పొలిమేర తాకితే చాలు

ర్థరాత్రి వచ్చిన స్వాతంత్య్రంలో
నిర్ణయాలన్నీ చీకట్లోనే జరుగుతున్నాయి
తెల్లారితే పనులు బందాయని ఎరుకై ఇంటికేగుదామని
చుట్టూ చూసిన కళ్ళకి వాహనాలే కానరాక
మనసు దిగాలై దిగంతం దాకా చూపులెతుకుతున్నాయి
పక్కూరు కాకపాయె పదపద అంటూ మూటాముల్లె సర్దుకుని
నడవటానికి
వందల మైళ్ళ ఆవల ఊరు
ఊరుకి దారి మేము పోసిందే  నల్లగా మెరుస్తూ తెల్లచారల త్రాచులా రహదారి మరో దారి లేక నడక
మొదట్లో వడివడిగా పడిన అడుగులు
తన్నుకొస్తున్న నీరసం నిప్పులోలె మండుతున్న
తారు నెర్రెలిచ్చిన  పాదాల్లో దూరి యాతన
రుచి చూపెడుతుంది కనికరమే లేకుండా
ఎటునుంచి ఏ ఉపద్రవం ముప్పుకొస్తుందో తెలీదు
ప్రతొక్కడు సిద్ధం మాపై జులుంకి మాకెరుకే
తరాల సామాజిక అంతరాల అగచాట్ల లొల్లులు
లొట్లపై కాకుల్లా మాపై దాడికి అవి కాచుకుని కూర్చుంటాయి
కళ్ళ ముందున్న గమ్యమొకటే
ఊరిపొలిమేర తాకితే చాలు
నలుగురు నాలుగు విధాల సాయం చేయకున్నా
కనీసం మోస్తారు అంతిమంగా మావోళ్ళని
మొండితనం మాలో ఉండబట్టే
యాడైనా బతికే స్తైర్యం ధైర్యం మా గుండెల్లో
మా నెత్తురు చెమట చుక్కలై పునాదిరాళ్ళల్లో ఇంకిపోగా
వెలసిన భవంతుల్లో దీపాలు వెలుగుతున్నాయి
మా  నడకలో చీకట్లు ముసురుకున్నప్పుడల్లా నక్షత్రాలు మెరుస్తూ దారి చూపుతున్నాయి
ప్రకృతి తో బంధం మాది
మా తెగువ లో  కుంగే సంధ్య ఉదయించే సంధ్య
ప్రతిబింబిస్తాయి
ఎవరూ మా పక్షం వాలకపోయినా పొడిచే పొద్దు సాక్ష్యంగా
మా గమ్యాన్ని ముద్దాడుతాం
మాలో కొన్ని వాలిపోయినా…
*

గిరి ప్రసాద్ చెలమల్లు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు