనది.. ప్రాసంగికమైనది.. తరతరాలకు అనుసరణీయమైనది.

సుభద్ర ఆ కవిత శీర్షికను ప్రత్యేకంగా గమనించింది.

అది.. ‘ కాటేసి తీరాలె ‘

కాళోజీ అంటాడు.,

మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన

మన పిల్లలను చంపి మనల బంధించిన

మానవాధములను మండలాధీశులను

మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె

కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె

కాలంబు రాగానే కాటేసి తీరాలె

‘ సత్యమ్మహింస ‘ యని సంకోచ పడరాదు

‘ దయయు ధర్మం’ బనుచు తడుముకో పనిలేదు

‘ శాంతి ‘ యని చాటినను శాంతింపగా రాదు

‘ క్షమ ‘ యని వేడినను క్షమియించగా రాదు

‘ చాణక్య నీతి ‘ నాచరణలో పెట్టాలె

కాలంబు రాగానే కాటేసి తీరాలె

తిట్టిన నాల్కెలను చేపట్టి కొయ్యాలె

కొంగులాగిన వ్రేళ్ళ కొలిమిలో పెట్టాలె

కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలె

తన్నిన కాళ్ళను ‘ డాకలి ‘ గ వాడాలె

కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె

కాలంబు రాగానే కాటేసి తీరాలె

కాళోజీ నిజానికి అహింసావాది. కాని ‘ హింస ‘ ను ప్రతిఘటించడానికి ‘ ప్రతిహింస ‘ తప్పుకాదని విశ్వసించిన వ్యక్తి.

కాళోజీ కేవలం రాజకీయ కవితలనే కాకుండా.. సమాజంలోని అసమానతలనూ, ప్రజల ఆర్థిక వైరుధ్యాలనూ సూటిగా ఎత్తి చూపిన కవితలు బోలెడు కనబడ్డాయి సుభద్రకు ‘ నా గొడవ ‘ లో. చదువుతున్నకొద్దీ తనలో ఇన్నాళ్ళూ ఒట్టి బొగ్గులా పడిఉన్న పదార్థమేదో ఒక అగ్ని బిందువుతో రగులుకుని అంతరంగమంతా నిప్పుల కొలిమిలా మారుతున్నట్టు గ్రహింపు కలుగుతోందామెకు. ఒకచోట కనబడింది.. ‘ వ్యత్యాసాలు ‘ అన్న కవితలో.

‘ అన్నపురాసులు ఒక చోట

ఆకలి మంటలు ఒక చోట

హంసతూలిక లొక చోట

అలసిన దేహా లొక చోట

…………………………………

కమ్మని చకిలా లొక చోట

గట్టి దౌడ లొక చోట ‘

ఇట్ల ఎన్ని జన స్థితిగతుల వ్యత్యాసాలో.

తొమ్మిది దాటేదాకా కాళోజీ ని అధ్యయించిన సుభద్ర మెల్లగా లేచి నేలమీద ఒక ఈత చాపను పరుచుకుని పాతబట్టలతో తనే తయారు చేసుకున్న మెత్తను నెత్తికింద పెట్టుకుని.. మధ్యాహ్నం రాములు యాదవ్ ఇచ్చిన మొగిలి బాపతు మూడు డైరీలను ప్రక్కన పెట్టుకుని.. ఒకదాన్ని తెరిచింది.

అప్పుడామె చేతులు నిప్పులను ముట్టుకుంటున్నట్టు గజగజా వణికాయి. మనసు మంటను తాకుతున్న కాగితంవలె కాలిపోవడం మొదలైంది.

2009 వ సంవత్సర డైరీ అది.

మొదటి పేజీ తీయగానే మొగిలి హృదయాన్ని ఆవిష్కరించే కొన్ని వాక్యాలూ.. కింద కొన్ని కవిత్వ పాదాలు కనిపించాయి సుభద్రకు.

‘ పీడిత, దోపిడీకి గురౌతున్న తెలంగాణా జిల్లాలన్నింటిలోనూ ప్రధానంగా విస్తరించి ఉన్న సమస్య.. బతుకు తెరువు లేకపోవడం. చేద్దామంటే పనీ, ఉపాధీ లేకపోవడం. నీళ్ళు లేక బీడుపడ్ద భూముల్లో వ్యవసాయం లేకపోవడం.. కనీసం కూలీ పనులు లేకపోవడం వల్ల జిల్లాలకు జిల్లాలే పొట్టకూటికోసం కుటుంబాలకు కుటుంబాలుగా వలసపోవడం.. బతుకును భారంగా ఈడుస్తూ.. దరిద్రంలో మగ్గిపోవడం.. ఎక్కడ చూచినా ఒక విషాదకర దుఃఖ చిత్రమే. ముఖ్యంగా మహబూబ్ నగర్ , కరీం నగర్ జిల్లాల పేదలు కొన్ని లక్షలమంది వలస పోయి.. ఎక్కడెక్కడో ప్రవాస జీవితాలను గడుపుతున్నారు. వాళ్ల స్థితిగతుల్ని ఆలోచిస్తే హృదయం తరుక్కుపోయి కళ్ళనిండా నీళ్లు చిమ్ముతాయి. పని పట్ల ఈ తెలంగాణ ప్రజలకున్న నిబద్ధత, నిజాయితీ, మాటకు కట్టుబడి ఉండే అమాయకత్వంతో కూడిన విధేయత ‘ పాలమూరు లేబర్ ‘ అంటే ధర్మబద్ధంగా పని చేసే మనుషులుగా పెద్ద పేరు సంపాదించుకున్నారు. అదే విధంగా కరీం నగర్ చేనేత కార్మికులు బతుకుదెరువు వేటలో కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్ర లోని షోలాపూర్, భీమండి, బొంబాయి, సూరత్, అహమ్మదాబాద్ ప్రాంతాలకు వలసబోయి.. జోంప్డీ పట్టీ వాలాలుగా స్థిరపడిపోయారు. లక్షల మంది. ఇప్పుడిప్పుడు దుబాయికి, శ్రీలంకకు, ఇతర ఆరబ్ దేశాలకు.. అబుదాబి, కువైట్, మస్కట్.. ఇట్ల.

ఇక్కడ బీడీలు చేస్తూ.. కూలీ పనులకు పోతూ కుటుంబాలు.. అక్కడ ఆరబ్ దేశాల్లో పూట పూటకొక నరకంగా బతుకుతూ నాల్గు రూపాయలు వెనకేసుకొని రావాలని.. పెండ్లాం పిల్లలను ఆదుకోవాలనీ, సాదుకోవాలనీ.. రాత్రింబళ్ళ గొడ్డు చాకిరి.. వెల్డర్లు, ఫిట్టర్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఒకటేమిటి .. ఏ పని దొరుకుతే అది. మనిషి దుబాయ్ లో.. ప్రాణమంతా ఇక్కడ పస్తులుంటున్న పెండ్లాం పిల్లల నడుమ.. వెతల బతుకు ఏండ్లకు ఏండ్లు.

ఆంధ్ర పాలకుల మధ్య.. బానిసలుగా ఆంధ్ర రాజకీయ నాయకుల బూట్లు నాకే తెలంగాణ కోవర్ట్ నాయకుల చేతకానితనం వల్ల దశాబ్దాలకు దశాబ్దాలుగా ఈ దీనమైన, హీనమైన బతుకులు తెలంగాణ ప్రజలవి. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కమ్మర్ పల్లి.. ఈ ప్రాంతాలన్నీ వలసలే.

సభల్లో కెసీఅర్ పదే పదే చెపుతున్నట్టు.. పాలమూరు ప్రజల బతుకులు దశాబ్దాలుగా ‘ పాలమూరు లేబరే ‘.. కరీం నగర్ జీవితాలు ‘ బొంబాయి బొగ్గుబాయి దుబాయి లే ‘

ఒక మనిషి ఇక్కడి ముసలి తల్లిదండ్రులనూ, సహచరి భార్యనూ, పసిపిల్లలనూ విడిచి కళ్ళనిండా నీళ్ళు నింపుకుని వెళ్తున్నప్పటి దుఃఖ సందర్భాన్ని సిరిసిల్ల కవి జూకంటి జగన్నాథం ఈ కింది కవితలో చదువుతున్నప్పుడు ఎవరికైనా గుండెలవిసిపోతై. మనిషి కన్నీళ్ళై కరిగిపోతడు.

తల్లి కొంగు

తల్లికి నమస్కరించి

తండ్రికి నమస్కరించి

అత్తకు నమస్కరించి

చంకలో మూడేండ్ల కొడుకు నెత్తుకు

వీచే అన్ని తుఫాన్లను ఎగిసే అన్ని ఉప్పెనలను

తనలో ఉపశమింప చేసుకుంటున్న

భార్యకు నమస్కరించి

నన్ను నిరంతరం పెంచి పెద్ద చేస్తున్న

కన్న నేలకు నమస్కరించి

 

‘ పోతున్నా అవ్వా నాయినా

పోతున్నా చెల్లే బావా

పోతున్న నా చేనూ చెలకా

పోతున్న నా వాగూ ఊరగుట్టా

పోతున్న! పోతున్న!! ‘

 

దేశంగాని దేశానికి

దేహంగాని దేహంతో

గుండెలు పగిలి

అందరి కళ్ళలో గొడగొడ దుఃఖాలు

——————–

‘ తల్లిదండ్రికి దండం

అత్తమామకు దండం

భార్య కొడుక్కు దీవెన

కన్ననేల కొంగునీడకు దండం… ‘                             ( 20-04-2004 న రాసినది )

సుభద్ర కళ్ళనిండా నీళ్ళు సముద్రాలై పొంగినై. కళ్ళముందు కుటుంబాన్నీ, కన్న ఊరునూ, ముసలి తల్లిదండ్రులనూ విడిచి వెళ్తున్న బక్కచిక్కిన బీద చేనేత కార్మికుడు కదలాడి దుఃఖం ముంచుకొచ్చింది.

సరిగా ఇరవై ఐదేండ్ల క్రితం ఏ దిక్కూ లేని రాజేశం ఏ ఆసరా లేని తనను ఊరడిస్తూ దుబాయ్ పోయి రెండేండ్లలో కొంత డబ్బు సంపాదించుకుని తిరిగొచ్చి నిన్ను పెండ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళనిండా నీళ్ళతో వెళ్తూ.. మెడలో తలుగుతో కసాయోడు తల్లి ఆవును దూడనుండి దూరంగా గుంజుకపోతున్న దృశ్యం వలె దీనంగా కనిపించింది.

అంతే.. ఆ రోజు వెళ్ళిన రాజేశం దుబాయ్ నుంచి తిరిగి రానేలేదు. కనీసం శవంకూడా రాలేదు కన్న ఊరుకు.

ఏం మిగిలింది చివరికి.. జీవితం నిండా చీకటి.. దిక్కు తోచని జీవితం. చావలేకా బతుకలేకా ముందు నిలబడ్డ ఏ దారీ లేని బతుకు.

‘ కొడుకా మొగిలీ.. వాగు నీళ్ళసోంటి నిర్మలమైన హృదయంరా నీది. ఎక్కడ పట్టుకున్నౌరా ఈ జూకంటి జగన్నాథం కవినీ.. ఈ దోసెడు దుఃఖాన్నీ’

సుభద్ర డైరీలోని ఇంకో పేజీ తిప్పింది.

తేది: 20-06-2009

నానాటికి ఉధృతమౌతున్న ‘ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ‘ అగ్గి అంటుకున్న ఎండాకాలపు అడవిలా విస్తరిస్తున్న క్రమంలో .. ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా అసలు మన తెలంగాణా ప్రాంత రాజకీయ, సామాజిక, పోరాట నేపథ్యాలను స్థూలంగా అధ్యయనం చేయాలనుకుని కింది సమాచారాన్ని సేకరించాను.

1) 1324 వ సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఢిల్లీ సుల్తానులుగా ప్రవేశించిన ముస్లిం రాజులు 1948 వరకు.. అంటే భారతదేశంలో అప్పటిదాకా ఉన్న 565 సంస్థానాల్లోకెల్ల పెద్దదైన హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ పాలననుండి విముక్తమై స్వతంత్ర భారతదేశంగా 15 ఆగస్ట్, 1947 న అవతరించిన తర్వాత నిజాం ప్రతిఘటన, ఐక్యరాజ్య సమితిలో స్వతంత్ర దేశంగా కొనసాగుతానని దరఖాస్తు చేసుకుని.. పోలీస్ చర్యతో భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 వరకు మొత్తం 690 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలంగాణా వివిధ ముస్లిం వంశాల కింద ఒక బానిస రాజ్యంగా కొనసాగింది,

2) ఈ లోగా 1946 నుండి 21 అక్టోబర్ 1951 నాడు విరమించేదాకా అంటే 5 ఏండ్లు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ‘ కమ్యూనిస్ట్ ల నాయకత్వంలో నిర్వహించబడి.. దాదాపు 4500 మంది పోరాట యోధులను కోల్పోయింది. రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పెండ్యాల రాఘవరావు, నల్లా నరసింహులు వంటి ఎందరో నాయకులు ప్రజల మన్ననలను పొందారు.

3) విలీన ఒప్పందం కింద నవంబర్ 1, 1956 న కుట్రపూరిత రాజకీయాలతో ‘ ఆంధ్రప్రదేశ్ ‘ రాష్ట్రం ఏర్పడే దాకా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్ గా కొనసాగారు

4) విలీనానికి ముందు ఒక విశాల రాజ్యంగా ఉన్న హైదరాబాద్ దక్కన్ నుండి ఔరంగాబాద్, బీడ్, నాందేడ్ మరియు పర్బని జిల్లాలను మహారాష్ట్రలో, బీదర్, ఉస్మానాబాద్, గుల్బర్గా మరియు రాయచూర్ జిల్లాలను కర్ణాటకలో కలిపి మిగిలిన తెలుగు మాట్లాడే … జిల్లాలను ఆంధ్ర ప్రాంతంతో కలిపి ‘ ఆంధ్రప్రదేశ్ ‘ ను ఏర్పర్చారు అప్పటి ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ. ఈ విచ్ఛిత్తిని ప్రస్తావిస్తూ రాజ్యాంగ నిపుణులు ‘ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో నిజాం ప్రభుత్వం 1948 లో ‘ హైదరాబాద్ పై భారత సైన్యాల దాడి, దురాక్రమణ ‘ పై దాఖలు చేసిన పిర్యాదు నవంబర్ 1, 1956 దాకా సజీవంగా ఎజెండాలో ఉంది. అప్పటిదాకా ఐక్యరాజ్య సమితి విధానాల పరిధిలో పరిశీలిస్తే 1948 నాటికి హైదరాబాద్ ఒక స్వతంత్రమైన దేశం. కాబట్టి దాన్ని విచ్ఛిత్తి చేసి తెలంగాణా ప్రజలు ఇష్టపడకున్నా ఆంధ్రలో అవశేష హైదరాబాద్ ను విలీనపర్చి అసలు దాని అస్థిత్వమే లేకుండా చేసి ఐక్యరాజ్య సమితి నుండి రక్షించుకుందామనుకున్నాడు నెహ్రూ. ‘ అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ విలీనం నాటికి అది మిగులు బడ్జెట్ తో ఉన్న ధనిక రాష్ట్రం. నిజాం ప్రపంచస్థాయి ధనికుడు.

5) విలీనం జరుగగానే పెద్దమనుషుల ఒప్పందాన్ని ప్రక్కనపెట్టి తెలంగాణా దోపిడికి తెరలేపినవాడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. అతను నిలిపివేసి తెలంగాణాకు తీరని ద్రోహం చేసిన ప్రాజెక్ట్ లు.. గోదావరి నదిపై .. ఇచ్చంపల్లి, దేవునూరు, పెన్ గంగ, ప్రాణహిత. కృష్ణా నదిపై.. అప్పర్ క్రిష్ణ, భీమా, తుంగభద్ర లెవెల్ కెనాల్. ఇక అప్పటినుండి మొదలైంది నీళ్ళ దోపిడి. అదే విధంగా నిధులు.. హైదరాబాద్ మిగులు నిధులను ఆంధ్రాకు తరలించుకుపోవడం.. అనేకానేక పద్ధతులద్వారా తెలంగాణా అంతటా నియామకాలను చేపట్టి ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడ నింపివేయడం.

ఈ రకంగా నిధులు, నీళ్ళు, నియామకాల్లో దోపిడి 1969 దాకా అంటే 13 ఏండ్లు నిర్విఘ్నంగా కొనసాగుతూంటే.,

6) 1969 లో పుట్టింది తొలి ‘ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ‘ ఆవిర్భావ ఆకాంక్షతో మహోద్యమం.

పురాణకాలంనుండే ఇంటి దొంగలతో రాజ్యాలూ, రాజులూ ఎందరో పతనమైపోయినట్టు అనేకానేక ఉదంతాలు తెలుసు మనకు. కాని రోజు రోజుకూ పడిపోతున్న నైతిక విలువలవల్ల మనుషులు నిర్లజ్జగా స్వతంత్ర లాభాలకోసం.. తమ ప్రాంత లాభాలకోసం ఎదుటి మనుషులను దోచుకోవడం స్వతంత్ర భారతదేశంలోని స్వయం పాలనలో 1950 ల తర్వాత మరీ పెచ్చు పెరిగిపోయింది. కాని ఇక్కడ లక్షలాది ప్రజలు అన్నంకోసం అలమటిస్తూంటే ఆంధ్ర పాలకులు వాళ్ళ నోళ్ళుకొట్టి తెలంగాణా ప్రాంతానికి అన్యాయం చేయడం పరమ కిరాతకంగా అనిపించింది సుభద్రకు.

మొగిలి సామాజిక బాధ్యతతో తన జన్మభూమి గురించి స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం గర్వంగా అనిపించింది.

ఎప్పుడైనా మనిషికి సమస్య స్పష్టంగా అర్థమైతే సరియైన పరిష్కారం దొరుకుతుంది.

సుభద్రకు సమస్య అర్థమౌతోంది.

డైరీలోని ఇంకొన్ని పేజీలను తిరగేసింది.

తేదీ: 28-06-2009

శరీరం మీద గడ్డ ఐన తర్వాత అది పెరిగి పెరిగి తప్పక ఒకరోజు పగిలిపోతుంది. కాకుంటే కొద్ది టైం పడ్తుండొచ్చు.. రెండ్రోజులు.. నాలుగు.. వారం. కాని పగిలిపోవడం మాత్రం తప్పదు.

ఆంధ్రా వలస పాలకుల దోపిడి హద్దులుమీరి మిక్కుటానికి రావడం వల్ల.. తెలంగాణా ప్రజల పరిస్థితి గదిలో బంధించి కొడ్తున్న పిల్లిలా అయ్యింది.

ఇక పిల్లి పులి రూపమెత్తి 1969 జనవరిలో మొట్టమొదట కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లోని వి.ఎల్.నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు, ఆర్. రాజలింగం, వెంకటనారాయణ లతో ‘ ప్రత్యేక తెలంగాణ ‘ నినాదం మొదలై ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్ నిరాహార దీక్షతో జనవ్యాప్తమైంది.

దరిమిలా.. నిప్పు రవ్వగా పుట్టిన ప్రత్యేక రాష్ట్ర తొలి ఉద్యమం అరణ్యాగ్నిలా తెలంగాణా ప్రాంతమంతా వ్యాపించి మార్చ్ 25, 1969 న ‘తెలంగాణా ప్రజాసమితి ‘ ఏర్పడింది మదన్ మోహన్ నాయకత్వంలో.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని మొదటినుండీ బలపరుస్తూ ముందుండి నడిచిన నాయకులు కొండా లక్ష్మణ్, మర్రి చెన్నారెడ్డి, టి.పురుషోత్తమరావు, శ్రీధర్రెడ్డి, కె.ఆర్.ఆమోస్ ప్రభృతులు. ఇక్కడివారై ఉండి రాష్ట్రం విడిపోవద్దని వాదించిన ఇంటి దొంగలు జె.వి.నర్సింగరావు, ఎస్.జైపాల్ రెడ్డి, వెంగళరావు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారై ఉండికూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరుగాలని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యులు కొరపాటి పట్టాభిరామయ్య, ఎన్.జి.రంగా, చెంగల్రాయనాయుడు, కొమ్మారెడ్ది సూర్యనారాయణ, గౌతు లచ్చన్న.

అనేక కుట్రలూ కుతంత్రాల బీభత్సం వల్ల మొత్తం మీద 369 మంది విద్యార్థులు, ఉద్యోగులు పోలీస్ కాల్పుల్లో మరణించి అమరులైనారు. ఈ ఉద్యమంలో గమనించదగ్గ అంశమేమిటంటే.. ఈ మరణాలేవీ ఆత్మహత్యలు కావు. ఉద్యమ సందర్భంగా పోలీసులు పాలకుల ఆజ్ఞలపై ఉద్యమకారులపై జరిపిన అమానుష కాల్పుల్లో మరణించినవారే అందరూ . 1969 మే 22 న ‘ తెలంగాణా ప్రజా సమితి ‘ అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించిన మర్రి చెన్నారెడ్ది 1971 దాకా ఉద్యమాన్ని రాజకీయ రణతంత్రంతో నడిపించి ప్రజల్లో ఇక తెలంగాణ విముక్తమౌతుందన్న ఆశలను రగిలించి 1971 మార్చ్ 5 న జరిగిన లోక సభ ఎన్నికల్లో టి.పి.ఎస్ తరపున ఒంటరిగా అభ్యర్థులను నిలబెట్టి ఒక ఉత్కంఠను కలిగించారు. ప్రజలు ఉద్యమ ఆకాంక్షను ప్రతిఫలింపజేస్తూ మొత్తం 14 సీట్లకు 11 మందిని గెలిపించుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరుగవలసిందేనని తేల్చి చెప్పారు. కాని లోలోపల జరిగిన రాజకీయ లోపాయికారి పార్టీ మార్పిడులవల్ల, చెన్నారెడ్ది మాట వినని ఇంటి దొంగ పార్లమెంట్ సభ్యులు అమ్ముడుపోవడం వల్ల కొన్ని ఒప్పందాలకు లోబడి టి.పి.ఎస్ కాంగ్రెస్ పార్టీలో 1971 సెప్టెంబర్ 21 న విలీనమయ్యింది. ఫలితంగా.,

1971 సెప్టెంబర్ 15 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.

1971 సెప్టెంబర్ 25 న చెన్నారెడ్ది సూచన మేరకు పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

ప్రధాని ఇందిరా గాంధి షట్సూత్ర పథకం పేర ఒక మాయజలతారు వల ప్రజల నెత్తిన విసరబడింది.

మొత్తంమీద 369 మంది అమరుల ప్రాణాలను బలిగొన్న ‘ ప్రత్యేక తెలంగాణా తొలి ఉద్యమం ‘ హింసాత్మకంగా, రక్తపాతంగా, ఎగిసిపడి ఇంటి దొంగల ద్రోహం వల్ల సమసిపోయి చల్లారి అంతరించిపోయింది.

మళ్ళీ బానిస బతుకులోకే అనివార్యమై తలవంచుకుని నడువవలసిన శప్త తెలంగాణా మిగిలింది.

ఇక షరా మామూలే.

అప్పటిదాకా మహోద్వేగంతో చదివిన డైరీని కాస్సేపు మూసి.. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంది సుభద్ర.

369 మంది యువ ఉద్యమకారుల మరణం పోలీసు కాల్పుల్లో.. దాదాపు అందరూ యువకులే.. బంగారు భవిష్యత్తు ఉన్నవారే.. పిట్టలను కాల్చినట్టు కాల్చి.. పాపక్రియ ఇది.

ఎందుకో తెలియకుండానే సుభద్ర కళ్ళలోనుండి నీళ్ళు టపటపా కారాయి.

తన తల్లి హృదయమా ఈ కంటతడికి కారణం.

అలసిపోయినట్టనిపించి కాస్సేపు కళ్ళు మూసుకుని ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది.

 

*                                               *                                                             *

                                                                                                                                                ( మిగతాది వచ్చే పక్షం )

రామాచంద్ర మౌళి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • telangana mali udyama sandarbha jeevitaanni pratibimbistunna ee navala oka adbhutam. kaalam jnaapakaalanu maskabaarustundi..kaani.,

    Dr. raammuurthi, nalgonda

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు