‘బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’లో పాతికమంది భారతీయులు…” వార్తాపత్రికలో పతాకశీర్షికన ప్రచురింపబడ్డ వార్త చదివి, అపరిమితమైన ఆనందానికీ, ఉద్వేగానికీ గురయ్యాడు ఆకాశ్! దేశమంటే విపరీతమైన భక్తి ప్రపత్తులున్న భారతీయునిగా, పాతికమంది భారతీయులకు అంతటి అసమానమైన గౌరవం లభించినందుకు ఎంతగానో పులకించిపోయాడు. నియంత్రించుకోలేని బావోద్వేగానికి లోనయ్యాడు.
వార్తాంశంలో ఉన్న మిగతా వివరాలను చదవసాగాడు ఉత్సాహంగా .
‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బ్లూంబెర్గ్’ సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ప్రపంచంలో అత్యంత ధనవంతులైన అయిదువందలమందిలో మనదేశానికి చెందిన అపరకుబేరులు ఇరవైఐదుమందికి మొదటి వంద స్థానాల్లోనూ చోటు లభించింది.”
“ఎనభై రెండు బిలియన్ డాలర్లు, అనగా ఇంచుమించు ఆరువేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులతో ముఖేష్ అంబానీ ఆ జాబితాలో పన్నెండవ స్థానం ఆక్రమించగా, పదిహేడు బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కలిగిన మరో ‘అర్థపతి’ రాధాకృష్ణ ధమానీ నూరవ స్థానంలో నిలిచారు.” అంటూ…
అందులో స్థానం లభించిన పాతికమంది లబ్దప్రతిష్టులైన వ్యాపారవేత్తల గురించీ, దేశ విదేశాలలో బహుముఖంగా విస్తరించిన వారి వ్యాపారసామ్రాజ్యాల గురించీ ఆసక్తికరమైన విశేషాలు అనేకం వెల్లడిస్తూ రాయబడిన ఆ వార్తాంశం చదువుతున్నంతసేపూ ఆకాశ్ హృదయం ఆనందంతో ఎగిసిపడుతూనే ఉంది.
‘భారతీయ బిలియనీర్లకు లభించిన ఈ అనుపమానమైన గౌరవం మన దేశం సాధించిన సర్వతోముఖాభివృద్దికీ, ప్రగతికీ ప్రబలనిదర్శనం! వలసపాలన నుండి విముక్తి పొందే నాటికి అత్యంత వెనుకబడిన, నిరుపేద దేశంగా మాత్రమే గణింపబడిన భారతదేశం ఈనాడు అన్ని రంగాలలోనూ అత్యద్భుతమైన పురోభివృద్ది సాధించి, ప్రతిష్టాత్మకమైన బ్లూంబెర్గ్ ఇండెక్స్ లో… ఏకంగా ఇరవై అయిదు స్థానాలు కైవసం చేసుకోవడం… అది కూడా జస్ట్ త్రీ క్వార్టర్స్ ఆఫే సెంచరీలో … ప్రతీ భారతీయుడూ గర్వించాల్సిన విషయం’ అని చాతీ పొంగించి మరీ మురిసిపోయాడు ఆకాశ్.
అంతే కాకుండా… ‘భారతీయులు తమను తాము పరిపాలించుకోవడానికి అవసరమైన మేదోసంపత్తీ, నిపుణతా, విలువలూ కొరవడిన అనాగరికమైన జాతి అనీ, అందుచేతనే వారు స్వాతంత్ర్యానికి అర్హులు కారనీ’ వదరిన జాత్యహంకారి “చర్చిల్’గాడే గనుక బతికి ఉండుంటే… ఈ అసమాన విజయాన్ని వీక్షించి ఉంటే… అసూయతో రగిలిపోయేవాడు!! క్రోధంలో కుతకుతలాడిపోయేవాడు!! అని కూడా తలపోసాడు పరమోల్లాసంగా. “ఇప్పుడైనా…నో డౌట్, దట్ రేబిడ్ ఇంపీరియలిస్ట్ మస్ట్ బి టర్నింగ్ ఇన్ హిజ్ గ్రేవ్” అనుకున్నాడు కసిగా.
*****
పందొమ్మిది వందల ఎనభయ్యొకటవ సంవత్సరంలో, న్యూయార్క్ నగరంలో స్థాపించబడ్డ ‘బ్లూంబెర్గ్’ సంస్థ ప్రపంచంలో అత్యంతసంపన్నులైన వ్యక్తుల జాబితానూ, వారి ఆస్తుల వివరాలనూ రోజువారీ పద్దతిలో ప్రకటిస్తుంది. ఐదువందలమంది అపరకుబేరులకు మాత్రమే ఆ ‘ఎక్స్క్లూజివ్ క్లబ్’లో స్థానం లభిస్తుంది. అలా అబించడం అంతర్జాతీయ వ్యాపారవర్గాలలో ఘనమైన విషయంగా పరిగణించబడుతుంది. లభించిన వారికి అది గొప్ప గర్వకారణమౌతుంది.
అయితే… అంతటి అపూర్వమైన ఘనత సాధించిన శుభసందర్భంలో ముఖేష్ అంబానీ గాని, మిగిలిన బిలియనీర్లు గాని ఎంత గర్వించేరో ఎవరికీ తెలియకపోయినా, ఆకాశ్ మాత్రం అదేదో తనకే లభించినంతగా సంతోషించేడని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. అతనలా సంతోషించాడానికి బలమైన కారణమే ఉంది!
*****
అమోఘమైన తెలివితేటలున్న ఆకాశ్, అత్యంత క్లిష్టమైన ‘చార్టర్డ్ ఎకౌంటెంట్’ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. తరవాత భారతీయ బేంకుల్లోనూ, ఇతర కంపెనీల్లోనూ ఎన్ని ఉద్యోగావకాశాలు వచ్చినా, వాటిలో ‘వర్క్ కల్చర్’ గాని, ప్రమోషన్ అవకాశాలు గాని సరిగ్గా ఉండవన్న ఉద్దేశ్యంతో వాటినన్నింటినీ తిరస్కరించాడు. చివరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక అమెరికన్ బేంకులో పెద్ద జీతంపై, మంచి హోదాలో జాయిన్ అయ్యాడు.
అయితే… అమెరికన్ బేంకులో ఉద్యోగం చేస్తున్నాడన్న మాటేగాని, అమెరికా అంటే ఎలాంటి వ్యామోహమూ, ప్రేమా లేవు ఆకాశ్ కు. నిజం చెప్పాలంటే ఆ దేశమన్నా, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, ప్రపంచ వాణిజ్యాన్ని తన కంటిచూపుతో శాసించిన మన భారతదేశాన్ని, కుట్రలూ కుతంత్రాలూ, మాయలూ మోసాల ద్వారా ఆక్రమించుకొని, రెండువందల ఏళ్ళపాటు నిరంకుశంగా పరిపాలించిన ఇంగ్లండ్ అన్నా విపరీతమైన అసహ్యం కూడా.
పరాయిదేశస్తుల కసాయి పాలనలో కోల్పోయిన పూర్వవైభవాన్ని మనదేశం ఎప్పటికైనా తిరిగి సంతరించుకోవాలన్న ఆకాంక్షతో పాటు, ఆ రోజు ఎంతో దూరంలో లేదన్న విశ్వాసం కూడా గుండెనిండా నింపుకున్న పాతికేళ్ళ యువకుడు శశాంక్. దేశభక్తి పరాయణుడు.
అటువంటి ఉన్నతమైన భావజాలం హృదయంనిండా నింపుకున్నవాడు గనుకనే, మన దేశానికి చెందిన ‘అంబానీ’, ఆదానీ, ‘శివ్ నాడర్’, ‘అజీమ్ ప్రేమ్జీ’ వంటి వ్యాపార దిగ్గజాలను ఎంతగా అభిమానించి, ఆరాధిస్తాడో, ఇతర దేశాలకు చెందిన వారిని అంతగానూ ఏవగించుకుంటాడు.
మనవారిలో కనీసం ఒకరైనా ‘బ్లూంబెర్గ్ ఇండెక్స్’లో మొదటి స్థానానికి చేరుకోవాలనీ, అలా చేరుకొని, దేశ ప్రతిష్టను ఇనుమడింప జేయాలనీ మనసా వాచా ఆకాంక్షిస్తాడు; ఆ రోజు ఎంతో దూరంలో లేదని బలంగా విశ్వసిస్తాడు; అందుకు తనవంతు సాయం అందించగలిగే స్థానానికి త్వరలో చేరుకునేలా ఆశీర్వదించమని తన ఇష్టదైవాన్ని వేడుకుంటాడు.
అయితే, తను పనిచేస్తున్న బేంక్ లో అత్యున్నతమైన స్థానానికి చేరుకుంటే తప్ప, తన కోరిక తీరడం సాధ్యం కాదన్న విషయం స్పష్టంగా తెలిసిన వాడు గనుక, ఆ దిశగా మార్గం సుగమం చేసుకునే కృషిలో నిమగ్నమై ఉంటాడు అహర్నిశమూ.
ప్రతీ బిజినెస్ జర్నలూ, పేపరూ శ్రద్దగా చదువుతాడు. స్టాక్ మార్కెట్ కదలికలను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. లోతుగా విశ్లేషిస్తాడు. దేశ విదేశాలకు చెందిన ఆర్దికవ్యవస్థల తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తుంటాడు; వాటి కదలికలను ముందస్తు అంచనా వేసే ప్రయత్నాలు చేస్తుంటాడు.
‘బేంకే సర్వస్వం’ అని భావించి రాక్షసుడిలా పని చెయ్యడమే కాక, అలా పనిచేస్తున్నట్టు పై అధికారుల దృష్టిలో పడేలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు.
ఎంత చేసినా, తను కోరుకుంటున్న స్థానాన్ని కైవసం కోవడానికి కనీసం మరో పాతికేళ్ళైనా పట్టొచ్చని గుర్తొచ్చినప్పుడు మాత్రం అసహనంతో రగిలిపోతుంటాడు.
*****
‘బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నసాళానికి ఎక్కించిన నిషా నుండి బయటపడేసరికి, పదిగంటలు కావడానికి ముప్పావుగంట సమయం మాత్రమే మిగిలి ఉంది. దానితో స్నానపానాదులు హడావిడిగా ముగించి, ఇంటినుండి బయట పడ్డాడు.
ఆఫీసుకు చేరుకోవడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉంటాయి ఆకాశ్ కు. వాటిలో మొదటిది సువిశాలమైన రాజమార్గం. కాకపోతే, దానిలో ట్రాఫిక్కూ ఎక్కువే, ట్రాఫిక్ జాంలూ ఎక్కువే! అందుచేత ఆఫీసుకు చేరుకోవడానికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువ.
ఇక రెండవది అటువంటి ఈతి బాధలేవీ లేని దగ్గర దారి. కాకపోతే, రాష్ట్రంలోనే అతి పెద్దదిగా విఖ్యాతి గడించిన ‘గొప్ప’ మురికివాడ పక్కగుండా పోయే ఇరుకైన రోడ్డది దానికితోడు భయంకరమైన దుర్వాసన వెదజల్లే ఎవరెస్టు శిఖరమంత ఎత్తైన చెత్తకుప్పోకటి గుబాళిస్తూ ఉంటుంది దానిపక్కనే … సర్వకాల సర్వావస్థలయందూ.
అందుకే ఆ దారిలో వెళ్ళడమంటేనే చెడ్డ చిరాకు ఆకాశ్ కు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే మట్టుకు, మురికివాడ ఆమడదూరంలో ఉండగానే తన ‘టాటా నెక్సాన్ ఎస్,యూ.వీ’ వేగం ఒక్కసారిగా హెచ్చించి, దానివేపు చూడనైనా చూడకుండా, ఊపిరి బిగబట్టి, ఝామ్మంటూ దూసుకుపోతాడు రాకెట్లా.
అయితే…, ఆరోజు బయల్దేరడమే ఆలస్యం కావడంతో ఆ దారిలోనే వెళ్లక తప్పలేదు పాపం. సరిగ్గా మురికివాడ దగ్గరకు వచ్చేసరికి, దురదృష్టవశాత్తూ, అక్కడేదో ఏక్సిడెంట్ జరిగినట్టుంది…, ట్రాఫిక్ జామై కూర్చుంది. వాహనాలన్నీ అడ్డదిడ్డంగా, వంకర టింకరగా, ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా ఆగిపోయి ఉన్నాయి రోడ్డంతా!! దానితో ఆకాశ్ కూడా కారు ఆపక తప్పలేదు.
ఎప్పటిలానే భయంకరమైన దుర్వాసనతో నిండిఉందా ప్రాంతమంతా. కడుపులో తిప్పినట్టై, వాంతి వచ్చినంత పనయ్యింది. తిన్న ఇడ్లీలూ నాలుగూ బయటకు వెళ్ళుకొచేస్తాయేమోనని భయమేసింది. విసుగ్గా జేబు లోనుంచి రుమాలు తీసి, ముక్కు మూసుకుంటూ, ఎప్పుడూ చూడని వాడు, చెత్తకుప్ప వేపు దృష్టి సారించాడు అసంకల్పితంగా! కళ్ళముందు కనిపించిన దృశ్యాన్ని చూసి, దృష్టి పక్కకు మరల్చుకున్నాడు మొహం చిట్లించుకుంటూ!! ఎందుకంటే…
అక్కడ… ఆ చెత్తకుప్ప మీద… కుళ్ళి, కంపుకొడుతున్న అన్నం మీద కులకులమంటూ పాకే బొద్దింకల్లా… చింపిరిజుత్తులతో… చీమిడిముక్కులతో… జీవంలేని కళ్ళతో… డొక్కలకంటుకుపోయిన పొట్టలతో… మాసిపోయిన శరీరాలతో… బాల్యమన్న పదానికి అర్దం తెలియని,,, ‘బడి’ అన్న రెండక్షరాల మాటే ఏనాడూ చెవినబడని… ఆకలీ, అనారోగ్యం తప్ప మరొకటేదీ అనుభవంలోకి రాని… బూతులు తప్ప ఇంకే భాషా మాట్లాడడం చేతగాని… వికసించక ముందే వసివాడిపోతున్న గడ్డిపువ్వుల్లాంటి పది పన్నెండేళ్ళ బాలలు…
విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లకోసం… పనికిరాని ఇనపముక్కల కోసం… తాగి విసిరేసిన విస్కీ సీసాల కోసం… చింపి పారేసిన చెత్తకాయితాల కోసం… ఒకదాని కోసమనేంటి, అమ్ముకుంటే అర్దరూపాయ డబ్బులు ఆర్జించిపెట్టే దేని కోసమైనా… ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వెతుక్కుంటూ… కుక్కల్లా కాట్లాడుకుంటూ… పందెంకోళ్ళలా పొడుచుకుంటూ… కాళ్ళతో తన్నుకుంటూ… గోళ్ళతో రక్కుకుంటూ… పరమ జుగుప్సాకరంగా బూతులు తిట్టుకుంటూ…… బాలలే అందరూ!!! వందరూపాయలు ఎవడెక్కువ పారేస్తే వాడికి ఓట్లు గుద్దేసి, దొంగలనూ దగుల్బాజీ వెధవలనూ అందలాలెక్కించే శక్తి సామర్ద్యాలు సమీపభవిష్యత్తులో సంతరించుకోబోయే భావి… భారత… ఓటరు… మహాశయులు!!
ఆ దృశ్యాన్ని చూసిన ఆకాశ్ కడుపులో మరింత దేవినట్టైంది. ’బ్లూంబెర్గ్ బిలియనీర్లు’ నడినెత్తి కెక్కించిన నిషా కొన్ని అంగుళాలు కిందికి జారినట్టు అనిపించింది. ఒకవేళ ‘చర్చిల్’ గనుక బతికుంటే… అన్న ఆలోచన కూడా ఎక్కడో నీరసంగా మెరిసిందిగాని… ‘ఉఫ్ఫ్’మని గట్టిగా ఊదిపారేసాడు దాన్ని. అక్కడ్నుండి వెంటనే బయటపడే మార్గం కనబడక పళ్ళు కొరుక్కున్నాడు కోపంగా.
ఇంతలో అనూహ్యంగా ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. ఆగిపోయిన వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలసాగాయి. దానితో ఎంతో రిలీఫ్ ఫీలయ్యాడు ఆకాశ్. ముక్కుకు అదిమి పెట్టుకున్న రుమాలు మడిచి జేబులో పెట్టుకొని, ‘థేంక్ గాడ్’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. వద్దనుకుంటూనే తలతిప్పి, వ్యర్దంలో అర్థం వెతుక్కుంటున్న పిల్లకాయల వేపు రోతగా చూసేడు.
“ఈవెన్ ద గాడ్ అల్మైటీ కెన్నాట్ సేవ్ దట్ స్కమ్!!! ఈవెన్ ఇన్ ఎనదర్ హండ్రెడ్ యియర్స్!!” అని తన ‘డిజ్గస్ట్’ ఎండ్ దిస్ప్లెషర్’ ‘డిగ్నిఫైడ్’గానూ ‘మేజెస్టిక్’గానూ, వినడానికి పక్కనెవరూ లేరు గనుక ‘సైలెంట్’గానూ ‘ఎక్స్ప్రెస్’ చేసి, తన ఆరాధ్యదైవాలైన అంబానీ, అదానీ, దమానీలనూ…, అలాంటి బిలియనీర్లే మరికొంతమందినీ భక్తిపూర్వకంగా స్మరించుకొని, కారును ముందుకు దూకించాడు కోపంగా!!
*
చిత్రం: సృజన్ రాజ్
చాలా బాగా రాసిన సెటైర్. “విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లకోసం… పనికిరాని ఇనపముక్కల కోసం… తాగి విసిరేసిన విస్కీ సీసాల కోసం… చింపి పారేసిన చెత్తకాయితాల కోసం… ఒకదాని కోసమనేంటి, అమ్ముకుంటే అర్దరూపాయ డబ్బులు ఆర్జించిపెట్టే దేని కోసమైనా… ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వెతుక్కుంటూ… కుక్కల్లా కాట్లాడుకుంటూ… పందెంకోళ్ళలా పొడుచుకుంటూ… కాళ్ళతో తన్నుకుంటూ… గోళ్ళతో రక్కుకుంటూ… పరమ జుగుప్సాకరంగా బూతులు తిట్టుకుంటూ…… బాలలే అందరూ!!! వందరూపాయలు ఎవడెక్కువ పారేస్తే వాడికి ఓట్లు గుద్దేసి, దొంగలనూ దగుల్బాజీ వెధవలనూ అందలాలెక్కించే శక్తి సామర్ద్యాలు సమీపభవిష్యత్తులో సంతరించుకోబోయే భావి… భారత… ఓటరు… మహాశయులు!!”
ఈ పరిస్తితి మరి దేశం లో ముకేష్ అంబానీలు , ఆడని లు పెరిగిపోయే పరిస్తితి కోసం ఆలోచించే మధ్యతరగతి మూర్కుడు.
ఇలాంటి మూర్ఖులు ఇప్పటి రాజ్యానికి పెద్ద మద్దతు.
ఇది కథ అనడం కన్నా ఈనాటి దుస్థితి అనడం సమంజసమేమో! మన దేశంలో సువాసన్ కన్నా దుర్వాసనే ఎక్కువ వెదజల్లుతూ ఉంటుంది. ఊపిరాడని వాళ్ళు అయితే ఉంటున్నారు, లేదా బలైపోతున్నారు.