“ప్రతిసారీ సాహిత్యమే సేదతీర్చింది”

ఇంటికి వచ్చేసాక మా కాలనీలో ధృడంగా ఉన్న రావి చెట్టుని చూస్తే మళ్ళీ కోటేశ్వరమ్మ గారే గుర్తుకు వచ్చారు.

రంగు రంగుల పూల గౌనుతో తప్పటడుగులు వేస్తున్న పసిపాపలా బయటకు వచ్చారామె. హుద్ హుద్ తుఫాన్ ని తట్టుకుని నిలబడ్డ మధుమాలతిని చూసినట్లు అనిపించింది. నమస్కారం చెప్తూ నిలబడ్డ నాతో వృద్ధాప్యం శాపం అమ్మా అన్నారు. ఎందుకో గుండెలో కలుక్కుమంది. పసిపాపలా ఉన్న ఆమె ఆ మాట అంటే  ఎందుకో కొంచెం బెంగగా అనిపించింది.  ఎందుకంటే ఆమె అంటేనే యుద్ధరంగం… కానీ కాలం ధాటికి ఎవరైనా శుష్కించాల్సిందే కదా అన్న ఆలోచన మనసుని మెలి పెట్టింది…

అవును మరి ఆమె మామూలు మహిళ ఐతే ఇంతటి బాధ ఉండేది కాదేమో.  కానీ ఆమె నిర్జనవారధి రాసిన ధీమతి కోటేశ్వరమ్మ. తన గురించి ఒక్క సారి అవలోకనం చేసుకుంటే…

“వందేళ్ళు… ఒక శతాబ్దం…

కాలం కొలతలో చూస్తే ఈ సమయం అణువంతేనేమో…

కానీ మనిషి లెక్కల్లో ఇది ఒక మూడు నాలుగు తరాల ప్రయాణం.

అదే ఒక యోధురాలి గుండె చప్పుడుని ఆలకించి చూస్తే అది ఒక స్ఫూర్తివంతమైన ప్రమాణం.

మామూలుగా స్త్రీ అంటేనే అహరహం అంతులేని దుఃఖంతో సహవాసం చేస్తూ ఉండే ఒక యుద్ధరంగం.

అదే మామూలుతనానికి కొన్ని సామాజిక ఉద్యమాల అలజడి తోడైతే…

అదే స్త్రీ ఒక బాల వితంతువు ఐతే…

తనే స్వాతంత్ర యోధురాలైతే

మళ్ళీ ఆమే రాజ్యం వేటాడే ఒక ఉద్యమకారుడికి భార్య ఐతే…

ఉద్యమం కోసం మాతృత్వాన్ని వదులుకోవటానికి సిద్ధపడిన తల్లి అయితే

మరో ‘ఆమె’కోసం తనదారిన తనని వదిలేసి సగటు భర్తగా ప్రవర్తించిన ఉద్యమ నాయకుడిని… మళ్ళీ చూడాలనుకోని ఆత్మాభిమాని అయితే

చేతి అందివచ్చిన ఇద్దరు పిల్లలనీ కోల్పోయిన అమ్మ అయితే

ఆ స్త్రీ ఎంతటి విధ్వంస రచనలో పాత్రగా మారిపోయినట్లు? ఆమె అంతరంగమంతా ఒక యుద్ధ భీబత్సాన్నితలపిస్తుందేమో అని మనకు అనిపించదూ… మనకి అలానే అనిపిస్తుంది.”

అని ఆమె గురించి తలచుకుంటూ నమస్కారం చెప్పాక, నా చేయి  పట్టుకుని పక్కన  కూర్చోబెట్టుకుని మళ్ళీ  వెనక్కి వచ్చేసేవరకూ చేయి వదిలిపెట్టలేదామె. నాకు కూడా ఆమె చేయి వదలబుద్ధి కాలేదు. సన్నగా బలహీనంగా ఉన్న ఆ చేయి నిజంగా మధుమాలతి తీగ లానే ఉంది. ముడతలు పడిన ఆమె శరీరం చూస్తుంటే వంటిపై ఉన్న ప్రతి ముడతా ఆమె దాటి వచ్చిన ఒక hurdle లా అనిపించింది.

ఆమె ఇంకా అప్పటికి లంచ్ చేయలేదని తెలిసి భోజనం చేయమని ఎంత బతిమాలినా భోజనానికి లేవలేదు. ప్రవాహంలా మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఒక్క ప్రశ్న కూడా అడగాలని అనిపించలేదు. కానీ ఆమె చెప్తూనే ఉన్నారు.

“నన్ను కన్నవాళ్ళు ఒక వైపు నుండీ, నేను కన్న పిల్లలు ఒక వైపు నుండీ దిగిపోతే ఒంటరిగా నిర్జన వారధిలా నిలబడ్డ నన్ను సాహిత్యమే సేద తీర్చింది.” అన్నారామె.  అన్ని కష్టాల తరువాత కొండపల్లి సీతారామయ్యతో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావని చాలామంది అడిగారట. దానికి సమాధానం అన్నట్లుగా  “సహజంగా స్త్రీ తత్త్వంలోనే మాతృత్వం నిండి ఉందమ్మా. ఎవరినైనా  క్షమించగల గుణం తల్లికి ఉంటుంది.” అని నాతో అన్నారామె.

“అయితే ఆయన్ని క్షమించగలిగారా?” అని అడిగా.

“ఏమో! భర్తగా, తండ్రిగా కాకపోవచ్చు” అస్పష్టంగా అంటూ చేతులూపారామె.  సమాధానం అసంపూర్ణంగా అనిపించింది. అయినా ఇంకా అడగలేదు. అడగటం అనవసరం కూడా అనిపించింది.

కరుణ గురించి తలచుకున్నప్పుడు మాత్రం చాలా ఉద్వేగానికి గురయ్యారామె. “కరుణ ఎక్కడికీ పోలేదమ్మా… నా కన్నీటిలోనే సజీవంగా ఉంది.” అన్నారు

“అందరిలా అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరగలేదు నేను.  నా పిల్లలకి కూడా అలా తినిపించే అదృష్టం నాకు కలగలేదు. అందుకే అమ్మ చెప్పిన కథలు రాసుకున్నా. నాకు తీరని అన్ని కోరికలూ అందులో కథలుగా చెప్పుకున్నా. చంద్రాన్ని రాజ్యం ఎత్తుకుని వెళ్ళినప్పుడు సంఘమిత్ర రాసుకున్నా. జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైన ప్రతిసారీ సాహిత్యమే నన్ను సేదతీర్చింది. నేను కృంగిపోతున్నా అనుకున్న ప్రతిసారీ ఎంతో మంది సాహితీమిత్రులు చేయిచ్చి నిలబెట్టారు.” అని ఆమె చెప్తుంటే మనసు తడి అయిపొయింది.

సీతారామయ్య గారు వేరే స్త్రీ సాన్నిహిత్యాన్ని కోరుకున్నపుడు ఆమెకి గొడవచేయాలని అనిపించలేదట. గొడవపడి ఇది నాది అని లాక్కోవటంలోనే ఫ్యూడల్ భావజాలం ఉందని ఆమె ఉద్దేశ్యం. ప్రేమ పునాదిగా లేని బంధం గురించి తాపత్రయ పడాలని అనిపించలేదని ఆమె చెప్తుంటే గట్టిగా హత్తుకున్నా. కొంతైనా ధైర్యం ట్రాన్స్ఫర్ అవుతుందేమో అన్న ఆశతో.

వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో వాళ్లపట్లే ఏదైనా కోపం కనిపిస్తుందేమో అని వెదికాను. ఉహూ… లన్న్తి ఛాయలేవీ మచ్చుకైనా కనిపించలేదు.  అప్పుడనిపించింది… “ఆమెకి ఆత్మస్తుతి పరనింద అసలు తెలియవు. ఆమెకి తెలిసిందల్లా మనిషిలో కనిపించిన కాస్త మంచిని పది మందికి తెలిసేలా చెయ్యటం. తన జీవితం లోని ఆయన్ని తనకి దూరం చేసిన స్త్రీ ని కూడా ‘ఆమె’ గా పరిచయం చేసిందే తప్ప ఎక్కడా కూడా ఆ స్త్రీ మూర్తి పేరు బయటకు చెప్పని మహోన్నత వ్యక్తిత్వం. ఉన్నతత్వం అంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించేది అని మనకి ‘ఈమె’ జీవితాన్ని చదివినప్పుడే తెలుస్తుంది.

ఏదో ఒక సామాజిక ఉద్యమంలో  ప్రపంచానికి మహోన్నతంగా కనిపించే నాయకులు… అన్ని విషయాలలోనూ అంతే ఉన్నతంగా ఉండరని… మిగిలిన విషయాలలో వారు కూడా సగటు మనుషులేనని ఈమె భర్తని గురించి చదివాక మనకి మరో సారి తెలుస్తుంది. అలాంటి భర్తని మరో స్త్రీ అయితే ఎంత ఆరడి పెడుతుంది.

అందుకే అనిపిస్తుంది… ఉదాత్తత అనే పదానికి నిలువెత్తు నిర్వచనాన్ని ఉదాహరణగా చూపించాలంటే ప్రప్రథమంగా ఈమె పేరే చెప్పాలని.”

కొనసాగుతున్న ఆలోచనల నుండి తేరుకుని “అమ్మమ్మా! మీ పుస్తకం మీద నేను రాసిన పరిచయం” అని నా అక్షరాలు చూపిస్తే పదే పదే ఇష్టంగా చదువుకున్నారు. “చాలా బాగా రాసావమ్మా” అని ప్రేమగా చేయి నొక్కి వదిలారు. ఆ  తరువాత ఏవొ జ్ఞాపకాలు కదిలించాయి కాబోలు చాలాసేపు  మౌనంగా ఉండిపోయారు.

ఆమె మౌనంతో పాటే… నాలో  మళ్ళీ ఆమె గురించిన ఆలోచనలు ….

“ఒకరిది ఒక వందేళ్ళ జీవితమైతే… కష్టమో… సుఖమో… అదంతా  ఒక ప్రవాహంలా అక్కడక్కడా నిండుగా… ఇంకోచోట పలుచగా సాగిపోతూ…  రెండు మూడు తరాల జీవితపు అంతరాలకి సాక్షిగా ఉండటమే జరుగుతుంది.

కానీ కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో… ఒకే సమయంలో… చెప్పలేనంత విషాదమూ..  దాన్ని ధైర్యంగా దాటేసే మానసిక స్థైర్యమూ… పక్క పక్కనే ఉంటూ ఉంటాయి. ఆమె జీవితపు ఏ ఘడియని తెరచి చూసినా  తన అనుభవాలే అనేక జీవితాలై … అనేక ప్రారంభాలూ… ముగింపులుగా మనకి తెలుస్తుంటే ఆ జీవితాన్ని మనం ఏ కోణంలో చూడాలి. ఎన్నెన్ని దుఃఖాలు తన మీదగా సాగిపోయినా తనకు తాను మైనపు వత్తియై కరిగిపోతూ, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని ధైర్యంగా కొనసాగిస్తున్న ఆమె ధీర ప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత… మనకు ఎన్ని పాఠాలు నేర్పుతాయి.”

***

ఆగస్ట్ 5 న విశాఖలో ఆమె పుట్టిన రోజుని తన అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమెకింకా ఆ విషయం తెలియదు. “ముందే తెలిస్తే కంగారు పడతారని నెమ్మదిగా చెప్పాలనుకుంటున్నాం” అని మునిమనవరాలు రచన చెప్పారు. తిరిగి వచ్చేస్తూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని “అమ్మమ్మా! మళ్ళీ వస్తా” అని టాటా చెపితే పసిపిల్లలా నవ్వారు. హాయిగా చేయి ఊపుతూ “వైజాగ్ లోనేగా ఉండేది. రోజూ రా” అన్నారు.

ఇంటికి వచ్చేసాక మా కాలనీలో ధృడంగా ఉన్న రావి చెట్టుని చూస్తే మళ్ళీ కోటేశ్వరమ్మ గారే గుర్తుకు వచ్చారు.

*

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

10 comments

Leave a Reply to Aranya Krishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి గురించి మంచి మాటలు రాసినందుకు అభినందనలు. చాలా బాగా రాసారు.

  • సీతారామయ్య గారు వేరే స్త్రీ సాన్నిహిత్యాన్ని కోరుకున్నపుడు ఆమెకి గొడవచేయాలని అనిపించలేదట. గొడవపడి ఇది నాది అని లాక్కోవటంలోనే ఫ్యూడల్ భావజాలం ఉందని ఆమె ఉద్దేశ్యం. ప్రేమ పునాదిగా లేని బంధం గురించి తాపత్రయ పడాలని అనిపించలేదని ఆమె చెప్తుంటే గట్టిగా హత్తుకున్నా. కొంతైనా ధైర్యం ట్రాన్స్ఫర్ అవుతుందేమో అన్న ఆశతో. ఉమా గారూ అమ్మమ్మ గురించిన శిఖరం లాంటి మాటలు ఇదొక్కటి చాలు.. అలా ఉండటమే ఆమెలోని ఉన్నతికి నిదర్శనం.. ఎంత బాగా చెప్పారు.. మీ ప్రజంటేషన్ చాలా చాలా బాగుంది.. నిజమే సాహిత్యమే సేద తీర్చేది… లవ్ యూ ఉమా… నాకు మిమ్మల్నీ హత్తుకోవాలనిపించింది.. అమ్మమ్మను హత్తుకున్నారుగా… థాంక్యూ…

  • నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా…కొండపల్లి సీతారమయ్యగారికి అత్యంత సన్నిహితులైన మా మామగారు యలమంచిలి వెంకటసుబ్బరావు గారి ద్వారా కోటేశ్వరమ్మ గారి గురించి,ఆమె ధైర్యం గురించి విన్నాను.ఇప్పుడు మీ రచన ద్వారా ఎంతో దగ్గరైన అనుభూతి కలిగింది…
    శత వసంతాల ఆ మహాతల్లికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • మన జెనెరెషన్ చాలా అదృష్టవంతులు అని చెప్పాలా లేదా అత్యంత దురదృష్టవంతులు అని చెప్పాలా అర్ధం కాలేదు ఉమా,ఇదంతా చదువుతుంటే.యాక్టింగ్ గవర్నమెంట్స్ కి బాజాలూదే బానిస దశాబ్ధపు సాహిత్యంలో, పరమాణువు మాత్రపు సమాజమయిన కుటుంబంలోనూ అటు పూర్తి సమాజపు లోటుపాట్లలోనూ రెండిటిలోను పోరాడి నిలబడగలిగే శక్తి కోటేశ్వరమ్మగారి లాంటిదే కదా.అసలు పొరాడే ఉద్ధేశ్యమే లేని నిస్సత్తువుల ఆకాశంలో సగాలు ఇలాంటి వ్యక్తిత్వాలలో కనీసం సగం అన్న ఓన్ చేసుకోగలరా అన్నదే ప్రశ్న ఎప్పటైకయినా?

    పైగా కోటబుల్ కోట్ గా ఆడవాళ్ళందరికి పుస్తకం కావాలసిన లైన్ ఆ ఒక్క “అతను వద్దనుకున్నాక బలవంతంగా కావాలనుకోవడం సత్యంగా ఫ్యూడలిజమే” అన్న వాక్యం. అది చదవగానే అంత వ్యక్తిత్వాన్ని ఒకసారి కలిసి ఘాడంగా హద్దుకొని కొంత పరిమళం అన్నా పులుముకోవాలి అన్న ఫీలింగ్ ఉమా,థ్యాంక్ యూ!

    పైగాన్నూ ఈ మొత్తం సిరీస్తో ఎప్పుడు కుదుటగానే అయినా కొంచం “హట్ కే ” గా ఆలోచించే అఫ్సర్ గారు తెలుగు సాహిత్యానికి మరో ఇలా మిణుగురు ప్రెజెంట్ చేయడం నిజంగా కుడోస్ .

  • బాగా రాసారు ఉమా! అమ్మమ్మ ఏది చెప్పినా ఒక రెవెలేషన్ వుంటుంది. గొప్పవారు మాత్రమే అనుభవాల్నుండి ఎరుకలు తీసుకోగలరు. అందుకే వారు ఏకాకితనంలో కూడా ప్రశాంతంగా వుండగలరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు