కాస్త కాస్త కరిగే సమయం
ఇంకా అంటిపెట్టుకుని వున్న జ్ఞాపకాలు
తడిలేని కాలం –
ఆవిరైపోయే ఆశలు
పల్ పల్ మని శబ్దాలు
బహుశా, అవి ఎండుటాకుల శబ్దాలు.
ధ్యాసలన్నీ మరుగవుతున్న సంధ్యలలో
దోసిట నుంచి జారిపోతున్న ఊసులు.
మాటలన్నీ మౌనాలై
కొత్త పాట లేని పెనుగులాట.
ముగింపు దొరకని కథ ఒకటి
నిత్యం రాలుతున్న కన్నీళ్ళల్లో
మరి,
బండరాళ్ళను మెత్తపరచలేవు కదా!
గాయాలన్నీ శాపాల గుర్తులుగా మిగిలి
వెక్కిరిస్తుంటే.., నొప్పిని మరింత రాజేస్తుంటాయి
దిగులు రాత్రులు.
ఆంతర్యాలను పసికట్టలేని అమాయకత్వం
మరింత వెక్కిరింతలపాలు చేస్తుంటే
వేదన వాక్యాలతో.. పూరించలేని ఖాళీలతో
బతుకు మరింత బరువవుతూ వుంటుంది.
వెన్నెల లేని ఆ రాత్రులన్నీ
అమావాస్య చీకటి దుఃఖాన్ని నింపుకొని
నిలుచున్నప్పుడు,
చెప్పలేనంత స్తబ్దత ఉద్వేగం
ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
తూచలేనంత భారంగా హృదయం
బరువెక్కుతుంది.
ప్రశ్నలగంప నిండిపోతూ
వసంతాన్ని దూరం చేస్తుంటే
కలలన్నీ కాలి బూడిద అవుతుంటాయి.
అవ్యక్త భావనలతో
నిర్జీవంగా, నిస్తేజంగా,
నిరాకారంగా.. నిరాకరించే విషయాలు
దేహ భాషను మారుస్తుంటాయి.
వెటకారపు మాటలతో, చూపులతో
అలసి,
సాంత్వనకై
తడి తలపుల్లో తచ్చాడుతూ
మూగగా..
కొన్ని మాటలను మూటకట్టుకొని
కొంత మొండిగా సమాధాన పరచుకుంటూ
మళ్ళీ వసంతానికై ఎదురుచూస్తూ-
వేకువవుతూ
ఉదయాలను వెలిగించుకుంటుంటావు.
చరణాలను చేరదీసి సమయాలను పోగేసుకుని
పక్షిలా రెక్కలు విదిలించుకొని
హద్దులు గీసిన గీతలను చెరిపేసుకుంటూ
కొంచెం కొంచెం మేఘంలా కురుస్తూ
ఆస్వాదనల ఋతువులా మారిపోతూ
కొత్త చిగురులా మెరుస్తూ
నిశ్శబ్దపు చిత్రమై- సొగసులను అద్దుకున్నప్పుడు
పరిమళపు సోయగంలా
మురిపించే పరవశమై వేకువతనంతో-
మరింత ఇష్టమైన కాఫీ సువాసనలా
వెచ్చగా బతుకు సహజత్వంతో నిండిపోతుంది కదూ?
*
వేదన వాక్యాలతో పూరించలేని ఖాళీలతో….ఆస్వాదనల ఋతువులా మారిపోతూ
ధన్యవాదాలు సర్