పెద్దయ్యాక కలిసిన బాలమిత్రులు

పెద్దయ్యాక కలిసిన బాలమిత్రులు – YouTube

జనవరి రెండున నాది ఒకే ఒక్క కార్యక్రమం.

నూట ఏభై-నూటరవై కిలోమీటర్ల దూరాన ఉన్న పాండిచ్చేరి చేరుకోవడం, అక్కడ ఉన్న ఫేస్బుక్ మిత్రుడు చెరుకూరి రామకృష్ణతో వీలయినంత ఎక్కువ సమయం గడపడం. పాపం నిజానికాయన ముందటిరోజున విజయవాడలో ఉన్నా, నేను వస్తున్నానని తన కార్యక్రమం మార్చుకొని రాత్రి పూట బస్సు పట్టుకొని ఉదయం పదీ పదకొండుకల్లా పాండిచ్చేరి చేరుకొంటానన్నారు. అదే సమయానికి అక్కడికి చేరాలన్నది నా లక్ష్యం.

పాండిచ్చేరి అంటే సముద్రం ఒడ్డునే ప్రయాణం… అరవై కిలోమీటర్లలో మహాబలిపురం… ఇంకో వంద కిలోమీటర్లు వెళితే పాండిచ్చేరి- మహా అయితే నాలుగు గంటల ప్రయాణం.

ఉదయం ఆరు దాటకముందే ప్రయాణం మొదలెట్టాను.

దిక్కుల మీద మంచి అవగాహనే ఉన్నా గజిబిజిగా అల్లుకుపోయిన చెన్నై రోడ్లు పగటిపూటే నన్ను కాస్తంత

ఇబ్బంది పెడతాయి. అనుమానం వచ్చినపుడల్లా దారి అడుగుతూ వెళ్లడం, పెద్దగా తడబడకుండానే గమ్యం చేరుకోవడం నాకు అలవాటే.

ఆనాటి ఉదయపు మసక చీకటిలో దారులు పట్టుకోవడం అంత సులభంగా సాగలేదు.

గెస్ట్ హౌసునుంచి బయటపడి అశోక స్తంభం సెంటరుకు రాగానే నా వాకబులు మొదలెట్టాను. అంత పొద్దున్నే రోడ్డుమీద మనుషులు లేరు. ఉన్న ఒకరిద్దరూ ఏవో సమాధానాలు తమిళంలో చెప్పారు. అర్థం కాలేదు.

అడయారు వెళ్లే బస్సు కనిపించింది. మహాబలిపురం అడయారు మీదుగా వెళ్లినట్టు గుర్తొచ్చింది. ఆ బస్సును అనుసరించాను. కాస్త కష్టమే అయినా ఆ అనుసరణ నన్ను అడయార్ చేర్చేసింది! హమ్మయ్య అనుకొని మహాబలిపురం దారి పట్టుకొన్నాను. అడయార్ దాటాక తిరువాన్మియూర్, వీజేపీ బీచ్ ల మీదుగా మహాబలిపురం అన్న సంగతి గుర్తొచ్చింది.

అయినా ఎంత జాగ్రత్తగా ఉన్నాననుకొన్నా తిరువాన్మియూర్ దగ్గర పొరపాటు జరిగిపోయింది. ఎవరినో దారి అడగగా ఓ చక్కని దిశగా వేలు చూపించారు. అందులో ఓ పది కిలోమీటర్లు వెళ్లాక నేను వెళదామనుకొన్న దారి ఇదిగాదనిపించింది. కుడివేపున కనిపించిన ‘సత్యభామా యూనివర్శిటీ’ వాళ్ల బృహత్ ప్రవేశద్వారం దారి తప్పానని నిర్ధారించింది.

నే పట్టుకొన్నది రాజీవ్ంధీ ఎక్స్ప్రెస్ వే! సముద్రపు దారికి సమాంతరంగా- ఓ నాలుగు కిలోమీటర్లు లోపలగా మహాబలిపురంవరకూ సాగింది ఈ దారి. ఆ ఓల్డ్ మద్రాస్ రోడ్డు కన్నా ఇది అధునాతనమూ, వేగవంతమూ అన్నమాట నిజమే గానీ ఇదివరకటి దారిలో వెళ్లడం ద్వారా నా పాత జ్ఞాపకాలకు కొత్త ఊపిరి అందిద్దామన్న ఆలోచన విఫలమయింది! అదో చిరు విషాదం! నా దగ్గర స్మార్ట్ ఫోన్లూ, అందులో జీపీఎస్ లూ, గూగుల్ మ్యాపులూ ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేదే గాదు… నాకు ఆ ప్రావీణ్యం లేదు.

ఓ గంట ప్రయాణం సాగాక, మహాబలిపురం పరిసరాల్లో, స్కూటరు కొత్త శబ్దాలు చెయ్యడం వినిపించింది. గుండె గుభేలుమంది. ఇలాంటి దూరయాత్రలకు వెళ్లేవాళ్లు సంతరించుకొనే కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా నాకు లేదు. అది ఏ శబ్దమో, ఎక్కడ్నుంచి వస్తోందో పసిగట్టే ప్రయత్నం చేశానుగానీ ఫలితం లేకపోయింది. పోనీ మెకానిక్కు చూపిద్దామా అంటే అది మరీ మరీ ఉదయమయ్యే… ఏక్టివా తనను నిన్న విస్మరించిన సంగతికి ప్రతిగా తన ఉనికిని ఈ శబ్దాల ద్వారా ప్రకటించుకొంటోందా అనిపించింది. ఏమో… అయినా అవవచ్చు! యంత్రమయినంత మాత్రాన తనకో ఆలోచన ఉండదనుకోవడం పొరపాటు అన్నది నా అనుభవంలోకి పదేపదే వచ్చిన విషయం.

ఎలానూ మహాబలిపురం దరిదాపుల్లోకి చేరాం… మెకానిక్ దొరికే అవకాశ ముంటుంది. ఆ షాపులు తెరిచేదాకా ఊళ్లో గడుపుదాం అన్న ఆలోచనతో బండిని అటు నడిపించాను. అలా యథాలాపంగా పెట్టిన ఆ అడుగు ఓ రెండు గంటల శిల్పశోభాయాత్రగా పరిణమించింది.

ఆగడం ఆగడమే అర్జునుడి తపస్సు ఉన్న బృహత్ కుడ్యశిల్పం దగ్గర ఆగాను. దాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు- పూర్తిగా చూశామన్న తృప్తి కలగదు. అలాగే గంగావతరణం, పంచపాండవుల రథాలు, కృష్ణుని వెన్నముద్ద, సముద్రతీరపు గుడి, కొండమీది మంటపం, లైట్ హౌసు, కాస్తంత పక్కన మహాబలిపురం బీచి, శిల్పాల్లో బౌద్ధ వాస్తురీతి ఛాయలు- ఆ ఏడో శతాబ్దపు ‘పల్లవ’ శిల్పులను మరోసారీ మరోసారీ శ్లాఘించకుండా ఉండలేకపోయాను.

శిలలూ శిల్పాలతోపాటు సహయాత్రికులు కూడా నా అభిమాన విషయాలు గదా- పాండవుల రథాల దగ్గర ఎక్కడో దూరాన కొండలలో ఉండే తేని అన్న చిన్న పట్టణంనుంచి వచ్చిన ఓ కుటుంబం, బియ్యే ఆనర్స్ రెండో ఏడాది చదువుతున్న వాళ్ల పాప, హోసూరునుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడే మరో కుటుంబం, షోర్ టెంపుల్ దగ్గర ఓ అచ్చమైన తెలుగు పడుచు జంట, పలకరిస్తే ముందు బింకంగా ఉన్నా క్షణాల్లో అది కరిగిపోయి కెరటాల్లా కబుర్లు సాగడం… రెండు గంటలు తెలియకుండా గడిచిపోయాయి. ఈలోగా అల్పాహారమూ ముగిసింది.

ఊరు వదిలి పొలిమేరల్లోకి చేరగానే మెకానిక్కు దొరికాడు.

ఒకే ఒక్క నిమిషంలో ఏక్టివా శబ్దపు రహస్యం కనిపెట్టేశాడు!

హెడ్లైట్కు ఉన్న గ్లాసుకూ, మెటల్ ఫ్రేముకూ మధ్య చిన్న ఖాళీ ఏర్పడడంతో ఆ రాపిడి పుట్టిస్తోన్న శబ్దమది. గబగబా లైటు విప్పి తిరిగి బిగించి బండిని శబ్దరహితంగా చేశాడు. అంతా కలిసి పది నిమిషాలు కూడా పట్టలేదు. “ఏముందండీ ఇందులో తీసుకోడానికి,’ అంటూ ఎంతో బలవంతానగానీ రిపేరు ఛార్జీలు పుచ్చుకోలేదు. రిపేరు సంగతి తరవాత – దాని ద్వారా కలిగిన మనశ్శాంతో? దానికి వెల కట్టలేం కదా!

మహాబలిపురం దాటాక రాజీవ్ గాంధీ రహదారీ, సముద్రాన్ని ఆనుకొని వున్న ఈస్ట్ కోస్ట్ రోడ్ ఉరఫ్ ఓల్డ్ మద్రాస్ రోడ్డూ కలిసిపోయాయి. దారి పొడవునా పెద్ద పెద్ద జలదృశ్యాలు… సముద్రపు బాక్ వాటర్సా? అయి ఉండవచ్చు. నీళ్లు కనబడగానే మనసు పరవశించడమూ, ఓ నిమిషం ఆగి ఆ అందాన్ని మనసులోకి ఇంకించుకోవడమూ, కెమెరాకు పనిచెప్పడమూ- సహజంగా జరిగే విషయాలే గదా… హఠాత్తుగా ఎడమవేపున కల్పాక్కం అణు విద్యుత్ కేంద్రానికి దారి చూపించే బోర్డు… ఓ జీవితకాలం అందులో పనిచేసిన కాకినాడ క్లాస్మేట్ అనిప్పిండి కామేశ్వరరావు గుర్తొచ్చాడు.

ఓ జలాశయం దగ్గర బోటులూ, లైఫ్ జాకెట్లూ వగైరా హడావుడితో ఉన్న ఓ టూరిజంవారి విహార కేంద్రం కనిపించింది. ‘నా గంటకోసారి విరామం’ అన్న నియమాన్ని ఓ పది నిమిషాలు ముందుకు జరిపి ఆ లేతపచ్చని జలరాశి దగ్గర ఓ పది నిమిషాలు… వాళ్ల కేంటీన్లో చక్కటి కాఫీ…

జనవరి నెలే అయినా ఎండ ప్రతాపం ఏం తక్కువగాలేదు. అప్పటికే పదకొండు దాటేసింది. చిరుచెమటలు… ఆ చిత్తడి కలిగించే అసౌకర్యం… హఠాత్తుగా వీచే గాలి కలిగించే తాత్కాలిక ఆహ్లాదం… వాసవ సముద్రం, ఒడయూరు అన్న ఆసక్తికరమైన పేర్లు ఉన్న గ్రామాలు… అలా సాగిసాగి పాండిచ్చేరి పొలిమేరల్లో…

“మీకు బీచ్ రోడ్డు మీద ఉన్న గాంధీబొమ్మ తెలుసు కదా? అక్కడికి రండి. నేను వచ్చి కలుస్తాను. అక్కడ్నించి మా ఇల్లు మరో రెండు కిలోమీటర్లు. అడ్రసు చెప్పొచ్చుగానీ మీరు దాన్ని వెదికి పట్టుకోవడం అనవసరపు శ్రమ,” అన్నారు రామకృష్ణ ఫోన్లో. గాంధీబొమ్మ, బీచిరోడ్డూ నాకు పరిచయమే… రెండు మూడుసార్లు పాండిచ్చేరి వెళ్లి ఉన్నాను. అంచేత అతని ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకొన్నాను.

పన్నెండున్నర కల్లా గాంధీబొమ్మ దగ్గర కలిశాం.

“మీరు ఫేస్బుక్ ఫ్రెండ్సంటున్నారుగానీ నాకు మీరు పదేళ్లుగా తెలుసు. మీ శేఫాలిక కథల పుస్తకం చదివి అప్పట్లో మీతో ఫోన్లో మాట్లాడాను కూడా,” రామకృష్ణ మా స్నేహాన్ని ఓ దశాబ్దం వెనక్కి తీసుకు వెళ్లాడు.

అతను… ఆమె అనూరాధ… పెద్దపాప హరిచందన… చిన్నపాప హరికీర్తన.

విజయవాడకు చెందిన కుటుంబం… వ్యాపార వ్యాపకాల రీత్యా గత ఏడెనిమిది సంవత్సరాలుగా పాండిచ్చేరిలో ఉంటున్నారు. రామకృష్ణ వాళ్ల నాన్నగారు వన్ టౌన్ తేలప్రోలు రాజావారి హైస్కూల్లో డ్రిల్ టీచరుగా పనిచేసి రిటయిరయ్యారట. మళ్లా ఈ రామకృష్ణా మా అమెరికా స్నేహితుడు నాసీ అని పిలవబడే రచయిత నారాయణస్వామిగారూ హైస్కూలు క్లాస్మేట్లు!

రామకృష్ణ సాహిత్యాభిలాషి. చాలా పుస్తకాలు చదివిన మనిషి. అనూరాధగారు ఎంబీయే వరకూ చదువుకున్న చురుకైన లోతు ఉన్న మనిషి. పెద్ద పాప పదో క్లాసు… చిన్నపాప ఆరు.

క్షణాల్లో నలుగురూ పాత స్నేహితుల్లాగా దగ్గరయిపోయారు!! స్థూలదృష్టికి ఇది గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా ఇలాంటి అనుభవాలు నాకు ఎన్నెన్నో ఉండడం వల్ల మామూలుగానే అనిపించింది. అయినా చందన, కీర్తన కూడా కాసేపట్లో మాలిమి అయిపోయి వాళ్ల వాళ్ల చదువు గురించీ, స్నేహితుల గురించీ, స్కూళ్ల గురించీ, పాఠ్యేతర కార్యక్రమాల గురించీ, తమ తమ చిరు ఆందోళనల గురించీ చిరపరిచితుల్లా పోటీలు పడి చెప్పెయ్యడం- అపురూపమైన అనుభూతిని మిగిల్చింది.

నాకు అర్థమైనంతవరకూ వాళ్లది అర్థవంతంగా బ్రతకడంలోని విలక్షణతను, ఆహ్వానీయతనూ గుర్తించి, అలా బ్రతకాలని ప్రయత్నిస్తోన్న కుటుంబం. మామూలు మధ్యతరగతిలో జీర్ణించుకొనిపోయి ఉండే మిథ్యావిలువలూ, మిథ్యాగౌరవాలు, మిథ్యాజీవనసరళి- ఆ నలుగురిలో కనిపించలేదు. చందన ఆలోచనలు దాదాపు పెద్ద వయసువాళ్ల ఆలోచనలంత పరిపక్వంగా ఉన్నాయి. కీర్తన ఇంకా చిన్నపిల్లే అయినా స్వతంత్ర స్వభావం, తన విషయాలలో తానే బాధ్యత వహించే లక్షణం కనిపించి అబ్బురపరిచింది. అన్నట్టు పిల్లలిద్దరూ స్విమ్మింగ్ ఛాంపియన్లు. అనూరాధ కూడా అందులో ప్రవీణురాలు. దాంతోపాటు ఆ నలుగురూ అసలైన పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్లు.

అయినా ఇద్దరు టీనేజర్ల తల్లిదండ్రులకుండవలసిన ‘ఆరోగ్యకరమైన’ చిరు ఆందోళనలు ఆ దంపతులకున్నాయి. వాళ్లవాళ్ల ఆలోచనలల్లో కూడా చిన్న చిన్న తేడాలున్నాయి. అవి ఏ కుటుంబంలో అయినా సహజం. “ఒక మాట చెప్పండి అమరేంద్రగారూ… చందన ఇపుడు పదో క్లాసు. తనకు స్విమ్మింగే కాకుండా ఇతర ఆసక్తులూ ఉన్నాయి. చదువులోనూ బాగా ముందుంటుంది. ఈ నాజూకు స్థితిలో వేసవి సెలవుల్లో తనను కోచింగ్ క్లాసులో పెట్టడమా- తన ఇష్టం ప్రకారం, చదువుకు సంబంధించని ఇతర సమ్మర్ క్లాసులకు పంపడమా?” అనూరాధ ప్రశ్న.

కాసేపు ఆలోచించి, “నేనయితే చందనను ఇతర సమ్మర్ క్లాసులకే పంపుతాను. ఫస్టురాంకు గురించీ, ఐఐటీ సీటు గురించీ శ్రుతి మించిన శ్రమ పడనీయను. సహజసిద్ధంగా ఆ ఫలితాలు వస్తే మంచిదే. కానీ ఇలా సమ్మర్ కాంపు వేపు మొగ్గు చూపించమన్నది ఓ శాశ్వత ప్రయోజనానికి ప్రాతిపదిక, పునాది అవుతుందని నా నమ్మకం,” అన్నాను. ఆవిడకు ఆ సమాధానం పూర్తి సంతృప్తినివ్వదనీ, కొత్త ప్రశ్నలకూ సందేహాలకూ పుట్టిల్లు అవుతుందనీ తెలుసు.

“అరోవిల్ వెళదాం,” అన్నాడు రామకృష్ణ.

“నేను వచ్చింది అవీ ఇవీ చూడడానికి కాదు. మీతో సమయం గడపడానికి. అరోవిలి వెళ్లి రెండు మూడు గంటలు గడిపేకన్నా ఆ సమయం మీ నలుగురితో గడపడమే నాకు ఇష్టమయిన పని,’ సున్నితంగా స్పష్టపరిచాను.

అయినా సాయంత్రం ఆరయేసరికి కనీసం మా ఫ్రెంచి టౌనూ, అరవిందుని ఆశ్రమం, ఇంకా కొత్త సంవత్సర సంబరాల రంగులీనుతున్న వీధులూ, చర్చిలూ చూసి వద్దాం పదండి అని లేవదీశాడు రామకృష్ణ. నాకూ ఫ్రెంచి పేర్లు సంతరించుకొన్న ఆయా వీధుల్ని మరోసారి చూడాలనిపించింది.

బీచ్ రోడ్డులో గాంధీబొమ్మ దగ్గర నిలబడి సంధ్యాకాశం చూశాం. ఫ్రెంచి టౌనులో ఇప్పటికీ చెదరని ఫ్రెంచిబాణీ ఇళ్లు చూశాం. ఏదో ఒక మసీదు… అరవిందాశ్రమం ప్రాంగణంలో ‘అమ్మ’ నిలబడి సందర్శకులను అలరించిన బాల్కనీ, ‘రూ-ఫాంకోయిస్ మార్టిన్’ లాంటి పేర్లు ఉన్న వీధులు, అనుకోకుండా అరవింద ఆశ్రమంలోకి వెళ్లే అవకాశం దొరకగా అక్కడో అరగంట, ఓ రెండు ముఖ్యమైన చర్చిల లోపల ఓ పది నిమిషాలు, స్వర్ణోత్సవం జరుపుకొంటూ, ‘సరిహద్దుల్ని ఛేదిస్తాం, నూతన ఎల్లలు ఆవిష్కరిస్తాం’ అన్న రంగుల వెలుగుల దీపతోరణాలున్న సుప్రసిద్ధ జిప్మెర్ వైద్య కళాశాల ముఖద్వారం దగ్గర ఓ పదినిమిషాలు, అటు స్థానిక తమిళ పేటలలోనూ రెండడుగులు- తిరిగి ఇంటికి చేరేసరికి మూడు గంటలు గడిచిపోయాయి.

భోజనాలు ముగిసేసరికి రాత్రి పది దాటినా- అపుడూ నాకోసం ఒక ‘ఆశ్చర్యం’ ఎదురుచూస్తూ కనిపించింది. భోజనానంతర సమావేశం కోసం రామకృష్ణ వాళ్ల భవనంలో మొదటి అంతస్థులో ఉండే ఆ ఇంటి యజమానీ, ఆయన భార్యా వచ్చారు. ‘మా జ్ఞానసంపన్నుడైన స్నేహితుడొకరొచ్చారు, వచ్చి మాట్లాడండి,’ అని అతిశయోక్తించి ఉంటారు అనూ రామకృష్ణలు…

కబుర్లు అతి సులభంగా సాగాయి. ఆయన కొంచెం మితభాషి అయినా ఆవిడ మంచి మాటకారి. అయినా బోళామనిషి. ఇంగ్లీషు అంతగా రాకపోయినా ధారాళంగా సంభాషణ సాగించారావిడ. చందనతో సహా ఆరుగురం- పదకొండింటి దాకా సంభాషణలు… చదువుకోలేదన్న చిరు దిగులు ఆవిడలో ఉంది.

“పిల్లలు పెద్దాళ్లయిపోయారు గదా… అన్నామలై యూనివర్శిటీలో డిగ్రీ చెయ్యండి. నేను చేశాను. దూరవిద్యగదా అని ఆ యూనివర్శిటీవాళ్లు తేలిగ్గా తీసుకోరు. బాధ్యతగా కోర్సు నడుపుతారు. మీకున్న అనుభవానికీ, చదివే అలవాటుకీ, అభిరుచులకూ- డిగ్రీ చెయ్యడమన్నది ఎంతో ఎంతో సులభం,” అని ఆవిడలో ఒక నిప్పురవ్వను ప్రవేశపెట్టి చిరు ఆశాదీపాన్ని వెలిగించే ప్రయత్నాన్ని ఎంతో చిత్తశుద్ధితో చేశాను.

రామకృష్ణకు ఇంకా ఎంతో ఎంతో సాహిత్యం గురించీ, జీవితంగురించీ మాట్లాడాలని ఉంది. కానీ అప్పటికే అర్ధరాత్రి అవుతోంది. నేను తెల్లవారుఝామునే బయలుదేరాలని అతనికి తెలుసు.

“పిల్లలు ఎంతో ముచ్చటగా ఉన్నారు. మీరు ఏ రకమైన దిగుళ్లూ పెట్టుకోకండి. ఒక్క విషయంలో జాగ్రత్తపడండి. వాళ్లు ఏ వయసులో మన ‘నియంత్రణ’ స్థితిని దాటి మార్గదర్శకత్వం కోరే స్థితికి చేరతారో గమనించండి. ఆ స్థితికి వాళ్లు ఎంత తొందరగా చేరితే అంత మంచిది. ఆ స్థితికి చేరాక వాళ్లు మన నియంత్రణ అంగీకరించరు. అది గమనించకపోత కమ్యూనికేషను దెబ్బ తింటుంది. దూరాలు తెలియకుండానే పెరుగుతాయి. ఆ విషయంలో జాగ్రత్త,” నాకు తోచిన మాటలు వీలయినంత మృదువుగా, స్పష్టంగా చెప్పాను.

“నేను ఈ ప్రయాణం తలపెట్టింది ఓ స్కూటరు సాహసం చేద్దామనీ, గొప్ప గొప్ప ఊళ్లు చూద్దామనీ, వింతలూ విశేషాల మధ్య తడిసి ముద్దవుదామనీ కాదు… అన్నిటికన్న ముఖ్యమయినది మనుషుల్ని కలవడం… మీ నలుగుర్నీ కలిశాక ఇది ఓ రెండు గంటలకో, ఒక పూటకో పరిమితమయిన విషయంలా అనిపించడం లేదు. బహుశా మన ఈ పరిచయం చిరకాలస్నేహంగా పరిణమిస్తుంది. ఆ రకంగా నా ఈ యాత్ర ఇక్కడితోనే ఫలప్రదం అయిందనిపిస్తోంది. ఇక్కడితో ఈ యాత్రను ముగించి తిరిగి వెళ్లాల్సి వచ్చినా నాకు ఏమాత్రం విచారం కలగదు,” కొంచెం భావతీవ్రత ఎక్కువయిన మాట నిజమేగానీ ప్రతి పదమూ మనసులోంచి వచ్చినదే.

వాళ్లిద్దరూ ఆ జనవరి మూడు ఉదయం అయిదున్నర గంటల వేళ ఈ వీడ్కోలు మాటలు విని మాటల్లో స్పందించకపోయినా- వాళ్లూ అలాంటి భావో ద్వేగాలకే గురి అవుతున్నారని అనిపించింది.

*

దాసరి అమరేంద్ర

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు