మగోనికి మీసం మూతినుంటే, ఆడదానికి మునిచేతి నుంటుంది ! 

   ఇదే ఇందిరీ కత.  బాగుందా ! ఆ రాణి కూడా నీఅట్లాడిదే . దేనికి తీసిపోయేది కాదు. ఆడది దైన్నంచేస్తే దేంట్లోనైనా మొగోన్ని తుంగలో తొక్కుతుంది.

                       దేవుడు కొందరి చేతులకి బూమి, నీల్లు, దుడ్డు, బంగారమిస్తే మాచేతులకి కస్టానిచ్చినాడు. దినమూ కూలిపనికి పోతే గాని జరగని సంసారాలు మావన్నీ. మల్ల ఇట్లాంటోల్లల్లో కూడా ఆడోల్లపైనే ఆదారపడే ఇంకొన్ని సంసారాలుండాయి. పంటలు ఏసేటబుడు, పంటలు వొడిపేటబుడు ఊర్లో పతి మనిసికి యిడవకుండా పన్లు దొరుకుతాయి. ఈ మద్దె నుండే కాలమే కూలీలకి గడ్డు కాలము. కొన్నిదినాలు అడపాదడపా పనులు దొరుకుతాయి. ఆ పనులు కూడా అందరికీ  దొరకతాయన్న గారెంటీ లేదు. పని ఎక్కువుండి మనుసులు తక్కువుంటే పనిచెయలేనోల్లను,పని చేసేటోల్లను అందర్నీ కలుపుకొని పనికి పిలుస్తారు. అదే పని తక్కువుండి మనుసులు ఎక్కువుంటే మేటి మేటి అయినోల్లనే పనికి పిలుసుకొని పోతారు.అందులోనా  ఇబుడు చెరుకు తోట్లల్లో గుమ్ములు చుట్టే కాలం. ఈ  పనంతా మగోల్లే నేర్చుకోనుండారు. ఆడోల్లని పెద్దగా ఈ పనిలో ఏలు పెట్టనిచ్చేవాల్లు కాదు. అట్లాంటప్పుడు కూడా  తెగాయించి మా ఊర్లో ఇద్దరు, ముగ్గురు ఆడోల్లు  ఈ తోట్లు చుట్టే పని నేర్చుకోనుండారు.
                         మా ఇందరా పెద్దమ్మ, మంగత్త, రాజిసినమ్మ, ఈల్లు ముగ్గురూ మొగోల్లు  చేసే అన్ని పనులు నేర్సి సంకలో పెట్టుకోనుండారు.ఈల్లు  ముగ్గురూ ఈ పొద్దు రంగారెడ్డి తోట చుట్టే  పనికిపొయినారు. ఈల్లతో  పాటు ఆరేడు మంది మొగోల్లు కూడా వొచ్చినారు. అంతా చెరుకుతోట చుడతా ఉండారు. నేను గెడ్డికని తోటకాడికిపోయి  గెనుములో  గెడ్డి  కోస్తాఉండా.  ఇంక పనికాడ మా ఇందరా పెద్దమ్మ అందరికంటే తెలివిగా, ఉన్నరంగా పని చేస్తా ముందడుగులో ఉంది. ఆయమ్మ పని చూసి ఈరతాత  “ఇందిరీ నీ పని కాడ మగోల్లేమిటికి పనికొస్తారే, మగోనికి మీసం మూతినుంటే, ఆడదానికి మునిచేతి నుంటుందంట, నీపని  మెచ్చి నీ కేమన్నా బోమానం ఈయాలనిపిస్తుంది, నేనేమీ ఈలేనుగానీ  నీకు ఒగ కత చెప్తా ఇను, నీకు తోడుమైంది” అని  కత ఎత్తుకుండే .  కతలంటే పై మింద పాము బన్నా పట్టించుకోను నేను.  అంత సోరకం లేకుండా ఇంటా.  గెడ్డి కోసేది కూడా పక్కన  పెట్టి కత కోసం కూసుంటి.
                         ఒగూర్లో ఒగ రాజున్నాడంట.ఆ  రాజుకు ఎన్నో సంవత్సరాలు బిడ్డలే కలగలేదంట. ఎకడెకడో గుల్లు, గోపరాలు అన్నీ తిరిగినారు. అయినా పలితంలేదు. ఇంకేంచేసేది గొడ్డురాజు అన్నపేరు పడుతుంది. నా దగ్గర రొక్కము, రాజ్జెము , మనులు, మానిక్యాలు, గుర్రాలు అనీ  ఉన్నాయి. ఈ రాట్రానికే రాజు నేను, కాని బిడ్డలు లేరనే బాదతో  సద్ది బద్ది కట్టుకొని అడివింటి పాతా ఉండారంట. ఆ  అడివిలో ఒగ గుడి ఉంది. ఆగుడి కాడ చిన్న కోనేరుంది. ఆ రాజు పెండ్లాము  ఏమనిందంటే  సామి యాడికిపోయినా ఒగే దేవుడు కదా ఈడ గుడి,కోనేరుంది.దేవునికి  ఈన్నే వరపడదాము అని ఆ కోనేట్లో సానంచేసి అ గుల్లో వరపన్నారు. ఆడ రెండు మామిడిపండ్లున్నాయి. ఇవే మనకు పసాదం అని ఆ పండ్లు రెండూ ఎత్తుకొని ఇంటికొచ్చి  కోసుకొని తిన్నారు. అబుడాయమ్మకు గర్బం నిలిచింది. ఇబుడు బిడ్డను కనల్లంటే తొమ్మిది నెలలు, అబుడు తొమ్మిది గెడువుల్లో బిడ్నుకనేది.కొడుకు పుట్నాడు.
                         పరమట బటురాజు ఉన్నాడంట. ఈ రాజుకంటే ఆరాజు ఇంగా దనవంతుడు,పెద్దరాజంట. ఆ రాజుకాడ ఈరాజు పదిహేడు వరాలు బాకి చేసినాడంట. ఈరాజుకు ఈబిడ్డ బుట్న  సంబరాలకు డబ్బంతా కర్సు పెట్టేసి ఆ  బటురాజు కాడ చేసినబాకీ మాటే మరిచిపోయినాడు. అబుటికే  వడ్డీ,మొదులు చానా పెరిగిపోయింది. ఈ కొడుకనేవాడు  పెద్దోడయ్యి,చదువుకొని ఇలువిద్దెలన్నీ నేర్చుకున్నాడు. వాళ్ల తల్లిదండ్రులు  “నాయనా మాకు వయసు  కావస్తావుంది  నీకు పెండ్లి చేయల్ల కదా అన్నారు .
“అమ్మా మీ కాలంలో మీరు చూసి చేస్తావుండ్రి, మా కాలంలో మేము ఇస్ట పడితేనే పెండ్లమ్మ ,మీరెందుకు ఆత్రపడతారు. నాకెట్లాంటి పెండ్లాము   కావల్లో  నేను ఒగ జాబురాసి పంపిస్తా,  ఆ  జాబుకు యా యాడది సమాదానం రాసి పంపిస్తుందో దాన్నిపెండ్లి చేసుకుంటా”  అని పెన్ను పేపరు తీసుకొని “నువ్వు ఆడదానివైతే, కత్తికి కంకణం కడతా,  బాకుకి బాజిగం కడతా, అట్లయితే వివాహమాడు.నేను నిన్ను చూడను,నువ్వు నన్ను చూడకూడదు, అత్తింటి సొమ్ము,పుట్టింటి సొమ్ము లేకనే, కాశీ రామేశ్వరం సందులో ఒంటిస్తంబం మేడగట్టించల్ల,ఆ మేడ ముందర బాయితొగిచ్చి ఆ బాయికి ఎండి మెటికి, బంగారు మెటికి చేపిచ్చి, పూలవనాలు కాయిచ్చల్ల,నన్ను కానకుండా నాతోనే బిడ్డను కనల్ల . నన్నుగానకుండా నువ్వే నాకు రెండో పెండ్లి చేయల్ల. వీటన్నిటికి ఒప్పుకుంటే నిన్ను పెండ్లాడతా లేదంటే లేదు” అని జాబు రాసి ఎకడెకడ రాజులుండారో వాళ్ళందరికి పంపించినాడు.
                       తూర్పు తుంగబద్ర రాజు కూతురు కొన్నెండ్లుగా పెండ్లి కాకుండా  నిలిచిపోయి ఉందంట. ఈ జాబు ఆ రాజంచుకుపోతుంది. ఆ తుంగబద్ర రాజు ఆ జాబు చదివి నాకుండేది ఒగానొగ కూతురు, ఇన్ని కానువులతో  నాకూతుర్నిచ్చి పెండ్లి చేయాలా అని ఆ జాబు తెచ్చినోల్లను మూడు గుద్దులు గుద్ది పంపిస్తా ఉంటే, అబుడే ఆ రాజు కూతురు చూసి “నాయనా జాబు తిప్పిపంపిస్తే మన రాజవంశానికి ఎంత అపరతిస్ట, నేను ఆ రాజునే  పెండ్లి చేసుకుంటానని” ఈయమ్మ బటులతో పలానా పొద్దురండి అని చెప్పి అంపిస్తుంది.
వాల్లనాయిన “ఇంత కటినసిచ్చిగా నువు  పెండ్లి చేసుకునే అవసరం లేదు. మా మాటినకుండా చేసుకున్నావంటే  మాఇంటికి రావద్దు. ఉద్దేనవనంలో పెండ్లి చేసుకొని అట్లే ఎల్లిపోవల్ల ” అంటాడు.అదే మాట పకారం ఆ రాజుకత్తికి తలంబరాలు పోసి పెళ్లి చేసుకోని  ఆట్నుండి అట్లే పోయి కాశీ,రామేశ్వరం మద్దిలో బటులు కట్టిచ్చిపెట్టిన  తాటాకుల గుడిసెలో ఉంటుంది.
                       ఈ బటురాజు ఇచ్చిన  అప్పు వడ్డీ పెరిగిపోయింది. బటురాజు బటులను  ఆ రాజు కాళ్లు చేతులు కట్టేసి ఎత్తుకొని రా పొండి అని చెప్పి అంపిస్తాడు. అబుడు బటులొచ్చి  ఈ రాజును పట్టుకొని పోతా ఉంటారు. అబుడు వాల్ల కొడుకొచ్చి నాయనా నువ్వు పోవద్దు, నేను పోయి ఆ రాజుకు అప్పు తీరిసేసొస్తా అనిచెప్పి ఆ చినరాజు బటులెనకింటి బయలుదేరి పోబో తాడు. అబుడు వాళ్ల నాయన చినరాజుకు ఇట్లాని చెప్తాడు. ” ఆ బెమ్మదేవుని దీవెన, నీ కనతల్లి దీవెన, నీ బారియ దీవెన తీసుకొని నువ్వు పోవల్ల” అంటాడు. అబుడు బారియ దీవెన కోసం గుర్రంమింద కాశి రామేశ్వరం దగ్గర ఉండే తాటాకుల గుడిసె కాడికి వస్తాడు. ఆ యమ్మను  దీవించమంటాడు. అబుడాయమ్మ  మగానికి ముసికేసుకోనొచ్చి  మంగళారితిచ్చి ఒగ పూలారం మెల్లో ఏస్తుంది. చినరాజు  బటురాజు దగ్గిరికి కొస్తాడు. ఈ బటురాజు ఆ చినరాజుకు పని పాట్లు చెప్తాడు. ఆ రాజు దగ్గర పనిచేసే చెలికత్తులు, బటులు చినరాజు గురించి ఇట్లా చెప్పుకుంటా ఉంటారు.” ఆ చినరాజు మెల్లో ఒగ పూలారం ఉంది, అది ఎప్పుడూ కలకల అని ఉంటుంది, వాడనే వాడదు”  అని. చినరాజు పెండ్లాము  ఆ ఆరమేసేటబుడు ఏమని చెప్పిందంటే “సామీ ఈ ఆరం నాపతివర్త దర్మాన్ని నిరూపిస్తుంది.ఇది పొద్దున్నే లేచి చూస్తే కసురుమొగ్గలుగా ఉంటాయి, మద్యానం  మొగ్గలైతాయి, మావిటేల పూలైపోతాయి” అని .
                    ఈ ఇసియం ఆ బటురాజుకు తెలుస్తుంది. ఆ బటురాజు చినరాజును అడగతాడు. నీ మెల్లో ఈ పూలమాల ఎవురేసినారు  అని. అబుడు ఆ చినరాజు చెప్తాడు.ఇట్లా నా బారియ పతివర్తతనానికి గురుతుగా ఏసింది.ఈ పూలమాల ఎబుడు వాడితే అబుడు నా బారియ చెడిపోయినట్లు లెక్క, అని చెప్తాడు. అది మనసులో పెట్టుకున్న ఈ బటురాజు పన్నెండు మంది దొంగల్ని పంపిస్తాడు ఆయమ్మను చెడిచేసి రమ్మని. ఈ పన్నెండు మంది దొంగలు ఆమె దగ్గరికి పోతారు. అప్పుడు ఆయమ్మ చెప్తుంది మీరు నన్ను అంటుకోవాలంటే నేను చెప్పిన రెండు పనులు చేయల్ల, లేదు అట్లకాదని నా మీద బలాత్కారం చేస్తే మీ అందరూ తలలు పగిలి సస్తారు అని శాపిని పెడుతుంది. అబుడు ఏం చెబుతుందంటే “ఈ తాటాకుల గుడిసి తీసేసి ఒంటిస్తంబం మేడగట్టల్ల,  ఈ మేడ ముందర ఒక కొలను తొగి దానికి ఎండి మెటికి, బంగారు మెటికి పెట్టి, పూలవనాలు కాయించల్ల, అబుడే నన్ను మీరు అంటుకోగలరు” అని.  అదే పకారం ఆ దొంగలొచ్చి ఆ రాజుకు చెప్తారు.ఇట్లా అని చెప్పిందని.  సరేలే అని ఆ రాజు కావలసిన రొక్కమిచ్చి ఆయమ్మ చెప్పినట్లు చేయమంటాడు. ఈ దొంగలొచ్చి  ఆయమ్మకు ఇల్లు కట్టే పనిలో ఉంటారు.
                     ఈ బటు రాజుకు ఒగ కూతురు ఉంది. ఆ కూతురికి రాసపుండు పుట్టింది. ఆయమ్మ దాని నొప్పికి  కోడై, ఆవై  రేయి పొగులు అనే తేడా లేకుండా అరస్తా ఉంటుంది. రేయి పొగులు ఆఊర్లో ఉండే జనాలంతా ఆయమ్మ అరుపులకు బయపడుతున్నారు. ఆ రాజు ఎక్కడెక్కడినుంచో వైదుగుల్ని పిలిపించి  చూపిస్తా ఉంటాడు. కానీ పలితం లేదు. ఎవురు గాని ఆ పుండు మానిపేవాల్లే  దొరకలా. ఈలోగా ఈ చినరాజు బారియ ఒగ కోమటిశెట్టి  ఏసికమేసుకొని కావలసిన వంటలన్నీ చేసి,ఎద్దుల బండి కట్టుకొని, వంటలన్నీ ఆ బండ్లో పెట్టుకొని బండి తోలుకొని పోతా ఉంటుంది.అంతలో పొద్దు పోతుంది. ఆ   అడవిలో ఒక తావన గుడుంటే  బండి ఆడ నిలిపి ఈయమ్మ ఆ గుళ్లో ఆ రేయి రేతిరి పొనుకొంటుంది. ఆడికి రెండు చిలకలు వస్తాయి. ఆ చిలకలు రెండు అక్క చెల్లెల్లు . “పద్మావతీ పద్మావతీ  పొద్దన్నా పోనీ, ఒగ కతన్న చెప్పు” అని అక్క చెల్లిని అడుగుతుంది. “ఏం కత చెబుదులే మన బతుకే ఒక కత ” అని తుర్రని ఎగిరిపోయి మల్లొచ్చి కొమ్మమీద కూసుంటుంది . అట్ల కాదు ఏదో కత చెప్పు పద్మావతీ , పొద్దుపాలా నిద్రరాలా  అని మల్లా అడుగుతుంది అక్క చెల్లిని. అబుడు మొదట నుంచి ఈల్ల కతే తిరగ చెప్తుంది. ఆరాజు అదేగుళ్లో వరపడింది, ఆ చినరాజుని కనిండే కాట్నుండి చెప్పక వస్తుంది.  “ఇట్లా ఆ బటురాజుకు ఒకూతురుంది. ఆ కూతురుకు ఒగ రాసపుండు పుట్టింది  దాన్ని మానపల్లంటే  ఇబుడు మనం కుసోనుండే కొమ్మమీద ఆకులు, మనమేసిన లద్ది  నున్నగా నూరి మూడు కట్లు కడితే ఆ యమ్మకు  ఆ రాసపుండు నయమైతుంది”  అని ఇదంతా  ఈ యమ్మ ఇనే. ఆ రేరేతిరి ఆ గుల్లో  ఉండి పొద్దున్నే లేచి ఆ చిలకలు చెప్పినట్లే ఆ కొమ్మ ఆకులు, ఆ చిలకలేసిన లద్ది మూట కట్టుకొని,అన్నీ బండికి పెట్టుకొని చిన్న రాజుండే ఊరుకొస్తుంది.  ఆ ఊరిలో జోగి రానీ ,జంగం రానీ,  ఎవురన్నా రానీ  ఆ ఊరు రాజే వాళ్లకు ఉండడానికి చోటు చూపించి, తిండి తీర్తము చూసుకోవాలంట. ఈ కోమిటిశెట్టి  రాజంచుకు పోయి రాజా ఇట్లా నేను యాపారం చేసుకోను ఈ ఊరొచ్చిన, నాకు ఉండే దానికి సోటు చూపించు అని అడుగుతుంది. ఆ బటురాజు చినరాజును పిలిసి ఆ కడిల్లు సూపించి  ఆడుండమను ఆ కోమిటిశెట్ని అని చెప్తాడు. ఈ కోమటిశెట్టి రోజూ వంట్లు  చేసి చినరాజుకు  పెడతా ఉంటాడు. అట్లా ఈల్లిద్దరూ బాగా మచ్చికైతారు.
 
                      ఈ బటురాజు,  కూతురి  రాసపుండు ఎవరైనా మానిపితే  రాజ్యంలో అర్ద రాజ్యం రాసిచ్చి,  కూతుర్నిచి పెండ్లి చేస్తాను అని పకటించినాడు అని ఈ కోమటిశెట్టికి  చెప్తాడు చిన రాజు.ఆ మాటకు ఈ కోమటి శెట్టి,నేను మానుపుతాను కానీ ఇబుడు కాదు, నేను మా ఊరికి బోయి కొన్ని దినాలకు వస్తాను. మల్ల ఆమెకి వైదిగం చేస్తానని చెప్పి ఆట్నుండి వచ్చేస్తాడు. మల్ల ఈమె కోమిటిశెట్టి అవతారం తీసేసి మామూలు ఆడది మాదిరి అలంకరించుకొని మల్ల చినరాజు కాడికి వచ్చి నేను కోమటిశెట్టి భార్యని నా బర్త వచ్చేవరకు నేను యాపారం చేసుకుంటా అని చెప్తుంది. సరే అని చిన్నరాజు వాల్లింటి బీగాలిస్తాడు. ఆయమ్మ ఇంట్లో  బాగా వంటవార్పు చేసి చినరాజుకి పెట్టేది. అట్లా వాళ్ళిద్దరూ బాగా మచ్చికై ఇద్దరూ కలుస్తారు. ఆచినరాజుతోనే మూడు నెలల గర్బవతయి “చినరాజా ఇంగ నేను పొయెస్తాను, నీ గుర్తుగా నాకు  ఏమన్నా ఇయ్యి ” అని అడిగి చిన్నరాజుది రాజముద్రిక, కిరీటము, పట్టపుకత్తి ఈ మూడు తీసుకొని ఎలిపొయి వాటిని అక్కడ ఒంటి స్తంబం మేడలో పెట్టేసి మల్ల కోమిటిశెట్టి ఏసికం ఏసుకొని తిరిగి వచ్చేస్తుంది.
                     ఈ చినరాజు ఆ కోమిటిసెట్టిని చూస్తానే ఏమిసెట్టి ఇన్నాళ్లు రాలేదు. మీ వాళ్ళందరూ బాగుండారా అని అడుగుతాడు. అందరూ బాగున్నారు చినరాజా, ఇబుడు మనము బటురాజు కూతురుకు రాసపుండు మానిపేదానికి పదాము, నేను మందాకు తెచ్చిన అని ఆపొద్దు రెండు చిలకలు చెప్పిన మందాకు నూరి ఆ రాసపుండుకు పూసి మూడు కట్లు  కడతాడు. పుండు మానిపోతుంది. ఎవరైతే ఆ పుండు మానపతారో వాళ్లకు అర్ద రాజ్యాన్నిచ్చి ,కూతుర్నిచ్చి పెళ్లి చేయల్లన్న మాట పకారం  ఈ కోమిటిశెట్టికి  రాజుకూతురినిచ్చి పెళ్లి చెయల్లని  అన్నీ  సిద్దం చేస్తుంటారు .
                       పెండ్లి చేయాలంటే మా ఆచారం పకారం తోడిపెల్లి కొడుకే పెళ్ళికొడుకు మాదిరి పెళ్లి చేసుకుంటాడు. కాపరం మాత్రం అసలు పెళ్లి కొడుకు చేస్తాడు. అట్లయితే నేను ఈ పెండ్లి చేసుకుంటాను అంటాడు కోమిటిశెట్టి. ఇంగ చేసేదేమీ లేక ఆ రాజు కూడా ఇచ్చిన మాట తప్పకూడదని మీరెట్లా చెప్తే అట్లే కానిద్దాం అంటాడు. తోడుపెళ్లి కొడుగ్గా చినరాజును పెండ్లి పీటలమీద కుసన్న పెడతారు. చినరాజే నలుగులు పెట్టుకొని తాళి కడతాడు.ఇంక పెళ్ళైన తరువాత  వేటకోసం  అందరూ గుర్రాలేసుకుని అడివికి పోవల్ల. ఈ కోమిటిశెట్టి  చినరాజా మేము కోమిటోళ్ళం, జంతువులు చూస్తే బయం మాకు, మాంసారాలు తినము, నాబదులు ఈ ఏటకు మీరు ఎల్లండి అని చినరాజును పంపించి.
 ఆ పెళ్ళికూతుర్ని గుర్రం మీద ఎక్కించుకొని ఈ ఒంటి స్తంబం  మేడ కాటికి వచ్చి ఆ కోమిటిశెట్టి ఏసికం తీసేసి జరిగిన విషయం చెప్తుంది.
                         ఆ పన్నెండు మంది దొంగలు ఈమెను చెడిసే దానికి రెడీగా ఉండారు. ఆయమ్మ దావలో బంగారు సిరిమల్లెలు చేపించుకొని పోయి ఉంటుంది. మీ పన్నెండు  మందిలో ఎవరైతే గెరికి పాసతో ఈ సిరిమల్లెలు కుట్టి నా జల్లో  ముడుస్తారో వాళ్లకే నేను వశమయ్యేది. ఈ పని ఈ రేయిరేతిరే చేయల్ల. పొద్దుమాలిస్తే మల్ల నన్నంటు కుంటే తల బగిలి చస్తారు.
అని చెపుత్తుంది. ఆ పన్నెండు  మంది నేను కుడతా అని ఒకడు, కాదు నేనే కుట్టల్ల అని మరొకడు, ఇట్లా ఇరు పోటీలు ఏసుకొని తెగక  తెల్లారిపోతుంది. ఇంక నన్ను ముడితే మీ అందరి తలలు పగిలిపోతాయి అని శాపంపెడుతుంది. అబుడు ఆ దొంగలు ఎలిపోతారు. ఈ యమ్మ కూతుర్ని కంటుంది. ఈ రాణి లిద్దరూ ఆ ఇంట్లోనే  ఉంటారు. ఆరునెల్లు గడుస్తుంది. అబుడు ఈ చిన  రాజుకు ఈ యమ్మ జాబు రాసి పంపిస్తుంది ఏమని అంటే నువ్వు పెట్టిన షరతులన్నీ నేను చేసినాను నువ్వొచ్చి నన్నేలుకోవాలని. ఆ చినరాజు, ఆ జాబు చూసి ఇది ఎట్ల చేసింది, నాక్కానకుండా ఏమో చేసిందని గుర్రాన్ని ఏసుకొని వస్తా వుంటే ఆ దుమ్ముకు గుర్రం కూడా కనపడకుండా పోయింది . చినరాజు ఇచ్చిన కిరీటము, పట్టపు కత్తి, రాజ  ముద్రిక బిడ్డ పక్కన పెట్టింది. అబుడు ఆనవాలన్నీ నావే అని ఆ బిడ్డను, ఆ యమ్మను ఒప్పుకున్నాడు చినరాజు . ఈ బటురాజొచ్చి నన్ను క్షమించండి,నాదే తప్పు అని ఒప్పుకుంటాడు . తరువాత  బటురాజు తన కూతురికి మారుమనువు చేసి అంపిస్తాడు . చినరాజు నువ్వు నాకంటే పరాక్రమసాలివి అని రాణిని  మెచ్చుకొని బిడ్డతో సంతోషంగా ఉంటారు.
                     ఇదే ఇందిరీ కత.  బాగుందా ! ఆ రాణి కూడా నీఅట్లాడిదే . దేనికి తీసిపోయేది కాదు. ఆడది దైన్నంచేస్తే దేంట్లోనైనా మొగోన్ని తుంగలో తొక్కుతుంది. నీ మాదిరి అన్నిట్లోనా ఆరితేరిన ఆడది ఇంటికొకటి ఉండల్ల అని మెచ్చుకుండే ఈరతాత.  కత అయిపోయేసరికి నేను గెడ్డి కోసి మోపు కట్టుకొని ఇంటికొస్తి !
*

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి లో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. రచనలు : ముప్పై కథలతో 'ఎదారి బతుకులు ' కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. లఘుచిత్రాలు : మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు.

4 comments

Leave a Reply to jilukara srinivas Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జానపదీయతలోని విశేషం ఇదే. జీవిత వాస్తవికతని నర్మగర్బంగా చెప్పవచ్చు. పురుషుడికిబసాధ్యం కానంత మేధోశ్రమా శారీరకవిశ్రమా స్త్రీలు చెయ్యగలరు. దానికి సహనం సమయజ్ఞతా అదనం. మంచి కథ అందించిన ఎండపల్లి భారతికి అభినందనలు

    • Narration of the story was awesome,a lady can design her own life by her intelligence,,,,, Thank you for giving such a wonderful story madam

  • అస్సలు మాటలు లేవు. అక్షరాలు చదవడం కాదు… చిన్నప్పుడు మాయవ్వ పక్కలో పొణుకోని కత ఇన్నట్టుగా ఉండాది. తాతా తాతా ఇంగొక్క కత జెప్పే..

  • Endapalli Bharathi is the only story teller who knew the narratology. I am a great admirer for her stories. The folklorization of the modern story is her contribution to Telugu literature. I inclined to read more and more stories from her. The language she uses, the technique she employes and the essence of the life she ellucidates i.e amazing.
    Long live Endapalli Bharathi.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు