నల్లమనుషుల కోసం పరితపించిన తెల్లటి హృదయం 

దేశం కాని దేశంలో పీడితుల కోసం అహర్నిశం పరితపించిన అరుదైన ప్రజా మేధావి గెయిల్ పీడితుల విముక్తి కోసం కలలుగన్న స్వాప్నికురాలు ఆమె!

భిన్న సామాజిక శ్రేణులైన కులాలు, వుపకులాలు, మతాలు, విశ్వాసాలతోపాటు వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, వాటిమధ్య వైవిద్యాలు, వైరుధ్యాలతో కలగూర గంపలాంటి భారత సమాజం అధ్యయన వేత్తలకు ఓగొప్ప సారవంతమైన నేలలాంటిది. ఈనేలని తవ్వేకొద్దీ యిక్కడి ప్రజలమీద కులం చేసిన దాష్టీకం తాలూకు గాయాలు బైటపడినట్టే వివిధ చారిత్రక సంధ్యలలో కుల వివక్షకు గురయ్యే ఆయా సమూహాలు వేసిన పెనుకేకలు కూడా భూమిపొరల్లోంచి వినిపిస్తాయి.

భారత సమాజంలో కులవ్యవస్థ, దాని పుట్టుపూర్వోతరాల నుంచి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన బ్రాహ్మణేతర, కుల నిర్మూలనా ఉద్యమాలపై పరిశోధన ప్రారంభించిన వారంతా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన పరిశోధకులే! వారిలో జిజ్ఞాసులైన క్రిస్టియన్ మిషనరీలు, విద్యావేత్తలు, మానవ శాస్త్రవేత్తలు(ఆంత్రోపాలజిస్టులు), సామాజిక శాస్త్రవేత్తలు(సోషయాలజిస్టులు), చరిత్రకారులు వున్నారు. హేమండార్ఫ్, రిస్లే, హట్టన్, హెన్రీ వైట్ హెడ్, రోజలాండ్ ఒహన్లాన్, బ్రిగ్స్, లించ్, జెఫర్లట్, ఎలీనార్ జెలియట్, గాబ్రియేల్ డిత్రిచ్, రైస్ డేవిడ్స్, ఆయన భార్య కరోలిన అగస్టా ఫోలి, వెండీ డోనిగర్ మొదలైన పాశ్చాత్య పండితుల కోవలో Gail Omvedt ఒకరు. వారిలో ఎలీనార్ జెలియట్, రోజలాండ్ ఒహన్లాన్, గాబ్రియేల్, వెండీ డోనిగర్ వంటి స్త్రీలు వున్నప్పటికీ భావజాల పరంగా, పరిశోధనా పరిధి పరంగా గెయిల్ భిన్నమైన పరిశోధకురాలు. మిగిలినవారు కేవలం తమ మేధస్సును వుపయోగించి పరిశోధన చేస్తే గెయిల్ తన హృదయంతో  మేధస్సును జతచెయ్యడం ఆమె గొప్పతనం అనుకోవచ్చు. అందుకే ఆమె అందరికీ ప్రేమాస్పదురాలు అయ్యింది. భారతీయ సమాజంలో కులవ్యవస్తపై  పనిచేసే వుద్యమకారులకు విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులకు, పరిశోధకులకు పరిచయం అక్కర్లేని పేరు గెయిల్. ఆమె అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ భారత సమాజంలోని అణగారిన ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా కలిసిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

Gail Omvedt అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలోని మిన్నెపోలీస్ లో ఆగస్ట్ రెండో తేదీ, 1941 లో పుట్టారు. కార్లటన్ కాలేజీలో సోషయాలజీ చదివి పీ.హెచ్డీ డిగ్రీకోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ లో చేరారు.  1964-65లలో  గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ గా ఓసారి ఇండియాకి వచ్చి వెళ్ళిన గెయిల్  పరిశోధన కోసం 1972లో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గెయిల్ కు ఎలీనార్ జెలియట్ స్కూలులో చదివే రోజులనుంచి తెలుసు. ఆమె పీ. హెచ్డీ కోసం వలసవాద కాలపు భారతదేశంలో అణగారిన కులాలనుంచి పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైన బ్రాహ్మణేతర వుద్యమాలను తన పరిశోధక అంశంగా ఎన్నుకున్నారు. అకడమిక్ పరిశోధన అనేది ఆమె ఈదేశంలో పర్యటించడానికి ముఖ్య కారణం అయినా ఆపనిలో ఆమె నిమగ్నత మిగిలినవారికంటే గెయిల్ ను భిన్నంగా నిలబెట్టిందనుకోవచ్చు. అరవయ్యవ దశకంలో ఆమెకంటే ముందు వచ్చిన చరిత్రకారిణి ఎలీనార్ జెలియట్ కూడా మహారాష్ట్రలో ఫూలే, అంబేడ్కర్ పనిచేసిన ప్రాంతాలలో పర్యటించి వారి అనుయాయులను కలిసి వారివద్ద నుంచి నేరుగా సమాచారం సేకరించడం గెయిల్ కు కొంతమేరకు ఆదర్శంగా అనిపించినప్పటికీ ఫూలే అంబేడ్కర్ వుద్యమాలపై ఎలీనార్ జెలియట్ కంటే విస్తృతమైన అద్యయనం చేశారు గెయిల్.

గెయిల్  ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన వుద్యోగం చెయ్యకపోవడం గమనార్హం. ఆమె సోషయాలజీ ప్రొఫెసర్ గా పూనే యూనివర్సిటీ లో కొన్నాళ్ళు పనిచేశాక, ఒరిస్సాలోని NISWASS లో అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ గా,  కోపెన్ హెగెన్ లోని నార్డిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ లో ఆసియా దేశాలకు చెందిన గెస్ట్ ప్రొఫెసర్ గా, చివరిగా డిల్లీలోని ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ గా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో సీనియర్ ఫెలోగా పనిచేసారు. అనేక జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్ ప్రాజెక్టులలో రీసర్చర్ గా, సలహాదారుగా వున్నారు.

ఆమె  కేవలం తన పీ. హెచ్డీ కోసం సమాచారాన్ని సేకరించడం మాత్రమేకాక భారత సమాజంలో కులం నిర్వహించే పాత్రను అర్ధం చేసుకుని యిక్కడి అణగారిన ప్రజలకు అండగా నిలబడడం ఆమె ప్రత్యేకత. గెయిల్ అణచివేతకు గురయ్యే దళితులూ, ఆదివాసులు, స్త్రీలు తమ వునికికోసం, ఆత్మగౌరవం కోసం సాగించే వుద్యమాలతో మమేకమైంది. ఆమె మహారాష్ట్ర దళిత పాంథర్స్ వుద్యమం నుంచి గత నాలుగు దశాబ్దాల దళిత, ఆదివాసీ, స్త్రీ, రైతాంగ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలబడింది. BAMSEF కి తన సంఘీభావం తెలిపింది. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం BAMSEF కాలం నుంచి గెయిల్ తో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించేవారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే క్రమంలో గెయిల్ ఆమ్వేద్ట్ మహారాష్ట్రకు చెందిన మార్స్కిస్టు, ఫూలేవాది అయిన డా. భరత్ పటాంకర్ ను 1974లో వివాహం చేసుకున్నాక యిక్కడే వుండిపోవాలనే నిర్ణయానికి వచ్చి 1983లో తానుపుట్టి పెరిగిన  అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వాన్ని స్వీకరించింది. ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావం వున్న పటాంకర్ ను వివాహం చేసుకువడం కూడా గెయిల్ కు వుద్యమాలపరంగా గ్రామస్థాయిలో పనిచెయ్యడానికి, పరిశోధన చెయ్యడానికి దోహదం చేసింది. భారత సమాజంలో అణగారిన ప్రజల విముక్తి కోసం సమస్తం ధారపోసిన మహనీయులు మహాత్మా జ్యోతీరావు ఫూలే, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ల కృషిపట్ల ఆమెకుండే ప్రేమ బలమైన యిరుసుగా పనిచేసి ఆమె జీవితాన్ని యితరులకంటే భిన్నంగా నిర్వచించుకునేలా చేసిందనవచ్చు.

సాధారణంగా కుల వ్యతిరేక భావజాలం కలిగిన మేధావులూ, ఉద్యమకారులు వర్గపరమైన అంశాలకు ప్రాదాన్యతనివ్వరని, స్త్రీవాదులు ఎంతసేపటికీ సమాజాన్ని స్త్రీ కోణం నుంచి తప్ప కుల, వర్గపరమైన అంశాలను తరచుగా విస్మరిస్తారనే అభిప్రాయం వుంది. అయితే గెయిల్  ఒక స్త్రీగా వుండి భారతదేశం లాంటి ఒక సంక్లిష్ట సమాజంలో కులం, వర్గం, లింగం(జెండర్) నిర్వహించే పాత్రలను తన రచనలలో లోతుగా చర్చించారు.  భారతదేశంలో కుల వివక్ష, కుల వ్యతిరేక బ్రాహ్మణేతర ఉద్యమాలు, ఫూలే, అంబేడ్కర్ ల జీవితం, వారు నడిపిన ఉద్యమాలపైన, బ్రాహ్మణీయ వైదిక మతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధం, ప్రాచీన కాలంలో బుద్ధుడి నుంచి బ్రాహ్మణీయ వైదిక మతానికి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా గొంతువిప్పిన బ్రాహ్మణేతర   సంస్కర్తలు, తాత్వికులు, భక్త కవులు, వుద్యమకారులు, దళిత శ్రామిక కులాల స్త్రీలు, ఆదివాసీలు, చిన్న, సన్నకారు రైతుల సమస్యలు, పర్యావరణం మొదలైన అంశాలపైన సుమారు ముప్పై రెండు పుస్తకాలను రాసి ప్రచురించారు. వాటిలో Cultural Revolt in Colonial Society- The Non-Brahmin Movement in Western India(1976),We Shall Smash this Prison(1980),Violence against Women: New Movements and New Theories in India(1990), Re-Inventing Revolution: New Social Movements and the Socialist Tradition in India(1993), Dalits and Democratic Revolution(1994), Dalit Visions(1995), Buddhism in India: Challenging Brahmanism(2003), Ambedkar: Towards an Enlightened India(2004), Seeking Begumpura: The Social Visions of Anti caste Intellectuals(2008), Jyotirao Phule and the Ideology of Social Revolution in India, Building the Ambedkar Revolution, Understanding Caste from Buddha to Ambedkar and Beyond(2011),The Songs of Tukoba(Translations with Bharat Patankar, 2012) మొదలైన గ్రంధాలు ముఖ్యమైనవి. ఆమె పుస్తకాలలో కొన్ని మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఆమె భారతదేశంలో ప్రారంభమైన దళిత ఆత్మగౌరవ ఉద్యమాలపై ముఖ్యంగా మహాత్మా జ్యోతీరావు ఫూలే పై రాసిన పుస్తకం ఆయనని సమగ్రంగా ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం అనుకోవచ్చు. అలాగే అంబేడ్కర్ వుద్యమాన్ని, జీవితాన్ని గెయిల్ తన పుస్తకంలో గొప్పగా ఆవిష్కరించడం కూడా ఆయనపై మొదటగా వచ్చిన పుస్తకంగా భావించవచ్చు. అప్పటికి ఎలీనార్ జెలియట్ అంబేడ్కర్ మీద కొంతమేరకు పరిశోధన చేసి రాసినప్పటికీ ఆమె కృషికి కొన్ని పరిమితులున్నాయి. జెలియట్ అంబేడ్కర్ ను మహర్ల నాయకుడిగా, రాజ్యాంగ రచయితగా చిత్రిస్తే గెయిల్ అంబేడ్కర్ లో భారతదేశానికి సంబంధించి సమస్తమైన రుగ్మతలపై కత్తికట్టిన రాడికల్ గా, విప్లవకారుడిగా అభివర్ణించడం విశేషం.

బౌద్ధాన్ని బ్రాహ్మణవాదానికి కులతత్వానికి సవాలు విసిరిన మతతత్వంగా విశ్లేషించారు. స్త్రీలపట్ల బుద్ధుడి సానుకూల దృక్పధాన్ని, సంఘ నిర్మాణంలో బుద్ధుడి విశాల సామాజిక విప్లవాచరణను,  బుద్ధుడు బ్రాహ్మణీయ పండిత భాష అయిన సంస్కృతాన్ని కాదని ప్రజల భాషయైన పాళీకి ప్రాముఖ్యతనివ్వడం మొత్తంగా బౌద్ధంలో వుండే ప్రజాస్వామిక దృష్టిని గెయిల్ తన పుస్తకంలో ఎత్తిచూపడమేకాక ప్రాచీన భారత దేశంలో పరిడవిల్లినది ‘బౌద్ధ నాగరికత’ అని సూత్రీకరించి మతతత్వ చరిత్రకారుల చెంప చెళ్ళుమనిపించింది. అప్పటివరకు ప్రాచీన భారతాన్ని హిందూ యుగమని, మధ్య యుగ భారతాన్ని మహ్మదీయ యుగమనే సూత్రీకరణలను రొమిల్లా థాపర్ వంటి కొద్దిమంది మార్క్సిస్టు చరిత్రకారులు తప్ప మెజారిటీ చరిత్రకారులు పెద్దగా వ్యతిరేకించకపోవడం చూస్తాం. కానీ, గెయిల్  ఈదేశం బౌద్ధ దేశమని, ప్రాచీన భారతంలో పాలకులు, ప్రజలు బౌద్ధులేనని తేల్చి చెప్పడం సాహసోపేతమైనది.

గెయిల్ బ్రాహ్మణేతర ఉద్యమాలపై పరిశోధన చేసి పుస్తకాలు ప్రచురించడం ప్రారంభించిప్పటికి యిక్కడ ఫూలే అంబేడ్కర్ సిద్ధాంతాలపై అటు సంప్రదాయ వాదుల్లోనేకాక యిటు అభ్యుదయ వాదులైన  సోషలిస్టు మేధావి వర్గంలో కూడా సానుకూల వైఖరి లేకపోగా వ్యతిరేకతే ఎక్కువగా వుండేది. ఆవిషయాన్ని ఆమెకూడా గమనించినట్టు ఒక సందర్భంలో చెప్పారు. అలాగే పీపుల్స్ వార్ పార్టీ అంబేడ్కర్ ను ‘లిబరల్ బూర్జువా’ గా, అస్తిత్వ వుద్యమాలను సంస్కరణవాద వుద్యమాలుగా గుర్తించడం అనేది ఈనాటిది కాదు, ఈ దేశపు కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభ కాలం నుంచే ఆపార్టీ జాతీయ నాయకుడైన డాంగే వంటివారు అటువంటి అభిప్రాయాలను, సూత్రీకరణలను చేస్తూ వస్తున్నారని ఆమె అన్నారు. అయితే ఒక పాశ్చాత్య మేధావిగా ఆమెకుండే ప్రత్యేకత వల్ల గెయిల్ కు యిక్కడి సంప్రదాయ, అభ్యుదయ మేధావులనుంచి విమర్శలు, మేధోపరమైన దాడులు తక్కువనే చెప్పాలి. మండల కమిషన్ ఉద్యమం సందర్భంలో  పైకులాల అభ్యుదయ వాదులకులాగే  మీడియా కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నప్పుడు గెయిల్ మండల్ అనుకూల వ్యాసాలు రాసి బహుజన కులాల నుంచి వచ్చే మేధావులకు పరోక్షంగా ఒక భరోసాని యిచ్చి వారిలో మరింతమంది తమ గొంతు పెగుల్చుకుని మాట్లాడడానికి, రాయడానికి ఆమె వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ఆమె అయోధ్య, రధయాత్రలపైన, కుల దురహంకారులు, మతతత్వ మూకలు దళితులూ, మైనారిటీలు, స్త్రీలపైన చేసే అగాయిత్యాలు, అత్యాచారాలపైన వివిధ పత్రికలలో విస్తృతంగా వ్యాసాలు, కాలమ్స్ రాశారు, ఆయా ఉద్యమ సంబంధమైన ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. మేధావులనూ, వుద్యమకారులనూ, గ్రామస్థాయి ఉద్యమ కార్యకర్తలను కలిసి చర్చించారు. వుమ్మడి  ఆంద్రప్రదేశ్ లో కె.జి. సత్యమూర్తి వంటి వుద్యమకారులతో ఆమె స్వయంగా కలిసి సంభాషించారు. కులపరమైన హింస జాతివివక్ష తాలూకు ఒకానొక రూపమని ఆమె భావన. పీడిత ప్రజల విముక్తి ఉద్యమాలలో ఆమె నిమగ్నత, నిబద్ధత కనబరిచింది. గెయిల్ శరత్ జోషి నడిపిన రైతు వుద్యమమానికి సంఘీభావం  తెలిపింది. ఆమె తన భర్త అయిన డా. భరత్ పటాంకర్ తో కలిసి ‘శ్రామిక విముక్తి దళ్’ అనేపేరున ఒక ఉద్యమ సంస్థని స్థాపించి దానిద్వారా నిరుపేద శ్రామికుల, భూమిలేని పేదరైతుల కోసం పనిచేసింది.తన భర్తతో కలిసి చిన్న, సన్నకారు రైతుల సమస్యలమీద, ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ(Special Economic Zones) పేరున ప్రభుత్వాలు సహజవనరులను కార్పోరేట్లకు దోచిపెట్టడం, ఆదివాసులను తమ ఆవాసాల నుంచి వెళ్ళగొట్టడం వంటి ఆర్ధిక ఉగ్రవాదంపై పోరాటం చెయ్యడమే కాక తాము నివసించే సాంగ్లి జిల్లా, కోసేగాం లో ప్రజల సాగునీరు, తాగునీరు సౌకర్యాలకోసం స్వయంగా వారు ఒక చెక్ డ్యాంను నిర్మించడం గెయిల్ దంపతుల విప్లవ కార్యాచరణకు నిదర్శనం. తనకాలపు యితర స్త్రీ మేధావులు, ఉద్యమకారులవలే గెయిల్ ఎప్పుడూ పబ్లిసిటీని కోరుకోలేదు.  అయినప్పటికీ ఆమె వక్తగా హాజరయ్యే సభలకు జనం విపరీతంగా వచ్చి ఆమె మాటలు వినాలని ఆశపడడం గెయిల్ కు వున్న ప్రజాకర్షణ,  ఆమె మేధస్సు, వ్యక్తిత్వాల పట్ల వున్న అభిమానానికి గుర్తుగా భావించాలి. గెయిల్  ప్రజా ఉద్యమాలలో, వీధి పోరాటాలలో తానూ ఒక సాధారణ కార్యకర్తను అనుకుని పనిచేస్తుంది. వుద్యమంలో భాగం కాకుండా ఏ ఉద్యమాన్ని అర్ధం చేసుకోలేమని ఆమె అభిప్రాయం. ఆమె తాను స్థిరపడిన మహారాష్ట్రలో స్థానిక భాష అయిన మరాఠీ భాషను అంతే నిబద్ధతత్తో నేర్చుకోవడమే కాదు ఆభాషలో చదవడం, రాయడం, మరాఠీ దళిత సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యివన్నీ ఆమె తన సహచరుడు పటాంకర్ తో ఆడుతూ పాడుతూ చేసింది. ఆమె ఆయన కలిసి మరాఠీ భక్తీ కవి అయిన ‘తుకారాం’ గేయాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి ప్రచురించారు.

సమకాలికంగా భారత దేశంలో దళితులకు సంబంధించిన ప్రతి అంశంతో ఆమెపేరు ముడిపడి వుందంటే అతిశయోక్తి కాదు. 2001 జాత్యాహంకారం, కుల వివక్షలపై దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ఆమె ప్రతినిధిగా హాజరై జాతి సమస్యకు, కుల సమస్యకూ పొంతన లేదని భారత ప్రభుత్వం తరపున వచ్చిన వ్యాఖ్యానాన్ని ఖండించింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వున్నప్పటికీ భూపాల్ డిక్లరేషన్ కు కూడా ఆమె హాజరవ్వడం విశేషం. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆమె సలహాదారుగా పనిచేశారు.  కొయనా డ్యాం నిర్మాణంలో నిర్వాసితులైన ప్రజల హక్కులకోసం పోరాడింది. అమెరికావంటి దేశాలలో నల్లజాతివారి హక్కుల పరిరక్షణ కోసం వచ్చిన చట్టాలకంటే భారత దేశంలో దళితుల కోసం వచ్చిన చట్టాలు, వాటి అమలుతీరు అవకతవకలతో బలహీనంగా వున్నాయని ఆమె అంటారు.

గెయిల్  కులంపైన నిర్భయంగా, సూటిగా రాయడం, మాట్లాడడం ప్రారంభించాకనే  బహుజన కులాలనుంచి కంచ ఐలయ్య, గోపాల్ గురు, సుఖదేవ్ తోరట్ వంటివారు అకడమిక్ రంగంలో కుల వ్యతిరేక మేధావులుగా ఎదిగివచ్చారు. తర్వాత ఆమె మేధోపరమైన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా అనేకమంది అందుకుని చరిత్రకారులుగా, సామాజిక వేత్తలుగా, ప్రజా మేధావులుగా ఆవిర్భవించారు. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గెయిల్ యిచ్చిన ధైర్యం, అండదండలే కారణమని చెప్పొచ్చు. పాశ్చాత్య దేశాలకు చెందిన మేధావియైన గెయిల్ ఒకవైపు ఉద్యమకారిణిగా, మరోవైపు విద్యావేత్తగా  అకడమిక్ రంగంలో క్రియాశీలకంగా పనిచెయ్యడం వల్ల ఆమె రచనలను ప్రచురించడానికి  పేరున్న ప్రచురణ కర్తలు పోటీపడే పరిస్థితి వుండేది. వారికి ఆమె పుస్తకాలు ఆర్ధికంగా కూడా బోలెడన్ని లాభాలను ఆర్జించి పెట్టాయని చెప్పొచ్చు.

ప్రపంచాన్ని పట్టి పీడించే జాతి, మతం, పేదరికం వంటి సమస్యలపట్ల లోతైన అవగాహన వుండే గెయిల్  పరిచయాలు, మిత్రులు అన్ని స్థాయిల్లో వుండడం ఆమె విశాల దృష్టికి, మనిషితనం పట్ల ఆమె ప్రేమకు నిదర్సనం అనుకోవచ్చు. ఆమె స్నేహితులలో మేధావులూ, రచయితలూ, ఉద్యమ నాయకులూ, సాధారణ కార్యకర్తలు నగరాలు, పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకూ వున్నారు. వచ్చీరాని చీరకట్టులో గెయిల్ జనంతో కలిసి కలివిడిగా వీధిపోరాటాలలో పాల్గొనే సందర్భాలు అబ్బురం అనిపిస్తాయి. వారితో మమేకం అవ్వడానికి ఆమెకు వారి దేశం, ప్రాంతం, భాష ఎప్పుడూ అవరోధం కాకపోవడానికి కారణం ఆమెకు పీడితుల భాష, కన్నీటి రుచి తెలియడమే!

గెయిల్  అసలైన ఫూలే అంబేడ్కర్ వాది. ఆమె ఫూలే, అంబేడ్కర్ల  పోరాట చరిత్రపై పుస్తకాలు రాసిపడేసి బోల్డంత ఖ్యాతికి మూటకట్టుకుని ఆ మెత్తటి పరుపులాంటి కీర్తిమీద సుఖంగా  సేదదీరలేదు. ఆమె కూడా వారిలాగే వారి పద్ధతుల్లోనే  వివక్ష మీద పోరాడింది. ఫూలే, అంబేడ్కర్లలాగే వైదిక మతం గుట్టును తెలుసుకోడానికి సంస్కృతం, పాళీ భాషలను నేర్చుకుంది. విస్తృతంగా పురాణ, ఇతిహాసాలను చదివింది, బుద్ధుడిని తెల్సుకోడానికి పాళీ త్రిపీటకాలను చదివింది. బుద్ధుడి నుంచి చొక్కమేళా వరకు వున్న బ్రాహ్మణేతర తత్వవేత్తలను సీరియస్ గా అధ్యయనం చేసి వారిపై రాసింది. ఆమె ఆచరణశీలి అనడానికి మరొక ఉదాహరణ గెయిల్ ఆమ్వేద్ట్ తన భర్త పటాంకర్ తో బౌద్ధాన్ని స్వీకరించడం.

గెయిల్, పటాంకర్ ల ప్రేమ కూడా ఒక అబ్బురపరిచే అంశం. ఆమెకంటే ఆయన ఎనిమిదేళ్ళు చిన్నవాడు. మెడిసిన్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఆమె కోసం తన చదువుని పక్కనే పెట్టి గెయిల్ తో పాటు ఉద్యమాలు, అధ్యయనాలలో మునిగిపోయాడు. ఆయన  మార్క్సిస్టు, ఆమె వర్గ కుల నిర్మూలనావాది. అయినప్పటికీ వారి అనుబంధంలో ప్రజాస్వామ్యానిదే పైచెయ్యి కావడం విశేషం. గెయిల్ కుటుంబ జీవనంలో కూడా యెంతో ప్రజాస్వామికంగా  ఆదర్శ ప్రాయంగా బతికింది. ఆమె అత్తగారి వుమ్మడి కుటుంబంలో యితర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ కూడా ఎక్కడా తన మేధస్సు, శక్తి యుక్తులను నాలుగు గోడల మధ్య అణగారిపోకుండా జాగ్రత్త వహించింది. తన అత్తగారంటే గెయిల్ కు విపరీతమైన ప్రేమ. గెయిల్ దంపతులకు ‘ప్రాచీ’ అనే ఒక పాప, అల్లుడు ‘తేజస్వి’, మనుమరాలు ‘నియా’ వున్నారు. ఆ పొద్దు పొడుపు కూతురు అమెరికాలో వుండి అక్కడి ప్రజల సమస్యలమీద పోరాటాలు చేస్తుంది.

గతంలో కూడా పాశ్చాత్య దేశాల నుంచి యిక్కడికొచ్చి పనిచేసిన వారు మనకు వున్నప్పటికీ వారిలో చాలామంది యిక్కడి సమాజంలో కులం తాలూకు లొసుగులు, అంతరాల దొంతర్ల జోలికి పోలేదు,  అనిబిసెంటు వంటివారు ఈ దేశపు ఆధిపత్య కులాలకు కొమ్ముకాసి యిక్కడి నల్లదొరల దాష్టీకాన్ని పరోక్షంగా సమర్ధించి పోయారు. అలాగే యిక్కడి ఆధిపత్య కులాల స్త్రీలు అరుదుగా దళిత సమూహాలతో కలిసి పనిచేసినప్పటికీ తమకు అనాయాసంగా సామాజిక పెట్టుబడి నుంచి వచ్చిపడిన హోదా, గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టకుండానే పైపై సానుభూతి మాటలతో సరిపెట్టారు తప్ప గెయిల్ లాగా  అణగారిన కులాలతో సహానుభూతి పొందినవారు అరుదుగా వుంటారు. భారత దేశంలో 70, 80, 90 దశకాల దళిత, ఆదివాసీ, స్త్రీ అస్తిత్వ వుద్యమాలకు నైతిక మద్దతు యిచ్చి, ఆలోచనాత్మకమైన తన రచనలతో యెక్కువగా ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి గెయిల్ . ఆమెలేని ఈవుద్యమ కాలాన్ని ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో. ప్రజా ఉద్యమాలలో కాలికి బలపం కట్టుకుని ఖండాంతరాలు తిరిగిన యోధ  గెయిల్  గతనెల (ఆగస్ట్ 2021) 25 వ తేదీన తన గ్రామం మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లా, కాసేగాంలో తన ఎనభై ఒకటవ ఏట ఈ మట్టిలో కల్సిపోయారు. ఆమె భారతీయ దళితులకు ప్రాతఃస్మరణీయురాలు, గెయిల్ సమాజం, ప్రకృతి తనకిచ్చిన ఆధిక్యతను స్వచ్చందంగా వొదులుకుని దళితులలో దళితగా, ఆదివాసీలలో ఒక ఆదివాసీగా, స్త్రీలలో ఒక  అట్టడుగు స్త్రీగా బతికి ఈ దేశపు మట్టి మనుషుల్లో తన బంధుత్వాన్ని వెతుక్కున్న బహుజన బాంధవి. ఆమె జీవిత ప్రస్థానం, వుద్యమం, రచన, ఆచరణ ఎప్పటికీ స్పూర్తిదాయకమే!

తాను అమెరికాలో తెల్లజాతి వ్యక్తిగా పుట్టినప్పటికీ ఆదేశంలో నల్లజాతి ప్రజలపై తెల్లవాళ్ళు ప్రదర్శించే జాతి వివక్షతపై పోరాటం మొదలు పెట్టిన గెయిల్ ఆమ్వేద్ట్ అదే పంధాను భారత్ దేశంలో కూడా కొనసాగించారు. ఆమె రాతలకు, ఉద్యమ కార్యాచరణకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. తాను నమ్మిన సమత కోసం ఖండాంతరాలు దాటి వచ్చింది. పిడికిలి బిగించిన నల్ల మనుషులను తనవారిగా భావించి ప్రేమించింది. వారి అడుగుల్లో తన అడుగు కలిపింది. వారి సమస్యల పరిష్కారం కోసం తాను చెయ్యదగినది అంతా చేసింది. భారతీయుల కలల ప్రపంచం అయిన అభివృద్ధి చెందిన అమెరికాను వొదిలిన యిరవై ఏళ్ళ  అందమైన తెల్ల అమ్మాయి గెయిల్ నల్ల పేద నల్ల మనుషుల మధ్య ఒక మారుమూల పల్లెలో స్థిరపడి అక్కడి నుంచి అసమానతలపైన ప్రపంచానికి వినబడేలా బిగ్గరగా మాట్లాడడం అసాధారణం. దేశం కాని దేశంలో పీడితుల కోసం అహర్నిశం పరితపించిన అరుదైన ప్రజా మేధావి గెయిల్ పీడితుల విముక్తి కోసం కలలుగన్న స్వాప్నికురాలు.  తన పనితో, రాతతో ఆమె విడిచి వెళ్ళిన వారసత్వం(లెగసీ) చాలా విలువైనది. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లడం ఆమె అభిమానుల ముందున్న కర్తవ్యం. ఆమె రచనలను ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చెయ్యడం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆమె వదిలివెళ్ళిన పనిని ముందుకు తీసుకెళ్లడం, మనం గెయిల్  కి ఇచ్చే  నిజమైన నివాళి.

*

 

చల్లపల్లి స్వరూప రాణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గెయిల్ ని ఆత్మీయంగా స్మరించుకున్నారు ఈ వ్యాసం లో స్వరూపా. గెయిల్ కు నివాళి. తన పుస్తకాలు తెలుగులోకి కూడా వస్తే బాగుంటుంది.

  • మతమార్పిడులు మాత్రమే హిడెన్ అజెండాగా ఈ మారుమూలప్రాంతాల్లోకి వచ్చి పైపై అధ్యయనాలు, సానుభూతి వచనాలూ చెప్పే ఎందరో మేధావులకి భిన్నంగా, మూలాలను వెదకటంలో జీవితం గడిపేస్తూ, వారున్ద్వేన మతంపై ద్వేషాలు పెంచి, వచ్చిన పని (మార్పుడులు) సాగించే మతమేధావులకి భిన్నంగా, అసలైన సహానుభూతితో వర్తమానంలో జీవితాలు గాడిన పడేసే ప్రయత్నం స్వచ్ఛందంగా చేసిన గెయిల్ నిజంగా అభినందనీయురాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు