పుస్తకం చేర్చడం ఎలా అనేది పెద్ద పజిల్: ఛాయా మోహన్

‘ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం. నచ్చిన పుస్తకం కొనుక్కుందాం.’ సెప్టెంబర్ 11న రవీంద్ర భారతీలో  మధ్యాహ్నం  3గంటల నుండి 8గంటల వరకు జరుగుతున్న సందర్భంగా-

ఛాయ  పుస్తకం అంటే చాలు వెంటనే కొనుక్కోవచ్చు అనే నమ్మకం ఏర్పడిపోయింది ఇప్పుడు.

ఆ నమ్మకం వెనక కృష్ణ మోహన్ బాబు అనే సాహిత్య పిపాసి  నిష్టా నియమం వున్నాయి. పుస్తకం ఎన్ని కాపీలు పోతుందన్న ఆందోళన కన్నా ఆ పుస్తకం తెలుగు పాఠకుల చేతుల్లో వుండి తీరాలన్న పట్టుదలా వున్నాయి.

ఆ విధంగా తెలుగు   పుస్తకాల ప్రచురణలో “ఛాయ”ది తనదైన ప్రత్యేకత. ఫైనాన్స్ సెక్టార్ లో పేరున్న కృష్ణ మోహన్ బాబుకి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ ఛాయకు పురుడుపోసింది. నాలుగేళ్లలో 30 పుస్తకాలు ప్రచురించిన ఛాయతో సారంగ చిన్న ముచ్చట.

ఫైనాన్స్ సెక్టార్ లో ఉన్న కృష్ణ మోహన్ బాబుకి పుస్తకాలు వేయాలనే ఆసక్తి ఎలా కలిగింది?

సాహిత్యం మీద ఉండే అభిమానం, పుస్తకాల పట్ల ఉన్న ఇష్టం ఈ వైపుగా నడిపించింది. కొన్ని మంచి పుస్తకాలు చదివినప్పుడు ఇలాంటి పుస్తకాలు ఎందుకు మనమే ఎందుకు వేయకూడదు అనిపించింది. అందుకే ఇలా.

ఛాయ నుండి డైరెక్ట్ తెలుగు రచనలతో దాదాపు సమానంగా అనువాదాలు వచ్చాయి? అనువాదాలు  వేయాలని ఎందుకు అనిపించింది?

ఏ భాషా సాహిత్యాన్ని  అయినా అనువాద సాహిత్యం సుసంపన్నం చేస్తుంది. మన తెలుగు సమాజం బెంగాలీ, మలయాళం, కన్నడ, రష్యన్ అనువాద సాహిత్యాన్ని ఆదరించింది. ప్రేమించింది. అందుకే ఛాయ కేవలం డైరెక్ట్ రచనలే గాక అనువాద రచనలూ వేయడానికి పూనుకుంది.

ఛాయ ప్రచురించే పుస్తకాలలో రచయితల దగ్గరికే పబ్లిషర్స్ గా మీరే వెళ్తారా? రచయితలే మీ దగ్గరికి వస్తారా?

తొలినాళ్ళలో పబ్లిషర్స్ గా మేమే వెళ్ళాం. ఛాయ నుండి వచ్చే పుస్తకాలు బాగుంటాయి అనే నమ్మకం పాఠకులలో కలిగింది. ఇప్పుడు రచయితలూ తమ పుస్తకాలు ప్రచురించమని వస్తున్నారు. ఛాయ ఇప్పుడు choosing positionలో ఉండటం మాకు గర్వకారణం.

పుస్తకం అంటే వెయ్యి ప్రతులు ప్రచురించాలి అనేది ఆనవాయితీ కదా!? ఈ మధ్య ఛాయ రెండూ, మూడు వందల ప్రతులు ప్రచురిస్తుంది. ఎందుకు అలా?

 ఒక పుస్తకం వేయాలి అంటే ముప్పై, నలభై వేలు ముద్రణకే ఖర్చు అవుతుంది. రచయితా రాయల్టీ వేరు. ఒక ప్రింట్ అమ్ముడు పోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. అదీ గ్యారెంటి లేదు.  కోవిడ్ సందర్భంలో ప్రింట్ ఆన్ డిమాండ్ వచ్చింది. అప్పుడు వచ్చిందే ఈ ఆలోచన. రెండు వందల పుస్తకాలకు పదివేల లోపే అవుతుంది. పాఠకుల ఆదరణ ఆ రెండు వందలు ఎన్ని రెండు వందలైనా అవ్వచ్చు. అంతే తప్పా రెండు వందలే వేస్తామని మా పాలసీ కాదు. పుస్తకాలు వేసి గోడౌన్లో ఉంచడం కన్నా ఇది బెటర్ ఐడియా కాదా? దీనివలన 2020 ఆగష్టు నుండి నేటిదాకా పదికి పైగా పుస్తకాలు తీసుకువచ్చాం. అందులో సగానికి పైగా పుస్తకాలు రెండు మూడు సార్లు రీ ప్రింట్ కి పోయాయి.

ఛాయ ఈమధ్య ఆడియో బుక్స్ లోకి కూడా ఎంటర్ అయినట్టు ఉంది?

అవును. ఛాయ ప్రచురించిన మెజారిటి పుస్తకాలు ఇప్పుడు Storytell అప్లికేషన్ లో ఆడియో బుక్స్ గా వస్తున్నాయి.

ఛాయ పుస్తకాలు ప్రచురిస్తున్న సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా?

అనువాదాలకు సరైన అనువాదకులు దొరకడం లేదు. ఉదాహరణకు మలయాళం వచ్చిన కొన్ని పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ, నేరుగా మలయాళం నుండి తెలుగులోకి అనువాదం చేసే వాళ్ళు లేరు. తెలుగులో క్వాలిటీ ఉన్న రచనలు తక్కువ వస్తున్నాయి. రచనల్లో వైవిధ్యం లోపిస్తుంది. చదివే పాఠకులు ఉన్నారు. వాళ్లకు పుస్తకం చేర్చడం ఎలా అనేది పెద్ద పజిల్ గా ఉంది. అమెజాన్ లాంటి  వాటిలో బాగానే పోతున్నా, అది సంతృప్తికరం కాదు. మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ కి ఫైనాన్స్ సెక్టార్లో వచ్చే డబ్బులతో జీతాలు ఇవ్వాగలుగుతున్నాం కానీ కేవలం పుస్తక ప్రచురణ మీదే సంస్థను నడపడం సాధ్యమయ్యే పనికాదు.

ఇప్పటి వరకు ఛాయ బయటి పుస్తకాలను పునర్ముద్రణ చేయలేదు? చేయకూడదు అనేది ఏమైనా పాలసీగా పెట్టుకుందా?

చేయకూడదు అనేది ఒక పాలసీగా పెట్టుకుంది. పాత పుస్తకాలను రీప్రింట్ చేయడానికే రీసోర్సెస్ వాడితే కొత్త రచనలు సమాజానికి ఎలా చేరుతాయి?  ఛాయకి మొదటి ప్రిఫరెన్స్ యువకులు రాసే రచనలే.

 ఛాయ వేయబోయే పుస్తకాలు?

పది పదిహేను పుస్తకాలు ఇప్పటికైతే షార్ట్ లిస్టు లో ఉన్నాయి. అంబేద్కర్ పై హిందీలో వచ్చిన పుస్తక అనువాదం, యూఆర్ అనంతమూర్తి అవస్థ అనువాదం, అమృతా కళ్యాణరావు కథలు, చుక్కల్ని చూద్దాం రండీ, తత్వవేత్తల సంక్షిప్త సమాచారం… ఇంకా చాలా….

 ఛాయ తరువాతి కార్యక్రమం?

‘ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం. నచ్చిన పుస్తకం కొనుక్కుందాం.’ సెప్టెంబర్ 11న రవీంద్ర భారతీలో  మధ్యాహ్నం  3గంటల నుండి 8గంటల వరకు నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా మా ప్రచురణలను 50 నుండి 100రూపాయలకే ఇస్తున్నాం.

*

అరుణాంక్ లత

4 comments

Leave a Reply to R.S. Venkateswaran Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగులో క్వాలిటీ ఉన్న రచనలు తక్కువ వస్తున్నాయి. రచనల్లో వైవిధ్యం లోపిస్తుంది.
    రచయితలు కూడా తమ పంధా మార్చుకోవాలి. విమర్శలను అహ్వానించాలి.

    పాఠకులు కూడా ఒకడుగు ముందుకు వెయ్యాల్సి వుంటుంది.

  • మంచి సాహిత్యం పాఠకులకు సరసమైన ధరలకు అందించాలనుకుని కంకణం కట్టుకున్న ఏకైక తెలుగు పుస్తకాల ప్రచురణ సంస్థ ఒక్క “ఛాయ” మాత్రమే.

  • ఛాయా చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు. ఛాయా నుంచి మరిన్ని పుస్తకాలు మరికొంతమందికి అందుబాటులోకి వచ్చేలా చేసే ప్రయత్నానికి ఊతమిస్తూ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సారంగా కు…అరుణ్ కు …

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు